ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Wednesday, August 31, 2011

ప్రాణం తీస్తున్న గానం.. జితేన్ మరాండీల జీవితం


గానం వారి ప్రాణం.. కానీ ప్రాణాలను తీసే శత్రువు ఆ గానమే అయితే.. సమాజాన్ని మార్చాలనుకున్న ప్రజాచైతన్యంమే వారిని నిస్తేజుల్ని చేస్తే... గుండె చప్పుడే ఉలిక్కి పడేలా ఉరిమితే... పాట లయలే విలయతాండవం చేస్తే... అదే జితేన్ మరాండీ, అనీత్ రాం, మనోజ్ రజ్వార్, ఛత్రపతి మండలిల జీవితమవుతుంది...వాళ్లు పాటలు పాడారు. ఆదివాసీల కష్టాలకు మాటలు పేర్చి పాటలు కూర్చారు. ఎలా బతుకుతున్నారో.... ఆదివాసీల జీవితాలను ఎవరు ఎలా చిదిమేస్తున్నారో పాటలు అల్లి... గజ్జె కట్టి వినిపించారు. ఇది కాదు మీ జీవితం అని కూడా చెప్పారు. ఎలాంటి జీవితం కావాలో.. అలాంటి జీవితం కోసం ఏం చేయాలో ఆ పాటల్లో కూర్చారు... అంతే... అంత కంటే వాళ్లేం చేయలేదు. బతుకు పాటలా సాగాలని పాటల్లోనే చెప్పారు. ప్ర.జాస్వామ్య బద్దంగా ఎలా బతకాలో చెప్పిన దేశంలోనే... ఓ నలుగురు ఆదివాసీ కుర్రాళ్లు కూడా అంతటి ప్రజాస్వామ్యయుతంగానే ఎలా బతకాలో చెప్పారు. పాలకులు చెప్పిన బతుకు తీరు రాజ్యాంగమయ్యింది. ఈ నలుగురు ఆదివాసీ కళాకారులు అల్లిన పాటలు నేరం అయ్యాయి. హాయిగా బతకాలి... పదిమందిని బతికించాలి అని చెప్పిన మాటలు పాలకులకు నచ్చలేదు. అందుకే ఆ నలుగురికి శిక్ష పడింది. అలాంటిలాంటి శిక్ష కాదు. ఏకంగా ఉరి.
పాటలు పాడడం నేరమా.. పాటలో బతుకు చిత్రాన్ని ఆవిష్కరిచడం నేరమా.. పాటకు పరవశించడమే కాదు.. పోటెత్తాలని చెప్పడం కూడా నేరమేనా.. నేరమే అంటోంది మన పాలక వర్గం. అలాంటిలాంటి నేరం కూడా కాదంటోంది. పాట గొంతు నొక్కేయాలని శాసిస్తోంది. స్వరపేటికను తాళ్లతో బంధించాలని ఆజ్ఞలు జారీ చేస్తోంది. ఓ నలుగురు ఆదివాసీ కుర్రాళ్లు పాటలు కట్టి పాడినందుకు వారికి జార్ఖండ్ న్యాయస్థానం ఉరి శిక్ష వేసింది. ఆ ఉరి శిక్షను అమలు చేయాలని జార్ఖండ్ ప్రభుత్వం తహతహలాడుతోంది.
పాట... పరవశించిపోయే కళారూపం. పాట.. పరుగులెత్తించే చైతన్యం. పాట.. చెకుముకి రాళ్లు చేతులెత్తి చప్పట్టు కొట్టడం. పాట.. గుండెలోంచి గుండెలోకి నెత్తురు ప్రవహించడం. ఏ దేశమైనా.. ఏ కాలమైనా.. పాటకు ప్రపంచం ప్రాణం ఇస్తుంది. కాని, మన పాలకులు మాత్రం ప్రాణం తీస్తామంటున్నారు. అప్పుడెప్పుడో ఆఫ్రికన్ కవి బెంజిమన్ మొలైసీని అలాగే చంపేసారు. ఆ తర్వాత ఒగోని కవి కెన్ సారో వివా గొంతు నొక్కేసారు. ఇప్పుడు మన దేశంలో... జార్ఖండ్ లో ఆదివాసీ వాగ్గేయకారుడు జితెన్ మరాండీని కూడా చంపేయాలనుకుంటోంది. జితెన్ మరాండీతో పాటు ఆయన సహచరులు అనీత్ రాం, మనోజ్ రజ్వార్, ఛత్రపతి మండలి అనే కళాకారులకు ఆ రాష్ట్ర న్యాయస్థానం ఉరి శిక్ష వేసింది.
జితెన్ మరాండీ బృందం ఉరి శిక్ష పడేంతటి తప్పు ఏం చేసింది. అసలు ఈ జితెన్ మరాండీకి, ఆయన బృందం సభ్యులకు మరణశిక్ష విధించాల్సినంత అవసరం ఏమొచ్చింది. జార్ఖండ్ ప్రభుత్వానికి కోపం వచ్చేంత పని వీళ్లేం చేసారు. అరుదైన సందర్భాల్లో, అత్యంత అరుదైన, దారుణమైన నేరాలు రుజువైనప్పుడు తప్ప మరణ శిక్ష విధించరాదని సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది కదా.. మరి అంతటి దారుణమైన, అరుదైన నేరం జితెన్ మరాండి బృందం చేసిందా?. ఇంతకీ జితెన్ మరాండి ఎవరు.. ?
జార్ఖండ్ రాష్ట్రంలో గిరిధి జిల్లాలో ఓ మారుమూల ఉన్న గ్రామం సుడూర్. అసలు ఇలాంటి గ్రామం ఉందని చాలా మందికి తెలిసే అవకాశమే లేని పల్లె. అక్కడ 1980 లో జితెన్ మరాండీ పుట్టారు. చదువు ఎలా ఉంటుందో.. చదువుకుంటే బతుకు ఎలా ఉంటుందో కూడా తెలియని అమాయకపు పల్లెలో, అభివృద్ధి అనే మాట కూడా వినని పల్లెలో మరాండి పుట్టారు. చదువుకోవాల్సిన వయసులో పశువుల కాపరిగా జీవితాన్ని ఆరంభించాడు. ప్రకృతి, పశువులు, పల్లె జీవితం మరాండి చుట్టూ ఉన్న ప్రపంచం. అక్కడి నుంచే పల్లె పదాలను కూర్చడం ప్రారంభించాడు. పల్లె పదాల కూర్పుతో పాటు ఆదివాసీల జీవితాలు కూడా మరాండి పాటకు పల్లవి అందించాయి. వీళ్లు ఎందుకు ఇలా బతుకుతున్నారు.. అనే ప్రశ్న ఆ పాటల నుంచి పుట్టింది. అప్పటి నుంచే జితెన్ మరాండి జీవిత చిత్రం మారింది. అన్నం లేని, ఒంటిపై నిండైన అచ్ఛాదన కూడా లేని ఆదివాసీల గురించి పాటలు అల్లడం, పాడడం జితెన్ మరాండి జీవితమయిపోయింది.
పాటలు కట్టి.. ఆదర్శవాద సంస్కరణలతో తోటి ఆదివాసీలను జాగృతం చేసే పని తలకెత్తుకున్నాడు జితెన్ మరాండి. చేతిలో నగారా, ఢోలక్, హార్మోనియం తప్ప ఎప్పుడు ఎలాంటి ఆయుధం మరాండీ చేతిలో ఎవరూ చూడలేదు. పల్లె నుంచి పట్టణానికి మారిన మరాండి ప్రస్థానం నిరంతరం ఆదివాసీల జీవితం చుట్టూనే తిరిగింది. ప్రగతిశీల భావాలున్న వారితో పరిచయం పెరిగిన మరాండి తన సొంత పేరుతోనే చెలామణి అయ్యారు తప్ప ఆయనకు కలం పేరు కాని, మరే ఇతర పేరు కాని లేదు. మావోయిస్టులతో కాని, వారి దళాలతో కాని నేరుగా సంబంధం లేని, మావోయిస్టు ఉద్యమం పట్ల సానుభూతి మాత్రమే ఉన్న జితెన్ మరాండి, ఆయన బృందాన్ని మావోయిస్టులు చేసిన ఓ చర్యలో భాగస్వాములను చేసి ఉరి శిక్ష వేసింది జార్ఖండ్ న్యాయస్ధానం.
మావోయిస్టులను మట్టుపెట్టేందుకు ప్రభుత్వం సైన్యాన్ని దింపుతోంది. అదే మావోయిస్టులను కాలరాసేందుకు ప్రైవేట్ సైన్యాలను కూడా వాడుతోంది. ఛత్తీస్ ఘర్ లో సాల్వాజుడం, బెంగాల్ లో హర్మద్ వాహిని వంటి ప్రైవేట్ సాయుధ బలగమే.. జార్ఖండ్ లో కూడా వెలిసింది. దాని పేరే నాగరిక సురక్ష సమితి. ఆ సమితి సభ్యులకు మావోయిస్టులే టార్గెట్. చాలాకాలంగా పరస్పర దాడులతో ఆ రెండు వర్గాల మధ్య భీకర యద్ధం జరుగుతోంది. మధ్యలో ఎవరు లబ్ది పొందుతున్నారో... ఎవరు నష్టపోతున్నారో దేవుడికే తెలియాలి. కాని ఈ పోరులో నష్టపోయింది.. ప్రాణాల మీదకు వచ్చింది మాత్రం జితెన్ మరాండీ బృందానికే. ఆదివాసీల జీవితాలపై పాటలు కట్టిన వాళ్లకు, మావోయిస్టులకు మధ్య సంబంధాలు ఉన్నాయన్న జార్ఖండ్ సర్కార్ మావోయిస్టులు పాల్గొని 19 మందిని హతమార్చిన ఒకనొక సంఘటనలో జితెన్ మరాండీ బృందాన్ని బాధ్యులను చేసింది. ఆ సంఘటనలో వారే పాల్గొన్నారని రూఢీ చేసింది.
నాగరిక సురక్షా సమితి. మావోయిస్టులను సాయుధంగా ఎదుర్కొనేందుకు ఏర్పడ్డ ప్రైవేట్ సైన్యం. మావోయిస్టులకు సహకరిస్తున్నారనే కోపంతో ఆదివాసీలపై విరుచుకుపడుతోందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్ధ. ఈ సంస్ధకు చెందిన ఓ స్థావరంపై మావోయిస్టులు విరుచుకుపడ్డారు. ఆ దాడిలో నాగరిక సురక్షా సమితికి చెందిన 19 మంది మరణించారు. మరణించిన వారిలో జార్ఖండ్ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ కుమారుడు అనూప్ మరాండీ కూడా ఉన్నారు. ఈ దాడిలో పాల్గొన్న మావోయిస్టుల బృందంలో జితెన్ మరాండీ అనే మావోయిస్టు నాయకుడు కూడా ఉన్నారు. ఈ విషయం పోలీసుల దర్యాప్తులో బయటపడింది. అంతే ప్రభుత్వ కుట్రకు రూపం దొరికింది. ఒకే పేరున్న ఇద్దరు వ్యక్తులు రికార్డుల్లో బయటపడ్డారు. పావులు కదిలాయి. నాగరిక సురక్షా సమితిపై దాడిలో పాల్గొన్న వారిలో కళాకారుడు, ఆదివాసీ వాగ్గేయకారుడు జితెన్ మరాండీ ఉన్నారని నిర్ధారించారు. ఆ మేరకు ఆయన, ఆయన బృందంలోని ముగ్గురు అనీత్ రాం, మనోజ్ రజ్వార్, ఛత్రపతి మండలిపై కేసు పెట్టారు.
ప్రజా చైతన్యం కెరటమై విరిసినప్పుడు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతూనే వుంటాయి. జార్కండ్ లో ఆదివాసీల బతుకుల్లో చైతన్యం నింపినందుకు కొందరు కళాకారులకు ఉరిశిక్ష బహుమానమైంది. ఎభేన్ నాట్యమంచ్ కళాకారుడు జితేన్ మరాండీ, మరో ముగ్గురు ఇపుడు జైలు నిర్బంధంలో మగ్గుతున్నారు. ఈ కళాకారుల పక్షాన జన మద్దతును కూడగట్టడానికి జార్ఖండ్ కళాకారులు కదిలారు. నిర్బంధంలో వున్న జితేన్ మరాండీ విడుదల కోసం ఆతని భార్య అపర్ణా మరాండి ప్రజా పోరాటం చేస్తున్నారు...
చెట్టుకు కట్టి కాల్చేయడానికి పాట పెదవులు చేసే చప్పడు కాదు. కొయ్యకు తాడు కట్టి ఉరేసి చంపేయడానికి పాట ఓ శరీరం కాదు. పాటంటే.. ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటం. పాటంటే... పొత్తిళ్లలో పసి పాప నవ్వు. పాటంటే... ఓ నిండు జీవితం.

Friday, August 26, 2011

గణేష‌ పాట

http://www.divshare.com/download/15611900-6a2


Tuesday, August 23, 2011

దీక్షా దక్షులు


A.. Janardhan
ప్రజాస్వామ్య దేశంలో పౌరహక్కులను సాధించుకోడానికి, లేదా సమిష్టి ప్రయోజనాల కోసం రక్తపాత రహిత పోరాట రూపమే సత్యాగ్రహం.. ఆ ఆగ్రహ వ్యక్తీకరణ నిరాహార దీక్షతోనే సాధ్యం.. నిరాహార దీక్షలు ఇప్పుడు కొత్తగా వచ్చినవి కాదు.. పురాతన కాలం నుంచీ ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేయడానికి నిరాహార దీక్ష లే మార్గం.. తాజాగా అన్నా హజారే దీక్ష దేశ చరిత్రలోనే మరో మైలు రాయిగా నిలబడింది.. అసలు నిరాహార దీక్షలు ఎప్పటి నుంచి ప్రారంభించారు.. ఇందులో ప్రజా ప్రయోజనాల కోసం ఎందరు దీక్ష చేశారు.. రాజకీయ ప్రయోజనాల కోెసం ఎవరు దీక్ష చేశారు.. ఎన్ని దీక్షలు సక్సెస్ అయ్యాయి.. నిరాహార దీక్షల పై హెచ్ఎం టీవీ స్పెషల్ ఫోకస్

నిరాహార దీక్ష.. సత్యాగ్రహం అనగానే ఠక్కున గుర్తొచ్చేది.. మహాత్మా గాంధీ.. అవును భారతదేశ ప్రజలందరికీ శాంతియుత నిరసనా పద్దతిని బోధించింది గాంధీజీయే.. ఆయన చూపిన మార్గం ప్రపంచం మొత్తానికి ఆదర్శం అయింది... ఒక రకంగా చెప్పాలంటే.. నిరాహార దీక్షలు దేశాలకు స్వాతంత్ర్యాలను సాధించి పెట్టాయి.. రాష్ట్రాలను విభజించాయి.. కొత్త కొత్త జి.వోలను తెచ్చిపెట్టాయి... ఉవ్వెత్తున ఎగసిన ప్రజా ఉద్యమాలు కూడా చేరలేని లక్ష్యాన్ని నిరాహార దీక్షలు అందుకున్నాయి..
జాతి సమిష్టి ప్రయోజనాలు సాధించడం కోసం కావచ్చు..
ఒక ప్రాంత ప్రయోజనాలను నెరవేర్చడం కోసం కావచ్చు...
వ్యక్తిగత ప్రయోజనాలు లేదా హక్కులను పొందడం కోసం కావచ్చు...
పై స్థాయిలో ఉన్న నిర్ణాయక శక్తుల పై శాంతియుతంగా చేసే నిరసన
నిరాహార దీక్ష...
వాయిస్
వ్యక్తులు తమ హక్కులకు భంగం కలిగిందని భావించినపుడు.. లేదా తమకు అన్యాయం జరిగిందనుకున్నపుడు.. ఆవేశకావేశాలకు లోను కాకుండా ధర్మాగ్రహం వ్యక్తీకరణ రూపమే సత్యాగ్రహ దీక్ష.. ఈ దీక్షలో ఎవ్వరినీ నొప్పించడం గానీ... ఎవరి మనోభావాలనూ గాయపరచడం గానీ ఉండదు.. కేవలం నిరశన.. తమ కోర్కెలు సాధించుకునేందుకు చేసే శాంతి యుత పోరాటం.. సత్యాగ్రహానికి ఆద్యుడు గాంధీజీ అని చాలా మంది అనుకుంటారు.. వాస్తవానికి సత్యాగ్రహం అనేది పురాణ కాలం నుంచీ ఉంది... త్రేతా యుగంలో పితృవాక్యపాలన కోసం రాముడు అరణ్యవాసానికి వెళ్లినపుడు.. అయోధ్యకు వచ్చిన భరతుడు విషయం తెలుసుకొని సపరివారంతో అడవికి వెళ్లి రాముణ్ని కలుసుకొని రాజ్యపాలనకు రమ్మంటాడు.. దానికి రాముడు ఒప్పుకోక పోవడంతో.. భరతుడు పర్ణశాల ముందు గర్భలు పరుచుకొని నిరాహార దీక్షకు దిగుతాడు.. లక్ష్మణుడితో సహా.. మిగతా పరివారమంతా వారించడంతో.. రామ పాదుకలను తీసుకొని నిరాహార దీక్ష విరమించి తిరిగి అయోధ్య బాట పడుతాడు భరతుడు.. అసలు రాముడు అడవులకు వెళ్లడానికి కారణమే కైకేయి నిరాహార దీక్ష..

త్రేతాయుగంలో శ్రీకృష్ణుడికి నారదుడు బహుకరించిన పారిజాత పుష్పాన్ని రుక్మిణికి ఇవ్వడంతో అలిగిన సత్యబామ సత్యాగ్రహానికి దిగుతుంది. ఆమె అలకను తీర్చడానికి కృష్ణుడు విధిలేని పరిస్థితుల్లో దేవలోకం నుంచి పారిజాత వృక్షాన్నే పెకిలించి సత్యభామ ముంగిలిలో నాటుతాడని పురాణ కథనం.. నిరాహార దీక్షలు గాంధీతో ప్రారంభమైనవి.. అంతమైనవీ కావు.. మన ప్రాచీన కాలం నుంచే ఈ ధర్మాగ్రహం ఉంది.. రామాయణ, భారతాలను పారాయణం చేసే గాంధీ మహాత్ముడు తన పోరాటానికి నిరాహార దీక్షనే సరైన ఆయుధంగా ఎంచుకున్నాడు..

మహాత్మా గాంధీ మొదట సెప్టెంబరు 11, 1906 న దక్షిణ ఆఫ్రికా లో తనకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ దీక్ష ప్రారంభించాడు. అలా మొదలైన గాంధీ నిరాహార దీక్షలు ఎన్నో మలుపులు తిరిగి ఎన్నో విజయాలు సాధించాయి.. స్వదేశమా.. విదేశమా అనే తేడా లేకుండా గాంధీ సత్యాగ్రహం వెలిబుచ్చాలంటే.. నిరాహార దీక్షే ఆయుధంగా ఎంచుకున్నారు.. అందుకే అది ప్రపంచవ్యాప్తంగా ఆదర్శమయింది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో పౌరహక్కుల పోరాటంలో మార్టిన్ లూథర్ కింగ్ కూడా ఇదే పంథాను ఎంచుకున్నారు. గాంధీజీ సత్యాగ్రహంతో బ్రిటీష్ వారు తలవంచక తప్పలేదు.. అయితే గాంధీజీ సత్యాగ్రహం చేసింది ఒకసారి రెండుసార్లు కాదు.. లెక్కలేనన్ని సార్లు సత్యాగ్రహం చేశారు.. అన్ని సత్యాగ్రహాల్లో కంటే ఉప్పు సత్యాగ్రహం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.... గాంధీజీ సత్యాగ్రహం చేసినపుడల్లా బ్రిటీష్ ప్రభుత్వం అరెస్టు చేసి జైలుకు పంపేది.. అయినా మొక్కవోని ధైర్యంతో జైలులో కూడా నిరాహార దీక్షలు కొనసాగించేవాడు. 1922, 1930,1933, 1942 సంవత్సరాలలో గాంధీజీ బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా దీక్షలు చేశారు. గాంధీజీ ఒక్కోసారి కాంగ్రెస్ పార్టీలో బిన్నాభిప్రాయాలు వ్యక్తమయినపుడు కూడా స్వపక్షం పై సత్యాగ్రహంతో నిరసన తెలిపేవాడు.. ఒక్కోసారి గాంధీజీ సత్యాగ్రహంతో సొంత పార్టీ వాళ్లకే ఇబ్బంది కలిగేది.. అయినా ఆయన ఆలోచనా విధాన్ని అర్ధం చేసుకొని జాగ్రత్తగా మసలు కునే వారు.

అమరజీవి పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష
గాంధీజీ తరవాత స్వతంత్ర భారత దేశంలో సత్యాగ్రహానికి బలమైన గుర్తుగా నిలిచిన వ్యక్తి పొట్టి శ్రీరాములు.. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన వ్యక్తి పొట్టి శ్రీ రాములు. అంతకు ముందు శ్రీ స్వామి సీతారం 38 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి మధ్యలోనే విరమించారు. 1947 ఆగష్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం లేకపోవటం వల్ల ఆంధ్రులు వివక్షకు గురయ్యారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం లో తమిళుల పరిపాలనలో ఎన్నో బాధలు, ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఆంధ్రులు అంతా ఏకమై స్వంత రాష్ట్ర ఏర్పాటుకు ఎన్నో ఉద్యమాలు నిర్వహించారు. ఈ ఉద్యమంలో శ్రీ న్యాపతి సుబ్బారావు, శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య, శ్రీ అయ్యదేవర కాళేశ్వర రావు, కొండా వెంకటప్పయ్య వంటి వారు పాల్గొన్నారు. వీరంతా మహాత్మాగాంధీని కలుసుకొని ప్రత్యేక రాష్ట్ర అవసరం గురించి వివరించినప్పుడు స్వాతంత్ర్యం వచ్చాక ఈ సమస్యను పరిష్కారిస్తామని గాందీ హామీ ఇచ్చారు. స్వాతంత్ర్యానంతరం కూడా సమస్యకు సరైన పరిష్కారం దొరకక పోవడంతో పొట్టి శ్రీ రాములు గారు నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు.. నాయకులు ఎన్ని హామీలిచ్చినా.. పత్రికల ద్వారా సంపాదకీయాలు రాసినా వాటన్నిటీనీ పెడచెవిన పెట్టి దీక్షను కొనసాగించి అమరవీరులైనారు పొట్టి శ్రీ రాములు. ప్రజలు రెచ్చిపోయి అనేక దౌర్జన్యాలకు పూనుకున్నారు. యావత్ ప్రపంచం పొట్టి శ్రీరాములు ఆత్మ త్యాగాన్ని “సుప్రీం సాక్రిఫైస్‌” గా అభివర్ణించింది. పొట్టి శ్రీరాములు దీక్ష ఫలితంగా బాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు అప్పటి భారత ప్రధాని జవర్‌హాల్‌ నెహ్రూ అంగీకరించి ఆంధ్రరాష్ట్రమే కాక తమిళ, కేరళ మరాఠీ, గుజరాత్ వంటి ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటు చేశారు.

భారత దేశ చరిత్రలో చెప్పుకోదగ్గ మరో ఆమరణ దీక్ష జతీంద్ర నాద్ దాస్ ఆమరణ నిరాహార దీక్ష.. పొట్టి శ్రీరాములు స్వజాతి వారిపై నిరసనగా ఆమరణదీక్ష చేస్తే జతీంద్ర దాస్ బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా దీక్ష చేసి... అమరజీవి అయ్యాడు.. బెంగాల్ కు చెందిన జతీంద్ర దాస్ స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొనేవాడు.. గాంధీజీ పిలుపు నందుకొని అహింసా ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాడు.. ఫలితంగా బ్రిటీష్ ప్రభుత్వం అరెస్టు చేసి లాహోర్ జైల్లో నిర్భందించింది. అక్కడ జైల్లో ఖైదీల పట్ట జైలు అధికారులు చూపే నిర్లక్ష్యాన్ని చూసి చలించి పోయాడు జతీంద్ర.. శిక్ష పడ్డ ఖైదీలను, విచారణలో ఉన్న ఖైదీలను కట్టుబానిసలుగా చూడటాన్ని సహిచలేకపోయడు.. పదిరోజులకొకసారి గానీ ఖైదీల బట్టలకు శుభ్రం చేసుకొనే అవకాశం లేకపోవడం. అపరిశుభ్రమైన.. అధ్వాన్నంమైన ఆహారం అందించడం.. జితీంద్ర నాద్ దాస్‌ను కలిచివేసింది.. వెంటనే జైలులో సత్యాగ్రహ దీక్ష మొదలు పెట్టాడు.. దీక్ష విరమింప జేసేందుకు బ్రిటీష్ ప్రభుత్వం చిత్ర హింసలు పెట్టింది..అయినా జితీంద్ర తలవంచలేదు.. పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు.. 63 రోజుల జితీంద్ర దీక్ష మరణంతో ఆగిపోయింది.. జితీంద్ర భౌతిక కాయాన్ని.. లాహోర్ నుంచి కలకత్తా కు తీసుకొచ్చారు. ప్రతి స్టేషన్ లోనూ ఆయనకు ప్రజలు నీరాజనాలర్పించారు.. కలకత్తాలో రెండు కిలోమీటర్ల మేర జనప్రవాహం ఆయన అంతిమ యాత్రకు తరలివచ్చారు..


ఆమరణ దీక్ష చేసిన భారతీయుల్లో చెప్పుకోదగిన మరో వ్యక్తి స్వామి నిగమానంద్.. నిగమానంద్ తాను సాధించదలుచుకున్న సామాజిక ప్రయోజనం కోసం ప్రాణత్యాగం చేశాడు.. హరిద్వార్‌లో గంగా తీరంలో అక్రమ మైనింగ్‌ను ఆపాలంటూ నిగమానంద్ దీక్ష ప్రారంభించారు.. ప్రభుత్వ నిగమానంద్ దీక్షను నిర్లక్ష్యం చేసింది.. ఫిబ్రవరి, 19, 2011న దీక్ష ప్రారంభించిన నిగమానంద్‌ ఆరోగ్యం ఏప్రియల్ 27 నాటికి పూర్తిగా క్షీణించింది. .దీంతో ప్రభుత్వ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది చాలా కాలం పాటు కోమాలో ఉంది. 115రోజుల తరువాత మరణించారు. సామాజిక ప్రయోజనాలకోసం దీక్ష చేసిన మరోవ్యక్తిగా స్వామి నిగమానంద్ చరిత్రలో కెక్కారు. ఆయన మరణానంతరం ప్రభుత్వం ఆ మైనింగ్ ను ఆపేసింది..

మన దేశంలో కాక మనదేశ పాలనకు సంబంధించిన విషయాలను నిరసిస్తూ శ్రీలంక వాసి తిలీపన్ కూడా శ్రీలంకలో ఉన్న ప్రవాస తమిళులకోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి మరణిచాడు.. 1987లో దీక్ష చేసి అమరుడైన తిలీపన్ ప్రజల గుండెల్లో చిరస్తాయిగా నిలిచిపోయాడు. శ్రీలంకలో తీవ్రవాద వ్యతిరేక చట్టం పేరుతో నిర్భందించిన తమిళులను విడుదల చేయాలని, పునరావాసమనే సాకుతో తమిళ ప్రాంతంలో శ్రీలంక వాసులకు ఆశ్రయమివ్వడాన్ని నిలుపు చేయాలని, శ్రీలంక ఈశాన్య ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పోలీస్ క్యాంపులను ఆపాలని తిలీపన్ దీక్ష చేశాడు. ఎల్టీటీఈ సంస్థతో అతనికి ఉన్న సంబంధాల దృష్ట్యా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. స్వల్పకాలంలోనే తిలీపన్ ఆశయసాధనకోసం అమరుడయ్యాడు..

యావత్ భారతదేశ చరిత్రలోనే నిరాహార దీక్షా దక్షతకు ఆదర్శంగా నిలిచే మహిళ ఒకరున్నారు.. ఒకే లక్ష్యం కోసం నిరాహార దీక్ష చేస్తున్న మణిపూర్‌కు చెందిన ఒక 37 సంవత్సరాల యువతి... గత పది సంవత్సరాలుగా నిరవధిక నిరాహారదీక్ష సాగిస్తోంది. మధ్యలో ఒక్కసారి కూడా ఆపలేదు. ఇంతవరకు ప్రపంచంలోనే ఎవరూ, ఎప్పుడూ ఇంత సుదీర్ఘకాలం పాటు నిరాహారదీక్ష జరపలేదు. ఆమె పేరు ఇరోమ్‌ షర్మిల ఛానూ. మణిపూర్ లో నిర్భందాల మద్య పౌరులు అనేక హింసలకు గురవుతున్నారు.. తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల సాకుతో అమాయకులను పొట్టన బెట్టుకోవడాన్ని షర్మిలా ఛానూ వ్యతిరేకించింది. పోలీసులకు పూర్తి విచక్షణాధికారాలు కల్పించి అమాయక యువకులను కాల్చి చంపడాన్ని షర్మిలా నిరసించింది.. ప్రభుత్వం... షర్మిలాను ఆత్యహత్యా నేరం కింద అరెస్టు చేసి జైలులో నిర్భందించింది. జైలులో కూడా తన నిరాహార దీక్షను కొనసాగించింది.. అన్నపానీయాలు ముట్టకపోవడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించింది. ప్రభుత్వం నాళాల ద్వారా శరీరానికి కావలసిన ఆహారాన్ని అందిస్తోెంది.. ఈ పద్దతిని కూడా షర్మిలా వ్యతిరేకించింది.. కానీ అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే తాను బ్రతికుండాలి కనుక కేవలం నాళికా ద్రవాలతోెనే నిరాహార దీక్ష కొనసాగిస్తుంది.

యావత్ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ లో కూడా ధర్మాగ్రహంతో లక్ష్యసాధనకు నిరసన దీక్షకు దిగిన వారు కూడా ఉన్నారు.. అమర జీవి పొట్టి శ్రీరాములు తరువాత ఆ స్థాయిలో చెప్పుకోదగిన ప్రభావాన్ని కనబరిచిన వ్యక్తి.. తెలంగాణ ఉద్యమసారధి.. టిఆర్‌యస్ అధినేత కేసీఆర్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ టీఆర్ఎస్ అధ్యక్షడు కేసీఆర్ నిరాహార దీక్షకు దిగారు.. దీక్ష ఆపేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. కేసీఆర్ ను అరెస్టు చేసినా కూడా జైలులోనూ... ఆసుపత్రిలోనూ నిరాహార దీక్ష కొనసాగించారు.. కేసీఆర్ ఆరోగ్య పరిస్తతి విషమంగా మారడంతో దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించింది.. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపద్యంలో రాష్ట్ర విభజనకు ఆటంకాలు ఏర్పడ్డాయి..

ఆంధ్రప్రదేశ్ లో మరో సామాజిక ఉద్యమం యస్సీల వర్గీకరణ ఉద్యమం... ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా ప్రభుత్వం ప్రకటన చేయాలంటూ.. మందకృష్ట మాదిగ చేసిన నిరాహార దీక్షకు రాష్ట్రప్రభుత్వం స్పందించింది. కమిటీ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇవ్వడంతో మందకృష్ణ నిరాహార దీక్ష విరమించాడు.
స్పాట్
ిఇవే కాక దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ.. సత్యాగ్రహం చేయడం కొనసాగుతూనే ఉంది.. వ్యక్తులు కూడా తమకు అన్యాయం జరిగినపుడు ప్రభుత్వ కార్యాలయాల ముందు టెంట్ వేసుకోవడం.. నిరవధిక నిరాహార దీక్షలు చేయడం ఆనవాయితీగా వస్తోంది... అయితే పవిత్ర లక్ష్యాలకోసం అంతిమ ఆయుధంగా ఉపయోగించాల్సిన నిరాహార దీక్షలను కొందరు స్వార్ధ పరులు నవ్వుల పాలు చేయడం.. బాధ కలిగించే విషయం.. ఆర్భాటాల నడుమ.. రాజకీయ ప్రయోజనాల కోసం.. జనసమీకరణల మద్య చేసే బూటకపు దీక్షలు చేసేవారు.. అన్నా హజారే లాంటి పెద్దమనుషులను చూసి దీక్షకు సిసలైన నిర్వచనాన్ని గ్రహించాలి. బూటకపు దీక్షలను ప్రభుత్వాలు స్పందించడం మానేసిన రోజు... సిసలైన దీక్షా దక్షుల విశ్వసనీయత తెలుస్తుంది.. పోటీ దీక్షలు, బెదిరింపు దీక్షలు మాని సామాజిక ప్రయోజనాలు కోసం.. సమిష్టి ప్రయోజనాల కోసం.. జాతి ప్రయోజనాల కోసం చేసే దీక్షలు దేశ దిశాదశను మార్చగలవని... హజారే దీక్షద్వారా మరోసారి నిరూపితమయింది.

గారాల బంగారం..నింగి పొత్తిళ్లలో పుత్తడి.


బంగారం ధరలు చుక్కలను వెక్కిరిస్తున్నాయా అన్నట్టు పెరుగుతున్నాయి.. పుత్తడి ధరలు తారాజువ్వల కంటే స్పీడుగా పైకెగసి పడుతున్నాయి.. పసిడి వెలుగులు పంచుకోవాలనుకున్న మధ్యతరగతి మగువల ఆశలు అడియాశల్లాగానే కనిపిస్తున్నాయి.. సమ్మర్ టెంపరేచర్‌లో పాదరసంలా పైకెగసి పోతోన్న బంగారం ధరల పై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ..
బంగారం కొనాలనుకున్న మద్యతరగతి ప్రజలు... ఇక పుత్తడిని మరిచి ఇత్తడితోనే సరిపెట్టుకోవలసి వస్తుందా అన్నట్టున్నాయి పసిడి ధరలు.. గత ఐదు సంత్సరాలలో బంగారం ధర గణనీయంగా పెరిగి బులియన్ మార్కెట్‌ను పతాక శీర్షికల్లో నిలబెడుతోంది.. ఐదేళ్లలో పసిడి ధర రెండున్నర రెట్లు పెరిగిందంటే.. బంగారం ధరలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు..బంగారం ధర ఒకప్పుడు సామాన్యుడికి అందుబాటులోనే ఉండేది.. ఏదో ఒక రోజు బంగారు నగలు చేసుకోవచ్చనే ఊహల్లో ఉండేవారు.. కనీసం పెళ్లికో.. ఏదైనా వేడుకకో బంగారు నగలు కొనుగోలు చేయవచ్చనే ఆశతో ఉన్నారు.. కానీ ప్రస్తుతం ఉన్న రేట్లను బట్టి చూస్తుంటే.. వేడుకల కంటే బంగారం కొనడమనే విషయమే వేడిగా మారింది.. బంగారం పేరు చెబితే గుండె గుబేల్ మంటోంది.. వేలికి తొడిగే ఉంగరం కొనాలన్నా ఇరవై వేలు కావలసిందే... ఒక్కసారి గతంలోకి వెళితే.. 1963 లో 10 గ్రాముల బంగారం కేవలం 80రూపాయలకే వచ్చేది.. అంటే అప్పటి ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండేది.. అయితే ఇప్పటి ఆర్ధిక వనరులతో పోల్చుకుంటే ఆనాడు తక్కువే అయినా .. బంగారం ధర అంత బరువేమీ కాదు.. మద్యతరగతి, దిగువ మద్యతరగతి ప్రజలకు బంగారం అప్పట్లో అందని ద్రాక్ష కాదు.. భారతదేశం ఆర్దిక సంక్షోబంలో చిక్కుకున్నపుడు దేశాన్ని రక్షించింది బంగారమే.. భారత దేశానికి అప్పుపుట్టించిన ఆపద్భాందవుడు పుత్తడే.. అర్ధ దశాబ్ద కాలం నుంచి బంగారం రేట్లు కొండెక్కి దిగనంటున్నాయి. ఈ మద్య కాలంలో కొండ పై నుంచి శిఖరాన్ని పాకాయి.. ఇక ఇప్పట్లో దిగేలా కనిపించడం లేదు.. అమెరికాలో ఆర్ధిక సంక్షోభం... బంగారం రేట్లు పెరగడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా ఆచరించిన ఉదారవాద అర్దిక విధానాల వల్ల పెద్దన్న పూర్తిగా ఆర్ధిక సంక్షోభంలో కూరుకున్నాడు.. ఫలితంగా అమెరికా ప్రభుత్వం రుణబిల్లును ఆమోదించింది. ఈ బిల్లు పెట్టిన చిచ్చు ప్రపంచదేశాలను ప్రభావితం చేస్తోంది.. అమెరికా రుణ బిల్లు ప్రభావం కారణంగానే బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్లలో డబ్బులు పెట్టడం కన్నా బంగారం కొనడమే మేలని అందరూ భావిస్తున్నారు. అందుకే బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో, పెట్టుబడిపెట్టడానికి ఇన్వెస్టర్లు ఆసక్తిని కనబరుస్తున్నారు. బంగారం దిగుమతులు 1,000 టన్నుల స్థాయి దాటే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికా పరపతి రేటు తగ్గడం... యూరోజోన్ ఆర్థిక సమస్యలలో చిక్కుకోవడంతో సంక్షోభం రానుందని వార్తలొస్తున్నాయి... దీంతో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు పడిపోతుండడంతో బంగారంపై పెట్టుబడే క్షేమం అని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఈ నెలలో బంగారం ధర 15 శాతం పెరిగింది. ఈ విధంగా పెరగడం 1999 తర్వాత ఇదే మొదటిసారి. దేశీయంగా 10 గ్రాముల ధర రికార్డు స్థాయిలో పెరిగి రూ.29 వేలకు చేరువయింది... ప్రపంచంలో పసిడికి ఎక్కువ వినియోగదారులు ఉన్న భారత దేశం... 2010లో 958 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. అదేవిధంగా ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఇప్పటికే 553 టన్నులకు పైగా దిగుమతి చేసుకుందని డబ్యూజీసీ గణాంకాలు చెబుతున్నాయి.. బంగారం ధరలు పెరుగుతుండడంతో, మంచి లాభాలు వస్తాయన్న అంచనాలతో పుత్తడి పై పెట్టుబడికి కూడా డిమాండ్ పెరుగుతుంది. . దేశం మొత్తంలో బంగారు ఈటీఎఫ్‌లపై పెట్టుబడి 15 టన్నులకు చేరుకుంది. అయితే మార్కెట్లో పునరుత్పత్తి చేసిన బంగారం ఎక్కువవడంతో నగలకు డిమాండ్ తగ్గిందని విశ్లేషకులు చెబుతున్నారు. మార్కెట్లో ధరలు అధికంగా ఉండడంతో ప్రజలు నగలను అమ్మడానికి ప్రయత్నిస్తుండడంతో పాత బంగారానికి డిమాండ్ తగ్గింది. నింగిలో తారల్లా తళుక్కు మంటున్న బంగారం ధరలు ఇప్పట్లో తగ్గే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదంటున్నారు బులియన్ మార్కెట్ ఎనలిస్టులు.. దసరా.. దీపావళి పండుగలప్పటికి బంగారం ధర ముప్పైవేలను మించినా ఆశ్చర్యం లేదనేది విశ్లేషకుల అంచనా.. రియల్ ఎస్టేట్ ల మీద పెట్టిన పెట్టుబడిలో 25 శాతం పెట్టుబడి.. షేర్ బిజినెస్సుల్లో పెట్టిన పెట్టబడిలో 50 శాతం.. బంగారం పైన పెట్టినా ఊహించని లాభాలు వచ్చేవని పెట్టుబడి దారులు అంచనాలు కడుతున్నారు.. రానున్న రెండు నెలల్లో మరో పదిహేనొందల వరకు పెరిగే అవకాశం ఉండటంతో బంగారానికి మరింత డిమాండ్ పెరిగింది.

Friday, August 19, 2011

వామపక్ష తీవ్రవాద ఉద్యమం పూలపాన్పు కాదు



విప్లవం విందుభోజనం కాదు. వారి జీవితం పూలపాన్పు కాదు. భుజాలపై మృత్యువుని మోస్తున్నారు. కత్తుల వంతెనపై కవాతు చేస్తున్నారు... భావితరాల బంగారు భవిత కోసం..... ప్రాణాలను తృణప్రాయంగా త్యజిస్తున్నారు..... తమ సాహసం సుదీర్ఘమైనదని వారికి తెలుసు. వారు కలలుగన్న విప్లవం కష్టాల మయం... కన్నీళ్ళ పర్యంతం... ఎక్కడికి వారి ప్రయాణం? ఎవరికోసం అడవిబాట పట్టారు. మావోయిస్టులూ.....న్యూ డెమొక్రసీ కార్యకర్తలు....మార్గం వేరైనా గమ్యం ఒక్కటే..ఉద్యమ పంథా వేరైనా ఆశయం ఒక్కటే.... ప్రజాఉద్యమాలనూ, దళనిర్మాణాన్నీ అనుసంధానం చేసి పోరాడుతున్న విప్లవం పార్టీలు....మృత్యువుతో సహజీవనం చేస్తూ అనుక్షణం ప్రజల కోసం పోరాడుతున్న వారే. అడవిలో అక్షరాలు దిద్దుకున్న వాళ్ళు మొదలుకొని అత్యున్నత చదువులు చదువుకొని ఆయుధాలు అందుకున్నవారు సైతం అక్కడున్నారు. ఎక్కువ మంది ఆదివాసీలే. ప్రధానంగా మహిళలు. అత్యధికులు పేదలు, గిరిజనులు. ఆడమగ తేడా ఏమీ లేదక్కడ. అందరికీ ఒకే రకమైన శిక్షణ. ఒకే విధమైన క్రమశిక్షణ. భూమి సమస్య, దొరల పెత్తనం, గ్రామాల్లో దోపిడీ, పీడన, అణచివేత పోరాటంద్వారానే పరిష్కారమవుతాయని మనస్ఫూర్తిగా నమ్మి ఆయుధం పట్టారు. కష్టమైనా, నష్టమైనా ఆయుధాన్ని వదిలేది లేదంటున్నారు. ఒక్కొక్కిరిదీ ఒక్కో చరిత్ర. ఒక్కో సామాజిక నేపధ్యం. ఒక్కో పోరాట నేపధ్యం. ఇక్కడవన్నీ మరిచి ఒకే లక్ష్యం కోసం ఎండనకా, వాననకా, చలివణుకుతూ, మంచుకి తడుస్తూ, తనవారందరినీ వదులుకొని వచ్చిన వారి ఆశయం నెరవేరుతుందనే నమ్మకం గుండెలనిండా నింపుకున్నారు. నిస్వార్థంతో, నిరాడంబరంగా, నిరుపేదల పక్షాన నిలబడిన వీళ్ళు తమ ఆశయ సాధనలో ఎంతో మంది సహచరులను కోల్పోయారు. నెత్తుటిఏరులు పారినా... బారు ఫిరంగులు మోగినా ఎత్తిన జెండా దించకోయ్ అనేది పాటే కాదు. వారి బాట కూడా అదే. ఏ వివక్షా లేని సమాజ స్థాపన కోసం పౌర సమాజానికి దూరంగా వుంటున్నా సమసమాజానికి దగ్గరవుతామనే నమ్మకంతోనే వున్నామంటారు వాళ్లు. ప్రజాపోరు....ఉద్యమ బాటలో ఎన్నో అడ్డంకులు....మరెన్నో అవరోధాలు....ఖాకీల కంట పడకూడదు....క్యాంప్‌లు మారుస్తూ ఉండాలి. దళ సభ్యుల్లో ధైర్యం నింపాలి. ఈ మొత్తానికీ ఎంతో నెట్‌వర్క్ కావాలి. పోలీసు కూంబింగ్‌లు, కార్యక్రమాలకు అనుకూలంగా మావోయిస్ట్‌ల డెన్నులు మారుతుంటాయి. ఎక్కడ ఏ అలికిడైనా యిట్టే తెలిసిపోయే సమాచార వ్యవస్థ వారికుంటుంది. ఒకే చోట వారి క్యాంపు ఉండదు కాబట్టి, ఎక్కడ వుంటే అక్కడే తింటారు. దళ సభ్యుల్లో అత్యధిక సందర్భాల్లో తమ అవసరాలకు గ్రామస్తులపైనే ఆధారపడతారు. దళాలు తమతో పాటు కొద్దిపాటి సరుకులను మోసుకెళతారు. కానీ ఎక్కువ సార్లు గ్రామస్తులు పెట్టే భోజనంతోనే ఆకలి తీర్చుకుంటారు. ఇక ముందస్తుగా ఎమర్జెన్సీ మెడికల్ కిట్ అందరి దగ్గరా ఉంటుంది. మరీ ఇబ్బంది అయితే అడవిదాటాల్సిందే.
చలికీ, ఎండకీ, వానకీ, వారు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకునే ప్లాస్టిక్ కవర్లతో కూడిన గుడారాలు పూర్తి రక్షణనివ్వవు. ఇక ఎండాకాలం వచ్చిందంటే తాగే నీటికి కటకట లాడాల్సిందే. అనుక్షణం కదలికలో ఉండే దళాలకు నీటి అవసరం చాలా ఎక్కువ. కాల్వలు, కుంటల దగ్గర కాపుకాచి పోలీసులు వేటాడిన సందర్భాలను వీళ్లు ఎప్పడూ మర్చిపోరు. అందుకే నీటిని నిల్వవుంచుకునేందుకు కొన్ని పద్ధతులుంటాయి. గుంట తవ్వి ప్లాస్టిక్ కవర్ని గుంటలో అమర్చి అందులో నీళ్ళు నిల్వ చేసుకుంటారు. ఇక ఎండాకాలంలో రెండు కష్టాలు....ఒకటి నీటి సమస్య....మరొకటి పోలీసు దాడులు. ఆకులు రాలి అడవులు పలుచబడటం....వీరు ఎక్కడ ఉన్నారనేది....శత్రువుకు సులువుడా తెలిసిపోతుంది. పగలంతా అడవుల్లో ఉంటారు...పార్టీ కార్యకలాపాలపై చర్చిస్తారు....మరి చీకటి పడితే...గ్రామాల్లో సేద తీరడం.....వారి సమస్యలు తెల్సుకోవడం...ఒకవేళ దాడులు జరిగితే....తలోదారి వెతుక్కోవాల్సిందే. పగలంతా అడవుల్లో గడిపే దళసభ్యులు చీకటి పడే వేళకు గ్రామాలకు చేరుకుంటారు. పాటలతో, ఉపన్యాసాలతో గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తారు. గ్రామసమస్యలపై చర్చిస్తారు. చీకటైతే పోలీసులు సైతం గ్రామాల్లోకి రావడానికి భయపడతారు. అందుకే ఆదమరిచి నిద్దరపోయే వేళ తెల్లవారు ఝామునే ఎక్కువ దాడులు జరుగుతాయి. అందుకు సెంట్రీగా ఉన్న వ్యక్తి అనుక్షణం అలర్ట్‌గా ఉంటారు. ఏ చిన్న అలికిడయినా అందరినీ అలర్ట్ చేస్తారు. ఒకోసారి దాడి జరిగితే అందరూ తలోదిక్కుకు పారిపోతారు. ఆ తరువాత అడవిలో తమ వారి కోసం వెతుకులాట...... ఒక్కొక్కరూ కల్సుకోవడానికి పడరాని కష్టాలు....ఎన్నో సందర్భాల్లో ఇలా ఒంటరిగా ఉన్న వాళ్ళు... రోజుల తరబడి దళ సభ్యుల కోసం వెతుక్కున్న ఘటనలను వీరెప్పుడూ మర్చిపోలేదు. అడవితో పెనవేసుకున్న వారి జీవితం దుర్భరంగా ఉంటుంది. పాముల పుట్టలు వారికి పట్టు పాన్పులవుతాయి. చెట్ల ఆకులే వెచ్చని రగ్గులవుతాయి. ముళ్ళ పొదలే వారికి గదులుగా మారతాయి. అడవి పొదల్లో ఆయుధాలు దాస్తారు. తమ వారి జ్నాపకాలు గుర్తుకొస్తున్నా....పోరుదారే నిబ్బరాన్ని ఇస్తుంది. ఇన్ని కష్టాలు ఎవరి కోసం.....బాధలు ఎందుకోసం....ప్రజాపోరు ఎన్నో విజయాలు....ఎన్నో నిర్భంధాలు....తప్పదు....ఆశయ సాధన కోసం సాగే నిరంతర పోరుబాట.ఏళ్ళే కాదు తరాలకొద్దీ ఉద్యమంలో పనిచేస్తున్న వాళ్ళున్నారు. ఏం సాధించారని అడిగితే భూస్వాముల పెత్తనానికీ, పెత్తందార్ల దోపిడీకి ఎదురొడ్డి నిలవగలిగే ధైర్యం యిచ్చింది ఉద్యమమే అంటారు. సామాన్యుడి భూములు అతని చేతిలో ఇంకా ఉన్నాయంటే... ఉద్యమం ఫలమే అంటారు. దొరల ఎదుట నిలిచి..హక్కులు సాధించుకుంటున్నారంటే....అదీ ఉద్యమ స్ఫూర్తే అంటారు. ఆదివాసీ పోడు పంటను అనుభవిస్తున్నారంటే....దానికీ ఉద్యమ స్ఫూర్తేననేది వారి సమాధానం. ప్రత్యేక ఆర్థిక మండళ్లపై ఉద్యమాలు....కూలీరేట్ల కోసం పోరాటాలు....దళితుల దౌర్జన్యాలు...అగ్రవర్ణాల ఆధిపత్యానికి అంతం పలికారంటే...ఉద్యమ ఫలమేనన్నది వారి సమాధానం. ఉద్యమంలో ఆటు పోట్లు తప్పవు....ఎన్ కౌంటర్లతో క్యాడర్ బలహీన పడుతుంది. ప్రజలను భయపెడుతుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎంత మంది సహచరులను కోల్పోయినా ప్రభుత్వ నిర్బంధం ఉద్యమాలను బలహీన పరుస్తున్నా వారు తమది పురోగమనమేనంటారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరుకు ప్రజలను ఉద్యుక్తులను చేయడమే తమ కర్తవ్యమంటారు. ఎన్ కౌంటర్లు , నిర్బంధం ప్రజా ఉద్యమాలను ఎంతోకాలం అణచివేయలేవని ఏదో ఒక రోజు ఏదో ఒక మూల ప్రజలు చైతన్యవంతం అవుతూనే ఉంటారని, అణచివేత ఉన్నంత కాలం పోరాటం కొనిసాగితీరుతుందనే వీరి జీవితం ఏ వేకువకోసమో అర్థం చేసుకోవాలంటే వారి సంకల్పాన్ని అర్థం చేసుకోవాల్సిందే. వాళ్ళు విలాసవంతమైన, సుఖవంతమైన జీవితాన్ని కోరుకోలేదు. రంగురంగుల ప్రపంచం వారి దృష్టిని మళ్ళించలేదు. రేపటి సమసమాజపు ఉషోదయాన్ని ఆహ్వానించేందుకు కొండకోనల్లోకి వెళ్లారు. ఆ రేపటి కోసం వాళ్ళు నేటి ఉదయాలను త్యజిస్తున్నారు. క్షణ క్షణం మృత్యువుతో సహచర్యానికి సిద్ధమవుతున్నారు. తమ కళ్ళముందే సహచరులు రాలిపోతున్నా చలించని సంకల్పం వారిది. సమసమాజం కోసం పోరాడుతున్న వారి జీవన సమరమిది.

సల్వాజుడుం- ప్రభుత్వానికి ప్రైవేట్ సైన్యం


చట్టం తన పని తాను చేసుకుపోతుంది....చట్టాన్ని ప్రజలు చేతుల్లోకి తీసుకోకూడదు....న్యాయ రక్షణకు పోలీసులు ఉన్నారు....ఇదీ మన రాజ్యాంగం చెబుతున్న మాట....పెద్దలు నిర్దేశించిన బాట...అయితే....ప్రభుత్వమే ప్రైవేట్ ఆర్మీని ప్రోత్సహిస్తే......పోలీసులు చేయలేని...చేయకూడని కొన్ని పనులును.....వారితో చేయిస్తే.....ఏం జరుగుతుంది....రాజ్యం కొందరికి భోజ్యం అవుతుంది....సర్కార్ అండతో అరాచకాలు జరుగుతాయి...అలాంటి దారుణాలు మన దేశంలో జరిగాయి....సల్వాజుడుం.....గత కొన్నేళ్లుగా ఈ పేరు తెలీని పెద్దమనిషి ఉండడు....మావోయిస్ట్‌లకు పోటీగా తుపాకీ పట్టిన ప్రైవేట్ ఆర్మీ.....చత్తీస్‌ఘడ్ ప్రభుత్వ అండదండలతో అడవుల్లో నెత్తురు పారించిన సేన....ముల్లును ముల్లుతోనే తీయాలన్న సామెతను నిజం చేసిన చత్తీస్‌గడ్ పెద్దల నిర్వాకం......గిరిజన జీవితాల్లో చీకటి నింపింది.ఛత్తీస్ గఢ్ లో నక్సలైట్ల అణచివేతకు అక్కడి ప్రభుత్వం ఆదివాసీల్లోని ఒక తెగతో ప్రైవేటు సైన్యాన్ని తయారు చేసింది. దానిపేరే సల్వాజుడుం....17 నుంచి 25 సంవత్సరాలున్న యువకులకు ఆయుధ శిక్షణ ఇచ్చింది. వెయ్యి రూపాయల నుంచి మూడు వేల రూపాయల దాకా జీతం ఇచ్చింది. ఆధునికి ఆయుధాలు భుజాన పెట్టింది. కొంచెం చదువుకున్న వారిని స్పెషల్ పోలీస్ ఆఫీసర్లుగా నియమించింది. వీరి నియామకాలకు ఎటువంటి నిబంధనలు ఉండవు. వారు చేసే హింసాకాండకు ఎటువంటి శిక్షలు ఉండవు. ఆదివాసీల జీవితాలను చెల్లాచెదురు చేసినా, దారుణహింసకు పాల్పడినా, ఊళ్లకు ఊళ్లనే తగుల బెట్టినా....వారిని ప్రశ్నించే హక్కు కోర్టులకు కూడా ఉండదు. కేవలం పోలీసులతో చేయించలేని కొన్ని పనులను చేయించడానికి.....మావోలను ఉక్కుపాదంతో అణిచివేయడానికే సల్వాజుడుం ఏర్పాటు జరిగింది.సల్వాజుడుంని అడ్డుపెట్టుకుని చత్తీస్‌గడ్ సర్కార్ చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కాదు. సల్వాజుడుం చెలరేగినన్నాళ్లూ.....ఆదివాసీల జీవితాల్లో చీకటి రోజులే.....ఆదివాసీలు నక్సలైట్లకు ఆశ్రయం కల్పించారన్న నెపంతో పసిబిడ్డల చేతివేళ్ళను నరికిన రాక్షసత్వం సల్వాజుడుం నరనరాన్న జీర్ణించుకుంది. అమాయక ఆదివాసీల మానాన్ని కాపాడే ప్రయత్నం అక్కడ పోలీసులుకూడా చేయరు. కోట్ల రూపాయలు వీరి ఆయుధాలకు, వీరి భృతికి చెల్లిస్తున్నా ఇంతవరకు ఎక్కడి నుంచి ఈ నిధులను మళ్ళిస్తున్నారో లెక్కా పత్రం ఉండదు. స్పెషల్ పోలీసు ఆఫీసర్లుగా పరిగణిస్తున్న ఈ సల్వాజుడుం సైన్యం ఏర్పాటుకి ఎటువంటి చట్టబద్దత ఉండదు. వారికోసం చేస్తున్న ఆదాయ వ్యయాల లెక్కలుండవు. ఇదంతా ఓ అవినీతిలో భాగమేనంటున్నారు కొందరు ప్రజాస్వామిక వాదులు. అవినీతి నల్లధనాన్ని ప్రైవేటు సైన్యానికి ఖర్చుచేస్తూ బహుళజాతి కంపెనీలకు లాభం చేకూర్చేందుకేననేది వీరి వాదన. ఓ రకంగా చూస్తే ఆదివాసీలతోనే తోటివారి కన్ను పొడుస్తోంది. మట్టి తమ చేతులకు అంటకుండా చూసుకుంటోంది. ఉపాధిలేని ఆదివాసీలకు తుపాకులు ఇచ్చి, కేవలం వందల రూపాయల జీతం ముట్టజెప్పి తమ సోదరులపైకే ఉసి గొల్పుతున్నారు. వన సంపద కొల్లగొట్టే నల్లదొర కుట్రలు తెలీని ఈ అమయాక గిరిజనలు, తోటి ఆదీవాసీల ప్రాణాలను తీసేస్తున్నారు...నక్సలైట్ల అణచివేతలో భాగంగా వీరిని నియమించామని మాత్రమే ప్రభుత్వం చెపుతుంది. ఆదివాసీల గ్రామాలపైబడి వారిని భయభ్రాంతులకు గురిచేయడం. వారి ఆస్తులను ధ్వంసం చేయడం వీరి రోజువారీ కార్యక్రమం. హత్యలు, అత్యాచారాలు వీరి నిత్యకృత్యాలు. నక్సలైట్లకు ఆశ్రయమిచ్చారన్న నెపంతో గ్రామాలకు గ్రామాలనే తగుల బెట్టిన ఎస్ పిఓ లకు సర్వ హక్కులు ఉంటాయి. వారు ఏం చేసినా ఇదేమని ప్రశ్నించే హక్కు మాత్రం అక్కడి ఆదివాసీలకు గానీ ఎవ్వరికీ ఉండదు. అలా అడిగితే వారు నక్సలైట్ల కిందే లెక్క. నక్సలైట్లని పేరుంటే ఏమైనా చేసే అధికారం మాత్రం అనధికారికంగా పోలీసులకి, సల్వాజుడుంకి ఉంటుంది. అందుకే చివరకు ఏళ్ళతరబడి ఆదివాసీల కోసం స్థానికంగా పనిచేస్తున్న ఎన్ జీ ఓలు సైతం ఆ సాహసం చేయలేవు. అటువంటి సాహసం చేసిన వారికి పోలీసుల వేధింపులు తప్పలేదు.నక్సలైట్ల బూచి చూపి ప్రజలపైన, సామాన్య ఆదివాసీలు,
గిరిజనంపైన ఈ సల్వాజుడుం అనే జులుంని ప్రయోగిస్తోంది. సల్వాజుడుం పేరుతో ప్రైవేటు సైన్యం ఆదివాసీలు, గిరిజనులు లేదా సామాన్య ప్రజలపై జరుపుతున్న ప్రభుత్వమారణోహోమంపై హక్కుల సంఘాలు, మేధావులు, మీడియా, వివిధ రాజకీయ పార్టీలు జరిపిన దశాబ్దాల ఉద్యమం ఫలితంగా కదలిక వచ్చింది.ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం నియమించిన సల్వాజుడుం అక్రమమని, రాజ్యాంగ విరుద్ధమని దీనిని తక్షణమే రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆదివాసీల మధ్య అంతర్యుద్ధానికి కారణమౌతున్న ప్రైవేటు సైన్యం ఆయుధాలను ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని కూడా స్పష్టం చేసింది. కేవలం 4,5 తరగతులు మాత్రమే చదివిన ఆదివాసీలలోని ఒక తెగకు సంబంధించిన యువకులను స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ గా నియమించడం పట్ల తీవ్రఅభ్యంతరం వ్యక్తం చేసింది. కేవలం రెండునెలల తర్ఫీదుతో వారికి ఆయుధాలనిచ్చి ప్రజలపై ప్రయోగించమనడం చాలా ప్రమాకరమని కూడా హెచ్చరించింది. అంతేకాదు. ప్రభుత్వం నియమించిన ప్రైవేటుసైన్యం ప్రభుత్వానికి ఎదురు తిరిగితే వచ్చే నష్టం ఎటువంటిదో ఊహించమంది. దశాబ్దకాలంగా సల్వాజుడుం కి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజాస్వామ్య పోరాటాలకు సుప్రీంకోర్టు తీర్పుతో కాస్త ఊరట కలిగినట్టనిపించింది. అయితే అది తాత్కాలికమేనని చిదంబరం ప్రకటన స్పష్టం చేస్తోంది. దీనిపై రివ్యూ పిటిషన్ వేస్తామని, ఆర్డినెన్స్ తీసుకొస్తామని చిదంబరం చేస్తున్న ప్రకటనలను తీవ్రంగా ఖండిస్తున్నారు మేధావులు. ఇటువంటి అరాచకాలను దశాబ్దకాలంగా ప్రోత్సహిస్తూ వస్తున్న ప్రభుత్వాలు సుప్రీంకోర్టు తీర్పుతో సల్వాజుడుం ని నియంత్రించే ప్రయత్నం చేస్తాయా అన్నదే ఇప్పటి పౌరసమాజం ముందున్న ప్రశ్న? అది అంత సులువు కాదనే కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటన స్పష్టం చేస్తోంది. నక్సల్స్ బాధిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన చిదంబంర..... కొత్తం చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. స్పెషల్ పోలీసు ఆఫీసర్లకు చట్ట పరిధిని కల్పించేందుకే ఈ ప్రయత్నమని లెఫ్ట్ నేతల ఆరోపణ.ఇటు సైన్యం, అటు సల్వాజుడుం మధ్య అమాయక ఆదివాసీలు ఊళ్ళకు ఊళ్ళు ఖళీ చేసి ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో తలదాచుకుంటున్నారు. ఉన్న ఊళ్లను వదిలి దూరంగా గడుపుతున్నారు. ఇంత జరుగుతున్నా హోం మంత్రి చిదంబంర తన ప్రణాళికకు పదునుపెడుతున్నారు. సల్వాజుడుంను చట్టబద్ధం చేయాలనే కృతనిశ్చయంలో చిదంబరం ఉన్నారు.
కేంద్ర హోంమంత్రిగా ఉంటూ సుప్రీం తీర్పుకు అందకుండా వేరే ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తున్నారు. చిదంబరం కేవలం శాంతి భధ్రతలపైనే కాకుండా, సంపద తరలింపుపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. అందుకే ఆయన గతంలో అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో గనుల తవ్వకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మవోయిస్టులో, ఇతర ప్రజాస్వామ్యవాదులో అప్రమత్తమయ్యే లోపునే మైనింగ్ సంపద తరలించాలని చెప్పారు. ఫాస్ట్ మైనింగ్ ఉండాలంటూ బడా కంపెనీలకు ఒత్తాసు పలికారు. ఈ మొత్తం వ్యవహారం ద్వారా ప్రైవేటు సైన్యాలను పోషిస్తోంది కంపెనీల ముడుపుల, అవినీతి సొమ్మేనని స్పష్టమవుతోంది. యిటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఆదేశాన్ని ఆహ్వానిస్తున్నామంటూనే ప్రభుత్వం మరో ఆర్డినెన్స్ తెచ్చే ప్రయత్నం మొదలుపెట్టబోతోంది. రివ్యూ పిటిషన్ వెయ్యబోతోంది. ధర్మాసనాన్ని ఆశ్రయించబోతోంది. అయితే ఇదేం కొత్తకాదని, టాడాని రద్దుచేయాలని ప్రజాస్వామిక ఉద్యమాలు వచ్చినప్పుడు పోటా లాంటి చట్టాలను, దానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తే టాడా, పోటాల స్థానంలో యుఎపిఎ పేరుతో అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనే చట్టాన్ని 2008లో రూపొందించారు. ఇలాంటి మరింత ప్రమాదకరమైన నల్లచట్టాలను తీసుకొచ్చినట్టే ప్రభుత్వం ఈ రోజు సల్వాజుడుని నిషేధిస్తే మరో రూపంలో ప్రైవేటు సైన్యాన్ని కొనసాగించే ప్రయత్నం జరుగుతోందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకొనే ప్రయత్నం మరికొన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా చేసింది. లొంగిపోయిన నక్సలైట్లతోనూ, నక్సల్స్ వ్యతిరేకులనూ కూడగట్టి వారికి రహస్యంగా ఆయుధాలు సరఫరా చేసి నక్సల్స్ సానుభూతిపరులు, నక్సలైట్ల అనుకూలురి మీదకు ఉసిగొల్పిన సంఘటనలు ఆంధ్రరాష్ట్రంలో కోకొల్లలు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ గద్దర్ పైన హత్యాయత్నం. : 1997 నుంచి ఇప్పటివరకు కోబ్రాల పేరుతో బెదిరింపు లేఖలు, ఫోన్స్ లో లాంటి కార్యకలాపాలు ప్రభుత్వం ఏర్పర్చదల్చుకున్న ప్రైవేటు సైన్యంలో భగమే. అయితే దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వం పై ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు, హక్కుల నేతలు చేసిన పోరాట ఫలితంగా కోబ్రాలు కనుమరుగైనావారి స్థానంలో గ్రేహౌండ్స్ ఏర్పాటు జరిగింది. ఇటువంటి విధానాన్నే అనుసరించి ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం సల్వాజుడుం ని లీగలైజ్ చేసే ప్రయత్నం చేస్తోందనే వాదన వినిపిస్తోంది.

Saturday, August 13, 2011

ఉరి శిక్ష.. తీవ్రవాదులు.. స్వదేశీయులు... క్షమాబిక్ష..


నేరం చేసిన ముద్దాయికి కోర్టులు శిక్షలు విధిస్తాయి... శిక్షలు ఎన్నో రకాలుంటాయి.. వాటిల్లో యావజ్జీవ కారాగార శిక్ష పెద్దదయితే.. దానికి మించిన కాపిటల్ పనిష్మెంట్ ఒకటుంది. అదే ఉరిశిక్ష... ఒకసారి సుప్రీంకోర్ట్ ఉరిశిక్ష ఖరారు చేసిందంటే ఇక అప్పీల్ చేసుకోడానికి ఏ కోర్టూ ఉండదు.. ఒక్క రాష్ట్రపతికి మాత్రమే ఉరిశిక్ష పడ్డ నేరస్థులను కాపాడే అధికారం ఉంది. రాష్ట్రపతి కనికరించకుంటే నూకలు చెల్లినట్టే.. ఈ మద్యకాలంలో ఉగ్రవాదులకు సుప్రీంకోర్టు పలువురికి మరణశిక్ష విధించింది. సుప్రీంకోర్డు ఉరిశిక్ష విధించిన వారిలో ఎంతమందిని ఉరి తీశారు. ఎంతమందికి క్షమాబిక్ష పెట్టారు.. ఉరిశిక్ష పై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ..
చి'వురి' శిక్ష
దేశ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేసిన వారికి... ఎర్రకోట సమీపంలో సైనిక శిబిరం పై దాడి చేసిన తీవ్రవాదులకు... పార్లమెంట్ పై దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు.. ముంబయిలో మారణ హోమం సృష్టించిన టెర్రరిస్టుకు.. అత్యున్నత న్యాయస్థానం మరణ శిక్ష విధించింది.. ఈ శిక్షలన్నీ అమలవడానికి ఎంత కాలం పడుతుంది.. అసలు ఈ నేరస్థులు ఉరికంభం ఎక్కుతారా... లేక క్షమాబిక్ష పేరుతోనో... హైజాక్ ల పేరుతోనో బిగిసిన తాడును తప్పించుకుంటారా... ఇదే ఇప్పుడు యావత్ భారతం మదిలో మెదులుతున్న ప్రశ్నలు.దేశ సరిహద్దుల దాటి... రకరకాల రక్షణ వలయాలు ఛేదించుకొని... జన సమ్మర్ధాలను చేరుకొని దేశ రక్షణ వ్యవస్థకే సవాలుగా నిలిచిన మూకలవి... వారికి దేశ నాయకుడైనా... మామూలు పౌరుడని తేడా లేదు.. తీవ్రవాద ముసుగులో పచ్చి రక్తాన్ని రుచి మరిగిన ముష్కర మూకలు... వీరు అన్నెం పున్నెం ఎరుగని అమాయక ప్రజల పై బుల్లెట్ల వర్షం కురిపిస్తారు... దేశ చట్టాలను రూపొందించే పార్లమెంట్ లో జొరబడి ప్రజా ప్రతినిధులను గడగడ వణికిస్తారు.. ఎర్రకోట దగ్గర కవాతు చేసే సైనిక శిభిరాల పై దాడికి తెగబడతారు... దేశ భద్రతనే సవాలు చేసే ఈ కసాయి మూకలనేం చేయాలి... ఏ శిక్ష వేస్తే వీరికి సరిపోతుంది... ఈ ప్రశ్నకు యావత్ భారత జాతి ఠక్కున చెప్పే సమాధానం.. మరణ శిక్ష.. అవును రక్తం రుచి మరిగిని ఈ కిరాతకులకు వెయ్యాల్సింది మరణ శిక్షే.. ఆ శిక్ష ఎంత త్వరగా అమలు చేస్తే... అంత మంచిది.. మరొకరు ఈ పనికి పూనుకోవాలంటే వణికిపోవాలి.. వీలైతే అంత కిరాతకంగా శిక్షించాలి.. కానీ మనది అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం... ఇక్కడ శిక్ష వేయాలంటే... విచారించాలి.. నేరం రుజువు చేయాలి.. ఆ తరువాత శిక్ష విధించాలి.. తరువాత ఒక కోర్టు నేరస్థుడని రుజువు చేసినా మరో కోర్టులో న్యాయాన్ని కోరొచ్చు.. అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పాక కూడా రాష్ట్రపతిని రక్షించమని వేడుకొనే సౌకర్యం ఉంది.. ఇన్ని సోపానాలు దాటుకుంటూ వెళ్లే సరికి.. ఏదో ఒక బ్లాక్ మెయిల్ కు దిగి మన చేతుల్లో బందీలుగా ఉన్న నేరస్థులను విడిపించుకునే తెగువా వారికి ఉంది... అవును ఇప్పుడు మన జైళ్లలో ఉరిశిక్ష పడి.. ఉరికంబం ఎక్కడానికి సిద్దంగా ఉన్న ఉగ్రవాదుల సంఖ్య పదుల సంఖ్యలో నిరీక్షిస్తోంది... వీరందరినీ ఉరి తీసేదెప్పుడు.. అసలు ఉరిశిక్ష పడ్డ నేరస్థుడిని ఎంత కాలానికి ఉరి తీస్తారు... భారత దేశంలో ఎంత పెద్ద తప్పు చేసినట్టు రుజువయినా...యావత్ జీవ కారాగార శిక్ష మాత్రమే విధిస్తారు. కొన్ని అరుదైన కేసుల్లో మాత్రం కాపిటల్ పనిష్మెంట్ గా పిలిచే మరిణదండన విధిస్తారు. అతికిరాతకంగా హత్య చేసిన వారికి... మూర్ఖత్వంతో వ్యవహరించి పాశవికంగా సమూహ హత్యలకు పాల్పడ్డవారికి... మానవత్వాన్ని మరిచి... మానవజాతి తలదించుకునే కిరాతకానికి పాల్పడ్డ వారికి.. దేశ భద్రతనే ప్రశ్నార్దకంగా మార్చిన ఉగ్రవాదులకు ఉరిశిక్షను విధించిన సందర్భాలున్నాయి.. అయితే ఈ ఉరిశిక్షలు ఇప్పటివి కావు.. ఎన్నో వందల సంవత్సరాల నుంచి.. రాజులు.. సుల్తానులు.. ప్రభుత్వాలు విధిస్తున్నవే..భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 1983 నుంచి అరుదైన కేసుల్లో ఉరి శిక్ష విధించొచ్చని తెలిపింది. పాశవికంగా హత్యచేయడం, దోపిడీ హత్య, దేశ భద్రతకు ముప్పు కలిగించడం వంటి కేసుల్లో సుప్రీంకోర్టు ఎన్నో సార్లు ఉరిశిక్షలు విధించింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన ధనుంజయ్ చటర్జీ 1990 సంవత్సరంలో... 14 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసినట్టు నేరం రుజువు కావడంతో అతనికి కలకత్తా కోర్టు ఉరిశిక్ష విధించింది. రాష్ట్రపతి క్షమాబిక్ష తిరస్కరించడంతో ఆగస్టు 14, 2004న ఉరితీశారు.. చటర్జీ బంధువులు మృతదేహాన్ని తీసుకెళ్లడానికి నిరాకరించడంతో ప్రభుత్వమే దహనం చేసింది... రాష్ట్రంలో హైకోర్టులు కూడా ఉరిశిక్షలు విధించిన సందర్భాలున్నాయి. ఈ మద్యకాలంలో నెలరోజుల పసికందును ఆడపిల్ల అనే ఒకే ఒక కారణంతో హత్య చేసిన తండ్రికి విశాఖ కోర్టు ఉరిశిక్ష విధించింది. సహరించిన తల్లికి జైలు శిక్ష విధించింది. చెన్నై లో వరుస హత్య కేసులో ఆటో శంకర్ ని నేరస్థుడిగా నిర్ధారిస్తూ సుప్రీకోర్టు అతనికి మరణ శిక్ష విధించింది. ప్రజా ప్రతినిధుల పిల్లలను కిడ్నాప్ చేసి... రేప్ చేసి... హత్య చేసి ఇళ్ల మధ్యలో పాతిపెట్టిన సంఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు శంకర్ ను అరెస్టు చేశారు. నిందితుడు నేరాన్ని ఒప్పుకోవడంతో పాటు.. పోలీసులు తగిన ఆధారాలు కోర్టుకు సమర్పించడం వల్ల శంకర్ కు కోర్టు ఉరిశిక్ష విధించింది.. శంకర్ ను ఏప్రియల్ 27, 1995 ను ఉరితీశారు. ఆటోశంకర్ కేసి దేశవ్యాప్తంగా సంచలనం రేపింది..ిఇలా చెప్పుకుంటూ పోతుంటే స్వతంత్ర భారతంలో నేటికి 55 మందికి మాత్రమే ఉరిశిక్ష అమలు చేశారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.


రాష్ట్రపతి క్షమాబిక్ష జాబితాలో ఎన్నో కేసులు నిరీక్షిస్తున్నాయి. రాజీవ్ గాంధీతో బాటు, 14 మందిమరణానికి కారకులైన ముగ్గురు నిందితులు మురుగన్, శంతన్, పెరారివాలన్‌లు కూడా క్షమాబిక్ష జాబితాలో ఉన్నారు. వీరికి రాష్ట్రపతి క్షమాబిక్ష నిరాకరించింది.. ఈ ముగ్గురికి ఉరి తప్పదు.. వీరితో పాటు ఉన్న నళిని గర్భవతి కావడం వల్ల.. ఆమెను సోనియా గాంధీ క్షమించడంతో ఉరితాడు తప్పింది... 9 మందిని హతం చేసి 31 మందిని గాయపరిచిన ఖలీస్థాన్ లిబరేషన్ ఫోర్స్ టెర్రరిస్టు దేవిందర్ సింగ్, 21 మందిని పొట్టన బెట్టుకున్న గందపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ నలుగురు అనుచరులు, అమృత్ సర్ లో వరస హత్యలకు పాల్పడ్డ హంతకులకు, మంగుళూరులో కుటుంబ సభ్యులు నలుగురిని హత్య చేసిన ప్రవీణ్ కుమార్‌కు, గోద్రాలో రైలుకు నిప్పంటించి 58 సజీవదహనానికి పాల్పడిన 11 మందికి, ఇలా ఇదో ఉరితాడంత జాబితా ఉంటుంది. వీరంతా రాష్ట్రపతి క్షమాబిక్ష కోసం ఎదురుచూస్తూ కాలం గడుపుతున్నారు.. క్షమాబిక్ష లిస్టులో ఉన్న వారిలో చాలా మంది సహజ మరణంతో చనిపోయిన వారు కూడా ఉన్నారంటే మరణశిక్ష విధింపులో ఎంత జాప్యం జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా దేశ భద్రతనే సవాలు చేసే విధంగా ఏకంగా పార్లమెంట్ పై, ఎర్రకోట పై దాడికి పాల్పడ్డ తీవ్రవాదులకు కూడా సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించింది. 2000 సంవత్సరంలో ఎర్రకోట సమీపంలో సైనిక శిబిరం పై దాడి చేసిన పాకిస్థానీయుడు ఆరిఫ్ కు ఢిల్లీ కోర్టు, సుప్రీంకోర్టులు మరణ శిక్ష విధించాయి. 2001లో పార్లమెంట్ పై దాడి కేసులో కీలక సూత్రధారి అఫ్జల్ గురుకు కూడా కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. అబ్జల్ గురు క్షమాబిక్ష రాష్ట్రపతి చేతిలో ఉందని కేంద్రం తెలపింది. ముంబయిలో మారణహోమానికి పాల్పడ్డ అజ్మల్ అమీర్ కసబ్ కు కూడా కోర్టు ఉరిశిక్ష విధించింది. రాష్ట్ర పతి వద్ద ఇప్పటికే 29 క్షమాబిక్ష కేసులు పెండింగ్ లో ఉన్నాయి.. వీటిని పరిష్కరించాకగానీ ఉగ్రవాదులకు శిక్ష అమలయ్చే అవకాశం లేదు. ఉగ్రవాదులకు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాబిక్ష లభించదని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి ప్రత్యేక చొరవతో వీళ్ల ఫైలుకు కదలిక వస్తే శిక్ష అమలుచేసే అవకాశం ఉంది. ఉరిశిక్ష విధించగానే అక్కడితో కథ సమాప్తం కాదు. కిందికోర్టు శిక్ష విధిస్తే హైకోర్టుకు, అక్కడ కూడా శిక్ష ఖరారు చేస్తే సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు.. సుప్రీంకోర్టు కూడా ఉరిని ఖాయం చేస్తే.. రాష్ట్రపతి క్షమాబిక్ష పొందే అవకాశం ఉంది. రాష్ట్రపతి దగ్గర వెయిటింగ్ లిస్టు చాలానే ఉంది. ఇవన్నీ పరిష్కారమై ఉరి అమలు చేసే సమయానికి చాలా మంది సహజ మరణాన్ని పొందిన వారున్నారని అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2001లో ౩౩ మందికి, 2002లో 23 మందికి, 2005లో 77 మందికి, 2006లో 40 మందికి , 2007లో వంద మందికి ఉరిశిక్ష పడింది. వీరందరూ రాష్ట్రపతి క్షమాబిక్ష కోసం ఎదురు చూస్తున్నవారే. కింది కోర్టుల్లో మరణశిక్ష విధించబడిన చాలా మంది ముద్దాయిలకు రాష్ట్ర హై కోర్టు.. లేదా సుప్రీంకోర్టులు వాటిన యావత్ జీవ కారాగార శిక్షగా మార్చిన సందర్బాలు కోకొల్లలు.. ముద్దాయి నేర చరిత్రను బట్టి కోర్టు శిక్ష మార్పు చేస్తుంది. మరణ శిక్ష ను విధించడానికి ఇప్పటి వరకు ఉరి పద్దతినే అవలంబిస్తున్నారు.. పురాతన కాలంలో గ్రీకులు మరణ శిక్ష విధించాలంటే విషపు పాత్రను అందిచే వారు.. ఆ విషం తాగిన వ్యక్తి బెడ్ పై పడుకుంటే కాళ్లనుంచి చచ్చుబడుకుంటూ వస్తాయి.. పాదాల నుంచి స్పర్శ మాయమై చివరకు గొంతు వరకు స్పర్శ రహితమవుతుంది.. అప్పటి వరకు వ్యక్తికి ఎటువంటి బాధ కలుగదు.. ఆఖరు క్షణంలో మెదడు పనిచేయడం మానేసి కోమాలోకి వెళ్లి మరణిస్తాడు. సోక్రటీస్ కు గ్రీకులు విధించిన శిక్ష ఇటువంటిదే.. ఉరి శిక్షలో మనిషి కొంత సేపు బాధతో విలవిల్లాడుతాడు.. నరకయాతన అనుభవించి మరణిస్తాడు.. అందుకే ఈ శిక్షను సవాలు చేస్తూ 1983లో పౌరసంఘాలు కోర్టును ఆశ్రయించాయి. కానీ సుప్రీం కోర్టు దీన్ని తోసిపుచ్చింది. ఉరి విధింపులో ఎటువంటి అవమానకర పరిస్తితులు ఉండవని తెలిపింది.. మరణశిక్షకు ఉరితీతనే అనుసరిస్తున్నారు.




Friday, August 12, 2011

రాఖీ పౌర్ణమి విశిష్టత... రాకీ పుట్టుక... గమనం..


బతుకుబండి నడపే బాధ్యతలు ఒక పక్క ... కాలంతో పోటీ పడుతున్న వేగాన్ని అందుకోవాలన్న లక్ష్యం మరోపక్క.. వీటన్నిటి నడుమ బంధాలు అనుబంధాలు గుర్తుకురావడమే గగనమయ్యే పరిస్థితులు.. ఆత్మీయులను గుర్తుకుతెచ్చుకుందామన్నా తీరిక లేని బాధ్యతలు.. ఇంత వేగంలో కూడా తోడ బుట్టిన తోడును గుర్తుకుతెచ్చి.. ఆ ఒక్కరోజు బాల్య జ్ఞాపకాలను కుటుంబంతో నెమరేసుకునే ఓ మంచి పండుగ రాఖీ పౌర్ణమి.. సోదరీ సోదరుల జీవితాల్లో వెన్నెల నింపే చందమామ రాఖీ పౌర్ణమి.
అన్నా చెల్లెలు, అక్కా తమ్ముల అనుబంధానికి గుర్తుగా జరుపుకునే రాఖీ పౌర్ణమి ఇప్పటిది కాదు.. ఎందరో జీవితాలను కాపాడింది రాఖీ. రక్తపాతాన్ని నిలిపింది రాఖీ.. ఎదలోతుల్లో దాగిన అనురాగాల రాగాలను పలికించింది రాఖీ.. అవును రాఖీకి ఉన్న గొప్పతనం అంతటిది.సోదరీ సొదరుల అనుబంధానికి అచ్చమైన ప్రతీక రాకీ. తన సోదరుడు క్షేమంగా ఉండాలంటూ సోదరి కట్టే బందనమే రాఖీ.. మరో సందర్భంలో తమను ఆపద నుంచి కాపాడమని కోరుకుంటూ సోదరుడికి కట్టే బంధనాన్ని కూడా రాఖీ అంటారు.. అందుకే దీనికి రక్షా బంధన్ అనే పేరొచ్చింది.. ఈ రాఖీ ఇప్పటిది కాదు.. పురాణ కాలం నుంచి రాఖీ పౌర్ణమి వేడుక వైభవంగా జరుపుకుంటున్నారు. పురాణకాలంలో వృత్తాసురుడనే రాక్షసుడు దేవలోకం పైకి యుద్దానికి వచ్చాడట.. అప్పుడు ఇంద్రుడి భార్య ఇంద్రాణి మంత్రించిన దారం ఇంద్రుడి మణికట్టుకు కట్టిందట.. ఆ రక్షతో ఇంద్రుడికి యుద్దంలో విజయం లభించిందని పురాణ కథ ప్రచారంలో ఉంది... అంటే రాఖీ సంప్రదాయం మొదట భార్య రక్షా బంధనాన్ని భర్తకు కట్టడంతో ప్రారంభమయింది. తరువాత కాలంలో ఒకసారి రాక్షస రాజైన బలిచక్రవర్తి భూ మండలాన్ని ఆక్రమించాడు. చక్రవర్తి బలం చూసుకొని దానవులంతా మానవులను నానా హింసలకు గురిచేస్తుంటే.. వారిని కాపాడేందుకు విష్ణుమూర్తి వైకుంఠాన్ని వదిలి భూమికి వస్తాడు. అప్పుడు లక్ష్యీదేవి ఒక బ్రాహ్మణ యువతి వేశంలో బలి చక్రవర్తి వద్దకు వచ్చి... శ్రావణ పౌర్ణమి రోజున పవిత్రమైన దారాన్ని చేతికి కట్టి తానెవరో, ఎందుకొచ్చానో చెబుతుంది. అప్పుడు బలిచక్రవర్తి మానవులను వదిలేసి విష్ణుమూర్తిని వైకుఠానికి వెళ్లవలసిందిగా ప్రార్ధిస్తాడనే మరో కథ కూడా ప్రచారంలో ఉంది.రాఖీ పురాణాల్లోనే కాదు రాజుల చరిత్రలో కూడా స్థానం సంపాదించింది. ఉత్తర భారతదేశంలో రాజులు రాజ్యాలకోసం యుద్దాలు చేస్తున్న రోజులవి.. చిత్తోర్‌ఘడ్ రాజు అకాల మరణం వలన రాజ్యభారం రాణి కర్ణావతి పై పడింది.. అబల అనే చులకన భావంతో గుజరాత్ సుల్తాన్ బహుదూర్ షా తన సేనలతో చిత్తోర్‌ఘడ్ పైకి దండయాత్రకు వస్తాడు.. ఈ విపత్కర పరిస్థితిలో కర్ణావతి మొఘల్ చక్రవర్తి హుమాయున్ కు రాఖీని కానుకగా పంపుతుంది. రాఖీనందుకున్న హుమాయున్ కర్ణావతిని తన సోదరిగా గుర్తించి ఆమెకు అండగా నిలబడి బహుదూర్ షా ను ఓడిస్తాడు. మరాఠా ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటున్న శివాజీకి కూడా ఒకసారి ిఇటువంటి సంఘటన ఎదురయింది. యుద్దఖైదీకి ఒకరికి మరణ దండన విధించాడు శివాజీ.. ఆ సమయంలో ఒక హిందూ స్త్రీ శివాజీకి రాఖీ కట్టింది.. దానికి ప్రతిగా తనకు పసుపు కుంకుమలను ప్రసాదించమని కోరింది. మహిళలంటే గౌరవం ఉన్న శివాజీ ఆమె మాటకు సరేనన్నాడు. శివాజీ మరణ శిక్ష విధించిన ఖైదీ భార్యే ఆ యువతి కావడంతో... రాఖీ యుద్దఖైదీని మరణశిక్ష నుంచి కాపాడినట్లయింది. ఆనాటి నుంచి రాఖీకున్న ప్రాధాన్యత మరింత పెరిగింది. ప్రపంచాన్ని జయించాలన్న విజయకాంక్షతో భారతదేశం పైకి దండెత్తి వచ్చాడు అలెగ్జాండర్.. ఆ సమయంలో పురుషోత్తముడి శక్తి సామర్ధ్యాలు తెలిసిన అలెగ్జాండర్ భార్య రుక్సానా పురుషోత్తముడికి రాఖీని పంపి తన భర్తను చంపవద్దని కోరుతుంది. యుద్దంలో అలెగ్జాండర్ ను చంపే అవకాశం వచ్చినా... పురుషోత్తముడికి చేతికున్న రాఖీ గుర్తుకు వచ్చి అలెగ్జాండర్ కు ప్రాణబిక్ష పెడతాడు. చరిత్రలో అత్యవసర సాయం కోసం అన్నగా భావించి అర్ధించిన సంప్రదాయం నేడు బహుమతుల రూపంలోకి మారింది. రక్షా బంధనాన్ని కడితే ఎదో ఒక బహుమతి ఇవ్వాలనే సంప్రదాయంగా మారింది.అన్నా చెల్లెళ్లు ఎంత దూరాన ఉన్నా రాఖీ పౌర్ణమి పండుగ రోజున కలుసుకుంటారు.. ఖండాంతరాల్లో ఉండి కలువలేక పోతే రాఖీలు పంపుకొని శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఇదే రాఖీ పౌర్ణమిని ప్రాంతాల వారీగా ఒక్కొప్రాంతం వారు ఒక్కోరకంగా జరుపుకుంటారు. ఈ రోజునే జంద్య పౌర్ణమి అని, నారియల్ పౌర్ణమి అని, కజరి పౌర్ణమి అని రకరకాలుగా రకరకాల పేర్లతో వేడుక జరుపుకుంటారు. వర్షాలు కురిసి, నదుల నిండుగా నీరు ప్రవహిస్తూ నేలమ్మ పచ్చని చీర కట్టినట్టు, గడ్డిపూలతో అలంకరించుకునే ఈ రుతువుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఏటి నీళ్లలో నిండు పౌర్ణి ప్రతిబింబం... రేయి నుదుటిన బొట్టు పెట్టినట్టు కనిపిస్తుందని... ప్రకృతికి అందం దిద్దే రుతువుల్లో శ్రావణ పౌర్ణమి ఒకటని కవులు వర్ణిస్తారు. అందుకే శ్రావణ పౌర్ణమి కి అంత విశిష్టత ఆపాదించారు.

Thursday, August 11, 2011

జాత్యహంకార తిరుగుబాటుతో రగులుతున్న లండన్..



లండన్ లో రాజుకున్న సెగలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడంలేదు... ఈ అల్లర్లకు బ్రిటన్ ప్రభుత్వం రకరకాల కారణాలు చెబుతున్నప్పటికీ... అసలు కారణం మాత్రం పభుత్వం పై ప్రజల్లో ఉన్న అసంతృప్తేనని తెలుస్తోంది.. నగరాలన్నీ అగంతుకుల దాడులతో అట్టుడికి పోతున్నాయి.. నేరస్థులను విచారించే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు స్పీడ్ గా విచారణ జరుపుతున్నా... రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. మరోపక్క లూటీలు, దొమ్మీల నుంచి అల్లరి మూకలు హత్యా నేరాల వైపు మళ్లుతున్నారు. పరిస్థిితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం చేసే ప్రయత్నాలేవీ ఫలిస్తున్నట్టు కనిపించకపోగా.. అల్లర్లను అదుపు చేయాల్సిన పోలీసు బలగాలే అసంతృప్తతో రగులుతున్నట్టు వార్తలొస్తున్నాయి.
బ్యాంగ్ - 'బర్నింగ్' హోం
యాంకర్ 1
లండన్ లో అల్లర్లు తగ్గుముఖం పట్టేటట్టు కనిపించడం లేదు. బర్మింగ్ హాం.. బర్నింగ్ హోంలా నిత్యం అగ్నిగుండంలా రగులుతోంది. అల్లరి మూకలు పెట్రోల్ బాంబులతో పెట్రేగిపోతున్నారు.. ఒక పక్క జాత్యహంకార దాడులు, మరో పక్క ప్రభుత్వం పై అసమ్మతి సెగలు.. అన్నీ కలిసి ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అల్లర్లను అదుపు చేసేందుకు భారీ గా బలగాలను దించినా ఎటువంటి ఫలితమూ లేదు. సాయంత్రమయితే చాలు అల్లరి మూకలు విజృంబిస్తున్నాయి..
విజవల్స్
వాయిస్
లండన్ నగరం నాలుగు రోజులుగా హింస, లూటీలతో అట్టుడికిపోతోంది. లండన్‌లో ప్రారంభమైన అల్లర్లు మరో మూడు ప్రధాన నగరాలకు కూడా వ్యాపించాయి. బ్రిటన్‌లో 1980 తర్వాత ఇంత భారీగా అల్లర్లు చెలరేగడం ఇదే మొదటిసారి. అల్లరి మూకలు లండన్‌లో భవనాలకు, వాహనాలకు, చెత్త కుప్పలకు నిప్పు అంటిస్తూ వెళ్లిపోతున్నారు. పోలీసు అధికారులపైకి బాటిళ్లు, ఫైర్ వర్క్స్ రువ్వుతూ దుకాణాలను లూటీ చేస్తున్నారు. ఈ వేసవిలో 2012 కామన్‌వెల్త్ క్రీడలు జరుగనుండగా.. ఈ అల్లర్లు క్రీడలపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
విజువల్స్
వాయిస్
సభ్యతాసంస్కారానికి ప్రతీకలుగా చెప్పుకునే ఆంగ్లేయుల ప్రతిష్ఠను ఈ అల్లర్లు మసకబార్చాయి. పగలంతా ప్రశాంతంగా ఉండి సాయంత్రం ఐదు గంటల నుంచి అర్ధరాత్రి వరకు అల్లరిమూకలు చెలరేగిపోతున్నాయి. యువకులు గుంపుగుంపులుగా ముసుగులు ధరించి దోపీడీలకు, విధ్వంసాలకు పాల్పడుతున్నారు. ఈ పరిణామాలను చక్కదిద్దేందుకు ఇటలీ పర్యటనలో ఉన్న బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్‌ పర్యటన నుంచి వెనుతిరిగారు. నగరాల్లో హింసను నిరోధించడానికి అన్ని చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 20 వేల మందికి పై చిలుకు పోలీసులను నగరంలో మొహరించినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో.. మరికొంత మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దింపుతున్నారు.

ఈ అల్లర్లకు మూలాలేంటనే విషయంలో బ్రిటన్ ప్రభుత్వం రకరకాల కారణాలు చెబుతోంది. మొదట మార్క్ డగ్లన్ అనే యువకుడిని పోలీసులు కాల్చి చంపడంతో నల్లజాతీయులు కోపంతో నిరసన ప్రారంభిచారు. వారిపై లాఠీ ఝుళిపించడంతో నిరనలు తారాస్థాయికి చేరాయి. మొదటగా ఈ అల్లర్లు లండన్‌లో ప్రారంభమయి... మిగతా నగరాలకు కూడావిస్తరించించాయి. సాయంత్రమైతే చాలు... అల్లరి మూకలు పెట్రోల్ బాంబులు, రాళ్లు, సీసాలతో దాడులకు పాల్పడుతున్నారు.
యాంకర్ 2
లండన్ లో అల్లర్లకు కారణం కేవలం డగ్లన్ అనే నల్లజాతీయుణ్ని పోలీసులు కాల్చి చంపడమే కారణమా.. లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా.. ఒక వ్యక్తిని చంపినందుకు ఒక జాతి... జాతి మొత్తం ఇంతగా చెలరేగిపోయి విధ్యంసం సృష్టిస్తుందా... అలా చేస్తే ప్రభుత్వం ఊరుకుంటుందా... అల్లర్లకు అసలు కారణమేంటో ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు... అల్లర్ల బలమెంతో.. అవి ఏ స్థాయికి చేరుతాయో కూడా ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉంది. కానీ అప్రమత్తమయ్యే సమయానికి ప్రమాదం ముంచుకొచ్చింది. ఇంతకీ లండన్ లో ఏం జరుగుతోంది...
విజువల్
వాయిస్
శాంతి యుతంగా నిరసన చేస్తున్న డగ్లన్ కాల్చి చంపిన విషయంలో పోలీసులు రకరకాల కథనాలు వినిపిస్తున్నారు. అల్లర్లకు మూల కారణమైన డగ్లన్ మాదకద్రవ్యాలు విక్రయించే ముఠాకు నేతృత్వం వహిస్తున్నాడని పోలీసులు చెబుతున్నప్పటికీ అల్లర్లకు వేరే కారణాలు కూడా ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. 2012 కామన్ వెల్త్ క్రీడల్లో నల్లజాతి వారికి ప్రాధాన్యం పూర్తిగా తగ్గించినందువల్ల డగ్లన్ నిరసనకు దిగాడు. శాంతియుతంగా నిరసన చేస్తున్న డగ్లన్ ను పోలీసులు కాల్చి చంపి అతనే తమ పై కాల్పులు జరిపితే తాము ఎదురు కాల్పులు జరిపామనే కథనం వినిపించారు. వాస్తవాలు తెలుసుకున్న యువకులు ఆగ్రహంతో ఊగిపోయారు. నగరవీధులన్నీ నిప్పుల కుంపట్లుగా మారిపోయాయి. దుకాణాలన్నీ లూఠీలకు, దోపిడీలకు గురయి పోతున్నా.. వ్యాపారులు చూస్తూ నిస్తేజంగా నిలుచుండటం మినహా ఏమీచేయలేని పరిస్తిితి.. ఈ దాడుల్లో అత్యధికం యువకులే పాల్గొంటున్నారు... యువతీ యువకులే కాకుండా పిల్లలు కూడా దాడుల్లో పాల్గొనడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. దొరికిన నేరస్థులందరినీ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో విచారించి వదిలేస్తున్నారు. కొందరిని రిమాండ్ కు పంపినా వెంటనే బెయిల్ మంజూరు చేసి విడుదల చేస్తున్నారు.
విజువల్స్
వాయిస్
రవి అస్తమించని రాజ్యంగా పేరొందిన ఇంగ్లాండ్‌లో ప్రజల మధ్య సంబంధాలు మేడిపండు చందంలా తయారయ్యాయి.. ప్రజాస్వామ్యం, జాతుల జీవనం పేరుతో తక్కువ వేతనాలకు పనిచేస్తారనే ఉద్ధేశంతో ఆఫ్రికా, కరేబియన్ దీవులకు చెందిన వారిని వలసల పేరుతో ప్రోత్సహించిన ఆంగ్లేయులకు వారి పాపాలే వారి మెడకు చుట్టుకున్నాయి. స్థానిక ప్రజలకు, వలస వచ్చిన వారికి మధ్య ఆర్ధిక వ్యత్యాసం పెరిగిపోయింది. లండన్ పేరుకు మెట్రోపాలిటన్ నగరమై అయినప్పటికీ బతుకుదెరువుకోసం వలసవచ్చిన వారంతా పక్కకు విసిరవేసినట్లు ప్రత్యేక వాడల్లో జీవనం సాగిస్తున్నారు. పోలీసులు వారిపై నిఘాపెట్టడం, ఆంగ్లేయులు వారి శ్రమను దోచుకోవడం వంటి కారణాల వల్ల వారు మానసిక సంఘర్షణకు గురయ్యారు. రోజు రోజుకూ ఈ అసమ్మతి పెరిగిపోసాగింది. ఇంగ్లాండ్ లో జాత్యహంకార వ్యవస్థ రోజురోజుకూ పెరుగుతున్నా.. ప్రభుత్వం పట్టీ పట్టనట్టు ఉండటమే కాకుండా.. అగ్నికి ఆజ్యం పోసినట్టు కామన్ వెల్త్ క్రీడల్లో తక్కువ మందికి అవకాశం ఇవ్వడం నల్లజాతీయుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకోవడానికి కారణం అయింది. . తాజా అల్లర్లలో నల్లజాతి ముఠాలు బ్యాంకులు, ఏటీఎంల, జోలికి పోకుండా బ్రాండెడ్ దుస్తులు అమ్మే దుకాణాలు, అలంకరణ సామగ్రి దుకాణాలపైనే దృష్టి సారించడం ఇక్కడ గమనించాల్సిన విషయం.
విజువల్స్
వాయిస్
అల్లర్లకు మూలం డగ్లన్ ను కాల్చడమే అయినప్పటికీ... అల్లర్లు పెరగడానికి రకరకాల కారణాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన లండన్‌ ఒలింపిక్స్‌ 2012 ద్వితీయార్థంలో జరగనున్నాయి. ఈ క్రీడల్లో నల్ల జాతి వారి పట్ల వివక్ష చూపారనే అపవాదు మూటగట్టుకుంది ప్రభుత్వం. క్రీడలు జరగబోయే ఏడాది ముందు ఇంత విస్తృత స్థాయిలో ఘర్షణలు జరగడం... వాటిని యువత ప్రొత్సహించడం వెనుక ప్రభుత్వం పై ఎంత అసమ్మతితో ఉన్నాయో చెప్పకనే చెబుతోంది. . బ్రిటన్‌ ప్రతిష్టకు ఇది పెద్ద దెబ్బే.


అభివృద్ది చెందిన దేశాలకు ముందువరసలో నిటబడి... దిశానిర్ధేశం చేసే బ్రిటన్ సంక్షేమ రంగాలకు భారీగా కోత విధించడమేకాక... ఉపాధి అవకాశాలను కూడా కుదించడం యువతలో నిరుత్సాహానికి ప్రధాన కారణం.. దీంతో బాటు అసలు కారణాలను పక్కన బెట్టి...అసమ్మతులను అణిచివేసేందుకు ప్రభుత్వం నియంతలా ప్రవర్తించడం అల్లర్లు మరింత పెరగడానికి కారణంగా కనిపిస్తోంది.

అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో ఆదర్శ ప్రాయమైనదిగా చెప్పకునే బ్రిటన్‌ వైద్య రంగంలో సంక్షేమానికి కోతపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇతర రంగాల్లోనూ సంక్షేమ వ్యయాన్ని కత్తిరిస్తున్నారు. 2015 నాటికి ప్రభుత్వ వ్యయంలో 8 వేల కోట్ల పౌండ్లు కోత విధించాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే కత్తిరింపులు మొదలయ్యాయి. మార్క్‌ డగ్గన్‌ను కాల్చి చంపిన దక్షిణ లండన్‌లోని టోటెన్‌హాం ప్రాంతంలో యువజన సర్వీసులకిచ్చే బడ్జెట్‌లో 75 శాతం కోతపెట్టారు. ఆ ప్రాంతంలో నిరుద్యోగిత 20 శాతం నమోదయ్యింది. సంక్షేమ బడ్జెట్‌ కోత పడడంతో యువతీ యువకుల్లో అసంతృప్తి విపరీతంగా పెరిగింది. బ్రిటన్‌ యువతలో అసంతృప్తి జ్వాలలు రగలడానికి ఇలాంటి కారణాలు చాలా ఉన్నాయి.. అసంతృప్తులను, అసమ్మతులను అణిచివేసేందుకు ఉపయోగించే పోలీసులు కూడా అసంతృప్తితో రగులతున్నారు. పొదుపు చర్యల్లో భాగంగా టోరీ ప్రభుత్వం రానున్న నాలుగు సంవత్సరాల్లో 34 వేల పోలీసు ఉద్యోగుల పోస్టులను రద్దుచేయ నిర్ణయించింది. పోలీసు బడ్జెట్‌లో 20 శాతం కోత విధించింది. మీడియాను సైతం టోరీ పాలన వదిలిపెట్టలేదు. ఆ దేశంలోని అతిపెద్ద మీడియా సంస్థ అయిన బిబిసికి ప్రభుత్వం నుంచి ఇచ్చే కేటాయింపులకు కోతపెట్టింది. అందుకు నిరసనగా గడిచిన రెండు నెలల్లోనే బిబిసి పాత్రికేయులు రెండుసార్లు సమ్మె చేశారు. ఇలా బ్రిటన్‌లోని వివిధ వర్గాలు, తరగతులకు చెందిన ప్రజానీకం ప్రభుత్వ చర్యలతో అసంతృప్తి చెందాయి. . . నిరసనలకు మూల కారణమైన ఉదారవాద ఆర్థిక విధానాలను అక్కడి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. లేదా కనీసం ఆ వేగాన్ని తగ్గించాలి. అప్పుడే బ్రిటన్‌లో మంటలు చల్లారుతాయి. ప్రపంచమంతా మానవహక్కులు, ప్రజాస్వామ్యం, సమానత్వం అంటూ ప్రపంచదేశాలకు హితబోధ చేసే పాశ్చాత్య దేశాలు తమ దేశాల్లో వాస్తవంగా నెలకొన్న వాస్తవ పరిస్థితిని ఎంత కప్పి పెట్టినా ఏదో ఒకరోజు నివురు చెరిగిన నిప్పులా రగిలి రగిలి దావానంలా వ్యాపిస్తుందనే సత్యం మరోమారు రుజువయింది.

అర్ధరాత్రి స్వతంత్ర్యం... అవినీతి భారతం




ప్రజల చేత.. ప్రజల వలన.. ప్రజల కొరకు అన్న సూత్రాన్ని తుంగలో తొక్కి నేతల చేత.. నేతల వలన..నేతల కొరకే ప్రజాస్వామ్యమన్నట్టుగా తయారయింది మన భారతం.. ఏనాడైతే మనకు చీకట్లోస్వాతంత్ర్యం వచ్చింది ఆనాటి నుంచి నేటి వరకు చీకట్లు తొలగలేదు. తొలుగుతాయన్న ఆశ కూడా లేనంత ఘాడంగా అవినీతి చీకట్లు అలుముకున్నాయి.. ఈ అవినీతి రక్కసి కోరలు పీకాలనుకున్న లోక్ పాల్ బిల్లు కూడా దెయ్యాల చేతిలో మంత్ర దండంగా మారబోతోందా.. ఇప్పటికీ దేశాన్ని దోచుకున్న దొంగలెవరు.. ఈ స్వతంత్ర భారతంలో స్వరాజ్యం సిద్దించిన మరుసటి సంవత్సరం నుంచే దేశంలో దొంగలు పడ్డారంటే మీరు నమ్ముతారా..అవును నమ్మితీరాలి.. ఎందుకంటే నాటి జీపుల కుంభకోణం నుంచి నేటి ఘనాపాటిల గనుల కుంభకోణం వరకు అంతా అవినీతి మరకల చరిత్రే. అరవై నాలుగేండ్ల అవినీతి స్వాతంత్ర్యాన్ని ఒక్కసారి చూద్దాం..
జీపుల కొనుగోళ్ళు (1948): స్వాతంత్య్రం తర్వాత జరిగిన తొలి అవినీతి ఇది. సూత్రధారి భారత్‌ హై కమిషనర్‌ వికే కృష్ణ మీనన్‌. ప్రోటోకాల్‌ను ఉల్లఘించిన ఘనుడి ఈయన. ఓ విదేశీ కంపెనీ నుంచి ఆర్మీ జీపుల కొనుగోలుకు రూ. 80 లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు.
సైకిళ్ళ దిగుమతి (1951): ఓ కంపెనీకి సైకిళ్ళ దిగుమతి అనుమతి ఇచ్చేందుకు నాటి వాణిజ్య, పారిశ్రామిక మంత్రిత్వశాఖ కార్యదర్శి ఎస్‌ఏ వెంకటరామన్‌ లంచం తీసుకుని, జైలుకు వెళ్ళాడు.
బిహెచ్‌యూ నిధులు (1956): విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన ఉదంతమిది. బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం అధికారులు రూ.50 లక్షల నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు.
ముంద్రా కుంభకోణం (1957): తొలిసారిగా మీడియాకు చిక్కిన స్కాం ఇది. కోల్‌కత్తాకు చెందిన హరిదాస్‌ ముంద్రా అనే వ్యాపారి ఎల్‌ఐసీని టార్గెట్‌ చేశారు. మోసపూరితంగా షేర్లు అమ్మడం వల్ల రూ.1.25 కోట్ల నష్టం వాటిల్లింది. దీనిపై ప్రధానిగా ఉన్న నెహ్రూ న్యాయ విచారణకు ఆదేశించారు. జస్టిస్‌ ఎంసీ చాగ్లా నేతృత్వంలో కమిషన్‌ వేశారు. ఈ కేసులో ముంద్రాకు 22 ఏళ్ళ జైలుశిక్ష పడింది. నాటి ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి ఇందుకు బాధ్యతగా తన పదవికి రాజీనామా చేశారు.
తేజ రుణాలు (1960): జయంత్‌ షిప్పింగ్‌ కంపెనీని నెలకొల్పుతానంటూ నౌకారంగం దిగ్గజం జయంత్‌ ధర్మతేజ రూ.22 కోట్ల రుణం తీసుకున్నారు. కానీ కంపెనీ పెట్టకుండా ఆ డబ్బుతో దేశం వదిలి ఉడాయించాడు.
కైరాన్‌ స్కాం (1963): దేశంలోనే తొలిసారిగా ఓ ముఖ్యమంత్రిపై వచ్చిన ఆరోపణలు ఇవి. ప్రాప్‌సింగ్‌ కైరాన్‌ తనతో పాటు కుమారులు, బంధువుల ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగం చేశారు. ఈ దుమారం కారణంగా ఆయన పదవీచ్యుతులయ్యారు.
పట్నాయక్‌ సెల్ఫ్‌గోల్‌ (1965): ఒడిషా ముఖ్యమంత్రి బిజు పట్నాయక్‌ తన సొంతదైన కళింగ ట్యూబ్స్‌ కంపెనీకి ప్రభుత్వ కాంట్రాక్టు ఇచ్చారని తేలడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది.
మారుతి కుంభకోణం (1974): ఇందిరాగాంధీకి పడ్డ తొలి అవినీతి ముద్ర ఇది. మారుతి కార్ల కంపెనీని ఆమె పుత్రరత్నం సంజయ్‌గాంధీకి కట్టబెట్టేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డట్టు విమర్శలొచ్చాయి.
సోలంకి కుంభకోణం (1992): బోఫోర్స్‌ లంచాల కేసు విచారణను ఆపేయాలంటూ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మాధవ్‌ సింగ్‌ సోలంకీ వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరంలో స్విట్జర్లండ్‌ విదేశాంగ మంత్రికి ఓ లేఖ ఇచ్చారు. ఆ విషయాన్ని ఇండియా టుడే ప్రచురించడంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఇంధన కుంభకోణం (1976): ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీ కుంభకోణమిది. ఊరుపేరు లేని హాంకాంగ్‌ కంపెనీతో రూ.2.2 కోట్ల ఇంధన కాంట్రాక్టును కుదుర్చుకుంది. ఇందులో భారీ ముడుపులు చేతులు మారాయి. ఈ కొనుగోళ్ళ వెనుక అప్పటి పెట్రోలియం, రసాయనాల శాఖ మంత్రి పాత్ర వెలుగుచూసింది.
అంతూలే ట్రస్టు (1981): మహారాష్ట్ర ముఖ్యమంత్రి అంతులే స్వీయ పర్యవేక్షణలో సాగిన కుంభకోణం ఇది. ఇందులో ఆయనకు రూ.30 కోట్లు ముట్టినట్టు ఆరోపణ. ఈ మొత్తం ఓ ట్రస్టుకు చేరవేసినట్టు విమర్శలొచ్చాయి.
హెచ్‌డిడబ్ల్యూ కమిషన్లు (1987): జలాంత ర్గాముల విషయంలో నేతలు భారీ ముడుపులు అందుకున్నారు. హెచ్‌డిడబ్ల్యూ అనే కంపెనీ రూ.20 కోట్ల కమిషన్లు ఇచ్చినట్టు విచారణలో తేలింది. దీన్ని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినా... 2005లో ఈ కేసును మూసివేశారు.
బోఫోర్స్‌ లంచాలు (1987): దేశవ్యాప్తంగా ఓ కుదుపు కుదిపిన భారీ కుంభకోణమిది. రక్షణ వ్యవస్థపైనే అభద్రత ఏర్పడిన బాగోతమిది. బోఫోర్స్‌ శతఘ్నుల కొనుగోళ్ళ విషయంలో నాటి ప్రధాని రాజీవ్‌ గాంధీ సహా పలువురు భారతీయ ప్రముఖులకు రూ. 64 కోట్ల లంచాలిచ్చిందని స్వీడిష్‌ సంస్థ బోఫొర్స్‌ పై ఆరోపణలు చేసింది.
సెయింట్‌ కిట్స్‌ ఫోర్జరీ (1989): మాజీ ప్రధాని పివి నర్సింహరావును చరమాంకం వరకూ వెంటాడిన కేసు ఇది. సెయింట్‌ కిట్స్‌ ఫస్ట్‌ ట్రస్టు కార్పొరేషన్‌లో తన కుమారుడు అజేయ్‌సింగ్‌ ఖాతాలో ఉన్న 2.1 కోట్ల డాలర్లకు విపి సింగ్‌ను లబ్ధిదారుడిగా చిత్రీకరించారు. దీనికోసం కొన్ని పత్రాలను ఫోర్జరీ చేశారు. అప్పుడు పివి విదేశాంగశాఖ మంత్రి.
ఎయిర్‌బస్‌ కుంభకోణం (1990): ఎ-320 విమాన ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఎయిర్‌బస్‌ నుంచి విమానాల కొనుగోలుకు రూ.2వేల కోట్లతో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే విమానాలు రాలేదు. ఒక్క వారంలోనే దీనివల్ల రూ.2.5 కోట్ల నష్టం వాటిల్లింది.
సెక్యురిటీ స్కాం (1992): స్టాక్‌ మార్కెట్‌ను అతలాకుతలం చేసి, దేశ ఆర్థిక వ్యవస్థనే చిన్నాభిన్నం చేసిన భారీ కుంభకోణమిది. స్టాక్‌ బ్రోకర్‌ హర్షద్‌ మెహతా బ్యాంక్‌ డిపాజిట్లను స్టాక్‌ మార్కెట్‌లో పెట్టేందుకు మోసం చేశారు. ఫలితంగా రూ.5వేల కోట్ల నష్టం జరిగింది.
ఇండియన్‌ బ్యాంకుకు రుణాల ఎగవేత (1992): దక్షిణాదికి చెందిన పలు చిన్న కార్పొరేషన్లు, ఎగుమతిదారులు ఇండియన్‌ బ్యాంకు చైర్మన్‌ ఎం. గోపాలకృష్ణన్‌ అండతో రూ.1300 కోట్ల రుణాలు తీసుకుని వాటిని తిరిగి చెల్లించలేదు.
చక్కెర దిగుమతి (1994): కేంద్ర మంత్రి కల్పనాథ్‌రాయ్‌ స్వీయ పర్యవేక్షణలో సాగిన స్కాం. మార్కెట్‌ ధర కంటే అధిక ధరకు చక్కెర దిగుమతి చేసుకోడానికి ఆయన అనుమతులు ఇచ్చారు. ఖజానాకు రూ.650 కోట్ల నష్టం జరిగింది. ఫలితంగా మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఎంఎస్‌ బూట్ల కుంభకోణం (1994) : ఎంఎస్‌ బూట్ల కంపెనీ అధిపతి పవన్‌ సచ్‌దేవా తన సొంత కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకు వెళ్ళడానికి ముందే అత్యంత తక్కువ ధరకు కంపెనీ నిధులతో షేర్లు కొన్నారు. సెబీ ఎస్‌బిఐ కాప్స్‌ అధికారులతో కుమ్మక్కై ఇలా చేశారు. దాంతో ప్రజలు రూ.699 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. తర్వాత ఇందులో సచ్‌దేవా తప్పు లేదని తేల్చారు.
జెఎంఎంకు ముడుపులు (1995): సంకీర్ణ ప్రభుత్వాన్ని గట్టెక్కించేందుకు అప్పటి ప్రధాని పివి నర్సింహారావు అవినీతిని ప్రోత్సహించారు. 1993 నాటి అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కడానికి జెఎంఎం ఎంపిలకు రూ.30 లక్షల ముడుపులు ఇచ్చారు. జార్ఖండ్‌ ముక్తి మోర్చా నేత శైలేంద్ర మహతో ఈ విషయాన్ని అంగీకరించడంతో పివీ రాజకీయ జీవితానికి మచ్చ పడింది.
పచ్చళ్ళ వీరులు (1996): లఖుభాయ్‌ పాఠక్‌ వ్యవహారం ఇప్పటికీ దేశ ప్రజలకు తెలుసు. తనకు కాగితపు గుజ్జు కాంట్రాక్టు ఇప్పించేందుకు నాటి ప్రధాని పివీ నరసింహారావు, చంద్రస్వామి రూ.10 లక్షల లంచం తీసుకున్నారంటూ పచ్చళ్ల కంపెనీ అధినేత లఖుభాయ్‌ పాఠక్‌ ఆరోపించారు.
టెలికాం స్కాం (1996): హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఓ ప్రైవేటు కంపెనీ నుంచి టెలికం పరికాల కొనుగోలుకు సహకరించి, ఖజానాకు రూ.1.6 కోట్ల నష్టం కలిగించారని నాటి కమ్యూనికేన్ల శాఖ సహాయ మంత్రి సుఖ్‌రాంపై ఆరోపణలు వచ్చాయి. ఆయనతో పాటు మరో ఇద్దరికి 2002లో శిక్ష.
పశువుల మేత కుంభకోణం (1996): పశువుల మేత కోసం అంటూ బీహార్‌ పశుసంవర్థ శాఖ రూ.950 కోట్లు విత్‌డ్రా చేసుకుంది. నాటి ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు ఇందులో భాగం ఉండటంతో ఆయన ఏడాది తర్వాత రాజీనామా చేశారు.
యూరియా ఒప్పందం (1996): రెండు లక్షల టన్నుల యూరియా దిగుమతి కోసం పివి ప్రభుత్వాన్ని నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ కంపెనీ ఎండి సిఎస్‌ రామకృష్ణన్‌ ప్రభావితం చేశారు. ఈ సందర్భంగా రూ.133 కోట్లు ముట్టజెప్పినట్టు ఆరోపణలు వచ్చాయి.
హవాలా డైరీలు (1996): ఢిల్లిd హవాలా ఆపరేటర్లపై 1991లో సిబిఐ దాడులతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వీటిలో ఎస్‌కే జైన్‌ డైరీలు సంచనాలను సృష్టించాయి.
సిఆర్‌బి స్కాం (1997): చైన్‌ రూప్‌ బన్సాలీ అనే తెలివైన వ్యాపారి... పిరమిడ్‌ వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి వెయ్యి కోట్ల డిపాజిట్లు సేకరించారు. ఓ బ్యాంకింగ్‌ లైసెన్సు కూడా పొందారు. కానీ ఆయన సమర్పించిన కొన్ని వారంట్లకు నగదు లేదని స్టేట్‌బ్యాంకులోని ఓ అధికారి కనుగొనడంతో బుడగ పగిలింది. అప్పటికే చిన్న మదుపుదారులు వెయ్యి కోట్ల నష్టపోయారు.
బిగ్‌బుల్‌ స్కాం(1998): బిగ్‌బుల్‌ హర్షద్‌ మెహతా బిపిఎల్‌, వీడియోకాన్‌, స్టెరిలైట్‌ కంపెనీల ప్రమోటర్లతో కుమ్మక్కై వాటి షేర్ల ధరలను పెంచేశాడు. తర్వాత ఇది కుప్పకూలింది. సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌లో డీలింగ్‌ చేయకుండా మెహతాను జీవిత కాలం డిబార్‌ చేశారు.
కంపెనీల అదృశ్యం స్కాం (1998): ఆర్థిక మంత్రి చిదంబరం అన్న ఓ మాట దలాల్‌ స్ట్రీట్‌లో సంచలనం సృష్టించింది. కొన్ని వందల కంపెనీలు ప్రజాధనం సేకరించి, అదృశ్యమైపోతున్నాయని ఆయనకు తెలిసింది. తనిఖీ చేస్తే 600 కంపెనీలు లేవని తేలింది. దీటిలో 80 కంపెనీలు రూ.330.78 కోట్లు సేకరించి, అదృశ్యమైనట్టు సెబీ తేల్చింది.
ప్లాంటేషన్‌ కంపెనీల స్కాం (1999): టేకు, స్ట్రాబెరీ లేదా ఏ పంటలైనా సాగు చేస్తామంటూ 653 కంపెనీలు మదుపుదారుల నుంచి రూ.2,563 కోట్లు వసూలు చేశాయి. దిగుబడుల మాట వడ్డీలు అంటుంచితే పెట్టుబడులు కూడా ఎవరికీ వెనక్కు ఇవ్వలేదు.
మ్యాచ్‌ ఫిక్సింగ్‌ (2000): భారత క్రికెట్‌ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిన అంకం. కెప్టెన్‌ మహ్మద్‌ అజహరుద్దీన్‌పై మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలొచ్చాయి. ఆజాద్‌తో పాటు అజయ్‌శర్మలపై నిషేధం విధించారు. అజయ్‌ జడేజా, మనోజ్‌ ప్రభాకర్‌లను ఐదేళ్ళు సస్పెండ్‌ చేశారు.
కేతన్‌ పరేఖ్‌ స్కాం (2001): హర్షద్‌ మెహతా కంటే కేతన్‌ పరెెఖ్‌ కాకలు తీరిన స్కాము వీరుడు. మోహతా బ్యాంకర్ల రసీదులను వాడితే, పరేఖ్‌ పే ఆర్డర్లను వాడి తనకు కావాల్సిన స్క్రిప్‌ల (కె-10) ధరలు పెంచేశాడు. బ్యాంకులతో పాటు హోచ్‌ ఎఫ్‌సీఎల్‌ (425 కోట్లు), జీ (340కోట్లు) గ్రూపులను ముంచేశాడు. మాధవ్‌పురా మర్కంటైల్‌ సహకార బ్యాంక్‌ పే ఆర్డర్లు బౌన్సయినప్పుడు దొరికాడు.
తెహల్కా ఆపరేషన్‌ (2001): రక్షణ రంగాన్ని ఓ కుదుపు కుదిపిన కుంభకోణం ఇది. దేశ రాజకీయాలను మరో మలుపు తిప్పింది. లంచావతారులైన సైనిక అధికారుల, రాజకీయ నాయకుల గుట్టును రట్టు చేయడానికి తెహల్కా అనే న్యూస్‌ వెబ్‌సైట్‌ స్పై కెమెరాలు వాడింది. దీంతో దేశంలో పరిశోధనాత్మక జర్నలిజం కొత్త పుంతలు తొక్కింది.
స్టాక్‌ మార్కెట్‌ స్కాం (2001): కేతన్‌ పరేఖ్‌ పుణ్యమాని 2001 మార్చిలో మార్కెట్ల నుంచి లక్షా పదిహేను వేల కోట్లు మాయమైపోయాయి. 2002 డిసెంబర్‌లో పరేఖ్‌ను అరెస్టు చేసి, మార్కెట్‌ నుంచి నిషేధించారు.
హోం ట్రేడ్‌ స్కాం (2002): నకిలీ ట్రేడింగ్‌ ముసుగులో మహారాష్ట్ర, గుజరాత్‌లోని 25 సహకార బ్యాంకుల నుంచి నవీ ముంబైకి చెందిన హోం ట్రేడ్‌ అనే కంపెనీ రూ. 600 కోట్లు మింగేసింది. కంపెనీ సిఈవో సంజయ్‌ అగర్వాల్‌ను అరెస్టు చేశారు.
స్టాంపుల కుంభకోణం (2003): అబ్లుల్‌ కరీం తెల్గిd చేసిన స్టాంపు పేపర్ల కుంభకోణం పుణ్యమాని దేశ ఖజానాకు రూ.30 వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఇందులో ఉన్నత పోలీసు అధికారులు, ఉన్నతాధికారులు ఉన్నారు. వాళ్ళందరి పేర్లు కూడా తెల్గిd ఆ తర్వాతి కాలంలో బయటపెట్టాడు.
ఆహారం కోసం చమురు స్కాం (2005): ఇరాక్‌తో ఆహారం కోసం చమురు స్కాంపై వోకర్‌ నివేదిక వచ్చిన తర్వాత కేంద్ర మంత్రివర్గ నుంచి కె. నట్వర్‌సింగ్‌ను తప్పించారు.
సత్యం స్కాం (2009): ప్రపంచంలోనే భారీ కుంభకోణంగా పేరుపడింది. అంకెల గారడీతో లాభాలు చూపించి, భారీ షేర్లను చూపించారు. 10వేల కోట్ల రూపాయల లోటు చూపిస్తూ సత్యం రామలింగరాజు సిఐడికి లొంగిపోయారు. దీని వెనుక రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతల పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చాయి. సత్యం రాజు ప్రస్తుతం జైలులో ఉన్నారు.
గనుల కుంభకోణం (2011): కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప గనుల మాఫియాతో చేతులు కలిపి, కోట్లాది రూపాయల ముడుపులు అందుకున్నారనేది ఆరోపణ. లోకాయుక్త విచారణలో వెలుగుచూసిన ఈ వాస్తవం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం కల్గిస్తోంది.

Sunday, August 7, 2011

ఫ్రెండ్ షిప్ డే.. ఆగస్టు ఫస్ట్ సండే


యాంకర్
పొత్తి కడుపులోంచి పొత్తిళ్లలోకి చేరాక మొదటి స్నేహం అమ్మ. వేలు పట్టి బుడిబుడి అడుగులేసే దశలో లోకాన్ని చూపే మరో స్నేహితుడు నాన్న.. ఈ ఇద్దరికీ తెలియని.. ఈ ఇద్దరితో కూడా చెప్పలేని.. పంచుకోలేని మరో వ్యక్తి కావాలి.. అంతరంగంలో తెరలను చెరిపి ఆత్మీయతను, ఆలోచనలను, ఆశయాలను పంచుకునే వాడే స్నేహితుడు.. వాడు.. కంటతడితుడిచినపుడు అమ్మవుతాడు.. కష్టాల్లో ఆదుకున్నపుడు నాన్నవుతాడు.. ఆశయసాధనలో నీడవుతాడు.. ధైర్యంతో అడుగేసేటపుడు జోడవుతాడు.. కడదాకా వీడని తోడవుతాడు.. స్నేహం గురించి ఎంత చెప్పినా తక్కువే.. కాదు ఎంతసేపు చెప్పినా తక్కువే.. ఈ రోజు ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా హెచ్ఎంటివి ఫ్రెండ్స్ కు స్పెషల్ ప్యాకేజి మీకోసం.
బ్యాంగ్ - మనిషికో స్నేహం..
వాయిస్ ( అన్నీ వాయిస్ లే..)
అమ్మ ఒడి వీడాక.. నాన్న చేయి వదిలాక.. దొరికే తోడు స్నేహితుడు.. కొండంత కష్టమైనా.. కడలి నిండే కన్నీళ్లైనా పంచుకునేది నేస్తమే.. చిరు చెమటలో చిరుగాలై.. నడి వేసవిలో మబ్బుతునకై.. జడివానలో.. సుడిగాలిలో.. గోవర్ధనగిరిలా.. అడుగులో అడుగై.. జీవితాంతం మనసు పంచుకునే మనసు తెలిసిన ఆత్మబంధువు స్నేహితుడు.. ( ఈ వాయిస్ పై పాట ముందు మ్యూజిక్ బిజియం రావాలి)
సాంగ్-హాపీ డేస్- తడి కన్నులు తుడిచే నేస్తమా..
అవును... స్నేహితుడు సంతోషాన్ని పంచుతాడు.. భావాలను పంచుకుంటాడు.. గతాన్ని గుర్తుకు చేస్తాడు.... వర్తమానాన్ని వడ్డిస్తాడు.. ఆశలో ఆశగా.. శ్వాసలో శ్వాసగా.. గుండె సడిలా.. కంటి రెప్పల్లా.. వెన్నంటి కాపాడుకొని ఉంటాడు.. కనుచూపు కరువైనా..తన కన్నులతో లోకాన్ని చూపిస్తాడు.. ప్రకృతి వర్ణాలను వర్ణించి బతుకంత సువర్ణం చేస్తాడు..
సాంగ్ - పెళ్లిపందిరి..నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా
స్నేహితుడంటే పెళ్లికి ముందు కాలేజీలో చేసేదేనా.. ఆ తరవాత స్నేహానికి చిరునామా మారుతుందా.. అవును ఏ వయసు స్నేహం ఆ వయసుదే.... ఏ వయసు అనురాగం ఆ వయసులోనే ఉంటుంది.. అవును మనిషికో స్నేహం.. మనసుకో దాహం.. కన్నుతెరిచింది మొదలు.. కన్నుమూసే వరకు కనుపాపై కంటికి రెప్పలా కాపాడేదే స్నేహం..
సాంగ్- ఆత్మబంధువు..- మనిషికో స్నేహం మనసుకోదాహం.
కొందరి ఫ్రెండ్ షిప్ స్కూల్ తో ఫుల్ స్టాప్ పెడతాు.. మరికొందరు కాలేజితో కామా పెడతారు.. కానీ స్కూల్ నుంచి మొదలై కాలేజీలో కంటిన్యూ అయి.. జీవితాంతం పెనవేసుకొనే స్నేహాలు బ్రహ్మముడిలా విడిపోకుండా అలా పెనవేసుకుంటాయి.. స్నేహమంటే స్కూల్, కాలేజీ.. ఇవే కాదు.. ఒక యజమాని.. సేవకుడి మద్యలో కూడా తారతమ్యాలు లేని.. అరమరికలు లేని స్నేహం అంతస్థులు మరిచి అంతరంగాలను పంచుకుంటుంది...
సాంగ్- స్నేహం కోసం.... మీసమున్న నేస్తమా...
స్నేహానికి కులం లేదు.. మతం అడ్డురాదు.. అది చంద్రుని వెన్నెల లాంటిది.. వీచే చిరుగాలి వంటిది.... జలజలా రాలే సెలయేటి లాంటిది.. అవును అన్ని మతాలకు దోస్తీ సమ్మతమే..
సాంగ్- నిప్పులాంటి మనిషి- స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం
ఓ నిముషం కోపంగా.. మరునిముషం నవ్వులతో.. మరి కాసేపుఈర్ష్యతో.. ఇంకాసేపు అనురాగంతో.. జీవితంలో కురిసే రసాలన్నిటినీ రుచిచూపించేదే స్నేహం.. అది భవిష్యత్తును కలలు కంటుంది.. వర్తమానంలో కలహించుకుంటుంది.. గతాన్ని గుర్తుచేసుకొని కంట తడి పెడుతుంది.
సాంగ్ - ప్రేమదేశం.. ముస్తాఫా ముస్తాఫా..
స్నేహానికి ఉన్న విలువను కాపాడుకొని.. అసూయలను పాతరేసి.. ఈర్ష్యలను వదిలేసి.. కమ్మనైన కలలు కనే మంచి తోడు ప్రతి ఒక్కరికి దొరుకుతారు. ఆ తోడు ను జీవితాంతం నిలుపుకునే అదృష్టం ఉంటే.. అదే అమృత స్నేహం..
ఎండ్ విత్ బ్యాంగ్

Friday, August 5, 2011

ఆచార్య జయశంకర్ జయంతి నేడు.. ఆగస్టు 06


ఆయన తెలంగాణ ప్రజల గుండె గొంతుకై నిలిచాడు. తుది శ్వాస వరకు నమ్మిన సిద్దాంతానికి కట్టుబడి జీవించాడు. తెలంగాణలో నీళ్లు.. నిధులు... నియామకాలు ఎలా దోపిడీకి గురవుతున్నాయో వివరించి చెప్పిన థీశాలి.. ఆయనే తెలంగాణ సిద్ధాంత కర్త ఆచార్య కొత్త పల్లి జయశంకర్.. తెలంగాణ జాతిపితగా పిలుచుకొనే ఆచార్య కొత్త పల్లి జయశంకర్ జయతి సందర్భంగా హెచ్ఎం టీవీ స్పెషల్ స్టోరీ.
బ్యాంగ్ - జయశంకర్ సారు జయంతి / తెలంగాణ జాతిపిత జయంతి
వాయిస్
ఆచార్య కొత్తపల్లి జయశంకర్.. తెలంగాణ ప్రజలకు పరిచయం అక్కరలేని పేరు. తెలంగాణ ప్రజల కడగండ్లను, కన్నీళ్లను కళ్లారా చూసి చలించిన మేథావి. ఆయన పుట్టింది పోరాటాల పురిటిగడ్డ వరంగల్ జిల్లా అక్కంపేట గ్రామం..ఈ బుద్దిశాలిని కన్న ధన్యజీవులు లక్ష్మీకాంతారావు, మహాలక్ష్మి. సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన జయశంకర్ బడుగు జీవుల బతుకు దెరువులను అతి దగ్గరనుంచి గమనించాడు..అందుకే ఆయన తొలి అడుగు నుంచి తుది శ్వాస వరకు దగా పడ్డ బతుకులకు బాసటగా నిలిచాడు.
స్పాట్
జయశంకర్ ప్రస్థానం ఉపాధ్యాయ వృత్తితో మొదలయింది.. వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్, హైదరాబాద్ జిల్లాలలో టీచర్ గా పనిచేశారు. తెలంగాణ అన్ని జిల్లాలతో ఆయనకు అనుబంధం ఉంది..ఉపాధ్యాయ వృత్తి నుంచి అంచలంచలుగా లెక్చరర్ గా, ప్రొఫెసర్ గా ఎదిగారు. అంతేకాక సీఫెల్, కాకతీయ యూనివర్సిటీ లకు రిజిస్ర్టార్ గా పనిచేశారు.1991 నుంచి 1994వరకు కాకతీయ యూనివర్సిటీకి వైస్ చాన్స్ లర్ గా బాధ్యతలు నిర్వహించారు. ప్రధాని మన్మోహన్ సింగ్ జయశంకర్ గారి ప్రతిభను గుర్తించి 2004లో జాతీయ అసంఘటిత రంగ కమీషన్ లో నియమించారు. తరువాత కాలంలో ఆపదవికి తానే స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఆత్మగౌరవం కన్నా పదవి ముఖ్యం కాదని ప్రకటించారు..
స్పాట్
జయశంకర్ గారు తెలంగాణ ఎలా కన్నీళ్లు పెడుతుందో దగ్గర్నుంచి చూడటమే కాదు. ఆయన కూడా ఆ ఆవేదనలు అనుభవించారు. ఉపధ్యాయ వృత్తిలో ఉన్నా తరగతి గదులకే పరిమితం కాలేదు. తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలకు కారణమేంటో వివరించే ప్రయత్నం చేశారు.. ఆయన అనుభవాలు వందల పిహెచ్ డిలతో సమానం..ఆయన స్పృషించని అంశంలేదు... నీళ్లల్లో, నిధులల్లో, నియామకాల్లో సీమాంధ్ర నాయకులు తెలంగాణ ప్రాంత ప్రజలను ఎలా మభ్యపెడుతున్నారో వివరించారు.. తెలంగాణ సంస్కృతి పైనా, బాష పైన దాడి జరిగే తీరును తన అక్షరాలలో పొదివి పట్టుకున్నారు.. ఆయన రాసిన తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్, తెలంగాణ విస్త్రుత అంగీకారం, తెలంగాణలో ఏమి జరుగుతుంది వంటి పుస్తకాలలో తెలంగాణ గతం, వర్తమానం కనిపిస్తాయి.
స్పాట్
తెలంగాణ విముక్తి కొరకు జయశంకర్ గారు చేసిన సేవలు మరువలేనివి.. ఆయన చేసిన మేథోశ్రమ నభూతో నభవిష్యతి.. విద్యార్ధిగా ఉన్నపుడే 1952లో నాన్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు.. 1954లో ఫజల్ అలీ కమీషన్ ముందు తెలంగాణ నుప్రత్యేక రాష్ర్టంగా ఉంచాలని గట్టిగా వాదించారు. 1955 -56 మద్యకాలంలో విశాలాంధ్ర వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1968-69లలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్రపోషించి, తెలంగాణ కోసం పనిచేసే ప్రతి శక్తిని కలుపుకోవాలని పిలుపునిచ్చారు...
స్పాట్..
1969 -1996 మధ్య కాలంలో తెలంగాణ కోసం పని చేసే సంఘాలకు, వ్యక్తులకు పెద్దదిక్కుగా నిలిచారు.. 1997లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పురుడు పోసుకున్న తెలంగాణ ఐక్య వేదిక ద్వారా ప్రత్యక్షంగా నాయకత్వ బాధ్యతలు చేపట్టి, నాలుగు సంవత్సరాలుగా ఉద్యమాన్ని నడిపించారు.. తెలంగాణ రాష్ర్ట సమితి ఆవిర్భావ దశలోనాయకత్వాన్ని, కార్యకర్తలను, చైతన్యం పరచడంలో ఆయన పాత్ర చెప్పుకోదగ్గది. ఆర్ యస్ యు నుంచి ఆర్ యస్ యస్ వరకు తెలంగాణ కోసం ఎవరు పిలిచినా అరమరికలు లేకుండా ఉద్యమ సభల్లో పాల్గొని తన గొంతు వినిపించేవారు.
స్పాట్
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న దశలో.. తెలంగాణ ఉద్యమ సారధి కేసిఆర్ కు వెన్నుదన్నుగా ఉంటూ ..యావద్భారత రాజకీయ ప్రముఖుల మద్దతు కూడ గట్టడంలో ముఖ్యపాత్రపోషించారు జయశంకర్. తెలంగాణ రాష్ర్ట సమితి అధినేత కేసిఆర్.. జయశంకర్ గారిని తన గురువుగా చెప్పుకుంటారు... 2004 సంవత్సరం నుంచి 2009 డిసెంబర్ 9 న తెలంగాణ రాష్ర్ట ప్రకటన వెలువడే వరకు అందరు నాయకులను కలిసి తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు ఒప్పించడంలో కేసిఆర్ తో బాటు జయశంకర్ కూడా ముఖ్యపాత్ర పోషించారు.... మూడు తరాల తెలంగాణ ప్రజల కన్నీళ్లను తడిమిన సామాజికవేత్త ఆయన. ఆయన జీవించినంత కాలం తెలంగాణ ప్రజలకోసం పోరాటం వల్ల ఆయన.. తెలంగాణ సిద్దాంత కర్తగా ప్రజల మదిలో నిలిచిపోయారు. .. ఆయన మరణానంతరం తెలంగాణ జాతిపితగా.. అమరజీవిగా చెరగని ముద్ర వేసుకున్నారు. నిజాయితీ గల సిద్దాంతకారుడికి నిలువెత్తు నిదర్శనం జయశంకర్.