ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Wednesday, October 23, 2013

వాడుకొని వదిలేద్దమనుకున్నారా ... లోగుట్టు బయట పడింది ..


ఢిల్లీలో నిర్భయ కేసు తరహాలోనే హైదరాబాద్‌లో జరిగిన అభయ అత్యాచార ఘటన, భాగ్యనగరంలో మహిళల భద్రతను మరోసారి ప్రశ్నార్థకంగా మార్చింది. జనసమ్మర్థం ఉన్న ప్రాంతం నుంచే అభయను క్యాబ్‌ పేరుతో కారులో ఎక్కించుకుని నగర శివార్లకు తీసుకువెళ్లి అత్యంత అమానవీయంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ తీరు చూస్తే, మృగాళ్లు ఎంతకు తెగించారో అర్థం చేసుకోవచ్చు. అమ్మాయిలు రేప్ చేస్తే పోలీసులకు చెప్పుకోరని, ఒకవేళ చెప్పుకున్నా, తమను పట్టుకోలేరన్న ధీమాతో నిందితులు ఉండడం మన వ్యవస్థాగత లోపాలను బయటపెడుతోంది. ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టిన దుర్మార్గులను అత్యంత దారుణంగా శిక్షించాలి. ఇక ఈ ఘటన జరగడం వెనుక లోపాలను పరిశీలిస్తే, ఎన్నో కనిపిస్తాయి. ఢిల్లీలో నిర్భయ కేసు జరిగిన తర్వాత, ఐటీ ఆఫీసులు, కాల్ సెంటర్లు ఎక్కువగా ఉన్న సైబరాబాద్ పరిధిలో సీసీ కెమెరాలు భారీగా అమర్చామని, నిర్బయలాంటి ఘటనలు తమ పరిధిలో జరగవని అప్పటి పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల నాథ్ ప్రకటించారు. కానీ, అదంతా వట్టిమాటలేనని తాజా ఘటనతో తేలిపోయింది. ఎందుకంటే, మాదాపూర్ నుంచి కొల్లూరు వెళ్లేదాకా ఒక్క సీసీ కెమెరా కూడా కారును రికార్డ్ చేయలేకపోయింది. ఇంత దారుణంగా సీసీ కెమెరాల పనితీరు ఉన్నా మన పోలీసులు పట్టించుకోవడం లేదు. అదృష్టవశాత్తూ బిర్లా స్కూల్ దగ్గర సీసీ కెమెరా పనిచేసింది కాబట్టి ఈ కేసులో చిక్కుముడి చాలావరకూ వీడిపోయింది. ఒకవేళ అక్కడ కెమెరా లేకపోతే పరిస్థితి ఏమిటి.. ఈ నిందితులు దొరికేవారా..? ఒకవేళ దొరకకపోతే మాత్రం, ఇదే తరహాలో మరెంతోమంది యువతుల జీవితాలతో చెలగాటమాడేవారన్నది ఎవరూ కాదనలేని సత్యం. ఈ కేసును పోలీసులు త్వరగా ఛేదించినప్పటికీ, వారి నిర్లక్ష్యం వల్లే ఇంత దారుణం చోటుచేసుకుందన్నది అందరూ గుర్తించాల్సిన విషయం. ఇక త్వరగా హాస్టల్‌కు వెళ్లాలన్న తపనలో ప్రైవేట్ కార్‌లో ఎక్కడం కూడా అభయ తప్పే. నిర్భయ లాంటి ఘటనలు జరిగిన తర్వాత కూడా, ఒక్కసారి కూడా ఆమె ఆలోచించకపోవడం వల్లే ఈ దారుణం జరిగింది. కారులో ఎక్కకుండా బస్సు కోసమో, షేర్ ఆటో కోసమో కనీసం మరో పదినిమిషాలు వేచి ఉన్నా సరిపోయింది. ఒంటరిగా వెళ్లాల్సి వచ్చిప్పుడు వీలైనంతవరకూ బస్టాండ్‌ల దగ్గరకు వచ్చి ఎక్కించుకునే క్యాబ్‌లను ఆశ్రయించకపోవడమే మంచింది. ఇద్దరు ముగ్గురు ఉంటేనే ఇలాంటి వాహనాలను ఎంచుకోవాలి. అమ్మాయిల భద్రత కోసం మనవాళ్లు కొంతకాలం ఆండ్రాయిడ్ ఆప్‌ను తయారు చేశారు. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని ఉంచుకోవడం మంచిది. ఇక పెప్పర్‌ స్పే లాంటివి అమ్మాయిలు బ్యాగ్‌లో ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి. తాము ప్రయాణిస్తున్న వాహనం దారి మళ్లిందని గుర్తించగానే డ్రైవర్‌ను నిలదీయాలి. అతనిచ్చిన సమాధానం సరిగా లేకపోతే మాత్రం వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ 100కు డయల్ చేయాలి. ఒకవేళ ఫోన్ చేసే పరిస్థితులు లేకపోతే, మేసేజ్ పంపించినా చాలు. ఔటర్ రింగ్‌రోడ్డు టోల్‌గేట్ల దగ్గర కూడా పోలీస్‌లను డ్యూటీలో ఉంచాల్సిన అవసరం ఉంది. కార్లలో అనుమానాస్పదంగా ఉన్నవాళ్ల వివరాలను అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. మగాళ్లు కూడా ఈ విషయంలో మారాల్సిన అవసరం ఉంది. ఆడవాళ్లపై లైగింక దాడులు చేయాలన్న దురాలోచనను మానుకోవాలి.