ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Friday, April 23, 2010

యాదగిరి లక్ష్మినరసింహ స్వామి చరిత్ర


జనార్దన్‌
తెలంగాణ ఆలయాలకు స్వాగతం.
ఇంట్రో
తెలంగాణ ఆలయాల్లో యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి పేరు వినని వారు ఉండరు. ఈ రోజు మనం యాదగిరి గుట్టను దర్శించి.. అక్కడి స్థల పురాణం తెలుసుకొందాం..వెళ్దామా..పదండి..
బ్యాంగ్
యా
యాంకర్‌ 1
యాదగిరి గుట్టకు వచ్చేశాం..ఇది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ తోరణం. ఈ తోరణం చూడగానే భక్తులకు తాము స్వామి సన్నిధికి వచ్చేశామన్న సంతోషం కలుగుతది.
(విజువల్స్‌ విత్‌ సాంగ్స్ ఘాట్‌రోడ్డు...)
వాయిస్‌
భగవంతుని దశావతారలలో.. నారసింహావతారానికి ఎంతో విశిష్టత ఉంది. భక్త వత్సలుడిగా... దుష్టశిక్షకుడిగా... ధర్మ పరిరక్షకుడిగా.. భక్తకోటి హృదయాలలో పదిలమైన స్థానం ఉంది. హిరణ్యాక్షుడి సంహారం తరువాత ఈ భూమి పై భక్తులను కాపాడేందుకు నరసింహుడు ఎన్నో పుణ్యతీర్ధాలలో వెలసి భక్తుల కోర్కెలు తీరుస్తున్నడు. నరసింహస్వామి ఉగ్రరూపం ఉపసంహరించినంక వేసిన ప్రతి అడుగూ పుణ్యతీర్ధంగా వెలిసిందంట.. అటువంటి పుణ్యక్షేత్రాలలో అత్యంత పవిత్రమైనది యాదగిరి పుణ్యక్షేత్రం...
స్పాట్‌
యాంకర్‌ 2
ఇదే..యాదగిరి గుట్ట..ఈ గుట్టకు యాదగిరి అని పేరు రావడం వెనుక స్థల పురాణ కథ ఉంది. పూర్వం యాదమహర్షి ఇక్కడ తపసు చేసిండట..మహర్షి తపసుకు మెచ్చి స్వామి ప్రత్యక్షమై యాద మహర్షిని వరం కోరుకోమన్నడట..అప్పుడా మహర్షి ఈ క్షేత్రం తన పేరు మీద ప్రసిద్ది చెందాలని, ఈ క్షేత్రంలో స్వామి కొలువై ఉండి భక్తుల కోర్కెలు తీర్చాలని వరమడిగిండట..అంతే అప్పటి నుంచి ఈ క్షేత్రాన్ని యాదగిరి క్షేత్రమని పిలుస్తున్నరు.
వాయిస్‌ 1
పూర్వం రుష్యశృంగుడు అనే మహర్షి ఉన్నడు. ఆయన ఎక్కడ కాలు పెడితే అక్కడ పాడి పంటలతో వర్ధిల్లుతదని చెప్పుకుంటరు. అందుకే ఒకపారి అయోధ్యలో కరువు వచ్చిందని దశరదుడు కూడా రుశ్యశృంగుని తీసుకొచ్చి అతనితో యజ్ఞయాగాదులు చేయించి మంచి ఫలితాన్ని పొందిండు. దానితో సంతృప్తి చెందిన దశరదుడు తన తమ్ముడైన రోమపాదుని కుమార్తె శాంత అనే యువతినిచ్చి రుష్యశృంగుడికిచ్చి వివాహం జరిపిస్తడు దశరదుడు. ఆ రుష్యశృంగుడికి శాంతలకు కలిగిన సంతానమే యాదమహర్షి. ఈ యాదమహర్షి పేరు మీదే ఈ పుణ్యక్షేత్రానికి యాదగిరి గుట్ట అనే పేరొచ్చింది.
స్పాట్...
హిరణ్యకశివుడి సంహారం తరువాత ఉగ్రనరసింహుడి రూపం నుంచి శాంతించి ప్రసన్న రూపంలో దర్శనమీయమని వేడుకున్నడు ప్రహ్లాదుడు. భూమిపై భక్తుల కోరికలు తీర్చే దేవుడిగా నిలిచిపోవాలని ప్రార్దించిండు.
(ప్రహ్లాద ‌శ్లోకం)
ప్రహ్లాదుడి కోరిక మన్నించిన స్వామి. భూమి పై దక్షిణ భాగంలో వెలుస్తానని అభయమిచ్చిండు.
(యాదగిరి గుట్ట విజుల్స్)
రుష్యశృంగుడి కుమారుడు యాదమహర్షి తన దివ్యదృష్టితో నరసింహస్వామి యాదగిరి ప్రాంతంలో వెలిసినాడని గ్రహించి ప్రాంతానికి వచ్చి ధ్యానం చేయ సంకల్పించిండు. ఆ ప్రాంతనికి వచ్చి స్వామి ఉన్న ప్రదేశం కోరకు వెతక సాగిండు. ఆ కాలంలో అది కీకారణ్యం. మొత్తం చెట్టు పుట్టల మయం. కౄరమృగాలు సంచరించే ప్రదేశం. ఈ నిర్జన ప్రదేశంలో స్వామి కోసం వెదికి వెదికి యాదమహర్షి అలసి సొలసి చెట్టుకింద నిద్రించిండట. అప్పుడు ఆంజనేయ స్వామి కలలో కనిపించి, నరసింహస్వామి ఉన్న తావు చూపిండట. వెంటనే యాదమహర్షికి మెలకువ వచ్చి చూడగా...తాను కలలో చూసిన తావు తన కళ్లేదుటే ఉన్న గుట్ట పై కనిపించిందట. అక్కడికి వెళ్లిన యాదమహర్షి నరసింహస్వామి గూర్చి ఘోరతప్పస్సు చేసిండట. మహర్షి తపస్సుకు మెచ్చిన నరసింహస్వామి ప్రత్యక్షమై యాదమహర్షిని వరములు కోరుకొమ్మన్నడు. స్పాట్‌
స్వామిని చూసిన యాదమహర్షి సంతోషంతో పొంగిపోయిండు. తన జన్మతరించిందని నిలువెల్ల పులకించిండు. ఈ పర్వతం వెలసి భక్తజనులకు దర్శనం ఇవ్వాలని, ఈ పర్వతం తన పేరు మీద యదగిరిగా పేరుపొందాలని వరాలు కోరిండు. మహర్షి చూస్తుండగానే స్వామి జ్వాలా రూపంలో తేజోవంతంగా వెలుగులీనుతూ గుహలో వెలసిండు.
స్పాట్‌
యాదగిరి గుట్ట గుహలో స్వామి పంచరూపాలలో వెలిసిండు... ఉగ్ర నరసింహుడిగా... యోగానంద నరసింహుడిగా...జ్వాలా నరసింహుడిగా..గండభేరుండ నరసింహుడిగా...భక్తాభయ నరసింముడిగా ...వెలసిండు. జ్వాలా నరసింహుడి జూలు అగ్నిశిఖల వలే ఉంటది. యోగానంద నరసింహుడు ఇక్కడికొచ్చి వేడుకున్నయోగులును, మునులను కరుణించి వరములిస్తడు. గండబేరుడ నరసింహుడు పొడవాటి ముక్కుగలిగి దుష్టశక్తలు భారి నుంచి భక్తులను కాపాడే రూపం.భక్తాభయ నరసింహుడు భక్తుల పాలిటి కల్పతరువుగా వెలసిండు. లక్ష్యీ నరసింహ రూపంలో లక్ష్మీదేవితో కూడియున్న ప్రశాంత మూర్తిగా దర్శనమిస్తడు. ఈ మూర్తికే ప్రజలు ఎక్కువగా మొక్కులు మొక్కుకుంటరు.
యాంకర్‌ 3
ఇవి దేవాలయానకి వెళ్లే మెట్లు. ఈ మెట్లు ఎక్కిస్వామిని దర్శించుకున్న వారికి కీళ్లనొప్పులు తగ్గుతాయని భక్తుల నమ్మకం.
(భక్తులు మెట్లెక్కే విజువల్స్‌)
యాంకర్‌ 4
ఇది గోపుర చక్రం..ఇది సాక్ష్యాత్తూ ఆ విష్టుదేవుడి చక్రం. యాదమహర్షి తపస్సు చేసుకుంటుండగా ఒక రాక్షసుడు మహర్షిని చంపే ప్రయత్నం చేసిండట. తన భక్తునికి అపాయం వచ్చిందని గ్రహించిన స్వామి...విష్ణు చక్రాన్ని సంధించి రాక్షసుణ్ని చంపేసిండట. యాదమహర్షి ఈ చక్రాన్ని స్తుతించగా.. తాను ఇక్కడే ఉంది భక్తులకు ఏవిధమైన కష్టాలు కలుగకుండ కాపాడుతానని అభయమిచ్చిందట.
వాయిస్
స్వామి వారి విమానం మీద ఉన్న ఈ చక్రం అత్యంత పవిత్రమైనది. ఇది సాక్ష్యాత్తూ విష్ణుమూర్తి సంధించిన చక్రం. యాదమహర్షి ఇక్కడ తపస్సు చేసుకుంటుండగా ఒక రాక్షసుడు వచ్చి మహర్షిని తినబోయిండు. ఈ విషయం మహర్షికి తెలీదు. ఈ విషయాన్ని గ్రహించిన సర్వాంతర్యామి కోపోద్రిక్తుడై రాక్షసుడి పైకి సుదర్శన చక్రాన్ని సంధించిండు. ఆ చక్రాఘాతానికి రాక్షసుడు నేలకొరిగిండు. యాదమహర్షి కనులు తెరిచి ఆ చక్రముని శాంతించమని స్తోత్రం చేసిండు. అపుడా సుదర్శన చక్రం మహర్షిని నిర్భయంగా ఉండుమని అభయమిచ్చింది. దుష్టులనుంచి భక్తులను కాపాడేందుకు ఇక్కడే కొలువై ఉందునని అభయమిచ్చింది. త్వరలో ఒక భక్తుడు స్వామి గుహ పై నిర్మించబోయే ఆలయం పై చక్ర ప్రతిష్ట చేస్తడని తెలిపిండు. ఆ చక్రం పైన తాను అధిరోహించి యుందునని తెలిపిండు. షట్కోణయుతమైన తన స్వరూపమును భక్తులు దర్శించుకుందురని రివ్వున గుట్ట పైకి వెళ్లింది.
స్వాట్‌...
యాంకర్‌ 5
ఇది విష్ణు కుండము. దీనికి విష్టు కుండము అనే పేరు రావడానికి రెండు కారణాలున్నయని చెప్తరు. యాదమహర్షిని రక్షించేందుకు వచ్చిన విష్టు చక్రం తన పని పూర్తి కాగానే మహర్షికి దర్శనమిచ్చి, ఈ ప్రాంతంలో అంతర్ధానమయిందని...అందుకే దీనికి విష్టు కుండమనే పేరొచ్చిందని చెప్తరు.
వాయిస్
ఈ కోనేరు చూడండి. నిత్యం జీవజలంతో తొణికిసలాడుతుంటది. ఎండాకాలంలో కూడా నిండుకుండలా ఉంటది. ఈ కుండం ఇలా ఉండడానికీ ఓ కారణం ఉంది. యాదమహర్షిని కాపాడటానికి వచ్చిన సుదర్శన చక్రం మహర్షికి ఇక్కడే ఉండి భక్తులకు దర్శనమిస్తనని అభయమిచ్చింది. తర్వాత ఈ కొండ పైకి వచ్చి నిలిచిపోయింది. ఆ చక్ర ఘాతానికి కోనేరు తయారయింది. అందుకే దీనికి విష్ణుకుండమనే పేరొచ్చింది.
స్పాట్‌..
సృష్టికర్త బ్రహ్మ తన కమండల జలంతో నారసింహుని పాదాలు కడుగగా ఆజలం ప్రవహిస్తూ వచ్చి ఈ విష్ణుకుండంలో ఆగిందట. యాద మహర్షి తపస్సు పూర్తి చేసుకొని ఇక్కడి కోనేరులో పుణ్య స్నానం చేసేవాడట. తొలిసారి ఈ పుష్కరిణిలో యాదమహర్షి స్నానమాచరించడం వలన దీనికి యాదర్షికుండమని కూడా పిలుస్తరు.ఈ పుణ్యక్షేత్రానికి వచ్చిన భక్తులు తప్పక ఈ కుండంలోస్నానం చేస్తరు. ఈ పవిత్ర జలం శిరస్సు పై చల్లుకున్నంతనే సకల పాపాలు హరిస్తయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా వైశాఖ, మాఘ, పాల్గుణ, మాసాలలో ఈ కుండానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటది. ఈ కుండంలో రాత్రి వేళల్లో స్నానం చేయడం నిషేదం. ఎందుకంటే రాత్రి వేళల్లో వెంకటగిరిలో తపస్సు చేసుకునే మునులు ఇక్కడకొచ్చి తపస్సు చేస్తరని ప్రచారం.
స్పాట్...
బైట్ –ఆలయ ప్రధానార్చకులు
స్పాట్‌
యాంకర్‌ 6
ఇది ‌శ్రీ ఆంజనేయుని అర్చా రూపం. యాదమహర్షికి కలలో కనిపించి ఈ క్షేత్రమహత్యం తెలిపింది ఈ స్వామేనట. మహర్షికి నరసింహ స్వామి ప్రత్యక్షమై ఇక్కడ వెలశాక, ఆంజనేయుణ్ని ఇక్కడ క్షేత్రపాలకుడిగా ఉండమని కోరిండట యాదమహర్షి. మహర్షి కోరిక మన్నించిన ఆంజనేయుడు కామస్వరూపిగా వెలసిండు.అప్పటి నుంచి లక్ష్మీనరసింహస్వామితో బాటు ఆంజనేయ స్వామి కూడా పూజలందుకుంటున్నడు.
వాయిస్
యాద మహర్షికి ఆంజనేయుడు కలలో కనిపించి స్వామి ఉన్న చోటు చూపినందుకు...ఆంజనేయుని పట్ల యాదమహర్షికి భక్తి పెరిగింది. ఎంతో కాలం ఆంజనేయుడి దర్శనం కోసం తపసు చేసిండు. మహర్షి భక్తికి మెచ్చి ఆంజనేయుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకొమ్మన్నడు. అప్పుడు యాదమహర్షి...ఆంజనేయస్వామి ఇక్కడే కొలువై ఉండి ఇక్కడి పుణ్యక్షేత్ర పాలకుడిగా ఉండాలని కోరిండట. మహర్షి కోరిక మేరకు అంజనీ పుత్రుడు ఇక్కడ క్షేత్ర పాలకుడిగా ఉంటూ భక్తులకు దర్శనం ఇస్తండు.
యాంకర్‌ 7
ఇక్కడ లక్ష్మీనరసింహస్వామితో బాటు ఆంజనేయుణ్ని శివుణ్ని కూడా పూజిస్తరు.
వాయిస్‌
శివాయ విష్ణు రూపాయ...అని వేదాంగాలు వర్ణించినట్టు...ఎక్కడ విష్ణుముర్తి తన అవతారాలతో వెలుస్తడో అక్కడ శివుడు దర్శనమిస్తడని స్థల పురాణాల్లో వివరించిండ్రు. చాలా విష్ణు ఆలయాల్లో శివాలయాలు కూడా ఉంటయి. ఇక్కడ కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కొలిచేందుకు శివుడే ప్రత్యక్షంగా లింగరూపంలో వెలసిండట. ఇక్కడికి వచ్చిన భక్తులు శివుణ్ని కూడా భక్తిశ్రద్దలతో పూజిస్తరు.
స్పాట్‌
యాంకర్‌ 8
ఈ పుణ్యక్షేత్ర మహిమ తెలుసుకున్న రాజులు ఎందరో ఈ క్షేత్రాన్ని దర్శించి తమ కోరికలు నెరవేర్చుకున్నరు. ఆలయ కీర్తి ప్రతిష్టలను దశదిశలా చాటి చెప్పిండ్రు. అంతటి మహత్తుగల పుణ్యక్షేత్రం ఈ యాదగిరి గుట్ట.
వాయిస్
క్రీస్తు శకం 12వ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని ఆంధ్రప్రాంతాన్ని పశ్చిమ చాళుక్యులు పాలించేవారు. 1148 సంవత్సరంలో త్రిభువన మల్లుడు అనే పశ్చిమచాళుక్యరాజు రాజ్య విస్తరణ కాంక్షతో తెలంగాణ ప్రాంతపు చిన్న చిన్న రాజ్యాలను జయిస్తూ భువనగిరి ప్రాంతానికి వచ్చిండు. భువనగిరిలో ఏకశిలను చూసి ముగ్దుడై ఆ శిల పై కోటనిర్మించుకొని దానిలోనే నివాసమున్నడట. అదే సమయంలో పృధ్వీ వల్లభ అనే రాజుతో త్రిభువనిడికి వైరం ఏర్పడింది. పృధ్వీ వల్లభుణ్ని జయించడం త్రిభువనుడికి చాలా కష్టంగా మారింది. దీంతో మంత్రి బగద్దేవుడు యాదగిరి నరసింహుణ్ని దర్శించుకొమని సలహా ఇచ్చిండట. మంత్రి సలహా విన్న రాజు ఈ యాదగిరి లక్ష్మీనరసింహుణ్ని చేరి సేవించిండట. స్వామి కటాక్షం వల్ల త్రిభువనుడికి విజయం కలిగింది. ఆ రాజు పేరు మీదే ఈ ప్రాంతానికి భువనగిరి అనే పేరొచ్చింది. ఈ విషయం ఆ ప్రాంత ప్రజలందరికీ తెలయడంతో స్వామి మహిమల గురించి ప్రజల్లో బాగా ప్రచారం జరిగింది.
స్పాట్‌
స్వామి లీలలు తెలిపే మరో సంఘటన కూడా ఉంది. పూర్వం ఒకసారి శ్రీ కృష్టదేవరాయులు ఆంధ్రదేశాన్ని లోబరచుకొని సతీసమేతంగా గొల్కొండకు వచ్చిండు. ఇక్కడకు సమీపంలో ఉన్న యాదగిరిగుట్టను దర్శించుకున్నడు. రాజభక్తులు స్వామిని శ్రద్దగా పూజించిండ్రు. ఎంత కాలంనుంచో పుత్రసంతానం కోసం బాదపడుతున్న రాయలుకు మగబిడ్డ జన్మించిండట.కానీ ఆ కొడుకు అల్పాయుష్కుడై ఐదేండ్లకే చనిపోయిండు. రాయలు ఈ ఘటతో కుంగిపోయిండు. తానేదైనా అపచారం చేశానా అని మధనపడసాగిండు. అప్పుడు స్వామి కలలో కనిపించి రాణి విష్ణుకుండలో స్నానమాచరించక నిర్లక్ష్యం చేసినందున ఈ శిక్ష అనుభవించవలసిందని తెలిపిండట. దీంతో రాజు మరల యాదగిరి గుట్టకు చేరుకొని భక్తి శ్రద్దలతో పూజించిండ్రు.
స్పాట్‌..
ఎంతో మంది రాజులు స్వామిని దర్శించుకున్నా దేవదేవునికి ఆలయం నిర్మించాలన్న ఆలోచన రాలేదు. ఆలయ ఉద్దరణకు కృషి చేయలేదు. అందుకే చెట్టుపుట్టలతో నిండిన ఈ ప్రాంతం 19వ శతాబ్దం వరకు సామాన్యులకు అందుబాటులోకి రాకుండా పోయింది.
స్పాట్‌
బైట్‌ - ఆలయ ధర్మకర్త.
యాంకర్‌ 9
ఈ క్షేత్రాన్ని రాజులెందరో దర్శించి, పూజలు చేసి తమ కోరికలు తీర్చుకొన్నారే కానీ ఆలయ ఉద్దరణకు నడుం బిగించిన వారు లేరు. 19 శతాబ్దం వరకు ఈ ఆలయ ఉనికే చాలా మందికి తెలీదు. క్షేత్రం మొత్తం చెట్టు పుట్టలతో నిండి పోవడంతో స్వామి గ్రామ పెద్దకు కలలో కనిపించి...క్షేత్ర మహత్యం తెలపడంతో గ్రామస్థులంతా కలిసి ఈ పుణ్యక్షేత్రాన్ని ఉద్దరించిండ్రంట.
వాయిస్‌
పూర్వం యాదగిరి ప్రాంతం మొత్తం కాకులు దూరని కారడివిలా ఉండేదట. స్వామి దూపదీప నైవేద్యాలేవీ లేకుండా చీకటి గుహలో ఉండేవాడు. యాదగిరి గ్రామ పెద్దకు స్వామి కలలో కనిపించి తాను ఈ కొండ పై వెలసియున్నానని చెప్పిండు. మరునాడు గ్రామ ప్రజలంతా కలిసి ఆ కొండ అణువణువూ శోదించిండ్రు. చెట్లను తొలిగించి గుహలన్నిటిని వెదికిండ్రు. వారి శ్రమ ఫలించింది. స్వామి దర్శనం లభించింది. అంతే ఇక వారి సంతోషానికి అవధులు లేవు. వెంటనే పూజారులను పిలిచి పూజలు చేయించిండ్రు. ఆ ప్రాంతమంతా శుభ్రం చేసిండ్రు. అప్పటి నుంచి స్వామికి రోజూ పూజలు చేయడం మొదలు పెట్టిండ్రు.
యాంకర్‌ 10
ఇవి ఆలయ ప్రాకారాలు... వీటి పై స్వామి కథలను అందంగా చెక్కిండ్రు. ఒకప్పుడు ఇక్కడ ఆలయమే లేదు. ఈ క్షేత్ర మహిమ తెలుసుకున్న మోతీలాల్‌ అనే భక్తుడు స్వామికి ఆలయ ప్రాకారాలు నిర్మించేందుకు కృషి చేసిండట.
వాయిస్‌
యాదగిరి గ్రామస్తులంతా కలిసి స్వామిని వెలికితీసి పూజలు చేసిండ్రు కానీ ఆలయం నిర్మించ లేదు. కొంతకాలం గడిచాక హైదరాబాద్‌ నివాసి శ్రీ రాజా మోతీలాల్‌ పిథీగారు ఈ ఈ క్షేత్ర మహత్యం గురించి తెలుసుకొన్నడు. స్వామిని దర్శించాలన్న తపనతో ఇక్కడకు వచ్చి భక్తి శ్రద్దలతో పూజించిండు. పంచరూపాలలో ఉన్న శ్రీ లక్ష్మీనారసింహస్వామికి ఆలయం లేక పోవడంతో చింతించిండు. తాను అక్కడే నివాసముండి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టిండు. ఆలయానికి ప్రాకారాలు నిర్మించి ఒక రూపం తెచ్చిండు. అప్పటి నుంచి నేటి వరకు ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ది చెందుతనే ఉంది.
స్పాట్‌.
బైట్‌----ఆలయ ఈ.వో
యాదగిరి లక్ష్మీనరసిహ ఆలయంలో ఏటా బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తరు. ఆ ముక్కోటి దేవతలు ఈ ఉత్సవాలకు హాజరై భక్తులను దీవిస్తరని విశ్వసిస్తరు.
స్పాట్‌
( బ్రహ్మోత్సవాల విజువల్స్‌ సి.డిలోవి.)
ఇదీ ఈ వారం తెలంగాణ ఆలయం. మరో తెలంగాణ ఆలయంతో మళ్ళీ కలుసుకుందాం...

Sunday, April 18, 2010

సింగపూర్‌ సింగారాలు


జనార్దన్‌
అందమైన భవనాలు... సిటీ మద్యలో సెలయోళ్లు.. అడుగడుగునా ఆహ్లాదకరమైన వాతావరణంతో... అచ్చం అద్దంలా ఉండే నగరాన్ని మీరెప్పుడైనా చూశారా.. అయితే ఇప్పడు మీరు చూడబోయే నగరం అచ్చం అద్దంమంత స్పష్టంగా కనిపిస్తది. ఇంతకీ ఆ నగరం పేరేంటనేగా మీ డౌట్. ఇన్ని లక్షణాలున్న బ్యూటిఫుల్‌ సిటీ నన్‌ అదర్‌ దాన్ సింగపూర్‌... ఈ వారం టూరిస్ట్‌ గైడ్ లో సింగపూరు సింగారాలను చూసొద్దాం.
సింగపూర్‌... ఈ పేరులోనే ఓ విశేషం ఉంది. సింగం అంటే మలయా భాషలో సింహమని అర్దం. పద్నాలుగో శతాబ్దంలో సుమత్రాదీవి యువరాజు సంగ్‌ నీలోత్తమ ఈ ద్వీపానికి వచ్చిండట. అప్పుడు ఈ ద్వీపంలో సింహం వంటి విచిత్ర జంతువు కనిపించిందట. అప్పటి నుంచి ఆ యువరాజు ఈ ప్రదేశం గురించి చెప్పే సందర్బంలో సింగపురం అని చెప్పేవాడట. అదే నానుడిగా మారి ఈ దేశానికి సింగపూర్‌ అనే పేరు స్థిరపడింది.సింగపూర్ గురించి వర్ణించడానికి మాటలు చాలవు. నిత్యం వేలాది మంది సంచరించే రద్దీ ప్రదేశాన్ని కూడా అద్దంలా అందంగా ఉంచుకోవచ్చు అని చెప్పడానికి స్వచ్ఛమైన ఉదాహరణ సింగపూర్‌. దక్షణాసియా దేశంలోనే అతి చిన్న దేశం సింగపూర్‌. చిన్న రాష్ర్టాలు, చిన్న దేశాలు అభివృద్ది సాధించవు అని నీతులు చెప్పేవారికి సింగపూరే అచ్చమైన ఉదాహరణ. పాలకులలో చిత్తశుద్ది ఉంటే ఎంత చిన్నదేశమైన స్వర్గధామంగా మార్చవచ్చని నిరూపించారు ఇక్కడ పాలకులు. పారిశుద్ధ్యంలో కూడా చక్కటి పేరు సంపాందించిన సింగపూర్ అభివృద్ధికి ఇక్కడి పరిపాలనా దక్షతను కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అందుకే అతి చిన్నదైనప్పటికీ, ప్రపంచ దేశాలలో ఆర్థికంగా 13వ స్థానంలో నిలిచేలా చేసింది.ఈ అందమైన భవనాలను చూడండి... ఎంత ముచ్చటగా ఉన్నయో... మెడ మొత్తం ఎత్తినా కనిపించనంత ఎత్తులో ఉన్నయి. ఆకాశ హర్మాలు అనే పదానికి సింగపూర్‌ బిల్డింగ్‌లే పర్యాయపదాలు. మలేషియాకు దక్షిణాన 704 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన దక్షిణాసియాలోని అతి చిన్న దేశం సింగపూర్. దీని అధికారిక నామం "రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్". ఇది ఒక చిన్న ద్వీపం, నగరం కూడాను..
ఆరోగ్యపరంగానూ సింగపూర్ అభివృద్ధి పథంలో ఉండటంతో విదేశీయులు సైతం వైద్యం కోసం ఇక్కడకు వస్తూ ఉంటారు. ఈ దేశ ఆర్ధిక వనరులలో పర్యాటక రంగము ప్రధాన పాత్ర వహిస్తుంది కనుక ఇక్కడకు విచ్చేసే పర్యాటకులకు విమానాశ్రయంలోనే తాత్కాలిక వీసా మంజూరు చేసే ఏర్పాటు ఉంది. ఈ దేశానికి వివిధ దేశాలనుండి టూరిస్ట్ వీసా సులువుగానే లభిస్తది.సింగపూర్‌ చూడాలంటే రెండు కళ్లు చాలవంటే నమ్మండి... ఇక్కడ ఏది చూసినా కొత్తగనే అనిపిస్తది. ముఖ్యంగా సిటీ మొత్తం అంత నీట్‌గా మెయింటేయిన్ చేయడం చూస్తే వావ్‌ అనిపిస్తది. సిటీ మొత్తం అద్దంలా ఉంటదంటే నమ్మండి... చూస్తే మీరే అంటరు సింగపూర్‌ ఈజ్‌ క్లీన్‌ అండ్‌ గ్రీనని.సింగపూర్‌ చూడ్డానికి రెండు కళ్లు చాలవంటే నమ్మండి. ఎందుకంటే ఇక్కడ నీరు సమృద్దిగా ఉండటం వల్ల చల్లగా ఉండటమే కాక పచ్చని తివాచీ పరచినట్టుండే పచ్చిక బయళ్లు కనువిందు చేస్తయి. ఇక్కడి మెర్‌మెయిడ్‌ విగ్రహాలు పర్యాటకులను ఆకట్టుకుంటయి. ఇక్కడకొచ్చిన పర్యాటకులు మెర్‌మెయిడ్‌ ప్రతిమల ముందు ఫోజులిచ్చి ఫోటోలు దిగుతరు. బోట్‌లో బ్రిడ్జ్‌ కిందనుంచి చేసే ప్రయాణం భలే మజాగా ఉంటది.రివర్‌లో ప్రయాణిస్తూ చుట్టూ ఉన్న అందమైన భవంతులను చూస్తుంటే ఏదోలోకంలో విహరిస్తున్న అనుభూతి. అడుగడుగున ఉన్న బ్రిడ్జిలను దాటుకుంటూ చేసే ఆహ్లాదకరమైన జర్నీ ఇది. వచ్చే బోటుకు, పోయే బోటుకు హాయ్‌ చెప్పుకుంటూ వాటర్ జర్నీ ఎంజాయ్‌ చెయ్యోచ్చు. సింగపూర్లో మరో విశేషమై ప్రదేశం డ్రాగన్‌ బోట్‌రేస్‌. సింగపూర్‌ మద్యలో ఉన్న నదిలో బోట్‌ రైడింగ్‌ పోటీలు నిర్వహిస్తరు. ఇందులో గెలిచినవారికి పతకాలు, బహుమతులు అందజేస్తరు. సింగపూర్లో ఈ పోటీలకు అత్యంత ఆదరణ లభిస్తది. సింగపూర్‌ భవనాలు విశ్వకర్మ సృష్టించాడా అన్నంత అందంగా ఉంటయి. ఖాళీ ప్రాంతం ఉంటే చాలు పచ్చిక బయళ్లతో నింపేస్తరు. విశాలమైన రోడ్లు. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌, పాదచారులకు సౌకర్యంగా ఉంటది. సింగపూర్‌ వెళ్లిన వాళ్లు బస చేయాలంటే రాజభవనాల్లాంటి హోటళ్లు సిద్దంగా ఉంటయి. ఇక్కడి హోటళ్లన్నీ టైమ్‌ మిషన్‌లంటే నమ్మండి. మోడ్రన్‌ లుక్‌లో ఉన్నా పురాతన చరిత్రను అడుగడుగునా కళ్లకు కట్టే ప్రయత్నం చేస్తరు ఇక్కడి వాళ్లు. రాజభవనంలా ఉండే రాప్లెస్‌ హోటల్ కు వెల్లడం ఓ అనుభూతి. ఈ హోటల్ ఎన్నో ఏండ్లసంది పర్యాటకులను ఆకట్టుకుంటది. ఇది కట్టి ఎన్నో ఏండ్లయినా హోటల్లో కొత్తగానే కనిపిస్తది. అంత రిచ్ గా మేనేజ్‌ చేస్తరు. హోటల్ గోడలపై చరిత్రక, సాంస్కృతిక ఆనవాళ్లు తెలిపే చిత్రాలు ముద్రించిండ్రు.సింగపూర్‌కు సింగారాన్ని తెచ్చిపెట్టేది ఆర్కిడ్ గార్డెన్‌. వర్ణాలన్నీ కలబోసి ఈ తోటలోనే కుమ్మరించారా అన్నట్టుంటయి ఇక్కడి పూలు. ఎన్నెన్నో వర్ణాల పూలు తేటి ముద్దలతో తడిసి ముద్దయితుంటయి. ఈ గార్డెన్ మద్యలో ఉన్న కొలనులో అన్ని వర్ణాల చేపలు జలపుష్పాల్లా కవ్విస్తుంటయి.తోటలో గడియారం చూపరులను ఆకట్టుకుంటది. సాధు జంతువులంటే ఎవరు మాత్రం ఇష్ట పడరు చెప్పండి. సింగపూర్‌ జూలో ఉన్న జంతువులను చూస్తే మీక్కూడా వాటితో కాసేపు కబుర్లాడాలనిపిస్తది. చిలుకలను చూసి ముచ్చట్లాడాలని పిస్తది. చిట్టి, చిట్టి జలపాతాలను చూసి సేదాతీరాలనిపిస్తది. పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకునే ప్రదేశాలలో జూ కూడా ఒకటి. సింగపూర్‌ జూలో చింపాంజీల చిలిపి చేష్టలు నవ్వు తెప్పిస్తయి. పర్యాటకులు వీటిని ముద్దు చేస్తరు. మొసళ్లు, తాబేళ్లు, ఉబయచరాలు, కొంగలు, ఒకటేమిటి రకరకాల పక్షులు, ఎన్నో రకాల జంతువులు మనల్ని పలకరిస్తయి.తామరాకుల పై నీటి బిందువులు వజ్రపు తునకల్లా మెరిసిపోతుంటయి. కలువల కొలనుల్లో సూర్యుడు జలకాలాడుతున్నట్టు సూర్యకిరణాలు నాట్యం చేస్తయి. మనం బయట చూడలేని ఎన్నో జంతువులను ఇక్కడ చూడొచ్చు.జూ లో నడిచి చూడలేని వారు ట్రైన్‌ ఎక్కి జూ మొత్తం కలియ తిరగొచ్చు.సింహాలు, జీబ్రా, ఖడ్గ మృగాలు, చూడముచ్చటగా ఉంటయి. వింతైన అడవి జంతువులు. మనం ఎప్పుడూ చూసెరుగని ఎన్నెన్నో జంతువులు ఇక్కడ కనిపిస్తయి. ఏనుగుల సందడి, సీల్, కంగారుల సయ్యాటలు. చలికి వణికే చిగురాకులు ఎంత సేపు చూసినా తనివి తీరని అందం ఈ పార్క్‌ది.సింగపూర్‌ కల్చర్‌ డిఫరెంట్‌గా ఉంటది. భిన్నత్వంలో ఏకత్వం అనే మాట సింగపూర్‌కు సరిగ్గా సరిపోద్ది. ఎందుకంటే ఇక్కడ ఇండియా, అరబ్‌ కంట్రీస్‌, చైనా దేశాల నాగరికతలు కూడా కనిపిస్తయి.
చైనాటౌన్, లిటిల్ ఇండియా, అరబ్‌ స్ట్రీట్‌లు సింగపూర్‌లో చూడవలసిన వాటిలో ప్రధానమైనవి. చైనాటౌన్‌లో కెళితే సింగపూర్‌లో ఉన్న ధ్యాసే ఉండదు. ఇక్కడ షాపింగ్‌, సంప్రదాయాఉ, ఆచార వ్యవహారాలు మొత్తం చైనా మయమే. చైనా సంస్కృతికి ఈ టౌన్‌ అద్దం పడతది.
సింగపూర్‌లో మరో చూడచక్కటి ప్రదేశం మయమ్మన్‌ టెంపుల్. ఈ టెంపుల్‌లో అడుగు పెడితే భారతీయత ఉట్టిపడతది. కాసేపు సింగరేణిలో ఉన్న సంగతే గుర్తురాదు. ఈ దేవాలయ గాలిగోపురాల పై దేవతా మూర్తులు కొలువుదీరి ఉంటయి. పూజారుల హడావుడి, ఆడపడుచుల ఆరాటం. పెళ్లి సందళ్లు... ఇవన్నీ చూస్తుంటే సింగపూర్‌లో ఇండియాను చూస్తున్నట్టుంటది.దేవాలయ ప్రాకారాల నిండా రామాయణ, మహాభారత, భాగవత కథలు చెక్కించిండ్రు.అరబ్‌ స్ర్టీట్‌ అరబ్‌ సంస్కృతికి అద్దం పడతది. ఈ స్ట్రీట్లో అరబ్‌లకు కావలిసిన అన్ని రకాల వస్తువులు దొరుకుతయి. మోజు పడ్డ వస్తువులను ముచ్చటగా సొంతం చేసుకోవాచ్చు.చిట్టి చిలుకలు, ఎండ పొడకు మిలమిల మెరిసే నీటి కొలనులు, మురిపించి మాయమయ్యే రంగురంగుల చేపలు. ఇవన్నీ ఒక్కచోట కనిపించే చోటే జరంగ్‌ బర్డ్‌ పార్క్‌. ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ వెళ్లాలని పించే పార్క్‌ ఇది.సింగపూర్‌ జరంగ్‌ బర్డ్‌ పార్క్‌ కంటి చూపు తిప్పుకోనీయదు. ఇక్కడ వింత వింతైన పక్షులు కనువిందు చేస్తయి. పార్క్‌ మద్యలో చిట్టి జలపాతం, సింగిల్‌ ట్రాక్‌ పై వెళ్లే మినీ రైలు, ఎంత బాగుంటయో...కొలనులో జలకాలాడే బాతులు..అలల పై తేలియాడే పూల గుత్తులు. అందమైన లోకం ఇది. పర్యాటకులు తమ కెమేరా కళ్లల్లో బందించాలను తాపత్రయపడ్తరు.కలువలను జలపుష్పాలను కొంగలు పలకరిస్తయి. సయ్యాటలాడుతుంటయి. పనిలో పనిగా దొరికిన చేపలను గుటుక్కుమనిపిస్తయి. ఎర్రటి కొంగలను చూస్తే కూసింత కళాపోషణ గుర్తొస్తది. సిందూర నదిలో అభ్యంగన స్నానం చేసొచ్చాయా.. అన్నట్టుంటయి ఈ ఎర్రటి కొంగలు.ఈ చిలుకలను చూస్తే ఎవరైనా చిన్న పిల్లలై పోవడం ఖాయం. ఎన్నెన్నో వర్ణాల చిలుకలు మనలను ప్రకృతి ఒడిలో మైమరచిపోయేలా చేస్తయి. సింగపూర్లో మరో ముచ్చటైన ప్రదేశం చైనీస్‌ గార్డెన్‌. సంప్రదాయ నాగరికతను కళ్లకు కట్టే ప్రదేశం ఇది. టేస్ట్ ఉన్న వాళ్లకు ఇక్కడే చిరకాలం ఉండాలనిపిస్తది. ఇటువంటి గెస్టహౌస్‌ కట్టించుకుంటే బాగుండనిపిస్తది. అవును మరి చైనీస్ గార్డెన్‌ అంత సుందరమైనది. చూస్తే మీరే చెప్తరు.చైనీస్‌ గార్డెన్‌ ఒక సుందమైన ప్రదేశం. పెద్ద పెద్ద భవంతులు చూస్తే అవాక్కయి పోవడం ఖాయం. గార్డెన్‌ అణువణువునా అందమైన మొక్కలతో అలంకరించి ఉంచుతరు. బోన్సాయ్‌ మొక్కలు చిన్న చిన్న కుండీల్లో తమ పెద్దరికాన్ని ఒలకబోస్తయి. ఎంతసేపు చూసినా తనివి తీరని అందం చైనా గార్డెన్‌ది. పురాతన చెట్లు, ఈత కొలను, సేదతీరాలను కునే వారికి ఇది మంచి చోటు. గార్డెన్‌ మద్యలో విగ్రహాలుంటయి.చిన్న చిన్న కాలువలు, పచ్చని పచ్చికలు ప్రేమికులకు పొదరిల్లులా అనిపిస్తది. మనసైన తోడు చెంతనుంటే లోకాన్ని మరిచి ఎంజాయ్‌ చేసే చోటు ఇది. సొగసైన ఈ గార్డెన్‌లో ఉబయచరాలు సందడి చేస్తయి. సెంతోసా ద్వీపం. ఈ ద్వీపానికి కేబుల్ కారులో ఒక దారిలో వెళ్ళవచ్చు. తిరిగి రావడానికి బస్సురూటును ఉపయోగించుకుంటరు. సింగపూరులో భాగమైన సెంటోసా ద్వీపంలో సింగపూరు జాతీయ చిహ్నమైన మెర్ మెయిడ్ కింది సగ భాగము చేప, పై సగ భాగము సింహముతో ఉంటుంది. ఈ మెర్‌ మెయిడ్‌ను చూడటం మరచిపోలేని అనుభూతిగా మిగిలిపోతుందనడంలో ఆశ్చర్యం లేదు సందర్శకులను మెర్ మెయిడ్ తలభాగమువరకు లిఫ్ట్‌లో తీసుకు వెళతారు. ముందుగా ఒక చిన్న ప్రదర్శన ఉంటుంది .ఇక్కడ సంప్రదాయక భవనంలో సింగపూరు చరిత్రను లేజర్ షో సహాయంతో ప్రదర్శిస్తారు. అతి సహజమైన పరిస్థితిలో జీవము ఉట్టిపడే బొమ్మలతో నావ ప్రయాణము, నావికులు, వర్తకము అనేక సంప్రదాయాలు ప్రతిబింబించే బొమ్మలతో కూడిన ప్రదర్శనశాలను సందర్శకులు చూడొచ్చు
ఇక్కడ చూడవలసిన పర్యాటక ప్రాంతాలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది "అండర్ సీ వరల్డ్". భూగర్భంలో ఏర్పాటు చేసిన ఈ అండర్ సీ వరల్డ్‌లో అనేక సముద్ర ప్రాణుల్ని సజీవంగా చూసే ఏర్పాటు ఉంది. ఇక్కడ రాత్రివేళలో అద్భుతమైన లేజర్ షోలు జరుగుతూ ఉంటాయి. వాటిని చూస్తూ కాలాన్ని మరచిపోతం.
సింగపూర్‌ అందాలు చూసి మీరు కూడా ఎంజాయ్‌ చేశారు కదా. మీకు కూడా ఈ సమ్మర్లో సింగపూర్‌ వెళ్లాలనుందా... అయితే ఇంకెందుకాలస్యం బయలుదేరండి... ఎలా వెళ్లాలి...ఎంత ఖర్చవుతది అనేగా మీ డౌట్‌... అయితే ఇదిగో ఇటో లుక్కేయండి.

పల్లె పాటగాడు జయరాజ్ గురించి

తెలంగాణ గడ్డ పాటలకు పెట్టని కోట. ఇక్కడ మట్టి పొరల్లో పాటలు ప్రవహిస్తుంటయి. మాటలంత తేలికగా పాటలు పుడుతుంటయి. జనం నోళ్ళల్లో మాటలు, పాటలు కలిసి సహజీవనం చేస్తుంటయి. అట్లా ఊటలయిన పాటలకు పోరాట శక్తిని అందిస్తున్నది తెలంగాణ పాటగాళ్ళే. జనం పాటల బాణీలను తీసుకొని ఉద్యమ స్ఫూర్తిని నింపి తిరిగి జనానికి ఆ పాటలను చేర్చడంలో ప్రజా వాగ్గేయకారుల పాత్ర మరువలేనిది. అలాంటి ప్రజావాగ్గేయకారుల్లో పదునెక్కిన గొంతుక, జబర్దస్త్‌ పాటల జంగ్‌ సైరన్‌ జయరాజుతో ఈ వారం మాటాముచ్చట... మీ కోసం....
జయరాజ్‌... నీటి చెలిమల్లాంటి తియ్యనైన పాలల్లినోడు. చెట్టు పుట్టలను పాటల్లో ఒంపుకొని పల్లెతల్లిని పలకరించినోడు. వరంగల్‌ జిల్లా మహబాద్‌ మండలం గుమ్మనూర్‌లో పాటైపుట్టిండు. తల్లి చెన్నమ్మ, తండ్రి రాజయ్య. చదువంతా ఖమ్మం జిల్లా బయ్యారం మండలం గంధంపల్లిలో సాగింది. విద్యార్ది దశ నుంచే ప్రశ్నించడం నేర్చుకున్న పోరుశాలి జయరాజు. విద్యార్ది నాయకుడిగా కళాశాల, హాస్టల్ సమస్యల పై పోరాడిండు. డిగ్రీ పూర్తి చేయకముందే జయరాజును ఉద్యోగం వరించింది. సింగరేణిలో ఫిట్టర్‌ కొలువు చేసినా పోరాట బాటను వీడలేదు. సింగరేణి కార్మికుల సమస్యల పై పోరాడే క్రమంలో లాఠీ దెబ్బలను తిన్నడు. ఎన్నోసార్లు జైలు గడపతొక్కిండు. జైలుకు వెళ్లినా అక్కడ కూడా ఖైదీల సమస్యల పై పోరుచేసిండు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నెలరోజులు చేసిన సమ్మె సింగరేణి చరిత్రలోనే ఓ కొత్త అధ్యాయానికి తెరలేపింది. ప్రభుత్వం సామధానభేద దండోపాయలు ప్రయోగించింది. ఆఖరుకు ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రలోభ పెట్టిండ్రు. అయినా జయరాజ్‌ తన పంథా వీడలేదు. పేదలకై బుట్టి పాటలు కైగట్టినోడు.. పాటగానే పుట్టి పాటల్లో పదంలా బతికాలన్నదే జయరాజు ఆశ..శ్వాస.సుకవి జీవించు ప్రజల నాలుకలందు అన్న కవి మాటలకు జయరాజే నిలువెత్తు సాక్ష్యం. జయరాజ్‌ కదిలే పాటల ప్రవాహం. పల్లెపాటలను ఒళ్లంతా నింపు కున్న మర్మయోగి జయరాజు. కల్మశం లేని ఆయన కలం నుంచి జాలువారే పాటలు జీవనదిలా సాగిపోతుంటయి. తన స్నేహితుడు చేరాల కనుమూసినపుడు “ నిన్నెట్టా మరిచిపోదును చేరాల..’ అన్న పాట ఆయన కలం నుంచి పట్టిన తొలి పల్లవి. కాచినపల్లి ఎన్‌కౌంటర్‌ పై రాసిన పాట ప్రతి హృదయాన్ని కదిలించింది. ఈ పాట విన్న ఏ తల్లికైనా... ఏ చెల్లి కైనా కన్నీటి చెమ్మ రావడం ఖాయం. “ ఎక్కడ ఉన్నారో అన్నలు... యాడా ఉన్నారో... నింగీలోన తొంగి చూసే చుక్కలైనారో..’ ఈ పాట జయరాజును లోకాని పరిచయం చేసింది. ఆయన కలం నుంచి తొణికిన ప్రతి పదమూ పాటై పలికింది. చెలకల్లో లేని నీళ్లు రైతు కళ్లల్లో చూసి జయరాజు రాసిన వానమ్మ పాట.. కరువుతో అల్లాడే ప్రతి పల్లెలోన, పనిపాటల్లోనా కష్టజీవికి తోడైనిలిచింది. నీల్లోసుకున్న కంకి నీళ్లాడలేక పాయే అన్న పదం, గుండె గల్ల ఎవరినైనా కదిలిస్తది. అంత సక్కని పాట వానమ్మ పాట. చెంగు చెంగున ఎగిరే కోడె దూడలు కటికోడి కొట్టుకు చేరుతున్నయని వలపోస్తడు జయరాజు. వంద మాటల కంటే ఒక పాట చాలా గొప్పదన్న స్పృహ ఉన్నోడు కాబట్టే...పాట జనం నాడి పట్టుకొని... దశాబ్దాలు గడిచిన వన్నెతరగని పాటలు రాసిండు. అనేక ఉద్యమాలకు సాంస్కృతిక సైనికుడై పనిచేసిండు.
జయరాజు సింగరేణిపోరాటాలకు సైరనై మోగిండు. ఫలితంగా రాజ్యం అతని మీద కక్ష గట్టి , లాఠీ దెబ్బలు, దొంగకేసుల రుచి చూపించి అనేక సార్లు జైలుకు పంపింది. అయినా ఆ గొంతుక పోరుబాటను మాత్రం వీడలేదు. పోరాట పాటలు రాయడం మాత్రం వదలలేదు. అనేక ఉద్యమ పుట్టుకల్లో , పయానాల్లో ముందుండి పోరాడిన నాయకుడు, గాయకుడు తాను. విప్లవోద్యమం బలంగా ఉన్న రోజుల్లో ప్రజలను ఆ పోరాటాలకు మద్దతు కూడగట్టినయి జయరాజు పాటలు. రక్తం ఉడికి, కడుపు రగిలిన తనం తన పాటలంతట కనిపిస్తది. తెలంగాణ బతుకు ఛిధ్రమైన జాడను పాటల్లో పట్టి చూపించిండు.ప్రజల గుండెల్లో చిరకాలం యాదికుండే పాటలు రాసిన జయరాజు విప్లవోద్యమ దృష్ఠితో అనేక పాటలకు ప్రాణం పోసిండు. పోరాడకుంటే బతుకు మారదని, ప్రజలకు దోపిడి మర్మాన్ని విప్పి చెప్పిండు. జయరాజు పాటలు ప్రజలను ఉద్యమ బాటలో నడిపిస్తయి. అంతేకాదు ప్రజలకు చదువు ఎంత ముఖ్యమో తెలుపుతూ అక్షరోద్యమ సమయంలో అద్భుతమైన పాటలు రాసిండు. ఆ పాటలు చదువురాని అనేకమందికి చదువుపట్ల ఆసక్తి కలిగేటట్టు చేసినయి. జయరాజు రాసిన పాటలు అక్షర దీపాలైనయ్‌. ఆరిపోని నిప్పు కణికలైనయి.జయరాజు రాసిన పాటల్లో దేని ప్రత్యేకత దానిదే. ప్రతీ పాట ఒక సమగ్రమైన కళాఖండంగా నిలిచింది. “జోలాలీ’’ పాటవింటే వందకోట్ల భారతీయుల కన్నీటి కథ మన కండ్లముందుంటది. ఇంకేమి మారిందరా అని తెలంగాణ గోసను పాటగా ప్రశ్నించే తీరుకు ఒంటి మీది రోమాలు కత్తులవుతయి. జయరాజు పాటల్ల గోడాడే తండ్లాట అట్లా కండ్లముందటికొత్తది. ఆకలి, పేదరికం,నిరక్షరాస్యత, నిరుద్యోగం, పాలకుల పీడనవంటి దీర్ఘకాలిక సమస్యలను పాటగట్టి జనాన్ని పోరుబాట పట్టిచ్చిండు.పల్లె గురించి, తల్లి గురించి, ఉద్యమం గురించి, అక్షరం గురించి, ప్రభుత్వ దుర్మార్గాల గురించి...పడావుపడ్డ భూముల గురించి విభిన్నమైన వస్తువులతో పాటలల్లిన ఘనత జయరాజుది. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలన్న కవి హృదయం తనది. అంతేకాదు వివాహ వ్యవస్థలో లోపాలను, స్త్రీ పడే జీవితకాలపు వేదనను పదాలకు ఎక్కించిన ఉద్యమ గొంతుక జయరాజు. ఉద్యమ రచయితలు స్పృశించని అనేక విషయాలను పాటగా మలిచి తనకాలపు పాటకవుల్లో తనదైన ముద్రను నిలుపుకున్నోడు జయరాజు.జయరాజు రాసిన పాటలు వెండితెరకు కూడా ఎక్కినయ్‌. కొంత కాలం క్రితం వచ్చిన అడవిలో అన్న సినిమాకు హైలెట్‌గా నిలిచిన వందనాలమ్మ పాటను రాసింది జయరాజే. మాస్‌ సినిమాల్లో మైలురాయిగా నిలిచిన దండోరా సినిమాలో ఆణిముత్య గీతమైన కొండల్లో కోయిల పాటలు పాడాలి అనే పాట రాసిందీ జయరాజే !

Wednesday, April 14, 2010

చిలుకూరు బాలాజీ చరిత్ర


జనార్దన్‌
తెలంగాణలో అతి పురాతన దేవాలయాల్లో చిలుకూరు బాలాజీ టెంపుల్‌ ఒకటి... ఈ దేవాలయానికి అత్యంత పురాతన చరిత్ర ఉంది...చిలుకూరు వెంకటేశ్వరుడు వందల ఏండ్ల సంది ఇక్కడ పూజలందుకుంటున్నడు.
చిలుకూరు బాలాజీ... ఈపేరు చెబితే తెలంగాణ జిల్లాల్లో భక్తులంతా ఆ దివ్యమూర్తిని తలచుకొని పులకించి పోతరు. అంతటి మహత్‌చరిత్రగల్ల దేవాలయం ఇది. ఒక్క తెలంగాణ నుంచే కాదు దేశం నలుమూలల నుంచి ఇక్కడకొచ్చి భక్తులు తమ కష్టాలు స్వామితో మొర పెట్టుకుంటరు. ఆపద మొక్కుల వాడని కీర్తిగడించిన వేంకటేశుడు తమ ఆపదలు గట్టెక్కిస్తడని భక్తుల నమ్మకం.
లక్షలాధి భక్తుల పూజలందుకుంటున్న ఈ దేవాలయం ఇప్పటిది కాదు. తెలంగాణలో ఉన్న అతిప్రాచీన పుణ్యక్షేత్రాలలో ఇదొకటి. దీనికి సూమారు 500 ఏండ్లకు పై బడ్డ చరిత్ర ఉంది. హైదరాబాద్‌సంస్థానాన్ని నిజాం నవాబులు పాలించే కాలంలో ఈ దేవాలయాన్ని కట్టించిండ్రట. రామదాసు మేనమామలు అక్కన్న, మాదన్నల కాలంలో ఈ గుడి కట్టించిండ్రు. సర్వమత ఆదరణ ఉన్న కాలంలో నిజాం ప్రభువుల ఆదరణతో ఈ దేవాలయాన్ని నిర్మించిండ్రు.ఈ దేవాలయం కట్టడం వెనక ఒక భక్తి కథ ఉంది. భక్తుడికోసం ఆ దేవదేవుడే ఏడుకొండలు దిగి వచ్చిన సంఘటనలు మనం పురాణాల్లోనే వింటం. కానీ వాస్తవజీవితంలో ఇది కనీ వినీ ఎరగం...కానీ చిలుకూరులో భక్తుని కోసం భగవంతుడే దిగి వచ్చిండు..కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశుడంటే మాధవరెడ్డి అనే భక్తుడికి ఎంతో ప్రీతి. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా తిరమల వెళ్లి ఆ ఏడుకొండలవాడి దర్శనం చేసుకుంటడు. క్రమం తప్పకుండా తిరుమల వాసుణ్ని దర్శించుకొనే మాధవరెడ్డికి ఆ యేడు చెప్పరాని కష్టమొచ్చిపడింది. మంచాన పడి లేవలేని పరిస్తితి. అయినా తన ఇష్టదైవం తిరుమల వాసుణ్ణి దర్శించుకొని తీరాలని పట్టుబట్టిండు. అనుకున్నదే ఆలస్యం తిరుమలకు బయలెల్లిండు. కొంతదూరం నడిచిండో లేదో నీరసంతో స్పృహ తప్పి పడిపోయిండు. తానిక తిరుమలేశుణ్టి చూడకుండానే కన్నుమూయాల్సి వస్తుందనే బెంగ పట్టుకుంది మాధవ రెడ్డి. ఒంట్లో సత్తువంతా మాయమై పూర్తిగా అపస్మారక స్తితికి వెళ్లిండు. భక్తుని తపనకు ఆ భక్తునికి ఆ భక్తలోలుడు స్వప్నమందు దర్శనమిచ్చిండట. తన వద్దకు రాలేనందుకు బాధ పడవద్దని. దర్శనం చేసుకోవలనుకున్న భక్తుని పట్టుదలకు మెచ్చి తానే ఈ ప్రాంతంలో వెలుస్తున్నానని అభయం ఇచ్చిండు. దగ్గరలో ఉన్న పుట్టలో తన విగ్రహమూర్తులు కొలువై ఉన్నయని, దేవుడు వెలసిన ఆనవాళ్లు చెప్పి అంతర్దానమయిండు. వెంటనే మెలకువ వచ్చిన భక్తుడు ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలిపిండు. గ్రామస్తుల సాయంతో కలలో స్వామి తెలిసిన ఆనవాళ్ల ప్రకారం అడవిలో ఉన్న పుట్టను దొరికిచ్చుకొని ఆపుట్టను తవ్వి చూసిండ్రు. కొంత పుట్ట తవ్వగానే కంగుమనే శబ్దం వినిపించిందట. పలుగు తీసి చూస్తే పలుగు కొనకు రక్తం అంటింది.దీంతో గ్రామస్తులు భయంతో వణికిపోయిండ్రు. అంతలో మాధవరెడ్డిక ఒక అదృశ్యవాణి వినిపించింది. ఆ పుట్టలో ఉన్న విగ్రహానికి పాలాభిషేకం చేస్తే ఆ రక్తస్రావం తగ్గుతదని ఆకాశవాణి వినిపించింది. వెంటనే ఆ పుట్టలో పాలుపోయగా శ్రీవెంకటేశ్వరుడు భూదేవి, శ్రీదేవి సమేతంగా కనిపించిండట. పలుగు గాయం తాలూకూ గుర్తుల గడ్డం పైనా ఎడమ కనుబొమ్మ పైనా కనిపించిందట. అచ్చు తనకు కలలో కనిపించిన స్వామి లాగే ఉండటంటే మాధవరెడ్డి పరమానంద భరితుడైనడు. వెంటనే గ్రామస్థులంతా కలిసి దేవాలయ నిర్మాణం చేపట్టిండ్రు. భక్తులు కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరడంతో ...చిలుకూరుకు భక్తుల తాకిడి ఎక్కువయింది. ఈ విషయం ఆనోటా ఈ నోటా పాకి తెలంగాణ మొత్తం పాకింది. దీంతో స్వామి మహిమలు తెలిసిన ప్రజలు వేలాదిగా వచ్చి స్వామి దర్శించుకుంటున్నరు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఆదరణ కొనసాగుతనే ఉంది.
భగవంతుని దృష్టిలో అందరూ సమానులే అన్న విషయం ఇక్కడ అచ్చుగుద్దినట్టు పాటిస్తరు. స్వామిని దర్శించుకునేందుకు ధనిక పేదా అనే తేడాలేదు. ఇక్కడ ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు అనే తేడా లేదు. అందరికీ ధర్మదర్శనమే దారి.భక్తులు కోరికలు తీరుస్తూ మానవ జాతిని తరింప చేస్తూ చిలుకూరు స్థావరంగా వెలసినాడు ‌శ్రీవెంకటేశుడు. “అజ్ఞానినా మయాదోశా అశేషా నిహితాన్‌ హరే..క్షమస్తత్వం క్షమస్తత్వం చిలుకూరు శిఖామణే’ అని కొలిచిన భక్తులకు కోరిన వారికి కొంగు బంగారమై కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా ఇలలో వెలిసిన స్వయం భూ మూర్తి చిలుకూరు బాలాజీ.. మానవజాతి జీవన గమనంలో కారణచక్రం నుంచి విడివడి ఆ పరమాత్ముని చేరే మార్గమే చిలుకూరు వేంకటేశ్వరుడు. వెంకట అంటే సంకటాలు హారించే వాడని సంస్కృతార్దం. ఇలలో మనం కోరే ధర్మమైన కోరికలు తీర్చి భక్తులను తరింపజేస్తడు చిలుకూరు బాలాజి. దేవుడి దర్శనానికి వెళితే చుక్కలు కనిపించే రోజులివి. కష్టాలు తీర్చమని దేవుడికి చెప్పాలన్నా ముందు కడివెడు కష్టాలెదుర్కోవాలి. అడుగడుగున పైకం అందితేనే స్వామి దర్శనం అవుతది. కానీ చిలుకూరు దానికి పూర్తిగా విరుద్దం. పైసామే పరమాత్మ అన్న మాటను తిరగరాసిన దేవాలయం చిలుకూరు దేవాలయం.ఈనాడు దేశంలోని చాలా ఆలయాలు వ్యాపార కేంద్రాలుగా మారాయి. స్వామిని దర్శిచడానికి టికెట్‌, కొబ్బరికాయ కొట్టడానికి టెకెట్‌, అర్చనకు టికెట్‌, ప్రసాదానికి టికెట్‌. ఈ టికెట్‌ల ఇక్కట్లు భారత దేశంలోని ప్రతి ఆలయంలోనూ తప్పవు కానీ చిలుకూరులోని స్వామిని దర్శించేందుకు టిక్కెట్ల ఇక్కట్లుండవు. గుడిలో హుండీలుండవు. చందాలు కూడా అడగరు. ఇక్కడ ప్రదక్షణలు తప్ప దక్షణ స్వీకరించరు. టిక్కెట్లు లేక, చందాలు లేక, హుండీలు లేక ఆలయ నిర్వహణ ఎలా సాగుతుందనేది అందరి మదిని తొలిచే ప్రశ్న. కానీ దేవాలయ తరపున వాక్‌ అనే పత్రిక నడుపుతరు. ఆ పత్రిక ద్వారా వచ్చే ఆదాయమే ఈ గుడి నిర్వహణకు వాడతరు. లక్ష్మీ పతికి మనం ఏమివ్వగలం...భక్తితో ఒక నమస్కారం తప్ప..పత్రం పుష్పం ఫలం తోయం అని ఆ దేవదేవుడే సెలవిచ్చాడు కదా..తాము కోరుకున్న కోరికలు తీరాలంటే ముందుగా స్వామి వారికి 11 ప్రదక్షిణలు చేస్తరు. తమ మనసులో ఉన్న కోరికలు స్వామివారికి చెప్పుకుంటరు. స్వామి వారిని దర్శించుకొనేటప్పడుకళ్లు మూయకూడదనే నిబంధన కూడా ఇక్కడ పాటిస్తరు. తమ కోరికలు నెరవేరినంక 108 ప్రదక్షిణలతో తమ మొక్కు చెల్లించుకుంటరు. ఇక్కడ కోరికలు కోరుకునే ముందు 11 ప్రదక్షిణలు, కోరికలు తీరాక 108 ప్రదక్షిణలు చేయడం వెనక ఒక సంఘటన ఉందని చెప్పుకుంటరు. స్వామీవారికి గుడి కట్టిన కొత్తలో స్వామి వారి అభిషేక జలంగా దగ్గరలో ఉన్న చెరువు నీటిని వాడేవారు. తర్వాత కొంత కాలానికి ఆ చెరువు ఎండి పోయింది. తర్వాత ఎన్నేళ్లయినా ఆ చెరువులోకి నీటి చుక్క రాలేదు. స్వామి కైంకర్యానికి నీరు కరువయింది. నీటి ఎద్దడి భక్తులను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేసేది. దీంతో ఆలయ అర్చకులు ఎన్నో బోర్లు వేయించి విఫలయత్నం చేశారు. సుమారు 300 అడుగుల లోతు తవ్వించినప్పటికీ నీటి జాడ కనిపించలేదు. నాలుగు చోట్ల తవ్వించి ఇక తమ వల్లకాదని నీటి ప్రయత్నం వదిలేశారు. ఒక రోజు ఒక భక్తుడు తాను స్వామి వారికి బోరు తవ్వించేందుకు సహకరిస్తనని, బోరు తవ్వించడాని అయ్యే ఖర్చులో సగం తాను భరింస్తానని హామీ ఇచ్చి ఆఖరు ప్రయత్నం చేయమని ప్రోత్సహించిండు. దాంతో ఆలయ ప్రధాన పూజారి గోపాలకృష్ట నీరు పడాలని గుడి చుట్టు ప్రదక్షణలు చేయనారంభించిండు. 11వ ప్రదక్షణ చేయగానే బోరులో నీళ్లు పడ్డట్టు గోవులు కాసే పిల్లవాడు కబురు చెప్పిండట. ఆ తరువాత ప్రదక్షిణలు నిలిపేస్తే ఎక్కడ నీటి ధార ఆగిపోతుందోనని అలాగే 102 ప్రదక్షిణలు చేసిండట. అప్పటికి పుష్కలంగా నీరు పడ్డప్పటికీ బోరుఇంజన్‌ రిబ్‌ బోరుబావిలో ఇరుక్కుందట. రిబ్‌ తీస్తేగానీ నీరు రాదని చెప్పడంతో ఆలయ పూజారి మిగతా ఆరు ప్రదక్షణలు పూర్తి చేసి స్వామి వారికి మొక్కుకోగానే రిబ్‌ బయటకొచ్చిందన్న వార్త పూజారి చెవిన పడింది. అప్పటి నుంచి భక్తులు కోరికి కోరుకునే ముందు 11 ప్రదక్షిణలు కోరిక తీరాక 108 ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీగా వస్తుంది.ఇక్కడ స్వామి వారికి ఏటా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలను ప్రభుత్వం కట్టుదిట్టంగా జరుపుతది. ఈ ఉత్సవాలకు భక్తుల ఆదరణ కూడా ఎక్కువే. ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్‌ సర్వీసులను నడుపుతది.చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తరు. బ్రహ్మోత్సవాలకు గుడిని అందంగా అలంకరించి ఉత్సవమూర్తులను రథం పై ఊరేగిస్తరు. ఆలయ బ్రహ్మోత్సవాలకు కావలసిన ఏర్పాట్లను ప్రభుత్వమే చూసుకుంటది. ఉత్సవాల్లో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా గట్టి బందో బస్తు ఏర్పాటు చేస్తరు. గతంలో రెండు సిసి కెమేరాలు ఉండేవి. ఇందులో ఒకటి పూర్తిగా చెడిపోయింది. ఇప్పడు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నాలుగు సిసి కెమేరాలను అమర్చిండ్రు. ఇవి ఎప్పటి కప్పడు భక్తుల కదలికలను రికార్డు చేస్తవి.బ్రహ్మోత్సవాల సమయంలో ఆర్టీసి అదనపు బస్పులను నడిపిస్తది. వీటితో బాటు ఆటోలు ట్రాలీలతో ఆ ప్రాంతమంతా రద్దీగా కనిపిస్తది. స్వామివారి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు ఒక్క తెలంగాణ ప్రాంతం నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు ఇక్కడకు వస్తరు. ఈ బాలజీ దయతో వీసాలు పొందిన వారైతే ఖండాంతరాలలో ఎక్కడ ఉన్నా ఒక్కసారయినా బ్రహ్మోత్సవాలకు హాజరయితరు. బ్రహ్మోత్సవాలలో గుడి ప్రాంగణమే కాదు ఆ ఊరుఊరంతా సందడే సందడి.ఎక్కడ ఎక్కువ ప్రజాదరణ ఉంటదో అక్కడ రాజకీయం నిద్దరలేస్తది. ప్రజల సెంటిమెంట్‌ను సొమ్ము చేసుకోవాలని చూస్తరు. అశేషప్రజానికం చేత పూజింపబడుతున్న చిలుకూరు బాలాజీని కూడా రాజకీయ చీడ వదల్లేదు. అయినా ప్రజాప్రతినిధుల కపటనీతిని ముందే పసిగట్టి తిప్పికొట్టగలిగారు ఇక్కడి వారు.
ఇంతటి ప్రజాదరణ కలిగిన ఈ దేవాలయం పై కొందరు స్వార్ధ పరుల కళ్లు పడ్డయి. ఆలయ కమిటీలో స్థానం కొరకు ఫైరవీలు చేయించి తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మొదలు పెట్టిండ్రు. మరో పక్క ఎండోమెంటు బోర్డు ఆలయానికి కొన్ని నిధులు కేటాయించి, తమ స్వాధీనంలోకి తీసుకొని దాని ఆలనా పాలనతో బాటు దానిపై పూర్తి అధికారాలను కూడా హస్తగతం చేసుకోవాలని చూసింది. వారసత్వంగా దీనిపై హక్కుల పొందుతున్న పూజారులు దీనిపై కోర్టు గుమ్మం ఎక్కక తప్పలేదు. ప్రభుత్వానికి వ్యతిరేఖంగా పోరాడి పంథం నెగ్గించుకున్నరు. ఆలయంలో హుండీ ఉంటేనే ఎండోమెంట్‌ బోర్డు ఆజమాయిషీ చెలాయించుతదని, హుండీ తీసేశారు. దీంతో స్వామి వారికి లక్షలాదిమంది భక్తులున్నా సరైన ఆదాయం లేక నానా ఇబ్బందులు పడుతున్నది. ఇదీ తెలంగాణ తిరుమలగా వెలుగులీనే చిలుకూరు బాలాజీ ఆలయచరిత్ర. భక్తిమయమైన వెంకటేశుని మహిమ. మరో తెలంగాణ ఆలయంతో మళ్లీ కలుసుకుందాం.

Friday, April 2, 2010

పుష్పక విమానం నిజంగా ఉన్నట్టే నా....

విమానం కనిపెట్టిందెవరు? నిజంగా రైట్ సోదరులేనా? అంతకు ముందు అసలు గాలి మోటార్లూ లేనే లేవా? అన్ని మన వేదాల్లో వున్నాయష అంటూ ఆడిపోసుకుంటాం కానీ.. నిజంగానే విమాన పరిజ్ఞానం వేదాల్లోవుందట.. తాజా పరిశోధనలు తేల్చిన పచ్చినిజమిదే.. ఆ పరిజ్ఞానంతోనే ఆదికాలంలోని ఆర్యులు గగన విహారం చేశారట.. పురాణాల కాలంలోని వైమానిక విజ్ఞానంపై ఎబిఎన్ స్పెషల్ స్టోరీ.
రెక్కలు కట్టుకొని రివ్వున ఎగరాలనే కోరిక ఇప్పటిది కాదు.. ఆ మాటకొస్తే బుద్ధిజీవుడైనప్పట్నుంచే మనిషి
వుంటే అందులో ఆకాశంలో షికార్లు చేసిన ఘనులెవ్వరు? రెక్కలు కట్టుకొని రివ్వున ఎగరాలనే కోరిక ఇప్పటిది కాదు.. ఆ మాటకొస్తే మనిష
ఆకాశంలో ఎగిరే పక్షులను చూస్తే మనకూ రెక్కలు కట్టుకొని ఎగరాలనిపిస్తుంది. దూది పింజల్లాంటి మబ్బుల్లో తేలుతూ ప్రకృతిని ఆస్వాదిస్తూ పరవశించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆ కోరికలో నుంచి పుట్టిందే విమానం. విమానం గురించి వివరంగా తెలుసుకోవాలంటే పురాణాల్లోకి పరుగులు పెట్టాల్సిందే విమానం. ఈ పేరు వింటేనే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ అందరి మనసులూ గాలిలో ఎగిరుతున్న అనుభూతి. ఇంతకీ విమానాన్ని ఎవరు కనిపెట్టారని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఎంచెబుతారు? కాస్తో కూస్తో చదువుకున్న వారైతే టక్కున రైట్ బ్రదర్స్ అని చెప్పేస్తారు. కానీ ఇది రాంగ్ అంటున్నాయి మన పురాణాలు. అవును మరి మన దేశంలో పురాణ కాలంలోనే విమానాలు వాడారట. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.గగన విహారం భారతీయులకు కొత్తేమీ కాదు. కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగాల్లో మన పూర్వికులు అంతరిక్షంలో అవలీలగా తిరిగేవారట. ఈ విమానాలు గాలిలో, నీటిలో, భూమి పై కూడా వాయువేగంతో ప్రయాణించేవట. ఇలా చెబితే మన పూర్వికుల సాంకేతిక పరిజ్ఞానం గురించి గొప్పలు చెప్పుకుంటున్నామనో, బాకా ఊదుతున్నామనో అనుకుంటారు. కానీ వాస్తవాలు చూస్తే అసలు విషయం అర్దమవుతుంది. విమానం అనే పదం పుట్టింది పుష్పక విమానం అనే పదం నుంచే. పుష్పక విమానం అంటే తెలియని భారతీయులను వేళ్లపై లెక్కబెట్టవచ్చు. ఈ రోజుల్లోనయితే చెప్పలేం గానీ, మన తాత ముత్తాలు మాత్రం ఈ పుష్పక విమానాల గురించి కథలు కథలుగా చెబుతారు. తాము చనిపోయాక స్వర్గానికి ఈ విమానంలోనే వెళ్తామని తమ మనుమలకు చెప్పేవారు.ఈ పుష్పక విమానానికి ఒక స్పెషాలిటీ ఉంది. దీనిలో ఎంత మంది ఎక్కినా ఒకరికి చోటు మిగిలే ఉంటుందట. అదే దీని స్పెషాలిటీ. ఈ స్పెషాలిటీ సంగతి పక్కన బెడితే అసలీ విమానం కథా కమీషు ఏంటో చూద్దాం. పుష్పక విమానం ప్రస్తావన మన పురాణాల్లో, వేదాల్లోనే ఉంది. విశ్వకర్మ బ్రహ్మదేవుని కోసం ఈ విమానాన్ని తయారు చేశాడట. దీని తయారీకి తేలికైన లోహాలతో బాటు మణిమాణిక్యాలు కూడా వాడాడట. బ్రహ్మ ముల్లోకాలూ సంచరించేందుకు మనో వేగంతో ప్రయాణించే విధంగా దీన్ని రూపొందిచాడు విశ్వకర్మ. అనంతర కాలంలో కుబేరుడు తీవ్రంగా తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకొని ఆ విమానాన్ని వరంగా పొందాడు. కుబేరుని భాగ్యాన్ని చూసి అతని సోదరుడు రావణుడు అసూయ చెందుతాడు. కుబేరుణ్ణి యుద్దంలో ఓడించి రావణుడు పుష్పకవిమానాన్ని సొంతం చేసుకుంటాడు. రామరావణ యుద్దంలో రావణ సంహారం తరువాత ఈ విమానం విభీషణుడి వశమవుతుంది. ఈ విమానంలోనే సీతా సమేతంగా రామ లక్ష్మణులు, వానర సైన్యం అమోధ్యను చేరుకున్నారని పురాణ కథ. ఆ తరువాత ఈ విమానం విభీషణుడి వద్ద ఉందా ? లేక రాముడి సొంతమయిందా అనేది ఇప్పటికీ మిస్టరీయే.పురాణాల్లో చెప్పే విమానాలు కేవలం ఫాంటసీయేనా లేక నిజంగా ఉన్నాయా అనే డౌటు చాలా మందికి వచ్చింది. టెక్నాలజి అభివృద్ది చెందిన ఈ రోజుల్లోనే శాస్త్రవేత్తలు అంత వేగంగా ప్రయాణించేలా విమానాన్ని రూపొందించలేక పోయారు. మరి ఏ సూత్రాలను ఉపయోగించి వారు అన్ని సౌకర్యాలున్న, మనోవేగంతో ప్రయాణించే విమానాన్ని తయారుచేశారు. మన వాళ్లు దానికీ సమాధానం చెప్పారు.మన పూర్వికులు కేవలం మాయామంత్రాలతో విమానాలు నడిపారని అనుకుంటే అది కేవలం కట్టుకథ కింద కొట్టిపారెయ్యోచ్చు. కానీ వారు ఈ నేటి ఆధునిక కాలంలో ఎయిర్ క్రాఫ్ట్ లు నడపడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు, ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ కాకుండా ఎలా నడపాలనే విషయాలూ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఇంధనాన్ని ఎలా సమకూర్చుకోవాలో కూడా వివరించారు. విమాన తయారీ కొరకు అతి తేలికైన 16 రకాల లోహాలను కనుగొన్నారు. ఆమ్ల క్షారాను ఉపయోగించి కెమికల్ ఎలక్ట్రిసిటీ ఎలా ప్రోడక్ట్ చేయోచ్చో కూడా వివరించారు. విమానాన్ని మన పూర్వికులే ముందు ఉపయోగించారనడానికి ఆధారాలేంటి? కేవలం కట్టు కథలు, పుక్కిటి పురాణాలే దీనికి సాక్ష్యాలా?లేక శాస్త్రీయ ఆధారాలు ఏమైనా ఉన్నాయా అనే సందేహం అందరికీ వస్తుంది. దానికీ మన పూర్వీకులు వివరణ ఇచ్చారు.ఈ సందేహాలన్నీ మనకే కాదు ఆ కాలంలో కూడా వచ్చాయి. మనిషి గాలిలో ఎగరడం ఏమిటని విడ్డూరంగా చెక్కిలి పై చేయివేసుకున్నార అప్పటి వాళ్లు. అంతే కాదు ఇవన్నీ కట్టుకథలని కొట్టిపారేశారు. వీరందరి సందేహాలు నివృత్తి చేసేందుకే భరధ్వాజ మహర్షి వేల సంవత్సరాల క్రితమే ప్రయత్నించారు. వైమానికశాస్త్రం పేరుతో ఈ సందేహాలన్నిటికీ సమాధానాలు చెప్పడమే కాకుండా విమాన రహస్యాలు కూడా ఇందులో వివరించారు. విమానాలు ఎన్ని రకాలు. విమానాన్ని నడిపే వారికి ఉండాల్సిన నైపుణ్యాలు, ఆకాశంలో విమానాన్ని ఏఏ కోణాల్లో నడిపించాలి అనే వివిధరకాల అంశాలపై సమగ్రంగా వివరణనిచ్చారు. భరధ్వాజ మహర్షి తరువాత లల్లాచార్యుడనే శాస్ర్తవేత్త రహస్యలహరి అనే గ్రంధంలో మనకు అందించాడు.చూశారా ! ఇప్పటి వరకూ మనం పుష్పకవిమానం అంటే కథల్లో ఉండే ఊహాజనిత విమానమే అనుకునే వాళ్లం కానీ అది నిజమైన విమానమే అని మనలో చాలా మందికి తెలియదు.

బతుకమ్మ గురించి కాస్త తెలుసుకుందామా....

బతుకమ్మ...కల్లలెరుగని తెలంగాణ ప్రజల సంబరం...పల్లె పల్లెన కనిపించే మహోత్సవం.. వెల్లివిరిసే పూల సమ్మేళనం.. వెదజల్లే మట్టి పరిమళం.
బతుకమ్మ...ఒక అందమైన సంస్కృతిని ప్రతిబింబించే అపురూప దృశ్యం. యాంత్రిక జీవనంలో విసిగిపోయే మహిళలకు ఉల్లాసాన్ని మానసిక నవోత్తేజాన్ని అందించే పర్వదినం..

తెలంగాణ సాంస్కృతిక ప్రత్యేకతలున్న నేల. ఇక్కడి భాష, యాస, ఆచారాలు, వ్యవహారాలు అన్నింటిలో జానపద ముద్ర కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. పండుగలూ కూడా ప్రకృతి, వ్యవసాయం చుట్టూ అల్లుకుని వుంటాయి. బతుకమ్మ పండుగ అలాంటిదే!
బతుకమ్మ అచ్చంగా స్ర్తీల పండుగ. అలా కనిపిస్తుంది. భాద్రపద అమావాస్యకు చాలా ప్రాముఖ్యత వుంది. పెద్దల అమావాస్య అనీ.. పెత్తరమాస అని పిలుస్తుంటారు. కాలంతో పరుగెత్తడం అలవాటయ్యాక తిథులను గుర్తు పెట్టుకోవడం ఒకింత కష్టమే! అందుకే అందరూ ఈ రోజు తమ పెద్దలకు, పితృదేవులకు పండుగ చేస్తారు. పల్లె సంబరం బొడ్డెమ్మ పండుగతో మొదలవుతుంది. నిజానికి ఈ ప్రాంత వాసులకు ఇది ఒక పండుగ కాదు. నాలుగు పండుగల మేళవింపు. బొడ్డెమ్మ పండుగ, పెద్దల పండుగ, బతుకమ్మ పండుగ, దసరా పండుగ.. ఈ నాలుగింటిని వరుసగా జరుపుతారు. ఇది ఒకరోజు సంబరం కాదు.. ఇరవై రోజుల ఉత్సవం.
భాద్రపద పంచమి రోజున మగవాళ్లు వెళ్లి పుట్టమన్ను తెస్తారు. ఇక్కడి ప్రజల సంస్కృతిలో పుట్టమన్నుకు ప్రత్యేక స్థానం వుంది. ఇంట్లో కొత్త పొయ్యి వెయ్యటానికి కూడా పుట్టమన్నే వాడుతారు. దుర్గమ్మ పండుగకు పుట్టమన్ను తెస్తారు. పుట్టమన్ను తడిపి ఒక చిన్న పీట మీద చతురస్రాకారంలో గుడి గోపురం మీద అంతురాలు చేస్తారు. వాటికి వరుసగా రంధ్రాలుంటాయి. పీటకు నాలుగు దిక్కులా నాలుగు చదరపు ముద్దలుంటాయి. వాటికి ఒక్కొక్క రంధ్రముంటుంది. దీన్ని బొడ్డెమ్మ అంటారు. బొడ్డె అంటే చిన్న కుప్ప లేదా రాశి. నిజానికి ఇది మట్టి పూజ. ఉత్పత్తి అంటే పంట.. పునరుత్పత్తి అంటే సంతానం సవ్యంగా సాగాలని చేసే పూజ. సాయంత్రం బొడ్డెమ్మను అలుకుతో కాని జాజుతో కాని తీర్చి దిద్దుతారు. మట్టి రంధ్రాలలో రంగు రంగుల రుద్రాక్ష, గోరింట, ముద్దాన్న పూలు పెట్టి అలంకరిస్తారు. సంధ్యవేల కూడలిలోనో, పెద్ద వాకిట్లోనో నడుమ పేడతో అలికి ముగ్గు వేస్తారు. మధ్యలో బొడ్డెమ్మలన్నీ పెట్టి చుట్టూ తిరుగుతూ ఆడపిల్లలు ఆడతారు. చీకటి పడిందాక ఆడి బొడ్డెమ్మలు తీస్తారు. నిదురపో బొడ్డెమ్మ నిదురపోవమ్మా.. నిద్రకు నూరేళ్లు, నీకు వెయేళ్లు అని పాటలతో నిద్ర పుచ్చి ఎవరింటికి వాళ్లు తీసుకెళతారు. ప్రతి సాయంత్రం ఇలా కొత్త అలుకు రాసి కొత్త పూలు అలంకరించి తొమ్మిది రోజుల తర్వాత పండుగ చేస్తారు. చివరి రోజు ఆట తర్వాత బొడ్డెమ్మలను బావిలో వేస్తారు. బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక దర్పణం. తెలంగాణ ప్రజల జీవన విధానం అందులో ప్రతిబింబిస్తుంది. మానవసంబంధాలను నిలబెట్టి కొత్త జీవన స్ఫూర్తినిస్తుంది. బతుకమ్మ మనకు బతకడాన్ని నేర్పిస్తుంది.
పెత్తరమాస రోజు నుంచి బతుకమ్మ సంబరాలు మొదలవుతాయి. మొదటి రోజును ఎంగిలిపూలంటారు. ఇంటి చుట్టూ దొరికే పూలన్నీ సంబరంలో పాలు పంచుకుంటాయి. రంగు రంగుల పూలన్నింటినీ తీసుకొచ్చి హారతి పళ్లెంలో అందంగా పేరుస్తారు. తెలంగాణలో ఈ పళ్లాన్ని తబుకు అంటారు.
మెట్టినింటికెళ్లిన ఆడబిడ్డలందర్ని ఆప్యాయంగా పుట్టింటికి తీసుకొస్తారు. ఏడాది పొడవునా వ్యవసాయ పనులతో, ఇంటి పనులతో, అత్తింటి ఆరళ్లతో అలసిపోయిన ఆడవాళ్లకు తల్లిగారింటి నుంచి వచ్చే పిలుపు గొప్ప ఊరటనిస్తుంది. పుట్టినిల్లు కావాల్సినంత విరామాన్నిస్తుంది. చుట్ట పక్కాలు, చిన్ననాటి స్నేహితులు, పలకరింపులు, ఆప్యాయతలు, అభిమానాలు కష్టాలను కడతేరుస్తాయి. కొత్త ఉత్సాహాన్ని తెస్తాయి. మొత్తానికి తొమ్మది రోజులూ సందడే. అందుకే పేద కుటుంబాలైనా సరే ...ఆడబిడ్డలను ఇంటికి పిలిపించుకుంటారు. ఇది కేవలం పండుగ కాదు... తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో ఆడబిడ్డల ప్రేమ బంధాలను గట్టిపరిచే సందర్భం.
బతుకమ్మను పేర్చడం ఓ కళ. అలంకారినికో పరీక్ష. సౌందర్యాభిలాషకో నిదర్శనం. బతుకమ్మను పేర్చేవారికి పూల పరిచయముండాలి. . రంగుల రహస్యం తెలుసుండాలి. అద్దకం, కలంకారి పనితనం కావాలి.
తొమ్మిదో రోజు బతుకమ్మను పెద్ద బతుకమ్మ అనీ.. సద్దుల బతుకమ్మ అని అంటారు. పెద్ద బతుకమ్మ కోసం ఒక రోజు ముందుగానే గడ్డి పువ్వు, గునుగుపువ్వు తెచ్చి తగినట్టుగా కోసి కట్టలు కట్టి పెట్టుకుంటారు. కొంతమందైతే.. అర్ధరాత్రి వెళ్లి తంగెడు చెట్టు దగ్గరే పడుకుంటారు. రాత్రి నుంచే పువ్వుల కోసం పోటీ పడతారు. గంపల్లో బస్తాల్లో పూలు నింపుకొస్తారు. కాస్త పొద్దు పొడిచాక.. బతుకమ్మను తీర్చిదిద్దడం మొదలవుతుంది. ఇంట్లో వున్న వాళ్లంతా తలో చేయి వేస్తారు. ఆడామగా చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ పువ్వలేరుతారు. పెద్ద పెద్ద బతుకమ్మలను సాధారణంగా మగవాళ్లే పేరుస్తారు.
ముక్కాలి పీట, దాని మీద పెద్ద తాంబాలం. దాని మీద గుమ్మడి ఆకులు పరచి తంగెడు పూలు పేరుస్తారు. తంగెడు పువ్వుతోనే బతుకమ్మ ఎత్తు పెంచుతారు. నడుమ ఉనుకనో, తంగెడు తుక్కునో నింపుతారు. రంగుల్లో అద్దిన గునుగుపూల కట్టలను వలయాకారంలో పేరుస్తూ వస్తారు. బతుకమ్మకు ఒకటా రెండా … అన్ని పువ్వులూ అలంకరణలవుతాయి. రోకలి బండ పువ్వు, అడవి శాకుంతి, కట్లె పువ్వు, గోరింట, గన్నేరు పూలు ఒద్దికగా ఒదిగిపోతాయి. బతుకమ్మను పేర్చడమయ్యాక పసుపు గౌరమ్మను తీర్చుతారు . ఇంట్లో అలికి ముగ్గు పెడతారు. దాని మీద పీట పెట్టి అందులో బతుకమ్మను పెడతారు. ఆడవాళ్లు వరి, సజ్జ రొట్టెలను ముక్కలు చేసి చక్కెర పాకంలో వేసి ముద్దలు చేస్తారు. వీటినే మలీద ముద్దలని, కులీదలని అంటారు. రకరకాల సద్దులు చేస్తారు. పులుసు కలిపిన సద్ది, పెరుగు కలిపిన సద్ది చేస్తారు. కాస్త కలిగిన వాళ్లు పెసర, కొబ్బరి, నువ్వుల, పల్లీల బియ్యం పొడులు లకిపి తయారు చేసిన తొమ్మది రకాల సద్దులు బతుకమ్మ ముందు పెడతారు. అగరు వత్తులు ముట్టించి బతుకమ్మ పూల మధ్యలో చెక్కుతారు. పూజ చేస్తారు. కొత్త చీరలు కట్టుకొని తయారైన స్ర్తీలు బతుకమ్మను ఇంటి ముందు పెట్టి ఆడతారు. వంటలు సమర్పిస్తారు. మొక్కుతారు. సాయంత్రం నుంచి చీకట్లు ముసురుకొనే వరకు అడవాళ్లంతా తనివి తీరా ఆడతారు. ఆ తర్వాత తమ్మలి వాద్య సహకారంతో బతుకమ్మలు తలల మీద ఊరేగుతాయి. అంతకు ముందే బతుకమ్మలను వదలడానికి యువకులు పెద్దలు చెరువు కట్ట పొడుగునా బారులు తీరి వుంటారు. సందె చీకట్ల మధ్య చెరువులోని నీటి అలల మీద బతులకమ్మలు తేలియాడుతూ ముందుకు వెనక్కి కదులుతుంటూ అదో ఉద్వేగం. పోయిరా బతుకమ్మ పోయికరావమ్మ మల్లొచ్చే యాడాది తిరిగి రావమ్మా అంటూ ...శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ అంటూ పాటలు పాడుతారు. తెచ్చిన ప్రసాదాలు, ఫలహారాలు తబుకుల్లో పోసి ఒక్క దగ్గర అందరూ కూడతారు. గుంపులు గుంపులుగా కలిపి మరింత సందడిగా తుళ్లుతూ పరాచికాలాడుతూ పరవశించిపోతారు. ఈ కార్యక్రమం అంతా ముగిసిన తర్వాత ఒకరినొకరు ఇష్టపూర్వకంగా పలకరించుకుంటారు. ఆడపిల్లలాడుకునే అందమైన, అద్భుతమైన పూల జాతర మరెక్కడా కనిపించదు. కేరళలో ఓనం పండుగ అటుఇటుగా ఇలాగే వుంటుంది. అక్కడ కూడా రంగు రంగుల పూలతో చిత్రించిన రంగవల్లిక, మధ్యలో వెలుగులు విరజిమ్మే దీపం, చూట్టూ చేరి ఆటపాటలాడే అమ్మాయిలు. పాటల్లో ఎక్కువగా పురాణ కథలే వుంటాయి. ఈ రెండు సందర్భాలు మినహాయిస్తే పూల సమ్మేళనంతో కూడిన పండుగలు మరో చోట కనిపించవు. అదే బతుకమ్మ ప్రత్యేకత. తెలంగాణలో బతుకమ్మ గొప్ప వేడుక.. అచ్చంగా జానపదుల పండుగ. ప్రాచీనమైన పండుగ. కావ్యాల్లోనూ, చరిత్ర పుస్తకాల్లోనో లేకపోయినంత మాత్రానా బతుకమ్మను ఇటీవలి పండుగగా చెప్పుకోవద్దు. చరిత్రలో చాలా అంశాలకు చోటు దొరక్కపోవచ్చు. దానికి రకరకాల కారణాలుంటాయి.జానపదులకు ఎంతో ఆరాధనీయమైన తంగెడుపూల ప్రస్తావన ఎందుకో కావ్యాల్లో కనిపించదు. నాగరికులూ పెద్దగా పట్టించుకోలేదు. ఈ బంగరుపూల సోయగాన్ని చూడాలంటే కాపు కన్నెల ముద్ద కొప్పుల్లో చూడాలి. వాసన లేకపోతేనేం... వలపు బాసలు నేర్చిన పూలు కాబట్టే స్ర్తీల సిగలో కాపురముంటున్నాయి. తంగెడుపూలకు బతుకమ్మకు విడదీయరాని సంబంధం వుంది. బతుకమ్మ పండుగ ఆవిర్భావినకి సంబంధించి కాల నిర్ధారణ చేయడం కష్టం. జానపద రచనకు ఆచారానికి కాల నిర్ధారణ చేయడం ఇప్పుడున్న ఆధారాలు సరిపోవు. అయితే పండుగ నేపథ్యాన్ని వివరించే నాలుగైదు కథనాలు బతుకమ్మ పాటల్లోనే వున్నాయి. ఓ బాలిక భూస్వాముల అకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటే, ఆమెను ఆ ఊరి ప్రజలు చిరకాలం బతుకమ్మా అని దీవించారని, అందుకనే ఇది స్ర్తీలకు సంబంధించిన పండుగైందని చెబుతారు. మరో కథలో దక్షిణ భారతాన్ని పాలించిన చోళ వంశ చక్రవర్తి ధర్మాంగుడనే రాజు ఆయన భార్య సత్యవతి వంద నోములు నోచి వంద మంది పుత్రులకు జన్మనిచ్చారు. యుద్ధంలో వారంతా అమరులయ్యారు. ఆవేదన చెందిన రాజదంపతులు లక్ష్మీదేవి కోసం తపస్సు చేశారు. లక్ష్మీదేవి ప్రసన్నురాలై సత్యవతి బిడ్డగా జన్మిస్తుంది. బతికిన ఈ తల్లి బతుకమ్మ అవుతుందనే మహర్షుల ఆశీర్వచనల ప్రకారం అప్పట్నుంచి ఆమె బతుకమ్మ అయింది. సంతానం కోసం పూజలు చేశాడట! లక్ష్మి దేవి అనుగ్రహంతో ఆయన భార్య గర్భవతై కూతుర్ని కనిందట! అనేక గండాల్నుంచి గట్టెక్కింది కాబట్టి పాపకు బతుకమ్మా అని పేరు పెట్టారట! అప్పట్నుంచి యువతులు బతుకమ్మను కొలవడం ఆనవాయితీగా వస్తుందట! అసలు బతుకమ్మ పండుగకు, నవరాత్రి ఉత్సవాలకు కూడా దగ్గర సంబంధం వుందట! మహిషాసురునితో యుద్ధం చేసి దుర్గాదేవి అలసిపోయిందట! ఆ అలసటతోనే సుప్తావస్థలోకి వెళ్లిపోయిందట! ఆమెకు సేద తీర్చి తిరిగి యుధాస్థితికి తీసుకురావడానికి స్ర్తీలు సేవలు చేసి పాటలు పాడారట! తొమ్మిదో రోజుకు ఆమె అలసట తీరిందట! వెంటనే మహిషాసురుడ్ని సంహరించి తన కర్తవ్యాన్ని నిర్వహించిందట! ఆ జగన్మాత జనులకు జీవితాన్ని, బతుకునూ ప్రసాదించింది కాబట్టే గ్రామీణులు ఆమెను బతుకమ్మగా పిల్చుకుంటున్నారనేది ఓ కథ కూడా ప్రచారంలో వుంది. బతుకమ్మ పాటల్లో హితోక్తులు ఎక్కువ. వాటితో పాటు ఆర్ర్దత వుంటుంది. ఆవేశం వుంటుంది. ఆవేదన వుంటుంది. అణచివేతకు గురైన ఆవేశం వుంటుంది. ఉద్వేగం, ఉక్రోషం, ఉద్యమం అన్నీ వుంటాయి. బతుకమ్మ పాట పాడుకోవటానికి ఆశువుగా అల్లుకోవడానికి సులువుగా వుంటుంది. ఈ పాటల్లో అనేక ఇతివృత్తాలు ఇమిడి వున్నాయి. బతుకమ్మ పుట్టక కథల నుంచి, స్ర్తీల జీవితం చుట్టూ అల్లుకుని వున్న కష్టాల నుంచి అత్తింటి ఆరళ్ల నుంచి అన్నా చెల్లెల అనురాగాల నుంచి ఎన్నో కథనాలు సుదీర్ఘంగా సాగుతాయి. జనగామ రైలు ప్రమాదం, చెరువు కట్ట తెగిన వరద ప్రమాదం, కరువు కాటకాలు, కాల వైపరీత్యాలు, తెలంగాణ వీరుల అమరగాధలు, జానపద గాధలు, ఉద్యమాలు చివరికి ఎన్టీయార్‌ తెలుగుదేశం పార్టీని పెట్టడం ఇవన్నీ... ఈ పాటల నిండా మారుమోగుతుంటాయి. ఈ పాటలేవి అక్షరబద్దమైనవి కావు. అప్పటికప్పుడు సందర్భోచితంగా కూర్చిన పాటలు. పాటల్లోని భావరాగాలు ఒకదానితో ఒకటి పోటీ పడతాయి. తాళలయలు తప్పే ప్రసక్తే వుండదు.ఇప్పుడు బతుకమ్మ ఆధిపత్య సంస్కృతులు చేసిన దాడిలో కన్నీరు పెడుతోంది. దోపిడి బారిన పడిన చెరువులను చూసి గుండె చెరువు చేసుకుంటోంది. ఇంతకాలం పల్లెల కన్నీరు తుడిచిన బతుకమ్మను బతికించుకోవాలి. తెలంగాణ అస్థిత్వానికి నిలువెత్తు నిదర్శనమైన ఈ పూల జాతరను బతికించుకోడానికి వేనవేల సంజీవనిలు కావాలి. అవి మనమే ఎందుక్కాకూడదు?
రంగురంగుల పూలు ఉయ్యాలో... రకరకాల మనసులుయ్యాలో.. అందరికి శాంతిని ఉయ్యాలో .. అందించి దయ సూడు ఉయ్యాలో.

రామప్ప గుడి గురించి ...

జనార్దన్‌
కాకతీయులనాటి కళానైపుణ్యానికి ప్రతీక రామప్ప దేవాలయం. ఈ ఆలయ ప్రాంగణంలో.. అడుగడుగునా ఆనాటి కళా వైభవం కళ్లకు కడతది. వెయ్యేండ్లనాటి శిల్పచాతుర్యం మంత్రముగ్దులను చేస్తది. ప్రతి శిల్పం మనల్ని పలకరిస్తున్నట్టుగా అనిపిస్తది. ప్రకృతి ఒడిలో రమణీయ శిల్పాల నడుమ కాలాన్ని మరచి పసిపిల్లలమయ్యే క్షణాలు ఇక్కడే సాధ్యం.. కాకతీయుల కళావైభవం రామప్పదేవాలయం స్పెషల్‌ స్టోరీ..వరంగల్‌ జిల్లా కేంద్రానికి 75 కిలోమీటర్ల దూరంలో వెయ్యేండ్ల చరిత్రగలిగిన రామప్పదేవాలయముంది. దీనినే రామలింగేశ్వరాలయమని కూడా పిలుస్తరు. ఈ దేవాలయాన్ని కాకాతీయులు నిర్మించినట్టు శిలాశాసనాల్లో ఉంది. ఈ దేవాలయానికి వెయ్యేండ్ల చరిత్ర ఉంది. రాజుల సొమ్ము రాళ్ల పాలన్న నానుడిని తిరగరాసి రాళ్లను రతనాలు చేసేందుకేనని నిరూపించింది రామప్పగుడి.ఈ శిల్ప భంగిమలు రూపుతదిద్దుకోవడం వెనుక ఎన్నో ఏండ్ల చరిత్ర ఉంది. ఎందరో శ్రమజీవుల కష్టం ఉంది. తాము లేకున్నా తమ కళా నైపుణ్యం బతికే ఉంటదన్న శిల్పకారుల ఆశలున్నయి. పల్లెటూరి యువకుల స్వచ్ఛమైన ప్రేమ కథలున్నయి. వీటన్నిటిని మించి ఆశలు ఆవిరైన నిరాశ పరుల కన్నీటి వెతలున్నయి. చూసే వాళ్ల గుండె సడిని బట్టి ఈ ఆలయ కథలు వినిపిస్తయి. రామప్పగుడి ఆత్మ కథ ఉంటే అసలు విషయం మీకే తెలుస్తది.ఈ దేవాలయ నిర్మాణం ఒక మహా యజ్ఞంగా చేసిండ్రు. నిర్మాణంలో ఎక్కడా లోపాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నరు. ఈదేవాలయం అడుగడుగు వాస్తు, శిల్ప కళల మడుగు. కాకలు తీరిన కాకతీయ శిల్పకారుల ప్రతిభకు నిండైన నిదర్శనం. ప్రతి తెలంగాణ బిడ్డ ఒక్కసారైనా చూడాల్సిన చోటు. ఆ మాటకొస్తే కళాపోషకులు ఏ ప్రాంతం వారైనా చూసి తరించాల్సిన తావు ఇది.రామప్పగుడికి సీతమ్మోరి కష్టాలు తప్పలేదు. తను వంతా ల్పసంపదనింపుకున్న రామప్పగుడి ఎన్నో దాడులను చవిచూసింది. కళ్ల ముందే కనుమరుగవుతున్న శిల్ప సంపదను చూసి కనిపించని కన్నీరు కార్చింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇకనైనా మేల్కోంటే మంచి రోజులన్నయని సందేశమిస్తది.తెలంగాణ గడ్డకే గర్వకారణమైన శిల్పసంపదను, చారిత్రక ఆనవాళ్లను రక్షించుకునే బాధ్యత మనందరి పైనా ఉంది. ఒక్క రామప్పే కాదు... తెలంగాణ నిండా ఇటువంటి ఎన్నో రామప్పలు పరాయి పాలనలో పడావు పడుతున్నయి. ఇకనైనా వీటన్నిటి వెలుగులోకి తెచ్చి ఉద్దరించే బాధ్యత మనందరి పైనా ఉంది..ఇదీ ఈ వారం తెలంగాణ దేవాలయ చరిత్ర.. వచ్చే వారం మరో తెలంగాణ దేవాలయంతో కలుసుకుందాం.