Thursday, August 11, 2011
అర్ధరాత్రి స్వతంత్ర్యం... అవినీతి భారతం
ప్రజల చేత.. ప్రజల వలన.. ప్రజల కొరకు అన్న సూత్రాన్ని తుంగలో తొక్కి నేతల చేత.. నేతల వలన..నేతల కొరకే ప్రజాస్వామ్యమన్నట్టుగా తయారయింది మన భారతం.. ఏనాడైతే మనకు చీకట్లోస్వాతంత్ర్యం వచ్చింది ఆనాటి నుంచి నేటి వరకు చీకట్లు తొలగలేదు. తొలుగుతాయన్న ఆశ కూడా లేనంత ఘాడంగా అవినీతి చీకట్లు అలుముకున్నాయి.. ఈ అవినీతి రక్కసి కోరలు పీకాలనుకున్న లోక్ పాల్ బిల్లు కూడా దెయ్యాల చేతిలో మంత్ర దండంగా మారబోతోందా.. ఇప్పటికీ దేశాన్ని దోచుకున్న దొంగలెవరు.. ఈ స్వతంత్ర భారతంలో స్వరాజ్యం సిద్దించిన మరుసటి సంవత్సరం నుంచే దేశంలో దొంగలు పడ్డారంటే మీరు నమ్ముతారా..అవును నమ్మితీరాలి.. ఎందుకంటే నాటి జీపుల కుంభకోణం నుంచి నేటి ఘనాపాటిల గనుల కుంభకోణం వరకు అంతా అవినీతి మరకల చరిత్రే. అరవై నాలుగేండ్ల అవినీతి స్వాతంత్ర్యాన్ని ఒక్కసారి చూద్దాం..
జీపుల కొనుగోళ్ళు (1948): స్వాతంత్య్రం తర్వాత జరిగిన తొలి అవినీతి ఇది. సూత్రధారి భారత్ హై కమిషనర్ వికే కృష్ణ మీనన్. ప్రోటోకాల్‌ను ఉల్లఘించిన ఘనుడి ఈయన. ఓ విదేశీ కంపెనీ నుంచి ఆర్మీ జీపుల కొనుగోలుకు రూ. 80 లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు.
సైకిళ్ళ దిగుమతి (1951): ఓ కంపెనీకి సైకిళ్ళ దిగుమతి అనుమతి ఇచ్చేందుకు నాటి వాణిజ్య, పారిశ్రామిక మంత్రిత్వశాఖ కార్యదర్శి ఎస్‌ఏ వెంకటరామన్ లంచం తీసుకుని, జైలుకు వెళ్ళాడు.
బిహెచ్‌యూ నిధులు (1956): విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన ఉదంతమిది. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం అధికారులు రూ.50 లక్షల నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు.
ముంద్రా కుంభకోణం (1957): తొలిసారిగా మీడియాకు చిక్కిన స్కాం ఇది. కోల్‌కత్తాకు చెందిన హరిదాస్ ముంద్రా అనే వ్యాపారి ఎల్‌ఐసీని టార్గెట్ చేశారు. మోసపూరితంగా షేర్లు అమ్మడం వల్ల రూ.1.25 కోట్ల నష్టం వాటిల్లింది. దీనిపై ప్రధానిగా ఉన్న నెహ్రూ న్యాయ విచారణకు ఆదేశించారు. జస్టిస్ ఎంసీ చాగ్లా నేతృత్వంలో కమిషన్ వేశారు. ఈ కేసులో ముంద్రాకు 22 ఏళ్ళ జైలుశిక్ష పడింది. నాటి ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి ఇందుకు బాధ్యతగా తన పదవికి రాజీనామా చేశారు.
తేజ రుణాలు (1960): జయంత్ షిప్పింగ్ కంపెనీని నెలకొల్పుతానంటూ నౌకారంగం దిగ్గజం జయంత్ ధర్మతేజ రూ.22 కోట్ల రుణం తీసుకున్నారు. కానీ కంపెనీ పెట్టకుండా ఆ డబ్బుతో దేశం వదిలి ఉడాయించాడు.
కైరాన్ స్కాం (1963): దేశంలోనే తొలిసారిగా ఓ ముఖ్యమంత్రిపై వచ్చిన ఆరోపణలు ఇవి. ప్రాప్‌సింగ్ కైరాన్ తనతో పాటు కుమారులు, బంధువుల ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగం చేశారు. ఈ దుమారం కారణంగా ఆయన పదవీచ్యుతులయ్యారు.
పట్నాయక్ సెల్ఫ్‌గోల్ (1965): ఒడిషా ముఖ్యమంత్రి బిజు పట్నాయక్ తన సొంతదైన కళింగ ట్యూబ్స్ కంపెనీకి ప్రభుత్వ కాంట్రాక్టు ఇచ్చారని తేలడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది.
మారుతి కుంభకోణం (1974): ఇందిరాగాంధీకి పడ్డ తొలి అవినీతి ముద్ర ఇది. మారుతి కార్ల కంపెనీని ఆమె పుత్రరత్నం సంజయ్‌గాంధీకి కట్టబెట్టేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డట్టు విమర్శలొచ్చాయి.
సోలంకి కుంభకోణం (1992): బోఫోర్స్ లంచాల కేసు విచారణను ఆపేయాలంటూ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మాధవ్ సింగ్ సోలంకీ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో స్విట్జర్లండ్ విదేశాంగ మంత్రికి ఓ లేఖ ఇచ్చారు. ఆ విషయాన్ని ఇండియా టుడే ప్రచురించడంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఇంధన కుంభకోణం (1976): ఇండియన్ ఆయిల్ కంపెనీ కుంభకోణమిది. ఊరుపేరు లేని హాంకాంగ్ కంపెనీతో రూ.2.2 కోట్ల ఇంధన కాంట్రాక్టును కుదుర్చుకుంది. ఇందులో భారీ ముడుపులు చేతులు మారాయి. ఈ కొనుగోళ్ళ వెనుక అప్పటి పెట్రోలియం, రసాయనాల శాఖ మంత్రి పాత్ర వెలుగుచూసింది.
అంతూలే ట్రస్టు (1981): మహారాష్ట్ర ముఖ్యమంత్రి అంతులే స్వీయ పర్యవేక్షణలో సాగిన కుంభకోణం ఇది. ఇందులో ఆయనకు రూ.30 కోట్లు ముట్టినట్టు ఆరోపణ. ఈ మొత్తం ఓ ట్రస్టుకు చేరవేసినట్టు విమర్శలొచ్చాయి.
హెచ్‌డిడబ్ల్యూ కమిషన్లు (1987): జలాంత ర్గాముల విషయంలో నేతలు భారీ ముడుపులు అందుకున్నారు. హెచ్‌డిడబ్ల్యూ అనే కంపెనీ రూ.20 కోట్ల కమిషన్లు ఇచ్చినట్టు విచారణలో తేలింది. దీన్ని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినా... 2005లో ఈ కేసును మూసివేశారు.
బోఫోర్స్ లంచాలు (1987): దేశవ్యాప్తంగా ఓ కుదుపు కుదిపిన భారీ కుంభకోణమిది. రక్షణ వ్యవస్థపైనే అభద్రత ఏర్పడిన బాగోతమిది. బోఫోర్స్ శతఘ్నుల కొనుగోళ్ళ విషయంలో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ సహా పలువురు భారతీయ ప్రముఖులకు రూ. 64 కోట్ల లంచాలిచ్చిందని స్వీడిష్ సంస్థ బోఫొర్స్ పై ఆరోపణలు చేసింది.
సెయింట్ కిట్స్ ఫోర్జరీ (1989): మాజీ ప్రధాని పివి నర్సింహరావును చరమాంకం వరకూ వెంటాడిన కేసు ఇది. సెయింట్ కిట్స్ ఫస్ట్ ట్రస్టు కార్పొరేషన్‌లో తన కుమారుడు అజేయ్‌సింగ్ ఖాతాలో ఉన్న 2.1 కోట్ల డాలర్లకు విపి సింగ్‌ను లబ్ధిదారుడిగా చిత్రీకరించారు. దీనికోసం కొన్ని పత్రాలను ఫోర్జరీ చేశారు. అప్పుడు పివి విదేశాంగశాఖ మంత్రి.
ఎయిర్‌బస్ కుంభకోణం (1990): ఎ-320 విమాన ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఎయిర్‌బస్ నుంచి విమానాల కొనుగోలుకు రూ.2వేల కోట్లతో ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే విమానాలు రాలేదు. ఒక్క వారంలోనే దీనివల్ల రూ.2.5 కోట్ల నష్టం వాటిల్లింది.
సెక్యురిటీ స్కాం (1992): స్టాక్ మార్కెట్‌ను అతలాకుతలం చేసి, దేశ ఆర్థిక వ్యవస్థనే చిన్నాభిన్నం చేసిన భారీ కుంభకోణమిది. స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా బ్యాంక్ డిపాజిట్లను స్టాక్ మార్కెట్‌లో పెట్టేందుకు మోసం చేశారు. ఫలితంగా రూ.5వేల కోట్ల నష్టం జరిగింది.
ఇండియన్ బ్యాంకుకు రుణాల ఎగవేత (1992): దక్షిణాదికి చెందిన పలు చిన్న కార్పొరేషన్లు, ఎగుమతిదారులు ఇండియన్ బ్యాంకు చైర్మన్ ఎం. గోపాలకృష్ణన్ అండతో రూ.1300 కోట్ల రుణాలు తీసుకుని వాటిని తిరిగి చెల్లించలేదు.
చక్కెర దిగుమతి (1994): కేంద్ర మంత్రి కల్పనాథ్‌రాయ్ స్వీయ పర్యవేక్షణలో సాగిన స్కాం. మార్కెట్ ధర కంటే అధిక ధరకు చక్కెర దిగుమతి చేసుకోడానికి ఆయన అనుమతులు ఇచ్చారు. ఖజానాకు రూ.650 కోట్ల నష్టం జరిగింది. ఫలితంగా మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఎంఎస్ బూట్ల కుంభకోణం (1994) : ఎంఎస్ బూట్ల కంపెనీ అధిపతి పవన్ సచ్‌దేవా తన సొంత కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వెళ్ళడానికి ముందే అత్యంత తక్కువ ధరకు కంపెనీ నిధులతో షేర్లు కొన్నారు. సెబీ ఎస్‌బిఐ కాప్స్ అధికారులతో కుమ్మక్కై ఇలా చేశారు. దాంతో ప్రజలు రూ.699 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. తర్వాత ఇందులో సచ్‌దేవా తప్పు లేదని తేల్చారు.
జెఎంఎంకు ముడుపులు (1995): సంకీర్ణ ప్రభుత్వాన్ని గట్టెక్కించేందుకు అప్పటి ప్రధాని పివి నర్సింహారావు అవినీతిని ప్రోత్సహించారు. 1993 నాటి అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కడానికి జెఎంఎం ఎంపిలకు రూ.30 లక్షల ముడుపులు ఇచ్చారు. జార్ఖండ్ ముక్తి మోర్చా నేత శైలేంద్ర మహతో ఈ విషయాన్ని అంగీకరించడంతో పివీ రాజకీయ జీవితానికి మచ్చ పడింది.
పచ్చళ్ళ వీరులు (1996): లఖుభాయ్ పాఠక్ వ్యవహారం ఇప్పటికీ దేశ ప్రజలకు తెలుసు. తనకు కాగితపు గుజ్జు కాంట్రాక్టు ఇప్పించేందుకు నాటి ప్రధాని పివీ నరసింహారావు, చంద్రస్వామి రూ.10 లక్షల లంచం తీసుకున్నారంటూ పచ్చళ్ల కంపెనీ అధినేత లఖుభాయ్ పాఠక్ ఆరోపించారు.
టెలికాం స్కాం (1996): హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఓ ప్రైవేటు కంపెనీ నుంచి టెలికం పరికాల కొనుగోలుకు సహకరించి, ఖజానాకు రూ.1.6 కోట్ల నష్టం కలిగించారని నాటి కమ్యూనికేన్ల శాఖ సహాయ మంత్రి సుఖ్‌రాంపై ఆరోపణలు వచ్చాయి. ఆయనతో పాటు మరో ఇద్దరికి 2002లో శిక్ష.
పశువుల మేత కుంభకోణం (1996): పశువుల మేత కోసం అంటూ బీహార్ పశుసంవర్థ శాఖ రూ.950 కోట్లు విత్‌డ్రా చేసుకుంది. నాటి ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఇందులో భాగం ఉండటంతో ఆయన ఏడాది తర్వాత రాజీనామా చేశారు.
యూరియా ఒప్పందం (1996): రెండు లక్షల టన్నుల యూరియా దిగుమతి కోసం పివి ప్రభుత్వాన్ని నేషనల్ ఫెర్టిలైజర్స్ కంపెనీ ఎండి సిఎస్ రామకృష్ణన్ ప్రభావితం చేశారు. ఈ సందర్భంగా రూ.133 కోట్లు ముట్టజెప్పినట్టు ఆరోపణలు వచ్చాయి.
హవాలా డైరీలు (1996): ఢిల్లిd హవాలా ఆపరేటర్లపై 1991లో సిబిఐ దాడులతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వీటిలో ఎస్‌కే జైన్ డైరీలు సంచనాలను సృష్టించాయి.
సిఆర్‌బి స్కాం (1997): చైన్ రూప్ బన్సాలీ అనే తెలివైన వ్యాపారి... పిరమిడ్ వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి వెయ్యి కోట్ల డిపాజిట్లు సేకరించారు. ఓ బ్యాంకింగ్ లైసెన్సు కూడా పొందారు. కానీ ఆయన సమర్పించిన కొన్ని వారంట్లకు నగదు లేదని స్టేట్‌బ్యాంకులోని ఓ అధికారి కనుగొనడంతో బుడగ పగిలింది. అప్పటికే చిన్న మదుపుదారులు వెయ్యి కోట్ల నష్టపోయారు.
బిగ్‌బుల్ స్కాం(1998): బిగ్‌బుల్ హర్షద్ మెహతా బిపిఎల్, వీడియోకాన్, స్టెరిలైట్ కంపెనీల ప్రమోటర్లతో కుమ్మక్కై వాటి షేర్ల ధరలను పెంచేశాడు. తర్వాత ఇది కుప్పకూలింది. సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో డీలింగ్ చేయకుండా మెహతాను జీవిత కాలం డిబార్ చేశారు.
కంపెనీల అదృశ్యం స్కాం (1998): ఆర్థిక మంత్రి చిదంబరం అన్న ఓ మాట దలాల్ స్ట్రీట్‌లో సంచలనం సృష్టించింది. కొన్ని వందల కంపెనీలు ప్రజాధనం సేకరించి, అదృశ్యమైపోతున్నాయని ఆయనకు తెలిసింది. తనిఖీ చేస్తే 600 కంపెనీలు లేవని తేలింది. దీటిలో 80 కంపెనీలు రూ.330.78 కోట్లు సేకరించి, అదృశ్యమైనట్టు సెబీ తేల్చింది.
ప్లాంటేషన్ కంపెనీల స్కాం (1999): టేకు, స్ట్రాబెరీ లేదా ఏ పంటలైనా సాగు చేస్తామంటూ 653 కంపెనీలు మదుపుదారుల నుంచి రూ.2,563 కోట్లు వసూలు చేశాయి. దిగుబడుల మాట వడ్డీలు అంటుంచితే పెట్టుబడులు కూడా ఎవరికీ వెనక్కు ఇవ్వలేదు.
మ్యాచ్ ఫిక్సింగ్ (2000): భారత క్రికెట్ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిన అంకం. కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలొచ్చాయి. ఆజాద్‌తో పాటు అజయ్‌శర్మలపై నిషేధం విధించారు. అజయ్ జడేజా, మనోజ్ ప్రభాకర్‌లను ఐదేళ్ళు సస్పెండ్ చేశారు.
కేతన్ పరేఖ్ స్కాం (2001): హర్షద్ మెహతా కంటే కేతన్ పరెెఖ్ కాకలు తీరిన స్కాము వీరుడు. మోహతా బ్యాంకర్ల రసీదులను వాడితే, పరేఖ్ పే ఆర్డర్లను వాడి తనకు కావాల్సిన స్క్రిప్‌ల (కె-10) ధరలు పెంచేశాడు. బ్యాంకులతో పాటు హోచ్ ఎఫ్‌సీఎల్ (425 కోట్లు), జీ (340కోట్లు) గ్రూపులను ముంచేశాడు. మాధవ్‌పురా మర్కంటైల్ సహకార బ్యాంక్ పే ఆర్డర్లు బౌన్సయినప్పుడు దొరికాడు.
తెహల్కా ఆపరేషన్ (2001): రక్షణ రంగాన్ని ఓ కుదుపు కుదిపిన కుంభకోణం ఇది. దేశ రాజకీయాలను మరో మలుపు తిప్పింది. లంచావతారులైన సైనిక అధికారుల, రాజకీయ నాయకుల గుట్టును రట్టు చేయడానికి తెహల్కా అనే న్యూస్ వెబ్‌సైట్ స్పై కెమెరాలు వాడింది. దీంతో దేశంలో పరిశోధనాత్మక జర్నలిజం కొత్త పుంతలు తొక్కింది.
స్టాక్ మార్కెట్ స్కాం (2001): కేతన్ పరేఖ్ పుణ్యమాని 2001 మార్చిలో మార్కెట్ల నుంచి లక్షా పదిహేను వేల కోట్లు మాయమైపోయాయి. 2002 డిసెంబర్‌లో పరేఖ్‌ను అరెస్టు చేసి, మార్కెట్ నుంచి నిషేధించారు.
హోం ట్రేడ్ స్కాం (2002): నకిలీ ట్రేడింగ్ ముసుగులో మహారాష్ట్ర, గుజరాత్‌లోని 25 సహకార బ్యాంకుల నుంచి నవీ ముంబైకి చెందిన హోం ట్రేడ్ అనే కంపెనీ రూ. 600 కోట్లు మింగేసింది. కంపెనీ సిఈవో సంజయ్ అగర్వాల్‌ను అరెస్టు చేశారు.
స్టాంపుల కుంభకోణం (2003): అబ్లుల్ కరీం తెల్గిd చేసిన స్టాంపు పేపర్ల కుంభకోణం పుణ్యమాని దేశ ఖజానాకు రూ.30 వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఇందులో ఉన్నత పోలీసు అధికారులు, ఉన్నతాధికారులు ఉన్నారు. వాళ్ళందరి పేర్లు కూడా తెల్గిd ఆ తర్వాతి కాలంలో బయటపెట్టాడు.
ఆహారం కోసం చమురు స్కాం (2005): ఇరాక్‌తో ఆహారం కోసం చమురు స్కాంపై వోకర్ నివేదిక వచ్చిన తర్వాత కేంద్ర మంత్రివర్గ నుంచి కె. నట్వర్‌సింగ్‌ను తప్పించారు.
సత్యం స్కాం (2009): ప్రపంచంలోనే భారీ కుంభకోణంగా పేరుపడింది. అంకెల గారడీతో లాభాలు చూపించి, భారీ షేర్లను చూపించారు. 10వేల కోట్ల రూపాయల లోటు చూపిస్తూ సత్యం రామలింగరాజు సిఐడికి లొంగిపోయారు. దీని వెనుక రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతల పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చాయి. సత్యం రాజు ప్రస్తుతం జైలులో ఉన్నారు.
గనుల కుంభకోణం (2011): కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప గనుల మాఫియాతో చేతులు కలిపి, కోట్లాది రూపాయల ముడుపులు అందుకున్నారనేది ఆరోపణ. లోకాయుక్త విచారణలో వెలుగుచూసిన ఈ వాస్తవం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం కల్గిస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment