ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Sunday, February 27, 2011

కసబ్‌ ఎందుకు నవ్విండంటే???

కసబ్ పకపకా నవ్వాడు... పగలబడి నవ్వాడు...
ఈ దేశ దౌర్భాగ్యాన్ని చూసి విరగబడి నవ్వాడు...
-----
చేతికి చిక్కిన యుద్ధఖైదీకి ఇచ్చే రాచమర్యాదల్ని చూసి...
శత్రు దేశంలో కోట్ల కర్చుతో తనకిచ్చే భారీ భద్రత చూసి...
కోడి బిర్యానీలూ, మేక పులావులతో మేపే తీరు చూసి...
దేశంపైనే దాడి చేసినా యేళ్లకేళ్లు జరిగే విచారణ చూసి...
తను నిర్దోషని వాదించే ఓ సర్కారీ న్యాయవాదిని చూసి...
లక్ష కాగితాల కట్టల్లో చెదలు పడుతున్న దర్యాప్తు చూసి...
ఇప్పటికే బహిరంగ ఉరి తీయలేని ఈ వ్యవస్థ అవస్థ చూసి...
ఇక తనకు యేళ్లకేళ్ళు ఢోకా లేదంటూ ఎగతాళిగా నవ్వాడు...
----
ఇంకా సుప్రీంకోర్టు, ఆపైన ఫుల్ బెంచీ ఉండనే ఉన్నాయట...
రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరుకునే చాన్సూ పదిలమేనట...
మరణ దండన ఖరారైనా పదేళ్లూ బతికే వీలుందట...
ఉరి తీసే తలారులూ రిటైరయ్యారట, కొత్తవాళ్లు లేరట...
ఉరి వరుసలో తనకన్నా సీనియర్లే నిరీక్షిస్తున్నారట...
టైముకు మైనారిటీ వోట్లు గుర్తొచ్చి పాలకులే వణకొచ్చట...
అఫ్జల్ గురూ లాగే రాజభోగాలతో బతికేసే వీలూ ఉందట...
దిక్కుమాలిన వోట్ల మంత్రాలే రాజ్యాన్ని పాలిస్తున్నాయట...
శత్రు సైనికుడికీ వర్తించే చట్టాలు చూసి పడీపడీ నవ్వాడు...
-----
ఇక్కడికి కోట్లాదిగా వలసొచ్చి డామినేట్ చేస్తూ బతకొచ్చు...
యేళ్లకేళ్లు స్లీపర్ సెల్స్ పేరిట ఎంచక్కా బతికేయవచ్చు...
లక్షల కోట్ల దొంగ కరెన్సీతోనూ దేశంపై దాడి చేయొచ్చు...
ఆత్మాహుతి దాడులతో, ఆర్డీఎక్స్ మోతలతో వణికించవచ్చు...
కాదంటే నేరుగా పార్లమెంటుపైనే దాడులు చేయొచ్చు...
అక్షరధాములూ, అయోధ్యలూ టార్గెట్ చేసుకోవచ్చు...
పట్టుబడినా లీడర్ల సాయంతో ఇట్టే విడుదల కావొచ్చు...
లేదంటే నేరుగా ఆర్థిక రాజధానిపైనే దాడి చేయొచ్చు...
నెత్తురుడిగి, ఎముకలు కుళ్ళిన దేశాన్ని ఏమైనా చేయొచ్చు...
ఎవడికీ ఏమీ కాదు, సమాజమూ ఎవరిపైనా తిరగబడదు...
పాలకుడి కాలర్ పట్టి నిలదీయదు, కనీసం ప్రశ్నించదు...
అందుకే కసబ్ నవ్వాడు... దేశాన్నే చూసి నవ్వాడు...
ఏ కసీ లేని ఈ సమాజాన్ని చూసి వెటకారంగా నవ్వాడు...!!

తెలంగాణలో సహాయనిరాక"రణం"


ఎ. జనార్ధన్

ఏ దేశచరిత్ర చూసినా ఏముంది గర్వకారణం. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. అణిచివేత ఆక్రమణలు ప్రపంచానికి కొత్త కాదు. కానీ తెలంగాణలో సాగుతున్న దోపిడీ తీరే కొత్త. ఒక జాతి మరొక జాతిని, ఒక తెగ మరొక తెగను దాడి చేయడం చూశాం.. లేదా ఒకే ప్రాంతంలో తన జాతి ప్రజలను చెప్పుచేతల్లో ఉంచుకోవడం చూశాం.. అనాగరిక శతాబ్దంలో దేశాన్ని దేశం, రాజ్యాన్ని రాజ్యం ఆక్రమించుకోవడం చూశాం..కానీ హైటెక్ యుగంలో కూడా ఒక ప్రాంతాన్ని మరో ప్రాంతం నిలువు దోపిడీ చేయడం ఒక్క తెలంగాణలోనే చూస్తున్నం..
ఎక్కడ అణిచివేత, ఆక్రమణలు విశృంకలంగా జడలు విప్పుకుంటయో..అక్కడ తిరుగు బాటు మొదలవుతది. ఇది చరిత్ర చెప్పిన నిజం.. ఆ నిజమే మరోసారి నిప్పులు కక్కుతోంది.
సరిగ్గా రెండు వందల ఏండ్లకు ముందు భారతదేశంలో తెల్లదొరలు మంచి మాటలతో మాటువేసిన్రు.. చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి ఏకంగా రాజ్యాధికారాన్నే హస్తగతం చేసుకున్నరు. దేశాన్ని అందిన కాడికి దోచుకోవడమే కాకుండా భారతీయులను బానిసలను చేసిన్రు. ఎదిరించిన వారిని తూటాలతో పేల్చి పడేసిన్రు ఆడా మగా తేడాలేకుండా చిత్రహింసలు పెట్టిన్రు. వందేమాతరం అన్న నోళ్లను శాశ్వతంగా మూసేసిన్రు. నిరాటంక దోపిడీ కోసం లక్షలాధిమంది ప్రజలను పొట్టన బెట్టుకున్నరు. అయినా పోరాటం ఆగలేదు.. తిరుగుబాటు తప్పలేదు.. ఆ తిరుగుబాటులో పూసిన పువ్వులే సహాయనిరాకరణ విదేశీవస్తు బహిష్కరణ..
ఇప్పుడు మనం చూసిన ఈ స్వాతంత్ర్య పోరాటాలేవీ తెలంగాణకు అప్పుడు తెలియవు. ఎందుకంటే యావత్ భారత దేశం పరాయి దేశ పాలకుల కబంధ హస్తాల్లో చిక్కినా తెలంగాణ మాత్రం ఒక స్వతంత్ర రాజ్యంగానే విలసిల్లింది. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం, తెలంగాణ గడ్డపై ఉదయించడానికే గడగడ లాడింది. ఎందుకంటే ఇక్కడి నెత్తురు అటువంటిది.. ఈ నేల పౌరుషం అంతటిది. కాస్త కాలు మోపుదామనుకున్నపుడే కొమరం భీం ఉరుములకు నాలుగడుగులు వెనక్కి వేసింది బ్రిటీష్ సైన్యం. మట్టి కణాలు నిప్పుకణాల్లా నిగనిగలాడం చూసి భయపడ్డరు తెల్లదొరలు. అందుకే అప్పుడు తెలంగాణ ప్రజలకు సహాయనిరాకరణ అవసరం రాలేదు.
దేశం మొత్తానికి స్వతంత్రం సిద్దించిందట.. సరిగ్గా అప్పుడే తెలంగాణకు పరతంత్రం దాపురించింది. బ్రిటీష్ పాలకుల కుతంత్రాలను నేర్చుకున్న సీమాంధ్రులు.. వాటన్నిటినీ తెలంగాణ బిడ్డలపై ప్రయోగించిన్రు. మెత్తటి మాటలతో తిష్టవేసి గుడిని, బడిని ఏకంగా రాజధానిని దోచేసిన్రు. తెలంగాణ ప్రజలు కళ్లు తెరిచే సరికే ఇది మా సొత్తు అని ఎగబడుతున్నరు. ఇది బ్రిటీషోణ్ని మించిన సంకర జాతి పాలన. విదేశీయులైనా తెల్లదొరలు దేశాన్ని అభివృద్ది చేసే పనులు చేసి తమ పబ్బం గడుపుకున్నరు. కానీ సీమాంధ్రులు మాత్రం ఇక్కడి నాగరికతను నేర్చుకొని, రెంట్ కంట్రోల్ యాక్ట్ పుట్టించుకొని పావలాకూ బేడాకు తిష్టవేసిన్రు. ఇది మా రాజ్యమని బొంకుతున్నరు.
ఆనాడు బ్రిటీష్ వాడి ఉక్కు పాదాలకింద నలిగిపోయిన భారతీయులకు గాంధీజీ ఇచ్చిన ఆయుధాలు అహింస, సత్యాగ్రహం, సహాయనిరాకరణ. తెల్లదొరలు దేశాన్ని వదిలిపోయేలా తరిమి తరిమి కొట్టింది ఈ ఆయుధాలతోనే. యావత్ ప్రపంచానికి రక్తపాత రహిత ఉద్యమం నేర్పింది భారతదేశమే. తెలంగాణకు అప్పుడు లేని..రాని అవసరం ఇప్పుడొచ్చింది.. అందుకే గాంధీజీ ఇచ్చిన ఆ ఆయుధాలకు పదును పెట్టి ప్రయోగిస్తొంది తెలంగాణ. రక్తపాత రహిత ఉద్యమం. సహాయనిరాకరణం. సంపూర్ణ సహాయ నిరాకరణం. ది పవర్ఫుల్ వెపన్..నో పే..నో బిల్..నో వర్క్.. నో కోఆపరేషన్ ..
చరిత్ర పునరావృతమయింది. నియంతృత్యం నిద్దురలేచింది. ఆనాడు తెల్లదొరల నీతే ఈనాడు నల్లదొరలు పాటిస్తున్నరు..ఏనాడైతే తెల్లదొరలు ఈ దేశాన్ని ఆక్రమించిన్రో ఆనాడే మన భారతీయుల బాషలో ఇంగ్లీష్ ఇమిడిపోయింది. దేశబాష సంకరమై సంకటాల పాలయింది. సంస్కృతి చట్టుబండలయింది.. మతం మైలబడ్డది.. ఆనాడు బాష మీద, సంస్కృతి మీదా, చరిత్ర మీద, జరిగిన దాడే తెలంగాణలోనూ జరిగింది. అందుకే భారత దేశంలో మరో స్వాతంత్ర్య సమరం మొదలయింది...మా బాష, మా యాసలను గౌరవించాలే.. మా నీళ్లు, నిధులు, నియామకాలు మాకే కావాలే అన్ననినాదం గల్లీ నుంచి ఢీల్లీకి పాకింది. నాడు అస్తమించిన నెత్తుటి పొద్దు మళ్లీ ఉదయించింది. ఉక్కు తుపాకులు తుప్పు వదిలించుకుంటున్నయి. అమాయకుల దేహాలపై రబ్బరు బుల్లెట్లు, పెల్లెట్లు సవారి చేస్తున్నయి. స్వాతంత్ర్య పోరాటంలో నాడు డయ్యర్ మించిన దాష్టికానికి తెగబడుతున్నరు ఆంధ్రపాలకులు. ఆడా మగా, పిల్లా పాపా అన్న తేడా లేక ఉసురు గొట్టుకుంటున్నరు. అయినా తెలంగాణ బిడ్డల సహనం చూసి పెల్లెట్లు బుల్లెట్లు కూడా తలదించుకుంటున్నయి. మెద్దుబారిన కేంద్రం మెదడులో కూడా కదలిక వస్తంది. ఇదే స్పూర్తి , ఇదే పోరాటం..ఇదే సహాయ నిరాకరణం..తెలంగాణ వచ్చేదాకా..ఇదే బాట ఇదే బాసట...ది అల్టిమేట్ పవర్ ఫుల్ వెపన్..నాన్ కోఆపరేషన్..