Monday, April 2, 2012
పునరావాస కేంద్రాల్లో పచ్చి వ్యభిచారం... స్వచ్ఛంద సంస్థల ముసుగులో దోపిడీ
కూటి కోసం కోటి విద్యలన్నారు పెద్దలు.. కానీ ఏ విద్యా రాని ఈ అభాగ్య గిరిజన మహిళలు వ్యభిచార వృత్తిని ఆశ్రయిస్తున్నారు. కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు చెందిన మహిళతో ఇటు ప్రభుత్వం అటు స్వచ్ఛంద సంస్థలు... చేయూతనిస్తున్నమని చెబుతూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. వ్యభిచారాన్ని మించిన ఈ అనైతిక వ్యాపారంలో అమాయక మహిళలు సమిధలవుతున్నారు. స్వచ్ఛంద సేవ పేరుతో సాగుతున్న చెలగాటం ఒకవైపు.. పాత వృత్తిలో చేసిన పని పునరావాస కేంద్రాల్లో మళ్లీ చేయమనే ఒత్తిడి మరోవైపు.. బతుకు దెరువుకు దారితప్పిన వారిని బానిసలుగా మార్చి చేస్తున్న వ్యాపారం పై ప్రత్యేక కథనం.
పునరకావాసం / వెలయాలి విలాపం / చేను మేసే కంచె/
రైలుబండి దిగి తలలకు ముసుగులు ధరించి కనిపించే వీరంతా... వ్యభిచార కూపం లోంచి రక్షించబడ్డ యువతులు.. తెలిసో తెలియకో... లేక తెలిసినా విధిలేకో.. వీరు ఈ వృత్తిలో అడుగు పెట్టారు. కానీ ఈ వృత్తిలో అడుగు పెట్టిన మరు క్షణమే వీరు ఎందరికో వ్యాపార వస్తువులయ్యారు. మొదట వీరు వృత్తిలోనే దోపిడి గురవుతారు. వీరిని అడ్డం పెట్టుకొని.. నిర్వాహకులు రోజుకు పదివేలు సంపాదించి... వందరూపాయలు కూడా ఇవ్వరు. మరోవైపు వీరిని రక్షించామని చెప్పి ఒకరు దోచుకుంటుంటే.. వీరికి పునరావాసం కల్పిస్తామని చెప్పి మరొకరు దోచుకుంటారు. ఇక పునరావాసం పేరుతో సాగే అరాచకం మరో వికృతం. అలవాటైన పాత పనేగా... మళ్లీ చేసి తమ పనులు చేయించమంటూ వత్తిడి.. పునరావాసం పేరుతో పున్నామ నరకం.. ఇవన్నీ అనంతపురం జిల్లాలో వ్యభిచార వృత్తిలోకి దిగిన మహిళల కన్నీటి వెతలు... వెలయాలులను అడ్డం పెట్టుకొని నడుపుతున్న అడ్డగోలు దందా..
దేశంలో ఏ వ్యభిచార గృహం పై దాడి జరిగినా.. దొరికిన వారిలో అనంతపురం జిల్లాకు చెందిన వారే అధికంగా ఉంటున్నారు. దీనికి కారణం ఇక్కడున్న సామాజిక ఆర్ధిక పరిస్థితులతో... బాటు వాటిని అడ్డం పెట్టుకొని వీరితో వ్యాపారం సాగించేందుకు మభ్యపెట్టే ట్రాఫికర్స్ ఎక్కువ కావడం మరో కారణం.. జిల్లాలో కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాల్లో యువతులు వ్యభిచార వృత్తిలో అడుగుపెడుతున్నారు. ఇక్కడ తండాల్లో నివసించే వారిని సుగాలీలు అంటారు. వీరితో బాటు కదిరి నియోజక వర్గంలో ఉన్న మైనారిటీ యువతులను మాయమాటలు చెప్పి ఈ వృత్తిలోకి దించుతున్నారు. 2004 నుంచి 2011 వరకు సుమారు 72 మంది ఈ వృత్తిలో మగ్గుతున్నట్టు అధికారిక అంచనాలు చెబుతున్నాయి.
ఈ వృత్తిలో నరకం అనుభవించిన వారితో బ్రోకర్లు కుమ్మక్కై పచ్చి అబద్దాలు చెప్పి అమ్మాయిలకు విలాస జీవితాన్ని ఎర వేసి ఈ వృత్తిలో దింపుతున్నారు. ప్రలోభానికి గురై ఈ నరకకూపంలోఅడుగు పెట్టిన అమ్మాయిలకు భూలోక నరకం అంటే ఏంటో చూస్తారు. రోజుకు 50 నుంచి 100 మంది విటులతో గడపాల్సి వస్తుందని యువతులు చెబుతున్నారు. ఇంత చేసినా తమకు రోజుకు వంద రూపాయలు కూడా ఇవ్వకుండా నిర్వాహకులు మాత్రం రోజుకు 10వేల పైచిలుకు సంపాదిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇదంత ఒక ఎత్తు. ఇక మరో దోపిడీ స్వచ్ఛంద సంస్థలు, పోలీసుల పేరుతో సాగుతోంది. వ్యభిచార కూపంలో ఉన్న యువతులు ఇచ్చిన సమాచారంతో వారిని కాపాడి... తరువాత మళ్లీ వారినే వ్యభిచార గృహాలకు తరలిస్తారు. అక్కడికి వెళ్లగానే వారు ఇచ్చిన సమాచారంతో మళ్లీ యువతులను రక్షించినట్టు డ్రామా ఆడుతారు. దీంతో వ్యభిచార గృహ నిర్వాహకుల నుంచి భారీగా వసూలు చేయడం.. మరోవైపు ప్రభుత్వం నుంచి ప్రశంసలు.. ఈ స్వచ్ఛంద పనిని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా నిధులు కొల్లగొట్టడం ఒక వ్యాపారం గా మారింది.
ముఖ్యంగా పుట్టగొడుగుల్లా వెలిసిన స్వచ్చంద సంస్థలు వీరికి పునారావాసం కల్పిస్తామంటూ.. మరోదోపిడి చేస్తున్నాయి. కదిరిలో వెలిసిన ఒక స్వచ్ఛంద సంస్థ వీరిని కాపాడిన నెపంతో 15 మంది అమ్మాయిలను తీసుకువచ్చి పునారావాసం పేరుతో మళ్లీ వ్యభిచార గృహం నిర్వహించింది. ఈ పునరావాస కేంద్రాల్లో వీరికి బతుకు దెరువుకు పనికి వచ్చే పనులేవీ నేర్పకపోగా.. వీరితో పాత పనులు చేయమని వత్తిళ్లు తెస్తున్నట్టు చెబుతున్నారు.
స్వచ్ఛంద ముసుగులో సాగుతున్న అరాచకం వల్ల నిజంగా సేవ చేసే వారు తట్టుకోలేకపోతున్నారు. ఇటు పోలీసులు, లాయర్లు, స్థానిక నాయకుల అండ పుష్కలంగా ఉండటంతో పునరావాస కేంద్రాల్లోఉండే వారిని కాపాడలేకపోతున్నామంటున్నారు.
అనంతపురం జిల్లాలో సాగుతున్న ఈ చీకటి వ్యాపారాన్ని హన్స్ ఇండియా, హెచ్ఎంటీవీ కలెక్టర్ దృష్ఠికి తీసుకెళ్లడంతో తీగ కదిలింది. రిహాబిలిటేషన్ సెంటర్లను పరిశీలించి దగాపడ్డ వారికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
బతుకు దెరువుకు దారి తప్పిన యువతులు.. ఆ దారిలో ఉన్న కష్టాలు చూసైనా కనువిప్పు కలగాలి.. చీకటి దారుల్లో చిరువెలుగు కూడా చిచ్చర పిడుగులా కబళిస్తుందన్న నిజం తెలుసుకుంటే.. ఈ దారిలోకే వెళ్లరు.
Subscribe to:
Post Comments (Atom)
very sad..
ReplyDelete"పునరావాసం పేరుతో పున్నామ నరకం.." - మీ తెలుగు భాషా పాండిత్యం అద్భుతం. !
ReplyDelete@vanaja vanamali, @sri ram...thanku for responding
ReplyDelete