Wednesday, February 8, 2012
సమ్మక్క సారలమ్మలు కొండదేవరలెందుకయ్యారు..?
సమ్మక్క సారలమ్మలు కొండదేవరలెందుకయ్యారు..?
ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతర సమ్మక్క సారలమ్మ జాతర... ఇంత పేరు మోసిన ఈ జాతరలో వేద మంత్రాలు, హోమగుండాలేవీ ఉండవు. కేవలం నమ్మకంతోనే నడిచే జాతర ఇది.. గిరిజనుల కొంగు బంగారంగా విలసిల్లే ఈ దేవరలకు... బెల్లాన్ని బంగారంగా ముడుపు చెల్లిస్తే చాలు కోరిన కోరికలు తీరుస్తారనే నమ్మకం గిరిజనులది... వీరికి పూజలు చేసే అధికారం కేవలం గిరిజనులకే సొంతమా.. ఎప్పటి నుంచి వస్తుందీ ఆచారం. సమ్మక్క సారలమ్మలు గిరిజన దేవరలు ఎలా అయ్యారో... కథనం.
కాకతీయ రాజు చేతిలో వీరమరణం చెందిన గిరిజన వీరనారీమణులు సమ్మక్క సారలమ్మలు.. వీరు చిలకలగుట్ట వద్ద కుంకుమ భరిణలుగా వెలిసి గిరిజనుల పాలిట కొంగు బంగారంగా పూజలందుకుంటున్నారు. తొలుత గిరిజన గూడేలకే పరిమితమైన ఈ జాతర ఇప్పుడు ఖండాంతరాలు వ్యాపించింది. అందుకే ఈ జాతరను ప్రభుత్వం స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించింద.ి
సమ్మక్క-సారలమ్మలు మరణించిన చోట గద్దెలు నిర్మించి, వారి ప్రతిమలుగా కొయ్యలను ప్రతిష్టించారు. వీటినే దేవరగా భావించి కోయలు పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తున్నారు. తమ వీర వనితలైన సమ్మక్క సారలమ్మలను దేవతా స్వరూపాలుగా భావిస్తూ ప్రతి కార్యక్రమంలో గుర్తు చేసుకుని స్ఫూర్తి పొందుతారు. మేడారం అతిచిన్న గిరిజన గ్రామం. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన అరణ్య ప్రాంతంలో ఇది ఉంది. ఈ గ్రామంలోనే సమ్మక్క-సారలమ్మ జాతర జరుగుతుంది. అందుకే, ‘ఈ జాతరను గిరిజనులు నిర్వహిస్తారు కాబట్టి గిరిజన జాతరగానూ పిలుస్తున్నారు.
సమ్మక్క-సారలమ్మ దేవతలకు జాతరను నిర్వహించే గిరిజనులు ఎవరు? ఆ పూజారులు ఎవరు? ఆ హక్కు అందరికీ ఉంటుందా? సమ్మక్క సారలమ్మలకు గిరిజనులకు సంబంధం ఏమిటి? ఎందుకు సమ్మక్క-సారలమ్మ జాతర చేస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే జాతర మూలాల్లోకి వెళ్లాలి. సమ్మక్క-సారలమ్మ జాతరను నిర్వహించేది కోయతెగకు చెందిన గిరిజనులు. మళ్లీ ఇందులోనే 12 రకాల కోయ తెగల వారున్నారు. ఈ కోయల్లో వరంగల్ జిల్లాలో రాచకోయ వారున్నారు. ఈ తెగకు చెందిన కోయలే మేడారం సమ్మక్క-సారలమ్మల జాతరను నిర్వహిస్తున్నారు. వీరే దీనికి హక్కుదారులు, పూజారులు. పూజారులనే కోయలు వడ్డెలు అని కూడా అంటారు.
కోయ తెగలో గోత్రాలుంటాయి. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క దేవత ఇలవేల్పుగా ఉంటుంది. సమ్మక్కకు పూజారులు... అంటే వడ్డెలు... వారెవరంటే సిద్ధబోయిన, కక్కెర అనే ఇంటిపేరు గల వాళ్లు.
సారలమ్మ 4వ గోత్రికం వారికి ఇలవేల్పు. కేవలం కాక అనే ఇంటి పేరు గల వాళ్లు సారలమ్మకు వడ్డెలు. 4వ గోత్రికం వారికి ఇలవేల్పుగా పగిడిద్ద రాజును పూజిస్తారు . పెనక అనే ఇంటిపేరు గలవాళ్లు పగిడిద్ద రాజుకు వడ్డెలు. 6వ గోత్రికం వారికి గోవిందరాజులును ఇలవేల్పుగా పూజిస్తారు . ‘దబ్బగట్ల’ అనే ఇంటిపేరు గల వాళ్లు గోవిందరాజుకు పూజారులుగా వ్యవహరిస్తారు. మొత్తంగా సమ్మక్క సారలమ్మ జాతరకు కోయ గిరిజన తెగకు చెందిన రాచకోయ వారు హక్కుదారులుగా ఉన్నారు. ముందే చెప్పినట్టు కోయ సంప్రదాయం ప్రకారం కేవలం ఆయా గోత్రాలకు సంబంధించిన వాళ్లు మాత్రమే పూజారులుగా వ్యవహరిస్తారు.
సమ్మక్క సారలమ్మల జాతర పూర్వం నుంచి 1947 వరకు మేడారం గ్రామం కులపెద్ద ఆధ్వర్యంలో నడిచేది. మొదట గ్రామ సామూహిక పండుగ. తర్వాత కోయల తెగ పరిమితిలో, అనంతరం పెరిగిపోయి, గిరిజనుల, గిరిజనేరుతరుల ప్రవేశంతో పెద్దదిగా మారింది. ఆదాయం పెరిగి 1947లో రెవెన్యూ స్వాధీనంలోకి వెళ్ళింది. 1962లో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోకి వెళ్లడంతో కోయలు తమకు హక్కులు కల్పించాలన్న డిమాండ్‌తో కోర్టుకు వెళ్లారు. హైకోర్టు కోయ వడ్డెలకు 1/3 వంతు జాతర ఆదాయం ఇవ్వాలని తీర్పు ఇస్తూ వీరికి హక్కులు కల్పించారు.
Subscribe to:
Post Comments (Atom)
baagundi mee post.. mana telangaana jaataralu gurtukostunnaayi...
ReplyDelete