Thursday, March 15, 2012
నిప్పుల కుంపటి పై నిప్పన్ లు... వల్ల కాదని వణుకుతున్న జపనీయులు
నిప్పుల కుంపటి పై నిప్పన్ లు... వల్ల కాదని వణుకుతున్న జపనీయులు
జపాన్ పై ప్రకృతి పగ బట్టిందా... గతేడాది సునామీ మృత్యు ఘడియలను మర్చిపోక ముందే.. మరో ప్రమాద ఘంటిక మోగింది. ప్రతి రోజూ తొలి సూర్యోదయాన్ని చూసే ఈ నేల... అగ్ని శిఖలను కడుపులో దాచుకొని నిత్యం గడగడ వణుకుతోంది.. ఆ చల్లని సముద్ర గర్భంలో దాగిన బడబానలమేదో అప్పుడప్పుడు జడలు విప్పుకొని కడలిని కల్లోలం చేస్తుంది. ఈ కల్లోలం సముద్ర తీరం దాటి జపాన్ ప్రజల జీవితాలను తాకుతోంది..
సాంకేతిక పరిజ్ఞానం వినియోగించు కోవడంలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిన దేశం జపాన్. ఈ చిన్న దేశం నుంచి ఎన్నో రకాల నాణ్యమైన ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వస్తువులను తయారు చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తుంది. కానీ ఇప్పుడీ దేశాన్ని ఓ పీడ కల వెంటాడుతోంది. జపాన్ దేశంలో అగ్ని పర్వతాలు ఎక్కువగా ఉంటాయి. ఈ దేశాన్ని ఆవరించి ఉన్న సముద్ర గర్భంలో కూడా అగ్రి పర్వతాలు నిత్యం ఎగసి పడుతుంటాయి.. ఈ అగ్ని పర్వతాల సమయంలో భూ గర్భంలో ఫలకాల సర్ధుబాటుల వల్ల నిత్యం భూ కంపాలు సంభవిస్తున్నాయి.
సముద్రంలో పుట్టిన ఈ భూ కంపాల తాకిడికి సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగిసి పడి తీరాన్ని దాటి భూమి పైకి ఎగబాకుతున్నాయి. దీంతో తీర ప్రాంతంలో ఉన్న పట్టణాలు జల ప్రళయంలో చిక్కుకొని విలవిల్లాడుతున్నాయి. ఈ విలయ తాండవంలో ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి
సరిగ్గా ఏడాది క్రితం... ఉన్నట్టుండి జపాన్ తీరానికి దూసుకొచ్చిన రాకాసి కెరటాలు వందలాది మందిని కబళించాయి. సముద్రంలో ఉన్న నావలన్నీ అల్లకల్లోలమయ్యాయి.. సమద్ర తీరంలో ఉన్న పట్టణాలన్నీ జలమయమయ్యాయి. ఈ కెరటాల దారిలో ఏది ఉన్న అది నేల మట్టం అయింది ఎన్నో బ్రిడ్జిలు.. వాహనాలు, భవంతులు, వృక్షాలు, జంతువులు.. ఇదీ అదీ అనే తేడా లేకుండా కెరటాల దారిలో ఏది వస్తే దాన్ని తమ ప్రవాహంలో కలుపుకున్నాయి. విలువైన వాహనాలు, వస్తువులు ఎన్నో నీళ్ల పాలయి, పనికి రాని వస్తువులుగా మారిపోయాయి. అణు కర్మాగారాల్లో నీరు జొరబడి రేడియో వికిరణాలు విడుదలవుతాయని అందరూ భయపడ్డారు. ఈ వికిరణాలు సముద్రం మార్గం గుండా పొరుగు దేశాల పై కూడా ప్రభావం చూపబోతున్నాయనే వదంతులు వ్యాపించాయి. సునామీ వేటుకు మృత్యువాత పడ్డవారు కాక బతికున్న వారు రేడియో ధార్మకత ప్రభావం వల్ల చర్మవ్యాధులతో నిత్య నరకం అనుభవించాలేమోనని గడగడ వణికారు. కానీ ఆ ప్రమాదం తృటిలో తప్పింది. అయినా జపాన్ లాంటి సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశం కాబట్టి సాధ్యమైనంత త్వరగా కోలుకుంది.
ఇప్పుడిప్పుడే జపాన్ ఆ పీడ కలల గుర్తుల నుంచి తేరుకుంటుంది.. ఆ విషాద ఛాయలను మర్చిపోయే ప్రయత్నం చేస్తోంది. సునామీ సుడిగుండంలో కోల్పోయిన తమ వారిని గుర్తు చేసుకొని... సముద్రజలానికి తమ కన్నీళ్లు జోడించి నివాళులర్పించారు. వీరి పుష్పగుచ్చాలు చూసి కడలి కెరటాలు గతాన్ని గుర్తు తెచ్చుకున్నాయోమో అన్నట్టు మళ్లీ కడలిగర్భం కంపించింది. అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జపాన్ లో వచ్చిన భూకంపం రిక్టర్ స్కేల్ పై 7.2 గా నమోదయింది. అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరిచిపోయిన భయం మళ్లీ గుబులు రేపింది. ఏడాది క్రితం చూసిన మృత్యు హేలను గుర్తు తెచ్చుకొని అప్రమత్తమయ్యారు. నిప్పల కుంపటి పై నిలుచున్న ఈ నిప్పన్ ల భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అని జపాన్ వాసులు భీతిల్లుతున్నారు. సునామీ రాకను ముందే గుర్తించి అధికారులు చెబుతున్నా ఏమరుపాటున ఏ రోజైనా కడలి గుప్పిట్లో కలిసిపోవలి వస్తుందేమో నని హడలిపోతున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment