Tuesday, August 23, 2011
దీక్షా దక్షులు
A.. Janardhan
ప్రజాస్వామ్య దేశంలో పౌరహక్కులను సాధించుకోడానికి, లేదా సమిష్టి ప్రయోజనాల కోసం రక్తపాత రహిత పోరాట రూపమే సత్యాగ్రహం.. ఆ ఆగ్రహ వ్యక్తీకరణ నిరాహార దీక్షతోనే సాధ్యం.. నిరాహార దీక్షలు ఇప్పుడు కొత్తగా వచ్చినవి కాదు.. పురాతన కాలం నుంచీ ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేయడానికి నిరాహార దీక్ష లే మార్గం.. తాజాగా అన్నా హజారే దీక్ష దేశ చరిత్రలోనే మరో మైలు రాయిగా నిలబడింది.. అసలు నిరాహార దీక్షలు ఎప్పటి నుంచి ప్రారంభించారు.. ఇందులో ప్రజా ప్రయోజనాల కోసం ఎందరు దీక్ష చేశారు.. రాజకీయ ప్రయోజనాల కోెసం ఎవరు దీక్ష చేశారు.. ఎన్ని దీక్షలు సక్సెస్ అయ్యాయి.. నిరాహార దీక్షల పై హెచ్ఎం టీవీ స్పెషల్ ఫోకస్
నిరాహార దీక్ష.. సత్యాగ్రహం అనగానే ఠక్కున గుర్తొచ్చేది.. మహాత్మా గాంధీ.. అవును భారతదేశ ప్రజలందరికీ శాంతియుత నిరసనా పద్దతిని బోధించింది గాంధీజీయే.. ఆయన చూపిన మార్గం ప్రపంచం మొత్తానికి ఆదర్శం అయింది... ఒక రకంగా చెప్పాలంటే.. నిరాహార దీక్షలు దేశాలకు స్వాతంత్ర్యాలను సాధించి పెట్టాయి.. రాష్ట్రాలను విభజించాయి.. కొత్త కొత్త జి.వోలను తెచ్చిపెట్టాయి... ఉవ్వెత్తున ఎగసిన ప్రజా ఉద్యమాలు కూడా చేరలేని లక్ష్యాన్ని నిరాహార దీక్షలు అందుకున్నాయి..
జాతి సమిష్టి ప్రయోజనాలు సాధించడం కోసం కావచ్చు..
ఒక ప్రాంత ప్రయోజనాలను నెరవేర్చడం కోసం కావచ్చు...
వ్యక్తిగత ప్రయోజనాలు లేదా హక్కులను పొందడం కోసం కావచ్చు...
పై స్థాయిలో ఉన్న నిర్ణాయక శక్తుల పై శాంతియుతంగా చేసే నిరసన
నిరాహార దీక్ష...
వాయిస్
వ్యక్తులు తమ హక్కులకు భంగం కలిగిందని భావించినపుడు.. లేదా తమకు అన్యాయం జరిగిందనుకున్నపుడు.. ఆవేశకావేశాలకు లోను కాకుండా ధర్మాగ్రహం వ్యక్తీకరణ రూపమే సత్యాగ్రహ దీక్ష.. ఈ దీక్షలో ఎవ్వరినీ నొప్పించడం గానీ... ఎవరి మనోభావాలనూ గాయపరచడం గానీ ఉండదు.. కేవలం నిరశన.. తమ కోర్కెలు సాధించుకునేందుకు చేసే శాంతి యుత పోరాటం.. సత్యాగ్రహానికి ఆద్యుడు గాంధీజీ అని చాలా మంది అనుకుంటారు.. వాస్తవానికి సత్యాగ్రహం అనేది పురాణ కాలం నుంచీ ఉంది... త్రేతా యుగంలో పితృవాక్యపాలన కోసం రాముడు అరణ్యవాసానికి వెళ్లినపుడు.. అయోధ్యకు వచ్చిన భరతుడు విషయం తెలుసుకొని సపరివారంతో అడవికి వెళ్లి రాముణ్ని కలుసుకొని రాజ్యపాలనకు రమ్మంటాడు.. దానికి రాముడు ఒప్పుకోక పోవడంతో.. భరతుడు పర్ణశాల ముందు గర్భలు పరుచుకొని నిరాహార దీక్షకు దిగుతాడు.. లక్ష్మణుడితో సహా.. మిగతా పరివారమంతా వారించడంతో.. రామ పాదుకలను తీసుకొని నిరాహార దీక్ష విరమించి తిరిగి అయోధ్య బాట పడుతాడు భరతుడు.. అసలు రాముడు అడవులకు వెళ్లడానికి కారణమే కైకేయి నిరాహార దీక్ష..
త్రేతాయుగంలో శ్రీకృష్ణుడికి నారదుడు బహుకరించిన పారిజాత పుష్పాన్ని రుక్మిణికి ఇవ్వడంతో అలిగిన సత్యబామ సత్యాగ్రహానికి దిగుతుంది. ఆమె అలకను తీర్చడానికి కృష్ణుడు విధిలేని పరిస్థితుల్లో దేవలోకం నుంచి పారిజాత వృక్షాన్నే పెకిలించి సత్యభామ ముంగిలిలో నాటుతాడని పురాణ కథనం.. నిరాహార దీక్షలు గాంధీతో ప్రారంభమైనవి.. అంతమైనవీ కావు.. మన ప్రాచీన కాలం నుంచే ఈ ధర్మాగ్రహం ఉంది.. రామాయణ, భారతాలను పారాయణం చేసే గాంధీ మహాత్ముడు తన పోరాటానికి నిరాహార దీక్షనే సరైన ఆయుధంగా ఎంచుకున్నాడు..
మహాత్మా గాంధీ మొదట సెప్టెంబరు 11, 1906 న దక్షిణ ఆఫ్రికా లో తనకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ దీక్ష ప్రారంభించాడు. అలా మొదలైన గాంధీ నిరాహార దీక్షలు ఎన్నో మలుపులు తిరిగి ఎన్నో విజయాలు సాధించాయి.. స్వదేశమా.. విదేశమా అనే తేడా లేకుండా గాంధీ సత్యాగ్రహం వెలిబుచ్చాలంటే.. నిరాహార దీక్షే ఆయుధంగా ఎంచుకున్నారు.. అందుకే అది ప్రపంచవ్యాప్తంగా ఆదర్శమయింది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో పౌరహక్కుల పోరాటంలో మార్టిన్ లూథర్ కింగ్ కూడా ఇదే పంథాను ఎంచుకున్నారు. గాంధీజీ సత్యాగ్రహంతో బ్రిటీష్ వారు తలవంచక తప్పలేదు.. అయితే గాంధీజీ సత్యాగ్రహం చేసింది ఒకసారి రెండుసార్లు కాదు.. లెక్కలేనన్ని సార్లు సత్యాగ్రహం చేశారు.. అన్ని సత్యాగ్రహాల్లో కంటే ఉప్పు సత్యాగ్రహం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.... గాంధీజీ సత్యాగ్రహం చేసినపుడల్లా బ్రిటీష్ ప్రభుత్వం అరెస్టు చేసి జైలుకు పంపేది.. అయినా మొక్కవోని ధైర్యంతో జైలులో కూడా నిరాహార దీక్షలు కొనసాగించేవాడు. 1922, 1930,1933, 1942 సంవత్సరాలలో గాంధీజీ బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా దీక్షలు చేశారు. గాంధీజీ ఒక్కోసారి కాంగ్రెస్ పార్టీలో బిన్నాభిప్రాయాలు వ్యక్తమయినపుడు కూడా స్వపక్షం పై సత్యాగ్రహంతో నిరసన తెలిపేవాడు.. ఒక్కోసారి గాంధీజీ సత్యాగ్రహంతో సొంత పార్టీ వాళ్లకే ఇబ్బంది కలిగేది.. అయినా ఆయన ఆలోచనా విధాన్ని అర్ధం చేసుకొని జాగ్రత్తగా మసలు కునే వారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష
గాంధీజీ తరవాత స్వతంత్ర భారత దేశంలో సత్యాగ్రహానికి బలమైన గుర్తుగా నిలిచిన వ్యక్తి పొట్టి శ్రీరాములు.. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన వ్యక్తి పొట్టి శ్రీ రాములు. అంతకు ముందు శ్రీ స్వామి సీతారం 38 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి మధ్యలోనే విరమించారు. 1947 ఆగష్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం లేకపోవటం వల్ల ఆంధ్రులు వివక్షకు గురయ్యారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం లో తమిళుల పరిపాలనలో ఎన్నో బాధలు, ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఆంధ్రులు అంతా ఏకమై స్వంత రాష్ట్ర ఏర్పాటుకు ఎన్నో ఉద్యమాలు నిర్వహించారు. ఈ ఉద్యమంలో శ్రీ న్యాపతి సుబ్బారావు, శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య, శ్రీ అయ్యదేవర కాళేశ్వర రావు, కొండా వెంకటప్పయ్య వంటి వారు పాల్గొన్నారు. వీరంతా మహాత్మాగాంధీని కలుసుకొని ప్రత్యేక రాష్ట్ర అవసరం గురించి వివరించినప్పుడు స్వాతంత్ర్యం వచ్చాక ఈ సమస్యను పరిష్కారిస్తామని గాందీ హామీ ఇచ్చారు. స్వాతంత్ర్యానంతరం కూడా సమస్యకు సరైన పరిష్కారం దొరకక పోవడంతో పొట్టి శ్రీ రాములు గారు నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు.. నాయకులు ఎన్ని హామీలిచ్చినా.. పత్రికల ద్వారా సంపాదకీయాలు రాసినా వాటన్నిటీనీ పెడచెవిన పెట్టి దీక్షను కొనసాగించి అమరవీరులైనారు పొట్టి శ్రీ రాములు. ప్రజలు రెచ్చిపోయి అనేక దౌర్జన్యాలకు పూనుకున్నారు. యావత్ ప్రపంచం పొట్టి శ్రీరాములు ఆత్మ త్యాగాన్ని “సుప్రీం సాక్రిఫైస్” గా అభివర్ణించింది. పొట్టి శ్రీరాములు దీక్ష ఫలితంగా బాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు అప్పటి భారత ప్రధాని జవర్‌హాల్ నెహ్రూ అంగీకరించి ఆంధ్రరాష్ట్రమే కాక తమిళ, కేరళ మరాఠీ, గుజరాత్ వంటి ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటు చేశారు.
భారత దేశ చరిత్రలో చెప్పుకోదగ్గ మరో ఆమరణ దీక్ష జతీంద్ర నాద్ దాస్ ఆమరణ నిరాహార దీక్ష.. పొట్టి శ్రీరాములు స్వజాతి వారిపై నిరసనగా ఆమరణదీక్ష చేస్తే జతీంద్ర దాస్ బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా దీక్ష చేసి... అమరజీవి అయ్యాడు.. బెంగాల్ కు చెందిన జతీంద్ర దాస్ స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొనేవాడు.. గాంధీజీ పిలుపు నందుకొని అహింసా ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాడు.. ఫలితంగా బ్రిటీష్ ప్రభుత్వం అరెస్టు చేసి లాహోర్ జైల్లో నిర్భందించింది. అక్కడ జైల్లో ఖైదీల పట్ట జైలు అధికారులు చూపే నిర్లక్ష్యాన్ని చూసి చలించి పోయాడు జతీంద్ర.. శిక్ష పడ్డ ఖైదీలను, విచారణలో ఉన్న ఖైదీలను కట్టుబానిసలుగా చూడటాన్ని సహిచలేకపోయడు.. పదిరోజులకొకసారి గానీ ఖైదీల బట్టలకు శుభ్రం చేసుకొనే అవకాశం లేకపోవడం. అపరిశుభ్రమైన.. అధ్వాన్నంమైన ఆహారం అందించడం.. జితీంద్ర నాద్ దాస్‌ను కలిచివేసింది.. వెంటనే జైలులో సత్యాగ్రహ దీక్ష మొదలు పెట్టాడు.. దీక్ష విరమింప జేసేందుకు బ్రిటీష్ ప్రభుత్వం చిత్ర హింసలు పెట్టింది..అయినా జితీంద్ర తలవంచలేదు.. పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు.. 63 రోజుల జితీంద్ర దీక్ష మరణంతో ఆగిపోయింది.. జితీంద్ర భౌతిక కాయాన్ని.. లాహోర్ నుంచి కలకత్తా కు తీసుకొచ్చారు. ప్రతి స్టేషన్ లోనూ ఆయనకు ప్రజలు నీరాజనాలర్పించారు.. కలకత్తాలో రెండు కిలోమీటర్ల మేర జనప్రవాహం ఆయన అంతిమ యాత్రకు తరలివచ్చారు..
ఆమరణ దీక్ష చేసిన భారతీయుల్లో చెప్పుకోదగిన మరో వ్యక్తి స్వామి నిగమానంద్.. నిగమానంద్ తాను సాధించదలుచుకున్న సామాజిక ప్రయోజనం కోసం ప్రాణత్యాగం చేశాడు.. హరిద్వార్‌లో గంగా తీరంలో అక్రమ మైనింగ్‌ను ఆపాలంటూ నిగమానంద్ దీక్ష ప్రారంభించారు.. ప్రభుత్వ నిగమానంద్ దీక్షను నిర్లక్ష్యం చేసింది.. ఫిబ్రవరి, 19, 2011న దీక్ష ప్రారంభించిన నిగమానంద్ ఆరోగ్యం ఏప్రియల్ 27 నాటికి పూర్తిగా క్షీణించింది. .దీంతో ప్రభుత్వ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది చాలా కాలం పాటు కోమాలో ఉంది. 115రోజుల తరువాత మరణించారు. సామాజిక ప్రయోజనాలకోసం దీక్ష చేసిన మరోవ్యక్తిగా స్వామి నిగమానంద్ చరిత్రలో కెక్కారు. ఆయన మరణానంతరం ప్రభుత్వం ఆ మైనింగ్ ను ఆపేసింది..
మన దేశంలో కాక మనదేశ పాలనకు సంబంధించిన విషయాలను నిరసిస్తూ శ్రీలంక వాసి తిలీపన్ కూడా శ్రీలంకలో ఉన్న ప్రవాస తమిళులకోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి మరణిచాడు.. 1987లో దీక్ష చేసి అమరుడైన తిలీపన్ ప్రజల గుండెల్లో చిరస్తాయిగా నిలిచిపోయాడు. శ్రీలంకలో తీవ్రవాద వ్యతిరేక చట్టం పేరుతో నిర్భందించిన తమిళులను విడుదల చేయాలని, పునరావాసమనే సాకుతో తమిళ ప్రాంతంలో శ్రీలంక వాసులకు ఆశ్రయమివ్వడాన్ని నిలుపు చేయాలని, శ్రీలంక ఈశాన్య ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పోలీస్ క్యాంపులను ఆపాలని తిలీపన్ దీక్ష చేశాడు. ఎల్టీటీఈ సంస్థతో అతనికి ఉన్న సంబంధాల దృష్ట్యా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. స్వల్పకాలంలోనే తిలీపన్ ఆశయసాధనకోసం అమరుడయ్యాడు..
యావత్ భారతదేశ చరిత్రలోనే నిరాహార దీక్షా దక్షతకు ఆదర్శంగా నిలిచే మహిళ ఒకరున్నారు.. ఒకే లక్ష్యం కోసం నిరాహార దీక్ష చేస్తున్న మణిపూర్‌కు చెందిన ఒక 37 సంవత్సరాల యువతి... గత పది సంవత్సరాలుగా నిరవధిక నిరాహారదీక్ష సాగిస్తోంది. మధ్యలో ఒక్కసారి కూడా ఆపలేదు. ఇంతవరకు ప్రపంచంలోనే ఎవరూ, ఎప్పుడూ ఇంత సుదీర్ఘకాలం పాటు నిరాహారదీక్ష జరపలేదు. ఆమె పేరు ఇరోమ్ షర్మిల ఛానూ. మణిపూర్ లో నిర్భందాల మద్య పౌరులు అనేక హింసలకు గురవుతున్నారు.. తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల సాకుతో అమాయకులను పొట్టన బెట్టుకోవడాన్ని షర్మిలా ఛానూ వ్యతిరేకించింది. పోలీసులకు పూర్తి విచక్షణాధికారాలు కల్పించి అమాయక యువకులను కాల్చి చంపడాన్ని షర్మిలా నిరసించింది.. ప్రభుత్వం... షర్మిలాను ఆత్యహత్యా నేరం కింద అరెస్టు చేసి జైలులో నిర్భందించింది. జైలులో కూడా తన నిరాహార దీక్షను కొనసాగించింది.. అన్నపానీయాలు ముట్టకపోవడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించింది. ప్రభుత్వం నాళాల ద్వారా శరీరానికి కావలసిన ఆహారాన్ని అందిస్తోెంది.. ఈ పద్దతిని కూడా షర్మిలా వ్యతిరేకించింది.. కానీ అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే తాను బ్రతికుండాలి కనుక కేవలం నాళికా ద్రవాలతోెనే నిరాహార దీక్ష కొనసాగిస్తుంది.
యావత్ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ లో కూడా ధర్మాగ్రహంతో లక్ష్యసాధనకు నిరసన దీక్షకు దిగిన వారు కూడా ఉన్నారు.. అమర జీవి పొట్టి శ్రీరాములు తరువాత ఆ స్థాయిలో చెప్పుకోదగిన ప్రభావాన్ని కనబరిచిన వ్యక్తి.. తెలంగాణ ఉద్యమసారధి.. టిఆర్‌యస్ అధినేత కేసీఆర్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ టీఆర్ఎస్ అధ్యక్షడు కేసీఆర్ నిరాహార దీక్షకు దిగారు.. దీక్ష ఆపేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. కేసీఆర్ ను అరెస్టు చేసినా కూడా జైలులోనూ... ఆసుపత్రిలోనూ నిరాహార దీక్ష కొనసాగించారు.. కేసీఆర్ ఆరోగ్య పరిస్తతి విషమంగా మారడంతో దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించింది.. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపద్యంలో రాష్ట్ర విభజనకు ఆటంకాలు ఏర్పడ్డాయి..
ఆంధ్రప్రదేశ్ లో మరో సామాజిక ఉద్యమం యస్సీల వర్గీకరణ ఉద్యమం... ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా ప్రభుత్వం ప్రకటన చేయాలంటూ.. మందకృష్ట మాదిగ చేసిన నిరాహార దీక్షకు రాష్ట్రప్రభుత్వం స్పందించింది. కమిటీ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇవ్వడంతో మందకృష్ణ నిరాహార దీక్ష విరమించాడు.
స్పాట్
ిఇవే కాక దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ.. సత్యాగ్రహం చేయడం కొనసాగుతూనే ఉంది.. వ్యక్తులు కూడా తమకు అన్యాయం జరిగినపుడు ప్రభుత్వ కార్యాలయాల ముందు టెంట్ వేసుకోవడం.. నిరవధిక నిరాహార దీక్షలు చేయడం ఆనవాయితీగా వస్తోంది... అయితే పవిత్ర లక్ష్యాలకోసం అంతిమ ఆయుధంగా ఉపయోగించాల్సిన నిరాహార దీక్షలను కొందరు స్వార్ధ పరులు నవ్వుల పాలు చేయడం.. బాధ కలిగించే విషయం.. ఆర్భాటాల నడుమ.. రాజకీయ ప్రయోజనాల కోసం.. జనసమీకరణల మద్య చేసే బూటకపు దీక్షలు చేసేవారు.. అన్నా హజారే లాంటి పెద్దమనుషులను చూసి దీక్షకు సిసలైన నిర్వచనాన్ని గ్రహించాలి. బూటకపు దీక్షలను ప్రభుత్వాలు స్పందించడం మానేసిన రోజు... సిసలైన దీక్షా దక్షుల విశ్వసనీయత తెలుస్తుంది.. పోటీ దీక్షలు, బెదిరింపు దీక్షలు మాని సామాజిక ప్రయోజనాలు కోసం.. సమిష్టి ప్రయోజనాల కోసం.. జాతి ప్రయోజనాల కోసం చేసే దీక్షలు దేశ దిశాదశను మార్చగలవని... హజారే దీక్షద్వారా మరోసారి నిరూపితమయింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment