Tuesday, October 11, 2011
మారన్ కథ జైలుకేనా...?
2జి స్పెక్ట్రమ్ కేసులో దయానిధి మారన్ పై సిబిఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఇటు కళానిధి మారన్ ఇంట్లో కూడా సిబిఐ సోదాలు నిర్వహించింది. ఎయిర్ సెల్, మ్యాక్సిన్ ఒప్పందంలో అవకతవకలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలకు సంబంధించి మారన్ సోదరుల పై ఈ సోదాలునిర్వహించారు. మరోవైపు హైదారబాద్ లో అపోలో గ్రూప్ డైరెక్టర్ సునితా రెడ్డి కార్యాలయంలో కూడా సిబిఐ సోదాలు నిర్వహించింది. దీంతో 2జి కేసులో మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఇంతకీ 2జి కుంభకోణం అంటే ఏంటి.. 2జి స్పెక్ట్రం కేసులో ఎవరెవరి పై ఆరోపణలొచ్చాయి. అసలేంటీ 2జి కథ.. ఒకసారి అవలోకిద్దాం..
దేశరాజకీయాలను ఓ కుదుపు కుదిపిన 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం డొంక కదులుతూనే ఉంది. ఈ కుంభకోణానికి సంబంధం ఉన్న ప్రజాప్రతినిధులంతా ఒక్కొక్కరే చెరసాల చెంతకు చేరుకుంటున్నారు. ఇప్పటికే రాజా, కనిమొళిలు జైలు భోగాలు అనుభవిస్తుంటే ఆ జాబితాలోకి మారన్ సోదరులు కూడా చేరనున్నట్టు వార్తలొస్తున్నాయి. మారన్ సోదరులను ఇప్పటి వరకు అరెస్టు చేయనప్పటికీ ఇరువురు సోదరుల పై సిబిఐ కేసులు నమోదు చేసింది.
రాజా, కనిమొళితోనే ఈ కథ కంచికి చేరిందనుకున్నారంతా.. ఆ మధ్య మారన్ కు క్లీన్ చిట్ ఇచ్చినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఆ వెంటనే ఆ వార్తలను సిబిఐ ఖండించడం వెనుక అంతరార్ధం ిఇప్పుడు భోదపడుతోంది. దయానిధి మారన్ కమ్యునికేషన్ల శాఖ మంత్రిగా ఉన్నపుడు ఎయిర్ సెల్, మాక్సిన్ సంస్థల లైసెన్స్ వ్యవహారంలో పక్షపాతంగా వ్యవహరించారనే అపవాదు మూట గట్టుకున్నారు. టెలికామ్ అధికారుల నుంచి ఏకగ్రీవ సిఫారసులు ఉన్నప్పటికీ, మారన్ ఎయిర్‌సెల్ ఫైల్‌ను తొక్కిపెట్టినట్లు సీబీఐ ప్రాథమిక నివేదికలో వెల్లడించింది. ఎయిర్‌సెట్ పట్ల ఒత్తిడి తెచ్చే వైఖరిని మారన్ అనుసరించినట్లు కూడా నివేదికలో పేర్కొంది. కంపెనీలో కొంత వాటాను మాక్సిస్ సంస్థకు విక్రయిం చాల్సిందిగా ఎయిర్‌సెల్ చీఫ్‌పై మారన్ ఒత్తిడి తీసుకు వచ్చినట్లుగా తమ విచారణలో తేలినట్టు సీబీఐ తన నివేదికలో తెలిపింది. దయానిధి మారన్ వ్యూహాల వల్లనే ఆయన సోదరుడు కళానిధికి చెందిన సన్ టీవీ రూ.750 కోట్ల మేరకు లబ్ధి పొందినట్లు సీబీఐ వర్గాలు గతంలోనే వెల్లడించాయి. ఎయిర్‌సెల్‌లో తన వాటాను కళానిధికి విక్రయించాల్సిందిగా దయానిధి తనపై ఒత్తిడి తీసుకువచ్చి నట్లు ఎయిర్ సెల్ వ్యవస్థాపకుడు శివశంకరన్ గతంలోనే ఆరోపించారు.
ఈ కుంభకోణంలో చిదంబరం పాత్ర కూడా ఉందన్న ఆరోపణలు వచ్చిన నేపద్యంలో 2జి కేసు పై మరింత ఆసక్తి నెలకొంది. వివిధ కారణాల వల్ల కాస్త జాప్యం జరిగినా తిరిగి తెర పైకి వచ్చింది. తాజాగా మారన్ సోదరుల పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో మారన్ సోదరుల పై అరెస్టు ఊహాగానాలు జోరందుకున్నాయి. హైదరాబాద్ అపోలో డైరెక్టర్ సునితా రెడ్డి కార్యాలయాల పై సిబిఐ సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ ఉచ్చు ఇంకా ఎందరు ప్రముఖుల మెడుకు చుట్టుకోనుందోనన్న ఆసక్తి నెలకొంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment