ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Saturday, October 1, 2011

బతుకమ్మ పేదోళ్లదా...? పెద్దోళ్లదా..? నిజాలేంటి..?


బతుకమ్మ పండుగకు మూలాలెక్కడ.. బతుకమ్మకు జీవం పోసిందెవరు... ఇప్పుడైతే అన్ని వర్గాల ప్రజలు బతుకమ్మను ఆడుతున్నారు. గతంలో కూడా బతుకమ్మ అందరి బతుకమ్మేనా.. బతుకమ్మకు పూలకు సంబంధం ఏమిటి.. బతుకమ్మ కథల్లో నిజమెంత.. స్పెషల్ స్టోరీ..
బతుకమ్మ.. వెల్లివిరిసిన పూల సంబరం. నడిచొచ్చిచ్చే పూవనం.. మంచు తడికి మురిసిపోయే పూల కొమ్మలు పడుచుల కొనగోటిని తాకే తరుణం.. తడిగాలుల్లో తేనె పరిమళం పరుచుకునే పూలరుతువు.. మత్తడి దునికే నీళ్లతో చిత్తడిగా మారిన నేల పొత్తిళ్లను పొదివి పట్టుకునే పూరెమ్మల గారాబం.. వర్షరుతువుకు.. శీతాకాలానికి నడుమ ఆహ్లాదబరిత పరిమళాలు వెదజల్లే సుమస్మమ్మోహనం.. ఈ రుతువులోనే ఎన్నో ప్రకృతి కార్యాలకు పునాదులు పడతాయి. ఈ రుతువే ఎన్నో వాతావరణ మార్పులకు బీజం వేస్తుంది.. ఈ వాతావరణమే ఎన్నో ఉత్పరివర్తనాలకు పునాది వేస్తుంది.. చంటిపిల్లను చంకనెత్తుకున్న చందంగా పూలుగుత్తులను ఎత్తుకున్న తంగేడు మొక్కలు.. అడవి పడుచు శిగలో తురుముకున్న కొండ మల్లెల్లా... కొండకోనల్లో వయ్యారంగా నడుస్తున్న కోయ పడుచుల్లా... గాలికి ఊగుతున్న గునుగు పూలు.. ఎంత వర్ణించాలన్నా ఈ రుతువులో కనిపించే ప్రకృతి అందం మాటలకు చాలదు. ఈ సుమతాడన స్పర్శతో మగువ మునివేళ్లు కొత్త అనుభూతితో పొంగిపోతాయి.
మనుషులకు కులాలు మతాలు, కట్టుబాట్లు ఉంటాయి.. నింగి, నేల, ఆకాశం అగ్ని, వాయువు పంచభూతాలకు ఏ కట్టుబాట్లు తారతమ్యాలు లేవు. అలా అని చాటి చెప్పేందుకే బతుకమ్మ పండుగలో పదం పదం.. పాదం పాదం కలిపి ఆటపాటల్లో పాల్గొంటారు. అయితే ఈ పండుగను తెలంగాణ జాతి మొత్తం జాతీయ పండుగలా జరుపుకుంటున్నా.. ఒకప్పుడు ఇది కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమనే వాదనలు కూడా ఉన్నాయి. . బతుకమ్మ పుట్టుకకు కారణమైన పురాణగాథలు చాలానే ఉన్నా.. అసలు కారణం మాత్రం ఒక్కటేనని పరిశోధకులు అభిప్రాయం.. విజ్ఞానం అంతగా అభివృద్ది చెందని రోజుల్లో ప్రసూతి మరణాలు అధికంగా జరిగేవి.. వివిధ రకాల కారణాల వల్ల పిల్లలు పురుటిలోనే చనిపోయేవారు.. పుట్టిన పిల్లలు వరసగా చనిపోతుంటే.. తర్వాత పుట్టిన సంతానం తమది కాదన్నట్టు.. పెంటకుప్ప పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.. అలా పెంటకుప్ప పై శిశువును వదిలితే ఆ తమది కాదని దుష్టశక్తులు వదిలేస్తాయని పూర్వికుల నమ్మకం. పెంటకుప్ప పై చాటలో పెట్టిన శిశువులు కొందరు కాకతాళీయంగా బతికారు.. అటువంటి వాళ్లకు పెంటయ్య, పెంటమ్మ అనే పేర్లు కూడా పెట్టారు. కాస్త సంపన్న వర్గమైతే మరీ పెట్టకుప్పమీద పెట్టకుండా కాసిన్ని పూలు, ఆకులు ఒక్కచోట చేర్చి దాన్నే చెత్త కుప్పగా భావించి శిశువును పూలదిబ్బ పై పడుకోబెట్టేవారు. పూలదిబ్బ పై పడుకోబెట్టిన శిశువు అదృష్టవశాత్తూ బతికినందువల్ల.. ఆ పూల దిబ్బనే బతుకమ్మ అన్నారు.. అంతేకాదు. పూలదిబ్బ పై పడుకోబెట్టిన శిశువు ఏడుస్తుంటే మహిళలంతా చుట్టూ చేరి ఊయల పాటలు పాడేవారు.. తమ శిశువును కాపాడినందు వల్ల ఆ పూలదిబ్బకు మహిహలున్నాయని.. ఆ పూలకుప్పే తమ ఇలవేల్పని భావించి గౌరమ్మను చేర్చి పూజించడం అనాదిగా ఆనవాయితీగా వస్తోంది..
ఇంతకీ బతుకమ్మ పేదల పండుగా.. పెద్దోళ్ల పండుగా.. అనే వాదన ఎదురయినపుడు దీన్ని పేదల పండుగ అనే ఎక్కువ మంది వాదిస్తారు. ఎందుకంటే ఈ పండుగ పుట్టుకలోనే పేదతనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. బతుకమ్మ కోసం బొడ్డెమ్మను పుట్టమన్నుతో చేస్తారు. బతుకమ్మను అడవిపూలతో పేరుస్తారు.. కాబట్టి ఏ ఖర్చూ ఉండదు.. అంతేకాకుండా.. గౌరమ్మను పూజిచేందుకు ఏ మంత్ర తంత్రాలూ వాడరు.. కేవలం పాటలతోనే ఆదిశక్తిని స్తుతిస్తారు. ముగ్గులు, పూలు, పాటలే ఈ బతుకమ్మ ఖర్చులు.. బతుకమ్మకు పెట్టే ప్రసాదం కూడా చాలా తక్కువ ఖర్చుతో కూడుకొన్నది.. ఒక్కముక్కలో చెప్పాలంటే ఇంట్లో ఉన్న నానబెట్టిన బియ్యం, పాలు, అటుకులు, బెల్లం ఇవే ప్రసాదాలు.. సంపన్న వర్గం చేసుకునే వేడుకలకు చక్కర పొంగలి, నూనెతో చేసే పిండి వంటలు, దేవుడి కళ్యాణం, ఆ కళ్యాణానికి మంత్రాలు, వంటి రకరకాల తంతులుంటాయి.. బతుకమ్మ వేడుకల్లో ఇవేవీ ఉండవు. అందుకే బతుకమ్మ పేదల పండుగ అని చాలా మంది వాదిస్తారు.
బతుకమ్మ పండుగకున్న విశిష్టత మరోటి ఉంది.. వర్షరుతువులో కురిసిన వానలన్నీ చెరువుల్లో చేరుతాయి. ఆ నీటిలో రకరకాల మలినాలు చేరి కలుషితంగా తయారవుతాయి. ఈ కలుషిత నీటిని తంగేడు పూలు శుద్ధి చేస్తాయి. తరువాత కలరా వంటి వ్యాధులు వ్యాపించకుండా గునుగు పూలు అరికడతాయి. పూర్వకాలంలో సంపన్న వర్గాలకు ఇళ్లలో బావులుండేవి.. వాటిలో పంచాయితీ బ్లీచింగ్ పౌడర్ వేసేవారు. కానీ పేద ప్రజలకు బావుల్లో నీటికి ప్రవేశం లేదు. అందుకే వారు మంచినీటికోెసం కుంటలు, చెరువులను ఆశ్రయించాల్సి వచ్చింది. తాము మంచినీటి కోసం వాడే చెరువులు కాబట్టి వారే వాటిని శుద్ధి చేసుకునేవారు. వాడవాడంతా కలిసి తంగేడు గునుగు పూలతో బాటు గౌరమ్మగా పేర్చిన పసుపును కుంటలు చెరువుల్లో కలపడం ద్వారా నీరు శుద్ది అవుతుంది..
కాలక్రమంలో పూలకుప్పగా పూజలందుకున్న బతుకమ్మ కాస్త అనేక రూపాలు మార్చుకొని ఇప్పుడు తెలంగాణ జాతి యావత్తూ జరుపుకునే సంబరంగా మారింది. పుక్కిటి పురాణాలను పక్కన బెట్టి బతుకమ్మ పండుగలో ఉన్న ఔచిత్యాన్ని చూడాలి.. పదిమందిని ఒక్కటి చేసే పూలజాతరను ప్రోత్సహించాలి.. ఆడపడుచులకు అనధికార కౌన్సిలింగ్ కేంద్రాలుగా మారిన బతుకమ్మలను పేర్చే ఇళ్లు సంసారాలను చక్కబరుస్తున్నాయి.. వాదాలు వివాదాలు మాని బతుకమ్మ సంస్కృతిని దేశం మొత్తం ఆచరించే విధంగా తీర్చిదిద్దాలి..

9 comments:

  1. మీ విశ్లేషణ బాగుంది.
    ఇవాళ ఆంద్ర జ్యోతిలో "దళితులకు దూరమైనా బతుకమ్మ" అనే వ్యాసం వచ్చింది (ఆశాలత)
    అదికూడా ఆలోచింప చేసేలావుంది
    అసలు పండుగలన్నీ ఒకవిధంగా ధనికులవీ, అగ్ర కులాల వారివే అని చెప్పవచ్చు.
    చరిత్ర కథలు గాధలు అన్నీ వాళ్ళు రాసుకున్నవే కదా. .
    ఇప్పుడు ఆ చరిత్రనంతా తిరగారాయాల్సి వుంది.
    ఊరూరా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించే వారు విధిగా దళితులను అందులోకి తీసుకొచ్చే
    పాత సంప్రదాయాన్ని మార్చే ప్రయత్నం చేయాలి.
    బతుకమ్మ వర్ధిల్లాలి
    తెలంగాణా వర్ధిల్లాలి
    Rajesh

    ReplyDelete
  2. first two paragraphs are simply sodi. bathukamma is neither pedollu nor peddollu's festival. its ladies festival and irrelevant of cast, economical, social status.

    ReplyDelete
  3. ఒక్కొక్క పువ్వేసి చందమామా...

    http://www.andhrabhoomi.net/ka-main-feature/main-article-184

    ReplyDelete
  4. Brathukamm actual version is "Nijam vallu...agra kulaala vaallu...chinna kulaala vallatho balavantham ga aadinche aata. Anduke aa patala lo badha...valla vyadaha kanipinchedi"

    exact ga cheppalante ippudu dabbunna vaallu...club lo aadistunnaaru kada...papam aadevallu...roju gadava aaduthunnaaru...

    alaage aa rojulllo prana bayamtho dorala mundu aadevallu...

    i read this in telangana history books...

    ReplyDelete
  5. ee content lo pukkiti puranalu nammoddu antaanav malli "deepavali venuka asalu katha" ani ade pukkiti purananni rasinav. Be with one stand.

    by
    giri
    moolavasi

    ReplyDelete
  6. @ గిరి మూల వాసి గారూ.. బతుకమ్మ కాంటెంపరరీ( సమకాలీన ) ఇష్యూ... దీనికి చరిత్రకు సంబంధం ఉంది.. ప్రస్తుతం చర్చ కూడా జరుగుతోంది.. అందుకే దాని పై చారిత్రక వివరణ ఇచ్చాను.. కానీ దీపావళి కి రకరకాల కారణాలున్నాయి.. పుక్కిటి పురాణాలు కూడా రకరకాలు... రాముడు రావణుణ‌్ణి జయించినప్పుడని, నరకసంహారమపుడని... కాళిక అసురుణ్ని సంహరించినపుడని.. ఇలా రకరకాల కథలున్నాయి.. అవేవీ వివాదాస్పదం కావు.. కానీ బతుకమ్మకు తెలంగాన సంస్కృతికి లింక్ ఉండబట్టి విశ్లేషణ చెప్పాను.. దీపావళికి వైదిక సమాచారం ఇచ్చాను..

    ReplyDelete
  7. బాగా బతికిన కుటుంబాల పునిస్త్రీలను మరణాంతరం దేవతగా కొలిచే ఆచారం రాష్ట్రంలో ఉంది. కోస్తా జిల్లాలో లక్ష్మమ్మ కథ ఇలాంటిదే. విషాదకర మరణంనుంచి ఆమె కథకు అతిశయోక్తులు చేర్చి దేవతను చేశారు. బతుకమ్మ కథా అలాంటిదే. ఆమెదీ విషాదకర మరణమే. హృదయం కరిగిన సమాజం ఆ మరణాలకు అందించే నివాళే ఈ పండుగ. అంతే తప్ప పెంటకుప్పలు, పేడకుప్పలు వంటి ఏ ఆధారాలు లేని సొంత కవిత్వాలు వద్దు... వక్రీకరణలు వద్దు. చెరువు గట్ల దగ్గర ఆటలో... చెరువులో బతుకమ్మల వీడ్కోలు పాటలో పేదగొప్ప తారతమ్యాలుండవు. పండగ అందరిదీ. .....ఆధిపత్యమో, న్యూనతా భావమో అడ్డు పడితే.....కుల ఆర్థిక అంశాలు తెరలుగా నిలస్తే దోషం పండుగది కాదు...... మనుషులది.
    చరిత్ర ఎవరు పడితే వారు రాసే కాకమ్మ కథ కాదు.. అది అలాకాబట్టి ఇది ఇలా అనే లాజిక్కు మనం అడ్జెస్టు కావొచ్చుగానీ చరిత్ర అడ్జెస్ట్ కాదు. దీపావళి అయినా మరొకటైనా మన దేశంలో ఏ కథకైనా జనశృతులే ఆధారం. అవి వాస్తవాలనుంచిపుట్టి అతిశయోక్తులు కలిసి కలగాపులగం అవుతాయి. అంతే తప్ప కథ ఒకటి వాస్తవం ఒకటి కాదు. నాటికాలంలో రాజుల ఆనందమే ప్రజల ఆనందం. రాజు విజయమే ప్రజల విజయం. నరకాసుర వధ కృష్టుడనే రాజు ఆనందం... అదే ప్రజల ఆనందమైంది. పండగైంది. దీనికి ఈకలు తోకలు పీకాల్సిన అవసరం లేదు. ఏ మతంలో అయినా ఆ మతానికి చెందిన రాజులు, మహానుబావుల జనన మరణాలు..విజయాలు...ఉత్తానాలు పునరుత్తానాలు పండగ లయ్యాయి. అంతే తప్ప సామాన్యుడి కథ ఏ మతానికి పూజనీయం కాలేదు.... ఇందుకు హిందూ మతం కూడా మినహాయింపు కాదు.

    ReplyDelete