Friday, July 22, 2011
ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం
ఎపి భవన్ రెసిడెంట్ అధికారి చంద్రశేఖర్ పై టిఆర్ఎస్ ఎమ్మెల్యే చేయి చేసుకున్న ఘటన కొత్త మలుపు తిరుగుతోంది.. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న యాదిరెడ్డి మృతదేహాన్ని ఎపి భవన్ కు తీసుకురానివ్వకుండా... నేరుగా శ్మశానానికి తీసుకెళ్లే ప్రయత్నానికి... చంద్రశేఖరే కారకుడని హరీష్ రావు అతని పై చేయి చేసుకున్నాడు. తన పై అధికారి చెబితేనే ఆ పని చేశానని చంద్రశేఖర్ చెప్పడంతో కమీషనర్ తో వాదనకు దిగారు. తరువాత హరీష్ రావు తన తప్పిదాన్ని అంగీకరించి క్షమాపణలు చెప్పాడు. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న యాదిరెడ్డిని కడచూపు కూడా దక్కకుండా చేయబోయారనే ఆవేదనతో చేయిజారానని హరీష్ రావు చెబితే.. దళితుడు కాబట్టే దాడి చేశారని చంద్రశేఖర్ తరపు వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన చిలికి చిలికి గాలివానలా మారి రాజకీయ రంగు పులుముకుంది. చంద్రశేఖర్ ను కొట్టడం హరీష్ రావు దొరతనానికి నిదర్శనమని విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ అన్నారు. హరీష్ రావు పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసి నమోదు చేయడం న్యాయమైనదేనని మందకృష్ణ మీడియా సమావేశంలో తెలిపారు. ఇంతకీ అట్రాసిటీ కేసు ఎప్పుడు ప్రారంభమయింది. దీని పరిధిలోకి వచ్చే అంశాల పై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం.
బ్యాంగ్ - వేధింపుల నిరోధక చట్టం.
యాంకర్ 1
మన దేశంలో ఒకప్పుడు దళితులను అంటరాని వారిగా చూసేవారు. దళితులను, గిరిజనులను చిన్న చూపు చూడటం.. వేధించడం.. కులం పేరుతో దూషించడం.. దాడులకు పాల్పడటం వంటి జరిగేవి. అంటరాని తనాన్ని నిషేదించేందుకు జాతిపిత మహాత్మాగాంధి, రాజ్యంగకర్త అంబేడ్కర్ తీవ్రంగా కృషి చేశారు. మహాత్మాగాంధి దళితులను బదులు హరిజనులని పిలిచాడు. అంబేద్కర్ దళితుల పై వేధింపుల నిరోదానికి రాజ్యాంగంలో ప్రత్యేక ప్రకరణమే చేర్చారు..
వాయస్
రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల ప్రకారం దేశంలో పౌరులంరూ సమానులే.. కానీ గణతంత్రం వచ్చాక కూడా సమాజంలో పౌరులందరూ సమానంగా గౌరవించబడలేదు.. దళితుల పై గిరిజనుల పై అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగింది. రాజ్యాంగంలో హక్కులు, సూత్రాలు, ప్రకరణలు కాగితాలకే పరిమిత మయ్యాయి. చట్టం పేదవాడి వరకు చేరలేదు. అసలు చట్టంలో ఏముందో తెలుసుకునే అవకాశం కూడా దళితుడికి లేదు. అంటరానితనం అమానుషం అన్న నీతి పాఠ్యపుస్తకాల అట్టలకే పరిమితం అయింది. అమానుషం కొనసాగింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో దళితుల పై జరిగిన దాడులకు ప్రభుత్వాలు స్పందించాయి. సామాజిక వేత్తల, దళిత నేతల చొరవతో ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్అట్రాసిటీ యాక్ట్ కు పునాదులు పడ్డయి.
విజువల్స్
భారత రాజ్యాంగంలో పొందుపర్చిన 366 అధికరణంలోని 24,25 క్లాజుల ఆధారంగా 11 సెప్టెంబర్ 1989 న ఈ చట్టం రూపొందింది. ఇది1973 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పరిధిలోకి వస్తుంది. ఈచట్టంలోని సెక్షన్-3 ప్రకారం షెడ్యూల్ కులాలు,తెగల వారిని దూషించటం,సంఘ బహిష్కరణ, లైంగిక వేధింపులు, చిన్నచూపు చూడటం, దాడులకు పాల్పడటం వంటి14 రకాల నేరాలు ఈ చట్టం క్రిందకు వస్తాయి. ఈ చట్టం కింద కేసు నమోదయితే నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేస్తారు. నేరం రుజువైతే 6నెలల నుంచి 5 సంవత్సరాల వరకు జైలుశిక్ష, జరిమానా విధించే వీలుంది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి 2010 సెప్టెంబరు 11వ తేదీ నాటికి ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తయ్యింది
విజువల్స్
ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం క్రింద కేసు నమోదు అయితే 30 రోజుల్లో పరిష్కరించాల్సి వుంది. హత్య జరిగిందని నిరూపణ అయితే మృతుని కుటుంబానికి రూ.2 లక్షల వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేయాలి. మృతుని కుటుంబంలో ఒకరికి ఉద్యోగ భద్రత, బాధిత కుటుంబంలోని బిడ్డలకు విద్యకయ్యే పూర్తి ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. ఆ కుటుంబ పరిస్థితి మరీ దయనీయంగా వుంటే బాధిత కుటుంబంలోని పిల్లలకు నిత్యావసర వస్తువులు సైతం అందజేయాలని చట్టం చెబుతోంది. దాడులలో వికలాంగులైతే లక్ష రూపాయల వరకు అందజేస్తారు.
విజువల్స్
1985 పిసిఆర్, 1989 పిఓఎ చట్టం అమలు కోసం ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలను అరరికట్టేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారు. అలాగే 22 జిల్లాలో సంచార న్యాయస్థానాలు ఏర్పాటయ్యాయి. ఈ జిఓల అమలుకు 2006-07లో రూ.13.72 కోట్లు బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఏడాది చివరి నాటికి రూ.5.89 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. 2007-08లో రూ.18.89కోట్లు ప్రతిపాదించారు. కానీ, రూ.8.73 కోట్లు మాత్రమే కేటాయించారు. 2008-09 సంవత్సరం పరిస్థితి అంతా పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్‌ఆర్ చనిపోవడం, వరదలు వంటి ప్రకృతి వైపరిత్యాల కారణంగా బడ్జెట్ కేటాయింపులు,అమలు పరంగా పెద్దగా ప్రభుత్వం దృష్టి సారించలేదు.
visuals
ఇప్పటి వరకు ఈ చట్టం కింద నమోదైన కేసులను పరిశీలిస్తే రాజకీయ కారణాలతో అకారణంగా ప్రత్యర్దులపై ఈ చట్టం క్రింధ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసిన దాఖలాలు అత్యధికం. పనిచేసి పెట్టడం లేదని ప్రభుత్వోద్యోగులపై, తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని జర్నలిస్టులపై ఇటీవలి కాలంలో ఈ చట్టం కింద ఎక్కువగా కేసులు పెడుతున్నారు. ఈ చట్టం కింద కేసు పెడితే ముందుగా బెయిల్ (యాంటీసీపేటర్) దొరికే పరిస్ధితి లేకపోవటం వల్ల నిందితులకు రాజీ తప్ప మరో మార్గం లేదు. ఈ చట్టం వల్ల ఎంతో మంది ప్రభుత్వోద్యోగులు అరెస్టయి ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఈ చట్టం పేరు చెబితేనే జర్నలిస్టులు, వ్యాపారులు హడలి పోతున్నారు. అప్పు తీసుకుని అడిగితే కులం పేరుతో తిట్టాడని కేసులు పెడుతుండటంతో వ్యాపారులు వీరికి అప్పు ఇవ్వటమే మానివేశారు. కొద్ది మంది చేష్టలవల్ల మొత్తం జాతి ఇబ్బందుల పాలయ్యే పరిస్ధితి. పెట్టిన ఈ కేసులన్నీ న్యాయస్ధానాల్లో నిలబడలేకపోతున్నాయి.శిక్షకు ముందే నిందితుదు రిమాండ్ ఖైదీగా నెలరోజులపాటు జైల్లో ఉండే పరిస్ధితి. వంద మంది నేరస్తులు తప్పించుకున్న పరవాలేదు. ఒక నిర్దోషికి శిక్ష పడకూడదన్నది న్యాయ సూత్రం. ఏ నేరం చేయని వ్యక్తిని , సంఘంలో పేరు ప్రఖ్యాతులున్నవారిని ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో జైల్లో తోస్తే ఆ తర్వాత సమాజంపై అతని ముద్ర నెగిటివ్ ధోరణిలో ఉండదా? 20 యేళ్ళ క్రితం పరిస్ధితులు నేడు లేవు. అంటరానితనం తగ్గింది.ఎస్సీ,ఎస్టీలు గౌరవమైన జీవనం సాగిస్తున్నారు. అలాంటప్పుదు చట్టాన్ని మార్పు చేయకుండా యదాతధంగా అమలు చేయటం ఓట్ల రాజకీయమే. అట్రాసిటి చట్టం కింద నమోదైన కేసులలో పోలీసుల విచారణ సరిగా ఉండటం లేదనే ఆరోపణలున్నాయి. డీఎస్పీ స్తాయి అధికారి ఈ కేసులను విచారణ చేయాల్సి ఉంటుంది. ఫిర్యాదులో ఇచ్చిన సాక్షులను విచారించి చేతులు దులుపు కుంటున్నారు.చాలావరకు బోగస్ కేసులే .తనపై కేసు నమోదు అయ్యిందని పోలీసులు చెప్పేవరకు నిందితుడికి తెలియదు.సంఘటన ఎప్పుడు,ఎక్కడ జరిగిందో కేసు ఎవరు పెట్టారోతెలియని బోగస్ కేసులే అధికం. నలుగురు సాక్షులుంటే చాలు ఏ స్ధాయి వారి మీదనైన కేసు పెట్టవచ్చు.హత్య కేసులో కూడా అడ్వాన్సుగా బెయిల్ పొందే అవకాశం ఉంటుంది. ఎస్సీ,ఎస్టి యాక్టు కేసుల్లో జైలు గదప తొక్కనిదే బయటపడలేని పరిస్ధితి. ఏ మనిషి ఏ మనిషి పట్ల అమానుషంగా ప్రవర్తించినా శిక్షించాల్సిందే. ఒక అమానుషాన్ని నిరోధించడం కోసం ఇంకో అమానుష చట్టం చెయ్యడం వివేకవంతమనిపించుకోదు. వ్యక్తి స్వేచ్చకు,పత్రికా స్వేచ్చకు, సమాజంలో జీవించే స్వేచ్చకు ఇబ్బందికరంగా తయారైన ఈ చట్టాన్ని సవరించి మార్పులు తీసుకురావాలి. లేని పక్షంలో సమాజంలో పౌరులందరికీ కలిపి సమగ్రమైన అత్యాచార నిరోధక చట్టం రూపోందించాల్సిన అవసరం ఉంది
విజువల్స్
ఈ చట్టం వచ్చాక దళితుల్లో చైతన్యం వచ్చిందనే చెప్పాలి. కానీ ఈ చట్టాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఏ ఇద్దరి వ్యక్తుల మద్య గొడవ జరిగినా అందులో ఒకరు దళితుడైతే ఈ చట్టం పేరు చెప్పి భయపెడుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. అమాయకులను ఆసరా చేసుకొని కొందరు రాజకీయ నాయకులు ఈ చట్టాన్ని తమ స్వార్ధ ప్రయోజనాలకు వాడుకుంటున్నారనే అపవాదూ ఉంది. అందుకే చాలా కేసులు న్యాయస్థానం వరకూ వెళ్లకుండానే పోలీస్ స్టేషన్లలోనే పరిష్కారమవుతున్నాయి. 20 యేళ్ళ క్రితం పరిస్ధితులు నేడు లేవు. అంటరానితనం అనే మాట దాదాపు కనుమరుగయిందనే చెప్పాలి. .ఎస్సీ, ఎస్టీలు గౌరవమైన జీవనం సాగిస్తున్నారు. దళిత వాడల్లో నివసిించే వారికి మాత్రం ఇప్పటికీ ఈ చట్టం అందని ద్రాక్షగా మారితే.. ఉద్యోగంలో స్థిరపడి గౌరవంగా బతుకుతున్న వారు మాత్రం తమను కులం పేరుతో దూషిస్తున్నారని.. కేసులు పెట్టి పై అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే వాదనలూ ఉన్నాయి. ఇంతకీ హరీష్ రావు దాడి చేసింది చంద్రశేఖర్ రావు ఒక దళితుడనా..? తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని అనాధ మృతదేహంగా తరలించారనే కోపంతోనా అనేది చట్టమే చెప్పాలి..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment