ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Monday, July 4, 2011

సమాచార హక్కు చట్టానికి చిక్కులు ఆరేళ్లయినా వీడని బాలారిష్టాలు

సమాచార హక్కు చట్టానికి చిక్కులు
ఆరేళ్లయినా వీడని బాలారిష్టాలు
యాంకర్ పార్ట్
సామాన్యుడి చేతిలో పాశుపతాస్త్రాన్ని పాతిపెడుతున్నారు. సమాచార హక్కు చట్టం చట్టుబండలవుతోంది... అవినీతి పునాదులు కదిలిస్తుందనుకున్న సమాచారహక్కు చట్టం కొయ్యగుర్రం పై స్వారీ చేస్తోంది. అధికారుల నిర్లక్ష్యపు నీడలో లక్ష్యం నీరుగారిపోతోంది. సమాచార కమీషనర్ ముందు ఫిర్యాదుల ఫైళ్లు గుట్టలు గుట్టలుగా పేరుకు పోతున్నా కదలిక లేదు. పౌరులు అడిగిన సమాచారాన్ని 30 రోజుల్లో కాదు కదా కనీసం మూడేళ్ల లోపు కూడా అందించలేని నిస్సహాయ స్థితికి చేరుకుంది మన సమాచార వ్యవస్థ.. ఈ జాడ్యం ఒక్క మన రాష్ట్రానికే అనుకుంటే పొరబాటు.. దేశవ్యాప్తంగా అంటువ్యాధిలా సోకి స.హ చట్టాన్ని మింగేస్తోంది. సమాచార హక్కు చట్టానికి పట్టిన చెదలు పై హెచ్ఎంటివి స్పెషల్ స్టోరీ..
బ్యాంగ్ ( సమాచార నిరాకరణ చట్టం / సమాచార చిక్కు )
వాయిస్ 1
ఆరేళ్ల కిందటి మాట... సమాచార హక్కు చట్టం వస్తే అవినీతి పాదాలకింది పునాదులు కదలాల్సిందే.. సమాచార హక్కు చట్టం కింద ఏదైనా అభ్యర్ధన వస్తే అధికారులకు చెమటలు పట్టేవి. కారణం ఇచ్చే సమాచారం పారదర్శకంగా ఉండాలి. లేదా మొదటికే మోసం వస్తుంది. ప్రాణ హాని, జీవించే హక్కుకు సంబంధించిన సమాచారమైతే 48 గంటల్లోనూ, ఇతర సమాచారమైతే 30 రోజుల్లోపు ఇవ్వాలని చట్టం చెబుతోంది. కానీ ఈ చట్టం రూపకల్పనలో ఉన్న చిన్న చిన్న లోపాలను అడ్డం పెట్టుకొని సమాచారం ఇవ్వడానికి అధికారులు తల అడ్డం ఊపుతున్నారు. సమాచారం అడిగిన వ్యక్తిని యక్ష ప్రశ్నలేసి, అవసరం లేకున్నా కాగితం నుంచి కరెంట్ బిల్లు వరకు లెక్కలేసి లక్షల రూపాయల్లో బిల్లు చెల్లించాలని అడగటంతో.... సమాచార చట్టం అంటే సంపన్నుడి చుట్టమనే అభిప్రాయం వచ్చింది సామాన్యుడికి.
స్పాట్
అభివృద్ది పథంలో దేశంలో అగ్రగామినని ఢంకా భజాయిస్తున్న ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కును అమలు చేయడంలో అట్టడుగున ఉందంటే ఇక్కడి అధికారుల నిర్వాకం ఎంత ఘనమో అర్ధం చేసుకోవచ్చు. స.హ చట్టాన్ని గొప్పగా అమలు చేస్తామని డాంబికాలు పలికిన ప్రభుత్వ వైఖరి ఆరంభ శూరత్వంగా మారింది. చట్టం అమలులోకి వచ్చి ఆరేళ్లయినా బాలారిష్టాలు దాటలేదు. చట్టం అటకెక్కడానికి కమీషనర్ల వైఖరే కారణమన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. వేలాది ఫైళ్లు రెండేళ్లుగా పెండింగులో ఉన్నాయంటే ఈ అలసత్వానికి కారణం ఎవరు...? గతంలో ప్రధాన సమాచార కమీషనర్లుగా సి.డీ అర్హ, ఆర్ దిలీప్ రెడ్డి ఉన్నపుడు ఫైళ్లకు కాళ్లుండేవనే చెప్పాలి. సమాచారం అడిగిన వాళ్లకు న్యాయం జరుగుతుందనే నమ్మకం బలంగా ఉండేది. సమాచారం ఇవ్వని అధికారుల పై చర్యలు తీసుకుంటారనే నమ్మకం ఉండేది. అదే నమ్మకంతో వేలాది రూపాయలు ఖర్చుపెట్టుకొని కార్యాలయానికి వస్తున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సమాచారం అంటే అందని ద్రాక్ష.. సమాచారమడగటమంటే కొరవితో తల గోక్కోవడం.. సమాచారం హక్కు కాదు, పెద్ద చిక్కు... అవును ఇది ఎవరి పై అక్కసుతోనే అనే మాటలు కావు.. సమాచారం కోసం కాళ్లరిగేలా తిరిగి కడుపుమండి సామాన్యుడు అంటున్న మాటలు...
బైట్ - 1, 2, 3 ( తెప్పించాలి ) వాక్స్ పాప్
వాయిస్ 2
మండల స్థాయి కార్యాలయాల్లో సమాచారం కావాలంటే ప్రాథమిక సమాచార అధికారికి ధరఖాస్తు చేసుకోవాలి. ఆ అధికారి స్పందించకపోతే మొదటి అప్పీలేట్ అధికారికి ఫిర్యాదు చేయాలి. అక్కడ కూడా సరియైన స్పందన లేకుంటే..దరఖాస్తు దారుడు అడిగిన సమాచారం ఇవ్వకున్నా, దరఖాస్తు తిరస్కరించినా, అసమంజసమైన రుసుము కోరినా.. సమాచార హక్కు చట్టం 18 బై1 ప్రకారం రాష్ట్ర సమాచార కమీషనర్ కు అప్పీల్ చేసుకోవచ్చు. అబ్యర్ధన దాదాపు ఇక్కడి వరకు చేరదు. చేరిందంటే ఆ సమాచారం అభ్యర్ధికి చాలా విలువైందిగా భావించి కమీషనర్ వెంటనే చర్యకు పూనుకోవాలి. కానీ పరిస్థతి దీనికి పూర్తి విరుద్దంగా ఉంది. కమీషనర్ కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదులు, కుంభకర్ణుడిలా నిద్ర పోతున్నాయి. వాటిని తట్టిలేపే నాధుడే కరువయ్యాడు. కారణం చట్టాన్ని కాపాడే కమీషనరే కఠినంగా వ్యవహరిస్తున్నాడనే విమర్శలు వినవస్తున్నాయి. ప్రధాన సమాచార కమీషనర్ జన్నత్ హుస్సేన్ చట్టానికి విరుద్దంగా వ్యవహరిస్తున్నారనే అపవాదు మూటగట్టుకున్నారు. ఈ అధికారా పనితీరు తెలుసుకున్న ప్రాధమిక సమాచార అధికారులు సమాచారం కోసం వచ్చిన వారిని తమ మాటలతో భయపెట్టి పంపుతున్నారు. ఎందుకంటే సమాచారం కోసం వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువ శాతం అవినీతి, అక్రమాలను ప్రశ్నించేందుకు వచ్చినవే కావడం... అందులో అంచెలంచెలుగా అధికారులకు భాగస్వామ్యం ఉండటం వల్ల చట్టాన్ని అమలు చేసే వారే అధికారులకు అండగా నిలుస్తున్నారు.
బైట్ -(దరఖాస్తు దారు) తెప్పించాలి
వాయిస్ 3
మన రాష్ట్రం కంటే ఎంతో చిన్న రాష్ట్రం గోవా సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయడంలో ఎంతో ముందంజలో ఉంది. అక్కడి కమీషనర్ కార్యాలయం గవర్నర్ కార్యాలయాన్నే సమాచారం ఇవ్వాల్సిందిగా ఆదేశించింది... అరుణాచల్ ప్రదేశ్ లో ఆరంభం నుంచే ఆరుగురు కమీషనర్లు ఈ చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేయడంలో బిజీ బిజీగా ఉన్నారు. మద్యప్రదేశ్ లో ఏకంగా ఐఏయస్ ల ఆస్తులు కూడా వెల్లడించాలని సంచలన తీర్పు చెప్పి సమాచార హక్కు చట్ట చరిత్రలో ఆదర్శంగా నిలిచింది. మరి మనరాష్ట్రానికేమయింది. పని చేసే అధికారులు లేరా.. అర్హులైన వారికి కొరత ఉందా అంటే అదేం లేదు.. సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసే ఐఏయస్ లు, ఐపియస్ లు, అనుభవం కల ఉన్నతాధికారులు ఉన్నారు. కానీ సమాచార కమీషన్ కు ఒక్క అధికారిని కూడా కార్యదర్శిగా నియమించలేక పోయింది ప్రభుత్వం. తిరుమల తిరుపతి దేవస్థానానికి జెఇఓగా పనిచేసిన ధర్మారెడ్డిని కమీషన్ కార్యదర్శిగా నియమించింది.. ఈ పోస్టులో కొనసాగడం ఇష్టం లేని ధర్మారెడ్డి అలిగి ఢిల్లీకి వెళ్లారు. తరువాత ఈ పోస్టుకు ఆర్ధిక శాఖలో పనిచేసే శేఖర్ బాబుని నియమించారు. ఆయన కూడా ఈ ఉద్యోగంలో చేరకుండానే దీర్ఘకాలిక సెలవు పై వెళ్లారు. ఆ తరవాత దీన్ని పట్టిచ్చుకున్న నాధుడే లేడు. ఇప్పటికే ఉన్న కమీషనర్లలో ముగ్గురు నవంబర్ 15, 16 తేదీల్లో పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి కమీషన్ పూర్తిగా దిగజారిందని, ఫిర్యాదులు కుప్పలు తెప్పలుగా పెండింగులో పడుతున్నాయిని దరఖాస్తు దారులు చెబుతున్నారు. పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులను పరిశీలిస్తే 2010 మే నెలలో 5వేల 8వందల 8 కేసులు, జూన్ 24 వరకు 7వేల 3వందల 17, అక్టోబర్ 28 వరకు 12వేల7వందల74, అక్టోబర్ 30 నాటికి 12వేల9వందల33 కేసులు నేటికీ విచారణకు నోచుకోలేదు. ఈ నిర్లక్ష్యం ఇలానే కొనసాగితే కమీషన్ ఆఫీసుకు రావడం కంటే అవినీతి, అక్రమాలను చూసి కళ్లు మూసుకోవడమే మంచిదన్న అభిప్రాయం కలిగే అవకాశం ఉంది. అధికారులకు రాజకీయ నాయకులకు కూడా కావలసింది ఇదే కాబట్టి వ్యూహాత్మకంగానే చట్టాన్ని నీరుగారుస్తున్నారని సామాజిక వేత్తలు, ప్రజాస్వామిక వాదులు వాదిస్తున్నారు..
బైట్ - మాడభూషి శ్రీధర్ (తెప్పించాలి)
బైట్ - జన్నత్ హుస్సేన్, రాష్ట్ర ప్రధాన సమాచార కమీషనర్
మరికొందరు సామాజిక కార్యకర్తల బైట్ లు వాడుకోవచ్చు.
వాయిస్ 4
సామాన్యుడి చేతిలో పాశుపతాస్త్రాన్ని పడగొట్టాలని చూస్తే ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి. సమాచారం కోసం అలుపెరగకుండా తిరిగే పౌరులు కోర్టు గుమ్మం మెట్లు ఎక్కి న్యాయమూర్తుల చేత చివాట్లు తినక ముందే మేలుకుంటే మంచిది.

ీ..

2 comments:

  1. vestalorg@hotmail.comSeptember 10, 2011 at 9:18 AM

    mari koddi rojulu pimmata ee chattanni rashtra pourulu poorthiga marchi povalsinde.

    ReplyDelete
  2. ఇప్పటికి కేవలం రాజకీయ నాయకులకే గుర్తుంది... రాజకీయ నాయకులు అవసరమొచ్చినపుడు గుర్తు తెచ్చుకుంటారు.. ప్రజలకు గుర్తు తెస్తారు.

    ReplyDelete