ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Tuesday, March 27, 2012

దళిత గిరిజనుల నిధులు దొంగల పాలు.. ఉపసంఘం ఊరటనిచ్చేనా..?




ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికను ఎటువంటి అవకతవకలు లేకుండా అమలు చేయాలంటూ ప్రజాసంఘాలు, దళిత సంఘాలు చేస్తున్న ఆందోళనకు ప్రభుత్వం దిగొచ్చింది. ప్రణాళిక అమలుకు మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం కిరణ్ కుమార్ రెడ్డ ిప్రకటించారు. ఇంతకూ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పై మంత్రి వర్గ ఉప సంఘం వేయాలని ప్రజా సంఘాలతో బాటు, దళిత సంఘాలు డిమాండ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది.. సబ్ ప్లాన్ నిధులు ఎలా పక్కదారి పడుతున్నాయి.. ముఖ్యమంత్రి తాజా ప్రకటన వల్ల ఎటువంటి ప్రయోజనం కలగబోతోంది.... వంటి విషయాల పై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం.
సొమ్మొకరిది.. సోకొకరిది
సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించాలని ఉప ప్రణాళికను రూపొందించింది. ఎస్సీ, ఎస్టీ లను అభివృద్ధి చేయాలన్న సదుద్దేశ్యంతో వారికి ప్రత్యేక నిధులు కేటాయింస్తూ... వారికి మాత్రమే ఖర్చు చేయాలని సంకల్పించి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ రూపొందించింది. కాలక్రమంలో ఈ సబ్ ప్లాన్ కు చెదలు పట్టింది. ఒకవైపు నిధుల కేటాయింపుల్లోనే నిర్లక్ష్యం రాజ్యమేలుతుంటే.. మరో వైపు కేటాయించిన నిధులు పక్కదారి పట్టడం మొదలయింది. ఈ పద్దతిని నిరసిస్తూ దళిత సంఘాలు ఎన్నో సార్లు ఆందోళన బాట పట్టాయి. అయినా ప్రభుత్వంలో కదలిక లేదు.. ఉత్తుత్తి హామీలతో సరిపుచ్చాయి. దీంతో నిధుల దుర్వినియోగం షరా మామూలైపోయింది. ఇదేంటని అడిగిన నాధుడు లేడు.
దళిత, గిరిజనుల జనాభా సంఖ్యకు తగ్గట్టుగా.. ఎస్సీలకు 16.2 శాతం నిధులు, ఎస్టీలకు 6.6 శాతం నిధుల్ని ప్రణాళిక బడ్జెట్ లో కేటాయించాలని సబ్ ప్లాన్ ఏర్పాటు చేసిన సందర్భంలో నిర‌్ణయించింది. ఎస్సీ ఎస్పీ పేరుతో 1979 సంవత్సరంలో ఈ ఉప ప్రణాళికను ఏర్పాటు చేసింది. దీని ద్వారా కేటాయించిన నిధులు దళిత, గిరిజనుల సామాజిక, ఆర్ధిక, విద్యా, వైద్య రంగాల్లో అభివృద్ధికి వినియోగిస్తారు. కానీ ఈ సబ్ ‌ప్లాన్ ఏర్పాటు చేసిన నాటి నుంచి నిధులను సక్రమంగా వినియోగించిన పాపాన పోలేదని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయం పై దళిత సంఘాలు ఎన్నోసార్లు ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశాయి.
ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కోసం దామాషా ప్రకారంకేటాయించాల్సిన నిధులు కేటాయించక పోగా.. కేటాయించిన అరకొర నిధులను పక్కదారి పట్టిస్తున్నారంటూ కమిషన్ తప్పు బట్టింది. రాష్ట్రంలో 1992 నుంచి ఇతర శాఖల బాట పట్టిన నిధులు అక్షరాలా 13 వేల 200 కోట్లు... ఇప్పడు ఆ మొత్తం 20 వేల కోట్లకు పైకి చేరింది. ఈ విషయాన్ని లెక్కలతో సహా కాగితాల పై కుమ్మరించి ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం వాగ్ధానాలతోనే బుజ్జగిస్తోంది.
ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే నోడల్ వ్యవస్థ అమలులోకి రావాలి. కానీ రాష్ట్రంలో నోడల్ వ్యవస్థ ఇన్నాళ్లూ ఓ చిరకాల స్వప్నంగానే మిగిలింది. ఉత్తరప్రదేశ్, మహరాష్ట్ర, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలో సాకారమైన నోడల్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు దుస్సాధ్యంగా మిగిలింది. దీంతో నిధులను ఇష్టమొచ్చిన శాఖలకు కేటాయించినా పట్టించుకునే నాథుడు లేడు. 2007లో ఎస్సీ ఎస్టీ లకు రెండు ఏజన్సీలు ఏర్పాటు చేసి రెండు నెలలకో మారు సమీక్ష చేస్తామన్న దివంగత ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖర్ రెడ్డి మాటలు కాగితాలకే పరిమితమయ్యాయి. తరువాత ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన రోశయ్య కూడా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల దుర్వినియోగం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.. మిగిలిన నిధులను నోడల్ ఏజన్సీకి బదలాయించాలని ఆదేశించి చేతులు దులుపుకున్నారు. అయినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది.
ఎస్సీ ఎస్టీ ల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసిన సబ్ ప్లాన్ అపహాస్యం పాలవుతోంది.. దళిత గిరిజనులను ఉద్ధరించడానికి ఏర్పాటు చేసిన ఉప ప్రణాళికకు నిధులు కేటాయించడంలోనే నిర్లక్ష్యం తాండవిస్తుంది. దానికి తోడు కేటాయించిన అరకొర నిధుల విడుదలలో విపరీతమైన జాప్యం.. ఆఖరుకు కేటాయించిన నిధులను దళితులకు, గిరిజనులకు ఖర్చు పెట్టకుండా వేరే పనులకు ఖర్చు పెట్టి.. దళిత గిరిజన ఖాతాలో రాయడం షరా మామూలై పోయింది. దళిత, గిరిజనులకు అసలే సంబంధం లేని పులివెందుల అభివృద్ధి, హైదరాబాద్ రింగ్ రోడ్డు నిర్మాణం, హుస్సేన్ సాగర్ ఆధునికీకరణ వంటి పనులకు ఖర్చు పెట్టడం చూస్తే ప్రభుత్వాలకు దళిత గిరిజనుల అభివృద్ధి పట్ల ఉన్న చిత్త శుద్ది తేటతెల్లమవుతోంది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పడుతున్నాయని... ఇందిరా పార్క్ వద్ద ఆందోళన చేస్తున్న ప్రజా సంఘాల సాక్షిగా ఉప ముఖ్యమంత్రే బహిరంగంగా ఒప్పుకున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. మన పొరుగున ఉన్నా కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు బడ్జెట్ కేటాయింపుల్లో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కు ఎంత కేటాయిస్తారో ముందే ప్రకటిస్తారు. కానీ మన రాష్ట్రంలో కేటాయించిన నిధులు ఎన్నో తెలుసుకోవడమే కష్టంగా మారింది.
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు మంజూరు చేయకున్నా, నిధులు దారి మళ్లించినా, దానికి సహకరిస్తూ సంతకం చేసిన వారందరిపైనా చర్యలు తీసుకునే విధంగా సబ్‌ప్లాన్ నిధుల చట్టం రూపొందించాల్సి ఉందని నేతలు అభిప్రాయ పడుతున్నారు.. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం 750 కోట్ల రూపాయల సబ్ ప్లాన్ నిధులను కామన్‌వెల్త్ క్రీడలకు వెచ్చించిందని , హైదరాబాద్‌లోని రింగ్‌రోడ్, ట్యాంకు బండ్ ప్రక్షాళనకు కోట్ల రూపాయలు దారిమళ్లించారని బీజేపీ నేత కిషన్‌రెడ్డి చెప్పారు. దళితుల అభివృద్ధికి కేటాయించిన నిధులను కూడా సక్రమంగా ఖర్చు పెట్టకపోవడం బాధాకరమని బీవీ రాఘవులు అన్నారు.
మా సొమ్ములు మాకు ఖర్చు పెట్టండి ప్రభో అంటూ దళిత సంఘాలు రొడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చినందుకు ప్రభుత్వాలు పెద్దగా బాధ పడక పోగా ఇలా జరిగిన మాట వాస్తవమే అని శాసన సభ సాక్షిగా ఒప్పుకోవడాన్ని చూస్తుంటే ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి పై ప్రభుత్వాలకున్న చిత్త శుద్ధి కనిపిస్తోంది.
అవును జరిగిందేదో జరిగింది.. ఇక అలా జరగనివ్వమని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ సక్రమంగా అమలు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని.. వారికి కేటాయించిన నిధులు జాప్యం లేకుండా విడుదల చేయడమే కాకుండా విడుదలయిన నిధులు వారికే ఖర్చు పెట్టేలా చర్యలు తీసుకుంటామని... దీనికోసం శాసన సభలో ప్రత్యేక చర్చ చేపడతామని సీఎం చెప్పే మాటలు కాస్త ఊరట కలిగించేవే అయినా.. అవి కార్యరూపం దాల్చిన రోజు సంపూర్ణ విజయం సాధించనట్టే..

No comments:

Post a Comment