ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Friday, October 14, 2011

నెలరోజుల 'సమ్మె'ట

తెలంగాణ మొత్తాన్ని దిగ్భందం చేస్తే తప్ప తెలంగాణ రాదనే ఉద్దేశ్యంతో తల పెట్టిన సకల జనుల సమ్మె నేటికి నెలరోజులు కావస్తుంది. తెలంగాణలో సాగుతున్న సకల జనుల సమ్మె నిన్న మొన్నటి దాకా రాష్ట్రాన్నే ఇబ్బంది పెట్టింది. తాజాగా అది దేశ రాజదాన్నే చీకటి మయం చేసే స్థాయికి ఎదిగింది. సమ్మె ఇలానే కొనసాగితే దేశ ఆర్ధిక పునాదులే కదులుతాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇంతకీ తెలంగాణ సకల జనుల సమ్మెలో ఏం దాగుంది.. ఈ సమ్మె యావత్ దేశాన్ని కుదిపేయడం వెనుకున్న మూలాలేంటి.. ముప్పై రోజుల సకల జనుల సమ్మె పై ప్రత్యేక కథనం.


తెలంగాణ ఉద్యమం ఎంత తారా స్థాయికి చేరినా ప్రభుత్వం దిగిరావడం లేదనే ఉద్దేశ్యంతో... తెలంగాణ వాదులంతా ఏకమై సకల జనుల సమ్మెకు పిలుపు నిచ్చారు. ఉద్యోగ, కార్మిక, ఉపాద్యాయ సంఘాలన్నీ ఒక్కతాటి పైకి వచ్చి సకలం బంద్ చేసి తమ సత్తా ఏంటో ఢిల్లీకి చాటాలనుకున్నారు. గత నెల 13న ప్రారంభమైన సమ్మెలో ఎన్నో ఆటుపోట్లు... వదంతులు.. ప్రభుత్వ వ్యూహాలు.. ధిక్కారాలు.. అనధికారికంగా అణిచివేత ఉత్తర్వులు.. విభజించి పాలించే సూత్రాలు.. పరస్పర విరుద్ధ ప్రకటనలు.. అరెస్టులు.. కేసులు.. ఆఖరుకు వదంతులు.. ఇవన్నీ గత నెలరోజులుగా రాష్ట్ర ప్రజలకు వినిపిస్తున్న తాజా వార్తలు.. కళ్లారా చూస్తున్న కష్టాలు.. అనుభవిస్తున్న నష్టాలు. ఒక లక్ష్యం కోసం.. ఒక ఆశయం కోసం.. దశాబ్దాలుగా చేస్తున్న నిరీక్షణలో అంతిమ పోరుకు సిద్ధమైన తెలంగాణ ప్రజల సహనానికి నిలువెత్తు నిదర్శనం.. దేశ చరిత్రలోనే మునుపెన్నడూ ఎరుగని ఒక సత్యాగ్రహ సంగ్రామం..

ఒక ప్రాంతం నుంచి మరోప్రాంతం విముక్తి కోసం చేసే దశాబ్దాల పోరాటం అంతిమ దశకు చేరిందా అంటే అవునని... కాదని... సమాధానం చెప్పలేని దుస్థితి.. రాజ్యం తగలబడిపోతుంటే పిడేలు వాయించుకునే నీరోలను అనుసరిస్తున్న పొలిటికల్ హీరోలున్న రోజులివి.. నీకిస్తే నాకేంటనే రాజకీయ పద్దులు లెక్కగట్టే కాలమిది.. ఈ తరుణంలో తెలంగాణ అనే సున్నిత సమస్యను కఠినంగా ఎదుర్కొవాలనే దురాలోచన... దూరాలోచన... ఇటు ప్రజలను, అటు ప్రభుత్వాన్ని కాస్త ఇరుకున పెట్టేదనే మాట గత నెలరోజుల సమ్మె చెప్పకనే చెబుతుంది.

సకల జనుల సమ్మె హఠాత్తుగా రాత్రికి రాత్రే వచ్చి పడింది కాదు.. అలాగని ఏ ఒక్క రాజకీయ పార్టీయో నిర్ణయం తీసుకొని అమలు చేసింది కూడా కాదు.. తెలంగాణ పై తేల్చకుంటే సకలం స్థంబింప జేస్తామని అన్ని రాజకీయ పార్టీలు మూకుమ్మడిగా కాకున్న ఎవరికి వారైతే ప్రకటించారు. రూపాలు వేరైనా ఒకే రకంగా నినాదించారు.. సకల జనుల సమ్మెను మామూలు సమ్మెగా ఎదుర్కొడానికి ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. విశ్రాంత ఉద్యోగులను రంగంలోకి దింపాలని ప్రయత్నించింది. తాత్కాలిక ప్రాతిపదికన కొత్త వారిని విధుల్లోకి తీసుకునే ప్రయత్నం చేసింది. మరోవైపు ఒకరంగంలో ఉన్న వారిని మరోరంగంలోకి మార్చి ఉపయోగించుకోవలనే ప్రయత్నం కూడా చేసింది.. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆఖరుకు సకల జనుల సమ్మె ముందు రాజ్యం తలవంచక తప్పలేదు. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. తరిగిపోతున్న బొగ్గు నిల్వలు, ఎండిపోతున్న పంటలు, రోడ్డెక్కుతున్న రైతన్న, మండిపోతున్న నిత్యావసర సరుకుల ధరలు, పాఠశాలలను మరిచిపోయిన విద్యార్ధులు, రోడ్డెక్కని ఆర్టీసి బస్సు.. కదలని కరెంటు బిల్లు... ఒక్కటని కాదు.. అన్ని రంగాలపై సకల జనుల సమ్మెప్రభావం స్పష్టంగా కనిపించింది... ఆఖరుకు మద్యం డిపోల్లో కూడా సిబ్బంది బందు ప్రకటించడంతో మద్యం రేట్లు కూడా చుక్కలను వెక్కిరిస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న మద్యాన్ని, బస్సులను ఉద్యమకారులు అడ్డుకోవడంతో... తెలంగాణలో సమ్మెకు వ్యతిరేకంగా ఏపని చేయాలన్నా ఇతర ప్రాంతాల వారు జంకుతున్నారు.

సకల జనుల సమ్మె ప్రభావం వల్ల సింగరెణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయి.. ఇటు రాష్ట్రంతో బాటు అటు దేశంలోనూ విద్యుత్పత్తి నిలిచిపోయింది. మన రాష్ట్రం ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసే ప్రయత్నం చేసినా అక్కడ కూడా బొగ్గు నిల్వలు లేకపోవడంతో కేటాయించిన కరెంటునే కేంద్రం వెనక్కు లాక్కుంది. ఆర్టీసి బస్సు చక్రాలు డిపోల్లోనే నిలిచిపోవడంతో ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండిపడింది. డ్ర్రైవర్లు, కండక్టర్లతో సహా ఆర్టీసి సిబ్బంది మొత్తం సమ్మెకు దిగడంతో రోడ్డు పై ఆర్టీసి బస్సు అనేది కనిపించక వారాలు దాటింది. బొగ్గు పెళ్లను పెకిలించింది లేదు. . ఇతర ఉద్యోగులను ప్రలోబపెట్టి పనులు చేయించుకునే ప్రభుత్వ వ్యూహాన్ని సమ్మెలో ఉన్న ఉద్యోగులు సంఘటితంగా తిప్పి కొట్టగలిగారు. సెట్విన్ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు కూడా సమ్మెకు మద్దతిచ్చి రెండు రోజుల సమ్మె చేశాయి. రైల్ రోకోలకు భయపడ్డ ప్రభుత్వం ఏకంగా రైళ్లనే నిలిపేసింది. సచివాలయంలో ఫైళ్లు కుప్పలు కుప్పలుగా పేరుకొని పోతున్నాయి. పెన్షన్లు, రిజిస్ట్రేషన్లు, ఉపాధి వేతనాలు అన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయినా ప్రభుత్వం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. వందల కోట్ల నష్టంతో బాటు ప్రజల్లో రోజు రోజుకు అసహనం పెరుగుతోంది.. తెలంగాణ వచ్చేవరకు విద్యా సంవత్సరాన్ని వదులు కోవడానికి కూడా విద్యార్ధులు వెనకాడటం లేదు.. ఉద్యోగులు, కార్మికులు ఉపాద్యాయులు జీతం రాకున్నా ఓపిక పడుతున్నారు. కాబట్టి సకల జనుల సమ్మె సామాన్యుడి పై కంటే ప్రభుత్వం పైనే ఎక్కువ ప్రభావం చూపుతోంది. ఈ నెల రోజుల సమ్మె ఎన్ని రోజులు సాగుతుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే తేల్చుకోవాలని ఉద్యమకారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ సమస్యను తేల్చే వరకు సకల జనుల సమ్మె విరమించేది లేదని ఉద్యోగ సంఘాలు తేల్చి చెబుతున్నాయి.

4 comments:

  1. antha thondaraga anthu choodanu.. touch cheyakunda screan ni activate chestha..

    ReplyDelete
  2. The most important lesson from December 10 is that our opponents are resourceful, cunning and unscrupulous.

    We must be ready for a long drawn struggle. The intensity of the movement must be matched by patience.

    ఎన్నేళ్ళయినా వేరు తప్పదు, ఎంత కష్టమొచ్చినా పోరు ఆగదు.

    ReplyDelete
  3. పొద్దు పొడుపును చూడాలంటే చీకట్లో జడుసుకోకుండా వేచి చూడాలి..

    ReplyDelete