ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Tuesday, August 23, 2011

గారాల బంగారం..నింగి పొత్తిళ్లలో పుత్తడి.


బంగారం ధరలు చుక్కలను వెక్కిరిస్తున్నాయా అన్నట్టు పెరుగుతున్నాయి.. పుత్తడి ధరలు తారాజువ్వల కంటే స్పీడుగా పైకెగసి పడుతున్నాయి.. పసిడి వెలుగులు పంచుకోవాలనుకున్న మధ్యతరగతి మగువల ఆశలు అడియాశల్లాగానే కనిపిస్తున్నాయి.. సమ్మర్ టెంపరేచర్‌లో పాదరసంలా పైకెగసి పోతోన్న బంగారం ధరల పై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ..
బంగారం కొనాలనుకున్న మద్యతరగతి ప్రజలు... ఇక పుత్తడిని మరిచి ఇత్తడితోనే సరిపెట్టుకోవలసి వస్తుందా అన్నట్టున్నాయి పసిడి ధరలు.. గత ఐదు సంత్సరాలలో బంగారం ధర గణనీయంగా పెరిగి బులియన్ మార్కెట్‌ను పతాక శీర్షికల్లో నిలబెడుతోంది.. ఐదేళ్లలో పసిడి ధర రెండున్నర రెట్లు పెరిగిందంటే.. బంగారం ధరలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు..బంగారం ధర ఒకప్పుడు సామాన్యుడికి అందుబాటులోనే ఉండేది.. ఏదో ఒక రోజు బంగారు నగలు చేసుకోవచ్చనే ఊహల్లో ఉండేవారు.. కనీసం పెళ్లికో.. ఏదైనా వేడుకకో బంగారు నగలు కొనుగోలు చేయవచ్చనే ఆశతో ఉన్నారు.. కానీ ప్రస్తుతం ఉన్న రేట్లను బట్టి చూస్తుంటే.. వేడుకల కంటే బంగారం కొనడమనే విషయమే వేడిగా మారింది.. బంగారం పేరు చెబితే గుండె గుబేల్ మంటోంది.. వేలికి తొడిగే ఉంగరం కొనాలన్నా ఇరవై వేలు కావలసిందే... ఒక్కసారి గతంలోకి వెళితే.. 1963 లో 10 గ్రాముల బంగారం కేవలం 80రూపాయలకే వచ్చేది.. అంటే అప్పటి ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండేది.. అయితే ఇప్పటి ఆర్ధిక వనరులతో పోల్చుకుంటే ఆనాడు తక్కువే అయినా .. బంగారం ధర అంత బరువేమీ కాదు.. మద్యతరగతి, దిగువ మద్యతరగతి ప్రజలకు బంగారం అప్పట్లో అందని ద్రాక్ష కాదు.. భారతదేశం ఆర్దిక సంక్షోబంలో చిక్కుకున్నపుడు దేశాన్ని రక్షించింది బంగారమే.. భారత దేశానికి అప్పుపుట్టించిన ఆపద్భాందవుడు పుత్తడే.. అర్ధ దశాబ్ద కాలం నుంచి బంగారం రేట్లు కొండెక్కి దిగనంటున్నాయి. ఈ మద్య కాలంలో కొండ పై నుంచి శిఖరాన్ని పాకాయి.. ఇక ఇప్పట్లో దిగేలా కనిపించడం లేదు.. అమెరికాలో ఆర్ధిక సంక్షోభం... బంగారం రేట్లు పెరగడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా ఆచరించిన ఉదారవాద అర్దిక విధానాల వల్ల పెద్దన్న పూర్తిగా ఆర్ధిక సంక్షోభంలో కూరుకున్నాడు.. ఫలితంగా అమెరికా ప్రభుత్వం రుణబిల్లును ఆమోదించింది. ఈ బిల్లు పెట్టిన చిచ్చు ప్రపంచదేశాలను ప్రభావితం చేస్తోంది.. అమెరికా రుణ బిల్లు ప్రభావం కారణంగానే బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్లలో డబ్బులు పెట్టడం కన్నా బంగారం కొనడమే మేలని అందరూ భావిస్తున్నారు. అందుకే బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో, పెట్టుబడిపెట్టడానికి ఇన్వెస్టర్లు ఆసక్తిని కనబరుస్తున్నారు. బంగారం దిగుమతులు 1,000 టన్నుల స్థాయి దాటే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికా పరపతి రేటు తగ్గడం... యూరోజోన్ ఆర్థిక సమస్యలలో చిక్కుకోవడంతో సంక్షోభం రానుందని వార్తలొస్తున్నాయి... దీంతో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు పడిపోతుండడంతో బంగారంపై పెట్టుబడే క్షేమం అని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఈ నెలలో బంగారం ధర 15 శాతం పెరిగింది. ఈ విధంగా పెరగడం 1999 తర్వాత ఇదే మొదటిసారి. దేశీయంగా 10 గ్రాముల ధర రికార్డు స్థాయిలో పెరిగి రూ.29 వేలకు చేరువయింది... ప్రపంచంలో పసిడికి ఎక్కువ వినియోగదారులు ఉన్న భారత దేశం... 2010లో 958 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. అదేవిధంగా ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఇప్పటికే 553 టన్నులకు పైగా దిగుమతి చేసుకుందని డబ్యూజీసీ గణాంకాలు చెబుతున్నాయి.. బంగారం ధరలు పెరుగుతుండడంతో, మంచి లాభాలు వస్తాయన్న అంచనాలతో పుత్తడి పై పెట్టుబడికి కూడా డిమాండ్ పెరుగుతుంది. . దేశం మొత్తంలో బంగారు ఈటీఎఫ్‌లపై పెట్టుబడి 15 టన్నులకు చేరుకుంది. అయితే మార్కెట్లో పునరుత్పత్తి చేసిన బంగారం ఎక్కువవడంతో నగలకు డిమాండ్ తగ్గిందని విశ్లేషకులు చెబుతున్నారు. మార్కెట్లో ధరలు అధికంగా ఉండడంతో ప్రజలు నగలను అమ్మడానికి ప్రయత్నిస్తుండడంతో పాత బంగారానికి డిమాండ్ తగ్గింది. నింగిలో తారల్లా తళుక్కు మంటున్న బంగారం ధరలు ఇప్పట్లో తగ్గే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదంటున్నారు బులియన్ మార్కెట్ ఎనలిస్టులు.. దసరా.. దీపావళి పండుగలప్పటికి బంగారం ధర ముప్పైవేలను మించినా ఆశ్చర్యం లేదనేది విశ్లేషకుల అంచనా.. రియల్ ఎస్టేట్ ల మీద పెట్టిన పెట్టుబడిలో 25 శాతం పెట్టుబడి.. షేర్ బిజినెస్సుల్లో పెట్టిన పెట్టబడిలో 50 శాతం.. బంగారం పైన పెట్టినా ఊహించని లాభాలు వచ్చేవని పెట్టుబడి దారులు అంచనాలు కడుతున్నారు.. రానున్న రెండు నెలల్లో మరో పదిహేనొందల వరకు పెరిగే అవకాశం ఉండటంతో బంగారానికి మరింత డిమాండ్ పెరిగింది.

No comments:

Post a Comment