ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Tuesday, October 25, 2011

దీపావళి పండుగ వెనుక అసలు కథ

లోక కంఠకుడు నరకాసురుడు మరణించిన రోజును ప్రజలు దీపావళి పండుగ జరుపుకుంటారు. జగతి యావత్తు వెలుగులు పంచుకునేలా మతాబులు కాలుస్తారు. ఇంతకీ నరకుడు ఎవరు..? అతడి జన్మ వృత్తాంతం ఏంటి..?

నరకాసురుడు భూదేవికి, వరాహమూర్తికి కలిగిన సంతానం అన్నది పురాణ కథనం. పూర్వం, దానవ చక్రవర్తి హిరణ్యకశిపుడి సోదరుడు... హిరణ్యాక్షుడు, భూదేవిని ఎత్తుకెళ్లి సముద్రంలో దాక్కుంటాడు. దీంతో శ్రీహరి... వరాహావతారంలో వచ్చి హిరణ్యాక్షుని హతమార్చి భూదేవిని రక్షిస్తాడు. తనను కాపాడిన వరాహ రూప శ్రీహరిని భూదేవి మోహిస్తుంది. వరాహమూర్తి కారణంగా భూదేవి గర్భం ధరిస్తుంది. భూదేవి-విష్ణుమూర్తి తనయుడి వల్ల తన త్రిలోకాధిపత్యానికి ముప్పు వస్తుందని భావించిన ఇంద్రుడు.. భూదేవి ప్రసవించకుండా ఆమె గర్భాన్ని గడ్డలాగ చేశాడట. ఫలితంగా నరకాసురుడు రమారమి 27 యుగాల పాటు భూదేవి గర్భంలోనే ఉండి పోయాడట. దీంతో తనకు కానుపవ్వాలని భూదేవివిష్ణుమూర్తిని కోరిందట. తాను త్రేతాయుగాన రామావతారంలో రావణ సంహారం జరిపాక శిశువును ప్రసవించగలవని... విష్ణువు, భూదేవికి చెప్పాడట.
2: 27 యుగాల పాటు గర్భంలో ఉన్న నరకుడు... త్రేతాయుగంలో.. రావణుడు హతమైన రోజున జన్మించాడు. విష్ణువు, భూదేవిల తనయుడు రాక్షసుడిలా మారడం విశేషం. నరకుడు ఎందుకిలా లోక కంఠకుడయ్యాడు..?
: త్రేతాయుగంలో శ్రీరాముడు, రావణాసురుడిని హతమార్చాక.. భూదేవి నరకుడికి జన్మనిచ్చింది. అయితే... రాక్షసులు మేలుకొని విజృంభించే అసుర సంధ్య వేళ నరకుడు పుట్టాడు. దాంతో తన తనయుడికి రాక్షస లక్షణాలు వస్తాయని ముందే ఊహించిన భూదేవి, నరకుడిని వధించవద్దంటూ విష్ణువును కోరుతుంది. తన చేతిలో తప్ప ఎవరి చేతుల్లోనూ తనయుడికి చావు లేకుండా వరం కోరుతుంది.
: నరకుడికి జన్మనివ్వడానికి ముందే... భూదేవి... సీతను పెంచి పోషించిన జనక మహారాజును ఓ ఉపకారం కోరుతుంది. రావణ వధానంతరం, నరకాసురుని కూడా పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పాలని అడుగుతుంది. ఆమెకు ఇచ్చిన మాట ప్రకారం జనకుడు రావణ వధానంతరము జన్మించిన భూదేవి కుమారునికి నరకుడని పేరు పెట్టి, విద్యా బుద్ధులు నేర్పుతాడు. నరకునికి పదహారు సంవత్సరాల వయసు రాగానే.. భూదేవి వచ్చి అతణ్ణి గంగాతీరానికి తీసుకు వెళ్లి... అతని జన్మ వృత్తాంతాన్ని చెబుతుంది. అదే తరుణంలో.. విష్ణుమూర్తి ప్రత్యక్షమై నరకునికి శక్తి అయుధాన్ని, దివ్య రథాన్ని అనుగ్రహించి, ప్రాగ్జ్యోతిష నగరం రాజధానిగా చేసుకొని కామరూప దేశాన్ని ఏలుకొమ్మని చెప్పి భూదేవితో సహా అదృశ్యమవుతాడు. ఆ విధంగా నరకాసురుడు ప్రాగ్జ్యోతిషపురాన్ని రాజధానిగా చేసుకొని రాజ్య పరిపాలన చేసేవాడు.
3: కామరూప దేశాధినేత అయ్యాక కొంత కాలానికే నరకుడు లోక కంఠకుడిగా మారిపోతాడు. అసుర సంధ్యా సమయాన జన్మించడం.. దుష్టుల సహవాస దోషం కారణంగా.. రాక్షస లక్షణాలను పుణికి పుచ్చుకుంటాడు. నరకుడు.. సాధు సత్పురుషులతో పాటు, దేవతలనూ వేధించడం మొదలు పెడతాడు.
భూదేవి భయపడ్డట్లుగానే, నరకుడు జనన కాల దోషం కారణంగా.. రాక్షస లక్షణాలు పొందాడు. పైగా బాణాసురుడు, జరాసంధుడు, కంసుడు, శిశుపాలుడు, దంతవక్రుడు, పౌండ్రక వాసుదేవుడు, కాలయవనుడు లాంటి దుష్టుల సహవాస దోషంతో దేవతలకు జన్మించినప్పటికీ లోకకంఠకుడైన రాక్షసుడిగా మారాడు. అతడు దేవతలపై అకారణ ద్వేషాన్ని పెంచుకుని వారిపై దాడి చేసి దేవతలను జయించాడు. వరుణుడి ఛత్రాన్ని లాక్కున్నాడు. మేరుపర్వతానికి పోయి దానిలోని మణి పర్వతాన్ని తీసుకున్నాడు. అంతటితో ఆగకుండా.. దేవేంద్రుని తల్లి అదితి కుండలాలను బలవంతంగా లాక్కు వెళ్లాడు.
: నరకుడు సాధు సత్పురుషులను కూడా అతి కిరాతకంగా హింసించాడు. ఒకనాడు వశిష్ఠ మహర్షి ప్రాగ్జ్యోతిష పురములోని కామాఖ్యాదేవి ఆరాధనకు వెళ్లగా... నరకుడు ఆలయ తలుపులు మూయించాడట. దీంతో కోపించిన వశిష్టుడు జన్మదాత చేతుల్లోనే మరణిస్తావని శపిస్తాడు. ముని శాపానికి భయపడ్డ నరకుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకుని.. దేవతలు, రాక్షసుల నుంచి మరణము లేకుండా వరాన్ని పొందాడు. ఆ వర గర్వంతో మరింత రెచ్చిపోయాడు. ఋషులను మరింతగా బాధించాడు. 16 వేల మంది రాజకన్యలను బంధించాడు.
: నరకుని బాధలను సహింపలేక ఇంద్రాది దేవతలు, రుషులు శ్రీకృష్ణునితో మొరపెట్టుకుంటారు. విష్ణ్వంశతో అవతరించిన శ్రీకృష్ణుడు.. దేవతల ప్రార్థనలతో కరిగి.. నరకుని సంహరించేందుకు కామరూప దేశానికి వెళ్ళాడు. ఆయన ఇష్టసఖి సత్యభామ కూడా శ్రీకృష్ణునితో కలిసి యుద్ధానికి వెళుతుంది.

నరకుడిని వధించేందుకు ప్రాగ్జోతిష పురం వెళ్లిన సత్యభామా కృష్ణులకు... శత్రు దుర్భేద్యమైన దుర్గాల వలయాలు ఆశ్చర్య పరుస్తాయి. పంచ దుర్గావృతమైన ప్రాగ్జ్యోతిషపురాన్ని ఛేదించడానికి శ్రీకృష్ణుడు యోగమాయను ఉపయోగిస్తాడు.

: నరకుడి కామరూప దేశపు రాజధాని ప్రాగ్జ్యోతిష పురం అత్యంత భయంకరంగా ఉండేది. దాని భేదించడం సామాన్యులకే కాదు.. శక్తియుక్తులున్న ఇంద్రాది దేవతలకూ అసాధ్యం. జయించడానికే కాదు ముట్టడించడానికీ వీలుకాని దుర్గ పంచమంగా నిర్మితమైంది. ప్రాగ్జ్యోతిషపురం... గిరిదుర్గం, శస్త్ర దుర్గం, జలదుర్గం, వహ్నిదుర్గం, వాయుదుర్గం అనే ఐదు విభిన్నమైన కోటలతో నిర్మితమైంది. :‌ తొలి వరుసలో కొండలతో నిండిన దుర్గం, రెండో వరుసలో బాణాలతో రూపొందించిన దుర్గం, మూడో వరుసలో వేగంగా ప్రవహించే నదీనదాలు ఉంటాయి. నాలుగో వలయంలో ఎగసి పడే అగ్నికీలలు, చివరి వరుసలో శత్రు భయంకరమైన... ప్రచండ గాలులతో నిండిన దుర్గం ఉంటుంది. వీటన్నింటినీ మించి.. ఎందరో యోధానుయోధులు.. నగరం చుట్టూ కాపలాగా ఉంటారు. ఆ పైన ఎలాంటి వారినైనా బంధించి వేసే మురాసురుడి పాశాలు ఉన్నాయి. ఇన్నింటిని దాటి ప్రాగ్జ్యోతిషపురంలో ప్రవేశించడం మహామహులకే సాధ్యం కాదు.
: అయితే.. శ్రీకృష్ణుడు భగవత్స్వరూపుడు. నరకుడిని వధించేందుకు వెళ్లిన వెన్నుడు.. తన గదా దండంతో గిరిదుర్గాన్ని తుత్తునియలు చేస్తాడు. అలాగే, మహామహిమాన్వితాలైన బాణాలతో శస్త్ర దుర్గాన్ని ఛేదిస్తాడు. సుదర్శన చక్రాన్ని స్మరించి, ఆ చక్రాయుధంతో మిగిలిన దుర్గాలను ఛేదిస్తాడు. మురుడి పాశాలను కూడా ముక్కలు ముక్కలుగా చేస్తాడు. సమరోత్సాహంతో.. తన పాంచజన్యాన్ని పూరిస్తాడు. నీటిలో నిద్రలో ఉన్న మురుడు పాంచజన్య రవానికి ఉలికిపడి లేచి, శ్రీకృష్ణుని పైకి యుద్ధానికి వస్తాడు. అతడు విసిరిన గదను శ్రీకృష్ణుడు తుత్తునియలు చేస్తాడు. చక్రాయుధంతో.. మురుడి ఐదు తలలనూ నరికేస్తాడు. మురుడి ఏడుగురు కుమారులూ కృష్ణునితో యుద్ధానికి రాగా.. వారినీ హతమార్చుతాడు.
: నరకుడి వధచారులు, సేవకుల ద్వారా.. పంచదుర్గాలు ఛేదితమైన విషయాన్ని, మురుడు హతుడైన సంగతిని నరకుడు తెలుసుకుంటాడు. ఇక తానే యుద్ధానికి సమాయత్తమవుతాడు.
: శ్రీకృష్ణుడి శక్తిని గురించి తెలుసుకున్న నరకుడు నేరుగా తానే యుద్ధానికి వస్తాడు. గరుత్మంతుని మీదకు శక్తి అస్త్రాన్ని వేస్తాడు. అయితే.. వజ్రాయుధాన్నే లెక్కచేయని గరుడుడిని శక్తి అస్త్రం పెద్దగా బాధించదు. నరకుడికి శ్రీకృష్ణుడికి మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది. సత్యభామ... నరకుడు తన కొడుకేనన్న సంగతి గుర్తించలేకపోయింది. పైగా నరకుడు ఆమెతో కామాతురుడై, అసభ్యంగా ప్రసంగిస్తాడు. దానితో ఆమె ఆగ్రహించి, శ్రీకృష్ణుడు అనుగ్రహించిన దివ్యాస్త్రంతో నరకాసురుణ్ణి సంహరిస్తుంది.
2 : నరకుడు హతమయ్యాక, సత్యభామగా అవతరించిన భూదేవికి పూర్వస్మృతి కలుగుతుంది. తనకిచ్చిన వరం ప్రకారమే.. శ్రీహరి నరకుడిని తన చేత వధింపచేశాడని గుర్తిస్తుంది. పుత్రశోకాన్ని దిగమింగి.. తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని శ్రీకృష్ణుని ప్రార్థిస్తుంది. దీంతో.. నరకుడు మరణించిన రోజు నరక చతుర్దశిగా ప్రసిద్ధమవుతుందని భగవంతుడు వరమిస్తాడు.
: నరకుని వధతో.. అతడి చెరలో ఉన్న సాధు జనులు, పదహారు వేలమంది రాజకన్యలు విముక్తులవుతారు. వారు శ్రీకృష్ణునే వరించామని చెప్పటంతో, ఆయన వారిని వివాహమాడతాడు. లోకకంఠకుడైన నరకుడి పీడ విరగడైందన్న సంతోషంతో ప్రజలు పండుగ జరుపుకుంటారు. ఆశ్వయుజ కృష్ణ చతుర్దశినాటి రాత్రి రెండుజాములకు నరకాసుర సంహారం జరిగిందని పురాణాలు చెబుతాయి. నరకుని పీడ విరగడ కావడంతో.. ఆనంద పరవశులైన భూలోక వాసులు ఆ మిగిలిన రాత్రి భాగంలోను, మరునాడూ పండుగ జరుపుకొన్నారు. అప్పటి నుంచి ఆ రెండు రోజులు నరక చతుర్దశి, దీపావళి అమావాస్యలుగా ప్రసిద్ధి పొందాయి. నరకుని వధించాక.. అతని కుమారుడు భగదత్తుని కామరూప దేశానికి రాజును చేసి... శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై ద్వారకకు తిరిగి వెళతాడు. నరకుడు అపహరించిన దేవమాత అదితి కర్ణకుండలాలను తీసుకున్న శ్రీకృష్ణుడు.. పారిజాతాన్ని తెచ్చేందుకు వెళ్లినప్పుడు, ఆమెకు అప్పజెబుతాడు.
నరకుడు పరిపాలించిన కామరూప రాజ్యపు ఆనవాళ్లు నేటికీ భారతావనిలో కనిపిస్తాయి. ప్రస్తుతం అసోం రాష్ట్రంలో దీని ఆనవాళ్లు ఉన్నాయని చెబుతారు. కామాఖ్య పట్టణమే నాటి ప్రాగ్జ్యోతిషపురమన్నది హిందువుల నమ్మకం.
: అసోం రాష్ట్రం.. గౌహతికి దగ్గర్లో నీలాచల పర్వతం ఉంది. ఎటు చూసినా పచ్చదనంతో.. అద్భుతమైన ప్రకృతి రమణీయతతో నీలాచల పర్వతం అనిర్వచనీయమైన ఆనందాన్ని కలిగిస్తుంది. అక్కడ కామాఖ్యదేవి మందిరం ఉంది. ఈ ప్రదేశాన్ని చూసే వారికి ఆ జనని నిజస్థానం చేరుకున్న అనుభూతి కలుగుతుంది. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన కామాఖ్య... దర్శన మాత్రాన్నే పాపాలను హరించి జన్మజన్మలకు సరిపడా పుణ్యాన్ని ప్రసాదిస్తుందని భక్తులు నమ్ముతారు.
: కామాఖ్యదేవి కొలువైన నీలాచల పర్వత శ్రేణిని చేరడానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి మెట్ల మార్గం, రెండోది రోడ్డు మార్గం. మెట్ల మార్గంలో వెళ్లడానికి ఓ గంట సమయం పడుతుంది. కామాఖ్య గేట్‌ నుంచి మొదలయ్యే రోడ్డు మార్గంలో వెళ్లడానికి సిటీ బస్సులు, ట్యాక్సీలు, ఆటోలు కావలసినన్ని అందుబాటులో ఉంటాయి. ఈ రెండు మార్గాల ద్వారానూ భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు.
లోకకంఠకుడైన నరకుడు మరణించడంతో.. చీకట్లు తొలిగి పోయాయని, దీపాలు వెలిగించడం ఆనవాయితీ. అయితే.. దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవికి ఎందుకు పూజ చేస్తారు..? దీపానికి, లక్ష్మీదేవికి ఏంటి సంబంధం..?
: నరకాసురుడు హతుడవడంతో... లోకాన్ని అలముకున్న తిమిరం తొలగి పోయిందని ప్రాగ్జ్యోతిష పురం ప్రజలు భావించారు. అందుకే తిమిరాన్ని తొలగించేందుకు జగతి మొత్తం వెలుగులు పరచుకునేలా... ఇంటింటా లెక్కకు మిక్కిలిగా దీపాలు వెలిగించారు. తిమిరమున్న చోట దరిద్రదేవత జేష్ఠాదేవి కొలువుంటుందని, చిన్నపాటి దివ్వెను వెలిగించినా ఆమె అదృశ్యమవుతుందని హిందువులు నమ్ముతారు. ఎక్కడ వెలుగులు ఉంటే అక్కడికి లక్ష్మీదేవి వచ్చి చేరుతుందంటూ ఎన్నో పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి.
: దీపానికి లక్ష్మీదేవికి ప్రత్యక్ష సంబంధం ఉందని నమ్ముతారు. పూర్వం దూర్వాస మహర్షి... శక్తిని ప్రసన్నం చేసుకుని ఆమె కంఠాన ఉన్న హారాన్ని అనుగ్రహంగా పొందాడు. దాన్ని త్రిలోకాధిపతి దేవేంద్రునికి అందిస్తాడు. అయితే... మత్తులో మునిగి ఉన్న ఇంద్రుడు ఆ హారాన్ని ఐరావతం మీద వేస్తాడు. ఆ మత్తేభం, హారాన్ని కింద పడేసి, కాళ్లతో తొక్కేస్తుంది. అది చూసిన దూర్వాసుడు మహోగ్రుడై.. సర్వ సంపదలను కోల్పోతావని దేవేంద్రుని శపిస్తాడు. ఫలితంగా.. దేవేంద్రుడు త్రిలోకాధిపత్యాన్ని, సర్వ సంపదలనూ కోల్పోతాడు. తన తప్పిదానికి పశ్చాత్తాప పడ్డ దేవేంద్రుడు, దిక్కుతోచక, శ్రీహరిని శరణు వేడుతాడు. ఒక జ్యోతిని వెలిగించి దాన్నే శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావించి పూజించమని శ్రీహరి సూచిస్తాడు. ఆ విధంగా దేవేంద్రుడు పూజాధికాలు నిర్వహిస్తూ ఉంటాడు. ఆ పూజలకు సంతృప్తి చెందిన లక్ష్మీదేవి, ఇంద్రునికి పూర్వ వైభవాన్ని ప్రసాదిస్తుందన్నది పురాణ కథనం.
: అప్పటి నుంచి దీపాన్ని లక్ష్మీదేవి ప్రతీకగా భావిస్తూ... పూజించడం ఆనవాయితీ. దీపావళి పర్వ దినాన, సిరిదేవి కరుణ కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. అయితే దీపాలను ఏ దిక్కు పడితే ఆ దిక్కున ఉంచి పూజిస్తే మాత్రం ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయని ప్రాచీనులు విధివిధానాలను నిర్దేశించారు.
: తూర్పు, ఉత్తర ముఖంగా దీపాలను ఉంచే ఇళ్లలో, దీపాల కాంతి నలుమూలలా వ్యాపించే ఇళ్లలో లక్ష్మీదేవి కరుణ అమితంగా సిద్ధిస్తుందట. సాయంత్రం వెలిగించిన దీపం ఉదయం పూజ వరకూ వెలిగే ఇళ్లలో అష్టయిశ్వర్యాలు సమకూరుతాయట. సాయంత్రాలు తులసి కోట ముందు దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అమితమైన కరుణ సొంతమవుతుందట. పడమర, దక్షిణ దిక్కుల్లో దీపాలు ఉంచే ఇళ్లు... దరిద్రానికి చిరునామాగా మారతాయట.
: దివ్వెలు వెలుగులనే కాదు.. సిరిసంపదలనూ పంచి పెంచుతాయి. అందుకే... దీపాన్ని లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించి పూజించడం ఆనవాయితీ.
దీపావళి రోజున చేయాల్సినవి.. చేయకూడనివి
శుక్రవారం రోజు ధనాన్ని ఖర్చు చేయరాదు
దీపాలను ఎప్పుడేగాని నోటితో ఊపి ఆర్పరాదు
శుక్రవారం పూట అన్నాన్ని దానం చేయవద్దు
అక్క చెల్లెళ్ల మనసు కష్టపెట్టవద్దు
సూర్యోదయ, సూర్యాస్తమయ వేళల్లో నిద్ర పోరాదు
ఇలా చేస్తే లక్ష్మీదేవి ఎప్పుడూ విడిచి వెళ్లదు
ఇల్లాలిని సంతోషంగా ఉంచాలి
అబద్ధాలు ఆడరాదు
ఆవులను పూజించాలి
ముంగిళ్లు ముగ్గులతో కళకళ లాడాలి
గడపలకు పసుపు పూయాలి
ఇట్లాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది.
అంతేకాదు.. పువ్వుల్లో, పాలల్లో, ధాన్యపు రాశుల్లోనూ లక్ష్మీదేవి నిలకడగా ఉంటుంది.

No comments:

Post a Comment