ఎ.జనార్ధన్
ఇంట్రో యాంకర్
సినిమా అంటే వినోదం మాత్రమే కాదు.. సినిమా జీవితాన్ని చూపించాలి. నిజ జీవితానికి అద్దం పట్టాలి.. సగటు మనిషి రోజువారీ జీవితంలో ఎదుర్కోనే సమస్యలకు ఒక దారి చూపాలి. జీవన గమనానికి దిశా నిర్ధేశం చేయగలగాలి. అలా చేయగలిగిన సినిమా.. సినిమా మాత్రమే కాదు వర్తమానాన్ని…భావి జీవితాన్ని కళ్లముందు చూపే దృశ్యకావ్యం. ఇటువంటి వందలాది దృశ్యకావ్యాలను తన ఖాతాలో నింపుకున్న మేటి దర్శకుడు కె. బాల చందర్. రియల్ లైఫ్ ను రీళ్లలో నింపి గుండెలోతులను తడిమిన డైనమిక్ డైరక్టర్ కె. బాలచందర్.. బాలచందర్ కృషిని గుర్తిస్తూ భారత చలన చిత్ర రంగంలో అత్యున్నత అవార్డుగా భావించే దాదా సాహెబ్ పాల్కే అవార్డు కు ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం.
బ్యాంగ్
యాంకర్ 1
కె.బాలచందర్ ..ఈ పేరు వినగానే మన ముందు ఎన్నో జీవితాలు కదలాడుతాయి. అవును.. ఆయన తీసిన సినిమాలు కథలు కావు. అనుక్షణం మన కళ్ల ముందు కదులుతున్న జీవితాలు. నిజ జీవితంలో ఎదురయ్యే వాస్తవాలను ఆయన ఆవిష్కరించినట్టుగా మరే దర్శకుడూ ఆవిష్కరించలేదు. స్త్రీ అంతరంగాన్ని లోతుగా చదివిన దర్శకుడీయన. వివాహ బంధం లో వున్న పురుషాధిపత్యాన్ని తన సినిమాల్లో కళ్లకు కట్టినట్టు చూపిన యదార్థవాది బాలచందర్.
(చిన్న సీన్)
యాంకర్ 2
బాలచందర్ తెలుగు లో తీసిన సినిమాల లో ఇది కథ కాదు, అంతులేని కథ , 47 రోజులు , ఆకలి రాజ్యం, మరోచరిత్ర , సింధుభైరవి, ఆడవాళ్లూ మీరు జోహార్లు , మన్మథ లీల, అక్బోబర్ 2 , భార్యలూ జాగ్రత్త, కోటి విద్యలు కూటి కొరకే.. తొలి కోడి కూసింది సినిమాలు సినీ వినీలాకాశంలో వన్నె తరగని తారలుగా వెలుగుతున్నయి. సత్యజిత్ రే, మృణాల్ సేన్ , శ్యాంబెనెగళ్ వంటి దర్శకులు పూర్తి గా ఆర్ట్ సినిమా లు తీస్తున్న సమయంలో అటు కమర్షియల్ పంథాకీ, ఇటు సమాంతర చిత్రాల పంథా కీ మధ్యన సరికొత్త ట్రెండ్ లో సినిమాలు తీసిన్రు బాలచందర్. లేడీ ఓరియంటెడ్ మూవీ తీసినా, ప్రేమ కథా చిత్రాలు తీసినా, సందేశాత్మక చిత్రాలు తీసినా.. కె.బాలచందర్ భారతీయ సినిమా పై తనదైన ప్రత్యేకమైన ముద్రను వేయగలిగిండు.
సీన్/సాంగ్)
యాంకర్ 3
కె.బాలచందర్ తీసిన అత్యద్భుత చిత్రాల లో ఇది కథ కాదు ఒకటి. ఈ కథ ఎందరో మహిళల జీవితాలను ఆవిష్కరించింది. ప్రేమ , పెళ్లీ రెండూ విఫలమయి బాధ్యతలతో భారమైనజీవితం గడుపున్న మహిళకు మళ్లీ పాత ప్రియుడు ఎదురయితడు. మనసులో మళ్లీ ఆశ చిగురిస్తుంది. పెళ్లి చేసుకోవాలనుకుంటది. సరిగ్గా ఇప్పుడే చెడ్డవాడైన భర్త మంచివాడి గా మళ్లీ తన జీవితం లోకి వస్తనని అంటడు. మాజీ భర్త, మాజీ ప్రియుడు..ఈ రెండింటి మధ్యా నలుగుతున్న స్త్రీ హృదయాన్ని చూపిస్తూ ..సాగుతుందీ సినిమా.
(ఇది కథ కాదు సీన్) (అటుఇటు కాని పాట)
యాంకర్ 4
కె.బాలచందర్ తీసిన మరో ఆణిముత్యం అంతులేని కథ. జీవితం లో ఎన్ని ఒడిదుడుగుకు ఉంటయో చూపిన చిత్రం ఇది. వ్యక్తుల వ్యక్తిత్వాలకు ప్రవర్తనలకు ఉన్న వైరుద్యాలను కళ్లకు కట్టిన సినిమా ఇది.. పైకి కఠినం గా కనిపించే జయప్రద పాత్ర మనసు ఎంత సున్నితమో చెప్తడు బాలచందర్…కుటుంబం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి, ఆశలను చంపేసుకుంటూ బతుకుతున్నా విధి క్షణక్షణం పరీక్షలు పెడుతూనే ఉంటది. ఈ విధి చేసే వింతలకు అంతులేదని ముగింపు పలికిన చిత్రమే అంతులేని కథ.
స్పాట్
యాంకర్ 5
దేశం లో దరిద్రాన్ని చూపిస్తూ, ఆకలి బాధ ను చెప్పే ప్రయత్నం గా తీసిన సినిమా ఆకలిరాజ్యం. ఎమ్. ఏ లు చదివినా ఏ ఉద్యోగం లేక, ఆకలి బాధ ను నీళ్ల తో తీర్చుకుంటూ గడుపుతున్న నలుగురు యువకుల విషాద గాథ ఆకలిరాజ్యం. అప్పటి దేశ పరిస్థితికి అద్దం పట్టిన సినిమా ఇది. ఆకలి రాజ్యం సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ ఆకలి బాధ ఎలా వుంటదో అనుభవం లోకి వస్తది. ఈ సినిమా లో శ్రీ శ్రీ కవితలు వినిపిస్తయి. మన తల్లి అన్న పూర్ణ, మన భూమి వేదభూమి అంటూనే మన కీర్తి మంచుకొండ అని చమత్కరిస్తడు. ఇట్లాంటి జీవన చమత్కారాలు బాల చందర్ సినిమా నిండా కోకొల్లలు.
(సాపాటు ఎటూ లేదు పాట)
యాంకర్ 6
కె. బాలచందర్ మలిచిన దృశ్యకావ్యాల్లో వాడిపోని వసంతం మరో చరిత్ర. ఈ సినిమా చరిత్రనే తిరగరాసి మరో చరిత్ర సృష్టించిదనుకోవచ్చు. ప్రేమికులు చనిపోయినా బీచ్ బండల మీద, కూలిపోతున్న గోడల మీద వాళ్ల పేర్లను రాయించి ప్రేమ బతికేవుందనీ ఇది సరికొత్త చరిత్ర అంటూ బాలచందర్ మలిచిన ప్రేమకథా చిత్రం ఇది.. ప్రేమకు జాతీ, భాషా, ప్రాంతం ఇవేమీ అడ్డు కావని చెప్తడు బాల చందర్.
( ఈ తీగ పువ్వును ఏ కొమ్మ తేటిని పాట)
యాంకర్ 7
కె. బాలచందర్.. ఎక్కువగా సమాజంలో స్ర్తీ ఎదుర్కొంటున్న సమస్యలు..వాటి పరిష్కారాల పైనే ఎక్కువగా దృష్టి పెట్టిండు. ఆడవాళ్లూ మీకు జోహార్లు లోనూ స్త్రీ విలువను తెలిపే ప్రయత్నం చేసిండు. ఆడవాళ్ల ఆత్మాభిమానానికి ఆకలికి ఉన్న సంబంధం.. చక్కగా కళ్లకు కడతడు. ఈ సినిమాలో హీరోయిన్ కుండలమ్ముకొనే సీనే దీనికి అచ్చమైన ఉదాహరణ.
(హీరోయిన్ కుండలమ్ముకునే సీన్)
యాంకర్ 8
కె.బాలచందర్ సినిమా లలో సంగీతం గురించి ప్రత్యేకం గా చెప్పుకోవాలి. సంగీత దర్శకుడు ఎమ్.ఎస్. విశ్వనాధన్ బాలచందర్ కాంబినేషన్ సూపర్ హిట్ పాటల ను అందిచ్చాయి. ఇది కథ కాదు, అంతులేని కథ, ,మరో చరిత్ర,, గుప్పెడు మనసు సినిమా ల లోని పాటలు ఎప్పుడు విన్నా మన మనసును కదిలిస్తయి.
పాట
యాంకర్ 9
కె.బాలచందర్ మ్యూజిక్ మెస్ట్రో ఇళయరాజా కాంబినేషన్ సైతం అద్బుతమైన పాటలను అందించిన్రు. సుహాసినీ ప్రధాన పాత్రగా బాలచందర్ చేసిన సంగీత భరిత చిత్రం సింధుభైరవి. ఈ సినిమా కి గాను ఇళయరాజా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. అంతేకాదు చిరంజీవి తో బాలచందర్ తీసిన రుద్రవీణ కు కూడా ఇళయరాజా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. బాలచందర్ కమలహాసన్ ను చార్లీ చాప్లిన్ తీరు లో చూపించిన సినిమా డాన్స్ మాస్టర్. ఈ సినిమా కు ఇళయరాజా అందించిన సంగీతం చెప్పకోదగ్గది.
స్పాట్
యాంకర్ 10
కె.బాలచందర్ తన సినిమాల ద్వారా ఇద్దరు గొప్ప నటులను వెండితెరకు పరిచయం చేశారు. ఒకరు కమలహాసన్, ఇంకొకరు రజనీకాంత్. వీరిధ్దరినీ అపూర్వ రాగంగల్ తో ఇంట్రడ్యూస్ చేశారు బాలచందర్. వీరిధ్దరి కాంబినేషన్ లో ఎక్కువ సినిమాలు చేసిన దర్శకుడు కూడా కె.బాలచందరే.హీరోయిన్ లలో సైతం ఒకప్పుడు టాప్ హీరోయిన్ లు గా వెలుగొందిన తారలు జయప్రద, శ్రీదేవీల ను వెండితెరకు పరిచయం చేసింది కె.బాలచందరే.సహజనటులు గా పేరు గాంచిన సరిత, జయసుధ, సుజాత లను ఇంట్రడ్యూస్ చేసింది కూడా కె.బాలచందరే.
స్పాట్
యాంకర్ 11
బాలచందర్ ఈ మధ్య కాలం లో తీసిన సినిమా అబద్దం. ఈ సినిమా లో బాలచందర్ నటించారు కూడా. కె.బాలచందర్ దర్శకుడి గా నే కాకుండా నిర్మాత గా కూడా సినిమా లు నిర్మించారు. మణిరత్నం తీసిన రోజా సినిమా కు నిర్మాత కె.బాలచందర్. అలా ఎ.ఆర్. రెహమాన్ ను ఇంట్రడ్యూస్ చేసింది బాలచందరే. ఆ తర్వాత బాలచందర్ తీసిన డ్యూయెట్, పరవశం సినిమా లకు రెహమాన్ సంగీతాన్నందిచారు.
స్పాట్
ఎండ్ యాంకర్
భారత దేశం గర్వించదగ్గ దర్శకుడు బాలచందర్. కథా వస్తువు పరంగా బాలచందర్ చేసిన ప్రయోగాలు ఎప్పటికీ మర్చిపోలేనివి. బాలచందర్ తీసిన సినిమాల లో 6 సినిమా లకి ఉత్తమ ప్రాంతీయ చిత్రం కేటగిరీ లో నేషనల్ అవార్డ్ లభించింది.సినిమా ద్వారా తను చేసిన కళాసేవ కు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1987 లో కె.బాలచందర్ ను పద్మ శ్రీ అవార్డు తో సత్కరించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు దాదాసాహెబ్ పాల్కే అవార్డు ప్రకటించడం సినీ వినీలాకాశంలో కాంతులీనే బాల చంద్రునికో నూలు పోగు వంటిది. కె. బాలచందర్ ను చూసి వర్తమాన దర్శకులు నేర్చుకోవలసింది చాలా ఉంది. దాదా సాహెబ్ పాల్కే అవార్డు వచ్చిన సందర్భంగా బాలచందర్ గార్కి కంగ్రాట్స్ చెబుతూ.. బై.. దిసీజ్… సైనింగ్ ఆఫ్..
బ్యాంగ్
No comments:
Post a Comment