Monday, July 18, 2011
ఆధార్ అసలు రూపం
దేశ పౌరులందరికీ గుర్తింపు కార్డులు.. ఆ కార్డులో వ్యక్తి సమాచారం మొత్తం నమోదయి ఉంటుంది.. వేలి ముద్రల దగ్గర్నుంచి.. కనుబొమ్మల ఆకారం వరుకు.. ఇంటి పేరు నుంచి ఒంటి మచ్చల వరకు... అంటే దాదాపు ఒక పౌరుడి వివరాలు మొత్తం ఇందులో ఉంటాయి.. ఈ టెక్నాలజి ఎంత అడ్వాన్సుడ్ అంటే దేశంలో ఎక్కడ మీ వేలి ముద్ర దొరికినా మీ జాతకం మొత్తం చెప్పేయొచ్చు.. అంతేకాదు.. మీ అప్పులు.. బ్యాంక్ బ్యాలెన్స్... గ్యాస్ కనెక్షన్... మొబైల్ నంబర్ తో బాటూ అన్నీ చిటికెలో తెలుసుకునే యూనిక్ ఐడెంటిటీకి మన ప్రభుత్వం పెట్టిన పేరు ఆధార్.... ఈ పథకంతో లాభాలెన్ని ఉన్నాయో కష్టాలూ అన్నే ఉన్నాయి.. కష్ట నష్టాలమాట ఎలా ఉన్నా ఇంతకీ ఆధార్ కార్డుల జారీలోనే ప్రభుత్వం పురిటి నొప్పులు పడుతోంది.. ఆధార్ కార్డుల నిర్లక్ష్యపు నీడలపై హెచ్ఎంటివి స్పెషల్ స్టోరీ.
బ్యాంగ్ ( ఆధారం)
యాంకర్ 1
ఆధార్ కార్డు... ఏడాది కాలంగా వింటున్న మాట.. దేశంలో ప్రతి ఒక్కరికీ పన్నెండంకెల గుర్తింపు సంఖ్య.. ఈ నంబరు చెబితే చాలు... మీరేంటో చెప్పేయొచ్చు... నంబర్ గుర్తులేకుంటే.. బయోమెట్రిక్ మిషన్ లో వేలి ముద్ర పెడితే చాలు తప్పిపోయిన వారిని క ూడా క్షేమంగా ఇంట్లో దించొచ్చు... ఖర్మకాలి ఏ చోరీలోనే వేలి ముద్ర దొరికితే ఇంటికి వెళ్లే సరికే పోలీసులు గుమ్మం ముందుంటారు.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం.. కానీ ప్రభుత్వ సంకల్పం నెరవేరుతుందా... మన దేశంలో ఉన్న నూటా ఇరవై కోట్ల రెండు లక్షల మందికి ఆధార్ కార్డులివ్వడం సాధ్యమయ్యే పనేనా.. అసలిప్పటి వరకు ఆధార్ కార్డుల కథ ఎంత వరకు వచ్చింది..
వాయిస్ 1
దేశ పౌరులందరికీ ఒక గుర్తింపు ఉండాలనేది ప్రభుత్వ సంకల్పం.. ఈ విధానంలో ప్రతి పౌరుడికి 12 అంకెల సంఖ్యను కేటాయిస్తారు.. కార్డు జారీ సమయంలో వ్యక్తి వేలిముద్రలు బయో మెట్రిక్ పద్దతిలో... కనుపాపలను ఐరిస్ పద్దతిలో స్కాన్ చేస్తారు.... పుట్టుమచ్చల వివరాలు రాసుకుంటారు. తల్లి దండ్రుల వివరాలతో బాటు...ఇంటి అడ్రస్.. పుట్టిన తేదీ.. ఆస్థిపాస్తుల వివరాలు.. విద్యార్హతలు అన్నీ పూర్తిగా నమోదు చేస్తారు.. ఈ నంబర్ పై ఫోటోతో బాటు వ్యక్తి వివరాలు పొందుపచబడి ఉంటాయి.. రేషన్ కార్డు నుంచి పాస్ పోర్ట్ వరకు ఈ కార్డుకు అనుసంధానం చేస్తారు.. బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా... సంక్షేమ పథాకాలకు దరఖాస్తు చేయాలన్నా ఈ కార్డే ఆధారం.. దేశంలో ప్రతి ఒక్కరికీ గుర్తింపునివ్వాలను కున్న ప్రభుత్వ సంకల్పం నిర్లక్ష్యపు నీడలో నీరుకారిపోతోంది.. అట్టహాసంగా ప్రారంభించిన ఈ పథకం ఆరభ శూరత్వం లా మారింది.. అడపా దడపా ప్రభుత్వం పత్రికా ప్రకటనలు గుప్పిస్తున్నా.. ఆచరణలో మాత్రం అడుగు కూడా ముందుకు సాగడం లేదు.. ఇప్పటికే జారీలో అవకతవకలు... జారీ చేసిన వాటితో సవాలక్ష ఇబ్బందులు ఎదరువుతున్నాయి..
స్పాట్ (5 సెకండ్స్ చాలు)
దేశంలో మొదటి సారిగా ఆధార్ కార్డుల వినియోగాన్ని ప్రారంభించిన ఘనత మన రాష్ట్రానికే దక్కింది.. ఆంధ్ర ప్రదేశ్ పౌర సరఫరాల శాఖ కార్డుల జారీ బాధ్యత తీసుకుంది. ఇన్ఫోసిస్ మాజీ సిఇఓ నందన్ నీలేకని ఆధ్వర్యంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. మన రాష్ట్రంలో ముందుగా హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురం.. మొత్తం 7 జిల్లాల్లో ప్రాజెక్ట్ ప్రారంభించారు. వ్యక్తుల వివరాల సేకరణ బాధ్యతను ఇ సెంట్రిక్ సొల్యూషన్స్, గౌతమీ ఎడ్యుకేషన్ సొసైటీ... స్మార్ట్ చిప్, వంటి 8 సంస్థలు కాంట్రాక్ట్ తీసుకున్నాయి. పేరుకే ఈ సంస్థలు కాంట్రాక్టుదారులయినా.. క్షేత్ర స్థాయిలో పనిని మాత్రం సబ్ కాంట్రాక్టర్ లకు లీజుకిచ్చాయి. ఈ సబ్ కాంట్రాక్ట్ సంస్థలు కావల్సినన్ని డిపిఎల్ సెంటర్లను ఏర్పాటు చేయడం లేదు.. తక్కువ సెంటర్లతో.. తక్కువ మంది సిబ్బంది... దీనికి తోడు సెంటర్లలో పనిచేసే మిషన్లు, కంప్యూటర్లు మొరాయించడం.. సిబ్బంది నిర్లక్ష్యం... అన్నీ పోగై వివరాల సేకరణ నత్తనడకను వెక్కిరిస్తోంది...
స్పాట్ (5 సెకండ్స్ చాలు)
డిపిఎల్ సెంటర్లలో సేకరించిన వివరాలు బెంగుళూరుకు పంపుతారు... బెంగుళూరులో వ్యక్తుల వివరాలన్నీ పరిశీలించి ఆధార్ నంబర్ కేటాయిస్తారు.. ఆ వివరాల్లో ఉన్న అడ్రస్ కు పోస్టులో కార్డు పంపిస్తారు.. మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ఆధార్ నంబర్ తో బాటు రేషన్ కార్డు నంబర్ ఉన్న స్మార్ట్ కార్డును అందిస్తున్నారు. ముందు చెప్పిన ఏడు జిల్లాలు కాక మిగిలిన 16 జిల్లాల్లో ఈ పనిని యస్.బి.ఐ, పోస్టల్, సెంట్రల్ బ్యాంక్ ఎల్ఐసి సంస్థలకు అప్పగించారు.. షెడ్యూల్ ప్రకారం మొదట ప్రారంభించిన ఏడు జిల్లాల్లో జూన్ వరకు పని పూర్తయితే మిగిలిన జిల్లాల్లో ప్రారంభించాలని నిర్ణయించారు. కానీ వచ్చే జూన్ వరకు కూడా పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు. మిగతా జిల్లాల భాద్యతలు తీసుకున్న సంస్థలైన పోస్టల్.. బ్యాంక్ సంస్థలకు ఎలాగూ సిబ్బంది కొరత ఎప్పట్నుంచో వేదిస్తోంది.. ఉపాధి హామీ పథకంతోనే ఈ సంస్థలు పీకల్లోతు కూరుకొని ఉన్నాయి. అదనపు బాధ్యతలు అనుకున్న కాలంవలో పూర్తి చేయడమంటే అనుమానమేనంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే ఉన్న సెంటర్లలో భారీ క్యూలైన్లు ఉండటం, ధరఖాస్తు నింపరాని వారు ఏజెంట్లను ఆశ్రయించడం, వివరాలు నమోదు చేయడంలో తప్పులు దొర్లడం, పని త్వరగా కావాలంటే కిందిస్థాయి సిబ్బంది చేతివాటం ప్రదర్శించడం వంటివి ఆధార్ కు బాలారిష్టాలుగా పరిణమించాయి.
స్పాట్ (5 సెకండ్స్ చాలు)
యాంకర్ 2
ఆధార్ కార్డు రావడం ఆలస్యమవుతుందేమో గానీ రావడం మాత్రం తధ్యం.. ఇంతకీ అధార్ కార్డువల్ల సామాన్యులకు ఒరిగేదేముంది.. ఈ కార్డుంటే లాభమేంటి.. .. కార్డు వెనుక కష్టాలేమైనా ఉన్నాయా.. కార్డు లేకుంటే ఏం జరుగుతుంది.. సమాజంలో వ్యక్తిగా గుర్తింపునివ్వరా.. గుర్తింపే కాదు అసలేమీ ఇవ్వరా..
వాయస్
పన్నెండంకెల సంఖ్య ఉన్న ఆధార్ కార్డు జేబులో ఉంటే.. దేశంలో అన్ని ప్రయోజనాలు పొందడానికి అర్హుడైనట్టే లెక్క... ఇక నుంచి ప్రతి పనికీ ఆధార్ కార్డే అడుగుతారు.. ఇప్పటి వరకు సిమ్ కావాలన్నా , బ్యాంక్ అకౌంట్ కావాలన్నా రేషన్ కార్డో.. ఎలక్షన్ ఐడి కార్డో.. డ్రైవింగ్ లైసెన్సో అడిగే వారు.. ఇవేవీ లేకున్నా కనీసం కరెంట్ బిల్లన్నా తెమ్మంటారు.. ఇక నుంచి ఇవేమీ అక్కర్లేదు.. ఆధార్ నంబరే అన్నిటికీ ఆధారం.. ఆధార్ కార్డు జిరాక్స్ ఇస్తే చాలు పూర్తి వివరాలు ఇచ్చినట్టే.. ఈ విధానం వల్ల చాలా వరకు అక్రమాలను అరికట్ట వచ్చనేది ప్రభుత్వాల వ్యూహం. ఒకే వ్యక్తి వివిధ ప్రాంతాలలో ప్రభుత్వ పథకాలను దుర్వినియోగం చేస్తున్నారని.. అసలు వ్యక్తులే లేకుండా బినామీ పేర్లతో పథకాలను పక్కదారి పట్టించడాన్ని అరికట్టడానికి ఈ ఆధార్ కార్డు పనికొస్తుంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ రంగారెడ్డి బాలానగర్ రేషన్ షాపు. స్మార్ట్ కార్డులు రాక ముందు ఈ షాపు పరిధిలో 348 రేషన్ కార్డులుండేవి.. స్మార్ట్ కార్డులొచ్చాక 148 కార్డులు బోగస్ వని తేలింది. కేవలం 200 కార్డులు మాత్రమే నిజమైన లబ్దిదారులవని తెలుస్తోంది. దీంతో రేషన్ షాపు నుండి అదనపు ప్రయోజనాలు లభించకపోవడంతో డీలర్ షాపు తెరవడమే మానేశాడని వినియోగదారులు చెబుతున్నారు..
బైట్ - నాగేశ్వర్ రావు, రేషన్ వినియోగదారులు
బైట్ - చంద్రకళ, రేషన్ వినియోగదారులు
వాయిస్
ఈ రకంగా ఒక్క రేషన్ షాపులోనే ఇన్ని బోగస్ లు బయట పడితే ఇక రాష్ట్రంలో మొత్తంలో.. దేశం మొత్తంలో ఎన్ని అక్రమాలకు అడ్డుకట్ట పడాలి. అందుకేనేమో కార్డులు ఆలస్యం కావడంలో థర్డ్ పర్సన్ల పాత్ర కూడా లేకపోలేదంటున్నారు సామాజిక వేత్తలు.. ఈ కార్డు ఉంటే రాష్ట్రంలో ఎక్కడయినా రేషన్ తీసుకునే సౌకర్యం ఉంటుంది. ఐతే కుటుంబంలో ఎవరో ఒకరు వస్తేనే రేషన్ లభిస్తుంది. ఫీజుల రీయంబర్స్ మెంట్, ఇందిరమ్మ ఇళ్లు, గ్యాస్ కనెక్షన్, ఉపాధి హామీ, అన్నీ ఈ కార్డుతోనే ముడి పడి ఉన్నాయి. ఈ కార్డుతో ఒకసారి ఒక సంక్షేమ పథకం ద్వారా ప్రయోజనం పొందితే తిరిగి మరోసారి అదే పథకానికి అర్హుడయ్యే అవకాశం లేదు. ఈ విధానం వలన ఒకే వ్యక్తి రెండు ప్రాంతాల్లో రెండు రకాలుగా ప్రయోజనాలు పొందడాన్ని నివారించవచ్చు.
స్పాట్ (5 సెకండ్స్ చాలు)
యాంకర్ 3
ఆధార్ కార్డుతో ప్రయోజనాలు చాలా ఉన్నాయి.. కానీ దీని వల్ల అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందనే ఉద్దేశ్యంతో కార్డుల జారీలోనే జాప్యం చేస్తున్నారు.. అంతేకాదు.. లబ్దిదారుల ప్రయోజనాలను నెరవేర్చడంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారు..
వాయిస్
రాష్ట్రంలో జూన్ నాటికి మూడు కోట్ల మంది వివరాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.. కానీ అందులో సగం కూడా పూర్తిస్థాయిలో జరగలేదు.. కేవలం కోటీ 40లక్షల 59 వేల మంది వివరాలు సేకరిస్తే.. అందులో కోటీ 7లక్షల 72 వేల మంది వివరాలే బెంగుళూరుకు వెళ్లాయి. ఇందులో కేవలం 29 లక్షల మందికే కార్డులు జారీ అయ్యాయి. అంటే మొత్తం మూడు కోట్ల మందికి కార్డుల జారీ కావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో అంచనా వేసుకోవచ్చు.. మొత్తంగా మన రాష్ట్రంలో ఉన్న ఎనిమిదిన్నర కోట్ల జనాభాకు ఆధార్ కార్డులు అందే ద్రాక్షేనా అన్న సందేహం కూడా లేకపోలేదు. ఇదేంటంటే మాకుండే ఇబ్బందులు మాకున్నాయంటున్నారు అధికారులు..
బైట్ - ప్రసాద్, అంబర్ పేట డిపిఎల్ ఇన్ చార్జి
ఇదంతా ఒక ఎత్తయితే అసలు ఆధార్ కార్డంటే ఏంటో చాలా మందికి తెలియదు.. ప్రజల్లో దీని గురించి సరైన అవగాహన లేకపోగా అపోహలు ప్రచారంలోకి వచ్చాయి. దీనికి తోడు విమర్శలూ బలంగానే వినిపిస్తున్నాయి. తక్కువ జనాభా కలిగి సాంకేతికంగా అభివృద్ది చెందిన దేశాల్లోనే సక్సెస్ కాని ఈ విధానం భారత్ వంటి అత్యధిక జనాభా ఉన్న దేశంలో సాధ్యమేనా అన్న సందేహం నిపుణులను వేధిస్తోంది. 121 కోట్ల మందికి గుర్తింపు నంబరు ఇవ్వాలన్న ప్రభుత్వ ఆలోచన అభినందించ దగ్గదే అయినా వీరందరి వివరాలు గోప్యంగా ఉంచగలదా అనే కోణంలో కూడా నిపుణులు ఆలోచిస్తున్నారు.. ప్రతి కార్డు వినియోగ దారుడికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ ఉంటాయి.. లబ్దిదారుడు అకౌంట్ తెరిచినా.. కొత్తగా సిమ్ కొన్నా... గ్యాస్ కనెక్షన్ తీసుకున్నా ఆ వివరాలన్నీ ఆ నంబర్ ఫైల్ కు అప్ డేట్ అవుతాయి. అంతేకాదు.. అకౌంట్ నంబర్, రేషన్ కార్డు నకళ్లు.. ఎలక్షన్ కార్డు వివరాలు అన్నీ ఉంటాయి.. అయితే ఈ వివరాలన్నీ అసాంఘీక శక్తుల చేతికి వెళ్లకుండా కాపాడ గలగటమే ప్రభుత్వం ముందున్న పెద్ద సవాలు.. ఈ మొత్తం డేటా హ్యకర్ల చేతికి చిక్కిందా ఏదైనా జరగొచ్చు.. పుట్టగొడుగుల్లా డూప్లికేట్ కార్డులు పుట్టుకురావడమే కాకుండా... అసలు లబ్ది దారుడికే తెలియకుండా రకరకాల ప్రయోజనాలు పొందొచ్చు.. ఇప్పుడు భారత దేశంలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం ఈ డేటాను భద్రంగా దాచడం కత్తిమీద సామే అంటున్నారు సాఫ్ట్ వేర్ నిపుణులు.
యాంకర్ 4
యూనిక్ ఐడి నంబర్ కేవలం మనదేశంలోనే ఇస్తున్నారా.. ఇంతకు ముందు ఇటువంటి ప్రయత్నం ఏ దేశమయినా చేసిందా.. చేస్తే అక్కడ ఈ నంబర్ ఎటువంటి ప్రభావం చూపింది.. కార్డుల వల్ల ఏం జరిగింది.. ఏం ఒరిగింది..
వాయిస్
ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్దిదారులకు అందించడంతో బాటు, ఇతర ప్రయోజనాల నేరవేర్చుకోవడం కోసమే భారత్, బ్రిటన్ లు యూనిక్ ఐడి ప్రాజెక్ట్ ప్రారంభించారనేది తెలిసిందే.. అయితే ఇదే తరహా విధానాన్ని అమెరికా 1934లోనే అమలు చేసింది. పౌరులకు సోషల్ సెక్యురిటీ నంబర్ కేటాయించి సంక్షేమ పథకాలు అమలు చేసే ప్రయత్నం చేసింది. దీంతో బాటు పౌరుల సమాచారాన్ని గోప్యంగా ఉంచడానికి అవసరమైన చట్టబద్దమైన ఏర్పాట్లన్నీ చేసింది.. అన్ని ఏర్పాట్లు చేసుకొని అత్యంత పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నా సర్వర్ల పై హ్యకర్లు దాడి చేసి ఏటా కోటి మందికి పైగా నష్టపోతున్నారు. ఈ సైబర్ దాడుల్లో సుమారు 50 బిలియన్ డాలర్లకు పైగా నష్టం వాటిల్లిందని అధికారిక లెక్కలు.. కానీ ఆధార్ నంబర్ అమెరికా సోషల్ సెక్యురిటీ లాంటిది కాదని ప్రభుత్వ వాదిస్తోంది.
స్పాట్ (5 సెకండ్స్ చాలు)
ఇంత జరిగి కార్డు చేతికి వచ్చినా.. కార్డు ఉపయోగిచాలంటే బయోమెట్రిక్ మిషన్ లబ్దిదారుడి వేలి ముద్రను గుర్తించి ఆమోదిస్తేనే ప్రయోజనం... లేకుంటే... కార్డు జేబులో పెట్టుకొని ఇంటిబాట పట్టాల్సిందే. ఏ దేశంలో నైనా బయోమెట్రిక్ మిషన్లు సగటున 5 శాతం వేలి ముద్రలను గుర్తించలేవని నిఫుణులే చెబుతున్నారు. భారత్ వంటి దేశాలలో ఇది 15 శాతం వరకూ ఉంటుందని అంచనా.. నిత్యం శ్రమ చేసే కార్మిక వర్గం చేతుల గీతలు సహజంగానే చెదిరిపోతుంటాయి... కొత్త గాట్లు పడుతుంటాయి. వీటిని బయోమెట్రిక్ మిషన్ గుర్తించే అవకాశమే లేదు... ఆధార్ ప్రాజెక్టుకు సాంకేతిక సేవలందిస్తున్న 4జి ఐడెంటిటీ సొట్యూషన్ సంస్థ కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తోంది.. ఇదే నిజమయితే దేశంలో 20 కోట్ల మందికి ఆధార్ కార్డు వచ్చే అవకాశమే లేదు..
ఎండ్ యాంకర్
వేల కోట్లు వెచ్చించి చేపడుతున్న ఈ భారీ ప్రాజెక్టుతో ఆశించిన ఫలితాలు రాకుంటే ఎవరు బాధ్యత వహించాలి... కోటానుకోట్ల ప్రజాధనం దుర్వినియోగం జరిగాక చేతులెత్తేస్తే ఎవరిని నిందితులుగా చూపాలి.. ఏదేమైనా ఆధార్ కార్డు దేశ పౌరులకు ఓ దారి చూపితే అంతే చాలు..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment