Monday, March 5, 2012
రైతులకు కామధేనువు దొరికింది...
భారత దేశ సంప్రదాయంలో గోవులకున్న విలువ అపారం...కానీ కాలం కలిసి రాక.. ఆవులు గోశాల నుంచి వధ శాలలకు వెళుతున్నాయి గానీ.... వాస్తవానికి సకల దేవత నిలయంగా గోమాతను పిలుస్తారు. గోవును దేవతగా పిలవడం... కామధేనుగా భావించడం అనేది అంతా కట్టుకథగా భావించారు. కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం... నిత్య నూతనంగా వస్తున్న పరిశోధనలు గోవు నిజంగా కామధేనువే నని రుజువు చేస్తున్నాయి. గోవులు ఎలా కామధేనులయ్యాయి.. కేవలం పాలిచ్చినంత మాత్రాన గోవులు కామధేనువులా... లేక వయసు ఉడికి మాంసంగా మారినంత మాత్రాన కామధేనుగా మారిందా... ఇంకా ఏమైనా ఉపయోగాలున్నాయా.. కామధేనువు వెనుక దాగిన శతాబ్దాల కథేంటి..
గోవు.. భారతీయుల పాలిట కామధేనువు.. పూర్వం మహర్షులకు కావలసిన కోరికలు చిటికలో తీర్చే శక్తిగల కామధేనువు సంతతే ఈ గోవులు.. వందల మంది అథిధులకు కూడా కావలసిన పదార్ధాలను వండి వార్చడంలో కామధేనును మించిన శక్తిమంతురాలు లేదని పురాణ కథనం.. ఈ కామధేనువు వల్ల రుషుల్లో భేదాభిప్రాయాలు వచ్చాయి.. పూర్వం గో సంపద కోసం యుద్ధాలు కూడా జరిగాయి. దేశంలో పాడి ఎంతగా వర్ధిల్లితే... అంత సుభిక్షంగా ఉంటుందని పెద్దలు చెబుతారు. ఒకప్పుడు పాడి కోసమే ఆవులు కానీ.. ఇప్పుడు ఆవుల నుంచి పాలకు మించిన ఆదాయం ఇతర పదార్ధాల ద్వారా వస్తుందనే విషయం తెలుసుకున్న ఆధునిక శాస్త్రవేత్తలు గోవు నిజంగా కామధేనువేనని ఒప్పుకుంటున్నారు.
పురాతన కాలం నుంచీ భారతీయ సాంప్రదాయంలో పశు సంపదకున్న ప్రాధాన్యం అపరిమితం... గోవును దేవతగా పూజిస్తారు. ఆ మాటకొస్తే సకల దేవతా నిలయం గోమాత అని పురాణాల్లో చెబుతారు. రైతుకు జీవితకాలం నేస్తం గోవులే.. రైతు పొలం సాగు చేయడానికి పండిన పంట ఇంటికి చేర్చడానికి.. పంటకు బలవర్ధకమైన ఎరువు ఇవ్వడానికి... ఇంట్లో పాడి ఇవ్వడానికి రైతుకు చెక్కు చెదరని నేస్తం గోవు.. ఇంత లాభసాటి గోవుకు ఇప్పుడు నిరాదరణ ఎదురవుతోంది.. కాలం కలిసిరాకో... లేక రోజు రోజుకూ పెరుగుతున్న యాంత్రీకరణ విధానం.. రసాయన ఉత్పత్తుల ప్రభావం వల్ల ఆవు కనుమరుగవుతోంది... కానీ విదేశాల్లో ఆవుకున్న ప్రాధాన్యం తెలుసుకొని రోజు రోజుకూ ఆవులను పెంచే కార్యక్రమంతో బాటు.. వేలాది ఎకరాల్లో పంట పండించి కేవలం మేత కోసమే ఉపయోగిస్తున్నారు. ఎప్పుడో ప్రాచీన కాలంలో మన మహర్షులు తెలిపిన వాస్తవాలను ఇప్పుడు పాశ్చాత్యులు కనిపెట్టి పశుపోషణ పట్ల ఆసక్తి పెంచుకుంటున్నారు. వారిని చూసి ఇప్పుడిప్పుడే కొందరు భారతీయుల్లో ఆసక్తి పెరుగుతోంది...
మన దేశంలో ఎక్కువగా గేదె పాలనే ఆదరిస్తారు. మొదట్నుంచి ఎక్కువ వెన్న శాతం ఉన్న పాలు గనక గేదెలనే పాల పరిశ్రమకు ఉపయోగించేవారు. వాస్తవానికి రైతుల వద్ద ఉండే దేశవాళీ ఆవులు పాల ఉత్పత్తిలో అంత మెరుగేమీ కాదు. మహా అంటే అరలీటరు నుంచి లీటరు పాలిచ్చేవి.. బాగా బలం ఉన్న ఆవులు.. పాల సార ఉన్న ఆవులైతే లీటర్‌నర వరకు పాలిస్తే ఇంట్లో వరకు సరిపోయేవి. కానీ కొందరైతే అసలు ఆవు పాలు పల్చగా వెన్న శాతం తక్కువగా ఉంటుందనే ఉద్దేశ్యంతో పాలను కోడెదూడలకే వదులుతారు. కానీ పాల ఉత్పత్తి కోసమే పుట్టిన జెర్సీ, హెచ్.ఎఫ్ వంటి ఆవులు పాల కడలిని కడుపులో దాచుకున్నట్టు ఉంటాయి. పుష్టిగా మేత వేసి దాణా పెడితే... కడవలు కడవలుగా పాలు ఇస్తాయి. ఒక్క ఆవు రోజుకు 20 నుంచి 25 లీటర్ల పాలిస్తుంది. కేవలం పాలు ఇవ్వడానికే పుట్టినట్టుండే ఈ ఆవుల వల్ల పాల ఉత్పత్తి మాత్రమే ఉపయోగం కాదు. ఇంకా చాలా లాభాలున్నాయి. ఒక్కసారి ఆ విషయాలు పరిశీలిస్తే.. ఆవు ఎలా కామధేనువో తెలుస్తుంది..
మంచి మేలుజాతి ఆవులను కొనుగోలు చేసి ఫారం గా పెట్టి వ్యాపార దృష్టితో చూసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.. ఎందుకంటే పాలు నిత్యావసర వస్తువు.. పెరుగుతున్న జనాభాకు తగిన ఉత్పత్తి జరగడం లేదు.. కాబట్టి పాలకు డిమాండ్ పెరుగుతోంది. చికెన్ వంటి వాటకి రేట్లల్లో హెచ్చు తగ్గులు ఉంటాయోమో గానీ... పాల ధర మాత్రం స్థిరంగా ఉంటుంది.. ఈ ఎపిసోడ్లో పాల ఉత్పత్తుల పై ప్రత్యేకంగా చర్చించదలుచుకోలేదు. ఎందుకంటే పాల ఉత్పత్తుల గురించిగానీ .. వాటి అవసరం గురించి గానీ పాలబుగ్గల పసివాడిని అడిగినా చెబుతారు. పాల డైరీలో ఎన్నో ఇతర లాభాలున్నాయి. కాబట్టే పాల డైరీ నిర్వహించడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. అందుకే ఆవు ఒక్కంటికి 40వేలు ఉండే ధర ఏకంగా 70వేలకు పెరిగింది. భవిష్యత్తులో ఇది లక్ష రూపాయలైనా ఆశ్చర్యం లేదని ఈ రంగంలో ఉన్న నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక పది ఆవులతో ఫారం మొదలు పెడితే వచ్చే లాభాలు చూద్దాం..
పది ఆవులకు ఒక్కో ఆవుకు 20లీటర్ల చొప్పున లెక్క వేసుకున్నా సరాసరిన 200 లీటర్ల పాలు వస్తాయి. ఇది కొంచెం అటూ ఇటుగా ఉండొచ్చు... లీటర్‌కు వెన్న శాతాన్ని బట్టి 20 రూపాయలు ధర పలికినా.. 4 వేల రూపాయల ఆదాయం వస్తుంది.. రోజులకు నాలుగు వేల చొప్పున నెలకు లక్షా ఇరవై వేల ఆదాయం వస్తుంది. అయితే ఇందులో సగానికి పైగా ఖర్చులకే సరిపోతుంది. దాణా, గడ్డి, జీతాలు, వంటి బిల్లులకు సరిపోతుంది. ఒక్కోసారి పాల దిగుబడి తక్కువగా ఉండి,, శాస్త్రీయ పద్దతులు పాటించక పోతే అసలుకే మోసం వచ్చి.. ఆవులు రోగాల పాలై లాభం రాకపోగా నష్టాల పాలయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. వ్యాపార దృక్పదంతో పెట్టుకొని పెట్టుబడి పెట్టి దగ్గర ఉండి ప్రతీక్షణం చూసుకుంటే తప్ప డైరీలో ఉన్న లాభాలు ఆర్జించడం సాధ్యం కాదు. అయితే పాల సంగతి అలా ఉంటే గోవుల ద్వారా వచ్చే పేడ వల్ల లాభాలు చూద్దాం.. వాస్తవానికి ఈ విషయం చెప్పగానే చాలా మంది కాస్త ఇబ్బంది పడతారు. అసలు గోవులను, గేదెలను పెంచాలంటేనే పేడ తీయడానికి భయపడే సగం మంది వీటి జోలికి రారు... కానీ అసలు లాభం మొత్తం పేడ వల్లనే అన్న విషయం చాలా మందికి తెలియదు. పశువుల్లో ఎంత గడ్డి తింటాయో ఆ మేరకు పేడ వేస్తాయి. ఈ పేడలో సెల్యులోజ్ ను జీర్ణం చేసే బ్యాక్టీరియా ఉంటుంది. తరువాత అవాయు శ్వాసక్రియ జరిపి మీథేన్ వంటి ఇంధన వాయువులను వెలువరచే బ్యాక్టీరియా కూడా ఉంటుంది.. అందుకే ఈ గోవు పేడను ఉపయోగించి బయోగ్యాస్ లేదా గోబర్ గ్యాస్ ఉత్పత్తికి వినియోగిస్తారు. అయితే గోబర్ గ్యాస్ గురించి ప్రభుత్వం ప్రచారం చేసి చేసి విసిగి పోయింది. కానీ కొన్ని ప్రాంతాల్లోనే ఇది విజయం సాధించింది.. అయితే ఈ గ్యాస్ కేవలం ఇంటి వంటకే పరిమితంగా భావిస్తారు. కానీ ఇక్కడే మతలబు ఉంది.. ఒక డైరీ ఫాం నడపాలంటే దానికి కావలసిన విద్యుత్ అంతా ఇంతా కాదు.. పశువుల శాలకు కావలసిన నీటికి మోటార్ కోసం, రాత్రి వేళల్లో వెలుతురు కోసం, దాణా మిక్సర్ కోసం, గడ్డిని చిన్న ముక్కలుగా కత్తిరించే ఛాఫ్ కట్టర్ కోసం, పాలు పితికే యంత్రానికి, గడ్డికోసే యంత్రానికి.. వీటన్నిటికీ విద్యుత్ అవసరం.. ఇన్ని యంత్రాలకు విద్యుత్ కావాలంటే భారీగానే బిల్లు చెల్లించుకోవలసి వస్తుంది. కానీ కాస్త తెలివి ఉపయోగిస్తే ఈ భారం పూర్తిగా తగ్గించుకోవచ్చు. పేడ ద్వారా వచ్చే బయోగ్యాస్ ప్లాంట్ నిర్మించుకుంటే.. బయోగ్యాస్ తో ఎనిమిది గంటలు జనరేటర్ పనిచేస్తుంది. ఈ జనరేటర్ కు ఏ ఇంధన ఖర్చూ అవసరం లేదు. కేవలం పేడ కలిపి బయోగ్యాస్ ప్లాంట్ లో పోస్తే చాలు .. రోజు వారీ ఉత్పత్తయ్యే గ్యాస్ ద్వారా రోజూ ఎనిమిది గంటల విద్యుత్ ను అందిస్తుంది. ఈ విద్యుత్ వినియోగించుకునే అవసరం లేకుండా దాన్ని నిల్వ కూడా చేసుకోవచ్చు. ఇదే పెద్ద ఉపయోగం.. ఇక బయోగ్యాస్ నుంచి బయటకు వచ్చిన పేడ ఎండగానే మంచి ఎరువుగా మారుతుంది. అప్పటికే బ్యాక్టీరియా ద్వారా చర్యగావించ బడ్డ ఈ పేడ ఘాడత తగ్గి ఉంటుంది. ఈ పేడను వర్మి కంపోస్టుగా వాడొచ్చు. అంటే డైరీ ఫాంలోనే పక్కగా చిన్ని షెడ్లల్లో వర్మి కంపోస్టు తయారు చేయవచ్చు. దీనికోసం కూడా పెద్దగా ఖర్చు చేయవలసిందిగానీ... కష్ట పడవలసింది గానీ ఏమీ లేదు. షెడ్డులో నిర్ణీత పొడవు, వెడల్పుతో బెడ్డు తయారు చేసి అడుగున సిమెంట్ తో కాంక్రీట్ చేయాలి. ఈ బెడ్లల్లో బయోగ్యాస్ నుంచి వచ్చిన పేడను నింపి ఇందులో.. మొదటి సారి వర్మి కంపోస్టు ఎరువును చల్లాలి. ఆ ఎరువులో ఉన్న వానపాము గుడ్డు కొత్త పిల్లలను చేస్తాయి. వారం రోజుల్లో బెడ్డులో వేసిన పేడ మొత్తాన్ని ఎరువుగా మారుస్తుంది. ఎనిమిది రోజుల తరువాత పై ఎరువును సేకరించి మళ్లీ పైన బయోగ్యాస్ పేడను పరుచుకోవాలి. అడుగున ఉన్న వానపాములు తిరిగి ఈ పేడను కూడా వర్మి కంపోస్టుగా మారుస్తాయి. ఇది నిరంతర ప్రక్రియ. వర్మి కంపోస్టుకు ఇప్పుడు రోజు రోజుకూ డిమాండ్ పెరుగుతోంది. కొన్ని కంపెనీలు ముందుగానే ఆర్డిరిచ్చి మరీ కొనుగోలు చేస్తున్నాయి. కాబట్టి గోవు పేడ ఇటు వర్మి కంపోస్టుకు, అటు గ్యాస్ ఉత్పత్తికి, విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగ పడుతుంది. వీటితో బాటు... మరో విచిత్ర ఉపయోగం ఉంది. ఇది కొందరికే సాధ్యం.. డైరీ ఫాంలలో గోవులను రెండు రోజలకోసారి శుభ్రం చేస్తారు. ఈ నీరు సహజంగా దగ్గరలో ఉన్న గడ్డి మళ్లలోకి మళ్లిస్తారు. కానీ ఈ నీటిని భావి లాంటి గోయి తవ్వి దాంట్లోకి మళ్లిస్తే మరింత ఉపయోగం ఉంటుంది. మామూలుగా చెరువుల్లో పెరిగే బురద మట్ట చేపలు.. ఆవు పేడ, గడ్డి తిని త్వరగా పెరుగుతాయి. మత్య పరిశ్రమ వారి వద్ద బురద మట్టల చేప పిల్లలను తీసుకొచ్చి ఈ బావుల్లో వదిలి.. పశువులను కడిగిన పేడ నీటిని ఈ బావుల్లోకి మళ్లిస్తే... చేపలు ఏపుగా పెరుగుతాయి. పేడ నీటితో బాటు దాణా వ్యర్ధాలను కూడా ఈ బావుల్లో వేస్తే చేపలు మరింత తొందరగా పెరుగుతాయి. ఎందుకంటే ఆవు పేడను ఆవరించే బ్యాక్టీరియా, పురుగులు చేపలకు సంవర్ధక ఆహారంగా పనిచేస్తుంది.
పశువుల పేడ దాటి పశుమూత్రం దగ్గరకు వస్తే చెప్పడానికి కాస్త అతిశయంగా ఉంటుంది. కానీ పశుమూత్రం ద్వారా చాలా లాభాలున్నాయని బయోకెమికల్ నిపుణులు పరిశోధనల్లో రుజువు చేయడమే కాక మార్కెట్లోకి ఉత్పత్తులను విడుదల చేశారు. గో మూత్రం పురాతన కాలం నుంచీ ఆయుర్వేద ఔషదంగా వాడుకుంటూ వస్తున్నారు. కొన్ని తెగల వారు గో మూత్రాన్ని రోజూ రెండు స్పూన్లు సేవించడం వారి మూర్ఖత్వంగా భావించారు చాలా మంది. కానీ ఆధునిక పరిశోధనల వల్ల వారి పూర్వీకులు వారికి అలా చేయమని ఎందుకు చెప్పారో తెలిసొచ్చింది. గో మూత్రంలో 24 రకాల ప్రాథమిక లవణాలున్నాయి. వీటిలో ఐరన్, కాల్షియం, పాస్ఫరస్, కార్బనికామ్లం, పోటాష్,మరియు లాక్టోజ్ వంటి పదార్ధాలున్నాయి. ఇవన్నీ మొక్కలకు అత్యవసర పోషకాలు.. అంటే మొక్కల్లో వచ్చే సూక్ష్మ పోషక లోపాలకు ప్రధాన కారణాలైన కాల్షియం, పాస్ఫరస్, పొటాష్ వంటి ధాతువుల లోపాలను సవరించే దివ్యౌషదం గో మూత్రమని బయో కెమికల్ నిపుణులు రుజువు చేశారు. ఇది పంట పొలాలకే కాదు.. వ్యాపార పరంగా ఇంకా బాగా లాభాలిస్తోంది. గోమూత్రం నుంచి ఫినాల్, క్రిసాల్ ను ఉత్తత్తి చేస్తున్నారు. వీటి ధర అరలీటర్ కు 90 రూపాయల పై చిలుకే ఉంటుంది. అంటే గోవులు వదిలే మూత్రం కోసం డైరీ ఫాంలో ప్రత్యేక కాలువలు నిర్మిస్తారు. ఈ కాలువల్లోంచి వెళ్లిపోయే మూత్రం మామూలుగా మడుల్లోకి వెళ్లకుండా సిమెంట్ సంప్ నిర్మించుకొని అందులో పోగయ్యే విధంగా జాగ్రత్త తీసుకుంటే.. కొద్ది పాటి సాంకేతిక జ్ఞానాన్ని నేర్చుకుంటే డైరీ ఫాం నుంచే ఫినాల్ తయారు చేసి మార్కెట్లోకి వదలొచ్చు. ఫినాల్ తయారు చేయగా మిగిలిన మిశ్రమానికి వేపనూనె జోడించి పత్తి, మిర్చి, వంటి పంటలకు శిలీంద్ర నాశినిగా, సూక్షపోషకలోపాల నివారిణిగా పిచికారి చేయొచ్చు.
ఇప్పుడు చెప్పిన వన్నీ కాకమ్మ కథలు కావు... నిజ జీవితంలో వీటిని ఆచరించి లాభాలు పొందుతున్న రైతులు, వ్యాపారులు, ఈ రహస్యాలు చెప్పడానికే ఇష్టపడని వారు చాలా మందే ఉన్నారు. అంటే గోవుల పెంపకం ద్వారా.. పాలు, విద్యుత్, వంట చెరుకు, చేపల పెంపకం, వర్మి కంపోస్టు, ఫినాల్ తయారీ, మైక్రో మిక్స్ తయారీ.. ఇన్ని రకాల ప్రయోజనాలున్న పరిశ్రమ మరొక్కటి లేదేమో. వీటితో బాటు ఓపిక ఉండాలేగానీ.. చుట్టూ ఫెన్సింగ్ ఉంటే... ఆ పెరిగే గడ్డి మడుల్లో ఓ వంద గిరిరాజా కోళ్లు వదిలితే. ఏ మేతా, దాణా వేయకుండానే ఒక్కోక్కటీ గొర్రె పిల్లలంత ఎదుగుతాయి .. కానీ ఇవి ఆవులకు సంబంధం లేదు కావున వాటి ప్రస్తావన తీసుకురాలేదు. మనిషి అవసరానికి కావలసిన ఇన్ని రకాలు ఇచ్చిన ఆవును కామధేనువు అనడంలో అబద్దం ఏముంటుంది.. అందుకే ప్రభుత్వం కూడా పశుపోషణ పై దృష్టిసారించింది. అయితే సబ్సిడీల కోసం మాత్రమే కాకుండా.. వాటి పోషణ వల్ల వచ్చే లాభాల పై దృష్టి పెట్టి వ్యాపారాత్మకంగా చూస్తే గోవు కామధేనువే కాదు....... కామన్ ధేనువు కూడా...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment