ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Friday, April 2, 2010

బతుకమ్మ గురించి కాస్త తెలుసుకుందామా....

బతుకమ్మ...కల్లలెరుగని తెలంగాణ ప్రజల సంబరం...పల్లె పల్లెన కనిపించే మహోత్సవం.. వెల్లివిరిసే పూల సమ్మేళనం.. వెదజల్లే మట్టి పరిమళం.
బతుకమ్మ...ఒక అందమైన సంస్కృతిని ప్రతిబింబించే అపురూప దృశ్యం. యాంత్రిక జీవనంలో విసిగిపోయే మహిళలకు ఉల్లాసాన్ని మానసిక నవోత్తేజాన్ని అందించే పర్వదినం..

తెలంగాణ సాంస్కృతిక ప్రత్యేకతలున్న నేల. ఇక్కడి భాష, యాస, ఆచారాలు, వ్యవహారాలు అన్నింటిలో జానపద ముద్ర కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. పండుగలూ కూడా ప్రకృతి, వ్యవసాయం చుట్టూ అల్లుకుని వుంటాయి. బతుకమ్మ పండుగ అలాంటిదే!
బతుకమ్మ అచ్చంగా స్ర్తీల పండుగ. అలా కనిపిస్తుంది. భాద్రపద అమావాస్యకు చాలా ప్రాముఖ్యత వుంది. పెద్దల అమావాస్య అనీ.. పెత్తరమాస అని పిలుస్తుంటారు. కాలంతో పరుగెత్తడం అలవాటయ్యాక తిథులను గుర్తు పెట్టుకోవడం ఒకింత కష్టమే! అందుకే అందరూ ఈ రోజు తమ పెద్దలకు, పితృదేవులకు పండుగ చేస్తారు. పల్లె సంబరం బొడ్డెమ్మ పండుగతో మొదలవుతుంది. నిజానికి ఈ ప్రాంత వాసులకు ఇది ఒక పండుగ కాదు. నాలుగు పండుగల మేళవింపు. బొడ్డెమ్మ పండుగ, పెద్దల పండుగ, బతుకమ్మ పండుగ, దసరా పండుగ.. ఈ నాలుగింటిని వరుసగా జరుపుతారు. ఇది ఒకరోజు సంబరం కాదు.. ఇరవై రోజుల ఉత్సవం.
భాద్రపద పంచమి రోజున మగవాళ్లు వెళ్లి పుట్టమన్ను తెస్తారు. ఇక్కడి ప్రజల సంస్కృతిలో పుట్టమన్నుకు ప్రత్యేక స్థానం వుంది. ఇంట్లో కొత్త పొయ్యి వెయ్యటానికి కూడా పుట్టమన్నే వాడుతారు. దుర్గమ్మ పండుగకు పుట్టమన్ను తెస్తారు. పుట్టమన్ను తడిపి ఒక చిన్న పీట మీద చతురస్రాకారంలో గుడి గోపురం మీద అంతురాలు చేస్తారు. వాటికి వరుసగా రంధ్రాలుంటాయి. పీటకు నాలుగు దిక్కులా నాలుగు చదరపు ముద్దలుంటాయి. వాటికి ఒక్కొక్క రంధ్రముంటుంది. దీన్ని బొడ్డెమ్మ అంటారు. బొడ్డె అంటే చిన్న కుప్ప లేదా రాశి. నిజానికి ఇది మట్టి పూజ. ఉత్పత్తి అంటే పంట.. పునరుత్పత్తి అంటే సంతానం సవ్యంగా సాగాలని చేసే పూజ. సాయంత్రం బొడ్డెమ్మను అలుకుతో కాని జాజుతో కాని తీర్చి దిద్దుతారు. మట్టి రంధ్రాలలో రంగు రంగుల రుద్రాక్ష, గోరింట, ముద్దాన్న పూలు పెట్టి అలంకరిస్తారు. సంధ్యవేల కూడలిలోనో, పెద్ద వాకిట్లోనో నడుమ పేడతో అలికి ముగ్గు వేస్తారు. మధ్యలో బొడ్డెమ్మలన్నీ పెట్టి చుట్టూ తిరుగుతూ ఆడపిల్లలు ఆడతారు. చీకటి పడిందాక ఆడి బొడ్డెమ్మలు తీస్తారు. నిదురపో బొడ్డెమ్మ నిదురపోవమ్మా.. నిద్రకు నూరేళ్లు, నీకు వెయేళ్లు అని పాటలతో నిద్ర పుచ్చి ఎవరింటికి వాళ్లు తీసుకెళతారు. ప్రతి సాయంత్రం ఇలా కొత్త అలుకు రాసి కొత్త పూలు అలంకరించి తొమ్మిది రోజుల తర్వాత పండుగ చేస్తారు. చివరి రోజు ఆట తర్వాత బొడ్డెమ్మలను బావిలో వేస్తారు. బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక దర్పణం. తెలంగాణ ప్రజల జీవన విధానం అందులో ప్రతిబింబిస్తుంది. మానవసంబంధాలను నిలబెట్టి కొత్త జీవన స్ఫూర్తినిస్తుంది. బతుకమ్మ మనకు బతకడాన్ని నేర్పిస్తుంది.
పెత్తరమాస రోజు నుంచి బతుకమ్మ సంబరాలు మొదలవుతాయి. మొదటి రోజును ఎంగిలిపూలంటారు. ఇంటి చుట్టూ దొరికే పూలన్నీ సంబరంలో పాలు పంచుకుంటాయి. రంగు రంగుల పూలన్నింటినీ తీసుకొచ్చి హారతి పళ్లెంలో అందంగా పేరుస్తారు. తెలంగాణలో ఈ పళ్లాన్ని తబుకు అంటారు.
మెట్టినింటికెళ్లిన ఆడబిడ్డలందర్ని ఆప్యాయంగా పుట్టింటికి తీసుకొస్తారు. ఏడాది పొడవునా వ్యవసాయ పనులతో, ఇంటి పనులతో, అత్తింటి ఆరళ్లతో అలసిపోయిన ఆడవాళ్లకు తల్లిగారింటి నుంచి వచ్చే పిలుపు గొప్ప ఊరటనిస్తుంది. పుట్టినిల్లు కావాల్సినంత విరామాన్నిస్తుంది. చుట్ట పక్కాలు, చిన్ననాటి స్నేహితులు, పలకరింపులు, ఆప్యాయతలు, అభిమానాలు కష్టాలను కడతేరుస్తాయి. కొత్త ఉత్సాహాన్ని తెస్తాయి. మొత్తానికి తొమ్మది రోజులూ సందడే. అందుకే పేద కుటుంబాలైనా సరే ...ఆడబిడ్డలను ఇంటికి పిలిపించుకుంటారు. ఇది కేవలం పండుగ కాదు... తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో ఆడబిడ్డల ప్రేమ బంధాలను గట్టిపరిచే సందర్భం.
బతుకమ్మను పేర్చడం ఓ కళ. అలంకారినికో పరీక్ష. సౌందర్యాభిలాషకో నిదర్శనం. బతుకమ్మను పేర్చేవారికి పూల పరిచయముండాలి. . రంగుల రహస్యం తెలుసుండాలి. అద్దకం, కలంకారి పనితనం కావాలి.
తొమ్మిదో రోజు బతుకమ్మను పెద్ద బతుకమ్మ అనీ.. సద్దుల బతుకమ్మ అని అంటారు. పెద్ద బతుకమ్మ కోసం ఒక రోజు ముందుగానే గడ్డి పువ్వు, గునుగుపువ్వు తెచ్చి తగినట్టుగా కోసి కట్టలు కట్టి పెట్టుకుంటారు. కొంతమందైతే.. అర్ధరాత్రి వెళ్లి తంగెడు చెట్టు దగ్గరే పడుకుంటారు. రాత్రి నుంచే పువ్వుల కోసం పోటీ పడతారు. గంపల్లో బస్తాల్లో పూలు నింపుకొస్తారు. కాస్త పొద్దు పొడిచాక.. బతుకమ్మను తీర్చిదిద్దడం మొదలవుతుంది. ఇంట్లో వున్న వాళ్లంతా తలో చేయి వేస్తారు. ఆడామగా చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ పువ్వలేరుతారు. పెద్ద పెద్ద బతుకమ్మలను సాధారణంగా మగవాళ్లే పేరుస్తారు.
ముక్కాలి పీట, దాని మీద పెద్ద తాంబాలం. దాని మీద గుమ్మడి ఆకులు పరచి తంగెడు పూలు పేరుస్తారు. తంగెడు పువ్వుతోనే బతుకమ్మ ఎత్తు పెంచుతారు. నడుమ ఉనుకనో, తంగెడు తుక్కునో నింపుతారు. రంగుల్లో అద్దిన గునుగుపూల కట్టలను వలయాకారంలో పేరుస్తూ వస్తారు. బతుకమ్మకు ఒకటా రెండా … అన్ని పువ్వులూ అలంకరణలవుతాయి. రోకలి బండ పువ్వు, అడవి శాకుంతి, కట్లె పువ్వు, గోరింట, గన్నేరు పూలు ఒద్దికగా ఒదిగిపోతాయి. బతుకమ్మను పేర్చడమయ్యాక పసుపు గౌరమ్మను తీర్చుతారు . ఇంట్లో అలికి ముగ్గు పెడతారు. దాని మీద పీట పెట్టి అందులో బతుకమ్మను పెడతారు. ఆడవాళ్లు వరి, సజ్జ రొట్టెలను ముక్కలు చేసి చక్కెర పాకంలో వేసి ముద్దలు చేస్తారు. వీటినే మలీద ముద్దలని, కులీదలని అంటారు. రకరకాల సద్దులు చేస్తారు. పులుసు కలిపిన సద్ది, పెరుగు కలిపిన సద్ది చేస్తారు. కాస్త కలిగిన వాళ్లు పెసర, కొబ్బరి, నువ్వుల, పల్లీల బియ్యం పొడులు లకిపి తయారు చేసిన తొమ్మది రకాల సద్దులు బతుకమ్మ ముందు పెడతారు. అగరు వత్తులు ముట్టించి బతుకమ్మ పూల మధ్యలో చెక్కుతారు. పూజ చేస్తారు. కొత్త చీరలు కట్టుకొని తయారైన స్ర్తీలు బతుకమ్మను ఇంటి ముందు పెట్టి ఆడతారు. వంటలు సమర్పిస్తారు. మొక్కుతారు. సాయంత్రం నుంచి చీకట్లు ముసురుకొనే వరకు అడవాళ్లంతా తనివి తీరా ఆడతారు. ఆ తర్వాత తమ్మలి వాద్య సహకారంతో బతుకమ్మలు తలల మీద ఊరేగుతాయి. అంతకు ముందే బతుకమ్మలను వదలడానికి యువకులు పెద్దలు చెరువు కట్ట పొడుగునా బారులు తీరి వుంటారు. సందె చీకట్ల మధ్య చెరువులోని నీటి అలల మీద బతులకమ్మలు తేలియాడుతూ ముందుకు వెనక్కి కదులుతుంటూ అదో ఉద్వేగం. పోయిరా బతుకమ్మ పోయికరావమ్మ మల్లొచ్చే యాడాది తిరిగి రావమ్మా అంటూ ...శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ అంటూ పాటలు పాడుతారు. తెచ్చిన ప్రసాదాలు, ఫలహారాలు తబుకుల్లో పోసి ఒక్క దగ్గర అందరూ కూడతారు. గుంపులు గుంపులుగా కలిపి మరింత సందడిగా తుళ్లుతూ పరాచికాలాడుతూ పరవశించిపోతారు. ఈ కార్యక్రమం అంతా ముగిసిన తర్వాత ఒకరినొకరు ఇష్టపూర్వకంగా పలకరించుకుంటారు. ఆడపిల్లలాడుకునే అందమైన, అద్భుతమైన పూల జాతర మరెక్కడా కనిపించదు. కేరళలో ఓనం పండుగ అటుఇటుగా ఇలాగే వుంటుంది. అక్కడ కూడా రంగు రంగుల పూలతో చిత్రించిన రంగవల్లిక, మధ్యలో వెలుగులు విరజిమ్మే దీపం, చూట్టూ చేరి ఆటపాటలాడే అమ్మాయిలు. పాటల్లో ఎక్కువగా పురాణ కథలే వుంటాయి. ఈ రెండు సందర్భాలు మినహాయిస్తే పూల సమ్మేళనంతో కూడిన పండుగలు మరో చోట కనిపించవు. అదే బతుకమ్మ ప్రత్యేకత. తెలంగాణలో బతుకమ్మ గొప్ప వేడుక.. అచ్చంగా జానపదుల పండుగ. ప్రాచీనమైన పండుగ. కావ్యాల్లోనూ, చరిత్ర పుస్తకాల్లోనో లేకపోయినంత మాత్రానా బతుకమ్మను ఇటీవలి పండుగగా చెప్పుకోవద్దు. చరిత్రలో చాలా అంశాలకు చోటు దొరక్కపోవచ్చు. దానికి రకరకాల కారణాలుంటాయి.జానపదులకు ఎంతో ఆరాధనీయమైన తంగెడుపూల ప్రస్తావన ఎందుకో కావ్యాల్లో కనిపించదు. నాగరికులూ పెద్దగా పట్టించుకోలేదు. ఈ బంగరుపూల సోయగాన్ని చూడాలంటే కాపు కన్నెల ముద్ద కొప్పుల్లో చూడాలి. వాసన లేకపోతేనేం... వలపు బాసలు నేర్చిన పూలు కాబట్టే స్ర్తీల సిగలో కాపురముంటున్నాయి. తంగెడుపూలకు బతుకమ్మకు విడదీయరాని సంబంధం వుంది. బతుకమ్మ పండుగ ఆవిర్భావినకి సంబంధించి కాల నిర్ధారణ చేయడం కష్టం. జానపద రచనకు ఆచారానికి కాల నిర్ధారణ చేయడం ఇప్పుడున్న ఆధారాలు సరిపోవు. అయితే పండుగ నేపథ్యాన్ని వివరించే నాలుగైదు కథనాలు బతుకమ్మ పాటల్లోనే వున్నాయి. ఓ బాలిక భూస్వాముల అకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటే, ఆమెను ఆ ఊరి ప్రజలు చిరకాలం బతుకమ్మా అని దీవించారని, అందుకనే ఇది స్ర్తీలకు సంబంధించిన పండుగైందని చెబుతారు. మరో కథలో దక్షిణ భారతాన్ని పాలించిన చోళ వంశ చక్రవర్తి ధర్మాంగుడనే రాజు ఆయన భార్య సత్యవతి వంద నోములు నోచి వంద మంది పుత్రులకు జన్మనిచ్చారు. యుద్ధంలో వారంతా అమరులయ్యారు. ఆవేదన చెందిన రాజదంపతులు లక్ష్మీదేవి కోసం తపస్సు చేశారు. లక్ష్మీదేవి ప్రసన్నురాలై సత్యవతి బిడ్డగా జన్మిస్తుంది. బతికిన ఈ తల్లి బతుకమ్మ అవుతుందనే మహర్షుల ఆశీర్వచనల ప్రకారం అప్పట్నుంచి ఆమె బతుకమ్మ అయింది. సంతానం కోసం పూజలు చేశాడట! లక్ష్మి దేవి అనుగ్రహంతో ఆయన భార్య గర్భవతై కూతుర్ని కనిందట! అనేక గండాల్నుంచి గట్టెక్కింది కాబట్టి పాపకు బతుకమ్మా అని పేరు పెట్టారట! అప్పట్నుంచి యువతులు బతుకమ్మను కొలవడం ఆనవాయితీగా వస్తుందట! అసలు బతుకమ్మ పండుగకు, నవరాత్రి ఉత్సవాలకు కూడా దగ్గర సంబంధం వుందట! మహిషాసురునితో యుద్ధం చేసి దుర్గాదేవి అలసిపోయిందట! ఆ అలసటతోనే సుప్తావస్థలోకి వెళ్లిపోయిందట! ఆమెకు సేద తీర్చి తిరిగి యుధాస్థితికి తీసుకురావడానికి స్ర్తీలు సేవలు చేసి పాటలు పాడారట! తొమ్మిదో రోజుకు ఆమె అలసట తీరిందట! వెంటనే మహిషాసురుడ్ని సంహరించి తన కర్తవ్యాన్ని నిర్వహించిందట! ఆ జగన్మాత జనులకు జీవితాన్ని, బతుకునూ ప్రసాదించింది కాబట్టే గ్రామీణులు ఆమెను బతుకమ్మగా పిల్చుకుంటున్నారనేది ఓ కథ కూడా ప్రచారంలో వుంది. బతుకమ్మ పాటల్లో హితోక్తులు ఎక్కువ. వాటితో పాటు ఆర్ర్దత వుంటుంది. ఆవేశం వుంటుంది. ఆవేదన వుంటుంది. అణచివేతకు గురైన ఆవేశం వుంటుంది. ఉద్వేగం, ఉక్రోషం, ఉద్యమం అన్నీ వుంటాయి. బతుకమ్మ పాట పాడుకోవటానికి ఆశువుగా అల్లుకోవడానికి సులువుగా వుంటుంది. ఈ పాటల్లో అనేక ఇతివృత్తాలు ఇమిడి వున్నాయి. బతుకమ్మ పుట్టక కథల నుంచి, స్ర్తీల జీవితం చుట్టూ అల్లుకుని వున్న కష్టాల నుంచి అత్తింటి ఆరళ్ల నుంచి అన్నా చెల్లెల అనురాగాల నుంచి ఎన్నో కథనాలు సుదీర్ఘంగా సాగుతాయి. జనగామ రైలు ప్రమాదం, చెరువు కట్ట తెగిన వరద ప్రమాదం, కరువు కాటకాలు, కాల వైపరీత్యాలు, తెలంగాణ వీరుల అమరగాధలు, జానపద గాధలు, ఉద్యమాలు చివరికి ఎన్టీయార్‌ తెలుగుదేశం పార్టీని పెట్టడం ఇవన్నీ... ఈ పాటల నిండా మారుమోగుతుంటాయి. ఈ పాటలేవి అక్షరబద్దమైనవి కావు. అప్పటికప్పుడు సందర్భోచితంగా కూర్చిన పాటలు. పాటల్లోని భావరాగాలు ఒకదానితో ఒకటి పోటీ పడతాయి. తాళలయలు తప్పే ప్రసక్తే వుండదు.ఇప్పుడు బతుకమ్మ ఆధిపత్య సంస్కృతులు చేసిన దాడిలో కన్నీరు పెడుతోంది. దోపిడి బారిన పడిన చెరువులను చూసి గుండె చెరువు చేసుకుంటోంది. ఇంతకాలం పల్లెల కన్నీరు తుడిచిన బతుకమ్మను బతికించుకోవాలి. తెలంగాణ అస్థిత్వానికి నిలువెత్తు నిదర్శనమైన ఈ పూల జాతరను బతికించుకోడానికి వేనవేల సంజీవనిలు కావాలి. అవి మనమే ఎందుక్కాకూడదు?
రంగురంగుల పూలు ఉయ్యాలో... రకరకాల మనసులుయ్యాలో.. అందరికి శాంతిని ఉయ్యాలో .. అందించి దయ సూడు ఉయ్యాలో.

No comments:

Post a Comment