Monday, April 16, 2012
వందేళ్ల సినిమాలో ఒడిదుడుకులు.. వందేళ్ల సినిమాకు వందనాలు
ఆ సాయంత్రం ముంబయిలోని ఒలంపియా థియేటర్ ముందు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఓ అద్భుతానికి పునాదులు పడబోతున్నాయి. అయితే అది విజయవంతంగా మారుతుందా లేదా అనేది అందరి మదినీ తొలుస్తున్న ఉత్కంఠ.. అక్కడ ఉన్న వారంతా ఒక చారిత్రాత్మక సంఘటనకు సాక్షులు. చిత్ర రూపకర్త దాదాసాహెబ్ ఫాల్కే తన ఎన్నో ఎళ్లుగా నిరీక్షిస్తున్న కలను సాకారం చేసుకోవడాన్ని అక్కడికి చేరిన ప్రతి ఒక్కరూ ప్రశంసించారు. దాదాసాహెబ్ స్వదేశీ నిర్మిత పూర్తి నిడివిగల చిత్రాన్ని నిర్మించగలిగారు. ఇది చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోయింది.
భారతీయ చలన చిత్రానికి వచ్చే శనివారానికి వందేళ్లు పూర్తవుతున్నాయి. సరిగ్గా ఏప్రియల్ 21, 1913 తేదీన రాజా హరిశ్చంద్ర చలనచిత్రం వెండి తెరపై వెలుగులు చిమ్మింది. కదిలే బొమ్మలను కళ్లముందు ఆవిష్కరించింది.
అయితే చలన చిత్రాన్ని తొలిసారిగా వెండి తెరకు పరిచయం చేసిన భారతీయుల్లో ఫాల్కే ఒక్కరే మొదటి వారు కాదు.. రాజా హరిశ్చంద్రకంటే ముందు పుండలిక్ చిత్రం విడుదలయింది. అయితే ఇది మొత్తం విదేశీ సాంకేతిక సిబ్బందితో... విదేశీయుల సహకారంతో తెరకెక్కింది. కానీ రాజా హరిశ్చంద్ర మాత్రం పూర్తి నిడివి భారతీయతతో ఉట్టి పడుతుంది.
భారతదేశం వలస పాలకుల ఉక్కు పాదాల కింద ఉన్న కాలంలో ఒక స్వదేశీ చిత్రం రావడం చాలా కష్టం. కానీ వెన్ను చూపని ధైర్యానికి తోడు.. కఠోర శ్రమ ఆ లక్ష్యాన్ని నెరవేరేలా చేసింది.
సినిమా తొలినాళ్లలో అందరినీ ఒక్కటి చేసింది. సినిమా చూస్తున్నంత సేపూ కలిమి లేముల ధ్యాసే లేదు. సినిమాకు ఒక సామాజిక బాధ్యత ఉండేది. ముందు వలసలో కూర్చునే వారు... బాల్కనీలో కూర్చునే వారు అనే తేడా ఉన్నప్పటికీ చిత్రాన్ని చూసి ఆనందించడంలో ఎటువంటి తేడా లేదు.. ఆ చీకట్లో తారతమ్యాలన్నీ కనిపించకుండా మాయమయ్యేవి.
స్వాతంత్ర్యానికి పూర్వం వచ్చిన చిత్రాలన్నీ దేశభక్తి ఉట్టిపడేలా తీసినవే.. అప్పటి చిత్రాల్లో క్రూరత్వం, నగ్నత్వం తక్కువగా ఉండటం వల్ల పెద్దగా సెన్సార్ అవసరం రాలేదు. కానీ తొలిసారి.. భక్త విధుర చిత్రం వివాదానికి తెరలేపింది... ఈ చిత్రం రాజకీయ కోణంలో తీసిన వివాదాస్పద చిత్రంగా భావించారు.
ప్రధాన చిత్రాలకు పాటలే ప్రాణం... ఒక్కోసారి ఈ సాహిత్యం సమాజాన్ని కదిలించేదిగా ఉండేది. 1943లో అశోక్ కుమార్ రూపొందించిన బ్లాక్ బస్టర్ మూవీ కిస్మత్ ఓ సంచలనం.. అందులో దూర్ హఠో యే దునియా వాలా.. హిందుస్థాన్ హమారా.. అనే పాట.. వలస పాలకులకు ఓ సవాలుగా మారింది.
భారతీయ చలన చిత్రం కేవలం ఒక వ్యాపార దృక్పదంగా మిగల్లేదు. ఎక్కువ మంది నిర్మాతలు చలన చిత్రాన్ని ఒక బంగారు గుడ్లు పెట్టే బాతులా వినోదాత్మకంగా తీర్చి దిద్దడానికి ప్రాముఖ్యం ఇచ్చినా... శాంతారాం, మెహబూబ్‌ఖాన్, బిమల్‌రాయ్, అబ్బాస్ వంటి వారు సామాజిక కోణంలో ఉన్న చిత్రాలకే ప్రాముఖ్యతనిచ్చారు. సామాజిక సమస్యలను తెర పైకి ఎక్కించి వినోదాత్మకంగా రూపొందించి.. తాము చెప్పాల్సిన సందేశాన్ని సమాజానికి అందించే వారు. అంతేకాదు. వీరెవరూ తమ చిత్రాలు సమాజానికి ప్రతిబింబాలుగా ఉండాలని కోరుకోలేదు. తమ చిత్రాల ద్వారా ఏదో మార్పు రావాలని ఆశపడ్డారు. ఆ ఆశతోనే కులతత్వం పై, లింగ వివక్ష పై రకరకాల ప్రయోగాలు చేశారు.
భారతీయ చలన చిత్రంలో కొన్ని చిత్రాలు మైలు రాళ్లుగా నిలిచాయి. సత్యజిత్ రే తీసిన పథేర్ పాంచాలి చిత్రం 1956లో బెస్ట్ హ్యూమన్ డాక్యుమెంట్ బహుమతికి ఎంపికయింది. మరుసటి ఏడాది అమిత్ శంబు మిత్రా రూపొందించిన జగ్తేరహో చిత్రం కార్లోవీ వ్యారీ చిత్రోత్సవంలో మొదటి బహుమతి గెలుచుకోవడంతో... భారతీయ దర్శకులకు తాము గొప్ప చిత్రాలను రూపొందించగలమనే ఆత్మస్థైర్యం పెరిగింది.
ఇండియన్ సినిమా శరవేగంగా అభివృద్ధి చెందింది... జాతీయ బాష నుంచి స్థానిక బాషల్లో కూడా చిత్రాలు తీయగలిస్థాయికి ఎదిగింది.. 1962లో మొదటి బోజ్‌పురి చిత్రం... గంగా మయ్యా థోహె పియరీ చదాహిబో.. విడుదలయింది. దీంతో ప్రాంతీయ బాషలు తమ మాండలికాల్లో భావోద్వేగాలను తెరకెక్కిండంలో విజయవంతం అయ్యాయి.
భారతీయ చిత్రం ఉత్తర భారతం.. దక్షిణ భారత ప్రాంతాలలో ఎవరికి వారు విభిన్న శైలిలో చిత్రాలు నిర్మించడం ప్రారంభించారు. 1950 మరియు 60 లలో వస్తున్న అధునాతన బాషా పద్దతులను అనుసరిస్తూ... జెమినీ, ఏవీఎం, ప్రసాద్ ప్రొడక్షన్స్ చిత్రాలను రూపొందించుకుంటూ వెళ్లాయి.. ఈ పాటలు గ్రాంఫోన్ నుంచి రేడియోలో వినడం.. వాటిని జాతి మొత్తం ఆలపించడం ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.
ఇంతింతై వటుడింతై అన్న చందంగా భారతీయ చలన చిత్రం ఎదిగింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక చిత్రాలను ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగింది.. ఇటు వ్యాపర పరంగా గానీ.. సాంకేతిక పరంగా గానీ ప్రపంచ చిత్రాలకు పోటీనిస్తోంది. అంతర్జాతీయంగా భారీ వసూళ్లు రాబడుతున్నాయి. త్రీ ఇడియట్స్ చిత్రం భారతదేశం వెలుపల పది మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. మైనేమ్ ఈజ్ ఖాన్ చిత్రం దక్షిణ కొరియాలో 2.6 మిలియన్లు వసూలు చేసింది. రోజు రోజుకూ సినిమా తన రూపం మార్చుకుంటోంది. పాటల చిత్రణలోనూ... చిత్రం నిడివిలోనూ.. తెరపై ఆవిష్కరించే విధానంలో.. శబ్ద మాధ్యమంలో వినూత్న మార్పులు వస్తున్నాయి.
వందేళ్ల భారతీయ చలన చిత్రం ఓ అద్భతం.. నాటి నుంచి నేటి వరకు ఎందరో కళాకారులు చిత్రలే లోకంగా బతికారు. ఎంజీఆర్, ఏఎన్నార్, యన్టీఆర్.. రాజ్‌కుమార్, అమితాబ్ బచ్చన్, ఉత్తమ్ కుమార్.. వంటి వారు తమ కలలను సాకారం చేసుకున్నారు. తెర పై మెరిసి తారలుగా చెలామణి అయ్యి లక్షలాధి అభిమానుల హృదయాలను కొల్లగొట్టారు.. భారతీయ చలన చిత్రం మరిన్ని శతదినోత్సవాలు జరుపుకోవాలి... అందుకే భారతీయ చిత్రానికి శత సహస్రమానం భవతి చెబుదాం..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment