ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Tuesday, May 25, 2010

పదశిల్పి వేటూరి సుందరరామ్మూర్తి


ఎ.జనార్దన్
పదునైన పదాలతో పరిగెత్తించే కలం ఆగిపోయింది. స్వరాలకే వరంగా మారిన ఆ కావ్యఝరి మూగబోయింది. మూడుతరాలను సంగీత ప్రపంచంలో ఓలలాడించిన పదశిల్పి ఇకలేరు. వేటూరి మరణం సాహిత్య ప్రపంచానికి తీరని లోటు. ఆ మహా మనీషికి నివాళి అర్పిస్తూ రాజ్‌న్యూస్‌ అందించేస్పెషల్ స్టోరీ….
వేటూరి సుందరరామ్మూర్తి…సినీ వినీలాకాశంలో మెరిసే పాటల పాలపుంత..నవరసాలను ఒలికించే గేయామృతధారల సృష్టికర్త. ముచ్చటగా మూడు తరాలను మెప్పించిన అపర పదభగీరదుడు వేటూరి.
ఆయన పాటల్లో ప్రకృతి పల్లవిస్తది. మువ్వలు గల్లుమంటయి. కోయిల కూయంటది.. కొమ్మలు కోలాటాలాడుతయి. పైరగాలి పిల్లనగ్రోవి పలికిస్తది.పండు వెన్నెల పరదా విసుతది. గోదారి అలలు సవ్వడి చేస్తయి. ఆ పదాల అల్లిక మీగడ తరగతల వలే కమ్మగా ఉంటది. ఆ పాటలను ఎంత విన్నా …కాదు ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. అంత సాహితీ బాండాగారం వేటూరి.
(సిరిమల్లే నీవే పాట) (పంతులమ్మ )
(పిల్లనగోవికి నిలువెల్ల)( సప్త పది)
మేఘసందేశం నుంచి ఆకాశ దేశానా..సాంగ్
వేటూరి తాకని అంశం లేదు. ఆయన కలం కురిపించని భావం లేదు. జీవన మాధుర్యాన్ని , జీవన సాఫల్యాన్ని, జీవన గమనాన్ని ఒద్దికగా పదాల్లో పొందుపరచగల ప్రతిభా శాలి అతడు. మాటలకందని పదాలను పాటలుగా మలచిన పదబ్రహ్మ. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏం చెప్పినా తక్కువే..సినీ జగత్తులో మేరు నగధీరుడు. పాటల మాంత్రికుడు… వేటూరి కలం నుంచి జాలువారిన కవిత్వం… అజరామరం. పాటల రాతలోనే కాదు…. వచన రచనలోనూ మేటి అనిపించుకోవడం… ఆయనకు ‘పెన్నుతో పెట్టిన విద్య’. ఆయన ప్రతి పాటా… మెరుపుగా, ఉరుముగా నినదించింది. మారుతున్న కాలంతో పాటే పాట స్టైల్‌నూ మార్చి… యువత మనసు కొల్లగొట్టడంలో ఆయన నిత్య యవ్వనుడే! పడచుదనపు లోగిలిలోకి వచ్చిన అమ్మాయి మనసు సిరిమల్లెపూవు తోడుగా చిన్నారి చిలకమ్మ సాక్షిగా రాసిన వేటూరి… ఎదురుచూపులోని మధురబాధని గుండెకు హత్తుకునేలా చెప్పిండ్రు.
(సిరిమల్లెపువ్వా, చిన్నారి చిలకమ్మ)(పదహారేళ్ల వయసు)
అచ్చతెలుగు పదారణాల ఆడపడుచు.. తన సరిజోడు తొలిచూపుల తరువాత ఆమె మదిలో మెదిలిన వలపుల తలపులను విప్పి చెప్పిన గడసరి.
(తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు)(శ్రీవారికి శుభలేక)
భార్యా భర్తల మధ్య అనుబంధాన్ని తన పాటల్లో కళ్లకు కట్టిండు. సిరులన్నింటినీ మించిన సొమ్ము చిరునవ్వేనని సున్నితంగా చెప్పిండు.
(మా ఇంటిలోన మహలక్ష్మి నీవే.)
వేటూరి కలం సరస సరాగాల సుమవాణిని. శిలలకు సైతం సంగీతాన్ని వినిపించేలా చేసింది. పదం-పాదం కలిసిన నర్తనలో ఆ పదాల పరుగు గౌతమి పరవళ్లనే వెక్కించింది.
(నిన్నటి దాకా శిలనైన.)
అలా కదిపితే ఇలా ఇలా వర్షించే మధురగీతాల మేఘం వేటూరి.పదాలుకు పండు వెన్నెలలద్ది కొత్త అందాలను పులిమిన పదశిల్పి. వేలాదిగా పాటలు రాసిన సాటిలేని మేటి కవి వేటూరి. తెలుగు పాటకు ఆయనా ఓ ప్రాణం. తెలుగు అక్షరాల తోటలో కొమ్మకొమ్మకో సన్నాయి పలికించిన పదకారుడు ఈయన.
(కొమ్మకో సన్నాయి పాట)( రాగాలా పల్లకిలో కోకిలమ్మ)
వేటూరి జీవన సారాలన్ని ఒడిసి పట్టిన పదర్షి. జీవిత అనుభవాలను అక్షరాలుగా చెక్కి పాటల ప్రవాహలో వదిలిన వేదాంతి. స్రవంతి సినిమాలో “నవ్వుతూ వెళ్లిపో నువ్వుగా మిగిలిపో” పాట పాజిటివ్ థింకింగ్‌ ఆటిట్యూడ్స్ ని చూపిస్తే… మాతృదేవోభవ సినిమాలోని “రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే” పాటలో జీవన తాత్వికత వైరాగ్యంగ్యాన్ని నింపుతది.
(రాలిపోయే పువ్వా పాట)(మాతృదేవోభవ)
ఇదే సినిమాలోని వేణువై వచ్చాను భువనానికి పాట జాతీయ స్థాయిలో ఉత్తమ గీతంగా అవార్డును సాధించింది. తెలుగు పాటకు కీర్తిని తెచ్చింది. వేణువై వచ్చాను అనే పేరుతోనే వేటూరి తన ఆత్మకథను రాయాలని సంకల్పించడం… ఆ పాటపై ఆయనకున్న ప్రేమకు అద్దం పడుతది.
(వేణువై వచ్చాను భువనానికి పాట)( మాతృదేవోభవ)
దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న వేటూరి 10వేల పైగా పాటలు రాశారుపంతులమ్మ, కాంచన గంగ, చంటి, రాజేశ్వరి కల్యాణం, సుందరాకాండ సినిమాల్లో రచించిన పాటలకు నంది అవార్డులు గెల్చుకున్నారు.
(నవ్వవే నవ మల్లిక పాట)
ఇక శంకరాభరణం లోని అన్ని పాటలకు రచన చేసి శాస్త్రీయ సంగీత పాటల రచనలో మేటి అని నిరూపించుకున్నారాయన.
(ప్రాణము నీవని దగ్గరనుంచి)(శంకరా నాదశరీరాపరా)

గీతాంజలి సినిమాకు అన్ని పాటలను రాసి అరుదైన ఘనతను సాధించారు. ఆమని నిశ్శబ్దంలో స్వరాలు పలికించి… రాలేటి పూల మూగ గొంతులో రాగాలను వినిపించిండు.
(ఆమనీ పాడవే… హాయిగా)(గీతాంజలి)
వేటూరి ఆగమనంతో పాటకు పలవరింతలు మొద లయ్యాయి. పాట పరవశంతో నాట్యం చెయ్యడమూ మొదలైంది. 'ఓ సీత కథలో 'నిను కన్న కథ పాటతో ప్రారంభమైన వేటూరి పాటల పల్లకీ ప్రపంచం చుట్టూ తనదైన హంసగమనంతో ఊరేగి సినీ ప్రేమికుల్ని ఆనందపరుస్తూ ఆశ్చర్యపరుస్తూ డెభ్భై అయిదవ వసంతంలోకి అడుగు పెట్టింది'సిరిసిరి మువ్వలో ఝు కారంతో పల్లవి ప్రారంభించే గుండె ధైర్యం ఎందరికుంటుంది? (ఝుమ్మంది నాదం)
'శంకరాభరణం సినిమాలో ప్రతి పాటా అక్షర సరస్వతికి కంఠాభరణం.
(శంకారా..నాద) ( దొరకునా ఇటువంటి సేవ)
సాగర సంగమం నవరస భావోద్వేగాల సంగమం. ఎన్ని తరాలైనా వాడిపోని నిత్య పరిమళ సుమధుర సుమం.
(ఓం..నమశ్శివాయ..)( (నాద వినోదం..పాటలో కైలాసాన కార్తీకాన)

స్వాతిముత్యం నేటికీ ఆణిముత్యమే. మదిని ఊయలలూపే స్వరాలు ఎన్ని ఆవరించినా స్వాతి ముత్యంపు తళుకులు ఎప్పటికీ తరగని వెన్నెల వన్నెలు.
(సువ్వి సువ్వి సువ్వాలమ్మ పాట)(అండాదండా ఉండాలని దగ్గర్నుంచి)
వేటూరి సరస్వతీ పుత్రుడు. పది పదుల కాలాలు నిలిచిపోయే పాటలు రాసిండు. బావ కవులకు, భావి కవులకు ఆదర్శంగా నిలిచిండు.
(ఆ..కనులలో కలల మాధురి)(ప్రియతమా)( ఆలాపన చిత్రం)
(పొద్దున్నె పుట్టిందిచందమామ) (శతృవు)
వేటూరిలో అన్ని కోణాలూ ఉన్నయి. ఏ ఒక్క బాణికో ఆయన పరిమితం కాలేదు. కాలాన్ని బట్టి కలం కదం తొక్కింది. భక్తిగురించి చెప్పినా దేశభక్తి గురించి చెప్పినా ఆయన స్టైలే వేరు.
(కృషి ఉంటే మనుషులు రుషులవుతారు పాట)
ఏడు పదుల వయసులోనూ ఆయన మనసు నిత్య యవ్వనంగా ఉంటది. వయసు మనిషికే కానీ మనసు కాదంటడు. మెలోడీ సాంగ్స్‌తో బాటు మాంచి మసాలా ఉన్న పాటలు రాయడం వేటూరికి పెన్నుతో పెట్టిన విద్య. చిలిపి పాటలను చిగురింపచేయడం కూడా ఆయనకు తెలుసు. ఆకుచాటు పిందెలను పిలిచి..కొంటె పాటలకు కొత్త దారి చూపిన ఘనత కూడా ఆయనదే..
(ఆరేసుకోబోయి పారేసుకున్నాను)(ఇందువదన –చాలెంజ్)( ఆ అంటే అమలాపురం – ఆర్య )(అబ్బనీ తియ్మయనీ దెబ్బ –జగదేకవీరుడు)(చిలక కొట్టుడు కొడితే చిన్నదానా..)
వేటూరిలో ఓ ఆద్యాత్మిక కోణం ఉంది. పాటల పొదరిళ్లల్లో దేవుళ్లను కొలిచిన కవి కిరీటి.
(శ్రీరామదాసులో అదిగదిగో భద్రగిరి)(ఏడుకొండలా స్వామి)
(అన్నమ య్య సినిమాలో పాటలు)
వేటూరి కలం నుంచి జాలు వారిన పాటల హోరులో ఎన్నో గమకాలు.. వాన పాటలు -వీణపాటలు..విరహగీతాలు-విప్లవ గీతాలు..రక్తిపాటలు-ముక్తిపాటలు, భక్తి పాటలు –విరక్తి పాటలు..హాస్య గీతాలు –ఆశు కవిత్వాలు. ఒకటేమిటి ఆయన తడమని భావం లేదు. తడవని స్వరఝరి లేదు.
పాట
కె. విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వార తన కవితా ద్వారలు తెరిచిన వేటూరి నాటి నుంచి నేటి వరకు చేసిన పద ప్రయోగాలు కోకొల్లలు. పదాలతో జిగిబిగి అల్లికలు అల్లికలు అల్లి పాల తరగల్లాంటి పాటలు అందించడం ఆయనకే చెల్లింది. సీనీ బాణీలకు ఓణీలేయించి సరిగమ స్వరాలతో సరసాలాడిచిన మేనమామ వేటూరి.
పాట
ఒక పాటను దర్శకుడు, నిర్మాత మెచ్చేలా రాయడమంటే యాగమే. అటువంటి యాగాన్ని పదిహేను నిమిషాల్లో పూర్తిచేయగల నేర్పరి వేటూరి. బొంబాయి సినిమా తీసేటపుడు సంగీత దర్శకుడు రహమాన్‌తో బాటు పాటల రచయిత కూడా ఉండాలని వేటూరిని వెంటతీసుకెళ్లారట. అక్కడ లొకేషన్‌లో రహమాన్‌ మదిలో మెదిలిన స్వరానికి పదిహేను నిమిషాల్లో పదాలల్లి ఔరా అనిపించుకున్న పదప్రబంధం వేటూరి.
(కన్నానులే కలయికలు)(బొంబాయి)
కొత్త కొత్త పదబందాలు..సరికొత్త భావ శిల్పాలు..రాగాలతో రంగరించే వినూత్న స్వరాల సవ్వడులు కోకొల్లలు.
(ఉప్పొంగెలే గోదావరి)(గోదావరి )
వేటూరికి పాటంటే ప్రాణం. అంతే కాదు పాటను పలికించే మాతృబాషంటే పంచప్రాణాలు..ఆ బాష బంగపడితే తట్టుకోలేని సరస్వతి తనయుడు. 1994 తెలుగుపాటకు రెండవసారి పురస్కారం అందుకున్నరోజు తెలుగు బాషకు ప్రాచీన గౌరవం దక్కలేదని ఉద్వేగానికి గురయిండు.
పాట.
ఎంత పెద్ద నది కూడా చిన్న ఊటపాయతోనే ప్రాణపోసుకుంటది. ఎన్ని వేల మైల్ల ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలయితది. జర్నలిస్ట్‌ గా ప్రస్థానాన్ని మొదలు పెట్ఇన వేటూరి తన జీవిత ప్రస్థానంలో ఎన్నోమైలు రాళ్లను అధిగమించి మహాప్రస్థానికి మళ్లిన ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అందరం ప్రార్దిద్దాం.

వరంగల్‌ భద్రకాళి అమ్మవారి దేవాలయ చరిత్ర


ఎ. జనార్దన్‌
ఇంట్రో యాంకర్‌
చల్లని చూపుల తల్లి, ఓరుగల్లు ప్రజల కల్పవల్లి భద్రకాళి అమ్మవారు. కోరిన కోర్కెలు తీర్చెందుకు కొలువైన కొండంత దేవర. భద్రకాళి అమ్మవారిని ఓరుగల్లు ప్రజలు భక్తి ప్రవృత్తులతో పూజిస్తరు. ఈ వారం తెలంగాణ ఆలయాల్లో పిలిస్తే పలికే దైవం వరంగల్‌ భద్రకాళి అమ్మవారి ఆలయక్షేత్రాన్ని దర్శించి వద్దాం.
బ్యాంగ్‌
యాంకర్‌ 1
అమ్మలగన్న అమ్మ.. ఆది పరాశక్తి..ముగ్గరు అమ్మల మూలపుటమ్మ.. ఇలా ఏ పేరుతో కొలిచినా వరాలిచ్చే వరదాయిని వరంగల్‌ భద్రకాళి అమ్మవారు. శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయానికి పెద్ద చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వాయిస్‌
ఇది వరంగల్‌ భద్రకాళి అమ్మవారి దేవాలయం. ఈ ఆలయానికి వందల ఏండ్ల చరిత్ర ఉంది. సుమారు ఎనిమిది వందల ఏండ్ల కిందట ఏకాశిలనగరాన్ని రాజధానిగా చేసుకొని కాకతీయులు ఈ ప్రాంతాన్ని పాలించేవారు. నాటి ఏకాశిల నగరమే నేటి వరంగల్‌. కాకతీయ రాజులందరూ శివ భక్తులు. కాకతీయ సామ్రాజ్యంలో ఊళ్లన్నిటిలో శివాలయాలను కట్టించినరు. ఈ ఆలయాన్ని పశ్చిమ చాళుక్య ప్రభువైన రెండవ పులకేశి కట్టించిండు. ఈ అమ్మవారిని కూడా కాకతీయ వంశస్థుల ఆదరించిండ్రు. కాకతీయులు శివారాధకులైనప్పటికీ అందరూ దేవతలనూ సమానంగా పూజించిండ్రు. ఈశ్వరుని ఆరాధించినట్లే అమ్మవారిని కూడా వివిధ రూపాలలో ఆరాధించినరు.
స్పాట్
ఈ దేవాలయానికి శతాబ్దాల చారిత్రక నేపథ్యం ఉన్నది. వేంగీ చాళుక్యులపై విజయం సాధించటానికి పశ్చిమ చాళుక్య ప్రభువైన రెండవ పులకేశి నిర్మించినట్లు చారిత్రక కథనం ఉంది. పరాయి మతస్తుల పాలనలో ఆలయ ప్రాభవం కొంచెం మసకబారినా.. తర్వాత మళ్లీ పూర్వవైభవం సంతరించుకుంది. భద్రకాళీ మహిమలపై అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నయి. ఆ ఆలయాన్ని సందర్శించిన భక్తులు చెప్పే గాధలు కోకొల్లలు .
బైట్‌ - భక్తులు
యాంకర్‌ 2
కాకతీయల కాలంలో నిత్య ధూపదీప ఆరాధనలతో విరాజిల్లిన భద్రకాళి అమ్మవారు కాలక్రమంలో నిరాదరణకు గురయింది. ధూపదీపాలు కరువయినయి. అమ్మవారిని పట్టించుకొనే వారే కరువయినరు. అప్పుడే కొందరు భక్తులు ఆలయ పునరుద్దరణకు నడుంబింగించిండ్రు.
వాయిస్‌
ఈ ఆలయం 1313 తర్వాత తన ప్రాభవాన్ని పూర్తిగా కోల్పోయింది. కాకతీయ సామాజ్ర్యం పతనమయినాక ఈ దేవాలయాన్ని పట్టించుకునేవారు కరువయినరు. ధూపదీప నైవేద్యాలతో దేదీప్యమానంగా వెలిగిపోయే అమ్మవారి ఆలయం పడావుపడినట్టు ఉండటం ఇక్కడి ప్రజలను మనస్థాపినికి గురిచేసింది. ఎలాగైనా అమ్మవారి ఆలయాన్ని పునరుద్దరించాలని స్థానిక ప్రజలు నడుంబింగించిండ్రు. ఆలయ పునరుద్దరణకు కృషి చేసినవారిలో చెప్పుకోదగ్గ వ్యక్తుల్లో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ గణేష్ శాస్త్రి, రామానుజా చార్యులు. అప్పట్లో నగరంలో బాగా పేరున్న వ్యాపారి మగన్ లాల్ నమేజా దగ్గరకు వెళ్లి ఆలయ పునరుద్దరణ గురించి అడగాలనుకున్నరట. కానీ అతను అందుకు ఒప్పుకుంటడో లేదో అనే అనుమానంతో అడగడానికి సంకోచించిండ్రు. అయితే అంతకు ముందు రాత్రే అమ్మవారు మగన్ లాల్ కి కలలో కన్పించి..ఆలయ పునరుద్ధరణకు కృషిచేయాలని ఆదేశించిందట. అమ్మవారి మాటలను తేలిగ్గా తీసుకుని, ఆలయ పునరుద్దరణను నిర్లక్ష్యం చేసిండు. అమ్మమాట నిర్లక్ష్యం చేసినందుకు వ్యాపారి పెద్ద మూల్యమే చెల్లించుకోవలసి వచ్చింది. మగన్‌లాల్ ముద్దుల పట్టీ.. గారాల బిడ్డకు నోట మాట పడిపోయింది. ఈ పరిణామానికి మగన్‌లాల్‌ మదనపడిపోయిండు. అదే సమయంలో ఆలయపునరుద్దరణకు నడుంబిగించిన గణేష్‌ శాస్త్రి, రామానుజాచార్యులు మగన్‌లాల్ ని కలిసి తమ సంకల్పం వివరించిండ్రు. మగన్ లాల్‌ కూడా తనకు జరిగిన వృత్తాంతాన్ని వివరించి..తన బిడ్డకు తిరిగి మాటొస్తే అమ్మవారి ఆలయ పునరుద్దరణకు తప్పక కృషిచేస్తనని తెలిపిండట. అమ్మవారి ఆలయాన్ని పునరుద్ధరిస్తే.. అమ్మాయికి మాటలొస్తయని మంగన్‌లాల్‌కి చెప్పినరట గణేష్ శాస్త్రి, రామానుజాచార్యులు. భద్రకాళీమాతకు అభిషేకించిన తీర్థాన్ని నెల రోజుల పాటు మగన్ లాల్ కూతురుకి తాగించడంతో ఆమెకు తిరిగి మాటలు వచ్చినయ్. అమ్మవారి మహిమలకు ముగ్దుడైన వ్యాపారి వెంటనే ఆలయ పనులను ప్రారంభిచిండని ఇక్కడి వారు చెప్పుకుంటరు.
స్పాట్
ఆలయ పునరుద్దరణ ప్రారంభమైనప్పటినుంచి అమ్మవారికి తిరిగి పూజలు చేయడం ప్రారంభమైంది. ధూపదీప నైవేధ్యాలతో భక్తులు ప్రతినిత్యం సేవించడం మొదలుపెట్టినరు. ప్రతీ అశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు, ఛైత్ర మాసంలో వసంతరాత్రులు ఎంతో వైభవంగా జరుపుతున్నరు. ఆషాడ మాసంలో అమ్మవారిని శాకంభరిగా అలంకరిస్తారు. వైశాఖ శుధ్ద పంచమినాడు శంకర జయంతి సందర్భంగా అమ్మవారికి బ్రహ్మోత్సవ కళ్యాణం చేస్తరు.
స్పాట్
యాంకర్‌ 3
ఈ ఆలయ ప్రాంగణం మొత్తం భక్తి భావాలతో తొణికసలాడుతుంటది. ప్రశాంత వాతావరణంతో ఆద్యాత్మికత ఉట్టిపడుతుంటది. అమ్మను నమ్ముకున్న వారికి కష్టాలుండవని భక్తుల నమ్మకం. అందుకే దేశం నలుమూలల నుంచి భద్రకాళి అమ్మను కొలిచేందుకు ఇక్కడకొస్తరు.
వాయిస్‌
ఈ ఆలయం ఆధ్యాత్మికతకే కాకుండా పచ్చని ప్రకృతితో భక్తులకు నయనానందాన్ని కలుగిస్తున్నది. శ్రీభద్రకాళి దేవాలయాన్ని ఆనుకుని ఉన్న రెండున్నర కిలోమీటర్ల చెరువు నగర వాసుల దాహార్తిని తీర్చడంతో పాటు... సందర్శకులను ఆకర్షిస్తున్నది. చుట్టూ సహజంగా ఉన్న కొండలు దేవాలయానికి అదనపు ఆకర్షణగా నిలిచి, గాంభీర్యాన్ని తీసుకొస్తున్నయి
స్పాట్‌
ఆలయ కుడ్యాలపై అందమైన శిల్పాలు అలరిస్తయి. చరిత్రను వివరించే శాసనాలుకూడా అక్కడక్కడా కనిపిస్తయి. పక్కనే ఉన్న చెరువు వల్ల ఇక్కడి వాతావరణం అత్యంత ఆహ్లాదకరంగా ఉంటది. ఎత్తైన కొండదిగుంన ఉన్న ఈ ఆలయం చూడ చక్కగా ఉంటది. ఈ ఆలయానికి ఒక వైపున పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు అందంగా కొలవుదీరినయి. ఆలయ గోపురాల పై అందమైన శిల్పాలు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటయి. భక్తులకు నీడ కోసం ఆలయ ప్రాంగణంలో రేకుల షెడ్లు వేయించిండ్రు. ఇక్కడికొచ్చిన భక్తులు శ్రీ వల్లభ గణపతిని కూడా కొలుస్తరు. కొబ్బరి కాయలు కొట్టేందుకు ప్రత్యేక స్తలాన్ని కేటాయించిండ్రు. భక్తలు ఆలయ ధ్వజ స్తంబం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శించుకుంటరు. అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు కూడా దర్శించుకోవచ్చు.
బైట్‌ - భక్తురాలు
యాంకర్‌ 4
శ్రీ భద్రకాళి అమ్మవారిని త్రిపుర సుందరిగా పిలుచుకుంటరు. అమ్మది చూడచక్కని రూపం. ఆ తల్లిని చూసి భక్తి పారవశ్యానికి లోని కాని వారుండరంటే నమ్మండి. ముల్లోకాలకు పెద్ద ముత్తైదువ ఈ భద్రకాళి అమ్మవారు.
వాయిస్‌
వరంగల్‌ భద్రకాళి అమ్మవారిని త్రిపుర సుందరిగా పిలుస్తరు. అంటే ముల్లోకాలలో కెల్లా అందమైనదిగా అర్ధం. విశ్వంలోని స్త్రీ శక్తిని, ప్రకృతి శక్తినంతటిని కలిపి త్రిపుర సుందరిగా పిలుస్తరు. శ్రీ భద్రకాళీ అమ్మవారి అమ్మవారి విగ్రహాం 9 అడుగుల ఎత్తుతో 9 అడుగుల వెడల్పుతో కన్నుల పండుగగా అలరారుతూ భక్తులను కటాక్షిస్తున్నది.అమ్మవారు ప్రేతాసినియై కొలువుతీరింది. తల్లి 8 చేతులతో.. కుడివైపు ఉన్న 4 చేతులలోయ ఖడ్గము, ఛురిక, జపమాల, ఢమరుకము.. ఎడమవైపు ఉన్న చేతులలో ఘంట, త్రిశూలము, ఛిన్న మస్తకము, పాన పాత్రలున్నాయి. అమ్మవారు పశ్చిమాభిముఖముగా ఉంది.
స్పాట్ విజువల్స్...అమ్మవారివి వాడగలరు.
నయన మనోహరంగా జరుగుతున్న అమ్మవారి ఉత్సవాలను చూడటానికి వరంగల్ నుంచే కాక చుట్టుపక్కల జిల్లాల జనం కూడా వస్తున్నరు. భక్తులు సమర్పించిన రకరకాలపూలతో భద్రకాళి అమ్మవారు కళకళలాడుతూ కోరిన మొక్కులు తీర్చే తల్లిని దర్శించుకుని భక్తులు అమితానందంతో తిరిగి వెళుతున్నరు.
స్పాట్
వాయిస్...
అమ్మవారి కళ్యాణం సందర్భంగా దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తరు.అమ్మవారు కొలువైన పెళ్లిమంటపాన్ని రకరకాల పూలతో అలంకరించారు.శక్తిప్రదాయని శ్రీ భద్రకాళీ అమ్మవారి కళ్యాణం తిలకిస్తే ఎంతో పుణ్యమని భక్తుల నమ్మకం.కాకాతీయుల కాలంలో విరజిల్లి తర్వాత ప్రాభవం కోల్పోయిన అమ్మవారి దేవాలయం మగన్ లాల్ నమేజా లనే వ్యాపారి పునరుధ్దరించిడు.అప్పటి నుంచి శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆశీస్సులు ఓరుగల్లు వాసులకు చల్లని దీవెనలుగా మారాయి.
బైట్..భక్తురాలు.

యాంకర్ 5
అమ్మవారికి ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు జరుపుతరు. వైశాఖ మాసంలో ఎంతో వైభవంగా జరుపుకునే ఈ ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి భక్తుల హాజరుయితరు. సృష్టికర్త బ్రహ్మదేవుడే ఈ ఉత్సవాలను ప్రారంభించిండని ఇక్కడి భక్తులు చెప్పుకుంటరు. అంకురార్పణతో మొదలయి బ్రహ్మోత్సవ సమాప్తితో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తయి.
వాయిస్‌
భద్రకాళి దేవస్థానంలో ప్రతియేటా వైశాఖ మాసంలో జరిపే బ్రహ్మోత్సవాలకు అత్యంత ప్రాధాన్యత కలదు. పదకొండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతయి. విద్యుద్దీపాలతో అలంకరించిన ఆలయం దేదీప్యమానంగా వెలిగిపోతుంటది. .. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు.. ఈ బ్రహ్మోత్సవాలకు హాజరయిన భక్తులు అమ్మవారిని అత్యంత భక్తి ప్రపత్తులతో పూజిస్తరు. ఏడాదికోసారి జరిగే ఈ ఉత్సవాలకు ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి జనం ఇక్కడకు వస్తరు.
స్పాట్
వాయిస్
శ్రీ భద్రకాళీ అమ్మవారి కళ్యాణం రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తరు.ఉదయం శంకరభగవాత్పద సమారాధన అనంతరం చతుస్థానార్చన చేసి అమ్మవారికి సింహవాహనం సేవ చేస్తరు. సాయంత్రం గజవాహన సేవ చేసి శ్రీ భద్రకాళీ భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ మహోత్సవం జరుగుతది.
బైట్...ప్రవచనము...వాడగల
స్పాట్
ఉత్సవాల్లో రెండో రోజు ఉదయం వృషభవాహన సేవ, ధ్వజారోహణము జరిగుతది . యాగశాల ప్రవేశము, యాగమండప స్థూణ పూజ, ద్వారతోరణపూజలు నిర్వహిస్తరు. సాయంత్రం అమ్మవారికి జింక వాహన సేవా ఉత్సవం జరుగుతది. దీప నైవేద్యాలతో భద్ర కాళీ అమ్మవారిని కొలుస్తరు
స్పాట్........
బైట్...వినయ్ భాస్కర్...మాజీ ఎమ్మేల్యే.
ఉత్సవాల్లో మూడో రోజు మకర వాహన సేవతో అమ్మవారి ఉత్సవాలు మొదలవుతయి. సాయంత్రం చంద్రప్రభ సేవతో శ్రీ భద్రకాళీ భధ్రేశ్వరుల ఎదుర్కోలు ఘనంగా జరుగుతయి.
విజువల్స్‌ : ప్రవచనము వాడుకోగలరు
స్పాట్.....
వాయిస్
ఐదోరోజు శంకర భగవాత్పద సమారాధన తర్వాత చతుస్థానార్చన చేసి అమ్మవారికి సింహవాహన సేవ చేస్తరు. అమ్మవారి కళ్యాణం సందర్భంగా దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తరు. కళ్యాణ మండపాన్ని రకరకాల పూలతో అలంకరిస్తరు. శక్తిప్రదాయిని అయిన అమ్మావారి కళ్యాణం తిలకిస్తే ఎంతో పుణ్యమని భక్తుల నమ్మకం.
స్పాట్
గజవాహన సేవ అనంతరం శ్రీభద్రకాళీ..భద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవం మొదలైతది. సాక్షత్తు పరమశివుడే కళ్యాణ ఘడియలు నిర్ణయించుకున్న శుభదినం అయిన వైశాఖ శుద్ధ పంచమి నాడు అమ్మవారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగుతది. వేదాంతులు చెప్పే శివకళ్యాణ వైభవ ప్రవచనాన్ని భక్తులు ఎంతో శ్రద్దగా వింటరు.
విజువల్స్‌ : ప్రవచనాన్ని వాడుకోగలరు.
స్పాట్.....
ఈ ఆలయంలో ఆశ్వీయుజ మాసంలో దేవీ శరన్నవరాత్రులు, చైత్ర మాసంలో వసంత రాత్రులు, ఆశాఢ మాసంలో పౌర్ణమినాడు అమ్మవారిని శాఖంబరి దేవిగా కొలుస్తరు. శాఖంబరి దేవి అంటే తల్లిని అన్ని రకాల కూరగాయలతో అలంకరించి సేవిస్తరు. శాకలు అలంకరించడం వలన ఈ దేవికి శాకంభరి అనే పేరొచ్చింది. ఈ శాకంభరి దేవి నుంచే అన్న పానాదులు, సకల ఆహారాదులు ఉత్పత్త
బైట్స్: పూజారులు
ఎండ్‌ యాంకర్‌
ఇదీ వరంగల్‌ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయ చరిత్ర. మరో తెలంగాణ ఆలయంతో మళ్లీ కలుసుకుందాం..అంత వరకు శలవు.

భద్రాచల రామాలయం చరిత్ర


ఎ. జనార్దన్
ఇంట్రో యాంకర్
రామా అన్న రెండక్షరాలు సకల పాపాలను హరించి మోక్షాన్నిస్తయి. అందుకే ఆ రాముడికి గ్రామగ్రామానా గుడి కట్టించి ఇష్టదైవంగా కొలుస్తున్నరు. అగస్త్యమహాముని తెలిపిన 14 రామాలయ దివ్యక్షేత్రాలలో మొదటిది అయోధ్య అయితే... అంతే ఘనకీర్తి గల భద్రాచలం రెండవది. తెలంగాణ ఆలయాల్లో ఈ రోజు భద్రాచల పుణ్యక్షేత్రాన్ని దర్శించి వద్దాం..
బ్యాంగ్‌ (కోదండరాముడు కొలువైన భద్రగిరి)( రామదాసు చిత్రంలో చిరుచిరు నగవుల గోదావరి కోరస్‌ మ్యూజిక్‌తో బ్యాంగ్‌(ఆఖరున ఇదిగిదిగో నా రాముడు ఈడనే కొలువైనాడు..తో ఎండింగ్)
యాంకర్ 1
భద్రాచలం...తెలంగాణ గడ్డ గర్విచదగ్గ పుణ్యక్షేత్రం. ఆమాట కొస్తే యావత్ ప్రపంచ రామభక్తుల మన్నన పొందిన రామాలయం ఇది. ఈ ఆలయం ఇంతటి ఘనకీర్తి మూటగట్టుకోవడం వెనక చాలా చరిత్ర ఉంది. శ్రీరాముడు తన భక్తులను కరుణించేందుకు వైకుంఠం నుంచి నేరుగా దిగి వచ్చి ఇక్కడి కొలువుతీరిండని స్థలపురాణం. దానికీ ఓ కథ ఉంది. ఆ రసరమ్య రామకథ ఒక్కసారి చూద్దాం.
వాయిస్ 1
ఇది రామపాద ధూళితో పునీతమైన క్షేత్రం. సీతారాములు నడయాడిన దివ్యధామం. పితృవాక్యపరిపాలకుడై రాముడు వనవాసియై జీవిస్తున్న తరుణంలో గోదావరి తీరాన పర్ణశాల నిర్మించుకొని ఉన్నరు. దండకారణ్యంలో విహరిస్తున్న సీతారాములను సూర్యతాపం బాధించింది. నీలికలువల్లాంటి రామ పాదాలు ఎర్రతామరలయ్యాయి. సీతమ్మ చెక్కిళ్లు కంది పెదవులను పోలిన పగడాలయ్యాయి. ఆ ఎర్రటెండలో సీతారాములు ఒక శిల పై ఆశీనులయ్యారు. ఆ శిల జానకీరాములకు పాలకడలిలో ఆదిశేశుడు అందించి సౌఖ్యాన్ని అందించింది. ఆ శిల చల్లని హాయినివ్యడమే కాకుండా మృదువుగా హంసతూలికా తల్పమంత సుఖాన్నివ్వడంతో రాముడు ఉప్పొంగిపోయిండు. సీతమ్మ కూడా ఆ శిలను మనసారా దీవించింది. ఆ శిలకు ఏదైనా వరం ఇవ్వమని అడిగింది. ఇష్ట సఖి మీదా, ఆ శిల మీదా మమకారంతో రాముడు ఆ శిలకు వరమిచ్చిండు. “ఓ శిలారాజమా ! వచ్చే జన్మలో నీవు మేరుపర్వత రాజు పుత్రుడవై జన్మిస్తవు. భద్రుడనే పేరుతో వర్దిల్లుదువు.నిత్యం నా నామ స్మరణతో పరమ నాకు భక్తుడువయితవు. అప్పడు నీ శిరసు పై కొలువై ఉండి కలియుగమున సకల జనులను ఉద్దరించ గలను’’ అని వరమిచ్చిండు. అంటే త్రేతాయుగంలోనే ఈ భద్రాచల పుణ్యక్షేత్ర ఆవిర్భావానికి పునాదులు పడ్డయన్న మాట.
స్పాట్‌-“ ఇదిగిదిగో నారాముడు ఈడనే...’ సాంగ్‌తో స్పాట్‌
యాంకర్‌ 2
సీతారాముల వరాన్ని పొందిన ఆ శిలారాజము మరు జన్మలో భద్రుడిగా జన్మించి రాముణ్ని శిరసు పై ధరించే వరం పొందింది. అందుకే సీతారాముణ్ని రామభద్రుడని కూడా పిలుస్తరు. ఈ వరం పొందడానికి భద్రడు చేసిన కృషి అంతా యింతా కాదు. ఆ కోదండరాముని మనసు దోచుకోవడమంటే మాటలా..
వాయిస్‌
మేరు పర్వతరాజ దంపతులకు పుత్రసంతానం లేక ఎన్నో పూజలు చేసి, ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగిండ్రు. అయినా ఒక్క దేవుడు కూడా వరమియ్యక పోవడంతో మేరుపర్వతరాజు బ్రహ్మకోసం ఘోర తపసు చేసిండు.( బ్యాంక్‌ గ్రౌండ్‌లో ఓం మ్యూజిక్‌ రావాలి.) విధాత ప్రత్యక్షమయి మేరురాజుకు వరమిచ్చిండు. పుట్టబోయే బిడ్డ రామ భక్తుడై లోకోద్దారకుడవుతాడని తెలిపిండు. తరువాత కొంత కాలానికి దంపతులు... బ్రహ్మ వరప్రభావంతో సకల కళామూర్తియైన పండంటి బిడ్డకు జన్మనిచ్చిండ్రు. పువ్వుపుట్టగానే పరిమళించిందన్న చందంగా భద్రుడు నిత్యం రామనామాంకితుడై, రామభక్తి తో ఎదగసాగిండు.రాజకుమారుడైనా ఇహలోక సౌఖ్యాలపై మమకారం లేదు. సుందరాంగులకేసి కన్నేసి చూడడు.. మణిభూషణాలు అలంకరించడు. దీంతో మేరుదంపతులు విచారవదనాలతో బాధపడుతుండగా నారదమహర్షి భద్రుని పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరించిండు. లోకాలను శిరసుపై మోసిన విష్టుమూర్తిని తన శిరసున నిలుపుకునే అదృష్టం భద్రుని దని తెలిపిండు. అంతటితో ఆ దంపతులు కాస్త కుదుటపడ్డరు.
స్పాట్‌
భద్రుడు రామనామస్మరణతో, భక్తి ప్రవృత్తులతో ఉండగా ఒక శుభోదయాన నారద మహర్షి భద్రునికి తారక మంత్రం ఉపదేశించిండు.(బ్యాక్‌ గ్రౌండ్‌లో శ్రీరామరామేతు రామనామ మనోరమే..మంత్రం ) ఆ మంత్రజపంతో భద్రుడు..భద్రాచల ప్రాంతానికి చేరుకొన్నడు. రామదర్శనం కోసం ఘోర తపస్సు చేసిండు. ( రామదాసు సినిమాలో భద్రుడు తపస్సు చేసే బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌)భద్రుని తపస్సుకు మెచ్చిన ఆ విష్టుమూర్తి ప్రత్యక్షమయిండు. తనకు త్రేతాయుగంలో రాముడి రూపంలో దర్శనమీయమని కోరిండు. అంతటితో వామపార్శ్వమున జానకీ ఆసీనురాలై ఉండగా..శంకచక్రములు అటుఇటుగా చతుర్భాహువులతో లక్ష్మణ సమేతుడై దర్శనమిచ్చాడు.
స్పాట్( స్మాల్‌...వామాంకస్థిత జానకీ పరిసలతో కోదండ దండం కరే..సాంగ్ తో)
వాయిస్‌
త్రేతాయుగంలో రాముడు భద్రునికి ఇచ్చిన వరప్రభావంతో..భద్రుని శిరసు పై కొలువై ఉన్నడు. అదే నేటి భద్రగిరిగా రూపుదాల్చింది. అశేష భక్తుల పూజలందుకుంటుంది.
యాంకర్‌ 3
ఈ భద్రాచల క్షేత్రం ఒక్క భద్రుడినే కాదు ఎందరో భక్తులను ఉద్దరించింది. త్రేతాయుగంలో రాముడికి ఎంగిలి పళ్లను తినిపించిన మమకారానికి ఈజన్మలో కూడా శబరి ఆ రామభద్రుడి సేవకు అర్హురాలైంది. పోకల దమ్మక్కగా రామశిలకు నీడనిచ్చేందుకు తహతహలాడిండి. రామాలయ నిర్మాణానికి దమ్మక్క పట్టుదలే కారణం.
వాయిస్‌
పోకల దమ్మక్క ఒక గిరిజన మహిళ. దమ్మక్కలేనిదే భద్రాచల క్షేత్రం లేదు. పరమ రామభక్తురాలైన ఆ శబరి ఈ జన్మలో దమ్మక్కగా జన్మించిందని చెప్పుకుంటరు. అవును మరి త్రేతాయుగంలో ఆ శబరి రాముణ్ని చూడాలని ఎంత మదనపడిందో ఈ కలియుగంలో దమ్మక్కకూడా రామదర్శనం కోసం అంత తాపత్రయపడింది.
స్పాట్‌
రామభక్తురాలైన పోకల దమ్మక్క భద్రిరెడ్డి గ్రామానికి చెందిన గిరిజన మహిళ. భద్రుని పై రాముడు వెలిశాక ఎందరో మునులు, మహర్షులు రాముణ్ని కొలిచిండ్రు, పూజలు చేసిండ్రు. కాల క్రమంలో ఈ రామచంద్రుని అర్చారూపం చెట్టుపుట్టలతో నిండిపోయింది. ఆ దట్టమైన దండకారణ్యంలో ఉన్నకోదండరామ దివ్యమూర్తులు పూజానైవేద్యాలు లేక చెట్టుపుట్టల మధ్య కొలువై ఉన్నరు. ఒకరోజు దమ్మక్క కలలో సీతారాములు కనిపించి...దమ్మక్కా మేం భద్రగిరి పై అర్చారూపంలో కొలువై ఉన్నాము. మమ్ములను వెలికితీసి సేవించమని తెలిపిండు. దమ్మక్క సంతోషానికి అవధులు లేవు. ఈ వార్త గూడెం గూడేనికి మొత్తానికి తెలిపింది. మరునాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు రాముని జాడకోసం వెతికింది. అయినా రాముని జాడ కనపడలేదు. దమ్మక్క కడివేడు కన్నీళ్లతో అక్కడే కుప్పకూలింది. తానేం తప్పుచేశానని రాముణ్ని మనసులోనే నిలదీసింది. ఆ రాత్రి మళ్లీ దమ్మక్క కలలో కనిపించి ఈ రోజు తప్పకుండా కనిపిస్తనని. భద్రాచలం గుట్ట పై వెదకమని తెలిపిండు.
స్పాట్‌
తెలతెలవారుతుండగానే దమ్మక్క భద్రాద్రికి చేరుకుంది. గుట్ట పైకి ఒక కాలిబాట కనిపించింది. ఆ కాలిబాట వెంట రామచంద్రా..రామ చంద్రా..అనిపిలుకుంటూ వెళ్లింది.(ఇక్కడ రామదాసు సినిమాలో దమ్మక్క (సుజాత) రామచంద్రా అని పిలవడాన్ని బ్యాక్‌గ్రౌండ్‌లో వేసుకోవచ్చు. ఇమేజెస్ తో) ఒక పుట్టలోంచి ఓహో అని శబ్దం రావడంతో అటుతిరిగి చూసింది. ఆశ్చర్యంగా తాను కూర్చున్న బండ ఎదురుగా పుట్టలోంచి కాంతులు వెదజల్లడం చూసింది. దమ్మక్క. తనకు ఓహో అన్న శబ్దం కూడా ఆపుట్టలోంచే వినిపించడంతో.. ఆ పుట్ట దగ్గరకు పుట్టలోకి తొంగిచూసింది. సీతాసమేతుడైన రామభద్రుడు, పక్కనే లక్ష్మణుడు ఉండటంతో దమ్మక్క సంతోషంతో ఊగిపోయింది. గోదారినీళ్లతో పుట్టను అభిషేకించడంతో సీతారామలక్ష్మణ మూర్తులు వెలుపలికి వచ్చారు. వెంటనే ఆ ప్రాంతమంతా పందిళ్లు వేశారు. తోరణాలు కట్టి అలికి ముగ్గులు వేశారు. అప్పటినుంచి భద్రగిరి వెలుగులోకి వచ్చింది. పూజలైతే చేస్తున్నరు కానీ రాముడికి నీడలేక ఎండకు ఎండి, వానకు తడుస్తున్నడు. గుడికట్టిచ్చే శక్తి లేక గిరిజనులు విగ్రహమూర్తులకు అలాగే పూజలుచేస్తున్నరు.
స్సాట్‌
యాంకర్‌ 4
భద్రాచల సీతారామచంద్రడు అలా వెలుగులోకి వచ్చాక...ఆయన విగ్రహమూర్తులను ఎండావానల నుంచి రక్షించేందుకు గుడి కట్టేందుకు సంకల్పించిండు ఓ భక్తుడు...సీతాపతికి గుడి కట్టడానికి సీతమ్మోరి కష్టాలు అనుభవించాల్సి వచ్చింది ఆయనకు. ఆయనే రామదాసుగా పేరొందిన కంచర్ల గోపన్న...గోపన్న చరిత్ర కూడా భద్రమహర్షి అంతటి గొప్పదే..ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం....
వాయిస్‌
కంచర్ల గోపన్న..ఈ పేరులోనే గోపబాలుడు వినిపిస్తున్నడు. కంచెర్ల గోపన్నది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం. తల్లి కామాంబ, తండ్రి లింగమంత్రి.చాలా కాలం సంతాన లేమితో మదనపడ్డారు. ఎన్నో పూజలు చేశారు. వ్రతాలు చేశారు. అయినా దేవుడు తమ మోర ఆలకించలేదని బాధపడేవారు. ఆఖరుకు కొండపల్లిలో ఉన్న సంతాన గోపాలస్వామికి మొక్కుకుంటే గోపన్న జన్మించిండు. గోపాస్వామి ప్రసాదం కాబట్టి గోపన్న అనే పేరుపెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నరు.
స్పాట్
గోపన్నకు చిన్నతనం నుంచే రాముడన్నా, కృష్టుడన్నాఎక్కడలేని భక్తి. గురువుల వద్ద అనేక పురాణ కథలను తెలుసుకునే వాడు. యువకుడిగా ఉన్న గోపన్న ప్రజోపయోగ కార్యక్రమాలు చేసేవాడు. అప్పట్లో బందిపోటు దొంగల బెడద ఉండేది. స్థానికుల సాయంతో బందిపోట్లను ఎదుర్కొని రైతులను కాపాడేవాడు. అప్పట్లో అబుల్ హసన్‌ కుతుబ్‌ షాహీ గోల్కొండ సింహాసనాన్ని అధిష్టించి పరిపాలిస్తున్నడు. గోపన్న మేనమామలు అక్కన్న, మాదన్నలు కుతుబ్‌షాహీ కొలువులో మంత్రులుగా పనిచేస్తున్నరు. గోపన్న మంచి పనులు వీరి ద్వారా కుతుబ్‌షాహీకి తెలిసినయి. వెంటనే గోపన్నను పిలిపించి పాల్వంచ పరగణాకు తహశిల్దార్‌గా నియమించిండు. కానీ ఎప్పటి నుంచో ఈ పదవి పై కన్నేసి ఉంచిన అబ్దుల్లాకు ఈ నిర్ణయం నచ్చలేదు. ఎలాగైనా గోపన్నను ఆ పదవి నుంచి తప్పించాలనుకున్నడు. సమయం కోసం ఎదురు చూడసాగిండు.
స్పాట్
గోపన్న పదవీ బాధ్యతలు స్వీకరించగానే భద్రాచలం వెళ్లి తన ఇష్టదైవం రాముణ్ణి దర్శించుకొని వచ్చిండు. రాముడికి నిలువ నీడలేక ఎండావానలకు తడవడాన్ని గోపన్న జీర్ణించుకోలే పోయిండు. అక్కడి ప్రజల సహకారంతో రాముడికి గుడి కట్టించేందుకు సన్నాహాలు ప్రారంభించిండు. గ్రామగ్రామానా చందాలు వసూళ్లు చేసి సీతారాములకు గర్భాలయం, గోపురాలు, గోపురాల పై కలశాలు, చుట్టూ కోవెలలు, ముఖ మంటపం, అధ్యయనోత్సవ మంటపం, పవళింపు సేవలకు అద్దాలగది, వెండి శేష పాన్పు, ఎత్తేన ధ్వజ స్థంబ నిర్మాణాలు చకచకా జరిగిపోతున్నాయి. రామయ్య కొరకు రధ, గజ, అశ్వ, హంస, సింహ, గరుడ, హనుమ, సూర్యప్రభ వంటి వాహనాలు కూడా నిర్మింపచేసిండు. గర్బాలయ శిఖరం పై శ్రీవారి చక్రం అమర్చడం మిగిలింది. శిఖరం పై చక్రమును అమర్చేందుకు ఎందరో శిల్పులు తమ ప్రయత్నం చేసిండ్రు. అయినా ఒక పట్టాన చక్రం కుదురుగా నిలవడం లేదు. శిల్పులు ఎంత ప్రయత్నం చేసినా వారి ప్రయత్నాలన్నీ వ్యర్ధం అయ్యాయి. ఈ పరిస్తితికి రామదాసు కలత చెంది, రామచంద్రప్రభు నేనేమి నేరం చేశానని బాధ పడుకుంటూ నిద్రలోకి జారుకున్నడు. నిద్రలో రామచంద్రుడు కనిపించి రేపు గోదావరి నదిలో స్నాన మాచరించి తనను ప్రార్దించమని తెలిపి అంతర్ధానమయిండు. మరుసటి రోజు తెల్లవారు ఝామునే రామదాసు కలలో రాముడు చెప్పినట్టు గోదావరి స్నానం చేసి రాముణ్ని తలచుకొన్న మరుక్షణమే అలపై ఒక తెప్పపై తేలియాడుతూ గోపురచక్రం రామదాసు వద్దకు వచ్చింది. ఈ చక్రాన్ని గోపురం పై విజయవంతంగా అమర్చగలిగిండ్రు శిల్పులు. ఇప్పుడు రామాలయం పై మనం చూస్తున్న చక్రం అదే.
యాంకర్‌ 5
మంచికి పోతే చెడు ఎదురయినట్టయింది రామదాసు పరిస్థితి. రాముడికి నీడ కల్పించానన్న సంతోషం ఎంతో సేపు నిలవలేదు. ప్రభువు అనుమతి లేకుండా చిల్లి గవ్వ వాడినా అది నేరమే పుణ్యం కోసం వాడినా ప్రభువుల దృష్టిలో అది ఘోర అపరాదం. ఆ అపరాదానికి తగిన మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది రామదాసు.
స్పాట్
భద్రాచలం మొత్తం రామనామ సంకీర్తనతో మారిమోగుతోంది. ప్రతి ఇల్లు రామభక్తులతో విరాజిల్లుతంది. రామాలయంలో పనులన్నీ చకచకా జరిగిపోయి, అంగరంగ వైభవంగా కళకళలాడుతుంది. రామధాసు సంతోషానికి అంవధులు లేవు. అంత సంతోషంలో ఒక విషాదం.. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశాడని అబియోగం మోపుతూ రామదాసుని బందీగా తీసుకురమ్మని తానీషా దగ్గర నుంచి భటులు ఆజ్ఞా పత్రం తెచ్చిచ్చారు. రామదాసు అరణ్యానికి వెళతున్న రామచంద్రుడి వలే చిరుమందహాసంతో భటుల వెంట గోల్కొండకు కదిలిండు. రాజదర్భారులో న్యాయమూర్తులు రామదాసుకు శిక్ష ఖరారు చేసిండ్రు. ఆరు లక్షల ద్రవ్యాన్ని కట్టాలి..లేదా కారాగార వాసం చేయాలని తీర్పు చేప్పిండ్రు. రామదాసు ఎవరిని సాయం కోసం అర్దించకుండా కారాగార వాసానికి సిద్ధపడ్డడు.
స్పాట్ ( రామరసరమ్య..సాంగ్ )
రామదాసుకు కారాగార వాసంలో వేధింపులు మొదలయ్యాయి. తన పై ఎప్పటినుంచో కక్ష్య పెంచుకున్న అబ్దుల్లా రామదాసును కారాగారంలో చిత్రహింసలు పెట్టసాగిండు. కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర కరువయింది. శరీరం రోజురోజుకూ కృంగి కృశిస్తంది. అయినా రామనామం వీడలేదు. భటులు కొట్టే దెబ్బలకు తాళలేక “”నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అని ఆర్తిగా అర్తించిండు.
స్పాట్‌(ననుబ్రోవమని చెప్పవే సాంగ్)
రామదాసు కన్నీళ్లు ఎవరినీ కరిగించలేదు. ఆరు లక్షల పైకం ఎక్కడ దాచావో చెప్పమని ఒత్తిడి చేస్తున్నరు. సర్కారు పైకాన్ని ఏం చేశావని నరకయాతనలు పెడుతున్నరు. ఈ బాధలకు తట్టుకోలేని రామదాసు రాముడికి తాను పెట్టిన ఖర్చుల లెక్కలు అప్పజెప్పిండు.
స్పాట్ ( సీతమ్మకు చేయిస్తి చింతాకు పథకమూ..సాంగ్)
యాంకర్ 6
కారాగారంలో ఎన్నో కష్టాలు పడుతున్న రామదాసు కన్నీళ్లకు సీతమ్మ కరిగిపోయింది. రామదాసును చెరనుంచి విడిపించమని సీతాపతిని వేడుకొంది. సీతమ్మ మాటలకు కరిగిన ఆ దాశరది..రామదాసు చిలుకను పంజరంలో బందించడం వల్లనే చెరసాల కష్టాలు అనుభవించాల్సి వచ్చిందని వివరించి రామదాసును విడిపించేందుకు బయలుదేరిండు.
వాయిస్
రామదాసు కష్టాలు నెరవేరే రోజు దగ్గరకు వచ్చింది. సాక్ష్యాత్తూ ఆ రామలక్ష్మణులే రామోజీ, లక్ష్మోజి రూపంలో తానీషా కు కలలో కనిపించి ఆరులక్షల పైకాన్ని చెల్లించి రశీదు పొందిండ్రు. ఇది కలా నిజమా అన్నట్లు తోచింది తానీషా ప్రభువుకు. వెంటనే మెలకువ వచ్చిన తానీషాకు తన ఎదురుగా ఆరులక్షల పైకం ఉండటాన్ని గమనించి ఆశ్చర్యచకితుడయిండు. తనకు కలలో కనిపించింది ఆ శ్రీరామచంద్రులేనని తానీషా గ్రహించిండు. తాను ఘోర తప్పిదం చేసినట్లు గ్రహించిండు. వెంటనే రామదాసుని ఖైదు నుంచి విడుదల చేయాల్సిందిగా ఆజ్ఞాపించిండు. రామదాసును అధితి సత్కారాలతో మర్యాదగా సాగనంపడమే కాకుండా తానీషా తాను కూడా భద్రాచల రామదాసును దర్శించి కళ్యాణం జరిపించిండు. ప్రతి సంవత్సరం శ్రీసీతారాముల కళ్యాణానికి తానీషా తానే ముత్యాల తలంబ్రాలను నెత్తిన పెట్టుకొని తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పటికీ ఆ సంప్రదాయం కొనసాగుతుంది. ప్రభుత్వంలో ఎరున్నా మంచి ముత్యాల తలంబ్రాలు, రోకటి పోటు లేని బియ్యం రామునికి ముత్యాలు తలంబ్రాలుగా వాడుతరు.
స్పాట్‌ ‘(జానకి దోసిట కెంపులు ప్రోవై...రాముని దోసిట నీలపు రాసై..ఆణిముత్యములు తలంబ్రాలుగా.. ) సాంగ్‌ తో..
ఈ రామాలయాన్ని దర్శించుకోడానికి దేశం నలుమూలలనుంచి రామభక్తులు ఇక్కడికొస్తరు. భద్రాచల అందాలు ఎంత చూసినా తనితీరనివి. ఇక్కడి గోదావరి నది రామపాదాలను కడిగేందుకు తహతహలాడుతుంటది. భక్తులు గోదావరి నదిలో స్నానమాచరించి సీతారాములను దర్శించుకుంటరు. కరకట్ట పై శ్రీరామ చరిత్రకు సంబంధించిన రామాయణ గాథలు శిల్పాలుగా ఏర్పాటు చేసిండ్రు. భద్రాచలంలోప్రవేశించగానే అంతెత్తు ఆంజేయ విగ్రహం రామ భక్తులకు స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంటది. ఒక్క సారి భద్రాచలాన్ని దర్శిస్తే వందసార్లు కాశీ క్షేత్రాన్ని దర్శించిన పుణ్యం కలుగుతదని స్థల పురాణంలో పేర్కొన్నరు.

ఇదీ.. భద్రాచల శ్రీ సీతా రామాలయ చరిత్ర..మరో తెలంగాణ ఆలయంతో మళ్లీ కలుసుకుందాం ..అంతవరకు సెలవు.

Wednesday, May 12, 2010

సికింద్రాబాద్‌లో ఉన్న అమ్మవారిని ఉజ్జయినీ అమ్మవారు గురించి


ఎ.జనార్దన్‌
అమ్మలగన్న యమ్మ... ముగ్గురమ్మలమ్మ మూలపుటమ్మ...సృష్టి లయకారుల చేత పూజలందుకుంటున్న దివ్యజనని... మహాకాళి అమ్మవారు. ఆ తల్లి చల్లని చూపు మనపై ఉంటే ఏ చీడ పీడా దరి చేరదు. ఆ అమ్మ దయ ఉంటే బిక్షగాడు కూడా లక్షాధికారి అయితడని భక్తుల నమ్మకం...ఇంత మహత్తు ఉన్న అమ్మవారు ఎక్కడో దూర దేశాన లేదు...మన సికింద్రాబాద్ లోనే ఉంది. ఉజ్జయినీ మహాకాళి అనగానే చాలా మందికి ఒక అనుమానం వస్తది. సికింద్రాబాద్‌లో ఉన్న అమ్మవారిని ఉజ్జయినీ అమ్మవారుగా ఎందుకు పిలుస్తరనే సందేహం కూడా కలుగుతది. దానికీ ఓ కథ ఉంది. అప్పట్లో భద్రాచలంలో రాముడికి...రామదాసు అనే భక్తుడు గుడి కట్టించినట్టే... ఇక్కడ ఈ ఆలయం నిర్మించ డానికీ ఒక భక్తుడే కారణం. ముగ్గురు మూర్తులకు తల్లి..మహాకాళి అమ్మవారు. ఆ తల్లి...ఒక భక్తుని కోరిక మేరకు సికిందరాబాద్‌లో వెలిసింది. 1813వ సంవత్సరంలో మిలిటరీలో పనిచేసే సురిటి అప్పయ్య అనే భక్తుడు దేవికి పరమ భక్తుడు. ఆయన ఉద్యోగ రీత్యా మధ్యప్రదేశ్‌కు బదిలీ అయ్యిండ్రు.అక్కడ ఉజ్జయినీ మహాకాళిని నిత్యం సేవిస్తూ ఉండేవాడు. ఒకసారి ఉజ్జయినిలో కలరా వ్యాపించింది. ప్రజలు పిట్టల్లా రాలి పోయిండ్రు. కాపాడే నాథుడు లేక విలవిల్లాడిండ్రు. ఆ రోజుల్లో కలరాను గత్తర గా పిలిచెటోళ్లు. గత్తర వ్యాధి సోకితే మరణం తప్ప మార్గం లేదు. ఈ కలరాకు అప్పట్లో సరైన మందు లేదు.కలరా వచ్చిందంటే ప్రాణాల మీద ఆశలు వదులు కోవల్సిందే.. తన మిత్రులు, బందువులు తన కళ్లముందే నేలకొరగడాన్ని చూసి సురిటి అప్పయ్య చలించి పోయిండు. ఉజ్జయిని అమ్మవారి వద్దకు వెల్లి తమ వారిని కాపాడమని ప్రాదేయపడ్డడు. ప్రజలను కలరా బారినుంచి కాపాడితే అమ్మవారి విగ్రహాన్ని తమ ఊరైన సికిందరాబాద్‌లో ప్రతిష్టించుకొని నిత్యం పూజలుల చేస్తమని మొక్కుకున్నడట. అప్పయ్య ఆభ్యర్దన విన్నదో...లేక తన బిడ్డల కన్నీళ్లకు కనికరించిందో ఆ దేవత. అప్పటినుంచి ఆ వూళ్లో కలరా మటు మాయం అయింది. దేవి తన కోరిక మన్నించినందుకు సురిటి అప్పయ్య సంతోషించిండు.
తల్లికి మొక్కుకున్నట్టుగానే మహాకాళి విగ్రహాన్ని సికిందరాబాద్‌లో ప్రతిష్టించేందుకు సిద్దమయిండు. అప్పటికప్పడు రాతి విగ్రహం లేక ఉజ్జయినీ అమ్మవారిని చెక్క శిల్పంగా చెక్కించుకుండు. తాను, తన తోటివారు తిరిగి సికిందరాబాద్‌ రాగానే మొక్కిన మొక్కును చెల్లించుకునేందుకు రెడీ అయ్యిండ్రు. 1815వ సంవత్సరంలో అచ్చం తల్లి రూపంలో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని సికిందరాబాద్‌ నడిబొడ్డున ప్రతిష్టించిండు.గ్రామస్థులంతా అమ్మను ప్రతిష్టించి ప్రతిరోజు భక్తితో కొలుస్తున్నరు. ఇప్పడు ఇంత రద్దీగా ఉన్న ఈ ప్రాంతం ఒకప్పుడు చెట్టు చేమలతో పుట్టలతో నిండి ఉండేడిది. ఆ కాలంలో చెక్క విగ్రహాంఎండావానలకు పాడవకుండా... రక్షణగా అప్పయ్య చూట్టూ గోడలు నిర్మించిండు. గ్రామస్థుల సాయంతో చిన్న గుడి నిర్మించి రోజూ పూజలు చేస్తున్నరు. అమ్మవారికి గుడి కట్టించిన ప్రాంతంలో పెద్ద బావి ఉండేది. దానికి మరమ్మత్తులు చేయించేందుకు గ్రామస్తులంతా నడుంబిగించిండ్రు.మనం చూస్తున్న ఈ దేవత మాణిక్యాలమ్మ తల్లి. మహాకాళి అమ్మవారికి గుడి కట్టడానికి ఈ ప్రాంతంలో తవ్వకాలు జరుపుతుంటె ఈ తల్లి బయటపడిందంట. తమను దయ తలిచేందుకే అమ్మ వెలిసిందని భక్తులు ఈ అమ్మవారిని కూడా ప్రతిష్టించి పూజలు చేస్తున్నరు.ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి గుడికి మరమ్మత్తలు చేసే పనిలో చెట్టూ పుట్ట తొలగించి శుభ్రం చేసిండ్రు. ఇక్కడున్న పెద్ద బావిని కూడా చూట్టూ తవ్వి మంచినీళ్ల బావిగా మలిచే ప్రయత్నం చేసిండ్రు. అప్పడే ఇక్కడి తవ్వకాల్లో మాణిక్యాల దేవి విగ్రహమూర్తి బయట పడింది. భక్తులు సంతోష పడ్డరు. ఆ తల్లే తమను దయతలచి ఇక్కడకు వచ్చి ఈ రూపంలో తమను కరుణించిందని తలచిండ్రు. ఆ రాత్రి ఒక భక్తుని కలలో మాణిక్యాల దేవి తనను మహాకాళి అమ్మవారి పక్కనే ప్రతిష్టించాలని కోరిందట. 1864వ సంవత్సరంలో ఈ తల్లితో బాటు ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి కూడా రాతి విగ్రహం చేయించిండ్రు. గర్భగుడిలో మహాకాళి అమ్మవారిని... ఆ తల్లికి కుడివైపున మాణిక్యాలదేవిని ప్రతిష్టించి పూజిస్తున్నరు.ఈ దేవతలు ఒకప్పుడు అక్కడ గ్రామ దేవతలు గానే పూజలందుకునేవి. తరువాత కాల క్రమంలో అమ్మవార్ల మహిమలు ఒక్కొక్కటిగా ప్రజలకు తెలియండంతో దేశం నలుమూలలనుంచి భక్తులు ఇక్కడకు వచ్చి తల్లిని దర్శించుకుంటరు. ఈ తల్లి మహిమలు ఖండాంతరాలకు వ్యాపించినయి. దేశ విదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడకు వచ్చి అమ్మను సేవించి, తమ కోర్కెలు చెప్పుకుంటరు.ఆశాఢమాసం వచ్చిందంటే ఆలయమంతా సందడే సందడి. కొత్త పెళ్లి కూతుళ్లు అమ్మవారికి తమ మనసులో మాట చెప్పుకుంటరు. నమ్మి కొలిచినందుకు నచ్చిన తోడు ఇచ్చినవని మనసులోనే అమ్మకు కృతజ్ఙతలు చెప్పుకుంటరు. బోనాల జాతరకు ఇష్టపడి భోనం వండుకొని వచ్చి అమ్మకు వడ్డిస్తరు.తెలంగాణ గడ్డమీద పుట్టిన ప్రతి ఆడపడుచుకూ పల్లె తల్లులంటే పట్టరాని సంతోషం. మైసమ్మ, మారెమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ,ఉప్పలమ్మ, పోలేరమ్మ, ముత్యాలమ్మ ..పేర్లేవైనా కొలిచే దైవం ఒక్కటే...అమ్మతల్లులను కొలిచే పండుగంటే ఊరంతా సంబంరం..తెల్లవారు ఝామునే లేచి తలారా స్నానం చేసు పట్టు పరికిణీలతో రంగవల్లులు తీర్చిదిద్ది.. అమ్మవారికి నిండు మనసుతో బోనం వండి..తలకెత్తుకొని నడిచెళ్తుంటరు. అల్లంత దూరాన ఉన్న మహాకాళి అమ్మవారికి భక్తితో వడ్డిచ్చి తమ మనసులో కోరికలు తెలుపుకుంటరు.ఆషాఢ మాసం వచ్చిందంటే పల్లెలన్నీ పడుచుల సంబరాలతో చిందులేస్తయి. జంటనగరాలలో బోనాల పండుగ అంటే చెప్పలేనంత ఆనందం. ఊరూవాడా ఏకమైతది. పల్లె పట్నం ఒక్కచోట చేరుతది. యువకులకు బోనాల పండగంటే కళ్ల సంబరం.. ఆ ఒక్కరోజు కోసం ఏడాదంతా ఎదురు చూసే వారు ఎంతోమంది. కొర్కెలు కోరుకునే వారు కొత్త మొక్కులు మొక్కుకుంటే...కోరికలు తీరిన వారు భక్తితో తమ మొక్కులు చెల్లించుకునేది కూడా అప్పుడే... రెండొందల ఏండ్లసంది అమ్మ వారితో బాటు ఈ చెట్టు కూడా పూజలందుకుంటుంది.ఈ చెట్టులోనే అమ్మవారు కొలువై ఉందని భక్తుల నమ్మకం.అందుకే ఈ చెట్టుకు చీరలు బహుకరించి పూజలు చేస్తరు.వేప చెట్టు... తల్లికి ఇష్టమైన చెట్టు. ఒక్కమాటలో చెప్పాలంటే...అమ్మతల్లికి ప్రతి రూపం వేపచెట్టు. అందుకే అమ్మవారున్న ప్రతి చోటా వేపవృక్షం ఉంటది. ఈ మహకాళి దేవాలయానికి పునాదులు కూడా వేపచెట్టు నీడనే పడ్డయి. అమ్మకు గుడి కట్టకముందు అమ్మవారికి వేపచెట్టే నీడగా నిలిచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మతో బాటు ఈ వేప చెట్టుకూడా పూజలందుకుంటున్నది. రెండొందల ఏండ్లుగా వేపచెట్టు నిండు ఆరోగ్యంతో పచ్చగా ఉండటం వెనుక అసలు రహస్యం ఈ చెట్టులో అమ్మ కొలువై ఉండటమేనని భక్తులు నమ్ముతరు.ఈ చెట్టును పసుపు కుంకుమలతో పూజించి...వారానికో కొత్త చీరతో అలంకరిస్తరు. నిండు ముత్తైదువుగ దీవించమని కోరుకుంటరు. చీడ పీడలు...మంత్ర తంత్రాల నుంచి రక్షించమని వేడుకుంటరు.అమ్మ చల్లని చూపు తమ పై పడాలని కోరుకుంటరు. ఒక్క వేప కొమ్మ వేయి రోగాలను నయం చేస్తది. వేయి రక్షల విలువ చేస్తది. అందుకే ఆ వేప కొమ్మ స్పర్శతో సకల జాడ్యాలు వదిలిపోతయి. ఈ తల్లి మాతంగేశ్వరి అమ్మవారు... మహాకాళి అమ్మవారికి పరిచారదేవత అని చెప్పుకుంటరు. బోనాల జాతరప్పుడు సోమవారం రోజున జోగిని రంగమెక్కేది ఇక్కడే..మహాకాళి అమ్మవారికి అభిముఖంగా ఉన్న ఈ మాత మాతంగేశ్వరి అమ్మవారు. ఈ అమ్మవారికి ఓ ప్రత్యేకత ఉంది. బోనాల పండుగప్పుడు ఆదివారం బోనాల జాతర అయ్యాక..సోమవారం రంగమెక్కడం అనే కార్యక్రమం ఉంటది. ఈ కార్యక్రమాన్ని ఒక జోగిని చేత చేయిస్తరు. గతంలో పల్లెలల్లో ఒక జోగిని కుటుంబాల కన్యలను దేవికి అంకితం చేసేవారు. ఆ కన్యతో ఖడ్గానికి వివాహం చేసి తల్లి సేవకు అంకితం చేసే వారు. ఆమె పోషణ భారం ఆ ఊరే చూసుకునేది. బోనాల జాతరప్పుడు సోమవారం మాతంగేశ్వరి ముందు పచ్చి కుండ పై నిల్చుని జోగిని పూనకం ఊగుతది. భక్తులు జోగినిని అమ్మవారు పూనిందని పారవశ్యంతో నమస్కరిస్తరు. ఆ పూనకంలో భవిష్యత్తు గురించి...దేశకాల పరిస్థితుల గురించి జోగిని చెప్తది. వర్షాలు సకాలంలో వచ్చేది..రానిది.. ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటి నివారణకు ఏం చేయాలనేది అమ్మ పలుకుగా చెప్తది. భోనాల జాతరప్పుడు ఉత్సవ విగ్రహాన్ని గుడి బయట ప్రతిష్టిస్తరు. ఈ అమ్మవారు ప్రతి ఒక్క ఇంటి గడపకు వెళ్తది. గుడి వరకు రాలేని భక్తులను కరుణించేందుకు ఆ మాతే వారి గడపలోకి వెళ్లి దీవెనలందిస్తది. తల్లి వాయుస్పర్శతో తమ ఇంటిలో ఉన్న పీడ పిశాచాలు వదిలి పోయి...ఇంటికి శాంతి కలుగుతదని భక్తులు విశ్వసిస్తరు. అందుకే భక్తులు ఎక్కడ ఏ ఊర్లో ఉన్నా ఈ పండుగలప్పుడు తప్పక హాజరవుతరు. అమ్మమీద అంత విశ్వాసం.ఇక్కడ నిత్యకళ్యాణం పచ్చతోరణం. నిత్య ధూప దీపారాధనతలో...భక్తులతో గుడి కళకళలాడుతుంటది. ప్రతి మంగళ, శుక్రవారాలలో దేవికి పల్లకీ సేవ చేస్తరు... ఇదే రోజుల్లో భక్తలు దేవిని నిమ్మకాయలతో పూజిస్తరు.ఆలయం అణువణువు భక్తి భావంతో తొణికిసలాడుతుంటది. గుడిలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరి ముఖంలో శాంతి కొట్టొచ్చినట్టు కనిపిస్తది. ఆపదలో వచ్చిన వారికి తమ కష్టాలు గట్టెక్కుతయనే నమ్మకం కొట్టొచ్చినట్టుంటది.ఆలయకుడ్యాలపై అందమైన శిల్పాలు చెక్కించిండ్రు. దేవాతా మూర్తులతో బాటు అమ్మవారి వాహనమైన సింహశిల్పాలు చూడ ముచ్చటగా ఉంటయి.ఈ శిల్పాలు చెక్కడంలో కూడా మన శిల్పులు అత్యంత ప్రతిభ కనబరిచిండ్రు. ఆలయ ముఖ ద్వారం లో ఉన్న సింహం నోటిలో ఒక గుండ్రని రాయి చెక్కిండ్రు. ఇది సింహపు కోరల నుంచి చూస్తే నే కనిపిస్తది. కదిలిస్తే బంతి వలే కదులుతది కాని బయటకు తీసే మార్గం లేదు. ఈ రాయిని ఎలా ప్రతిమలోకి చేర్చారనేది ఆధునిక శిల్పులకు సైతం అంతు బట్టని విషయం.ఈ ఆలయం 1953 నుంచి దేవాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఆలయ బాగోగులు ప్రభుత్వమే చూసుకుంటున్నది. భక్తల సౌకర్యార్దం వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నది. బస్తీలో జరుగుతున్న అల్లర్లను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి అవాంచనీయ సంఘలనలుజరుగకుండా మెటల్‌ డిటెక్టర్‌లను ఏర్పాటు చేసిండ్రు. నిఘా కెమేరాలను ఏర్పాటు చేసి ఆలయంలో ప్రతి ఒక్కరి కదలికలను రికార్డు చేస్తున్నరు. జాతరలప్పుడు మరిన్ని భద్రతా ఏర్పాట్లతో కట్టదిట్టమైన చర్యలు తీసుకొని భక్తులకు అమ్మవారి దర్శనం తేలికగా అయి క్షేమంగా ఇల్లు చేరుకునే విధంగా చర్యలు తీసుకుంటరు.

Saturday, May 1, 2010

బాసర సరస్వతి గురించి



బాసర… అదిలాబాద్ జిల్లా మధోల్ మండలంలో ఉంది. ఇది హైదరాబాద్ కు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. బాసర పుణ్యక్షేత్రంలో చదువుల తల్లి జ్ఞానసరస్వతి అమ్మవారు కొలువై ఉంది. భారతదేశంలో సరస్వతి దేవాలయాలు రెండే ఉన్నయి. ఒకటి కాశ్మీర్లో ఉంటే రెండోది తెలంగాణలో బాసరలోనే ఉంది.
మానవులకు విజ్ఞాన్ని ప్రసాదించే చదువుల తల్లి సరస్వతి కొలువైన దివ్య క్షేత్రం బాసర. గోదావరి ఒడ్డున కొలువైన ఈ క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతూ భక్తులను ఆకర్షిస్తంది. తమ పిల్లలకు భవిష్యత్లో అపారమైన విజ్ఞానం సొంతం కావాలని కోరుతూ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని చేపట్టే తల్లితండ్రులతో ఈ బాసర క్షేత్రం నిత్యం కళకళలాడుతుంటుంది. గోదావరి నదీతీరాన బాసర కొలువున ఉన్న జ్ఞానసరస్వతీ దేవి కోట్లాది చిన్నారులకు చదువులు ప్రసాదించి అశేష భక్త జనానికి మనశ్శాంతిని ప్రసాదిస్తంది. ఈ సరస్వతీ దేవి ఆలయం జాతీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రతిరోజు వేలాది మంది అమ్మవారిని దర్శించుకోవడం, తమ చిన్నారులను అక్షరాభ్యాసం చేయించుకోవడం కోసం బాసరకు వస్తుండటంతో బాసర సరస్వతీ దేవి ఆలయం భక్తజన సందడితో కిటకిటలాడుతోంది
బాసరలో కొలువై ఉన్న జ్ఞానసరస్వతిని దేశం నలుమూలల నుంచి వచ్చి దర్శించుకుంటరు. సరస్వతి మాత, మహాలక్ష్మి, మహాకాళి సమేతంగా కొలువుదీరింది. ఈ మందిరం చాళుక్యులకాలంలో నిర్మించిండ్రు. దేవాలయం ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో, ఆహ్లాదకరంగా ఉండటం వల్ల ఆధ్యాత్మిక వాతావరణం ఉంటది.
ధాన దేవాలయానికి తూర్పు భాగమున ఔదుంబర వృక్షఛాయలో దత్త మందిరం, దత్త పాదుకలు ఉన్నయి. మహాకాళీ దేవాలయం పశ్చిమ భాగమున నిత్యార్చనలతో చూడ ముచ్చటగా ఉంటది. శ్రీ వ్యాస మందిరం దక్షిణ దిశలో ఉంది. ఇందులో వ్యాస భగవానుని విగ్రహము, వ్యాస లింగము ఉన్నాయి. మందిరానికి దగ్గరలో ఒక గుహ ఉన్నది. ఇది నరహరి మాలుకుడు తపస్సుచేసిన స్థలమని చెప్పుకుంటరు. అక్కడ "వేదవతి" అనే శిలపై తడితే ఒకో ప్రక్క ఒకో శబ్దం వస్తది. అందులో సీతమ్మవారి నగలున్నయని చెప్పుకుంటరు.
ఈ ఆలయానికి దగ్గరలో 8 పుష్కరిణులున్నాయి. ఇంద్రతీర్ధం, సూర్యతీర్ధం, వ్యాసతీర్ధం, వాల్మీకి తీర్ధం, విష్ణుతీర్ధం, గణేషతీర్ధం, పుత్రతీర్ధం, శివతీర్ధం. గోదావరికి సమీపంలో ఒక శివాలయం ఉంది. దేవాలయంలో ప్రతి నిత్యం ఉదయం 5 గంటలకు సరస్వతీ మూర్తికి వైదిక మంత్రోపేతంగా పూజ జరుపుతరు. సాయంకాలం ఆరు గంటలకు పూజ జరుగుతది.
ఈ ఆలయానికి ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా. మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాలనుండి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటరు. ముఖ్యముగా విద్యా ప్రాప్తికై ఇక్కడ విద్యార్ధులతో అక్షరాభ్యాసము చేయించి దేవికి పలక, బలపము, కాగితము, కలము వంటి కానుకలు సమర్పించే ఆచారము ఉన్నది. కేశ ఖండనము, ఉపనయనము, వివాహాలు, భజనలు నిరంతరం జరుగుతూనే ఉంటయి.
బాసరలో వెలసిన ఈ క్షేత్రం పురాతనమైన ప్రాముఖ్యాన్ని కల్గిఉంది. బాసర క్షేత్రంలో కొలువైన సరస్వతీదేవిని వ్యాసుడు ప్రతిష్టించాడని ప్రతీతి.
గోదావరి ప్రవహిస్తున్న ఈపుణ్యభూమి వ్యాసమహర్షి పాద స్పర్శతో పుణీతమైనది. వ్యాసమహర్షి ప్రశాంత చిత్తంతో తపస్సు చేయడాని కి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ అమ్మ వారి విగ్రహాన్ని ప్రతిష్టించినట్టు పురాణాలు చెబు తున్నయి. బ్రహ్మాండ పురాణాన్ని రచి స్తున్నప్పుడు ప్రకృ తి ఖండంలోని శక్తి ని వర్ణించాల్సిన అవసరం ఏర్ప డిం ది. శక్తిని వర్ణించాలంటే మరింత తపశ్శక్తితోపాటు ఎలాం టి అంతరాయం లేని మహిమగల ప్రశాంత వాతావరణం అవసరం ఏర్పడింది. దీంతో ఆయన అన్ని ప్రాంతాలు తిరిగి బాసర చేరుకున్నాడు. నాందేడ్ నుంచి బ్రహ్మేశ్వరం వరకు గోదావరి నాభిస్థానం అంటరు. ఇది అప్ప టికే పుణ్యస్థలం కావడంతో వ్యాసుడు ధ్యానం చేసుకోవడా నికి ఆగిండు.
గోదావరి తీరంలో ధ్యానముద్రలో ఉన్న ఆయ నకు శక్తి రూపం నీడలా కనిపించి వెనువెంటనే మాయ మైంది. దీంతో ఆ రూపం ఎవరిదా? అని దివ్యదృష్టితో చూడగా జ్ఞానసరస్వతి అమ్మ వారు కనిపించగా పూర్తి రూపం కనిపించకపోవడానికి కారణం అడిగిండు. కొన్ని పాపకార్యాల వల్ల తన పూర్తి రూ పాన్ని చూపెట్టలేకపోతున్నానని అమ్మవారు ఆ రుషితో చెప్పింది. ప్రతిరోజు ధ్యానం చేసి గోదావరిలో పిడికెడు ఇసుకను నిచ్చన స్థానంలో వేయాలని, ఇలా వేసిన ఇసుక తో తన పూర్తి రూపం తయారవుతుందని, అనంతరం జ్ఞాన సరస్వతీగా అందరికి దర్శనమిస్తానని తెలిపింది. వ్యాసుడు గోదావరి తీరానికి కొంతదూరంలో ఉన్న కుమారచల పర్వతంలోని ఒక గుహలోకి తపస్సు ప్రారంభించిండు. అమ్మవారు చెప్పినట్టు ఇసుకను తీసుకువచ్చి ప్రస్తుతం బాసరలో ఉన్న కోనేరు ఎదురుగా వేయడం ప్రారంభించిండు.
ఇలా కొన్ని ఏళ్లు గడిచిన అనంతరం అమ్మవారు రూపం పూర్తి కావడం, ఆమె జ్ఞాన సరస్వతిగా ఆవిర్భవిం చిందని పురాణాల్లో ఉంది. విగ్రహానికి జీవం పోయడం కోసం తగిన శక్తి కలిగేందుకు సరస్వతి దేవి ఆయనకు జ్ఞానభీజాన్ని ఉపదేశించింది. జ్ఞానానికి పుట్టుక బాసరలో జరిగినందున బాసర జ్ఞానానికి పుట్టుకగా వెలుగొందుతంది. భారతదేశంలో కన్యాకుమారిలో, కాశ్మీర్లలో సరస్వతీ దేవాలయాలు ఉన్నప్పటికీ చదువుల తల్లి జ్ఞానసరస్వతీ బాసరలోనిది మాత్రమేనని, దేశంలో మరెక్కడా లేదని చెబుతారు. అయితే ఒక సరస్వతీ దేవినే ప్రతిష్టిం చడం సబబు కాదని, ఈమెకు తోడుగా మరో మహాకాళీ, మహాలక్ష్మీలను ప్రతిష్టించిండు.

పుత్రసంతానం కోసం దశ రథుడు ఇక్కడ పూజలు చేశా డు. ఎనిమిది మంది దేవతలు కోనేరులోని వివిధ ప్రాంతా ల్లో స్నానాలు చేయడంతో దీనికి అష్టతీర్థసరోవరమని పేరు వచ్చింది. ఒకసారి దుర్వాస మహముని సరస్వతీ దేవి ఇచ్చి న పుష్పమూలికను ధరించి స్వర్గలోకానికి వెళ్లి దాన్ని ఇంద్రునికి ఇచ్చిండు. ఇంద్రుడు దాన్ని నేలపై పడవేయడం తో దుర్వాసుడు కోపంతో ఇంద్రున్ని రాజ్యభ్రష్టునిగా చేసి కుష్టువ్యాధిగ్రస్తుడు కావాలని శపిస్తడు.
ఇంద్రుడు బృహ స్పతి మాట ప్రకారం కోనేరులోని తూర్పు భాగంలో స్నా నం చేసి శాపవిమోచనం పొందాడు. దీని కారణంగా ఆ స్థానానికి ఇంద్రతీర్థమని పేరువచ్చింది.
ఇద్రుడు పూజలు చేసిన స్థలం సరస్వతీ దేవి మందిరానికి పూర్వభాగంలో ఒక మైలు దూరంలో గోదావరి నదీతీరమున ఉంది. దీనిని ప్రస్తుతం కుక్కుటేశ్వరం అని పిలుస్తరు. సూర్యుడు ఆకలి ని తట్టుకోలేక మంత్రోచ్ఛారణకు ముందుగానే భుజించ డంతో ఆగ్రహించిన ఇంద్రుడు వజ్రాయుధంతో సూర్యుడు కాంతి హీనుడయినడు. కోనేరుకు ఆగ్నేయ భాగం లో స్నానం చేయ డంతో పూర్వ వైభవం వచ్చింది. సూర్యుడు పూజలు చేసిన చోట సరస్వతీ దేవికి ఆగ్నేయ దిశ గా అరమైలు దూరంలో గోదావరి నదీతీరాన ఉంది. ప్రస్తు తం దీనిని సూర్వేశ్వరమని పిలుస్తరు.
ఆలయానికి దక్షిణ దిక్కున ఉన్న వేదవ్యాసుడు తపస్సు చేసిన ప్రాంతాన్ని ఇప్పు డు వ్యాసతీర్థం అంటున్నరు. ఇక్కడ వ్యాసమందిరం కూ డా ఉంది. వాల్మీకి మహార్షి కోనేరు నైరుతి దిశలో స్నానం చేసి శ్రీమద్రామాయణం రాసిండు. అందుకే పూజలు చేసిన స్థలం బాసర బస్టాండు సమీపంలో రోడ్డుకు కుడివైపున శ్రీవెంకటేశ్వర మందిరంగా వెలుగొందుతొంది. వినాయ కుడు అగ్రపూజ అర్హత పొందేందుకు కోనేరు వాయువ్య దశలో స్నానం చేసిండు. గణేషుని మందిరం బాసర గ్రా మం నుంచి సరస్వతీ మందిరానికి వెళ్లే మార్గంలో ఉంది.
దశరథుడు ఉత్త ర తీరంలో స్నానం చేయడంతో దీనిని పుత్రతీర్థం అంటున్నారు. కుమారస్వామి పూజలు చేసిన స్నా నం కుమారతీర్థం, ఈశాన్య దిశలో ఈశ్వరుడు స్నానం చేసి దేవిని ధ్యానించిన ప్రాంతాన్ని శివతీర్థం అని పిలు స్తరు. సరస్వతీ మందిరానికి ఉత్తారన ఒక మైలు దూరం లో పాపహరేశ్వరాలయమని పిలుస్తరు. కోనేరులోని మధ్యభాగంలో ఉన్న దానిని సరస్వతీ తీర్థం అని పిలు స్తరు. దీనికి ఎనిమిది దిక్కుల ఎనిమిది పుణ్యతీర్థాలు ఉన్నయి.
పురాణకాలంలో నిర్మించబడిన ఆలయం దండయాత్రల కాలంలో ధ్వసం కావడంతో శృంగేరీ పీఠాధిపతి ఆలయాన్ని పునర్నించి అమ్మవారిని పునఃప్రతిష్టించిండ్రట. ప్రస్తుతం బాసరలో ఉన్నది ఆ ఆలయమే.
ఈ ప్రదేశమైన బాసర దేవతలైన సూర్యదేవుడు, గణపతి, దేవేందృడు విష్ణువు మొదలగు వారికి తపో భూమి. కుమారస్వామి దగ్గరలోని కొండ గుహలో తపస్సు చేసికొనినందున దినిని కుమారచలము అని పిలుస్తరు. ఇచ్చట సరస్వతీదేవి వెలసినందున కౌమారాచలము అని కూడా అంటరు.
ఆలయంలో ప్రతీ రోజు తెల్లవారుఝామున 4:30గంటలకు మహా లక్ష్మి, సరస్వతీ అమ్మవార్లకు అభిషేకం చెస్తారు. 4గంల నుండి అభిషేకం టికెట్టులు ఇస్తారు. ఐతే అమ్మవార్లకు దేవీ నవరాత్రుల రోజులలో ఈ అభిషేకం చేయరు. కేవలం నవరాత్రుల మొదటి రోజు మాత్రమే అమ్మవార్లకు అభిషేకం చెస్తారు.అభిషేకం చేసిన తరువాత అమ్మవారిని అలంకరిస్తారు. వారికి అలంకరించిన పసుపును ప్రసాదంగా ఇస్తారు. దీనిని బండారు అని అంటారు. ఇది నాలుక మీద వెసుకొంటే మేధస్సు పెరుగుతుందని భక్తుల నమ్మకం. ఆలయంలో ముఖ ద్వారం పక్కన నిత్యం చండీ హోమం దుర్గా సప్తశతి చెస్తారు. 516రుపాయలు చెల్లించి హోమంలో పాల్గొనవచ్చు. గుడి వెనుక మధ్యాహ్నము నిత్య అన్నదానం చెస్తరు.దేవీ నవరాత్రుల సమయంలో ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తారు. ఆ తొమ్మిది రోజులు బాసరలొనే ఉంటరు.బాసరలోని సరస్వతీ దేవి ఆలయం విశాలమైన ప్రాంగణంలో నిర్మించబడి ఉంది. బాసర గ్రామం చిన్నదైనా ఆలయం మాత్రం చూపరులను ఇట్టే ఆకట్టుకుంటది.
దక్షిణ భారతదేశంలోనే ఏకైక సరస్వతీ ఆలయం అయి న దేవాలయమైన జ్ఞాన సరస్వతి ఆలయానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. శక్తిమూర్తులు సరస్వతీ, లక్ష్మీ, పార్వతీలు ఒకేచోట కొలువైన క్షేత్రం బాస ర కావడం మరింత విశేషం. అమ్మవారికి ప్రతిరోజు ఉద యం 4 గంటల నుంచి 6 గంటల వరకు అర్చకులచేత అభిషేకాన్ని నిర్వహించిన అనంతరం హారతి ఇచ్చిన తరు వాత సందర్శకులకు దర్శనానికి అనుమతిస్తారు. ఉదయం 7-30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అక్షరాభ్యాసం, కుంకుమపూజ, వాహనపూజ, ఓడిబియ్యం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.గంట విరామం తరు వాత గుడి మళ్లీ తెరుచుకొని దైనందిన కార్యక్రమాలు కొన సాగిస్తారు. దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తజనం అమ్మవారిని దర్శించుకొని తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించుకొని మనశ్శాంతిని పొందుతారు.

ఆలయానికి కొంత దూరంలో గోదావరి నది ప్రవహిస్తోంది. ఈ నదిలో స్నానం చేసి నదికీ సమీపాన ఉన్న శివుని భక్తులు దర్శించుకోవడం ఆనవాయితీ. గోదావరీ పుష్కరాల కారణంగా బాసర క్షేత్రం ఇటీవల ప్రముఖ క్షేత్రంగా అభివృద్ధి చెందుతోంది. ఆలయ ప్రాగణంలో ఇంద్రేశ్వరం, సూర్యేశ్వరం, వాల్మీకేశ్వరం, తరణేశ్వరం, కుమారేశ్వరం, వ్యాసేశ్వరం తదితర ప్రదేశాలు ఉన్నాయి. ఎంతో ప్రశాంతమైన ఈ ఆలయప్రాంగణంలో ఓ రోజంతా గడపగల్గితే అద్వితీయమైన అనుభూతి మన సొంతమౌతుంది.

ఈ వూరిలో ఇది ఒక ముఖ్యమైన సంప్రదాయం. మధుకర వృత్తి యాచించుట ద్వారా లభించే భిక్షకు మాధుకరము అని పేరు. శ్రీదేవి అనుగ్రహము కోరేవారు నియమ నిష్టలతో 11 లేదా 21 లేదా 41 రోజులు దీక్షతో గురూపదేశ మంత్రము అనుష్టానం చేస్తారు. ఆ కాళంలో వారు మధ్యాహ్నం వూరిలోనికి పోయి భిక్షను స్వీకరించి, సరస్వతీ దేవికి నమస్కరించి, ఆ భిక్షను భుజిస్తారు.

బాసర క్షేత్రం రాష్ట్ర రాజధాని నుంచి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సు, రైలు మార్గాల ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు. బాసరలో వసతి సౌకర్యాలు సైతం చెప్పుకోదగ్గ రీతిలోనే ఉన్నయి. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన వసతి గృహాలతోపాటు రాష్ట్ర టూరిజం శాఖకు చెందిన వసతి గృహాలు కూడా ఉన్నయి. మహా శివరాత్రి, వసంత పంచమి, అక్షరాభ్యాసం, దేవీనవరాత్రులు, వ్యాసపూర్ణిమ ఇక్కడ విశేషంగా జరుపబడే ఉత్సవాలు. ప్రధానంగా ప్రతి సంవత్సరం మూడు ఉత్సవాలు జరుగుతయి.హైద్రాబాదు నుంచి మన్మాడ్ కు వెళ్లే రైలు మార్గములో గలదు రైలు, బస్సు మార్గము ద్వారా సులభము గా చేరు కొన వచ్చును. వీటిలో అద్దె కూడా సామాన్యులకు అందుబాటులోనే ఉంటుంది. భోజనం తదితర అవసరాలకు అనువుగా హోటళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి.