Saturday, March 10, 2012
రాజకీయ పార్టీలకు పరీక్షలు
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సారాంశం ఏమిటి? ప్రజల తీర్సులోని ఆంతర్యం ఏమిటి? ఈ ఎన్నికల ఫలితాలు అవినీతికి ఆలవాలమైనందుకు మాయావతి సర్కార్ ను సాగనంపాయి. అదే కారణంతో కాంగ్రెస్ పార్టీకి పరువునష్టం కలిగించాయి. నికరమైన ప్రత్యామ్నాయంగా నిలిచిన సమాజ్ వాదీ పార్టీకి పట్టం కట్టాయి. అనిశ్చితికి ఆస్కారం లేకుండా, సంకీర్ణ కూటమికోసం బేరసారాలకూ, డబ్బుదస్కాలకూ ప్రమేయం లేకుండా ములాయం సింగ్ నాయకత్వంలోని సమాజ్ వాదీ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం ప్రసాదించాయి.
ఇవి పార్లమెంటు ఎన్నికలు కాకపోయినా 2014లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫెనల్స్ గా పరిశీలకులు పరిగణించారు. పంజాబ్ లో బాదల్ నాయకత్వంలోని అకాలీదళ్ పార్టీ పాలన కొనసాగాలనే ప్రజలు నిర్ణయించారు. కొండంత ఆశ్చర్యం కలిగించారు. బాదల్ బంధుప్రీతి, అవినీతి ఆరోపణల కంటే కాంగ్రెస్ పైన వచ్చిన ఆరోపణల ప్రభావం ఎక్కువ. అందుకే బాదల్ కు మరో సారి అవకాశం ఇచ్చారు ప్రజలు. గోవాలో అధికార మార్పిడి ఊహించిందే. మణిపూర్ లో కాంగ్రెస్ హ్యట్రిక్ కూడా అనుకున్నదే. అక్కడ ప్రతిపక్షం బలంగా లేదు. ఉత్తరాఖండ్ లో భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా గట్టిపోటీ ఇచ్చింది. ఉత్తర ప్రదేశ్ మాత్రం చరిత్ర సష్టించింది. 1985 తర్వాత ఏ ఎన్నికలోనూ ఏ రాష్ట్రంలోనూ సమాజ్ వాదీ పార్టీ నమోదు చేసినంతటి భారీ విజయాన్ని మరో పార్టీ సాధించిన సందర్భం లేదు. రెండు యువకెరటాలు ఎన్నికల ప్రచారంలో ఉవ్వెత్తున ఎగిసినట్టు కనిపించాయి. ఒకటి మాత్రమే అట్టహాసంగా తీరం చేరింది. మరొకటి మధ్యలోనే మటుమాయం అయింది. ములాయం తనయుడు అఖిలేష్ సృష్టించిన కెరటం ఉత్తరప్రదేశ్ ని ముంచెత్తగా రాహుల్ కెరటం మధ్యలోనే విరిగి పడిపోయింది. ఇద్దరు యువనాయకులు పోటాపోటీగా ప్రచారం చేసిన ఎన్నికలో స్థానిక యువకుడు ప్రజల హదయాలను దోచుకున్నాడు. ఢిల్లీబాబుకి ప్రజలు జెల్లకొట్టారు. ఇది వర్తమాన రాజకీయాలను అర్థం చేసుకోవడానికీ, భవిష్యత్ పరిణామాలను అంచనా వేయడానికీ ఉపకరించే తీర్పు. ముఖ్యంగా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు గుణపాఠాలు నేర్చుకోవలసిన సందర్భం.
టూ జీ స్పెక్ట్రమ్ మొదలు వరుస కుంభకోణాలతో చిక్కుకున్న కాంగ్రెస్ ఘనవిజయాలు సాధిస్తుందని ఎవ్వరూ జోస్యం చెప్పడానికి సాహసించలేదు. కానీ ఉత్తర ప్రదేశ్ లో మాయావతి సర్కార్, పంజాబ్ లో బాదల్ పరివారం, ఉత్తరాఖండ్ లో ఖండూరీ ప్రభుత్వం బాగా బదనాం అయిన కారణంగా కాంగ్రెస్ కు ఎంతోకొంత లాభం జరుగుతుందని అనుకున్నారు. పంజాబ్ లో బాదల్ గెలుపు, ఉత్తరాఖండ్ లో అత్తెసరు మార్కులతో గట్టెక్కిన పరిస్థితి చూస్తే కాంగ్రెస్ కు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ లో రాహుల్ గాంధీ శక్తినంతా ఒడ్డి ఎన్నికల ప్రచారం చేసినా ప్రయోజనం లేకపోయింది. కుటుంబ స్థావరాలుగా పరిగణించిన అమేథీ, రాయ్ బరేలీ నియోజకవర్గాలలో సైతం కాంగ్రెస్ ఆబోరు దక్కలేదు. కేంద్రమంత్రుల సుతులూ, సతులూ పరాజయం చెందారు. రాహుల్ ఆంతరంగిక మిత్రుడైన జతీన్ ప్రసాద పప్పులు కూడా ఉడకలేదు. ఉత్తరప్రదేశ్ లో వీచింది ఒక్క సమాజ్ వాదీ పార్టీ అనుకూల ప్రభంజనమే కాదు. కాంగ్రెస్ వ్యతిరేక పవనాలూ వీచాయి. మాయావతి ప్రతికూల ప్రభంజనం ఎట్లాగూ ఉంది. వెరసి ఎగసి పడిన ఉత్తుంగ తరంగంపైన సమాజ్ వాదీ పార్టీ ఎవ్వరికీ అందని ఎత్తుకు ఎదిగింది. కాంగ్రెస్ కు అవమానకరంగా, అగమ్యగోచరంగా, నిరాశాజనకంగా పరిస్థితులు పరిణమించాయి. ఈ దుస్థితి దాపురించడానికి దారితీసిన వాస్తవ కారణాలను తెలుసుకొని అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకుంటేనే కాంగ్రెస్ భవిష్యత్ సంగ్రామాలలో యుద్ధం చేయగలదు, విజయాలు సాధించగలదు.
ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే ఓటమికి తానే బాధ్యుడినంటూ రాహుల్ గాంధీ ఒప్పుకోవడం అతని పట్ల గౌరవం పెంచింది. కొన్ని మాసాలుగా మీడియాకు దూరంగా ఉంటూ వచ్చిన సోనియా కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కొన్ని గంటలు సహచరులతో సమాలోచనలు జరిపి మీడియాతో మాట్లాడటం ఈ ఎన్నికల ఫలితాలకు కాంగ్రెస్ పార్టీ తగిన ప్రాముఖ్యం ఇచ్చిందనడానికి నిదర్శనం.
కాంగ్రెస్ ఓటమికి బహునాయకత్వం, సంస్థాగత దౌర్బల్యం ప్రధాన కారణాలుగా సోనియా గుర్తించారు. ఆమె గుర్తించని ముఖ్యమైన కారణం మరొకటి ఉంది. స్థానికంగా బలమైన నాయకుడు లేదా నాయకురాలు లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి శాపంగా పరిణమించింది. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రేపు తమను ఎవరు పరిపాలిస్తారో ప్రజలకు తెలియకపోవడం, ప్రాంతీయ పార్టీలతో పోటీ పడి కుల,మత రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ తెగబడటం కూడా ఆ పార్టీకి నష్టం చేసింది. ఢిల్లీ నుంచి వచ్చిన నాయకులు ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడటం, ముస్లింలను మెప్పించడానికి అనవసరమైన ప్రయత్నాలు చేయడం, అమలు చేయడం సాధ్యం కాని వాగ్దానాలు చేయడం కూడా బెడిసి కొట్టింది.
దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ప్రజలు ఆదరిస్తున్నారు. స్థానికంగా ప్రాబల్యం కలిగిన గట్టి నాయకులకే పట్టం కడుతున్నారు. ములాయం, మాయావతి, జయలలిత, కరుణానిధి, మమతాబెనర్జీ, నితీష్ కుమార్, నవీన్ పట్నాయక్, చంద్రబాబా నాయుడు వంటి నాయకులను ఎదిరించి నిలబడే కాంగ్రెస్ నాయకులు లేరు. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం లేదు. యువతరం ప్రతినిధులూ ఉన్నారు. కానీ రాష్ట్రాలలో నాయకులు బలపడితే కేంద్రంలో మనుగడ కష్టమనే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీని కొంత కాలంగా ప్రభావితం చేస్తూ వచ్చింది. నెహ్రూ హయాంలో రాష్ట్రాలలో బలమైన కాంగ్రెస్ ముఖ్యమంత్రులూ, ఇతర నాయకులూ ఉండేవారు. నెహ్రూ మేరనగ సమానుడు కనుక ఆయనకు వారు గౌరవం ఇచ్చేవారు. వారిని చూసి నెహ్రూ భయపడే పరిస్థితులు లేవు. లాల్ బహద్దూర్ శాస్త్రి మరణం తర్వాత ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్న క్షణం నుంచీ పరిస్థితులు మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రాంతీయ నాయకులు ఒక సిండికేటుగా ఏర్పడి ప్రధాని ఇందిరను కట్టడి చేయడానికి ప్రయత్నించిన తీరు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి పెద్ద విఘాతం కలిగించింది. ప్రధాని పదవిలో ఉన్న ఇందిర ఆత్మరక్షణకోసం సహచరులతోనే పోరాడవలసిన పరిస్థితులు ప్రాంతీయ నాయకులను అస్థిర పరిచే కార్యక్రమాలకు దారితీశాయి. పార్టీని చీల్చిన తర్వాత ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీలో స్థానికి నాయకలు బలపడకుండా జాగ్రత్తపడటం స్పష్టంగా కనిపించిన పరిణామం. ఒక నాయకుడిపైన మరో నాయకుడిని పోటీ పెట్టడం, ఎవ్వరినీ నమ్మకపోవడం, అసమ్మతిని అధిష్ఠానమే ప్రోత్సహించడం, అందరినీ అభద్రతాభావంలో పడి కొట్టుమిట్టాడే పరిస్థితులు కల్పించడం, మనుగడకోసం అధిష్ఠాన దేవతల కరుణాకటాక్ష వీక్షణాలకోసం హస్తిన చుట్టూ రాష్ట్ర స్థాయి నాయకులు ప్రదక్షిణలు చేయవలసిన అవసరం కల్పించడం తెలిసిందే. 1970లలో ప్రారంభమైన ఈ తంతు ఇప్పటికే యథావిధిగా కొనసాగుతోంది. దీనివల్ల పార్టీ అధేనేత చుట్టూ కొందరు నాయకులూ, సలహాదారులూ చేరి అసలు అధికారాలను వారే పరోక్షంగా చెలాయించడం, ముఖ్యమంత్రులను తమ చుట్టూ తిప్పించుకోవడం, వారి చేత కూడని పనులు కూడా చేయించుకోవడం మొదలయింది. నలుగురు ముఖ్యమంత్రుల కంటే పార్టీ అధిష్ఠానంలో పలుకుపడి కలిగిన ఒక కేంద్రనాయకుడు, ఆ రాష్ట్రాలను పర్యవేక్షించే నాయకుడు బలవంతుడైనాడు. అధిష్ఠానవర్గంలోని సభ్యులను ప్రసన్నం చేసుకోవడానికి పైరవీలు చేసే స్థాయికి రాష్ట్ర నాయకులు దిగజారారు. గులాంనబీ ఆజాద్ లాంటి ప్రజాబలం లేని నాయకులు అధిష్ఠానం ప్రాపకంతో రాష్ట్రాల భవిష్యత్తును శాసించే స్థాయికి ఎదిగారు. ఎదురు చెప్పకుండా, చెప్పినట్టు నడుచుకునే నాయకశ్రేణులను చూసి వారే తమ బలమంటూ భ్రమించే స్థితిలో కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ఉంది. అంతర్గత కలహాలనూ, వైరుధ్యాలను పరిష్కరించడానికే అధిష్ఠానం శక్తియుక్తులు చాలకపోవడంతో పార్టీకీ, దేశానికి సరికొత్త దిశానిర్దేశం చేసే పరిస్థితులు కరువైనాయి. రాజశెఖరరెడ్డి వంటి స్థానిక నాయకులు బలపడి అధిష్ఠానవర్గానికే కొరుకుడు పడని సందర్భం వచ్చినప్పుడు ఇందిరాగాంధీ విధానమే సరైనదనీ, రాష్ట్రాలలో నాయకులను బలపడనిస్తే కేంద్రంలో కాంగ్రెస్ బలహీనపడుతుందనీ తీర్మానించే ధోరణి మళ్లీ ప్రబలుతోంది. వివిధ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పతనానికీ, ప్రాంతీయ పార్టీల ఆవిర్భావానికీ, ప్రాంతీయ పార్టీల నాయకులు బలోపేతం కావడానికి ఈ ధోరణే ప్రధాన కారణం.
ఉత్తర ప్రదేశ్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రా నాయకురాలు రీటా బహుగుణ అనే వృద్ధ నాయకురాలు. రాహుల్ ఢిల్లీ నివాసి అనీ, ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న యువకుడనీ యూపీ ప్రజలకు తెలుసు. అందుకే యువకుడూ, స్థానికుడూ, ఉత్సాహవంతుడూ అయిన అఖిలేష్ నాయకత్వంలో కదిలారు. సమాజ్ వాదీ పార్టీని గెలిపించారు. కాంగ్రెస్ తరఫున అఖిలేష్ కు దీటైన యువనాయకుడు ఉండీ, స్థానిక నాయకత్వం బలంగా ఉండీ, పార్టీ కార్యకర్తలు రాష్ట్రం అంతటా చురుగ్గా యుద్ధానికి సంసిద్ధంగా ఉండి ఉంటే రాహుల్ ప్రచారం సార్థకమై ఉండేది. రాహుల్ సృష్టించిన కెరటాన్ని తీరం దాటించి ఓట్ల తుపానుగా మార్చే పరిస్థితులు ఉండేవి. అటువంటి పరిస్థితులు ఏర్పడాలంటే కాంగ్రెస్ అధిష్ఠానవర్గంలో అభద్రతాభావం తొలగిపోవాలి. స్థానికి నాయకులకు స్వేచ్ఛ నివ్వాలి. వారిని బలపడనివ్వాలి.
భారతీయ జనతా పార్టీకి అదనపు సమస్యలు ఉన్నాయి. దేశాన్ని సమర్థంగా పరిపాలించిన వాజపేయి వారసత్వాన్ని ఆ పార్టీ మరించింది. అన్నివర్గాలనూ కలుపుకొని పోయే వాజపేయి తరహా రాజకీయాను భాజపా విస్మరించింది. ఆరెస్సెస్ జోక్యంతో లాల్ కృష్ణ అద్వానీ చురుకైన పాత్ర పోషించడం లేదు. చివరికి నరేంద్ర మోడీకి పగ్గాలు అప్పగించాలనే తీర్మానం చేసే అవకాశం కనిపిస్తున్నది. సంకోచం వదిలి ఏదో ఒక నిర్ణయం తీసుకొని నాయకత్వం గురించి స్పష్టమైన వైఖరి ప్రకటిస్తే, భాజపా గెలిస్తే ప్రధానమంత్రిగా ఎవరిని ఎన్నుకుంటారో ప్రకటిస్తే ప్రధాన ప్రతిపక్షానికి కొంత మేలు జరుగుతుంది. జాతీయ పార్టీలు స్వీయబలహీనతలను అధిగమించకపోతే, ఇల్లు చక్కదిద్దుకోపోతే ప్రాంతీయ పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి యూపీఏ, ఎన్ డీ ఏలకు ప్రత్యామ్నాయంగా సరి కొత్త సంకీర్ణం ఏర్పడే అవకాశం ఉంది. అదే జరిగితే 2014నాటి సార్వత్రిక ఎన్నికలు దేశ చరిత్రను మరో మలుపు తిప్పుతాయి. ఇది సంధికాలం. జాతి యావత్తుకూ పరీక్షా సమయం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment