భానుకిరణ్... ఈ పేరు చెబితే రకరకాల ఊహాగానాలు వెల్లువలా పెల్లుబికుతున్నాయి. భాను సూరిని నమ్మించి కోటాను కోట్ల రూపాయలు సంపాదించాడని... హీరోయిన్లతో సంబంధాలు పెట్టుకొని విచ్చలవిడిగా తిరిగాడని.. రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఉహాగానాలన్నీ వాస్తవాలేనా... అసలు పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో భాను ఏం చెప్పాడు ...? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు అందరి మదినీ తొలుస్తున్నాయి... ఈ ప్రశ్నలన్నిటీకి సమధానాలు హెచ్ఎంటీవీ చేతికి చిక్కాయి. పోలీసులకు భాను ఏం చెప్పాడో చూద్దాం..
భాను పోలీసులకు ఏం చెప్పాడు.. జనాల్లో ప్రచారమవుతున్న విషయాలకు భాను వాగ్మూలానిక కొద్దిగైనా పొంతన ఉందా... భాను పై ఏ ఆధారం లేకుండా ఇన్ని రకాలుగా ప్రచారం జరుగడం వెనుక ఎవరున్నారు. ఇంతకీ భాను వాగ్మూలంలో ఏముందో చూద్దాం..
రాష‌్ట్రంలో ఇప్పుడు భానుకిరణ్ పేరు ఒక సంచలనం ... భానుకు హీరోయిన్లతో సంబంధాలున్నాయని, 800 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించాడని పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ అసలు వాంగ్మూల పత్రాలను హెచ్ఎంటివి సంపాదించింది ... బయట జరుగుతున్న ప్రచారానికి వాంగ్మూలంలో ఉన్నదానికి అసలు పొంతనే లేదనే విషయాన్ని గుర్తించింది.
పోలీసులకు భాను ఇచ్చిన వాంగ్మూలం పూర్తి పాఠం ఇలా ఉంది ... భాను కుటుంబ సభ్యులందరూ ఉన్నత చదువులు చదివి..బాగా స్థిరపడిన వారే. భాను తల్లిదండ్రులు దామోదర్‌రావు, మీనాకుమారి. భానుకు ఓ తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. తల్లి మీనాకుమారి ప్రధానోపాధ్యాయురాలు.. తండ్రి దామోదర్ రావు 1997లో చనిపోయారు. తమ్ముడు వంశీకృష్ణ బెంగళూరు హెచ్‌ఎఎల్‌లో పనిచేస్తుండగా.. సోదరి భర్త బ్రహ్మానందం సెంట్రల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇంత ఉన్నతమైన కుటుంబంలో భాను మాత్రం నిందితుడిగా మారాడు.
పాలిటెక్నిక్ చదువుతూ మధ్యలోనే మానేసిన భాను... చింత గోపి, నర్సింహారెడ్డి, సతీష్, గణేష్ వంటి భాగస్వామ్యులుతో 1999లో అనంతపురంలో లిక్కర్ బిజినెస్ చేశాడు. ఆ తరువాత కొండాపురం సురేష్, సింహాద్రిపురం శేఖర్ రెడ్డి సాయంతో... చర్లపల్లి జైలులో ఉన్న మద్దెల చెరువు సూరిని భానుకిరణ‌్ కలిశాడు. తరువాత 2002లో హైదరాబాద్ లో కాల్ డైవర్షన్ స్కీమ్ బిజినెస్ ప్రారంభించాడు. అంకిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, లక్కిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి, మదన్ మోహన్ రెడ్డి, దంతులూరి కృష్ణ అలియాస్ మంగలి కృష్ణ, సుంకు సుదర్శన్ రెడ్డి, శెట్టినారాయణ, రమేష్ రెడ్డి, ఎరుకల వెంకట మదన్ మోహన్ రెడ్డి, కైతి నర్సింహారెడ్డి, మధుసూదన్ రెడ్డితో కలిసి అంతర్జాతీయ టెలిఫోన్ కాల్స్ కుంభకోణానికి పాల్పడ్డాడు.
భాను గ్యాంగ్ లోని 11మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. 2003లో ఖాదర్ , లోక్ నాథ్ తో కలిసి కాల్ డైవర్షన్ స్కీమ్ మళ్లీ మొదలుపెట్టాడు. 2006లో శ్రీకాంత్ గౌడ్ అనే వ్యక్తి ద్వారా బాడీగార్డు మన్మోహన్ సింగ్ పరిచయమయ్యాడు. ఈ క్రమంలోనే ఖమ్మంలో రివాల్వర్ లైసెన్స్ సంపాదించిన భాను..లైసెన్స్ కోసం పోలీసులకు, అధికారులకు భారీగా లంచాలు ముట్టజెప్పాడు.
భాను కిరణ్ 2006 వరకు సాదా సీదా దందాలు చేశాడు. ఆ తరువాత క్రమంగా బెదిరింపులకు... సెటిల్ మెంట్ లకు దిగి పోలీసులకు రెగ్యులర్ కస్టమర్ గా మారిపోయాడు. నగరంలో భాను అంటే తెలియని వ్యాపరిగానీ అధికారి గానీ లేనంతగా పాపులర్ అయ్యాడు. తుపాకుల కొనుగోళ్లు, అక్రమ వసూళ్లు భానుకు చేయితిరిగి విద్యగా మారింది
2006లో దందాలు చేయడం మెుదలుపెట్టిన భాను కొందరు పెద్దల సాయంతో దాన్ని నిరాటంకంగా కొనసాగించాడు. . ఖైరతాబాద్ సిఐ ఇండియా సాఫ్ట్ వేర్ ఇన్స్టిట్యూట్ యజమాని కళ్యాణ్ చక్రధర్‌రెడ్డి ని బెదిరించి భాను ముఠా 12కోట్లు వసూలు చేసింది. ఈ కేసులో ఎ వన్ గా కాశెట్టి ప్రతాప్, ఎ టుగా ప్రదీప్ కుమార్, ఎ త్రీగా మధుమోహన్ రెడ్డి, ఎ ఫోర్ గా భాను, ఎ ఫైవ్ గా కృష్ణకిషోర్, ఎ సిక్స్ గా నాగిరెడ్డి రవికృష్ణారెడ్డి, ఎ సెవెన్ గా బయ్యపురెడ్డి , ఎ ఎయిట్ గా సురేందర్ రెడ్డి, ఎ నైన్ గా రఘునాథ్ రెడ్డి, ఎ టెన్ గా అశోక్ రెడ్డి, ఎ లెవెన్ గా దంతలూరి కృష్ణ అలియాస్ మంగలి కృష్ణ, ఎ ట్వెల్వ్ గా గంగాధర్‌లు ఉన్నారు. భానుతో కలిపి మొత్తం 12మందిని సైఫాబాద్ పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. 2008లో దంతలూరి కృష్ణ అలియాస్ మంగలి కృష్ణ ద్వారా భాను ... అనిల్ సాయంతో 5 తుపాకులను కొనుగోలు చేశాడు.
2009 మార్చిలో అక్రమ ఫైనాన్స్ దందాకి తెర తీశాడు భాను . ఈ కేసులో ఎ వన్ గా పోరెడ్డి రాజశేఖర్ రెడ్డి , ఎ టుగా సర్వేష్, ఎ త్రీగా రాహుల్ కుమార్, ఎ ఫోర్ గా సంజయ్ భరద్వాజ్ అలియాస్ పండిట్, ఎ ఫైవ్ గా మహ్మద్ జఫర్, ఎ సిక్స్ గా జహంగీర్ ఖాన్, ఎ సెవన్ గా భాను, ఎ ఎయిట్ గా మాధవయ్య, ఎ నైన్ గా అబ్దుల్ రవూఫ్, ఎ టెన్ గా భంగి రాజు, ఎ లెవెన్ గా కర్నె శివప్రసాద్ రెడ్డి, ఎ ట్వెల్వ్ గా మోహన్ వినోద్ అలియాస్ చక్రి ఉన్నారు. భానుతో సహా గ్యాంగులోని పన్నెండు మందినీ బేగంపేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.
ఇంతవరకూ భాను తన ముఠాతో వసూళ్లు, అక్రమ దందాలకు పాల్పడ్డాడు. ఈ ఎపిసోడ్స్ అన్నింటిలో సూరి హస్తం ఎక్కడా లేదు. కానీ 2009లో సూరి సోదరి హేమలతా రెడ్డితో కలిసి సూరి జైలు శిక్షను తగ్గించేందుకు భాను విశ్వ ప్రయత్నం చేశాడు. దీంతో భాను.. సూరిల మధ్య నమ్మకమైన స్నేహం చిగురించింది. అప్పటి నుంచి సూరికి భాను నమ్మిన బంటుగా మారాడు. భాను లేనిదే సూరి ఏమీ చేయలేనంతగా నమ్మాడు.
2009 లో సూరి సోదరి హేమలతా రెడ్డితో కలిసి సూరి జైలు శిక్షను తగ్గించేందుకు భాను తీవ్రంగా ప్రయత్నించాడు. తరువాత కొద్ది రోజుల్లోనే సూరి బయటకు వచ్చాడు. ఇక్కడే సూరి, భానుకిరణ్‌ల మధ్య స్నేహం చిగురించింది. ఇద్దరూ కలిసి అనేక మందిని బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేశారు ... దీంతో తిరిగి సూరి మళ్లీ జైలుకు వెళ్లాడు. సూరి పేరు చెప్పుకుని భానుకిరణ్ దందాలు, భూ ఆక్రమణలు, సెటిల్‌మెంట్లు మెుదలుపెట్టాడు. ఈ నేపథ్యంలోనే 2010లో నిమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జ్యోత్స్నా రాణి కి కూకట్ పల్లిలో ఉన్న 684 గజాల స్థలాన్ని ... భాను గ్యాంగ్ ఆక్రమించింది ... ఈ కేసులో ఎ వన్ గా కందుకూరు దేవేందర్ రెడ్డి, ఎ టుగా పరమేశ్వర్ రెడ్డి, ఎ త్రీగా ఎరుకల సురేందర్ రెడ్డి , ఎ ఫోర్ గా నిమ్స్ డాక్టర్ శరత్ చంద్ర నాగవర ప్రసాద్, ఎ ఫైవ్ గా మధుమోహన్ రెడ్డి, ఎ సిక్స్ గా అల్లూరి భానుప్రకాష్ లను కూకట్ పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు .. ఈ కేసులో భానుతో సహా మొత్తం ఏడుగురిని పోలీసులు బుక్ చేశారు ...
2010 ఆగస్టులో సినీనిర్మాతలు శింగనమల రమేష్, సి. కళ్యాణ్ లు భానును కలిసి తమకు సహకరించాల్సిందిగా కోరారు. అప్పటి నుంచి భానుకిరణ్‌కు సినీ ఇండస్ట్రీతో పరిచయాలు మెుదలయ్యాయి. శింగనమల రమేష్, సి. కళ్యాణ్‌ల తరపున రంగంలోకి దిగిన భాను బాలాజి కలర్ ల్యాబ్ లో షాలిమార్ వీడియోస్ అధినేతను బెదిరించారు ... కొమురంపులి, ఖలేజా సినిమా వీడియో హక్కుల కోసం చెల్లించిన డబ్బుల విషయం మరిచి పోవాలని హెచ్చరించారు. 2010 సెప్టెంబర్ లో సినీ ఫైనాన్షియర్ వైజయంతీ రెడ్డి, సదానందంను బాలాజీ కలర్ ల్యాబ్ కు పిలిపించి భాను సెక్యురిటీ గార్డు మన్మోహన్ రివాల్వర్ తో బెదిరించారు ... 2010 నవంబర్ నెలలో తన అనుచరులు కొద్దిమంది తో కలిసి విజయవాడ అన్నపూర్ణ ప్యాకేజింగ్ యూనిట్ యాజమాన్యం లో తలెత్తిన వివాదాన్ని సూరి పేరు చెప్పి భాను సెటిల్ చేశారు.
2010లో సూరి జైలు నుండి విడుదలైన తరువాత సూరి సాయంతో కలిసి బెదిరింపులకు, బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడు. అంతకుముందు కొనుగోలు చేసిన రెండు రివాల్వర్ లను అదే ఏడాది అక్టోబర్ నవంబర్ నెలల్లో భాను తెప్పించుకున్నాడు. బెదిరింపులు, సెటిల్‌మెంట్లతో సంపాదించిన సొమ్ముని రక్తచరిత్ర సినిమాకి పెట్టుబడిగా భాను పెట్టాడు. సూరితో విభేదాలు తలెత్తడంతో 2011 జనవరి 3న మద్దెల చెరువు సూరిని తన అనుచరులతోపాటు మరో్ నలుగురి సాయంతో భాను మట్టు పెట్టాడు. ఇదీ భాను ఇచ్చిన వాంగ్మూలం.
భాను పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలాన్ని బట్టి చూస్తే అతని గ్యాంగ్ లో పనిచేసిన వారు , సహకరించిన వారి సంఖ్య ఏభైకి పైమాటేనని చెప్పవచ్చు. అంటే సూరి హత్యతో నేర ప్రపంచంలో వచ్చిన ఇమేజ్‌ను క్యాష్ చేసుకోవాలనుకుంటే, పాత పద్ధతిలో వ్యవహారాలు నడపాలనుకుంటే భాను గ్యాంగ్ లో ఇప్పటికిప్పుడు ఏభై మంది రెడీగా ఉన్నారు. ఈ గ్యాంగ్ సభ్యుల లెక్కలతో పాటు, భాను సొంతంగా సంపాదించిన భూములు, బినామీ పేర్లతో రిజిస్టర్ చేసిన భూములు వివరాల లెక్క తేల్చే పనిలో పడింది సిఐడి. ఈ మేరకు సిఐడి అధికారులు ఇప్పటికే రిజిస్ట్రేషన్ , రెవెన్యూ శాఖలకు లేఖలు రాశారు ... ఆ వివరాలు అందితే భాను ఆస్తుల విలువ తేలిపోతుంది ... మరోవైపు సినిమా ఇండస్ట్రీలో ఇంకా ఎన్ని సినిమాలకు భాను ఫైనాన్స్ చేశాడు ... శింగనమల, చిల్లర కళ్యాణ్ సహకారంతో సినిమా ఇండస్ట్రీలో భానుకు ఏర్పడ్డ పరిచయాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు ...
ఇదీ భాను పోలీసులకు చెప్పిన వాగ్మూలం... ఈ వాగ్మూలం ప్రకారం భాను నేర చరిత్రకు... సూరి పరిచయం కంటే ముందే పునాదులు పడ్డాయని తెలుస్తోంది. అయితే ఆయన సంపాదించిన ఆస్తులెన్ని.. సినీ నటులతో ఉన్న సంబంధాలు ఎటువంటివి అనేది సీఐడీ పోలీసులే తేల్చాల్సి ఉంది.
..
No comments:
Post a Comment