Wednesday, April 14, 2010
చిలుకూరు బాలాజీ చరిత్ర
జనార్దన్
తెలంగాణలో అతి పురాతన దేవాలయాల్లో చిలుకూరు బాలాజీ టెంపుల్ ఒకటి... ఈ దేవాలయానికి అత్యంత పురాతన చరిత్ర ఉంది...చిలుకూరు వెంకటేశ్వరుడు వందల ఏండ్ల సంది ఇక్కడ పూజలందుకుంటున్నడు.
చిలుకూరు బాలాజీ... ఈపేరు చెబితే తెలంగాణ జిల్లాల్లో భక్తులంతా ఆ దివ్యమూర్తిని తలచుకొని పులకించి పోతరు. అంతటి మహత్‌చరిత్రగల్ల దేవాలయం ఇది. ఒక్క తెలంగాణ నుంచే కాదు దేశం నలుమూలల నుంచి ఇక్కడకొచ్చి భక్తులు తమ కష్టాలు స్వామితో మొర పెట్టుకుంటరు. ఆపద మొక్కుల వాడని కీర్తిగడించిన వేంకటేశుడు తమ ఆపదలు గట్టెక్కిస్తడని భక్తుల నమ్మకం.
లక్షలాధి భక్తుల పూజలందుకుంటున్న ఈ దేవాలయం ఇప్పటిది కాదు. తెలంగాణలో ఉన్న అతిప్రాచీన పుణ్యక్షేత్రాలలో ఇదొకటి. దీనికి సూమారు 500 ఏండ్లకు పై బడ్డ చరిత్ర ఉంది. హైదరాబాద్‌సంస్థానాన్ని నిజాం నవాబులు పాలించే కాలంలో ఈ దేవాలయాన్ని కట్టించిండ్రట. రామదాసు మేనమామలు అక్కన్న, మాదన్నల కాలంలో ఈ గుడి కట్టించిండ్రు. సర్వమత ఆదరణ ఉన్న కాలంలో నిజాం ప్రభువుల ఆదరణతో ఈ దేవాలయాన్ని నిర్మించిండ్రు.ఈ దేవాలయం కట్టడం వెనక ఒక భక్తి కథ ఉంది. భక్తుడికోసం ఆ దేవదేవుడే ఏడుకొండలు దిగి వచ్చిన సంఘటనలు మనం పురాణాల్లోనే వింటం. కానీ వాస్తవజీవితంలో ఇది కనీ వినీ ఎరగం...కానీ చిలుకూరులో భక్తుని కోసం భగవంతుడే దిగి వచ్చిండు..కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశుడంటే మాధవరెడ్డి అనే భక్తుడికి ఎంతో ప్రీతి. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా తిరమల వెళ్లి ఆ ఏడుకొండలవాడి దర్శనం చేసుకుంటడు. క్రమం తప్పకుండా తిరుమల వాసుణ్ని దర్శించుకొనే మాధవరెడ్డికి ఆ యేడు చెప్పరాని కష్టమొచ్చిపడింది. మంచాన పడి లేవలేని పరిస్తితి. అయినా తన ఇష్టదైవం తిరుమల వాసుణ్ణి దర్శించుకొని తీరాలని పట్టుబట్టిండు. అనుకున్నదే ఆలస్యం తిరుమలకు బయలెల్లిండు. కొంతదూరం నడిచిండో లేదో నీరసంతో స్పృహ తప్పి పడిపోయిండు. తానిక తిరుమలేశుణ్టి చూడకుండానే కన్నుమూయాల్సి వస్తుందనే బెంగ పట్టుకుంది మాధవ రెడ్డి. ఒంట్లో సత్తువంతా మాయమై పూర్తిగా అపస్మారక స్తితికి వెళ్లిండు. భక్తుని తపనకు ఆ భక్తునికి ఆ భక్తలోలుడు స్వప్నమందు దర్శనమిచ్చిండట. తన వద్దకు రాలేనందుకు బాధ పడవద్దని. దర్శనం చేసుకోవలనుకున్న భక్తుని పట్టుదలకు మెచ్చి తానే ఈ ప్రాంతంలో వెలుస్తున్నానని అభయం ఇచ్చిండు. దగ్గరలో ఉన్న పుట్టలో తన విగ్రహమూర్తులు కొలువై ఉన్నయని, దేవుడు వెలసిన ఆనవాళ్లు చెప్పి అంతర్దానమయిండు. వెంటనే మెలకువ వచ్చిన భక్తుడు ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలిపిండు. గ్రామస్తుల సాయంతో కలలో స్వామి తెలిసిన ఆనవాళ్ల ప్రకారం అడవిలో ఉన్న పుట్టను దొరికిచ్చుకొని ఆపుట్టను తవ్వి చూసిండ్రు. కొంత పుట్ట తవ్వగానే కంగుమనే శబ్దం వినిపించిందట. పలుగు తీసి చూస్తే పలుగు కొనకు రక్తం అంటింది.