ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Friday, August 19, 2011

వామపక్ష తీవ్రవాద ఉద్యమం పూలపాన్పు కాదు



విప్లవం విందుభోజనం కాదు. వారి జీవితం పూలపాన్పు కాదు. భుజాలపై మృత్యువుని మోస్తున్నారు. కత్తుల వంతెనపై కవాతు చేస్తున్నారు... భావితరాల బంగారు భవిత కోసం..... ప్రాణాలను తృణప్రాయంగా త్యజిస్తున్నారు..... తమ సాహసం సుదీర్ఘమైనదని వారికి తెలుసు. వారు కలలుగన్న విప్లవం కష్టాల మయం... కన్నీళ్ళ పర్యంతం... ఎక్కడికి వారి ప్రయాణం? ఎవరికోసం అడవిబాట పట్టారు. మావోయిస్టులూ.....న్యూ డెమొక్రసీ కార్యకర్తలు....మార్గం వేరైనా గమ్యం ఒక్కటే..ఉద్యమ పంథా వేరైనా ఆశయం ఒక్కటే.... ప్రజాఉద్యమాలనూ, దళనిర్మాణాన్నీ అనుసంధానం చేసి పోరాడుతున్న విప్లవం పార్టీలు....మృత్యువుతో సహజీవనం చేస్తూ అనుక్షణం ప్రజల కోసం పోరాడుతున్న వారే. అడవిలో అక్షరాలు దిద్దుకున్న వాళ్ళు మొదలుకొని అత్యున్నత చదువులు చదువుకొని ఆయుధాలు అందుకున్నవారు సైతం అక్కడున్నారు. ఎక్కువ మంది ఆదివాసీలే. ప్రధానంగా మహిళలు. అత్యధికులు పేదలు, గిరిజనులు. ఆడమగ తేడా ఏమీ లేదక్కడ. అందరికీ ఒకే రకమైన శిక్షణ. ఒకే విధమైన క్రమశిక్షణ. భూమి సమస్య, దొరల పెత్తనం, గ్రామాల్లో దోపిడీ, పీడన, అణచివేత పోరాటంద్వారానే పరిష్కారమవుతాయని మనస్ఫూర్తిగా నమ్మి ఆయుధం పట్టారు. కష్టమైనా, నష్టమైనా ఆయుధాన్ని వదిలేది లేదంటున్నారు. ఒక్కొక్కిరిదీ ఒక్కో చరిత్ర. ఒక్కో సామాజిక నేపధ్యం. ఒక్కో పోరాట నేపధ్యం. ఇక్కడవన్నీ మరిచి ఒకే లక్ష్యం కోసం ఎండనకా, వాననకా, చలివణుకుతూ, మంచుకి తడుస్తూ, తనవారందరినీ వదులుకొని వచ్చిన వారి ఆశయం నెరవేరుతుందనే నమ్మకం గుండెలనిండా నింపుకున్నారు. నిస్వార్థంతో, నిరాడంబరంగా, నిరుపేదల పక్షాన నిలబడిన వీళ్ళు తమ ఆశయ సాధనలో ఎంతో మంది సహచరులను కోల్పోయారు. నెత్తుటిఏరులు పారినా... బారు ఫిరంగులు మోగినా ఎత్తిన జెండా దించకోయ్ అనేది పాటే కాదు. వారి బాట కూడా అదే. ఏ వివక్షా లేని సమాజ స్థాపన కోసం పౌర సమాజానికి దూరంగా వుంటున్నా సమసమాజానికి దగ్గరవుతామనే నమ్మకంతోనే వున్నామంటారు వాళ్లు. ప్రజాపోరు....ఉద్యమ బాటలో ఎన్నో అడ్డంకులు....మరెన్నో అవరోధాలు....ఖాకీల కంట పడకూడదు....క్యాంప్‌లు మారుస్తూ ఉండాలి. దళ సభ్యుల్లో ధైర్యం నింపాలి. ఈ మొత్తానికీ ఎంతో నెట్‌వర్క్ కావాలి. పోలీసు కూంబింగ్‌లు, కార్యక్రమాలకు అనుకూలంగా మావోయిస్ట్‌ల డెన్నులు మారుతుంటాయి. ఎక్కడ ఏ అలికిడైనా యిట్టే తెలిసిపోయే సమాచార వ్యవస్థ వారికుంటుంది. ఒకే చోట వారి క్యాంపు ఉండదు కాబట్టి, ఎక్కడ వుంటే అక్కడే తింటారు. దళ సభ్యుల్లో అత్యధిక సందర్భాల్లో తమ అవసరాలకు గ్రామస్తులపైనే ఆధారపడతారు. దళాలు తమతో పాటు కొద్దిపాటి సరుకులను మోసుకెళతారు. కానీ ఎక్కువ సార్లు గ్రామస్తులు పెట్టే భోజనంతోనే ఆకలి తీర్చుకుంటారు. ఇక ముందస్తుగా ఎమర్జెన్సీ మెడికల్ కిట్ అందరి దగ్గరా ఉంటుంది. మరీ ఇబ్బంది అయితే అడవిదాటాల్సిందే.
చలికీ, ఎండకీ, వానకీ, వారు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకునే ప్లాస్టిక్ కవర్లతో కూడిన గుడారాలు పూర్తి రక్షణనివ్వవు. ఇక ఎండాకాలం వచ్చిందంటే తాగే నీటికి కటకట లాడాల్సిందే. అనుక్షణం కదలికలో ఉండే దళాలకు నీటి అవసరం చాలా ఎక్కువ. కాల్వలు, కుంటల దగ్గర కాపుకాచి పోలీసులు వేటాడిన సందర్భాలను వీళ్లు ఎప్పడూ మర్చిపోరు. అందుకే నీటిని నిల్వవుంచుకునేందుకు కొన్ని పద్ధతులుంటాయి. గుంట తవ్వి ప్లాస్టిక్ కవర్ని గుంటలో అమర్చి అందులో నీళ్ళు నిల్వ చేసుకుంటారు. ఇక ఎండాకాలంలో రెండు కష్టాలు....ఒకటి నీటి సమస్య....మరొకటి పోలీసు దాడులు. ఆకులు రాలి అడవులు పలుచబడటం....వీరు ఎక్కడ ఉన్నారనేది....శత్రువుకు సులువుడా తెలిసిపోతుంది. పగలంతా అడవుల్లో ఉంటారు...పార్టీ కార్యకలాపాలపై చర్చిస్తారు....మరి చీకటి పడితే...గ్రామాల్లో సేద తీరడం.....వారి సమస్యలు తెల్సుకోవడం...ఒకవేళ దాడులు జరిగితే....తలోదారి వెతుక్కోవాల్సిందే. పగలంతా అడవుల్లో గడిపే దళసభ్యులు చీకటి పడే వేళకు గ్రామాలకు చేరుకుంటారు. పాటలతో, ఉపన్యాసాలతో గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తారు. గ్రామసమస్యలపై చర్చిస్తారు. చీకటైతే పోలీసులు సైతం గ్రామాల్లోకి రావడానికి భయపడతారు. అందుకే ఆదమరిచి నిద్దరపోయే వేళ తెల్లవారు ఝామునే ఎక్కువ దాడులు జరుగుతాయి. అందుకు సెంట్రీగా ఉన్న వ్యక్తి అనుక్షణం అలర్ట్‌గా ఉంటారు. ఏ చిన్న అలికిడయినా అందరినీ అలర్ట్ చేస్తారు. ఒకోసారి దాడి జరిగితే అందరూ తలోదిక్కుకు పారిపోతారు. ఆ తరువాత అడవిలో తమ వారి కోసం వెతుకులాట...... ఒక్కొక్కరూ కల్సుకోవడానికి పడరాని కష్టాలు....ఎన్నో సందర్భాల్లో ఇలా ఒంటరిగా ఉన్న వాళ్ళు... రోజుల తరబడి దళ సభ్యుల కోసం వెతుక్కున్న ఘటనలను వీరెప్పుడూ మర్చిపోలేదు. అడవితో పెనవేసుకున్న వారి జీవితం దుర్భరంగా ఉంటుంది. పాముల పుట్టలు వారికి పట్టు పాన్పులవుతాయి. చెట్ల ఆకులే వెచ్చని రగ్గులవుతాయి. ముళ్ళ పొదలే వారికి గదులుగా మారతాయి. అడవి పొదల్లో ఆయుధాలు దాస్తారు. తమ వారి జ్నాపకాలు గుర్తుకొస్తున్నా....పోరుదారే నిబ్బరాన్ని ఇస్తుంది. ఇన్ని కష్టాలు ఎవరి కోసం.....బాధలు ఎందుకోసం....ప్రజాపోరు ఎన్నో విజయాలు....ఎన్నో నిర్భంధాలు....తప్పదు....ఆశయ సాధన కోసం సాగే నిరంతర పోరుబాట.ఏళ్ళే కాదు తరాలకొద్దీ ఉద్యమంలో పనిచేస్తున్న వాళ్ళున్నారు. ఏం సాధించారని అడిగితే భూస్వాముల పెత్తనానికీ, పెత్తందార్ల దోపిడీకి ఎదురొడ్డి నిలవగలిగే ధైర్యం యిచ్చింది ఉద్యమమే అంటారు. సామాన్యుడి భూములు అతని చేతిలో ఇంకా ఉన్నాయంటే... ఉద్యమం ఫలమే అంటారు. దొరల ఎదుట నిలిచి..హక్కులు సాధించుకుంటున్నారంటే....అదీ ఉద్యమ స్ఫూర్తే అంటారు. ఆదివాసీ పోడు పంటను అనుభవిస్తున్నారంటే....దానికీ ఉద్యమ స్ఫూర్తేననేది వారి సమాధానం. ప్రత్యేక ఆర్థిక మండళ్లపై ఉద్యమాలు....కూలీరేట్ల కోసం పోరాటాలు....దళితుల దౌర్జన్యాలు...అగ్రవర్ణాల ఆధిపత్యానికి అంతం పలికారంటే...ఉద్యమ ఫలమేనన్నది వారి సమాధానం. ఉద్యమంలో ఆటు పోట్లు తప్పవు....ఎన్ కౌంటర్లతో క్యాడర్ బలహీన పడుతుంది. ప్రజలను భయపెడుతుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎంత మంది సహచరులను కోల్పోయినా ప్రభుత్వ నిర్బంధం ఉద్యమాలను బలహీన పరుస్తున్నా వారు తమది పురోగమనమేనంటారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరుకు ప్రజలను ఉద్యుక్తులను చేయడమే తమ కర్తవ్యమంటారు. ఎన్ కౌంటర్లు , నిర్బంధం ప్రజా ఉద్యమాలను ఎంతోకాలం అణచివేయలేవని ఏదో ఒక రోజు ఏదో ఒక మూల ప్రజలు చైతన్యవంతం అవుతూనే ఉంటారని, అణచివేత ఉన్నంత కాలం పోరాటం కొనిసాగితీరుతుందనే వీరి జీవితం ఏ వేకువకోసమో అర్థం చేసుకోవాలంటే వారి సంకల్పాన్ని అర్థం చేసుకోవాల్సిందే. వాళ్ళు విలాసవంతమైన, సుఖవంతమైన జీవితాన్ని కోరుకోలేదు. రంగురంగుల ప్రపంచం వారి దృష్టిని మళ్ళించలేదు. రేపటి సమసమాజపు ఉషోదయాన్ని ఆహ్వానించేందుకు కొండకోనల్లోకి వెళ్లారు. ఆ రేపటి కోసం వాళ్ళు నేటి ఉదయాలను త్యజిస్తున్నారు. క్షణ క్షణం మృత్యువుతో సహచర్యానికి సిద్ధమవుతున్నారు. తమ కళ్ళముందే సహచరులు రాలిపోతున్నా చలించని సంకల్పం వారిది. సమసమాజం కోసం పోరాడుతున్న వారి జీవన సమరమిది.

No comments:

Post a Comment