ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Saturday, February 4, 2012

నేరం మాది కాదు బాబయ్య అంటున్న ఐఏఎస్‌ అధికారులు



ప్రభుత్వ వ్యవహారాల గుట్టంతా తెలుసుకొని.. అవసరానికి తగ్గట్టు మసలుకొంటూ.. గుట్టు చప్పుడు కాకుండా పాలనా వ్యవహారాలు చక్కదిద్దే ఐఏఎస్ లు నోరు విప్పారు. ప్రభుత్వ ఉత్తర్వులను తూచా తప్పకుండా అమలు చేయడమే తమ విధి అని.. అయితే ఆ ఉత్తర్వుల వలన ప్రజా ధనం దుర్వినియోగం అయితే ఉత్తర్వులను ఇచ్చిన వారిని వదిలి అమలు చేసిన వారిని నేరస్థులుగా పరిగణించడం తగదన్నారు. కేబినెట్ ఉత్తర్వుల వలన కొన్ని ఇబ్బందులు ఎదరవుతాయని తెలిసినా పబ్లిక్ సర్వెంట్ లుగా అమలు చేయక తప్పని పరిస్థితి ఉంటుందని.. ప్రభుత్వ ఉత్తర్వులు అమలు చేసిన పాపానికి అత్యున్నత హోదాలో ఉండి కూడా అవమానాల పాలు కావలిసి వస్తుందని ఐఏఎస్ లు ఆవేదన వ్యక్తం చేశారు.
తప్పొకరు చేస్తే శిక్ష మరొకరికా ?
మంత్రులకో న్యాయం అధికారులకో న్యాయమా ?
అరెస్టులు శిక్షలు కావా ?
అవినీతి ఆరోపణల్లో అరెస్టయితే అవమానం కాదా ?
అవమానానికి మించిన శిక్ష ఉంటుందా ?
మంత్రులను విచారించేది పేషీల్లో... తమను కస్టడీలోనా ?
సీబీఐకి బిజినెస్ రూల్స్ తెలుసా..?
సీబీఐ టీంలో రిటైర్డ్ ఐఏఎస్ తప్పనిసరి
డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ హోదాలో రాజ్యాంగాన్ని... ప్రభుత్వ ఉత్వర్వులను అమలు చేస్తూ పాలనా వ్యవహారాలు చక్కబెట్టే అధికారులు వారు. ఇప్పుడు తమకు న్యాయం కావాలంటూ మీడియా ముందుకు వచ్చారు. రోజు రోజుకూ అవినీతి కేసుల్లో అరెస్టవుతున్న ఐఏఎస్ అధికారుల జాబితా పెరుగుతుండటంతో ఐఏఎస్‌లంతా ఒక్కటయ్యారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని ముఖ్యమంత్రికి విన్నవించారు.. ప్రభుత్వ ఉత్తర్వులు అమలు చేయడమే తమ విధి అని... ఆ ఉత్తర్వుల వలన మంచి జరిగినా, చెడు జరిగినా.. ఆ ఘనత ప్రభుత్వాన్ని నడిపించే మంత్రులదే తప్ప తమది కాదని తేల్చి చెప్పారు. అలాగని అధికారుల తప్పు లేదని తాము లేదని వాదించడం లేదన్నారు. అధికారులెవరైనా ప్రభుత్వ ఉత్తర్వులను తప్పుదోవ పట్టిస్తే విచారించాల్సిందే కానీ చట్టం దృష్టిలో అంతా సమానమే అన్న సూత్రాన్ని మరువరాదని ఐఏఎస్‌ల సంఘం గుర్తు చేసింది. కీలక నిర్ణయాలకు సంబంధించిన ఉత్తర్వులను వెలువరించిన మంత్రులను వదిలి ఆ ఉత్తర్వులను అమలు చేసిన తమను అక్రమాలకు కారకులుగా సీబీఐ వేధించడం శోచనీయమన్నారు. జీ.వోల వల్ల తప్పు జరిగితే దాన్నికి ముమ్మాటికీ మంత్రులే బాధ్యత వహించాలని కుండబద్దలు కొట్టారు. సీబీఐ బిజినెస్ రూల్స్ తెలుసుకొని మసలుకోవాలన్నారు.
అవినీతి ఆరోపణలతో అరెస్టు చేసినా బెయిల్ తో బయటకు రావచ్చు కదా.. చార్జి షీట్ దాఖలయినంత మాత్రాన నేరస్థులు కారని.. కోర్టులో తమ నిర్ధోషిత్వాన్ని రుజువు చేసుకొనే అవకాశం ఉందని ముఖ్యమంత్రితో సహా పలువురు వ్యాఖ్యానించడాన్ని ఐఏఎస్‌లు తప్పు బట్టారు. నిజానిజాలు తెలుసుకోకుండా.. విచారణ పేరుతో సీబీఐ తమను అవినీతి కేసుల్లో విచారణ నిమిత్తం అరెస్టు చేస్తే... దాన్ని మీడియా చిలువలు పలువలు చేసి చూపిస్తుందన్నారు. దీంతో బంధువర్గంలోనూ.. సివిల్ సొసైటీలోనూ ఒక ముద్దాయిగా ముద్రపడుతుందన్నారు. కోర్టు తీర్పు వెలువడే వరకు ఈ అవమానాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేశారు. సస్పెన్షన్ ఈజ్ నాటే పనిష్మెంట్ అనే సూత్రం తప్పని.. సస్పెన్షన్ అయిన వాడిని చిన్న చూపు చూస్తారని.. అలాగే తమను కూడా సీబీఐ అరెస్టు చేస్తే అవినీతి పరుడిగానే చూస్తారన్నారు. మీడియా, సీబీఐ మంత్రులను, అధికారులను సమదృష్టితో చూడాలని కోరారు. అక్రమాలకు బాధ్యులైన మంత్రులను పేషీల్లో విచారించి తమను మాత్రం కస్టడీలో విచారించడం ఏ న్యాయ విలువల్లో భాగమని ప్రశ్నించారు.
ప్రభుత్వం పై యుద్ధం ప్రకటించడమో.. లేక పోరాట బాట పట్టడమో తమ అభిమతం కాదని.. జరుగుతున్న అన్యాయాన్ని మీడియా ద్వారా ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి తెలియజేయడమే తమ అభిమతమని ఐఏఎస్‌ల సంఘం తెలిపింది.
రకరకాల మంత్రుల వద్దా.. ముఖ్యమంత్రుల వద్దా కీలక నిర్ణయాలలో క్రియాశీల పాత్ర పోషించే అధికారులు అలక బూనారు. ఐఏఎస్ అంటే పాలనా వ్యవస్థ పైన గట్టి పట్టుంటుంనే ఉద్దేశ్యంతో మంత్రులు వివిధ రకాల నిర్ణయాలు తీసుకునే టప్పుడు వారిని ఒకటి రెండు సార్లు సంప్రదిస్తారు. గతంలో పనిచేసిన మంత్రులు ముఖ్యమంత్రులు ఐఏఎస్ ల సలహాలతోనే చాలా నిర‌్ణయాలు తీసుకున్న చరిత్ర ఉంది. ఆ నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదురైతే ఆ తప్పును కప్పిపుచ్చి గండం గట్టెక్కించిన సందర్భాలూ ఉన్నాయి. కానీ ఇప్పుడు నిర్ణయాలు సొంతంగా తీసుకొని తప్పుకు అధికారులను బాధ్యులుగా చేసే సంప్రదాయం మొదలవడంతో ఐఏఎస్‌లు నోరువిప్పారు. ఇక ముందు నుంచి మంత్రులు ఇచ్చిన ఉత్తర్వుల వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందనో లేక తాము చిక్కుకుంటామని అనుమానం వచ్చినా ఆ ఉత్తర్వులను సంఘంలో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

2 comments:

  1. By looking at the cars in which the IAS's arrived to the meeting will show how rich these people are. Are they really bought those cars with their salaries alone????

    ReplyDelete
  2. బాబూ ఐయ్యేఎస్సులూ నిజంగా మీరే పాపం ఎరగకపోతే మీకేమిటి భయం...? మీరు నిజంగా నిజాయితీ పరులైతే ఉద్యోగంలోకి రాకముందు మి మరియు "మిసంబంధీకుల" ఆస్తులెంత? ఇప్పుడెంత ధైర్యంగా ప్రకటించండి చూద్దం!!! ఎంత నిజాయతీ ఉన్నదో మీ మాటల్లో.... సీబీఐ కూడా రాజ్యానగ బధమైన సంస్థే. దానికి సహకరించటం మీ విధి అని మా లాంటి సామాన్యుల చేత చెప్పించుకోవటం విడ్డూరంగా ఉన్నది.

    ReplyDelete