జనార్దన్
కాకతీయులనాటి కళానైపుణ్యానికి ప్రతీక రామప్ప దేవాలయం. ఈ ఆలయ ప్రాంగణంలో.. అడుగడుగునా ఆనాటి కళా వైభవం కళ్లకు కడతది. వెయ్యేండ్లనాటి శిల్పచాతుర్యం మంత్రముగ్దులను చేస్తది. ప్రతి శిల్పం మనల్ని పలకరిస్తున్నట్టుగా అనిపిస్తది. ప్రకృతి ఒడిలో రమణీయ శిల్పాల నడుమ కాలాన్ని మరచి పసిపిల్లలమయ్యే క్షణాలు ఇక్కడే సాధ్యం.. కాకతీయుల కళావైభవం రామప్పదేవాలయం స్పెషల్ స్టోరీ..వరంగల్ జిల్లా కేంద్రానికి 75 కిలోమీటర్ల దూరంలో వెయ్యేండ్ల చరిత్రగలిగిన రామప్పదేవాలయముంది. దీనినే రామలింగేశ్వరాలయమని కూడా పిలుస్తరు. ఈ దేవాలయాన్ని కాకాతీయులు నిర్మించినట్టు శిలాశాసనాల్లో ఉంది. ఈ దేవాలయానికి వెయ్యేండ్ల చరిత్ర ఉంది. రాజుల సొమ్ము రాళ్ల పాలన్న నానుడిని తిరగరాసి రాళ్లను రతనాలు చేసేందుకేనని నిరూపించింది రామప్పగుడి.ఈ శిల్ప భంగిమలు రూపుతదిద్దుకోవడం వెనుక ఎన్నో ఏండ్ల చరిత్ర ఉంది. ఎందరో శ్రమజీవుల కష్టం ఉంది. తాము లేకున్నా తమ కళా నైపుణ్యం బతికే ఉంటదన్న శిల్పకారుల ఆశలున్నయి. పల్లెటూరి యువకుల స్వచ్ఛమైన ప్రేమ కథలున్నయి. వీటన్నిటిని మించి ఆశలు ఆవిరైన నిరాశ పరుల కన్నీటి వెతలున్నయి. చూసే వాళ్ల గుండె సడిని బట్టి ఈ ఆలయ కథలు వినిపిస్తయి. రామప్పగుడి ఆత్మ కథ ఉంటే అసలు విషయం మీకే తెలుస్తది.ఈ దేవాలయ నిర్మాణం ఒక మహా యజ్ఞంగా చేసిండ్రు. నిర్మాణంలో ఎక్కడా లోపాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నరు. ఈదేవాలయం అడుగడుగు వాస్తు, శిల్ప కళల మడుగు. కాకలు తీరిన కాకతీయ శిల్పకారుల ప్రతిభకు నిండైన నిదర్శనం. ప్రతి తెలంగాణ బిడ్డ ఒక్కసారైనా చూడాల్సిన చోటు. ఆ మాటకొస్తే కళాపోషకులు ఏ ప్రాంతం వారైనా చూసి తరించాల్సిన తావు ఇది.రామప్పగుడికి సీతమ్మోరి కష్టాలు తప్పలేదు. తను వంతా ల్పసంపదనింపుకున్న రామప్పగుడి ఎన్నో దాడులను చవిచూసింది. కళ్ల ముందే కనుమరుగవుతున్న శిల్ప సంపదను చూసి కనిపించని కన్నీరు కార్చింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇకనైనా మేల్కోంటే మంచి రోజులన్నయని సందేశమిస్తది.తెలంగాణ గడ్డకే గర్వకారణమైన శిల్పసంపదను, చారిత్రక ఆనవాళ్లను రక్షించుకునే బాధ్యత మనందరి పైనా ఉంది. ఒక్క రామప్పే కాదు... తెలంగాణ నిండా ఇటువంటి ఎన్నో రామప్పలు పరాయి పాలనలో పడావు పడుతున్నయి. ఇకనైనా వీటన్నిటి వెలుగులోకి తెచ్చి ఉద్దరించే బాధ్యత మనందరి పైనా ఉంది..ఇదీ ఈ వారం తెలంగాణ దేవాలయ చరిత్ర.. వచ్చే వారం మరో తెలంగాణ దేవాలయంతో కలుసుకుందాం.
No comments:
Post a Comment