Thursday, February 16, 2012
ఎవడి వెనుక కథేందో ఇక్కడ తెలుస్తుంది..
ఎన్నికల నగారా మోగింది. ఈ ఉప ఎన్నికలు రాజకీయ పార్టీలకు అగ్ని పరీక్షగా నిలవబోతున్నాయి. ప్రధాన రాజకీయ పక్షాలన్నీ తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఏడుస్థానాలకు గానూ తెలంగాణలోనే ఆరు స్థానాలకు గట్టి పోటీ జరగబోతోంద. ఏఏ స్థానాల్లో ఏఏ పార్టీల బలా బలాలు ఎలా ఉన్నాయి. ఎవరు బరిలోకి దిగబోతున్నారు అనే అంశం పై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం.
ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్న ప్రధాన పార్టీలన్నీ తమ సత్తా చాటేందుకు అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే ఈ ఎన్నికలు ఇటు టీడీపీకి అటు కాంగ్రెస్ పార్టీకి అగ్ని పరీక్షగా నిలవబోతున్నాయి. ఎందుకంటే తెలంగాణలో ఖాళీ అయిన ఆరుస్థానాల్లో మూడు టీడీపీ సిట్టింగ్ స్థానాలయితే, రెండు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలు కాగా ఒకటి కాంగ్రెస్ అసోసియేటెడ్ ఇండిపెండెంట్ స్థానం. అంటే టీడీపీ, కాంగ్రెస్ రెండూ చెరి మూడు స్థానాల్లో తమ సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకోడానికి కసరత్తు చేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ విధానాలను విభేదిస్తూ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నలు పార్టీకి వీడ్కోలు పలికి తమ పదవులకు రాజీనామా చేశారు. వీరిలో కామారెడ్డి ఎమ్మెల్యే గంపా గోవర్దన్ , ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నలు టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. కానీ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి మాత్రం తెలంగాణ నగార భేరి పేరుతో వేదిక స్థాపించుకొని స్వతంత్ర అభ్యర్ధిగానే కొనసాగుతున్నారు. ఈ మూడు స్థానాల్లోనూ టీడీపీ తన సత్తా చాటుకునేందుకు సమాయత్తమవుతోంది.. ఇటు కోస్తాంధ్ర ప్రాంతానికి వస్తే నెల్లూరు జిల్లా కోవూర్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమర్ రెడ్డి కూడా జగన్ శిభిరంలో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను స్పీకర్ ఆమోదించడంతో ఈ స్థానంలో కూడా టీడీపీ తన సత్తా చాటాల్సి వచ్చింది.
తెలంగాణ ప్రాంతంలో ఖాళీ అయిన ఆరుస్థానాల్లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలు రెండు, అసోసియేటెడ్ స్థానం ఒకటి ఉంది. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య, కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావులు తెలంగాణ ఉద్యమ సమయంలో తమ పదవులకు రాజీనామా చేసి టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి ఇండిపెండెంట్‌గా గెలిచనప్పటికీ కాంగ్రెస్ అసోసియేట్ మెంబర్ గా కొనసాగుతున్నారు. ఈయన అకాల మరణంతో ఆ స్థానం కూడా ఖాళీ అయింది. దీంతో ఈ మూడు స్థానాల్లో కాంగ్రెస్ తన పట్టు నిలబెట్టుకొనే ప్రయత్నం చేస్తోంది.
కామారెడ్డి, ఆదిలాబాద్ స్థానాల్లో టీడీపీ నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల ఇక్కడ తమ గెలుపు నల్లెరు పై నడగానే భావిస్తున్నారు. ఇక్కడ వారు దాదాపు ప్రచారంలో ముందున్నారనే చెప్పాలి. దీనికి తోడు తెలంగాణ సెంటిమెంట్ బాగా పనిచేస్తుందనే అంచనాల్లో ఉన్నారు. అయితే గతంలో బాన్సువాడ ఉప ఎన్నికల్లో చేసిన తప్పు చేయకుండా తమ అభ్యర్ధులను రంగంలోకి దింపడమే కాకుండా వీలైనంత వరకు విజయ ఢంకా మోగించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. నాగర్ కర్నూల్ నుంచి టీడీపీ తరపున ఎన్నికై రాజీనామా చేసిన ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డికి కూడా ఇది పరీక్షాకాలమనే చెప్పొచ్చు. ఎందుకంటే టీడీపీకి గట్టి పట్టున్న నాగర్ కర్నూల్ లో నాగం రాజీనామా చేసి మళ్లీ ఏ రాజకీయ పార్టీ తీర్ధం పుచ్చుకోకుండా ఇండిపెండెంట్ గా బరిలో నిల్చుంటున్నారు. ఈ స్థానంలో టీఆర్ఎస్ తమ అభ్యర్ధిని పోటీకి నిలబెట్టే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నాగం జనార్దన్ రెడ్డికి మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి. అయినా నాగం కు కష్టాలు తప్పెటట్టు లేవు. టీడీపీ తన క్యాడర్‌ను బలపరురస్తోంది. మరోవైపు బలమైన ఆర్ధిక పునాదులున్న జనార్ధన్ రెడ్డి పేరు కలిగిన ప్రముఖ వస్త్ర వ్యాపారి జేసీ బ్రదర్స్ యజమాని మర్రి జనార్ధన్ రెడ్డిని రంగంలోకి దించాలని తెదేపా అధినాయకత్వం నిర్ణయించి, ఈ మేరకు సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఆయన కూడా అదే నియోజకవర్గానికి చెందినవారు కావడం, ఆర్థికంగా స్థితిమంతుడు కావడంతో ఒక్కసారిగా అక్కడ పోటీ రసవత్తరంగా మారింది.
అంతేకాక మరి కొందరు జనార్ధన్ రెడ్డి పేరు కలిగిన వారిని స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేయించవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
కాంగ్రెస్ విషయానికి వస్తే స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగబోతున్నారు. ఈ స్థానంలో కాంగ్రెస్ తన పట్టు నిలపుకోవలసి ఉంది. కొల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పదికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావుకు కూడా ఈ ఎన్నికలు అగ్ని పరీక్షాగానే నిలవబోతున్నాయి. జూపల్లి కాంగ్రెస్ లో ఉన్నప్పటికే అదే జిల్లాకు చెందిన మంత్రి డీకే అరుణకు జూపల్లికి పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా డీకే అరుణ ఈ ఎన్నికల్లో తన పవరేంటో చూపించేందుకు అస్త్రాలు సిద్ధం చేస్తోంది. మరోవైపు పాలమూర్ నుంచి ఎన్నికయి అకాల మరణం చెందిన రాజేశ్వర్ రెడ్డి భార్యను బరిలో దింపేందుకు టీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది.
నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి టీడీపీ నుంచి ఎన్నికై జగన్ శిబిరంలో చేరిన నల్లపురెడ్డి ప్రసన్న కుమర్ రెడ్డి తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సిద్ధమవుతున్నారు. ఈ స్థానం వైయస్సార్ పార్టీకి కైవసమైతే రాష్ట్రంలో రెండు ఎమ్మెల్యే స్థానాలు దక్కించుకోవడంతో పాటు వేటుకు సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేలకు ఆత్మ విశ్వాసం కలిగినట్లవుతుంది. తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్ధులను పోటీకి దించబోమని ప్రకటించినా తరువాత పరిణామాల్లో ఏంచేయబోతుందోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఈ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ బలాబలాలను నిరూపించుకునేందుకు వ్యూహ ప్రతి వ్యూహాలతో, అస్త్ర శస్త్రాలతో సిద్ధమవుతున్నాయి.
Subscribe to:
Post Comments (Atom)
మీ మ్యాప్ లో కాశ్మీర్ లేచిపోయింది.
ReplyDeleteఅది గూగుల్ లోంచి తీసుకున్నాను. కనిపెట్టలేదు. చెప్పినందుకు థాంక్స్
ReplyDelete