ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Friday, August 5, 2011

ఆచార్య జయశంకర్ జయంతి నేడు.. ఆగస్టు 06


ఆయన తెలంగాణ ప్రజల గుండె గొంతుకై నిలిచాడు. తుది శ్వాస వరకు నమ్మిన సిద్దాంతానికి కట్టుబడి జీవించాడు. తెలంగాణలో నీళ్లు.. నిధులు... నియామకాలు ఎలా దోపిడీకి గురవుతున్నాయో వివరించి చెప్పిన థీశాలి.. ఆయనే తెలంగాణ సిద్ధాంత కర్త ఆచార్య కొత్త పల్లి జయశంకర్.. తెలంగాణ జాతిపితగా పిలుచుకొనే ఆచార్య కొత్త పల్లి జయశంకర్ జయతి సందర్భంగా హెచ్ఎం టీవీ స్పెషల్ స్టోరీ.
బ్యాంగ్ - జయశంకర్ సారు జయంతి / తెలంగాణ జాతిపిత జయంతి
వాయిస్
ఆచార్య కొత్తపల్లి జయశంకర్.. తెలంగాణ ప్రజలకు పరిచయం అక్కరలేని పేరు. తెలంగాణ ప్రజల కడగండ్లను, కన్నీళ్లను కళ్లారా చూసి చలించిన మేథావి. ఆయన పుట్టింది పోరాటాల పురిటిగడ్డ వరంగల్ జిల్లా అక్కంపేట గ్రామం..ఈ బుద్దిశాలిని కన్న ధన్యజీవులు లక్ష్మీకాంతారావు, మహాలక్ష్మి. సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన జయశంకర్ బడుగు జీవుల బతుకు దెరువులను అతి దగ్గరనుంచి గమనించాడు..అందుకే ఆయన తొలి అడుగు నుంచి తుది శ్వాస వరకు దగా పడ్డ బతుకులకు బాసటగా నిలిచాడు.
స్పాట్
జయశంకర్ ప్రస్థానం ఉపాధ్యాయ వృత్తితో మొదలయింది.. వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్, హైదరాబాద్ జిల్లాలలో టీచర్ గా పనిచేశారు. తెలంగాణ అన్ని జిల్లాలతో ఆయనకు అనుబంధం ఉంది..ఉపాధ్యాయ వృత్తి నుంచి అంచలంచలుగా లెక్చరర్ గా, ప్రొఫెసర్ గా ఎదిగారు. అంతేకాక సీఫెల్, కాకతీయ యూనివర్సిటీ లకు రిజిస్ర్టార్ గా పనిచేశారు.1991 నుంచి 1994వరకు కాకతీయ యూనివర్సిటీకి వైస్ చాన్స్ లర్ గా బాధ్యతలు నిర్వహించారు. ప్రధాని మన్మోహన్ సింగ్ జయశంకర్ గారి ప్రతిభను గుర్తించి 2004లో జాతీయ అసంఘటిత రంగ కమీషన్ లో నియమించారు. తరువాత కాలంలో ఆపదవికి తానే స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఆత్మగౌరవం కన్నా పదవి ముఖ్యం కాదని ప్రకటించారు..
స్పాట్
జయశంకర్ గారు తెలంగాణ ఎలా కన్నీళ్లు పెడుతుందో దగ్గర్నుంచి చూడటమే కాదు. ఆయన కూడా ఆ ఆవేదనలు అనుభవించారు. ఉపధ్యాయ వృత్తిలో ఉన్నా తరగతి గదులకే పరిమితం కాలేదు. తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలకు కారణమేంటో వివరించే ప్రయత్నం చేశారు.. ఆయన అనుభవాలు వందల పిహెచ్ డిలతో సమానం..ఆయన స్పృషించని అంశంలేదు... నీళ్లల్లో, నిధులల్లో, నియామకాల్లో సీమాంధ్ర నాయకులు తెలంగాణ ప్రాంత ప్రజలను ఎలా మభ్యపెడుతున్నారో వివరించారు.. తెలంగాణ సంస్కృతి పైనా, బాష పైన దాడి జరిగే తీరును తన అక్షరాలలో పొదివి పట్టుకున్నారు.. ఆయన రాసిన తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్, తెలంగాణ విస్త్రుత అంగీకారం, తెలంగాణలో ఏమి జరుగుతుంది వంటి పుస్తకాలలో తెలంగాణ గతం, వర్తమానం కనిపిస్తాయి.
స్పాట్
తెలంగాణ విముక్తి కొరకు జయశంకర్ గారు చేసిన సేవలు మరువలేనివి.. ఆయన చేసిన మేథోశ్రమ నభూతో నభవిష్యతి.. విద్యార్ధిగా ఉన్నపుడే 1952లో నాన్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు.. 1954లో ఫజల్ అలీ కమీషన్ ముందు తెలంగాణ నుప్రత్యేక రాష్ర్టంగా ఉంచాలని గట్టిగా వాదించారు. 1955 -56 మద్యకాలంలో విశాలాంధ్ర వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1968-69లలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్రపోషించి, తెలంగాణ కోసం పనిచేసే ప్రతి శక్తిని కలుపుకోవాలని పిలుపునిచ్చారు...
స్పాట్..
1969 -1996 మధ్య కాలంలో తెలంగాణ కోసం పని చేసే సంఘాలకు, వ్యక్తులకు పెద్దదిక్కుగా నిలిచారు.. 1997లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పురుడు పోసుకున్న తెలంగాణ ఐక్య వేదిక ద్వారా ప్రత్యక్షంగా నాయకత్వ బాధ్యతలు చేపట్టి, నాలుగు సంవత్సరాలుగా ఉద్యమాన్ని నడిపించారు.. తెలంగాణ రాష్ర్ట సమితి ఆవిర్భావ దశలోనాయకత్వాన్ని, కార్యకర్తలను, చైతన్యం పరచడంలో ఆయన పాత్ర చెప్పుకోదగ్గది. ఆర్ యస్ యు నుంచి ఆర్ యస్ యస్ వరకు తెలంగాణ కోసం ఎవరు పిలిచినా అరమరికలు లేకుండా ఉద్యమ సభల్లో పాల్గొని తన గొంతు వినిపించేవారు.
స్పాట్
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న దశలో.. తెలంగాణ ఉద్యమ సారధి కేసిఆర్ కు వెన్నుదన్నుగా ఉంటూ ..యావద్భారత రాజకీయ ప్రముఖుల మద్దతు కూడ గట్టడంలో ముఖ్యపాత్రపోషించారు జయశంకర్. తెలంగాణ రాష్ర్ట సమితి అధినేత కేసిఆర్.. జయశంకర్ గారిని తన గురువుగా చెప్పుకుంటారు... 2004 సంవత్సరం నుంచి 2009 డిసెంబర్ 9 న తెలంగాణ రాష్ర్ట ప్రకటన వెలువడే వరకు అందరు నాయకులను కలిసి తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు ఒప్పించడంలో కేసిఆర్ తో బాటు జయశంకర్ కూడా ముఖ్యపాత్ర పోషించారు.... మూడు తరాల తెలంగాణ ప్రజల కన్నీళ్లను తడిమిన సామాజికవేత్త ఆయన. ఆయన జీవించినంత కాలం తెలంగాణ ప్రజలకోసం పోరాటం వల్ల ఆయన.. తెలంగాణ సిద్దాంత కర్తగా ప్రజల మదిలో నిలిచిపోయారు. .. ఆయన మరణానంతరం తెలంగాణ జాతిపితగా.. అమరజీవిగా చెరగని ముద్ర వేసుకున్నారు. నిజాయితీ గల సిద్దాంతకారుడికి నిలువెత్తు నిదర్శనం జయశంకర్.

No comments:

Post a Comment