ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Friday, August 12, 2011

రాఖీ పౌర్ణమి విశిష్టత... రాకీ పుట్టుక... గమనం..


బతుకుబండి నడపే బాధ్యతలు ఒక పక్క ... కాలంతో పోటీ పడుతున్న వేగాన్ని అందుకోవాలన్న లక్ష్యం మరోపక్క.. వీటన్నిటి నడుమ బంధాలు అనుబంధాలు గుర్తుకురావడమే గగనమయ్యే పరిస్థితులు.. ఆత్మీయులను గుర్తుకుతెచ్చుకుందామన్నా తీరిక లేని బాధ్యతలు.. ఇంత వేగంలో కూడా తోడ బుట్టిన తోడును గుర్తుకుతెచ్చి.. ఆ ఒక్కరోజు బాల్య జ్ఞాపకాలను కుటుంబంతో నెమరేసుకునే ఓ మంచి పండుగ రాఖీ పౌర్ణమి.. సోదరీ సోదరుల జీవితాల్లో వెన్నెల నింపే చందమామ రాఖీ పౌర్ణమి.
అన్నా చెల్లెలు, అక్కా తమ్ముల అనుబంధానికి గుర్తుగా జరుపుకునే రాఖీ పౌర్ణమి ఇప్పటిది కాదు.. ఎందరో జీవితాలను కాపాడింది రాఖీ. రక్తపాతాన్ని నిలిపింది రాఖీ.. ఎదలోతుల్లో దాగిన అనురాగాల రాగాలను పలికించింది రాఖీ.. అవును రాఖీకి ఉన్న గొప్పతనం అంతటిది.సోదరీ సొదరుల అనుబంధానికి అచ్చమైన ప్రతీక రాకీ. తన సోదరుడు క్షేమంగా ఉండాలంటూ సోదరి కట్టే బందనమే రాఖీ.. మరో సందర్భంలో తమను ఆపద నుంచి కాపాడమని కోరుకుంటూ సోదరుడికి కట్టే బంధనాన్ని కూడా రాఖీ అంటారు.. అందుకే దీనికి రక్షా బంధన్ అనే పేరొచ్చింది.. ఈ రాఖీ ఇప్పటిది కాదు.. పురాణ కాలం నుంచి రాఖీ పౌర్ణమి వేడుక వైభవంగా జరుపుకుంటున్నారు. పురాణకాలంలో వృత్తాసురుడనే రాక్షసుడు దేవలోకం పైకి యుద్దానికి వచ్చాడట.. అప్పుడు ఇంద్రుడి భార్య ఇంద్రాణి మంత్రించిన దారం ఇంద్రుడి మణికట్టుకు కట్టిందట.. ఆ రక్షతో ఇంద్రుడికి యుద్దంలో విజయం లభించిందని పురాణ కథ ప్రచారంలో ఉంది... అంటే రాఖీ సంప్రదాయం మొదట భార్య రక్షా బంధనాన్ని భర్తకు కట్టడంతో ప్రారంభమయింది. తరువాత కాలంలో ఒకసారి రాక్షస రాజైన బలిచక్రవర్తి భూ మండలాన్ని ఆక్రమించాడు. చక్రవర్తి బలం చూసుకొని దానవులంతా మానవులను నానా హింసలకు గురిచేస్తుంటే.. వారిని కాపాడేందుకు విష్ణుమూర్తి వైకుంఠాన్ని వదిలి భూమికి వస్తాడు. అప్పుడు లక్ష్యీదేవి ఒక బ్రాహ్మణ యువతి వేశంలో బలి చక్రవర్తి వద్దకు వచ్చి... శ్రావణ పౌర్ణమి రోజున పవిత్రమైన దారాన్ని చేతికి కట్టి తానెవరో, ఎందుకొచ్చానో చెబుతుంది. అప్పుడు బలిచక్రవర్తి మానవులను వదిలేసి విష్ణుమూర్తిని వైకుఠానికి వెళ్లవలసిందిగా ప్రార్ధిస్తాడనే మరో కథ కూడా ప్రచారంలో ఉంది.రాఖీ పురాణాల్లోనే కాదు రాజుల చరిత్రలో కూడా స్థానం సంపాదించింది. ఉత్తర భారతదేశంలో రాజులు రాజ్యాలకోసం యుద్దాలు చేస్తున్న రోజులవి.. చిత్తోర్‌ఘడ్ రాజు అకాల మరణం వలన రాజ్యభారం రాణి కర్ణావతి పై పడింది.. అబల అనే చులకన భావంతో గుజరాత్ సుల్తాన్ బహుదూర్ షా తన సేనలతో చిత్తోర్‌ఘడ్ పైకి దండయాత్రకు వస్తాడు.. ఈ విపత్కర పరిస్థితిలో కర్ణావతి మొఘల్ చక్రవర్తి హుమాయున్ కు రాఖీని కానుకగా పంపుతుంది. రాఖీనందుకున్న హుమాయున్ కర్ణావతిని తన సోదరిగా గుర్తించి ఆమెకు అండగా నిలబడి బహుదూర్ షా ను ఓడిస్తాడు. మరాఠా ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటున్న శివాజీకి కూడా ఒకసారి ిఇటువంటి సంఘటన ఎదురయింది. యుద్దఖైదీకి ఒకరికి మరణ దండన విధించాడు శివాజీ.. ఆ సమయంలో ఒక హిందూ స్త్రీ శివాజీకి రాఖీ కట్టింది.. దానికి ప్రతిగా తనకు పసుపు కుంకుమలను ప్రసాదించమని కోరింది. మహిళలంటే గౌరవం ఉన్న శివాజీ ఆమె మాటకు సరేనన్నాడు. శివాజీ మరణ శిక్ష విధించిన ఖైదీ భార్యే ఆ యువతి కావడంతో... రాఖీ యుద్దఖైదీని మరణశిక్ష నుంచి కాపాడినట్లయింది. ఆనాటి నుంచి రాఖీకున్న ప్రాధాన్యత మరింత పెరిగింది. ప్రపంచాన్ని జయించాలన్న విజయకాంక్షతో భారతదేశం పైకి దండెత్తి వచ్చాడు అలెగ్జాండర్.. ఆ సమయంలో పురుషోత్తముడి శక్తి సామర్ధ్యాలు తెలిసిన అలెగ్జాండర్ భార్య రుక్సానా పురుషోత్తముడికి రాఖీని పంపి తన భర్తను చంపవద్దని కోరుతుంది. యుద్దంలో అలెగ్జాండర్ ను చంపే అవకాశం వచ్చినా... పురుషోత్తముడికి చేతికున్న రాఖీ గుర్తుకు వచ్చి అలెగ్జాండర్ కు ప్రాణబిక్ష పెడతాడు. చరిత్రలో అత్యవసర సాయం కోసం అన్నగా భావించి అర్ధించిన సంప్రదాయం నేడు బహుమతుల రూపంలోకి మారింది. రక్షా బంధనాన్ని కడితే ఎదో ఒక బహుమతి ఇవ్వాలనే సంప్రదాయంగా మారింది.అన్నా చెల్లెళ్లు ఎంత దూరాన ఉన్నా రాఖీ పౌర్ణమి పండుగ రోజున కలుసుకుంటారు.. ఖండాంతరాల్లో ఉండి కలువలేక పోతే రాఖీలు పంపుకొని శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఇదే రాఖీ పౌర్ణమిని ప్రాంతాల వారీగా ఒక్కొప్రాంతం వారు ఒక్కోరకంగా జరుపుకుంటారు. ఈ రోజునే జంద్య పౌర్ణమి అని, నారియల్ పౌర్ణమి అని, కజరి పౌర్ణమి అని రకరకాలుగా రకరకాల పేర్లతో వేడుక జరుపుకుంటారు. వర్షాలు కురిసి, నదుల నిండుగా నీరు ప్రవహిస్తూ నేలమ్మ పచ్చని చీర కట్టినట్టు, గడ్డిపూలతో అలంకరించుకునే ఈ రుతువుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఏటి నీళ్లలో నిండు పౌర్ణి ప్రతిబింబం... రేయి నుదుటిన బొట్టు పెట్టినట్టు కనిపిస్తుందని... ప్రకృతికి అందం దిద్దే రుతువుల్లో శ్రావణ పౌర్ణమి ఒకటని కవులు వర్ణిస్తారు. అందుకే శ్రావణ పౌర్ణమి కి అంత విశిష్టత ఆపాదించారు.

No comments:

Post a Comment