ఖమ్మం కోట 10వ శతాబ్దంలో కాకతీయ చక్రవర్తులు, అనంతర కాలంలో ముసునూరి నాయకులు, ఆపైన వెలమ రాజులు ఖమ్మంకోటను కేంద్రంగా చేసుకుని పాలించారు. ఈ కోట హిందూ-ముస్లిం రెండు సంప్రదాయాలను ప్రతిబింబించేలా వుంటుంది. వెయ్యేళ్ళు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలు కూడా జరుపుకున్న ఈ ఖమ్మంకోట గొప్ప వాస్తుశిల్ప సంపదతో టూరిస్టులకు దర్శనీయ స్థలంగా వుంది.
ఎలగందల్ కోట
కామారెడ్డి రోడ్డు కరీంనగర్‌లో గోదావరీ నదీ తీరాన వుంది ఎలగందల్ కోట. క్రీస్తుశకం 1754లో జఫర్-ఉద్-దౌలా ఈ కోటను నిర్మించాడు. కాకతీయులు, బ్రాహ్మణీలు, ఖుతుబ్‌షాహీలు, మొఘల్ చక్రవర్తులు ఇంకా అసఫ్ జాహీలు - ఇలా ఐదు సామ్రాజ్యాలు ఈ కోట ఆధారంగా రాజ్యాన్ని పాలించాయి. నైజాముల కాలంలో ఇది ప్రధాన కేంద్రంగా వుండేది. అప్పట్లో ఎలగందల్ కోటనుండి కరీంనగర్ హైవేకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మానకొండూరు కోటకు సొరంగమార్గం వుండేదని నమ్మకం. ఈ కోట ప్రాంగణంలో ఒక మస్‌జీద్, పండుగ ప్రార్థనలకోసం ఈద్‌గావ్ ఉన్నాయి.
భువనగిరికోట
భువనగిరి లేదా బోనగిరి కోట హైద్రాబాద్‌కు 48 కిలోమీటర్ల దూరంలో నల్గొండ జిల్లాలో వుంది. పశ్చిమ చాళుక్య రాజు త్రిభువన మల్లా విక్రమాదిత్య-4 పేరుమీద త్రిభువనగిరి కోట అని పేరు వచ్చింది. అదే భువనగిరి కోట అయింది. ఇది కోడిగుడ్డు ఆకారంలో సౌందర్యం తొణికిసలాడుతూ రెండు బృహద్ ద్వారబంధాలతో వుంది. ఒకవేళ శుత్రుసైన్యాలు దాడిచేస్తే తప్పించుకునేందుకు భూమిలోంచి సొరంగమార్గం వుంది. చిత్రవిచిత్రమైన తలుపులు, కిటికీలు, కొలనులు, బావులతో ఒకనాటి వైభవానికి దర్పణం పట్టేలా వుంటుంది. రాణీ రుద్రమ్మాదేవి, ఆమె మనవడు ప్రతాప రుద్రారెడ్డి ఈ కోటనుండే రాజ్యపరిపాలన చేశారు. భువనగిరి కోట నుండి గోల్కొండ కోటకు సొరంగమార్గం వుండేది.
మెతుకు దుర్గం
హైద్రాబాద్‌కు 96 కిలోమీటర్ల దూరంలో మెదక్ పట్టణంలో వున్న మెతుకుదుర్గంలో హిందూ-ముస్లిం సమ్మిళిత వాస్తుశిల్పం దర్శనమిస్తుంది. ఇక్కడి 10 అడుగుల ఎత్తయిన ఇత్తడి తుపాకి, ముబారక్ మహల్ సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణ. వరి అన్నాన్ని మెతుకులు అంటాం కదా. అందులోంచి వచ్చిందే మెదక్ అనే పదం. క్రీస్తుశకం 12వ శతాబ్దంలో కాకతీయులు స్వచ్ఛమైన హిందూ సంప్రదాయంలో నిర్మించిన ఈ దుర్గాన్ని తర్వాతికాలంలో వచ్చిన ఖుతుబ్ షాహీలు మార్పులూ చేర్పులూ చేయడంతో ముస్లిం వాస్తుకళ తోడైంది.
కొండపల్లి కోట
కృష్ణాజిల్లా విజయవాడకు సమీపంలో వుంది కొండపల్లి ఖిలా. 1360లో కొండవీటి రాజయిన ప్రోలయ వేమారెడ్డి ఈ కొండపల్లి కోటను నిర్మించాడు. అనేక యుద్ధాలకు ఈ కోట సాక్షీభూతంగా వుండేది. 1541లో మహమ్మదీయులు దీన్ని ఆక్రమించారు. కొంతకాలం బహ్మనీ సుల్తానుల అధీనంలో వుంది. తర్వాత గజపతీ రాజులు, ఆపైన కృష్ణదేవరాయలు కొండపల్లి కోట కేంద్రంగా పాలించారు. చివరికి 16వ శతాబ్దంలో ఖుతుబ్ షాహీ సామ్రాజ్యం చేతుల్లోకి వచ్చింది. ఈ కోట దుర్బేధ్యంగా వుండటంతో ఆంగ్లేయుల పాలనలో దీన్ని మిలట్రీకేంద్రంగా మార్చారు. ముద్దులొలికే చెక్క, లక్క బొమ్మలకు ప్రసిద్ధమైన కొండపల్లి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా వుంది. ఇటుగా వచ్చినవారు కొండపల్లి ఖిలాను తప్పక దర్శిస్తారు.
అనంతగిరి కోట
ప్రస్తుతం అనంతపురం పేరుచెప్పగానే పుట్టపర్తి సాయిబాబా గుర్తురావడం సహజం. అనంతపురం గూటీ ఫోర్ట్, రాయదుర్గ కోట, హేమావతి, పెనుగొండ కోటలు ఇలా ప్రాచీన చారిత్రక సంపదకూ నిలయమే. అశోక చక్రవర్తి కాలంనాటి గూటీ కోట చాలా పురాతనమైంది. విజయనగర రాజుల రాయదుర్గ కోట సముద్రమట్టానికి 2727 అడుగుల ఎత్తున వుంది. ఈ కోటకు చరిత్రలో ఎంతో ప్రాముఖ్యం వుంది. 8, 10 శతాబ్దాలకు చెందిన పల్లవుల కాలంలో నిర్మించిన హేమావతిలో అపురూపమైన వాస్తుకళ గోచరిస్తుంది. ఈ జిల్లాలో ఉన్న మర్రిమాను మహావృక్షం 1989లో ప్రపంచంలో అతి పెద్ద చెట్టుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. 550 సంవత్సరాల నాటి ఈ చెట్టు 1100 వేళ్ళతో విస్తరించింది. ఈ చెట్టుపై ఇప్పటికీ బొటానికల్ సర్వేలు జరుగుతున్నాయి.
గోల్కొండ కోట
1525లో మొహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా నిర్మించిన గోల్కొండ కోట ముస్లిం సంప్రదాయ చరిత్రకు నిలువెత్తు అద్దం పడుతుంది. ఆ కాలంలోనే ఎక్కడికక్కడ నీళ్ళు పోయే మార్గంతో అద్భుతమైన ఆర్కిటెక్చరు, అపురూపం అనిపించే ఇంజనీరింగు కనిపిస్తాయి. ఈ ఖిలా గ్రానైట్ కొండమీద 120 అడుగుల ఎత్తులో వుంది. కింద ప్రాంగణం దగ్గర (ఎంట్రెన్స్) చప్పట్లు కొడితే పైన బురుజువద్ద ఆ ధ్వని వినిపించడం ఈ కోట విశిష్ఠత. గోల్కొండ కోట ప్రాచుర్యం చెప్పనలవి కానిది. దేశవిదేశాల టూరిస్టులెందరో గోల్కొండకోటను నిత్యం దర్శించుకుని వెళ్తుంటారు. గోల్కొండ కోట నుండి కొండపల్లి ఖిలాకు పైకి కనిపించని భూ అంతర్ మార్గం వుంది అంటారు. అలనాటి నవాబులు, బేగంలను స్ఫురణకు తెచ్చే గోల్కొండకోట వైభవాన్ని ఎంత ప్రశంసించినా తక్కువే.
చంద్రగిరి కోట
చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలో వుంది చంద్రగిరి కోట మన ప్రాచీన వాస్తుశిల్పకళను చాటిచెప్పే కళాఖండం అంటే అతిశయోక్తి కాదు. ఈ ప్రదేశాన్ని ''టెంపుల్ సిటీ ఎంట్రెన్స్'' అంటారు. బెంగుళూరు, తిరుపతి, తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో కొలువైన దేవాలయాలకు ఇక్కణ్ణించే వెళ్ళాలన్నమాట. చంద్రగిరికోట 11వ శతాబ్దానికి చెందినది. మూడు శతాబ్దాలపాటు యాదవరాయలు పాలించిన తర్వాత 1367లో విజయనగర పాలకులైన సాళువ నరసింహరాయల అధీనంలోకి వచ్చింది. నరసింహరాయలకు మహా మండలేశ్వర అనే బిరుదు వచ్చింది. ఆయన వద్ద పనిచేసిన మహా మంత్రి చిట్టి గంగరాయలు లేదా గంగనామాత్యుని దూరదృష్టి, తెలివి గురించి చరిత్ర గొప్పగా చెప్తుంది. ఆ కాలంలో ఆయన్ను భీష్మ పితామహుడు అని పిలిచేవారు. విజయనగర సామ్రాజ్యంలో నాలుగో రాజధాని చంద్రగిరి. గోల్కొండ సుల్తానులు పెనుగొండపై దాడి చేయడంతో విజయనగర చక్రవర్తులు తమ రాజధానిని ఇక్కడికి మార్చారు. ఇందులో రాజమహల్, రాణీమహల్, ఇంకా ఇతర దెబ్బతిన్న నిర్మాణాలు ఉన్నాయి. రాజమహల్‌లో పురావస్తు ప్రదర్రశనశాల వుంది.
గండికోట
కడప జిల్లాలోని పెన్నా నదికి కుడివైపున, జమ్మలమడుగుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గండికోట చిన్న పల్లెటూరు. ఎర్రమల పర్వతాల్లో సముద్రమట్టానికి 300 అడుగుల ఎత్తున గండికోట ఫోర్టు కొలువుతీరి వుంది. లోతైన లోయ, దట్టమైన చెట్లు, పుట్టలతో ఈ ప్రాంతం భూతల స్వర్గంలా కనిపిస్తుంది. 1123లో పశ్చిమ చాళుక్య చక్రవర్తులైన ఒకటవ అహవమల్ల సోమేశ్వరుని సామంతుడైన కాకరాజా ఈ గండికోటను కనుగొన్నాడు. కాకతీయ, విజయనగర, ఖుతుబ్ షాహీల కాలాల్లో గండికోటకు గొప్ప గుర్తింపు వచ్చింది. కడప జిల్లాకు చెందిన ప్రజాకవి వేమన ఈ గండికోట ప్రాంతంలోనే నివసించేవాడని చరిత్ర చెబుతోంది. హిందూముస్లిం భాయీభాయీ అనే నానుడికి నిదర్శనంగా ఈ కోటలో ఒక మస్‌జీదు, ఒక మందిరము (హిందూ దేవాలయం) ఉన్నాయి. రెండు పురాతన దేవాలయాలు మాధవునికి, రఘునాథునికి అంకితమయ్యాయి. ఇక్కడి అందమైన ఉద్యానవనాన్ని పరేబాగ్ అంటారు.
ఖిలా వరంగల్
ఇంద్రవైభవాన్ని తలపించే అపూర్వశిల్ప శోభిత కోట కాకతీయుల ఓరుగల్లు కోట. ఈ కోట ఉన్న ప్రాంతాన్ని ఖిలా వరంగల్ అంటారు. ఈ మూడు ప్రాకారాలు, నాలుగు మార్గాలు న్నాయి. హిందూ సంప్రదా యాన్ని పొదవి పట్టుకున్న అచ్చతెలుగుకోట తురుష్కుల ముష్కర దాడులకు చూర్ణ మైంది. మొండిగోడలు, విరి గిన శిల్పాలు, నేల రాలిన శిల్పకళా ఖండికలు చూప రుల గుండెలు పిండేస్తాయి. కాకతీయ ద్వారం ఇప్పటికీ తెలుగువారి స్వాగత ద్వారంగా నిలిచి అందా లు చిందిస్తోంది. కాకతీ య గణపతిదేవుడు ఈ కోటను 13వ శతాబ్దంలో నిర్మించేందుకు పూను కున్నాడు.
ఈ నిర్మాణాన్ని ఆయన కుమార్తె తెలుగు మహిళా శక్తికి ప్రతీకగా నిలిచిన రాణి రుద్రమదేవి పూర్తిచేసింది.
ఈ ఫోర్టులే కాకుండా జగిత్యాల కోట. మొలంగూరు కోట, దేవర కొండ కోట, నాగునూరు కోట, కొండవీటి కోట, రాచకొండ కోట - ఇలా అనేక కోటలు మన ప్రాచీన వైభవాన్ని ప్రతిబింబిస్తూ, చారిత్ర కతను చాటుతూ ఈనాటికీ సగర్వంగా నిలిచి వున్నాయి. మన నిర్లక్ష్యం వల్ల బీటలు వారుతున్న కోటలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాటిని కాపాడుకోకపోతే మనకు చారిత్రక ఉనికే లేకుండా పోతుంది. ఇన్ని శతాబ్దాల చరిత్రా మట్టిపాలైపోతుంది.
No comments:
Post a Comment