రాష్ట్రానికి జబ్బు చేసింది.. ఏ జిల్లా చూసినా జ్వరంతో మసిలిపోతోంది.. దాన్ని తగ్గించుకునే వైద్య ఖర్చులు విని వణికిపోతోంది.. ప్రభుత్వ ధర్మాసుపత్రులు ఎప్పటిలాగే చేతులెత్తేస్తున్నాయి.. ఫలితంగా డెంగ్యూ మహమ్మారికి రాష్ట్ర ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న డెంగ్యూ మరణాలు, వైద్య పరిస్థితి పై ఇది వర్షాకాలానికి.. శీతాకాలానికి సంధి కాలం.. వాతావరణ మార్పులతో జ్వరాలు రావడం, వైరస్ విజృంబించడం సహజమే... కాస్త జలుబు చేసినా ఒళ్లు వెచ్చబడటం కూడా మామూలే.. కానీ ఇప్పుడు మామూలు జ్వరం వచ్చినా గుండె దడదడలాడుతోంది. రక్త పరీక్ష చేసి ఫలితం చెప్పే వరకు టెంపరేచర్ తగ్గనంటోంది.. ఈ మాసంలో ప్రతి ఏటా డెంగ్యూ, చికెన్ గున్యా, విషజ్వరాలు విజృంబించే విషయం ప్రభుత్వ యంత్రాంగానికి తెలియంది కాదు.. అయినా వ్యాధి సోకకుండా ఫలానా చర్య తీసుకున్నామని చెప్పడానికి మచ్చుకు కూడా ఒక్క కార్యక్రమం లేదంటే... ప్రజారోగ్యం పై ప్రభుత్వాధికారులకున్న చిత్త శుద్దిని అర్ధం చేసుకోవచ్చు.. ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితంగా వందలాది మంది రోగులు చనిపోతున్నారు.
డెంగీ జ్వరం... ఇప్పుడీ మాట రాష్ట్రాన్ని వణికిస్తోంది. జ్వరమొచ్చిందంటే గుండె గాబారవుతోంది. ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా డెంగీ వ్యాధి సోకిన వారి సంఖ్య చూస్తే.. మామూలు జ్వారానికి కూడా ఐసీయు బెడ్ రాసే పరిస్థితి.. రాష్ట్రం మొత్తంగా చూస్తే అధికారిక లెక్కలే 800 పై చిలుకే.. ఆసుపత్రికి రాలేక.. ఆటవిక వైద్యాన్ని నమ్ముకొని, అడవి తల్లి ఒడిలో రాలిపోయే గిరిజనుల మరణాలు ఇంకా పూర్తిగా గణాంకాల్లోకి ఎక్కలేదనే అనుకోవాలి.
డెంగీ జ్వరం, మలేరియా జ్వరం, టైఫాయిడ్ జ్వరం, చికెన్ గున్యా, ఇవీ ఇప్పుడు రాష్ట్రాన్ని భయపెడుతున్న ఖరీదైన రోగాలు.. అయితే వీటి ప్రాథమిక లక్షణాలన్నీ ఒకే రకంగా ఉండటంతో వ్యాధి నిర్ధారణకు వైద్యులు వెంటనే ఒక నిర్ణయానికి రాలేక పోతున్నారు. మామూలు జ్వరంతో వచ్చినా ముందు జాగ్రత్తగా అన్ని పరీక్షలు చేయించుకొమ్మంటున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల లిస్టు చూసే రోగికి సగం నీరసం వస్తోంది. ఆ పరీక్షల్లో ఏ ఒక్కటయినా పాజిటివ్‌గా వస్తుందేమోనన్న భయం రిపోర్టు వచ్చేవరకు పీడిస్తూనే ఉంటుంది.. గతంలో చలితో కూడిన జ్వరం వచ్చిందంటే క్లోరోక్విన్ మాత్రలతో బాటు జ్వరం గోళీలు, నాలుగు యాంటిబయాటిక్ మాత్రలు వేసుకుంటే నాలుగు రోజుల్లో ఏ జ్వరమైనా మాయవవ్వాల్సిందే.. కానీ ఇప్పుడు ఆ నాలుగు రోజులు కూడా వేచి చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే డెంగీ వ్యాధి సోకిందంటే గంటల్లో రక్త కణాల సంఖ్య గణనీయంగా పడిపోయి రోగి తీవ్రంగా నీరసించి పోతాడు. వ్యాధి నిరోధక శక్తి క్షీణించి చర్మం పై దద్దుర్లు, పొక్కులు వస్తాయి. విపరీతంగా తల, నొసటి, కళ్ల నొప్పి ఉంటుంది.. ఇందులో సగం లక్షణాలు మామూలు జ్వరాలకు కూడా ఉంటాయి. అందుకే ఈ జ్వరాలను రక్త పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు. ఈ జ్వరాలన్నీ దోమ కాటు వల్ల వచ్చేవే.. ప్రభుత్వంముందస్తు జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల.. దోమల నివారణా చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇప్పడు ప్రజల పీకల మీదకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా డెంగీ మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
టైఫాయిడ్, మలేరియా జ్వరాలకు జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ, కొన్ని ప్రభుత్వాసు పత్రుల్లో వ్యాధి నిర్ధారణ చేసే అవకాశాలున్నాయి. కానీ డెంగీ జ్వరానికి మాత్రం ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిందే. ప్రైవేట్ ఆసుపత్రులు కూడా వ్యాధి నిర్ధారణ కొరకు పెద్ద పెద్ద డయాగ్నసిస్ సెంటర్లకు రాస్తున్నాయి. ఎలీసా టెస్టులో డెంగీ జ్వరం అని నిర్ధారణ అయితే తప్ప డెంగీ వైద్యం చేయకూడదు. అయితే ప్రైవేట్ ఆసుపత్రులు ఇదే సీజన్ గా రోగుల వద్ద నుంచి దండిగా పిండుకుంటున్నాయి. కొందరు ప్రైవేట్ వైద్యులు ప్రమాదకరమైన జ్వరం కాదని ముందే గుర్తించినా రోగి ఆర్ధిక పరిస్థితిని బట్టి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. లేని రోగాన్ని అంటగట్టి తగని వైద్యం చేస్తున్నారు. ఇది ఏ ఒక్క ఊళ్లోనో.. ఏ ఒక్క జిల్లాలోనో కనిపించేది కాదు.. రాష్ట్ర ప్రజానీకాన్ని మొత్తాన్ని ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్య.. ఇప్పటి వరకు నమోదైన డెంగీ జ్వరాల గణాంకాలు చూస్తే వెన్నులో వణుకు పుడుతోంది.. డెంగీ జ్వరం భారిన పడి మరణించిన వారి సంఖ్య గత సంవత్సరం కంటే ఈ ఏడాదే ఎక్కువగా ఉంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రుల్లో జ్వరపీడితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కేవలం వరంగల్, ఆదిలాబాద్ రెండు జిల్లాల్లోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో 350 మంది, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 700 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. అంటే రెండు జిల్లాల్లోనే డెంగీ లక్షాలున్న రోగులు వేయికి పైగా ఉన్నారు. ఇవి అధికారిక అంచనాలు. ఇవి కాక వెలుగులోకి రాని గిరిజన, మారుమూల గ్రామాల్లో రోగుల సంఖ్య ఇంతకంటే ఎక్కువే ఉండొచ్చని సమాచారం. అపరిశుభ్రమైన వాతావరణం, కలుషిత తాగునీరు వంటి కారణాల వల్ల ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. వరంగల్ జిల్లాలో పరిస్థితి తీవ్రంగా ఉండటంతో జిల్లా కలెక్టర్, ప్రభుత్వ వైద్య యంత్రాంగం కదిలింది. నియోజక వర్గాల వారీగా మండల స్పెషాలాఫీసర్లతో సమావేశాలు నిర్వహించి చర్యలు ప్రారంభించారు. 33 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 140 డెంగీ పాజిటివ్ కేసులు నమోదయితే కేవలం ఒకరు మాత్రమే మృతి చెందారని అధికారులు చెబుతున్నారు.
వరంగల్ జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టి, డెంగీ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారగణం సమాయత్తమవుతోంది.
ప్రజలు డెంగీ జ్వరాల బారిన పడి మరణించటం ఈ ఏడాది కొత్తేం కాదు. ఈ సీజన్ లో దోమ కాటు వల్ల జ్వరాలు విజృంభిస్తాయన్న నిజం ప్రభుత్వ యంత్రాంగానికి తెలియంది కాదు. దోమల నివారణే సగం వ్యాధి రాకుండా నివారణ అన్న వాస్తవం కూడా ప్రభుత్వం చెబుతున్న జాగ్రత్తలే.. అయినా ముందు జాగ్రత్త తీసుకోక పోవడంలో ఉన్న మతలబు ఏంటి.. ఈ సీజన్ లో డెంగీ, చికున్ గన్యా, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధి గ్రస్తుల సంఖ్య ఎక్కువే అని తెలిసినా అన్ని గ్రామాలకు సరిపడా మందులు పంపిణీ చేయకపోవడాన్ని ఎలా అర్దం చేసుకోవాలి.. ప్రభుత్వ నిర్లక్షం నీడన జరిగే తప్పిదాలకు ప్రజలు నిండు ప్రాణాలను మూల్యం చెల్లించుకుంటున్నారు.
ఒంగోలు జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రలు, ప్రైవేట్ ఆసుపత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. పరీక్ష చేసిన 91మందిలో 11 మందికి డెంగీ లక్షణాలు కనిపించడంతో మిగతా రోగుల్లో ఆందోళన మొదలయింది. ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలు లేకపోవడంతో రోగులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ ఆసుపత్రులు వైద్య పరీక్షల పేరు చెప్పి వేలల్లో వసూలు చేస్తున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో గత మూడు నెలలుగా 200 మందికి పైగా డెంగ్యూ, విష జ్వరాలతో మృత్యు వాత పడ్డారు. ప్రభుత్వాధికారులు మాత్రం దీన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. డెంగీ వ్యాధి చికిత్సకు అవసరమైన సౌకర్యాలు జిల్లాలో లేకపోవడంతో జిల్లా వాసులు వైద్యం కోసం మహారాష్ట్రకు వెళుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 50 మందికి పైగా డెంగీ కేసులు గుర్తించినట్టు వైద్యాధికారులు చెబుతున్నారు. వీరిలో ముగ్గురు మరణించార. కానీ ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు క్షేత్రస్థాయి రోగుల సంఖ్యకు పొంతన కుదరడం లేదు. రోగుల సంఖ్య వందల్లో ఉంటే ప్రభుత్వ యంత్రాంగం తక్కువ చేసి చెబుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిర్మల్, మంచిర్యాల, బైంసా కేంద్రాలలో డెంగీ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రభుత్వ వైద్యులు మాత్రం అసలు డెంగీ లేదని చెబుతుంటే.. ప్రైవేట్ వైద్యులు మాత్రం డెంగీ తీవ్రత ఎక్కువయిందనే పొంతనలేని సమాధానాలతో ప్రజలు అయోమయంలో పడ్డారు.
దీనికి తోడు గ్రామీణ వైద్యులు కమిషన్లకు కక్కుర్తిపడి నమ్మిన రోగులను కార్పోరేట్ ఆసుపత్రులకు తరలించుకుపోతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులతో గ్రామీణ వైద్యులు కుమ్మక్కై కమిషన్లకోసం కక్కుర్తి పడటంతో సాదారణ రోగులకు కూడా డెంగీ అంటగట్టి అవే మందులు అంటగడుతున్నారు. తాజాగా హైదరాబాద్ కార్పోరేట్ ఆసుపత్రుల్లో వైద్య, ఆరోగ్య శాఖ జరిపిన తనిఖీల్లో ఈ విషయం వెల్లడైంది. కార్పోరేట్ ఆసుపత్రుల్లో డెంగీ వ్యాధికి చికిత్స చేయించుకుంటున్న వారి రక్త నమూనాలు సేకరించి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటీవ్ మెడిసిన్‌కు పంపించి పరీక్షించగా... 65 మందిలో 31 మందికి మాత్రమే డెంగీ ఉన్నట్టు వెల్లడయింది. అయినా సదరు కార్పోరేట్ ఆసుపత్రుల నిర్వాకాన్ని ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. హైదరాబాద్ కార్పోరేట్ ఆసుపత్రుల నిండా నల్లగొండ, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, నిజాబాబాద్, కరీంనగర్, గుంటూరు వాసులు డెంగీ భయంతో చికిత్స చేయించుకుంటున్నారు.
కరీంనగర్‌లో కూడా 57 మండలాల్లో 190 గ్రామాల్లో పారిశుధ్య లోపంతో రోగాలకు నిలయంగా మారాయి. జిల్లాలో మంథని, హుస్నాబాద్, సిరిసిల్ల,ధర్మపురి, పెద్దపల్లి, కరీంనగర్, వేములవాడ మండలాల్లో విషజ్వారాల తీవ్రత అధికంగా ఉంది. ప్రభుత్వాసుపత్రిలో తగిన వైద్యం లభించకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేట్ ఖర్చు భరించలేని వారిని ఆరోగ్ర శ్రీ ఫథకం ఆదుకోలేకపోతోందని ఆవేదన చెందుతున్నారు. డెంగీ వంటి జ్వరాలు ఆరోగ్య శ్రీ పథకం పరిధిలోకి రాకపోవడంతో సామాన్యుడికి ఎదుయ్యే అనుకోని ఖర్చుతో సతమతమవుతున్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే డెంగీ రోగుల సంఖ్య, మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది.. ఏటికేటికీ ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. అయినా ప్రభుత్వం మాత్రం... వచ్చాక చూద్దాం అన్న ధోరణిలో ఉండటం వల్ల సామాన్య ప్రజల ప్రాణాల మీదకు వస్తోంది. ప్రభుత్వం ప్రకటనలతో పొద్దుపుచ్చకుండా ఆచరణలో చిత్తశుద్ధితో వ్యవహరించాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.
ఇదీ రాష్ట్రానికి కుట్టిన నిర్లక్ష్య దోమ ఫలితం.. సకాలంలో వైద్యం అందక, ప్రజల ప్రాణాలను, ఆస్థులను ఫణంగా పెట్టాల్సిన దుస్థితి.. ఈ పరిస్థితిలో మార్పు రాకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదు.
No comments:
Post a Comment