Friday, July 29, 2011
యడ్యూరప్ప కథ.. కమీషు
కర్నాటక రాజకీయం రసకందాయంలో పడింది. యడ్యూరప్ప ముఖ్యమంత్రి పీఠం వదులుకోక తప్పని పరిస్థితి.. అధిష్ఠానం ఆశీస్సులతో ప్రజాబలంతో గద్దెనెక్కిన యడ్యూరప్ప పదవీ కాలం పూర్తికాకుండానే నిష్క్రమించాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది. యడ్యూరప్ప పదవికి గండం తెచ్చిన అంశాలేంటి. సాదా సీదాగా కనిపించే యడ్యూరప్ప రాజకీయ ప్రస్థానం పై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్....యడ్యూరప్ప.. సాధారణ రైతు ఆహార్యాన్ని తలపించే ఓ అసాధారణ ప్రజానేత.. నిజాయితీకి, నిబద్దతకు నిలువుటద్దం అని ప్రశంసించిన అధిష్టానమే ఈరోజు అవినీతి కోర్టులో ముద్దాయిగా నిలబెట్టి పదవీత్యుచుణ్ని చేసేందుకు సిద్దమయింది. యడ్యూరప్పకు ఎందుకీ తలనొప్పి.. యడ్యూరప్ప నిజంగా అవినీతి పరుడా.. లేక అవినీతిని అనుమతించిన నాయకుడా.. ఇంతకూ ఎవరీ యడ్యూరప్ప...యడ్యూరప్ప 1943, ఫిబ్రవరి 27న మాండ్యా జిల్లాలోని బూకనాకెరెలో జన్మించాడు. డిగ్రీ వరకు చదువకున్న ఆయన1965లో సాంఘీక సంక్షేమ శాఖలో క్లర్క్ గా పనిచేశారు. రాజకీయ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న యడ్యూరప్ప 1970లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శికారిపుర శాఖ కార్యదర్శిగా నియామకంతో .. ఆయన రాజకీయ ప్రస్థానం ఆరంభమయింది. 1975లో శికారిపుర పురపాలక సంఘపు అద్యక్షుడిగా వ్యవహరించి అత్యవసర పరిస్థితి కాలంలో జైలు మెట్లెక్కాడు.. 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంతో శికారిపుర తాలూకాకు భారతీయ జనతా పార్టీ అద్యక్షుడిగాను, ఆ తరువాత శిమోగా జిల్లా భాజపా అద్యక్షుడుగా పనిచేశారు.భారతీయ జనతా పార్టీ యడ్యూరప్ప కార్యదక్షతను గుర్తించి 1988 లో కర్ణాటక పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టింది. అదే సంవత్సరంలో తొలిసారిగా శాసనసభకు పోటీచేసి శికారిపుర నియోజకవర్గం నుంచి గెలుపొందాడు. అప్పటి నుంచి వరుసగా ఐదు సార్లు అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించాడు. కర్ణాటక 10వ శాసనసభకు ప్రతిపక్ష నాయకుడిగా సమర్ధవంతంగా పనిచేశారు. 1999 ఎన్నికల్లో ఓటమి పాలయినా పార్టీ తరఫున ఎగువసభకు నామినేట్ అయ్యాడు. ధరంసింగ్ ప్రభుత్వాన్ని కూలదోసేదుకు జనతాదళ్ (ఎస్)కు చెందిన కుమారస్వామితో జతకట్టి చెరి సగం రోజులు ప్రభుత్వం ఏర్పాటుచేయాలనే ఒప్పందం కుదుర్చుకొని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఒప్పందంలో మొదట కుమారస్వామి ముఖ్యమంత్రిగా గద్దెనెక్కాడు. కుమారస్వామి ప్రభుత్వంలో యడ్యూరప్ప ఉప ముఖ్యమంత్రిగా మరియు ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. 20 మాసాల గడుపు తీరిపోయినా కుమారస్వామి యడ్యూరప్పకు అధికారం అప్పగించకపోవడంతో బిజేపి అగ్రనేతలు జోక్యం చేసుకొని 2007 నవంబర్‌లో యడ్యూరప్పకు అధికారం అప్పగించారు. ఈ ఘటన తరువాత కుమారస్వామి మనసుమార్చుకొని మద్దతు ఉపసంహరించడంతో... దక్షిణ భారతదేశంలో ఏర్పడిన తొలి భాజపా ప్రభుత్వం వారంరోజులకే కూలిపోయింది. 6 మాసాల రాష్ట్రపతి పాలన తరువాత జరిగిన శాసనసభ ఎన్నికలలో బిజేపి పూర్తి మెజారిటీ సాధించింది. యడ్యూరప్పను ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టి ప్రకటించినందువల్ల ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఏర్పాటుకు ఎలాంటి అవాంతరం జరుగలేదు. యడ్యూరప్ప స్వయంగా మళ్ళీ శికారిపుర శాసనసభ నియోజక వర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి బంగారప్పపై 45 వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించాడు. 2008, మే 30న యడ్యూరప్ప రెండోసారి కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.యడ్యూరప్ప కల నెరవేరింది.. కర్నాటక ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. అధిష్ఠానం ఆశీస్సులు, ప్రజా బలం పుష్కలంగా ఉంది.. కానీ యడ్యూరప్ప ఏ ముహూర్తాన ముఖ్యమంత్రి గా ప్రమాణ స్పీకారం చేశారో గానీ ఎక్కిన నాటి నుంచి నేటి వరకు వివాదాలే పలకరించాయి. దిన దిన పదవీ గండం యడ్యూరప్పను నిత్యం వేధించింది. నిజాయితీ పరుడని కితాబిచ్చిన అధిష్ఠానమే మందలించే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం యడ్యూరప్ప అవినీతికి పాల్పడుతున్నాడని కాదు.. అకమాలకు సహకరిస్తున్నాడని.. ఇంతకీ యడ్యూరప్ప అవినీతికి అభయమివ్వాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది..ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత యడ్యూరప్పను వివాదాలు చుట్టుముడుతూ వచ్చాయి. అంతకు ముందు సంకీర్ణ ప్రభుత్వంలో కుమారస్వామి గాలి జనార్దన్ రెడ్డి సోదరులకు బళ్లారి అక్రమ గనుల త్రవ్వకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే అరోపణలున్నాయి. దీనికి ఆయనకు భారీగానే ముడుపులు ముట్టాయనే వార్తలు వచ్చాయి. ఈ అపవాదును తొలగించుకునేందుకు లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డే ఆధ్వర్యంలో అక్రమాల పై విచారణ జరపవలసిందిగా కోరారు. లోకాయుక్త నివేదికతో తాను బయట పడతానని కుమారస్వామి ఆశించారు. కానీ ఈ లోపే కుమారస్వామి పదవి నుంచి వైదొలగడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. సొంత పార్టీ నేతే ముఖ్యమంత్రి కావడంతో గాలి సోదరుల అక్రమాలు మరింత ఊపందుకున్నాయనే ఆరోపణలున్నాయి. దీన్ని వ్యతిరేకించిన యడ్యూరప్పను తమ ధన బలంతో బ్లాక్ మెయిల్ చేసి పదవీచ్చుతుణ్ణి చేసేందుకు గాలి సోదరులు సిద్ధపడ్డారు. అధిష్ఠానం కల్పించుకొని వివాదానికి తెరపలికింది. యడ్యూరప్ప లోకాయుక్త దర్యాప్తును ముమ్మరం చేసి జూలై 19, 2010 కల్లా నివేదిక అందించాలని కోరారు.. తనను ఇబ్బంది పెడుతున్న గాలి సోదరులకు చెక్ పెట్టాలన్న యడ్యూరప్ప వ్యూహం ఆయన మెడకే ఉచ్చుగా మారింది. తరువాత జరిగిన పరిణామాలలో అక్రమాలలో యడ్యూరప్పతో బాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా సంబంధం ఉందనే ఆరోపణలు జోరందుకున్నాయి. భూ కేటాయింపులో తన కుమారుడికి మేలు చేశాడనే ఆరోపణలు వచ్చాయి. కర్ణాటకలో ఇది అతి పెద్ద భూ కుంభకోణం. దీంతో బాటు గాలి గనుల్లో అక్రమాల వెనుక యడ్యూరప్ప హస్తముందని, అనేక రకాల ఉదాహరణలతో లోకాయుక్త తన నివేదికలో వెల్లడించింది. యడ్యూరప్పతో బాటు, గాలి జనార్దన్ రెడ్డి తో బాటు ఈ అక్రమాలతో సంబంధం ఉన్న నేతలందరికీ ఉద్వాసన పలకాలని హెగ్డే సిఫారసు చేశారు. ఎన్నో వివాదాల నడుమ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన యడ్యూరప్ప ఇటు దాయాదుల ఒత్తిడి మద్య అటు ప్రతిపక్షాల ఆరోపణల మద్య అధిష్టానం ఆదేశాలతో ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకోక తప్పని పరిస్థితి వచ్చింది.కర్ణాటకలో బిజేపికి అన్నీ తానై వ్యవహరించిన యడ్యూరప్పకు సహచరుల బలం పుష్కలంగా ఉంది. గాలి జనార్దన్ రెడ్డిని అధిష్ఠానం అదుపులో పెట్టి ఉంటే యడ్యూరప్పకు ఇంత తలనొప్పి వచ్చేది కాదని ఆ పార్టీ నేతలే బాహాటంగా విమర్శిస్తున్నారు. అవసరమైతే యడ్యూరప్ప వెన్నంటి ఉండి ఆయనకు న్యాయం జరిగేలా చూస్తామంటున్నారు. రాజీనామాకు జూలై 31 వతేదీ వరకు గడువు కోరిన యడ్యూరప్ప తన రాజీనామా పై యూ టర్న్ తీసుకున్నట్టు వార్తలొస్తున్నాయి. ఎన్నో పదవీ గండాలెదుర్కొన్న యడ్యూరప్ప ఈ గండం కూడా తప్పించుకొని తిరిగి ముఖ్యమంత్రిగా కొనసాగుతారా... తప్పుకొని పెద్ద తలగా ఉంటారా అనేది కాలమే తేల్చాలి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment