ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Wednesday, March 21, 2012

గుండెలవిసేలా ఏడ్చినా... పోయిన బిడ్డ వస్తుందా.. ఈ పాపం ఎవరిది?


గుండెలవిసేలా ఏడ్చినా... పోయిన బిడ్డ వస్తుందా.. ఈ పాపం ఎవరిది?
ఆ బస్సు వారి పాలిట మృత్యు శకటం గా మారింది.. కళ్లముందు ఆడిపాడే విద్యార్ధులు కానరాని తీరాలకు చేరారు.. ఆ బిడ్డల తల్లి దండ్రుల శోకం తీరనిది.. గుండెలవిసేలా విలపిస్తున్న ఆ తల్లి దండ్రుల శోఖానికి అంతే లేదు. ఒక్కబస్సులో ప్రయాణిస్తున్న 50 మందిలో 14 మంది తల్లి దండ్రులకు గర్భశోకం కలిగింది.
పాపం పసివాళ్లు / ఈ పాపం ఎవరిది ?
రోజూ లాగే ఈ రోజూ వీడ్కోలు చెప్పి స్కూల్ బస్సెక్కారు.. కానీ అదే ఆ తల్లులకు.. బిడ్డలు చెప్పిన ఆఖరి వీడ్కోలవుతుందని తెలీదు. మురిపాలు కురిపించే చిన్నారులు.. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే.. తిరిగిరాని తీరాలకు చేరారు.. గుండె చెరువై కుమిలి పోతున్న ఆ తల్లి దండ్రులు ఈ పీడ కల నుంచి తేరుకోలేక పోతున్నారు.
వాగులో పడ్డ బస్సులో తమ పిల్లలు దొరుకుతారేమోనని వెదుకుతున్న ఆ తండ్రుల గుండెలు ఎంత తల్లడిల్లుతున్నాయో
ప్రమాదానికి కారణం ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించబోయినందుకే బస్సు వాగులో పడిందని చెబుతున్నా... అదొక్కటే కారణమా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. చిన్నారులను పొట్టన బెట్టుకున్న పాపం ఎవరిది..
వాగు వద్ద ఉన్న బ్రిడ్జి ప్రమాదాలకు నిలయంగా మారిందా..?
చంద్రుగొండ మండలంలో ఉన్న రోడ్డు సింగిల్ రోడ్డు.. తుంగారం వాగు పై ఉన్న బ్రిడ్జి కూడా ప్రమాదాలకు నిలయం గా మారింది.. ఏ మాత్రం అలసత్వంగా ఉన్నా ప్రాణాలు గాలిలో కలిసి పోవలసిందే.. ప్రమాదాలకు వంతెనలు కారణం అని తెలిసినా... బ్రిడ్జిల వద్ద పాటించాల్సిన జాగ్రత్తలు పాటించడం లేదు..
బస్సు కండీషన్ ఎలా ఉంది..?
ప్రైవేట్ విద్యా సంస్థలకు ప్రభుత్వం మార్గ దర్శకాలు సూచించింది.. కానీ చాలా పాఠశాలలు నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. ఈ రోజు ప్రమాదానికి కారణమైన బస్సు కండీషన్ పై కూడా స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
డ్రైవర్ నైపుణ్యం ఎంత ?
స్కూల్ బస్సు నడిపే డ్రైవర్‌కు ఎంతో నైపుణ్యం ఉండాలి. కానీ ఒక్కోసారి కొత్తగా డ్రైవింగ్ లోకి వచ్చిన వారిని కూడా స్కూల్ యాజమాన్యాలు డ్రైవర్లుగా నియమిస్తున్నాయి. ఎల్‌వీ రెడ్డి స్కూల్ బస్సు ప్రమాద సమయానికి బస్సు క్లీనర్ డ్రైవింగ్ చేసినట్టు తెలుస్తోంది. డ్రైవర్ తో బాటు క్లీనర్ క్షేమంగా ఈదుకుంటూ బయటపడ్డారు.
ఖండనలతో సరి ...
స్కూల్ ప్రమాదాలు నిత్య కృత్యాలయ్యాయి... ప్రమాదాలు జరిగినపుడు ఖండనలు, సంతాపాలు.. ఎక్స్‌గ్రేషియాలు.. సంప్రదాయంగా మారాయి.. కానీ ప్రమాదాలు నివారించేందుకు తీసుకునే చర్యలు .. పాటించాల్సిన నిబంధనలు మాత్రం కాగితాలకే పరిమితమవుతున్నాయి. స్కూల్ బస్సుల కండీషన్ల పై కూడా రాజీ పడ్డ వారు పసివాళ్ల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఇప్పటికైనా కాదు ఈ అధికారులు ప్రభుత్వం ఎప్పటికి స్పందిస్తుందో..

No comments:

Post a Comment