Friday, August 19, 2011
సల్వాజుడుం- ప్రభుత్వానికి ప్రైవేట్ సైన్యం
చట్టం తన పని తాను చేసుకుపోతుంది....చట్టాన్ని ప్రజలు చేతుల్లోకి తీసుకోకూడదు....న్యాయ రక్షణకు పోలీసులు ఉన్నారు....ఇదీ మన రాజ్యాంగం చెబుతున్న మాట....పెద్దలు నిర్దేశించిన బాట...అయితే....ప్రభుత్వమే ప్రైవేట్ ఆర్మీని ప్రోత్సహిస్తే......పోలీసులు చేయలేని...చేయకూడని కొన్ని పనులును.....వారితో చేయిస్తే.....ఏం జరుగుతుంది....రాజ్యం కొందరికి భోజ్యం అవుతుంది....సర్కార్ అండతో అరాచకాలు జరుగుతాయి...అలాంటి దారుణాలు మన దేశంలో జరిగాయి....సల్వాజుడుం.....గత కొన్నేళ్లుగా ఈ పేరు తెలీని పెద్దమనిషి ఉండడు....మావోయిస్ట్‌లకు పోటీగా తుపాకీ పట్టిన ప్రైవేట్ ఆర్మీ.....చత్తీస్‌ఘడ్ ప్రభుత్వ అండదండలతో అడవుల్లో నెత్తురు పారించిన సేన....ముల్లును ముల్లుతోనే తీయాలన్న సామెతను నిజం చేసిన చత్తీస్‌గడ్ పెద్దల నిర్వాకం......గిరిజన జీవితాల్లో చీకటి నింపింది.ఛత్తీస్ గఢ్ లో నక్సలైట్ల అణచివేతకు అక్కడి ప్రభుత్వం ఆదివాసీల్లోని ఒక తెగతో ప్రైవేటు సైన్యాన్ని తయారు చేసింది. దానిపేరే సల్వాజుడుం....17 నుంచి 25 సంవత్సరాలున్న యువకులకు ఆయుధ శిక్షణ ఇచ్చింది. వెయ్యి రూపాయల నుంచి మూడు వేల రూపాయల దాకా జీతం ఇచ్చింది. ఆధునికి ఆయుధాలు భుజాన పెట్టింది. కొంచెం చదువుకున్న వారిని స్పెషల్ పోలీస్ ఆఫీసర్లుగా నియమించింది. వీరి నియామకాలకు ఎటువంటి నిబంధనలు ఉండవు. వారు చేసే హింసాకాండకు ఎటువంటి శిక్షలు ఉండవు. ఆదివాసీల జీవితాలను చెల్లాచెదురు చేసినా, దారుణహింసకు పాల్పడినా, ఊళ్లకు ఊళ్లనే తగుల బెట్టినా....వారిని ప్రశ్నించే హక్కు కోర్టులకు కూడా ఉండదు. కేవలం పోలీసులతో చేయించలేని కొన్ని పనులను చేయించడానికి.....మావోలను ఉక్కుపాదంతో అణిచివేయడానికే సల్వాజుడుం ఏర్పాటు జరిగింది.సల్వాజుడుంని అడ్డుపెట్టుకుని చత్తీస్‌గడ్ సర్కార్ చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కాదు. సల్వాజుడుం చెలరేగినన్నాళ్లూ.....ఆదివాసీల జీవితాల్లో చీకటి రోజులే.....ఆదివాసీలు నక్సలైట్లకు ఆశ్రయం కల్పించారన్న నెపంతో పసిబిడ్డల చేతివేళ్ళను నరికిన రాక్షసత్వం సల్వాజుడుం నరనరాన్న జీర్ణించుకుంది. అమాయక ఆదివాసీల మానాన్ని కాపాడే ప్రయత్నం అక్కడ పోలీసులుకూడా చేయరు. కోట్ల రూపాయలు వీరి ఆయుధాలకు, వీరి భృతికి చెల్లిస్తున్నా ఇంతవరకు ఎక్కడి నుంచి ఈ నిధులను మళ్ళిస్తున్నారో లెక్కా పత్రం ఉండదు. స్పెషల్ పోలీసు ఆఫీసర్లుగా పరిగణిస్తున్న ఈ సల్వాజుడుం సైన్యం ఏర్పాటుకి ఎటువంటి చట్టబద్దత ఉండదు. వారికోసం చేస్తున్న ఆదాయ వ్యయాల లెక్కలుండవు. ఇదంతా ఓ అవినీతిలో భాగమేనంటున్నారు కొందరు ప్రజాస్వామిక వాదులు. అవినీతి నల్లధనాన్ని ప్రైవేటు సైన్యానికి ఖర్చుచేస్తూ బహుళజాతి కంపెనీలకు లాభం చేకూర్చేందుకేననేది వీరి వాదన. ఓ రకంగా చూస్తే ఆదివాసీలతోనే తోటివారి కన్ను పొడుస్తోంది. మట్టి తమ చేతులకు అంటకుండా చూసుకుంటోంది. ఉపాధిలేని ఆదివాసీలకు తుపాకులు ఇచ్చి, కేవలం వందల రూపాయల జీతం ముట్టజెప్పి తమ సోదరులపైకే ఉసి గొల్పుతున్నారు. వన సంపద కొల్లగొట్టే నల్లదొర కుట్రలు తెలీని ఈ అమయాక గిరిజనలు, తోటి ఆదీవాసీల ప్రాణాలను తీసేస్తున్నారు...నక్సలైట్ల అణచివేతలో భాగంగా వీరిని నియమించామని మాత్రమే ప్రభుత్వం చెపుతుంది. ఆదివాసీల గ్రామాలపైబడి వారిని భయభ్రాంతులకు గురిచేయడం. వారి ఆస్తులను ధ్వంసం చేయడం వీరి రోజువారీ కార్యక్రమం. హత్యలు, అత్యాచారాలు వీరి నిత్యకృత్యాలు. నక్సలైట్లకు ఆశ్రయమిచ్చారన్న నెపంతో గ్రామాలకు గ్రామాలనే తగుల బెట్టిన ఎస్ పిఓ లకు సర్వ హక్కులు ఉంటాయి. వారు ఏం చేసినా ఇదేమని ప్రశ్నించే హక్కు మాత్రం అక్కడి ఆదివాసీలకు గానీ ఎవ్వరికీ ఉండదు. అలా అడిగితే వారు నక్సలైట్ల కిందే లెక్క. నక్సలైట్లని పేరుంటే ఏమైనా చేసే అధికారం మాత్రం అనధికారికంగా పోలీసులకి, సల్వాజుడుంకి ఉంటుంది. అందుకే చివరకు ఏళ్ళతరబడి ఆదివాసీల కోసం స్థానికంగా పనిచేస్తున్న ఎన్ జీ ఓలు సైతం ఆ సాహసం చేయలేవు. అటువంటి సాహసం చేసిన వారికి పోలీసుల వేధింపులు తప్పలేదు.నక్సలైట్ల బూచి చూపి ప్రజలపైన, సామాన్య ఆదివాసీలు,
గిరిజనంపైన ఈ సల్వాజుడుం అనే జులుంని ప్రయోగిస్తోంది. సల్వాజుడుం పేరుతో ప్రైవేటు సైన్యం ఆదివాసీలు, గిరిజనులు లేదా సామాన్య ప్రజలపై జరుపుతున్న ప్రభుత్వమారణోహోమంపై హక్కుల సంఘాలు, మేధావులు, మీడియా, వివిధ రాజకీయ పార్టీలు జరిపిన దశాబ్దాల ఉద్యమం ఫలితంగా కదలిక వచ్చింది.ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం నియమించిన సల్వాజుడుం అక్రమమని, రాజ్యాంగ విరుద్ధమని దీనిని తక్షణమే రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆదివాసీల మధ్య అంతర్యుద్ధానికి కారణమౌతున్న ప్రైవేటు సైన్యం ఆయుధాలను ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని కూడా స్పష్టం చేసింది. కేవలం 4,5 తరగతులు మాత్రమే చదివిన ఆదివాసీలలోని ఒక తెగకు సంబంధించిన యువకులను స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ గా నియమించడం పట్ల తీవ్రఅభ్యంతరం వ్యక్తం చేసింది. కేవలం రెండునెలల తర్ఫీదుతో వారికి ఆయుధాలనిచ్చి ప్రజలపై ప్రయోగించమనడం చాలా ప్రమాకరమని కూడా హెచ్చరించింది. అంతేకాదు. ప్రభుత్వం నియమించిన ప్రైవేటుసైన్యం ప్రభుత్వానికి ఎదురు తిరిగితే వచ్చే నష్టం ఎటువంటిదో ఊహించమంది. దశాబ్దకాలంగా సల్వాజుడుం కి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజాస్వామ్య పోరాటాలకు సుప్రీంకోర్టు తీర్పుతో కాస్త ఊరట కలిగినట్టనిపించింది. అయితే అది తాత్కాలికమేనని చిదంబరం ప్రకటన స్పష్టం చేస్తోంది. దీనిపై రివ్యూ పిటిషన్ వేస్తామని, ఆర్డినెన్స్ తీసుకొస్తామని చిదంబరం చేస్తున్న ప్రకటనలను తీవ్రంగా ఖండిస్తున్నారు మేధావులు. ఇటువంటి అరాచకాలను దశాబ్దకాలంగా ప్రోత్సహిస్తూ వస్తున్న ప్రభుత్వాలు సుప్రీంకోర్టు తీర్పుతో సల్వాజుడుం ని నియంత్రించే ప్రయత్నం చేస్తాయా అన్నదే ఇప్పటి పౌరసమాజం ముందున్న ప్రశ్న? అది అంత సులువు కాదనే కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటన స్పష్టం చేస్తోంది. నక్సల్స్ బాధిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన చిదంబంర..... కొత్తం చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. స్పెషల్ పోలీసు ఆఫీసర్లకు చట్ట పరిధిని కల్పించేందుకే ఈ ప్రయత్నమని లెఫ్ట్ నేతల ఆరోపణ.ఇటు సైన్యం, అటు సల్వాజుడుం మధ్య అమాయక ఆదివాసీలు ఊళ్ళకు ఊళ్ళు ఖళీ చేసి ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో తలదాచుకుంటున్నారు. ఉన్న ఊళ్లను వదిలి దూరంగా గడుపుతున్నారు. ఇంత జరుగుతున్నా హోం మంత్రి చిదంబంర తన ప్రణాళికకు పదునుపెడుతున్నారు. సల్వాజుడుంను చట్టబద్ధం చేయాలనే కృతనిశ్చయంలో చిదంబరం ఉన్నారు.
కేంద్ర హోంమంత్రిగా ఉంటూ సుప్రీం తీర్పుకు అందకుండా వేరే ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తున్నారు. చిదంబరం కేవలం శాంతి భధ్రతలపైనే కాకుండా, సంపద తరలింపుపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. అందుకే ఆయన గతంలో అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో గనుల తవ్వకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మవోయిస్టులో, ఇతర ప్రజాస్వామ్యవాదులో అప్రమత్తమయ్యే లోపునే మైనింగ్ సంపద తరలించాలని చెప్పారు. ఫాస్ట్ మైనింగ్ ఉండాలంటూ బడా కంపెనీలకు ఒత్తాసు పలికారు. ఈ మొత్తం వ్యవహారం ద్వారా ప్రైవేటు సైన్యాలను పోషిస్తోంది కంపెనీల ముడుపుల, అవినీతి సొమ్మేనని స్పష్టమవుతోంది. యిటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఆదేశాన్ని ఆహ్వానిస్తున్నామంటూనే ప్రభుత్వం మరో ఆర్డినెన్స్ తెచ్చే ప్రయత్నం మొదలుపెట్టబోతోంది. రివ్యూ పిటిషన్ వెయ్యబోతోంది. ధర్మాసనాన్ని ఆశ్రయించబోతోంది. అయితే ఇదేం కొత్తకాదని, టాడాని రద్దుచేయాలని ప్రజాస్వామిక ఉద్యమాలు వచ్చినప్పుడు పోటా లాంటి చట్టాలను, దానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తే టాడా, పోటాల స్థానంలో యుఎపిఎ పేరుతో అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనే చట్టాన్ని 2008లో రూపొందించారు. ఇలాంటి మరింత ప్రమాదకరమైన నల్లచట్టాలను తీసుకొచ్చినట్టే ప్రభుత్వం ఈ రోజు సల్వాజుడుని నిషేధిస్తే మరో రూపంలో ప్రైవేటు సైన్యాన్ని కొనసాగించే ప్రయత్నం జరుగుతోందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకొనే ప్రయత్నం మరికొన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా చేసింది. లొంగిపోయిన నక్సలైట్లతోనూ, నక్సల్స్ వ్యతిరేకులనూ కూడగట్టి వారికి రహస్యంగా ఆయుధాలు సరఫరా చేసి నక్సల్స్ సానుభూతిపరులు, నక్సలైట్ల అనుకూలురి మీదకు ఉసిగొల్పిన సంఘటనలు ఆంధ్రరాష్ట్రంలో కోకొల్లలు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ గద్దర్ పైన హత్యాయత్నం. : 1997 నుంచి ఇప్పటివరకు కోబ్రాల పేరుతో బెదిరింపు లేఖలు, ఫోన్స్ లో లాంటి కార్యకలాపాలు ప్రభుత్వం ఏర్పర్చదల్చుకున్న ప్రైవేటు సైన్యంలో భగమే. అయితే దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వం పై ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు, హక్కుల నేతలు చేసిన పోరాట ఫలితంగా కోబ్రాలు కనుమరుగైనావారి స్థానంలో గ్రేహౌండ్స్ ఏర్పాటు జరిగింది. ఇటువంటి విధానాన్నే అనుసరించి ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం సల్వాజుడుం ని లీగలైజ్ చేసే ప్రయత్నం చేస్తోందనే వాదన వినిపిస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment