Monday, October 17, 2011
బరువైన బాల్యం
ఇదేమి జ్ఞాపకం...
వర్షరుతువు జీవితాన్ని ఎంత వాటేసింది
నన్నూ... నా జ్ఞాపకాలను
చినుకు చిగురింపజేసే తలపులెన్నో..
అయ్యో...
నేను కోల్పోయిన బాల్యం..
ఎంత మధురం.. ఎంత దుర్భరం..
బాల్యమంతా పరపీడన పరాయణత్వం
ఒక్కో చినుకూ భూమిని తాకి
మట్టి గంధాన్ని, మకరందాన్ని..
తేనె పరిమళాన్ని వెదజల్లే నీటి ఆవిరులు..
గుప్పున గుబాళించే బాల్య స్మృతులు..
ఆ గుబాళింపులో బాల్యం బావురుమంది.
దారంట తొంగిచూసే మొలకలు
చిరిగిన చొక్కా.. చినిగిన పుస్తకం
అరకలు, బాయి గిరకలు
ఆరుద్ర పురుగులు, ఆవకాయ పచ్చళ్లు
కొత్త తరగతులు, కొత్త మాస్టార్లు
ఒకే ఒక్క చినుకు టైం మిషనైంది
కాల గర్భంలో నిదురించిన
రెండున్న దశాబ్దాలకు మోసుకెళ్లింది..
ఆహా ఈ వర్షరుతువు నా బాల్యాన్ని
దాని బరువును ఎంతగా పెనవేసుకుంది
ప్రతి బాల్యం ఓ మధుర జ్ఞాపకం కాదు..
మధుర జ్ఞాపకాలన్నీ బాల్యాలే..
****************************
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment