ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Wednesday, February 15, 2012

మూడవ ప్రపంచ యుద్ధానికి సైరన్ సిద్ధం..?


ప్రపంచదేశాల మధ్య నెలకొన్ని తాజా యుద్ధ మేఘాలు భారత్‌కు చమురు సంకటంగా మారాయి. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లయింది భారత్ పరిస్థితి. ఢిల్లీలో ఇజ్రాయిల్ దౌత్య కార్యాలయం ముందు జరిగిన బాంబు పేలుళ్లు ఇరాన్‌ పనే అని భారత్ అభిప్రాయపడటం పట్ల కూడా ఇరాన్ గుర్రుగా ఉంది. అగ్రరాజ్యానికి వత్తాసు పలుకడం సరికాదని ఇరాన్ అధ్యక్షుడు అహ్మదినెజాద్ అభిప్రాయపడ్డారు. ఇరాన్ ను ఏకాకి చేయాలన్న అగ్రరాజ్య పిలుపు వివాదాస్పదంగా మారింది. దీంతో ప్రపంచ దేశాలు నిట్ట నిలువుగా చీలిపోతున్నాయి.. పాత పగలన్నీ తిరిగి తోడుకుంటున్నాయి. అగ్రరాజ్య గుత్తాధిపత్యానికి తెర దించాలని కొన్ని దేశాలు ప్రయత్నిస్తే అగ్రరాజ్యపు అడుగుజాడల్లో నడిచేందుకు మరికొన్ని దేశాలు తప్పక తలవంచాల్సిన పరిస్థితి.
ఇప్పటికే..ఇజ్రాయిల్ , ఇరాన్ దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. ఇరాన్ కయ్యానికి కాలుదువ్వుతోంది. ఐక్యరాజ్య సమితి ఆంక్షలను ఇరాన్ బేఖాతరు చేసింది. టెహ్రాన్ లో అణుప్రదర్శన నిర్వహించారు. ఇరాన్ అణురియాక్టర్ లో యురేనియం రాడ్లను నింపింది. ఇరాన్ ని ఏకాకిగా చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. చైనా, రష్యాలు ఇరాన్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఇప్పటికే యూరప్ లోని ఆరు దేశాలకు ఇరాన్ చమురు సరఫరాని నిలిపివేసింది. గ్రీస్, పో్ర్చుగల్, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్ దేశాలకు ఆయిల్ సరఫరా నిలిపివేసింది. ఆయిల్ సరఫరా చేసే ముఖ్యదేశాలు రెండుగా చీలిపోయాయి. అమెరికా, యూరప్ దేశాలు ఇజ్రాయిల్ కు వెన్నుదన్నుగా ఉన్నాయి.

ఈ సంక్షోభ సమయంలో భారత్ పరిస్థితి ఆడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఎందుకంటే, భారత్‌కి అత్యధికంగా క్రూడ్ సరఫరా చేసే దేశాల్లో ఇరాన్ రెండో స్థానంలో ఉంది. ఇరాన్‌పై ఆంక్షల నేపథ్యంలో భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురు పరిమాణం కూడా భారీగా తగ్గుతోంది. 2010-11లో ఇరాన్ నుంచి భారత్ దాదాపు 9.4 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 47,000 కోట్ల మేర ముడిచమురును దిగుమతి చేసుకుంది. గతేడాది ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో రూ. 15,500 కోట్లు మేర చమురు దిగుమతి చేసుకుంది. ఇరాన్‌పై అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించినప్పటికీ.. వీటిని తోసిరాజని భారత్ ఇప్పటిదాకా ఆ దేశంతో లావాదేవీలు కొనసాగిస్తూనే ఉంది. అయితే, ఇరాన్ నుంచి దిగుమతి చేసుకునే చమురుకి సంబంధించి చెల్లింపులు జరిపే విషయంలో భారత్‌కి సమస్యలు తలెత్తాయి. డాలర్ల బదులు రూపాయి మారకంలో చెల్లింపులు జరిపేందుకు, ఇతర సర్దుబాట్లు చేసేందుకు ఇరు దేశాలు మధ్యే మార్గంగా ఒక పరిష్కారాన్ని కనుగొన్నాయి. దీంతో సమస్య ఒక కొలిక్కి వచ్చినట్టేనని ఇరు దేశాలు భావించాయి. ఇంతలోనే న్యూఢిల్లీలో ఇజ్రాయెల్ దౌత్యకార్యాలయం దగ్గర జరిగిన బాంబు దాడి ఘటన.. ఏదో విధంగా ఇరాన్‌తో వాణిజ్య లావాదేవీలు జరపాలన్న భారత ప్రయత్నాలకు మరింత విఘాతంగా పరిణిమించింది. కాగా భారత్ నుంచి ఇరాన్‌కు భారీ స్థాయిలో బాస్మతి బియ్యం, టీ ఎగుమతి అవుతోంది. విదేశాలకి ఎగుమతయ్యే మొత్తం 2 మిలియన్ టన్నుల పైగా బియ్యం ఎగుమతుల్లో సగభాగం ఇరాన్‌కే వెడుతోంది. ఇప్పటికే రూ. 600 కోట్ల మేర బకాయిలు పేరుకుపోవడంతో సతమతమవుతున్న ఎగుమతిదార్లకు ఇరాన్ కరెన్సీ మారక విలువ క్షీణించడం మరింత ఆందోళనకరంగా మారింది. ప్రపంచదేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణంతో చమురు ధరలు భారీగా పెరగడంతో ఆ ప్రభావం భారత్ పై కూడా పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

No comments:

Post a Comment