ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Wednesday, August 31, 2011

ప్రాణం తీస్తున్న గానం.. జితేన్ మరాండీల జీవితం


గానం వారి ప్రాణం.. కానీ ప్రాణాలను తీసే శత్రువు ఆ గానమే అయితే.. సమాజాన్ని మార్చాలనుకున్న ప్రజాచైతన్యంమే వారిని నిస్తేజుల్ని చేస్తే... గుండె చప్పుడే ఉలిక్కి పడేలా ఉరిమితే... పాట లయలే విలయతాండవం చేస్తే... అదే జితేన్ మరాండీ, అనీత్ రాం, మనోజ్ రజ్వార్, ఛత్రపతి మండలిల జీవితమవుతుంది...వాళ్లు పాటలు పాడారు. ఆదివాసీల కష్టాలకు మాటలు పేర్చి పాటలు కూర్చారు. ఎలా బతుకుతున్నారో.... ఆదివాసీల జీవితాలను ఎవరు ఎలా చిదిమేస్తున్నారో పాటలు అల్లి... గజ్జె కట్టి వినిపించారు. ఇది కాదు మీ జీవితం అని కూడా చెప్పారు. ఎలాంటి జీవితం కావాలో.. అలాంటి జీవితం కోసం ఏం చేయాలో ఆ పాటల్లో కూర్చారు... అంతే... అంత కంటే వాళ్లేం చేయలేదు. బతుకు పాటలా సాగాలని పాటల్లోనే చెప్పారు. ప్ర.జాస్వామ్య బద్దంగా ఎలా బతకాలో చెప్పిన దేశంలోనే... ఓ నలుగురు ఆదివాసీ కుర్రాళ్లు కూడా అంతటి ప్రజాస్వామ్యయుతంగానే ఎలా బతకాలో చెప్పారు. పాలకులు చెప్పిన బతుకు తీరు రాజ్యాంగమయ్యింది. ఈ నలుగురు ఆదివాసీ కళాకారులు అల్లిన పాటలు నేరం అయ్యాయి. హాయిగా బతకాలి... పదిమందిని బతికించాలి అని చెప్పిన మాటలు పాలకులకు నచ్చలేదు. అందుకే ఆ నలుగురికి శిక్ష పడింది. అలాంటిలాంటి శిక్ష కాదు. ఏకంగా ఉరి.
పాటలు పాడడం నేరమా.. పాటలో బతుకు చిత్రాన్ని ఆవిష్కరిచడం నేరమా.. పాటకు పరవశించడమే కాదు.. పోటెత్తాలని చెప్పడం కూడా నేరమేనా.. నేరమే అంటోంది మన పాలక వర్గం. అలాంటిలాంటి నేరం కూడా కాదంటోంది. పాట గొంతు నొక్కేయాలని శాసిస్తోంది. స్వరపేటికను తాళ్లతో బంధించాలని ఆజ్ఞలు జారీ చేస్తోంది. ఓ నలుగురు ఆదివాసీ కుర్రాళ్లు పాటలు కట్టి పాడినందుకు వారికి జార్ఖండ్ న్యాయస్థానం ఉరి శిక్ష వేసింది. ఆ ఉరి శిక్షను అమలు చేయాలని జార్ఖండ్ ప్రభుత్వం తహతహలాడుతోంది.
పాట... పరవశించిపోయే కళారూపం. పాట.. పరుగులెత్తించే చైతన్యం. పాట.. చెకుముకి రాళ్లు చేతులెత్తి చప్పట్టు కొట్టడం. పాట.. గుండెలోంచి గుండెలోకి నెత్తురు ప్రవహించడం. ఏ దేశమైనా.. ఏ కాలమైనా.. పాటకు ప్రపంచం ప్రాణం ఇస్తుంది. కాని, మన పాలకులు మాత్రం ప్రాణం తీస్తామంటున్నారు. అప్పుడెప్పుడో ఆఫ్రికన్ కవి బెంజిమన్ మొలైసీని అలాగే చంపేసారు. ఆ తర్వాత ఒగోని కవి కెన్ సారో వివా గొంతు నొక్కేసారు. ఇప్పుడు మన దేశంలో... జార్ఖండ్ లో ఆదివాసీ వాగ్గేయకారుడు జితెన్ మరాండీని కూడా చంపేయాలనుకుంటోంది. జితెన్ మరాండీతో పాటు ఆయన సహచరులు అనీత్ రాం, మనోజ్ రజ్వార్, ఛత్రపతి మండలి అనే కళాకారులకు ఆ రాష్ట్ర న్యాయస్థానం ఉరి శిక్ష వేసింది.
జితెన్ మరాండీ బృందం ఉరి శిక్ష పడేంతటి తప్పు ఏం చేసింది. అసలు ఈ జితెన్ మరాండీకి, ఆయన బృందం సభ్యులకు మరణశిక్ష విధించాల్సినంత అవసరం ఏమొచ్చింది. జార్ఖండ్ ప్రభుత్వానికి కోపం వచ్చేంత పని వీళ్లేం చేసారు. అరుదైన సందర్భాల్లో, అత్యంత అరుదైన, దారుణమైన నేరాలు రుజువైనప్పుడు తప్ప మరణ శిక్ష విధించరాదని సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది కదా.. మరి అంతటి దారుణమైన, అరుదైన నేరం జితెన్ మరాండి బృందం చేసిందా?. ఇంతకీ జితెన్ మరాండి ఎవరు.. ?
జార్ఖండ్ రాష్ట్రంలో గిరిధి జిల్లాలో ఓ మారుమూల ఉన్న గ్రామం సుడూర్. అసలు ఇలాంటి గ్రామం ఉందని చాలా మందికి తెలిసే అవకాశమే లేని పల్లె. అక్కడ 1980 లో జితెన్ మరాండీ పుట్టారు. చదువు ఎలా ఉంటుందో.. చదువుకుంటే బతుకు ఎలా ఉంటుందో కూడా తెలియని అమాయకపు పల్లెలో, అభివృద్ధి అనే మాట కూడా వినని పల్లెలో మరాండి పుట్టారు. చదువుకోవాల్సిన వయసులో పశువుల కాపరిగా జీవితాన్ని ఆరంభించాడు. ప్రకృతి, పశువులు, పల్లె జీవితం మరాండి చుట్టూ ఉన్న ప్రపంచం. అక్కడి నుంచే పల్లె పదాలను కూర్చడం ప్రారంభించాడు. పల్లె పదాల కూర్పుతో పాటు ఆదివాసీల జీవితాలు కూడా మరాండి పాటకు పల్లవి అందించాయి. వీళ్లు ఎందుకు ఇలా బతుకుతున్నారు.. అనే ప్రశ్న ఆ పాటల నుంచి పుట్టింది. అప్పటి నుంచే జితెన్ మరాండి జీవిత చిత్రం మారింది. అన్నం లేని, ఒంటిపై నిండైన అచ్ఛాదన కూడా లేని ఆదివాసీల గురించి పాటలు అల్లడం, పాడడం జితెన్ మరాండి జీవితమయిపోయింది.
పాటలు కట్టి.. ఆదర్శవాద సంస్కరణలతో తోటి ఆదివాసీలను జాగృతం చేసే పని తలకెత్తుకున్నాడు జితెన్ మరాండి. చేతిలో నగారా, ఢోలక్, హార్మోనియం తప్ప ఎప్పుడు ఎలాంటి ఆయుధం మరాండీ చేతిలో ఎవరూ చూడలేదు. పల్లె నుంచి పట్టణానికి మారిన మరాండి ప్రస్థానం నిరంతరం ఆదివాసీల జీవితం చుట్టూనే తిరిగింది. ప్రగతిశీల భావాలున్న వారితో పరిచయం పెరిగిన మరాండి తన సొంత పేరుతోనే చెలామణి అయ్యారు తప్ప ఆయనకు కలం పేరు కాని, మరే ఇతర పేరు కాని లేదు. మావోయిస్టులతో కాని, వారి దళాలతో కాని నేరుగా సంబంధం లేని, మావోయిస్టు ఉద్యమం పట్ల సానుభూతి మాత్రమే ఉన్న జితెన్ మరాండి, ఆయన బృందాన్ని మావోయిస్టులు చేసిన ఓ చర్యలో భాగస్వాములను చేసి ఉరి శిక్ష వేసింది జార్ఖండ్ న్యాయస్ధానం.
మావోయిస్టులను మట్టుపెట్టేందుకు ప్రభుత్వం సైన్యాన్ని దింపుతోంది. అదే మావోయిస్టులను కాలరాసేందుకు ప్రైవేట్ సైన్యాలను కూడా వాడుతోంది. ఛత్తీస్ ఘర్ లో సాల్వాజుడం, బెంగాల్ లో హర్మద్ వాహిని వంటి ప్రైవేట్ సాయుధ బలగమే.. జార్ఖండ్ లో కూడా వెలిసింది. దాని పేరే నాగరిక సురక్ష సమితి. ఆ సమితి సభ్యులకు మావోయిస్టులే టార్గెట్. చాలాకాలంగా పరస్పర దాడులతో ఆ రెండు వర్గాల మధ్య భీకర యద్ధం జరుగుతోంది. మధ్యలో ఎవరు లబ్ది పొందుతున్నారో... ఎవరు నష్టపోతున్నారో దేవుడికే తెలియాలి. కాని ఈ పోరులో నష్టపోయింది.. ప్రాణాల మీదకు వచ్చింది మాత్రం జితెన్ మరాండీ బృందానికే. ఆదివాసీల జీవితాలపై పాటలు కట్టిన వాళ్లకు, మావోయిస్టులకు మధ్య సంబంధాలు ఉన్నాయన్న జార్ఖండ్ సర్కార్ మావోయిస్టులు పాల్గొని 19 మందిని హతమార్చిన ఒకనొక సంఘటనలో జితెన్ మరాండీ బృందాన్ని బాధ్యులను చేసింది. ఆ సంఘటనలో వారే పాల్గొన్నారని రూఢీ చేసింది.
నాగరిక సురక్షా సమితి. మావోయిస్టులను సాయుధంగా ఎదుర్కొనేందుకు ఏర్పడ్డ ప్రైవేట్ సైన్యం. మావోయిస్టులకు సహకరిస్తున్నారనే కోపంతో ఆదివాసీలపై విరుచుకుపడుతోందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్ధ. ఈ సంస్ధకు చెందిన ఓ స్థావరంపై మావోయిస్టులు విరుచుకుపడ్డారు. ఆ దాడిలో నాగరిక సురక్షా సమితికి చెందిన 19 మంది మరణించారు. మరణించిన వారిలో జార్ఖండ్ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ కుమారుడు అనూప్ మరాండీ కూడా ఉన్నారు. ఈ దాడిలో పాల్గొన్న మావోయిస్టుల బృందంలో జితెన్ మరాండీ అనే మావోయిస్టు నాయకుడు కూడా ఉన్నారు. ఈ విషయం పోలీసుల దర్యాప్తులో బయటపడింది. అంతే ప్రభుత్వ కుట్రకు రూపం దొరికింది. ఒకే పేరున్న ఇద్దరు వ్యక్తులు రికార్డుల్లో బయటపడ్డారు. పావులు కదిలాయి. నాగరిక సురక్షా సమితిపై దాడిలో పాల్గొన్న వారిలో కళాకారుడు, ఆదివాసీ వాగ్గేయకారుడు జితెన్ మరాండీ ఉన్నారని నిర్ధారించారు. ఆ మేరకు ఆయన, ఆయన బృందంలోని ముగ్గురు అనీత్ రాం, మనోజ్ రజ్వార్, ఛత్రపతి మండలిపై కేసు పెట్టారు.
ప్రజా చైతన్యం కెరటమై విరిసినప్పుడు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతూనే వుంటాయి. జార్కండ్ లో ఆదివాసీల బతుకుల్లో చైతన్యం నింపినందుకు కొందరు కళాకారులకు ఉరిశిక్ష బహుమానమైంది. ఎభేన్ నాట్యమంచ్ కళాకారుడు జితేన్ మరాండీ, మరో ముగ్గురు ఇపుడు జైలు నిర్బంధంలో మగ్గుతున్నారు. ఈ కళాకారుల పక్షాన జన మద్దతును కూడగట్టడానికి జార్ఖండ్ కళాకారులు కదిలారు. నిర్బంధంలో వున్న జితేన్ మరాండీ విడుదల కోసం ఆతని భార్య అపర్ణా మరాండి ప్రజా పోరాటం చేస్తున్నారు...
చెట్టుకు కట్టి కాల్చేయడానికి పాట పెదవులు చేసే చప్పడు కాదు. కొయ్యకు తాడు కట్టి ఉరేసి చంపేయడానికి పాట ఓ శరీరం కాదు. పాటంటే.. ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటం. పాటంటే... పొత్తిళ్లలో పసి పాప నవ్వు. పాటంటే... ఓ నిండు జీవితం.

2 comments:

  1. Civils courts are none other than kangaroo courts organised by ruling class.

    ReplyDelete
  2. yes. u r right sir.. every crucial judgment is released by ruling people..

    ReplyDelete