దీంతో గ్రామస్తులు భయంతో వణికిపోయిండ్రు. అంతలో మాధవరెడ్డిక ఒక అదృశ్యవాణి వినిపించింది. ఆ పుట్టలో ఉన్న విగ్రహానికి పాలాభిషేకం చేస్తే ఆ రక్తస్రావం తగ్గుతదని ఆకాశవాణి వినిపించింది. వెంటనే ఆ పుట్టలో పాలుపోయగా శ్రీవెంకటేశ్వరుడు భూదేవి, శ్రీదేవి సమేతంగా కనిపించిండట. పలుగు గాయం తాలూకూ గుర్తుల గడ్డం పైనా ఎడమ కనుబొమ్మ పైనా కనిపించిందట. అచ్చు తనకు కలలో కనిపించిన స్వామి లాగే ఉండటంటే మాధవరెడ్డి పరమానంద భరితుడైనడు. వెంటనే గ్రామస్థులంతా కలిసి దేవాలయ నిర్మాణం చేపట్టిండ్రు. భక్తులు కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరడంతో ...చిలుకూరుకు భక్తుల తాకిడి ఎక్కువయింది. ఈ విషయం ఆనోటా ఈ నోటా పాకి తెలంగాణ మొత్తం పాకింది. దీంతో స్వామి మహిమలు తెలిసిన ప్రజలు వేలాదిగా వచ్చి స్వామి దర్శించుకుంటున్నరు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఆదరణ కొనసాగుతనే ఉంది.
భగవంతుని దృష్టిలో అందరూ సమానులే అన్న విషయం ఇక్కడ అచ్చుగుద్దినట్టు పాటిస్తరు. స్వామిని దర్శించుకునేందుకు ధనిక పేదా అనే తేడాలేదు. ఇక్కడ ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు అనే తేడా లేదు. అందరికీ ధర్మదర్శనమే దారి.భక్తులు కోరికలు తీరుస్తూ మానవ జాతిని తరింప చేస్తూ చిలుకూరు స్థావరంగా వెలసినాడు శ్రీవెంకటేశుడు. “అజ్ఞానినా మయాదోశా అశేషా నిహితాన్ హరే..క్షమస్తత్వం క్షమస్తత్వం చిలుకూరు శిఖామణే’ అని కొలిచిన భక్తులకు కోరిన వారికి కొంగు బంగారమై కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా ఇలలో వెలిసిన స్వయం భూ మూర్తి చిలుకూరు బాలాజీ.. మానవజాతి జీవన గమనంలో కారణచక్రం నుంచి విడివడి ఆ పరమాత్ముని చేరే మార్గమే చిలుకూరు వేంకటేశ్వరుడు. వెంకట అంటే సంకటాలు హారించే వాడని సంస్కృతార్దం. ఇలలో మనం కోరే ధర్మమైన కోరికలు తీర్చి భక్తులను తరింపజేస్తడు చిలుకూరు బాలాజి. దేవుడి దర్శనానికి వెళితే చుక్కలు కనిపించే రోజులివి. కష్టాలు తీర్చమని దేవుడికి చెప్పాలన్నా ముందు కడివెడు కష్టాలెదుర్కోవాలి. అడుగడుగున పైకం అందితేనే స్వామి దర్శనం అవుతది. కానీ చిలుకూరు దానికి పూర్తిగా విరుద్దం. పైసామే పరమాత్మ అన్న మాటను తిరగరాసిన దేవాలయం చిలుకూరు దేవాలయం.ఈనాడు దేశంలోని చాలా ఆలయాలు వ్యాపార కేంద్రాలుగా మారాయి. స్వామిని దర్శిచడానికి టికెట్, కొబ్బరికాయ కొట్టడానికి టెకెట్, అర్చనకు టికెట్, ప్రసాదానికి టికెట్. ఈ టికెట్‌ల ఇక్కట్లు భారత దేశంలోని ప్రతి ఆలయంలోనూ తప్పవు కానీ చిలుకూరులోని స్వామిని దర్శించేందుకు టిక్కెట్ల ఇక్కట్లుండవు. గుడిలో హుండీలుండవు. చందాలు కూడా అడగరు. ఇక్కడ ప్రదక్షణలు తప్ప దక్షణ స్వీకరించరు. టిక్కెట్లు లేక, చందాలు లేక, హుండీలు లేక ఆలయ నిర్వహణ ఎలా సాగుతుందనేది అందరి మదిని తొలిచే ప్రశ్న. కానీ దేవాలయ తరపున వాక్ అనే పత్రిక నడుపుతరు. ఆ పత్రిక ద్వారా వచ్చే ఆదాయమే ఈ గుడి నిర్వహణకు వాడతరు. లక్ష్మీ పతికి మనం ఏమివ్వగలం...భక్తితో ఒక నమస్కారం తప్ప..పత్రం పుష్పం ఫలం తోయం అని ఆ దేవదేవుడే సెలవిచ్చాడు కదా..తాము కోరుకున్న కోరికలు తీరాలంటే ముందుగా స్వామి వారికి 11 ప్రదక్షిణలు చేస్తరు. తమ మనసులో ఉన్న కోరికలు స్వామివారికి చెప్పుకుంటరు. స్వామి వారిని దర్శించుకొనేటప్పడుకళ్లు మూయకూడదనే నిబంధన కూడా ఇక్కడ పాటిస్తరు. తమ కోరికలు నెరవేరినంక 108 ప్రదక్షిణలతో తమ మొక్కు చెల్లించుకుంటరు. ఇక్కడ కోరికలు కోరుకునే ముందు 11 ప్రదక్షిణలు, కోరికలు తీరాక 108 ప్రదక్షిణలు చేయడం వెనక ఒక సంఘటన ఉందని చెప్పుకుంటరు. స్వామీవారికి గుడి కట్టిన కొత్తలో స్వామి వారి అభిషేక జలంగా దగ్గరలో ఉన్న చెరువు నీటిని వాడేవారు. తర్వాత కొంత కాలానికి ఆ చెరువు ఎండి పోయింది. తర్వాత ఎన్నేళ్లయినా ఆ చెరువులోకి నీటి చుక్క రాలేదు. స్వామి కైంకర్యానికి నీరు కరువయింది. నీటి ఎద్దడి భక్తులను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేసేది. దీంతో ఆలయ అర్చకులు ఎన్నో బోర్లు వేయించి విఫలయత్నం చేశారు. సుమారు 300 అడుగుల లోతు తవ్వించినప్పటికీ నీటి జాడ కనిపించలేదు. నాలుగు చోట్ల తవ్వించి ఇక తమ వల్లకాదని నీటి ప్రయత్నం వదిలేశారు. ఒక రోజు ఒక భక్తుడు తాను స్వామి వారికి బోరు తవ్వించేందుకు సహకరిస్తనని, బోరు తవ్వించడాని అయ్యే ఖర్చులో సగం తాను భరింస్తానని హామీ ఇచ్చి ఆఖరు ప్రయత్నం చేయమని ప్రోత్సహించిండు. దాంతో ఆలయ ప్రధాన పూజారి గోపాలకృష్ట నీరు పడాలని గుడి చుట్టు ప్రదక్షణలు చేయనారంభించిండు. 11వ ప్రదక్షణ చేయగానే బోరులో నీళ్లు పడ్డట్టు గోవులు కాసే పిల్లవాడు కబురు చెప్పిండట. ఆ తరువాత ప్రదక్షిణలు నిలిపేస్తే ఎక్కడ నీటి ధార ఆగిపోతుందోనని అలాగే 102 ప్రదక్షిణలు చేసిండట. అప్పటికి పుష్కలంగా నీరు పడ్డప్పటికీ బోరుఇంజన్ రిబ్ బోరుబావిలో ఇరుక్కుందట. రిబ్ తీస్తేగానీ నీరు రాదని చెప్పడంతో ఆలయ పూజారి మిగతా ఆరు ప్రదక్షణలు పూర్తి చేసి స్వామి వారికి మొక్కుకోగానే రిబ్ బయటకొచ్చిందన్న వార్త పూజారి చెవిన పడింది. అప్పటి నుంచి భక్తులు కోరికి కోరుకునే ముందు 11 ప్రదక్షిణలు కోరిక తీరాక 108 ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీగా వస్తుంది.ఇక్కడ స్వామి వారికి ఏటా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలను ప్రభుత్వం కట్టుదిట్టంగా జరుపుతది. ఈ ఉత్సవాలకు భక్తుల ఆదరణ కూడా ఎక్కువే. ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్ సర్వీసులను నడుపుతది.చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తరు. బ్రహ్మోత్సవాలకు గుడిని అందంగా అలంకరించి ఉత్సవమూర్తులను రథం పై ఊరేగిస్తరు. ఆలయ బ్రహ్మోత్సవాలకు కావలసిన ఏర్పాట్లను ప్రభుత్వమే చూసుకుంటది. ఉత్సవాల్లో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా గట్టి బందో బస్తు ఏర్పాటు చేస్తరు. గతంలో రెండు సిసి కెమేరాలు ఉండేవి. ఇందులో ఒకటి పూర్తిగా చెడిపోయింది. ఇప్పడు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నాలుగు సిసి కెమేరాలను అమర్చిండ్రు. ఇవి ఎప్పటి కప్పడు భక్తుల కదలికలను రికార్డు చేస్తవి.బ్రహ్మోత్సవాల సమయంలో ఆర్టీసి అదనపు బస్పులను నడిపిస్తది. వీటితో బాటు ఆటోలు ట్రాలీలతో ఆ ప్రాంతమంతా రద్దీగా కనిపిస్తది. స్వామివారి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు ఒక్క తెలంగాణ ప్రాంతం నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు ఇక్కడకు వస్తరు. ఈ బాలజీ దయతో వీసాలు పొందిన వారైతే ఖండాంతరాలలో ఎక్కడ ఉన్నా ఒక్కసారయినా బ్రహ్మోత్సవాలకు హాజరయితరు. బ్రహ్మోత్సవాలలో గుడి ప్రాంగణమే కాదు ఆ ఊరుఊరంతా సందడే సందడి.ఎక్కడ ఎక్కువ ప్రజాదరణ ఉంటదో అక్కడ రాజకీయం నిద్దరలేస్తది. ప్రజల సెంటిమెంట్‌ను సొమ్ము చేసుకోవాలని చూస్తరు. అశేషప్రజానికం చేత పూజింపబడుతున్న చిలుకూరు బాలాజీని కూడా రాజకీయ చీడ వదల్లేదు. అయినా ప్రజాప్రతినిధుల కపటనీతిని ముందే పసిగట్టి తిప్పికొట్టగలిగారు ఇక్కడి వారు.
ఇంతటి ప్రజాదరణ కలిగిన ఈ దేవాలయం పై కొందరు స్వార్ధ పరుల కళ్లు పడ్డయి. ఆలయ కమిటీలో స్థానం కొరకు ఫైరవీలు చేయించి తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మొదలు పెట్టిండ్రు. మరో పక్క ఎండోమెంటు బోర్డు ఆలయానికి కొన్ని నిధులు కేటాయించి, తమ స్వాధీనంలోకి తీసుకొని దాని ఆలనా పాలనతో బాటు దానిపై పూర్తి అధికారాలను కూడా హస్తగతం చేసుకోవాలని చూసింది. వారసత్వంగా దీనిపై హక్కుల పొందుతున్న పూజారులు దీనిపై కోర్టు గుమ్మం ఎక్కక తప్పలేదు. ప్రభుత్వానికి వ్యతిరేఖంగా పోరాడి పంథం నెగ్గించుకున్నరు. ఆలయంలో హుండీ ఉంటేనే ఎండోమెంట్ బోర్డు ఆజమాయిషీ చెలాయించుతదని, హుండీ తీసేశారు. దీంతో స్వామి వారికి లక్షలాదిమంది భక్తులున్నా సరైన ఆదాయం లేక నానా ఇబ్బందులు పడుతున్నది. ఇదీ తెలంగాణ తిరుమలగా వెలుగులీనే చిలుకూరు బాలాజీ ఆలయచరిత్ర. భక్తిమయమైన వెంకటేశుని మహిమ. మరో తెలంగాణ ఆలయంతో మళ్లీ కలుసుకుందాం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment