Sunday, April 18, 2010
సింగపూర్ సింగారాలు
జనార్దన్
అందమైన భవనాలు... సిటీ మద్యలో సెలయోళ్లు.. అడుగడుగునా ఆహ్లాదకరమైన వాతావరణంతో... అచ్చం అద్దంలా ఉండే నగరాన్ని మీరెప్పుడైనా చూశారా.. అయితే ఇప్పడు మీరు చూడబోయే నగరం అచ్చం అద్దంమంత స్పష్టంగా కనిపిస్తది. ఇంతకీ ఆ నగరం పేరేంటనేగా మీ డౌట్. ఇన్ని లక్షణాలున్న బ్యూటిఫుల్ సిటీ నన్ అదర్ దాన్ సింగపూర్... ఈ వారం టూరిస్ట్ గైడ్ లో సింగపూరు సింగారాలను చూసొద్దాం.
సింగపూర్... ఈ పేరులోనే ఓ విశేషం ఉంది. సింగం అంటే మలయా భాషలో సింహమని అర్దం. పద్నాలుగో శతాబ్దంలో సుమత్రాదీవి యువరాజు సంగ్ నీలోత్తమ ఈ ద్వీపానికి వచ్చిండట. అప్పుడు ఈ ద్వీపంలో సింహం వంటి విచిత్ర జంతువు కనిపించిందట. అప్పటి నుంచి ఆ యువరాజు ఈ ప్రదేశం గురించి చెప్పే సందర్బంలో సింగపురం అని చెప్పేవాడట. అదే నానుడిగా మారి ఈ దేశానికి సింగపూర్ అనే పేరు స్థిరపడింది.సింగపూర్ గురించి వర్ణించడానికి మాటలు చాలవు. నిత్యం వేలాది మంది సంచరించే రద్దీ ప్రదేశాన్ని కూడా అద్దంలా అందంగా ఉంచుకోవచ్చు అని చెప్పడానికి స్వచ్ఛమైన ఉదాహరణ సింగపూర్. దక్షణాసియా దేశంలోనే అతి చిన్న దేశం సింగపూర్. చిన్న రాష్ర్టాలు, చిన్న దేశాలు అభివృద్ది సాధించవు అని నీతులు చెప్పేవారికి సింగపూరే అచ్చమైన ఉదాహరణ. పాలకులలో చిత్తశుద్ది ఉంటే ఎంత చిన్నదేశమైన స్వర్గధామంగా మార్చవచ్చని నిరూపించారు ఇక్కడ పాలకులు. పారిశుద్ధ్యంలో కూడా చక్కటి పేరు సంపాందించిన సింగపూర్ అభివృద్ధికి ఇక్కడి పరిపాలనా దక్షతను కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అందుకే అతి చిన్నదైనప్పటికీ, ప్రపంచ దేశాలలో ఆర్థికంగా 13వ స్థానంలో నిలిచేలా చేసింది.ఈ అందమైన భవనాలను చూడండి... ఎంత ముచ్చటగా ఉన్నయో... మెడ మొత్తం ఎత్తినా కనిపించనంత ఎత్తులో ఉన్నయి. ఆకాశ హర్మాలు అనే పదానికి సింగపూర్ బిల్డింగ్‌లే పర్యాయపదాలు. మలేషియాకు దక్షిణాన 704 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన దక్షిణాసియాలోని అతి చిన్న దేశం సింగపూర్. దీని అధికారిక నామం "రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్". ఇది ఒక చిన్న ద్వీపం, నగరం కూడాను..
ఆరోగ్యపరంగానూ సింగపూర్ అభివృద్ధి పథంలో ఉండటంతో విదేశీయులు సైతం వైద్యం కోసం ఇక్కడకు వస్తూ ఉంటారు. ఈ దేశ ఆర్ధిక వనరులలో పర్యాటక రంగము ప్రధాన పాత్ర వహిస్తుంది కనుక ఇక్కడకు విచ్చేసే పర్యాటకులకు విమానాశ్రయంలోనే తాత్కాలిక వీసా మంజూరు చేసే ఏర్పాటు ఉంది. ఈ దేశానికి వివిధ దేశాలనుండి టూరిస్ట్ వీసా సులువుగానే లభిస్తది.సింగపూర్ చూడాలంటే రెండు కళ్లు చాలవంటే నమ్మండి... ఇక్కడ ఏది చూసినా కొత్తగనే అనిపిస్తది. ముఖ్యంగా సిటీ మొత్తం అంత నీట్‌గా మెయింటేయిన్ చేయడం చూస్తే వావ్ అనిపిస్తది. సిటీ మొత్తం అద్దంలా ఉంటదంటే నమ్మండి... చూస్తే మీరే అంటరు సింగపూర్ ఈజ్ క్లీన్ అండ్ గ్రీనని.సింగపూర్ చూడ్డానికి రెండు కళ్లు చాలవంటే నమ్మండి. ఎందుకంటే ఇక్కడ నీరు సమృద్దిగా ఉండటం వల్ల చల్లగా ఉండటమే కాక పచ్చని తివాచీ పరచినట్టుండే పచ్చిక బయళ్లు కనువిందు చేస్తయి. ఇక్కడి మెర్‌మెయిడ్ విగ్రహాలు పర్యాటకులను ఆకట్టుకుంటయి. ఇక్కడకొచ్చిన పర్యాటకులు మెర్‌మెయిడ్ ప్రతిమల ముందు ఫోజులిచ్చి ఫోటోలు దిగుతరు. బోట్‌లో బ్రిడ్జ్ కిందనుంచి చేసే ప్రయాణం భలే మజాగా ఉంటది.రివర్‌లో ప్రయాణిస్తూ చుట్టూ ఉన్న అందమైన భవంతులను చూస్తుంటే ఏదోలోకంలో విహరిస్తున్న అనుభూతి. అడుగడుగున ఉన్న బ్రిడ్జిలను దాటుకుంటూ చేసే ఆహ్లాదకరమైన జర్నీ ఇది. వచ్చే బోటుకు, పోయే బోటుకు హాయ్ చెప్పుకుంటూ వాటర్ జర్నీ ఎంజాయ్ చెయ్యోచ్చు. సింగపూర్లో మరో విశేషమై ప్రదేశం డ్రాగన్ బోట్‌రేస్. సింగపూర్ మద్యలో ఉన్న నదిలో బోట్ రైడింగ్ పోటీలు నిర్వహిస్తరు. ఇందులో గెలిచినవారికి పతకాలు, బహుమతులు అందజేస్తరు. సింగపూర్లో ఈ పోటీలకు అత్యంత ఆదరణ లభిస్తది. సింగపూర్ భవనాలు విశ్వకర్మ సృష్టించాడా అన్నంత అందంగా ఉంటయి. ఖాళీ ప్రాంతం ఉంటే చాలు పచ్చిక బయళ్లతో నింపేస్తరు. విశాలమైన రోడ్లు. ట్రాఫిక్ సిగ్నల్స్, పాదచారులకు సౌకర్యంగా ఉంటది. సింగపూర్ వెళ్లిన వాళ్లు బస చేయాలంటే రాజభవనాల్లాంటి హోటళ్లు సిద్దంగా ఉంటయి. ఇక్కడి హోటళ్లన్నీ టైమ్ మిషన్‌లంటే నమ్మండి. మోడ్రన్ లుక్‌లో ఉన్నా పురాతన చరిత్రను అడుగడుగునా కళ్లకు కట్టే ప్రయత్నం చేస్తరు ఇక్కడి వాళ్లు. రాజభవనంలా ఉండే రాప్లెస్ హోటల్ కు వెల్లడం ఓ అనుభూతి. ఈ హోటల్ ఎన్నో ఏండ్లసంది పర్యాటకులను ఆకట్టుకుంటది. ఇది కట్టి ఎన్నో ఏండ్లయినా హోటల్లో కొత్తగానే కనిపిస్తది. అంత రిచ్ గా మేనేజ్ చేస్తరు. హోటల్ గోడలపై చరిత్రక, సాంస్కృతిక ఆనవాళ్లు తెలిపే చిత్రాలు ముద్రించిండ్రు.సింగపూర్‌కు సింగారాన్ని తెచ్చిపెట్టేది ఆర్కిడ్ గార్డెన్. వర్ణాలన్నీ కలబోసి ఈ తోటలోనే కుమ్మరించారా అన్నట్టుంటయి ఇక్కడి పూలు. ఎన్నెన్నో వర్ణాల పూలు తేటి ముద్దలతో తడిసి ముద్దయితుంటయి. ఈ గార్డెన్ మద్యలో ఉన్న కొలనులో అన్ని వర్ణాల చేపలు జలపుష్పాల్లా కవ్విస్తుంటయి.తోటలో గడియారం చూపరులను ఆకట్టుకుంటది. సాధు జంతువులంటే ఎవరు మాత్రం ఇష్ట పడరు చెప్పండి. సింగపూర్ జూలో ఉన్న జంతువులను చూస్తే మీక్కూడా వాటితో కాసేపు కబుర్లాడాలనిపిస్తది. చిలుకలను చూసి ముచ్చట్లాడాలని పిస్తది. చిట్టి, చిట్టి జలపాతాలను చూసి సేదాతీరాలనిపిస్తది. పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకునే ప్రదేశాలలో జూ కూడా ఒకటి. సింగపూర్ జూలో చింపాంజీల చిలిపి చేష్టలు నవ్వు తెప్పిస్తయి. పర్యాటకులు వీటిని ముద్దు చేస్తరు. మొసళ్లు, తాబేళ్లు, ఉబయచరాలు, కొంగలు, ఒకటేమిటి రకరకాల పక్షులు, ఎన్నో రకాల జంతువులు మనల్ని పలకరిస్తయి.తామరాకుల పై నీటి బిందువులు వజ్రపు తునకల్లా మెరిసిపోతుంటయి. కలువల కొలనుల్లో సూర్యుడు జలకాలాడుతున్నట్టు సూర్యకిరణాలు నాట్యం చేస్తయి. మనం బయట చూడలేని ఎన్నో జంతువులను ఇక్కడ చూడొచ్చు.జూ లో నడిచి చూడలేని వారు ట్రైన్ ఎక్కి జూ మొత్తం కలియ తిరగొచ్చు.సింహాలు, జీబ్రా, ఖడ్గ మృగాలు, చూడముచ్చటగా ఉంటయి. వింతైన అడవి జంతువులు. మనం ఎప్పుడూ చూసెరుగని ఎన్నెన్నో జంతువులు ఇక్కడ కనిపిస్తయి. ఏనుగుల సందడి, సీల్, కంగారుల సయ్యాటలు. చలికి వణికే చిగురాకులు ఎంత సేపు చూసినా తనివి తీరని అందం ఈ పార్క్‌ది.సింగపూర్ కల్చర్ డిఫరెంట్‌గా ఉంటది. భిన్నత్వంలో ఏకత్వం అనే మాట సింగపూర్‌కు సరిగ్గా సరిపోద్ది. ఎందుకంటే ఇక్కడ ఇండియా, అరబ్ కంట్రీస్, చైనా దేశాల నాగరికతలు కూడా కనిపిస్తయి.
చైనాటౌన్, లిటిల్ ఇండియా, అరబ్ స్ట్రీట్‌లు సింగపూర్‌లో చూడవలసిన వాటిలో ప్రధానమైనవి. చైనాటౌన్‌లో కెళితే సింగపూర్‌లో ఉన్న ధ్యాసే ఉండదు. ఇక్కడ షాపింగ్, సంప్రదాయాఉ, ఆచార వ్యవహారాలు మొత్తం చైనా మయమే. చైనా సంస్కృతికి ఈ టౌన్ అద్దం పడతది.
సింగపూర్‌లో మరో చూడచక్కటి ప్రదేశం మయమ్మన్ టెంపుల్. ఈ టెంపుల్‌లో అడుగు పెడితే భారతీయత ఉట్టిపడతది. కాసేపు సింగరేణిలో ఉన్న సంగతే గుర్తురాదు. ఈ దేవాలయ గాలిగోపురాల పై దేవతా మూర్తులు కొలువుదీరి ఉంటయి. పూజారుల హడావుడి, ఆడపడుచుల ఆరాటం. పెళ్లి సందళ్లు... ఇవన్నీ చూస్తుంటే సింగపూర్‌లో ఇండియాను చూస్తున్నట్టుంటది.దేవాలయ ప్రాకారాల నిండా రామాయణ, మహాభారత, భాగవత కథలు చెక్కించిండ్రు.అరబ్ స్ర్టీట్ అరబ్ సంస్కృతికి అద్దం పడతది. ఈ స్ట్రీట్లో అరబ్‌లకు కావలిసిన అన్ని రకాల వస్తువులు దొరుకుతయి. మోజు పడ్డ వస్తువులను ముచ్చటగా సొంతం చేసుకోవాచ్చు.చిట్టి చిలుకలు, ఎండ పొడకు మిలమిల మెరిసే నీటి కొలనులు, మురిపించి మాయమయ్యే రంగురంగుల చేపలు. ఇవన్నీ ఒక్కచోట కనిపించే చోటే జరంగ్ బర్డ్ పార్క్. ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ వెళ్లాలని పించే పార్క్ ఇది.సింగపూర్ జరంగ్ బర్డ్ పార్క్ కంటి చూపు తిప్పుకోనీయదు. ఇక్కడ వింత వింతైన పక్షులు కనువిందు చేస్తయి. పార్క్ మద్యలో చిట్టి జలపాతం, సింగిల్ ట్రాక్ పై వెళ్లే మినీ రైలు, ఎంత బాగుంటయో...కొలనులో జలకాలాడే బాతులు..అలల పై తేలియాడే పూల గుత్తులు. అందమైన లోకం ఇది. పర్యాటకులు తమ కెమేరా కళ్లల్లో బందించాలను తాపత్రయపడ్తరు.కలువలను జలపుష్పాలను కొంగలు పలకరిస్తయి. సయ్యాటలాడుతుంటయి. పనిలో పనిగా దొరికిన చేపలను గుటుక్కుమనిపిస్తయి. ఎర్రటి కొంగలను చూస్తే కూసింత కళాపోషణ గుర్తొస్తది. సిందూర నదిలో అభ్యంగన స్నానం చేసొచ్చాయా.. అన్నట్టుంటయి ఈ ఎర్రటి కొంగలు.ఈ చిలుకలను చూస్తే ఎవరైనా చిన్న పిల్లలై పోవడం ఖాయం. ఎన్నెన్నో వర్ణాల చిలుకలు మనలను ప్రకృతి ఒడిలో మైమరచిపోయేలా చేస్తయి. సింగపూర్లో మరో ముచ్చటైన ప్రదేశం చైనీస్ గార్డెన్. సంప్రదాయ నాగరికతను కళ్లకు కట్టే ప్రదేశం ఇది. టేస్ట్ ఉన్న వాళ్లకు ఇక్కడే చిరకాలం ఉండాలనిపిస్తది. ఇటువంటి గెస్టహౌస్ కట్టించుకుంటే బాగుండనిపిస్తది. అవును మరి చైనీస్ గార్డెన్ అంత సుందరమైనది. చూస్తే మీరే చెప్తరు.చైనీస్ గార్డెన్ ఒక సుందమైన ప్రదేశం. పెద్ద పెద్ద భవంతులు చూస్తే అవాక్కయి పోవడం ఖాయం. గార్డెన్ అణువణువునా అందమైన మొక్కలతో అలంకరించి ఉంచుతరు. బోన్సాయ్ మొక్కలు చిన్న చిన్న కుండీల్లో తమ పెద్దరికాన్ని ఒలకబోస్తయి. ఎంతసేపు చూసినా తనివి తీరని అందం చైనా గార్డెన్‌ది. పురాతన చెట్లు, ఈత కొలను, సేదతీరాలను కునే వారికి ఇది మంచి చోటు. గార్డెన్ మద్యలో విగ్రహాలుంటయి.చిన్న చిన్న కాలువలు, పచ్చని పచ్చికలు ప్రేమికులకు పొదరిల్లులా అనిపిస్తది. మనసైన తోడు చెంతనుంటే లోకాన్ని మరిచి ఎంజాయ్ చేసే చోటు ఇది. సొగసైన ఈ గార్డెన్‌లో ఉబయచరాలు సందడి చేస్తయి. సెంతోసా ద్వీపం. ఈ ద్వీపానికి కేబుల్ కారులో ఒక దారిలో వెళ్ళవచ్చు. తిరిగి రావడానికి బస్సురూటును ఉపయోగించుకుంటరు. సింగపూరులో భాగమైన సెంటోసా ద్వీపంలో సింగపూరు జాతీయ చిహ్నమైన మెర్ మెయిడ్ కింది సగ భాగము చేప, పై సగ భాగము సింహముతో ఉంటుంది. ఈ మెర్ మెయిడ్‌ను చూడటం మరచిపోలేని అనుభూతిగా మిగిలిపోతుందనడంలో ఆశ్చర్యం లేదు సందర్శకులను మెర్ మెయిడ్ తలభాగమువరకు లిఫ్ట్‌లో తీసుకు వెళతారు. ముందుగా ఒక చిన్న ప్రదర్శన ఉంటుంది .ఇక్కడ సంప్రదాయక భవనంలో సింగపూరు చరిత్రను లేజర్ షో సహాయంతో ప్రదర్శిస్తారు. అతి సహజమైన పరిస్థితిలో జీవము ఉట్టిపడే బొమ్మలతో నావ ప్రయాణము, నావికులు, వర్తకము అనేక సంప్రదాయాలు ప్రతిబింబించే బొమ్మలతో కూడిన ప్రదర్శనశాలను సందర్శకులు చూడొచ్చు
ఇక్కడ చూడవలసిన పర్యాటక ప్రాంతాలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది "అండర్ సీ వరల్డ్". భూగర్భంలో ఏర్పాటు చేసిన ఈ అండర్ సీ వరల్డ్‌లో అనేక సముద్ర ప్రాణుల్ని సజీవంగా చూసే ఏర్పాటు ఉంది. ఇక్కడ రాత్రివేళలో అద్భుతమైన లేజర్ షోలు జరుగుతూ ఉంటాయి. వాటిని చూస్తూ కాలాన్ని మరచిపోతం.
సింగపూర్ అందాలు చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారు కదా. మీకు కూడా ఈ సమ్మర్లో సింగపూర్ వెళ్లాలనుందా... అయితే ఇంకెందుకాలస్యం బయలుదేరండి... ఎలా వెళ్లాలి...ఎంత ఖర్చవుతది అనేగా మీ డౌట్... అయితే ఇదిగో ఇటో లుక్కేయండి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment