ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Thursday, February 16, 2012

అన్నా పై ఆంగ్లేయుల పరిశోధన, పరధ్యానంలో భారతప్రభుత్వం

యావత్ దేశాన్ని కదిలించిన ఒకేఒక్కడు.. పాతాళానికి వేళ్లూనుకున్న అవినీతి మూలాలను కూకటి వేళ్లతో పెకిలించాలని ప్రభుత్వం పై సత్యాగ్రహాన్ని ఎక్కుపెట్టిన అభినవ గాంధీ. ఈ మాటలు అక్షరాలా అన్నా హజారేకి వర్తిస్తాయి.. ప్రఖ్యాత బ్రిటన్ ససెక్స్ యూనివర్సిటీ హజారే ఉద్యమాన్ని పొగడ్తల్లో ముంచెత్తింది. అంతే కాదు హజారే ఉద్యమం పై పరిశోధించేందుకు ఏకంగా ఓ పరిశోధనా కేంద్రాన్నే ఏర్పాటు చేసింది. భారతదేశ పాఠ్యపుస్తకాల్లో పది వాక్యాలకు నోచుకొని హజారే చరిత్ర... బ్రిటన్ ససెక్స్ యూనివర్సిటీకి పరిశోధనాంశంగా మారడంలో మతలబు ఏంటి.. ఇదే ఈ వారం హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం.
అన్నా హజారే.. ఇప్పుడు ఈ పేరు తెలియని ఇండియన్ లేడు. ఏ పార్టీకి చెందని... ఏ పదవిలో లేని సామాజిక ఉద్యమకారుడు. అవినీతికి వ్యతిరేకంగా దేశపౌరులందరినీ ఒక్కతాటి పైకి తెచ్చిన థీశాలి. తెల్లదొరలకు వ్యతిరేకంగా నాడు గాంధీ పోరాడితే.. అవినీతికి వ్యతిరేకంగా నేడు హజారే అదే తీవ్రతలో పోరాడాడు. అదే స్థైర్యం, అదే పంథా, అదే నినాదం. అయితే నాడు స్వచ్ఛందంగా ఉద్యమాల్లో పాల్గొనే కార్యకర్తలు, ఉద్యమకారులున్నారు. కానీ రోజులు మారాయి. పైసలిస్తే గానీ పాదం కదపని ఈ రోజుల్లో ఇంతమందిని తరాల తరబడి పాతుకుపోయిన అవినీతికి వ్యతిరేకంగా అందరినీ ఎలా ఏకం చేయగలిగాడు.. ఇదే ఇప్పుడు బ్రిటన్ విద్యార్ధుల ముందున్న పరిశోధనాంశం.
గాంధీ తరువాత భారత దేశంలో అంతటి ప్రభావశీలిగా తక్కువ సమయంలో పేరు తెచ్చుకున్న అభినవ గాంధీ. భారతదేశాన్ని కొల్లగొడుతున్న విదేశీయుల పై గాంధీ పోరాటం చేస్తే. హజారే స్వదేశాన్ని కొల్లగొట్టి కోట్లు గడిస్తున్న అక్రమార్కుల పై యుద్ధం ప్రకటించాడు. ఆనాటి ఉద్యమంలో దేశ పౌరులంతా కలిసి వచ్చినట్టే.. ఈ అవినీతి వ్యతిరేక ఉద్యమలోనూ దేశ పౌరులంతా కదం తొక్కారు. అయితే వచ్చిన సందేహమల్లా ఒక్కటే.. దేశం మొత్తాన్ని ఏ రాజకీయ శక్తి అండ లేకుండా.. హజారే ఒక్కరే ఎల ాకదిలించ గలిగారా అని. హజారే ఉద్యమం పై రకరకాల విమర్శలు వెలువడ్డా అవేవీ సత్యం ముందు నిలవలేక పోయాయి. హజారే ఉద్యమానికి పౌరులు, మేథావులే స్వచ్ఛందంగా మద్దతునిచ్చారనే విషయం స్పష్టమయింది. అందుకే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. లోక్‌పాల్ బిల్లుకు సరే అంది. అయితే ఈ విషయాన్ని కేంద్రప్రభుత్వం పెద్దగా ప్రచారం చేయలేదు. హజారే వంటి వ్యక్తి సమరస్పూర్తిని పట్టించుకున్న పాపాన పోలేదు.
తొలి అడుగు అన్నా హజారే రూపంలో పడితే ఆ అడుగుకు వేల.. లక్షల.. కోట్ల అడుగులు తోడయ్యాయి. అసలు అన్నా చేస్తున్న ఈ ఉద్యమానికి అంత ఆదరణ ఎందుకు వచ్చినట్లు..? వందల నుంచి వేలు.. వేల నుంచి లక్షలు.. లక్షల నుంచి కోట్ల సంఖ్యలో ప్రజల మద్దతు ఎందుకు పెరిగింది..? అనే ప్రశ్నలను తరిచి చూస్తే మనకు అసలు విషయాలు అర్ధమవుతాయి.
రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు పట్టుమని ఐదేళ్లు తిరగకుండా తమ ఆస్తులను వందలరెట్లు పెంచుకుంటున్నారు. ఏ పార్టీ అయినా ఏ పార్టీకి చెందిన నాయకుడిదైనా ఇదే దారి. ఎవరో కొందరు తప్పించి మిగిలిన వారందరిదీ రహదారే.. అక్రమ మార్గంలో ఆస్తులను కూడగట్టుకునే అడ్డగోలు దారి. దానికి ఆయుధం అధికారం. రాజకీయం. వీటిని అడ్డం పెట్టుకుని ప్రజా ధనాన్ని లూటీ చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. ప్రజల వద్దకు వచ్చినపుడు మాత్రం నీతి వాక్యాలు వల్లిస్తున్నారు. అయితే సగటు భారతీయులు మాత్రం అవినీతి నాయకులతో విసిగిపోయారు. అవినీతికి వ్యతిరేకంగా వచ్చిన ప్రతి సినిమానూ ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. భారతీయుడు, శివాజీ, అపరిచితుడు వంటి సినిమాల్లో తమను తాము హీరోలుగా ఊహించుకొని ఏదో ఒక సందర్భంలో అవినీతిని ప్రశ్నిస్తూనే ఉన్నారు. సరిగ్గా ఇదే సమయంలో అన్నా హజారే అవినీతి పై ఖడ్గం దూశారు. అందుకే మేము సైతం అంటూ యువత పదం పాదం కలిపారు. మీడియా కూడా తన వంతు పాత్ర పోషించడంతో హజారే పతాక విశ్వయవనిక పై రెపరెపలాడింది.
మరో మహా సంగ్రామానికి తెరలేచింది. అయితే మన సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామ్య దేశంలో గెలిచిన వాడు రాసిందే చరిత్ర... రాజు చేసిందే ఘనకార్యం.. సామాన్యుడు రాజ్యానికి ఎదురు మాట్లాడితే అది తప్పు. అది ఒప్పేనని తమను గెలిపించిన కోట్లాది మంది ప్రజలు నొక్కి చెప్పినా అది అధికారంలో ఉన్నవారికి వినిపించదు. వినిపించినా నెత్తికెక్కదు. ఒకవేళ వారికి కూడా అది ఒప్పే అనిపించినా అది తాము చేసిన గొప్పతనంగా తీర్చిదిద్దుకొని రాజకీయ ప్రయోజనాలు పొందాలి. అందుకే అన్నా చేసిన ప్రయత్నాన్ని కాలగర్భంలో కలిపి లోక్‌పాల్ ప్రవేశ పెట్టిన ఘనత తమదే అని ఎన్నికల్లో చాటుకొనే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. అంటే అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన అన్నా ఉద్యమాన్నే తమ అక్రమానికి ఉక్కు కవచంగా వాడుకొనే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ ఉద్యమం నా చేత, నా వలన, ప్రజల కొరకు చేసిందని అన్నా చెప్పుకోవలసిన పరిస్థితి తెస్తున్నారు. ప్రభుత్వాల భవిష్యత్ వ్యూహాలు ఇలా ఉంటే అన్నా కోసం విద్యాబుద్దులు నేర్చుకునే విద్యార్ధుల పాఠ్యపుస్తకాల్లో రెండు పేజీల్లో చోటు ఆశించడం అత్యాశే అవుతుందేమో... కానీ బ్రిటన్ యూనివర్సిటీ హజారే ఉద్యమాన్ని ఒక పరిశోధనా అంశంగా స్వీకరించింది. ఎందుకంటే బ్రిటన్ అమాంతంగా అన్నా హజారేను ఎత్తుకుంటే వాళ్లకొచ్చే నష్టం లేదు. వాళ్ల థియరీ వల్ల ఒక కొత్త అంశం కనిపెట్టామనే తృప్తి లభిస్తుంది. సామాజిక శాస్త్రంలో జనసమీకరణకు ఓ కొత్త ఫార్మలాను కనుక్కొగలుగుతారు. ప్రజలను కదిలించాలంటే ఏఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలో కనిపెట్టగలుగుతారు. భౌషా బ్రిటన్ ససెక్స్ యూనివర్సిటీ అన్నా పై రూపొందించిన పూర్తి సిద్ధాంతాన్ని మనం తెలుగులోకి, హిందీలోకి తర్జుమా చేసి చదువుకోవాలేమో. అంతే కాదు.. అవునా మన అన్నా ఇంత గొప్పవాడా అని బ్రిటన్ పుస్తకాలు చదివి తెలుసుకోవాలేమే.. అవును మన వారసత్వ సంపదంగా బ్రిటీష్ దేశాల్లో పదిలంగా ఉంది. అందుకే ఈ అవినీతి నాయకుల కంటే తెల్లదొరలే నయం అన్న జనవాక్యాన్ని మన నేతలు నిజం చేస్తున్నారు. ఎందుకంటే నథింగ్ ఈజ్ బెటర్ దేన్ సంథింగ్.

No comments:

Post a Comment