Wednesday, May 12, 2010
సికింద్రాబాద్‌లో ఉన్న అమ్మవారిని ఉజ్జయినీ అమ్మవారు గురించి
ఎ.జనార్దన్
అమ్మలగన్న యమ్మ... ముగ్గురమ్మలమ్మ మూలపుటమ్మ...సృష్టి లయకారుల చేత పూజలందుకుంటున్న దివ్యజనని... మహాకాళి అమ్మవారు. ఆ తల్లి చల్లని చూపు మనపై ఉంటే ఏ చీడ పీడా దరి చేరదు. ఆ అమ్మ దయ ఉంటే బిక్షగాడు కూడా లక్షాధికారి అయితడని భక్తుల నమ్మకం...ఇంత మహత్తు ఉన్న అమ్మవారు ఎక్కడో దూర దేశాన లేదు...మన సికింద్రాబాద్ లోనే ఉంది. ఉజ్జయినీ మహాకాళి అనగానే చాలా మందికి ఒక అనుమానం వస్తది. సికింద్రాబాద్‌లో ఉన్న అమ్మవారిని ఉజ్జయినీ అమ్మవారుగా ఎందుకు పిలుస్తరనే సందేహం కూడా కలుగుతది. దానికీ ఓ కథ ఉంది. అప్పట్లో భద్రాచలంలో రాముడికి...రామదాసు అనే భక్తుడు గుడి కట్టించినట్టే... ఇక్కడ ఈ ఆలయం నిర్మించ డానికీ ఒక భక్తుడే కారణం. ముగ్గురు మూర్తులకు తల్లి..మహాకాళి అమ్మవారు. ఆ తల్లి...ఒక భక్తుని కోరిక మేరకు సికిందరాబాద్‌లో వెలిసింది. 1813వ సంవత్సరంలో మిలిటరీలో పనిచేసే సురిటి అప్పయ్య అనే భక్తుడు దేవికి పరమ భక్తుడు. ఆయన ఉద్యోగ రీత్యా మధ్యప్రదేశ్‌కు బదిలీ అయ్యిండ్రు.అక్కడ ఉజ్జయినీ మహాకాళిని నిత్యం సేవిస్తూ ఉండేవాడు. ఒకసారి ఉజ్జయినిలో కలరా వ్యాపించింది. ప్రజలు పిట్టల్లా రాలి పోయిండ్రు. కాపాడే నాథుడు లేక విలవిల్లాడిండ్రు. ఆ రోజుల్లో కలరాను గత్తర గా పిలిచెటోళ్లు. గత్తర వ్యాధి సోకితే మరణం తప్ప మార్గం లేదు. ఈ కలరాకు అప్పట్లో సరైన మందు లేదు.కలరా వచ్చిందంటే ప్రాణాల మీద ఆశలు వదులు కోవల్సిందే.. తన మిత్రులు, బందువులు తన కళ్లముందే నేలకొరగడాన్ని చూసి సురిటి అప్పయ్య చలించి పోయిండు. ఉజ్జయిని అమ్మవారి వద్దకు వెల్లి తమ వారిని కాపాడమని ప్రాదేయపడ్డడు. ప్రజలను కలరా బారినుంచి కాపాడితే అమ్మవారి విగ్రహాన్ని తమ ఊరైన సికిందరాబాద్‌లో ప్రతిష్టించుకొని నిత్యం పూజలుల చేస్తమని మొక్కుకున్నడట. అప్పయ్య ఆభ్యర్దన విన్నదో...లేక తన బిడ్డల కన్నీళ్లకు కనికరించిందో ఆ దేవత. అప్పటినుంచి ఆ వూళ్లో కలరా మటు మాయం అయింది. దేవి తన కోరిక మన్నించినందుకు సురిటి అప్పయ్య సంతోషించిండు.
తల్లికి మొక్కుకున్నట్టుగానే మహాకాళి విగ్రహాన్ని సికిందరాబాద్‌లో ప్రతిష్టించేందుకు సిద్దమయిండు. అప్పటికప్పడు రాతి విగ్రహం లేక ఉజ్జయినీ అమ్మవారిని చెక్క శిల్పంగా చెక్కించుకుండు. తాను, తన తోటివారు తిరిగి సికిందరాబాద్ రాగానే మొక్కిన మొక్కును చెల్లించుకునేందుకు రెడీ అయ్యిండ్రు. 1815వ సంవత్సరంలో అచ్చం తల్లి రూపంలో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని సికిందరాబాద్ నడిబొడ్డున ప్రతిష్టించిండు.గ్రామస్థులంతా అమ్మను ప్రతిష్టించి ప్రతిరోజు భక్తితో కొలుస్తున్నరు. ఇప్పడు ఇంత రద్దీగా ఉన్న ఈ ప్రాంతం ఒకప్పుడు చెట్టు చేమలతో పుట్టలతో నిండి ఉండేడిది. ఆ కాలంలో చెక్క విగ్రహాంఎండావానలకు పాడవకుండా... రక్షణగా అప్పయ్య చూట్టూ గోడలు నిర్మించిండు. గ్రామస్థుల సాయంతో చిన్న గుడి నిర్మించి రోజూ పూజలు చేస్తున్నరు. అమ్మవారికి గుడి కట్టించిన ప్రాంతంలో పెద్ద బావి ఉండేది. దానికి మరమ్మత్తులు చేయించేందుకు గ్రామస్తులంతా నడుంబిగించిండ్రు.మనం చూస్తున్న ఈ దేవత మాణిక్యాలమ్మ తల్లి. మహాకాళి అమ్మవారికి గుడి కట్టడానికి ఈ ప్రాంతంలో తవ్వకాలు జరుపుతుంటె ఈ తల్లి బయటపడిందంట. తమను దయ తలిచేందుకే అమ్మ వెలిసిందని భక్తులు ఈ అమ్మవారిని కూడా ప్రతిష్టించి పూజలు చేస్తున్నరు.ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి గుడికి మరమ్మత్తలు చేసే పనిలో చెట్టూ పుట్ట తొలగించి శుభ్రం చేసిండ్రు. ఇక్కడున్న పెద్ద బావిని కూడా చూట్టూ తవ్వి మంచినీళ్ల బావిగా మలిచే ప్రయత్నం చేసిండ్రు. అప్పడే ఇక్కడి తవ్వకాల్లో మాణిక్యాల దేవి విగ్రహమూర్తి బయట పడింది. భక్తులు సంతోష పడ్డరు. ఆ తల్లే తమను దయతలచి ఇక్కడకు వచ్చి ఈ రూపంలో తమను కరుణించిందని తలచిండ్రు. ఆ రాత్రి ఒక భక్తుని కలలో మాణిక్యాల దేవి తనను మహాకాళి అమ్మవారి పక్కనే ప్రతిష్టించాలని కోరిందట. 1864వ సంవత్సరంలో ఈ తల్లితో బాటు ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి కూడా రాతి విగ్రహం చేయించిండ్రు. గర్భగుడిలో మహాకాళి అమ్మవారిని... ఆ తల్లికి కుడివైపున మాణిక్యాలదేవిని ప్రతిష్టించి పూజిస్తున్నరు.ఈ దేవతలు ఒకప్పుడు అక్కడ గ్రామ దేవతలు గానే పూజలందుకునేవి. తరువాత కాల క్రమంలో అమ్మవార్ల మహిమలు ఒక్కొక్కటిగా ప్రజలకు తెలియండంతో దేశం నలుమూలలనుంచి భక్తులు ఇక్కడకు వచ్చి తల్లిని దర్శించుకుంటరు. ఈ తల్లి మహిమలు ఖండాంతరాలకు వ్యాపించినయి. దేశ విదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడకు వచ్చి అమ్మను సేవించి, తమ కోర్కెలు చెప్పుకుంటరు.ఆశాఢమాసం వచ్చిందంటే ఆలయమంతా సందడే సందడి. కొత్త పెళ్లి కూతుళ్లు అమ్మవారికి తమ మనసులో మాట చెప్పుకుంటరు. నమ్మి కొలిచినందుకు నచ్చిన తోడు ఇచ్చినవని మనసులోనే అమ్మకు కృతజ్ఙతలు చెప్పుకుంటరు. బోనాల జాతరకు ఇష్టపడి భోనం వండుకొని వచ్చి అమ్మకు వడ్డిస్తరు.తెలంగాణ గడ్డమీద పుట్టిన ప్రతి ఆడపడుచుకూ పల్లె తల్లులంటే పట్టరాని సంతోషం. మైసమ్మ, మారెమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ,ఉప్పలమ్మ, పోలేరమ్మ, ముత్యాలమ్మ ..పేర్లేవైనా కొలిచే దైవం ఒక్కటే...అమ్మతల్లులను కొలిచే పండుగంటే ఊరంతా సంబంరం..తెల్లవారు ఝామునే లేచి తలారా స్నానం చేసు పట్టు పరికిణీలతో రంగవల్లులు తీర్చిదిద్ది.. అమ్మవారికి నిండు మనసుతో బోనం వండి..తలకెత్తుకొని నడిచెళ్తుంటరు. అల్లంత దూరాన ఉన్న మహాకాళి అమ్మవారికి భక్తితో వడ్డిచ్చి తమ మనసులో కోరికలు తెలుపుకుంటరు.ఆషాఢ మాసం వచ్చిందంటే పల్లెలన్నీ పడుచుల సంబరాలతో చిందులేస్తయి. జంటనగరాలలో బోనాల పండుగ అంటే చెప్పలేనంత ఆనందం. ఊరూవాడా ఏకమైతది. పల్లె పట్నం ఒక్కచోట చేరుతది. యువకులకు బోనాల పండగంటే కళ్ల సంబరం.. ఆ ఒక్కరోజు కోసం ఏడాదంతా ఎదురు చూసే వారు ఎంతోమంది. కొర్కెలు కోరుకునే వారు కొత్త మొక్కులు మొక్కుకుంటే...కోరికలు తీరిన వారు భక్తితో తమ మొక్కులు చెల్లించుకునేది కూడా అప్పుడే... రెండొందల ఏండ్లసంది అమ్మ వారితో బాటు ఈ చెట్టు కూడా పూజలందుకుంటుంది.ఈ చెట్టులోనే అమ్మవారు కొలువై ఉందని భక్తుల నమ్మకం.అందుకే ఈ చెట్టుకు చీరలు బహుకరించి పూజలు చేస్తరు.వేప చెట్టు... తల్లికి ఇష్టమైన చెట్టు. ఒక్కమాటలో చెప్పాలంటే...అమ్మతల్లికి ప్రతి రూపం వేపచెట్టు. అందుకే అమ్మవారున్న ప్రతి చోటా వేపవృక్షం ఉంటది. ఈ మహకాళి దేవాలయానికి పునాదులు కూడా వేపచెట్టు నీడనే పడ్డయి. అమ్మకు గుడి కట్టకముందు అమ్మవారికి వేపచెట్టే నీడగా నిలిచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మతో బాటు ఈ వేప చెట్టుకూడా పూజలందుకుంటున్నది. రెండొందల ఏండ్లుగా వేపచెట్టు నిండు ఆరోగ్యంతో పచ్చగా ఉండటం వెనుక అసలు రహస్యం ఈ చెట్టులో అమ్మ కొలువై ఉండటమేనని భక్తులు నమ్ముతరు.ఈ చెట్టును పసుపు కుంకుమలతో పూజించి...వారానికో కొత్త చీరతో అలంకరిస్తరు. నిండు ముత్తైదువుగ దీవించమని కోరుకుంటరు. చీడ పీడలు...మంత్ర తంత్రాల నుంచి రక్షించమని వేడుకుంటరు.అమ్మ చల్లని చూపు తమ పై పడాలని కోరుకుంటరు. ఒక్క వేప కొమ్మ వేయి రోగాలను నయం చేస్తది. వేయి రక్షల విలువ చేస్తది. అందుకే ఆ వేప కొమ్మ స్పర్శతో సకల జాడ్యాలు వదిలిపోతయి. ఈ తల్లి మాతంగేశ్వరి అమ్మవారు... మహాకాళి అమ్మవారికి పరిచారదేవత అని చెప్పుకుంటరు. బోనాల జాతరప్పుడు సోమవారం రోజున జోగిని రంగమెక్కేది ఇక్కడే..మహాకాళి అమ్మవారికి అభిముఖంగా ఉన్న ఈ మాత మాతంగేశ్వరి అమ్మవారు. ఈ అమ్మవారికి ఓ ప్రత్యేకత ఉంది. బోనాల పండుగప్పుడు ఆదివారం బోనాల జాతర అయ్యాక..సోమవారం రంగమెక్కడం అనే కార్యక్రమం ఉంటది. ఈ కార్యక్రమాన్ని ఒక జోగిని చేత చేయిస్తరు. గతంలో పల్లెలల్లో ఒక జోగిని కుటుంబాల కన్యలను దేవికి అంకితం చేసేవారు. ఆ కన్యతో ఖడ్గానికి వివాహం చేసి తల్లి సేవకు అంకితం చేసే వారు. ఆమె పోషణ భారం ఆ ఊరే చూసుకునేది. బోనాల జాతరప్పుడు సోమవారం మాతంగేశ్వరి ముందు పచ్చి కుండ పై నిల్చుని జోగిని పూనకం ఊగుతది. భక్తులు జోగినిని అమ్మవారు పూనిందని పారవశ్యంతో నమస్కరిస్తరు. ఆ పూనకంలో భవిష్యత్తు గురించి...దేశకాల పరిస్థితుల గురించి జోగిని చెప్తది. వర్షాలు సకాలంలో వచ్చేది..రానిది.. ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటి నివారణకు ఏం చేయాలనేది అమ్మ పలుకుగా చెప్తది. భోనాల జాతరప్పుడు ఉత్సవ విగ్రహాన్ని గుడి బయట ప్రతిష్టిస్తరు. ఈ అమ్మవారు ప్రతి ఒక్క ఇంటి గడపకు వెళ్తది. గుడి వరకు రాలేని భక్తులను కరుణించేందుకు ఆ మాతే వారి గడపలోకి వెళ్లి దీవెనలందిస్తది. తల్లి వాయుస్పర్శతో తమ ఇంటిలో ఉన్న పీడ పిశాచాలు వదిలి పోయి...ఇంటికి శాంతి కలుగుతదని భక్తులు విశ్వసిస్తరు. అందుకే భక్తులు ఎక్కడ ఏ ఊర్లో ఉన్నా ఈ పండుగలప్పుడు తప్పక హాజరవుతరు. అమ్మమీద అంత విశ్వాసం.ఇక్కడ నిత్యకళ్యాణం పచ్చతోరణం. నిత్య ధూప దీపారాధనతలో...భక్తులతో గుడి కళకళలాడుతుంటది. ప్రతి మంగళ, శుక్రవారాలలో దేవికి పల్లకీ సేవ చేస్తరు... ఇదే రోజుల్లో భక్తలు దేవిని నిమ్మకాయలతో పూజిస్తరు.ఆలయం అణువణువు భక్తి భావంతో తొణికిసలాడుతుంటది. గుడిలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరి ముఖంలో శాంతి కొట్టొచ్చినట్టు కనిపిస్తది. ఆపదలో వచ్చిన వారికి తమ కష్టాలు గట్టెక్కుతయనే నమ్మకం కొట్టొచ్చినట్టుంటది.ఆలయకుడ్యాలపై అందమైన శిల్పాలు చెక్కించిండ్రు. దేవాతా మూర్తులతో బాటు అమ్మవారి వాహనమైన సింహశిల్పాలు చూడ ముచ్చటగా ఉంటయి.ఈ శిల్పాలు చెక్కడంలో కూడా మన శిల్పులు అత్యంత ప్రతిభ కనబరిచిండ్రు. ఆలయ ముఖ ద్వారం లో ఉన్న సింహం నోటిలో ఒక గుండ్రని రాయి చెక్కిండ్రు. ఇది సింహపు కోరల నుంచి చూస్తే నే కనిపిస్తది. కదిలిస్తే బంతి వలే కదులుతది కాని బయటకు తీసే మార్గం లేదు. ఈ రాయిని ఎలా ప్రతిమలోకి చేర్చారనేది ఆధునిక శిల్పులకు సైతం అంతు బట్టని విషయం.ఈ ఆలయం 1953 నుంచి దేవాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఆలయ బాగోగులు ప్రభుత్వమే చూసుకుంటున్నది. భక్తల సౌకర్యార్దం వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నది. బస్తీలో జరుగుతున్న అల్లర్లను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి అవాంచనీయ సంఘలనలుజరుగకుండా మెటల్ డిటెక్టర్‌లను ఏర్పాటు చేసిండ్రు. నిఘా కెమేరాలను ఏర్పాటు చేసి ఆలయంలో ప్రతి ఒక్కరి కదలికలను రికార్డు చేస్తున్నరు. జాతరలప్పుడు మరిన్ని భద్రతా ఏర్పాట్లతో కట్టదిట్టమైన చర్యలు తీసుకొని భక్తులకు అమ్మవారి దర్శనం తేలికగా అయి క్షేమంగా ఇల్లు చేరుకునే విధంగా చర్యలు తీసుకుంటరు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment