Friday, March 16, 2012
నకిలీ ఉత్పత్తుల పై చైనా సూపర్ డెసిషన్... ఇండియాలో ఎప్పుడు చేస్తారో ?
ఎక్కడైనా.. ఎవరైనా సరే ఒక ప్రొడక్ట్‌కు మంచి గిరాకీ తగిలిందా... వెంటనే దానికి దగ్గర పేరుతో గానీ... అదే పేరు పలికే విధంగా కానీ ఉత్పత్తులు పుట్టుకొస్తాయి. ఈ జాడ్యం ఒక్క ఇండియాకే కాదు.. ప్రపంచంలో అన్ని దేశాల్లో చౌకబారు వ్యాపారులకూ ఈ రోగం ఉంది. దీంతో కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టిన అసలు బ్రాండెడ్ వ్యాపారులు చాప చుట్టేస్తుంటే.. తక్కువ ఖర్చుతో నాణ్యత లేని ఉత్పత్తులు తయారు చేసే వారు మాత్రం కోట్లు గడిస్తున్నారు. అందుకే చైనా ఈ నకిలీలల నాటకాలకు తెరదించింది.. మార్చి 15 ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని చైనా వినియోగ దారులకు ఒక వరాన్నిచ్చింది. ఇంతకీ చైనా ప్రభుత్వం ఏం చేసిందో చూస్తే మన దేశంలోనూ అలా చేస్తే ఎంతబావుంటుందో అని పిస్తుంది.
మనకు ఇష్టమైన వస్తువు తీసుకుందామని మార్కెట్‌కు వెళితే.. అసలు దొరకక పోగా.. అచ్చం అదే పేరుతో ఉన్న మరో ప్రొడక్ట్ కనిపిస్తుంది. పైగా అసలు దానికంటే రేటు రెండు రూపాయలు తక్కువే ఉంటుంది. . పోనీలే ఏదో ఒకటి అని ట్రై చేద్దామనుకుంటే మొదటికే మోసం వస్తుంది. అంతేకాదు ఆ ప్రొడక్ట్ పైన నమ్మకమే పోతుంది. ఆ మధ్య కాలంలో బాగా అమ్ముడవుతున్న సబ్బులు, నూనెలు, పరిమళ ద్రవ్యాలు, సౌందర్య సాధనాలు కాపీ కొట్టడానికి పోటీ పడ్డాయి. ఇక గ్రామస్థాయిల్లో జరిగే సంతల్లో అయితే జాలీ పౌడర్ దగ్గర్నుంచి జాస్మిన్ పౌడర్ వరకు నకిలీ ప్రొడక్ట్ దొరుకుతాయి. ఇవి అసలు కంటే కాస్త ఎక్కువగానే తళతళలాడుతాయి. ఇటువంటి నకిలీ ఉత్పత్తుల వినియోగ దారులు నష్టపోవడమో.. లేక ఉత్పత్తులు అమ్ముడుపోక అసలు కంపెనీ మూత పడటమో జరుగుతుంది. ఈ జాడ్యం ఒక్క ఆంధ్ర ప్రదేశ్ కో ఇండియాకో పరిమితం కాదు.. ప్రపంచదేశాలన్నీ నకిలీ ఉత్పత్తుల బాధ పడుతున్నాయి. ఈ బెడద చైనాకు మరింత ఎక్కువ. వీటి వల్ల కార్పోరేట్ సంస్థలు కుదేలయ్యే పరిస్థితి ఎదురవడమే కాక.. ఎగుమతుల్లో కూడా నాణ్యత లేకపోవడంతో ఫిర్యాదులు పెరుగుతున్నాయి. దీంతో నకిలీ ఉత్పత్తుల పై చైనా శాశ్వత చర్యలు చేపట్టింది. అసలుకు నకిలీ కనిపిస్తే చాలు.. కనికరం లేకుండా కాల్చి పడేస్తున్నారు. మళ్లీ తిరిగి తీసుకోకుండా పూడ్చేస్తున్నారు. రిజిస్టర్ చేసేటపుడే పోలికలున్న పేరుకు అనుమతులు ఇవ్వకపోగా.. ఎవరైనా అక్రమంగా అటువంటి ఉత్పత్తులు తయారు చేసినా... ఫిర్యాదు వచ్చినా వెంటనే స్పందించి.. నకిలీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకొని చిత్తు చేస్తున్నారు. మొత్తం గా సుమారు 50 లక్షల విలువ చేసే ఉత్పత్తులను చిత్తు చేశారు.
ఇక్కడ కనిపిస్తున్న ఆయుర్వేద మందులు.. గృహోపకరణాలు.. అగ్నిమాపక యంత్రాలు... ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, వస్తువులన్నీ నకిలీవే... రోజు రోజుకూ పెరుగుతున్న ఈ నకిలీ ఉత్పత్తుల బెడదతో.... ఇటు వ్యాపారులు.. అటు సాధారణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అసలేదో నకిలీ ఏదో గుర్తించలేనంతగా తయారు చేసే పరాకష్ట దశకు చేరుకున్నారు నకిలీ వ్యాపారు. ఒక్కోసారి వెల తక్కువైన నకిలీ కంటే అసలు ఉత్పత్తులే నకిలీ ఉత్పత్తుల్లా వెలవెల బోతున్నాయి. కోటాను కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకొని.. భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టి తయారు చేసి బ్రాండెడ్ ముద్ర వేసుకున్న కంపెనీలు.. కుటీర పరిశ్రమగా పెట్టుకున్న నకిలీల బెడదతో... మూతబడుతున్నాయి. అందుకే ఇది భవిష్యత్ తరాలకు ఇటువంటి సమస్య రాకుండా చైనా జాగ్రత్త పడుతోంది. ఇక పై నకిలీ వస్తువులు తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. అన్ని ప్రధాన పట్టణాల అధికారులకు నకిలీ ఉత్తత్తుల పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. చైనాప్రభుత్వ తీసుకున్న ఈ నిర‌్ణయం పట్ల సామాన్య పౌరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment