ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Monday, February 20, 2012

గల్ఫ్ గాయాలు - కనిపించని కన్నీళ్ళు


గల్ఫ్ గాయాలు - కనిపించని కన్నీళ్ళు
జీవితాంతం తోడు నీడై.. నడిపించాల్సిన భర్త.. ఉపాధి కోసం వలసెళ్లిపోయి.. ఉండో లేడో తెలియని అయోమయంలో బతుకులీడుస్తున్న వారి బాధ వర్ణనాతీతం. దినదిన గండం నూరేళ్లుగా గడుపుతున్న పిల్లా పాపల దైన్యం చూస్తే కళ్లు చెమ్మగిల్లక మానవు. కళ్లలో వత్తులేసుకొని తమ కంటిదీపం కోసం ఎదురు చూస్తూ మూగగా రోదిస్తున్న ఆ నిరీక్షకులను కదిపితే కన్నీళ్ల కడవలు ఒలికాయి. తమ గోడెవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని స్థితులో ఉన్న ఆ అభాగ్యులను హెచ్ఎంటీవీ పలకరించింది. గల్ఫ్ లో గల్లంతై గుండె గాయాలను మిగిల్చిన మూగ వేదన పై ప్రత్యేక కథనం.
ఇక్కడ కనిపిస్తున్న ఈ అభాగ్యులు సంవత్సరాల తరబడి కళ్లలో కన్నీటి సంద్రాలను దాచుకొని... పంటిబిగువున కాలం వెళ్లదీస్తున్నారు. రెక్కాడినా కానీ డొక్కాడని పరిస్థితి ఒకపక్క... కాసులు తెస్తానని ఖండాంతరాలు దాటెళ్లిన తోడు జాడ దొరకని బెంగ మరోపక్క... ఎదిగిన పిల్లల చదువులు ఎదలపై బండలవుతున్న బరువు మరోపక్క.. ఇన్ని కష్టాల నడుమ.. ఊరడించని నేతల మాటలు నీటి మూటలై వెక్కిరిస్తుంటే.. ఉండో లేడో తెలియని దైవాన్ని కొలుస్తూ.. తమ ఇంటిదిక్కు తిరిగి ఇంటికి రావాలని వేడుకుంటున్నారు.


ఒకటి కాదు. రెండు కాదు. వలస వెళ్లి తిరిగిరాని కుంటుంబాలు ఎన్నో.. అందరికీ అదే మోసం.. అన్ని కథలకూ ఒకే ప్రారంభం.. ఒకే ముగింపు. ఆర్ధికంగా చితికిపోయి ఉన్న తమ కుటుంబాన్ని ఆదుకోవాలని. గల్ఫ్ ఏడారికి పయనమై తమ అముల్యమైన జీవితాన్ని తాకట్టు పెట్టి పోయారు. వెళ్లిన వారి వీడ్కోలే కడ చూపుగా మారింది. తమను నమ్ముకున్న వారి జీవితాలలో వెలుగు చుడాలని వెళ్లారు. కానీ వారికి పలుకే కరువయింది. వారికే ఏళ్ల తరబడి ఎదురు చూసినా ఫలితం లేదు... కనీసం బ్రతికి ఉన్నారా లేదో తెలియదు. కుటుంబ సభ్యులు తొక్కని గడప తొక్కకుండా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ, ప్రవాస భారతీయల సమస్యలను తీరుస్తామని ఏర్పాటు చేసే ప్రతీ కార్యక్రమాలకు చెప్పులరిగేలా తిరిగినా ఫలితం లేదు. తమ భర్తలు ఎక్కడ ఉన్నారో తెలపండి, వారు బ్రతికి ఉన్నారా లేక ఏడారిలోఇసుక దిబ్బలలోనే సమాధి చేసారా తెలుపండి అని వేడుకుంటున్నారు.
నిజామాబాద్ జిల్లా, మర్తాడు పాడు మండలానికి చెందిన ఇద్దరు తమ భర్తల కోసం ఏళ్లతరబడి ఎదురు చూస్తున్నారు. సమాజం దృష్టిలో తాము మనుషులమైనా.. తమ ఇంటిలో తాము జీవచ్ఛవాలమని చెబుతున్నారు. వీరిలో ముందుగా నజీరా బేగం దీన గాధ తెలుసుకుందాం..
నజీరా బేగం భర్త మహమ్మద్ అబ్దుల్ సలీం.. తండ్రి పేరు గోరే మియా, తల్లి ఖమ్రు భీ, పాస్‌పోర్టు నంబర్ పీ 995741, కువైట్ దేశంలో అలీ హసన్ ఫహీద్ హసన్ అల్ అజ్మీ వద్దకు ఉపాధికి వెళ్లాడు.
1997 సంవత్సరంలో కువేట్ దేశానికి పయనమైన ముహమ్మద్ అబ్దుల్ సలీం ఒక సంవత్సరం పాటు తన కుటుంబ సబ్యులకు ఉత్తరాల ద్వారా తన బాగోగుల తెలిపాడు, అందులో తన యజమాని తనను వేధింపలకు గురిచేస్తున్నాడని తాను ఈ బాధలను తట్టుకోలేక పోతున్నానని తెలిపాడు, ఒక సంవత్సర కాలంలో రెండే రెండు ఉత్తరాలు రాసిన సలీం ఆ తరువాత తన కుటుంబ సబ్యలతో కాని మరెవ్వరితో ఏలాంటి మాట్లాడి నట్టు దాఖలాలు లేవు, ఈ విశయాన్ని ఎన్నో సార్లు అధికారులకు తెలుపారు., కువైట్ లోని సలీం యజమానికి ఫోన్ లో సంప్రదించినా ఎలాంటి సమాచారం తనకు తెలుయదని నిర్లక్ష్చంగా సమాధానం ఇచ్చి ఫోన్ పెట్టెశాడని, కువైట్ లోని భారత దేశ రాయబారి కార్యాలయానికి ఎన్నో మార్లో లేఖలు రాసినా.. చూస్తున్నాము.. చేస్తున్నామని సమాధానమే తప్ప ఏలాంటి పురోగతి లేదని బాధితురాలు నజీరా తెలుపుతున్నారు.
ఎన్ని బీడీలు చుట్టినా తీరని కష్టం నజీరాది.అటువంటి కష్టమే ముతుకు లక్ష్మిది. ఈమె భర్త పేరు ముతుకు రమేశ్. ఉపాధి కోసం సౌదీ వెళ్లాడు.
తన సోదరడు సౌది అరేబియా వెళ్లి కుటుంబాన్ని చక్కదిద్దుకున్నాడని తాను కూడా గల్ఫ్ దేశానికి పయనమయ్యాడు. 2004 సంవత్సరం లో రియాద్ రిజన్ కు చెందిన అల్ ఫలాజ్ ప్రాంతనికి పయనమైనాడు, నాలుగు ఐదు సంవత్సారాల పాటు ఇంటి రాక పోకలు సాగించాడు అలాగే తన భార్య పిల్లలకు సైతం కొంత డబ్బు పోగు చేసుకున్నాడు, ఆ నాలుగు ఐదు సంవత్సారాల కాలంలో ఇంటికి రెండు సార్లు వచ్చి పోయాడు. ముడో సారి వచ్చిన ముతుకు రమే‌శ్ 2010 జనవరి 12 నాడు సౌదికి వెళ‌్లాడు. జనవరిలో సౌదికి వెళ్లిన రమేశ్ జనవరీ 2011 వరకు తన కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడుతూ అందుబాటులోనే ఉన్నాడు. కానీ ‍ జనవరి 2011 నుండి ఎలాంటి సమాచారం లేదు. తాను నివాసం ఉన్న గది సైతం తాళం వేయకుండా మాయమయ్యాడని సమాచారం వచ్చింది. ఎవ్వరిని అడిగిన తనకు తెలియదని సమాధానం చెప్పుతున్నారని ముతుకు రమేశ్ భార్య లక్ష్మి చెబుతోంది.
. అయితే తాను తన భర్త ఆచూకి కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాననీ.. అందులో భాగంగానే సౌది లోని యజమానికి ఫోన్ చేయగా ఎక్కడ చచ్చాడు వచ్చి వెతుకండి అని కఠినంగా సమాధానం ఇచ్చి ఫోన్ పెట్టెస్తున్నాడని లక్ష్బి తన గోడు వెళ‌్ల బుచ్చుకున్నారు. సంపాదన లేకపోగా భర్త జాడ కోసం ఉన్న ఇల్లును కూడా అమ్మి అప్పుల పాలయింది. ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు తన భర్త బతికున్నాడా. .లేక అక్కడే చంపేశారా తెలపాలని కోరుతోంది.
ఇలాంటి దీనగాధలు.. ఉపాధికని గల్ఫ్‌కు వెళ్లిన చాలా కుటుంబాల్లో కనిపిస్తాయి. గడప గడపలో కడివెడు కన్నీళ్లు వర్షిస్తాయి. ఆగని ఈ అశ్రుధారలకు ఆనకట్టలు వేసే రోజు ఎప్పుడొస్తుందో..

No comments:

Post a Comment