ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Sunday, April 18, 2010

పల్లె పాటగాడు జయరాజ్ గురించి

తెలంగాణ గడ్డ పాటలకు పెట్టని కోట. ఇక్కడ మట్టి పొరల్లో పాటలు ప్రవహిస్తుంటయి. మాటలంత తేలికగా పాటలు పుడుతుంటయి. జనం నోళ్ళల్లో మాటలు, పాటలు కలిసి సహజీవనం చేస్తుంటయి. అట్లా ఊటలయిన పాటలకు పోరాట శక్తిని అందిస్తున్నది తెలంగాణ పాటగాళ్ళే. జనం పాటల బాణీలను తీసుకొని ఉద్యమ స్ఫూర్తిని నింపి తిరిగి జనానికి ఆ పాటలను చేర్చడంలో ప్రజా వాగ్గేయకారుల పాత్ర మరువలేనిది. అలాంటి ప్రజావాగ్గేయకారుల్లో పదునెక్కిన గొంతుక, జబర్దస్త్‌ పాటల జంగ్‌ సైరన్‌ జయరాజుతో ఈ వారం మాటాముచ్చట... మీ కోసం....
జయరాజ్‌... నీటి చెలిమల్లాంటి తియ్యనైన పాలల్లినోడు. చెట్టు పుట్టలను పాటల్లో ఒంపుకొని పల్లెతల్లిని పలకరించినోడు. వరంగల్‌ జిల్లా మహబాద్‌ మండలం గుమ్మనూర్‌లో పాటైపుట్టిండు. తల్లి చెన్నమ్మ, తండ్రి రాజయ్య. చదువంతా ఖమ్మం జిల్లా బయ్యారం మండలం గంధంపల్లిలో సాగింది. విద్యార్ది దశ నుంచే ప్రశ్నించడం నేర్చుకున్న పోరుశాలి జయరాజు. విద్యార్ది నాయకుడిగా కళాశాల, హాస్టల్ సమస్యల పై పోరాడిండు. డిగ్రీ పూర్తి చేయకముందే జయరాజును ఉద్యోగం వరించింది. సింగరేణిలో ఫిట్టర్‌ కొలువు చేసినా పోరాట బాటను వీడలేదు. సింగరేణి కార్మికుల సమస్యల పై పోరాడే క్రమంలో లాఠీ దెబ్బలను తిన్నడు. ఎన్నోసార్లు జైలు గడపతొక్కిండు. జైలుకు వెళ్లినా అక్కడ కూడా ఖైదీల సమస్యల పై పోరుచేసిండు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నెలరోజులు చేసిన సమ్మె సింగరేణి చరిత్రలోనే ఓ కొత్త అధ్యాయానికి తెరలేపింది. ప్రభుత్వం సామధానభేద దండోపాయలు ప్రయోగించింది. ఆఖరుకు ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రలోభ పెట్టిండ్రు. అయినా జయరాజ్‌ తన పంథా వీడలేదు. పేదలకై బుట్టి పాటలు కైగట్టినోడు.. పాటగానే పుట్టి పాటల్లో పదంలా బతికాలన్నదే జయరాజు ఆశ..శ్వాస.సుకవి జీవించు ప్రజల నాలుకలందు అన్న కవి మాటలకు జయరాజే నిలువెత్తు సాక్ష్యం. జయరాజ్‌ కదిలే పాటల ప్రవాహం. పల్లెపాటలను ఒళ్లంతా నింపు కున్న మర్మయోగి జయరాజు. కల్మశం లేని ఆయన కలం నుంచి జాలువారే పాటలు జీవనదిలా సాగిపోతుంటయి. తన స్నేహితుడు చేరాల కనుమూసినపుడు “ నిన్నెట్టా మరిచిపోదును చేరాల..’ అన్న పాట ఆయన కలం నుంచి పట్టిన తొలి పల్లవి. కాచినపల్లి ఎన్‌కౌంటర్‌ పై రాసిన పాట ప్రతి హృదయాన్ని కదిలించింది. ఈ పాట విన్న ఏ తల్లికైనా... ఏ చెల్లి కైనా కన్నీటి చెమ్మ రావడం ఖాయం. “ ఎక్కడ ఉన్నారో అన్నలు... యాడా ఉన్నారో... నింగీలోన తొంగి చూసే చుక్కలైనారో..’ ఈ పాట జయరాజును లోకాని పరిచయం చేసింది. ఆయన కలం నుంచి తొణికిన ప్రతి పదమూ పాటై పలికింది. చెలకల్లో లేని నీళ్లు రైతు కళ్లల్లో చూసి జయరాజు రాసిన వానమ్మ పాట.. కరువుతో అల్లాడే ప్రతి పల్లెలోన, పనిపాటల్లోనా కష్టజీవికి తోడైనిలిచింది. నీల్లోసుకున్న కంకి నీళ్లాడలేక పాయే అన్న పదం, గుండె గల్ల ఎవరినైనా కదిలిస్తది. అంత సక్కని పాట వానమ్మ పాట. చెంగు చెంగున ఎగిరే కోడె దూడలు కటికోడి కొట్టుకు చేరుతున్నయని వలపోస్తడు జయరాజు. వంద మాటల కంటే ఒక పాట చాలా గొప్పదన్న స్పృహ ఉన్నోడు కాబట్టే...పాట జనం నాడి పట్టుకొని... దశాబ్దాలు గడిచిన వన్నెతరగని పాటలు రాసిండు. అనేక ఉద్యమాలకు సాంస్కృతిక సైనికుడై పనిచేసిండు.
జయరాజు సింగరేణిపోరాటాలకు సైరనై మోగిండు. ఫలితంగా రాజ్యం అతని మీద కక్ష గట్టి , లాఠీ దెబ్బలు, దొంగకేసుల రుచి చూపించి అనేక సార్లు జైలుకు పంపింది. అయినా ఆ గొంతుక పోరుబాటను మాత్రం వీడలేదు. పోరాట పాటలు రాయడం మాత్రం వదలలేదు. అనేక ఉద్యమ పుట్టుకల్లో , పయానాల్లో ముందుండి పోరాడిన నాయకుడు, గాయకుడు తాను. విప్లవోద్యమం బలంగా ఉన్న రోజుల్లో ప్రజలను ఆ పోరాటాలకు మద్దతు కూడగట్టినయి జయరాజు పాటలు. రక్తం ఉడికి, కడుపు రగిలిన తనం తన పాటలంతట కనిపిస్తది. తెలంగాణ బతుకు ఛిధ్రమైన జాడను పాటల్లో పట్టి చూపించిండు.ప్రజల గుండెల్లో చిరకాలం యాదికుండే పాటలు రాసిన జయరాజు విప్లవోద్యమ దృష్ఠితో అనేక పాటలకు ప్రాణం పోసిండు. పోరాడకుంటే బతుకు మారదని, ప్రజలకు దోపిడి మర్మాన్ని విప్పి చెప్పిండు. జయరాజు పాటలు ప్రజలను ఉద్యమ బాటలో నడిపిస్తయి. అంతేకాదు ప్రజలకు చదువు ఎంత ముఖ్యమో తెలుపుతూ అక్షరోద్యమ సమయంలో అద్భుతమైన పాటలు రాసిండు. ఆ పాటలు చదువురాని అనేకమందికి చదువుపట్ల ఆసక్తి కలిగేటట్టు చేసినయి. జయరాజు రాసిన పాటలు అక్షర దీపాలైనయ్‌. ఆరిపోని నిప్పు కణికలైనయి.జయరాజు రాసిన పాటల్లో దేని ప్రత్యేకత దానిదే. ప్రతీ పాట ఒక సమగ్రమైన కళాఖండంగా నిలిచింది. “జోలాలీ’’ పాటవింటే వందకోట్ల భారతీయుల కన్నీటి కథ మన కండ్లముందుంటది. ఇంకేమి మారిందరా అని తెలంగాణ గోసను పాటగా ప్రశ్నించే తీరుకు ఒంటి మీది రోమాలు కత్తులవుతయి. జయరాజు పాటల్ల గోడాడే తండ్లాట అట్లా కండ్లముందటికొత్తది. ఆకలి, పేదరికం,నిరక్షరాస్యత, నిరుద్యోగం, పాలకుల పీడనవంటి దీర్ఘకాలిక సమస్యలను పాటగట్టి జనాన్ని పోరుబాట పట్టిచ్చిండు.పల్లె గురించి, తల్లి గురించి, ఉద్యమం గురించి, అక్షరం గురించి, ప్రభుత్వ దుర్మార్గాల గురించి...పడావుపడ్డ భూముల గురించి విభిన్నమైన వస్తువులతో పాటలల్లిన ఘనత జయరాజుది. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలన్న కవి హృదయం తనది. అంతేకాదు వివాహ వ్యవస్థలో లోపాలను, స్త్రీ పడే జీవితకాలపు వేదనను పదాలకు ఎక్కించిన ఉద్యమ గొంతుక జయరాజు. ఉద్యమ రచయితలు స్పృశించని అనేక విషయాలను పాటగా మలిచి తనకాలపు పాటకవుల్లో తనదైన ముద్రను నిలుపుకున్నోడు జయరాజు.జయరాజు రాసిన పాటలు వెండితెరకు కూడా ఎక్కినయ్‌. కొంత కాలం క్రితం వచ్చిన అడవిలో అన్న సినిమాకు హైలెట్‌గా నిలిచిన వందనాలమ్మ పాటను రాసింది జయరాజే. మాస్‌ సినిమాల్లో మైలురాయిగా నిలిచిన దండోరా సినిమాలో ఆణిముత్య గీతమైన కొండల్లో కోయిల పాటలు పాడాలి అనే పాట రాసిందీ జయరాజే !

No comments:

Post a Comment