ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Friday, March 2, 2012

వివాదంలో తెలంగాణ భవన్ - అంతా అధికారికమేనన్న టీఆర్ఎస్



తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ రోజుకొకరు మీడియా ముందుకు వస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించినందున ఆ భూమిని ప్రభుత్వ వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మొన్న జగ్గారెడ్డి, నిన్న షబ్బీర్ అలి, నేడు కేసీఆర్ మేనల్లుడు ఉమేశ్ రావు... అందరిదీ ఒకటే మాట.. తెలంగాణ భవన్‌లో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని.. ఇంతకీ తెలంగాణ భవన్ వివాదం వెనుక నేపథ్యం ఏంటి... హెచ్ఎంటీవీ అందించే ప్రత్యేక కథనం

తెలంగాణలో ఉప ఎన్నికల కాక ఎండాకాలపు వేడిని మించి సెగలు కక్కుతోంది... ఆరోపణలు ప్రత్యారోపణలతో ప్రత్యర్ధులు పరస్పరం విమర్శల వర్షం గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. . ఈ విమర్శలకు కారణాలేంటి? వివాదానికి మూలాలేంటి.. ఈ వివాదం ఎటు దారితీయబోతోంది....

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో నిబంధనలు ఉల్లంఘించి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారంటూ రోజుకొకరు మీడియా ముందుకు వస్తున్నారు. మొన్న జగ్గారెడ్డి. నిన్న షబ్బీర్ అలీ. నేడు ఉమేశ్ రావు. అందరూ చెప్పేది ఒక్కటే మాట.. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణ భవన్ ను వ్యాపార కేంద్రంగా మార్చారని.... నిబంధనలు ఉల్లంఘించినందును ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ టీఆర్ఎస్ భవన్ లో ఏం జరుగుతోంది..
తెలంగాణ రాష్ట్ర సమితి స్థలం ఎప్పుడు కేటాయించారు ?
తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయమని చెబుతున్న టీఆరెస్....గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. ... 2004లో కాంగ్రెస్‌ పార్టీ అధికారలోకి వచ్చింది. తమ పార్టీ కార్యాలయ నిర్మాణం కోస స్థలం కేటాయించాల్సిందిగా టీఆర్‌ఎస్ అభ్యర్ధించింది. దీనికి స్పందించిన రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం భూమిని కేటాయించింది.
ఎంత భూమిని కేటాయించారు ?
కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితికి.... షేక్ పేట రెవిన్యూ పరిధిలో... రోడ్ నంబర్ 12 బంజరా హిల్స్‌లో గల ప్రభుత్వ స్థలంలో ఒక ఎకరం స్థలాన్ని కేటాయించారు. దీని కోసం నవంబర్ 27, 2004 తేదీన జీవో నంబర్ 966తో ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందిన పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ఈ స్థలంలో పార్టీ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. ఈ స్థలాన్ని ఏ ఇతర కార్యక్రమాలకు అంటే వ్యాపార సంస్థలకు గానీ... నివాససముదాయంగా కానీ వాడకూడదు. స్థలం కేటాయించిన తేదీ నుంచి సంవత్సరం లోపే కార్యాలయ భవనాన్ని నిర్మించాలని తెలిపారు. ఈ నియమాల్లో దేన్ని ఉల్లంఘించినా అందులో ఉన్న భవన సముదాయాలతో పాటు అన్నీ వెనక్కు తీసుకుంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
టీఆర్ఎస్ పార్టీకి కేటాయించిన స్థలం రేటెంత ?
పార్టీ కార్యాలయం కోసం కేటాయించన ఈ స్థలానికి ప్రభుత్వ నామ మాత్రపు ధరను నిర్ణయించింది. అప్పట్లో ఆ ప్రాంతలో గజం కొన్ని వేల రూపాలకు పై చిలుకు ధర పలుకుతోంది. కానీ ప్రభుత్వం..గజం వంద రూపాయల ధరగా నిర్ణయించింది. అంటే మొత్తం 4840 గజాలకు గానూ.. నాలుగు లక్షల ఎనభై నాలుగు వేలకు ఈ స్థలాన్ని కొనుగలు చేసింది. స్థలం కేటాయించిన మరుక్షణం నుంచే భవన నిర్మాణానికి పునాదులు వేశారు. తెలంగాణ భవన్ పేరుతో పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు.
ఇప్పుడు దాని విలువ ఎంత ఉంటుంది ?
శ్రీమంతులు నివాసం ఉండే అత్యంత ఖరీదైన బంజారా హిల్స్ ప్రాంతంలో అతి తక్కువ ధరకే పొందిన ఈ స్థలం విలువే కోట్లలో ఉంటుంది. మరి ఆ స్థలంలో మైసూరు ప్యాలస్‌ను తలపిస్తూ నిర్మించిన భవనం గురించి ఇక మాట్లాడనక్కర్లేదు. ఇప్పుడు విమర్వలకు కేంద్రమైంది ఈ భవనమే...
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం కోసం స్థలం కేటాయించడమే ఆలస్యం.. భవన నిర్మాణం చేపట్టింది. ప్రజా ప్రతినిధులకు గదులు, పార్టీలోని వివిధ విభాగాలకు కాన్ఫరెన్స్ హాల్స్, పార్కింగ్ అన్నీ నిర్మించారు. ఎనిమిది సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ తన కార్యకలాపాలన్నీ ఇక్కణ్నుంచే సాగిస్తోంది. అయితే ఎనమిదేళ్లుగా లేని వివాదం ఇప్పుడే ఎందుకొచ్చింది? అసలు వివాదమేంటి?
ఎనిమిది సంవత్సరాలుగా తెలంగాణ భవన్ లో పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కానీ గత కొంత కాలంగా తెలంగాణ భవన్ ను వివాదాలు వెంటాడుతున్నాయి.
తెలంగాణ భవన్ పై నెలకొన్న వివాదం ఏంటి ?
తెలంగాణ భవన్‌ను పార్టీ కార్యకలాపాలతో బాటు వ్యాపార కార్యకాలాపాలు కూడా వాడుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ కార్యాలయం కోసం స్థలం కేటాయించేటపుడు విధించిన నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణ భవన్ లో ఒక టీవీ చానల్‌ను నిర్వహించడం వ్యాపారమే అని విమర్శకుల అభిప్రాయం...గతంలో ఇదే విషయం పై జగ్గారెడ్డి విమర్శలు చేశారు. తాజాగా షబ్బీర్ అలి కూడా అవే వ్యాఖ్యలు చేయడంతో బాటు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
ఇప్పడు తెరపై కేసీఆర్ కుటుంబీకులు కూడా వచ్చారు. స్వయానా కేసీఆర్ మేనల్లుడు ఉమేశ్ రావు తన మేనమామపై ఇదే విషయంపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. . ఉద్యమం పేరుతో తెలంగాణ భవన్ ను తన స్వార్థప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. పార్టీ కార్యాలయాన్ని... ప్రైవేటు కార్యక్రమాలకు ఉపయోగించడాన్ని ఉమేశ్ తప్పుపట్టారు. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కోసం గజం వంద రూపాయలకు ఆ స్థలాన్ని కేటాయించారని... ఈ స్థలంలో కేవలం పార్టీ కార్యకలాపాలే నిర్వహించాలి తప్ప ఎటువంటి వ్యాపార కార్యకలాపాలకు గానీ, నివాస సముదాయలు గానీ నిర్మించకూడదన్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నిబంధనలను ఉల్లంఘించి తెలంగాణ భవన్ లో టీవీ ఛానల్ ను నడుపుతున్నారన్నారు. ఈ ఛానల్లో ఆయన సామాజిక వర్గానికి చెందిన వారితో బాటు ఆయన కుటుంబ సభ్యులు భాగస్థులుగా ఉంటూ లాభాలార్జిస్తున్నారని తెలిపారు. దీంతో బాటు పార్టీ కార్యాలయం ట్రస్టీ సభ్యుల వివరాలు కూడా బయటపెట్టాలన్నారు.
నిబంధనలు ఉల్లంఘించి స్వార్ధ ప్రయోజనాలకు ప్రభుత్వ భూమిని వాడుకున్నందుకు గానీ ఆ భూమిని తిరిగి వెనక్కు తీసుకోవాలని ఉమేశ్ ప్రభుత్వాన్ని కోరారు.
ఈ వివాదానికి అసలు కారణం...టీవీ చానల్ నిర్వాహణేనా? లేక ఉపఎన్నికల సమయంలో టీఆరెస్‌ను ఇరుకున పెట్టేందుకు చేస్తన్నా రాజకీయ వ్యూహమా? ఏడాదిన్నరగా లేని అభ్యంతరాలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి?
వివాదానికి కారణం ఏంటి ?
తెలంగాణా భవన్‌లో చానల్ ప్రారంభమై ఏడాదిన్నర కావొస్తోంది. ఈ చానెల్ అధికార కాంగ్రెస్‌తో సహా ఇతర పార్టీలపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారనేది పార్టీల అభిప్రాయం. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఆ చానల్‌ను తమపై దుష్‌ప్రచారం చేయడానికే ఉపయోగిస్తున్నారని మిగతా పార్టీలు భావిస్తున్నాయి. ...ఈ ప్రభావంతోనే గత ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ ఓటమి చవిచూడాల్సి వచ్చిందని డి.శ్రీనివాస్ ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు.. దీనికి తోడు త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రాంతంలో ఆ చానెల్ తమకు వ్యతిరేకంగా ప్రభావం చూపిస్తుందని మిగతా పార్టీలు భావిస్తున్నాయి. ఈ ప్రాంతలో గట్టి పట్టున్న టీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టేందుకే ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చారన్న వాదన ఉంది.
దీనికి టీఆర్ఎస్ ఏమంటోంది ?
తెలంగాణ భవన్ పై వస్తున్న వ్యాఖ్యల పై ఇప్పటి వరకు అధికారికంగా ఆ పార్టీ ముఖ్యులెవరూ వ్యాఖ్యానించనప్పటికీ.. ఈ వివాదాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఉద్యమ పార్టీలకు సహజంగానే సొంత పత్రికలుంటాయని దానిలో బాగంగానే.. సీపీఎం పార్టీ ప్రజాశక్తిని, సీపీఐ పార్టీ విశాలాంధ్రను, న్యూడెమోక్రసీ ప్రజాపంథ వంటి పత్రికలను పార్టీ కార్యాలయాల్లోనే నడిపిస్తున్నాయని.. అందులో బాగంగానే టీఆర్ఎస్ పార్టీ ఓ చానల్ నడుపుతోందని నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ వివాదం ఎటు దారి తీస్తుంది ?
తెలంగాణ భవన్ పై నెలకొన్న వివాదం...తాత్కాలికమేనని, ఎన్నికల తరువాత ఎగిరిపోయేదేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఉప ఎన్నికల్లో తెలంగాణ పవనాలు వీస్తున్న తరుణంలో ఈ తెలంగాణ భవన్ వివాదం ఎటు మలుపు తిరుగుతుందో.. దీని పై ఏఏ పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలంటే మరి కొంత కాలం చూడాల్సిందే.. ఇదీ తెలంగాణ భవన్ వివాదం పై ప్రత్యేక కథనం.
ఉప ఎన్నికల్లో తెలంగాణ పవనాలు వీస్తున్న తరుణంలో ఈ తెలంగాణ భవన్ వివాదం ఎటు మలుపు తిరుగుతుందో.. దీని పై ఏఏ పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలంటే మరి కొంత కాలం చూడాల్సిందే..

No comments:

Post a Comment