ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Tuesday, October 11, 2011

సకలం బందులో పాఠశాలలు ?

సకల జనుల సమ్మె వల్ల విద్యార్ధులు నష్టపోతున్నారని... విశాలాంధ్ర మహాసభ, హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే సందర్భంలో తెలంగాణ వాదుల మాత్రం తెలంగాణ వస్తుందనుకుంటే విద్యాసంవత్సరం కోల్పోవడానికి కూడా సిద్ధమేనంటున్నారు... లక్షలాధిరూపాయలు ప్రైవేట్ విద్యా సంస్థలకు డొనేషన్ల రూపంలో చెల్లించేవారు విద్యా సంస్థల యాజమాన్యాన్ని , ప్రభుత్వ అసమర్ధతను ప్రశ్నిస్తున్నారు. సకల జనుల సమ్మె... తెలంగాణ మొత్తం స్థంభిచి పోవాలనే లక్ష్యంతో.. సకల జనుల సమ్మెను తలపెట్టారు.. కానీ ప్రభుత్వ సంస్థలు తప్ప ప్రైవేట్ సంస్థలేవీ ఈ సమ్మెలో పాల్గొనడం లేదని.. అన్ని రకాల కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతుంటే విద్యార్ధులను ఈ సమ్మెలోకి లాగడం సరికాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ గొడవ చిలికి చిలికి గాలివానలా మారి ఇటు తెలంగాణ వాదులకు అటు విద్యార్ధుల తల్లి దండ్రులకు మద్య తీవ్ర వాగ్వాదానికి దారి తీస్తోంది.
అవును.. గత రెండు రోజుల క్రితం కూకట్ పల్లిలో ‍యన్‌ ఆర్ ఐ విద్యాసంస్థ ముందు.. పాఠశాల తెరవాలని.. సకాలంలో సిలబస్ పూర్తి చేయాలని విద్యార్ధుల తల్లి దండ్రులు ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న తెలంగాణ వాదులు అక్కడికి రావడంతో కొంత గందరగోళ పరిస్థితి తలెత్తింది. కావాలంటే ఉద్యమాల్లోకి మేమొస్తాం.. మా పిల్లల్ని ఉద్యమాల్లోకి లాగకండని పేరెంట్స్ మీడియా సాక్షిగా వేడుకున్నారు. ఇదంతా చూస్తూ నిలబడ్డ స్కూల్ య ాజమాన్యం మాత్రం రెండు రోజుల గడువు కోరింది.
కూకట్ పల్లి అంటే సహజంగా ఆంధ్రా సెటిలర్స్ ఉండే ప్రాంతం కనుక వారిలా మాట్లాడారని తెలంగాణ వాదుల విమర్శ. తెలంగాణలో ఎక్కడా లేనిది కూకట్ పల్లిలోనే ఈ సంఘటన జరగడం యాదృచ్ఛికమో.. లేక అక్కడ విద్యావంతులు ఎక్కువగా ఉండి పిల్లల విద్య పట్ల అధికంగా శ్రద్ధ చూపడమో ఒక కారణం కావచ్చు.. కానీ అదే సమయంలో మందకృష్ణ మాదిగ కూడా అటువంటి వ్యాఖ్యలే చేశాడు. పిల్లల చదువుల జోలికి పోకూడదని.. సమ్మె వల్ల విద్యార్ధులు విద్యా సంవత్సరాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. రాజకీయ కారణాలేవైనా పాఠశాల బంద్ చేస్తే విద్యార్ధులు ఇంటి వద్ద ఉండి టీవీ రిమోట్ తో ఆడుకోవడం తప్ప ఒరిగేదేమీ లేదని విద్యార్ధుల తల్లిదండ్రుల అభిప్రాయం. మిగతా వ్యాపారాలన్నీ జోరుగా సాగుతుంటే విద్యాసంస్థల బంద్ దేనికని వారి ప్రశ్న. థియేటర్లు, షాపింగ్ మాల్స్, బార్ షాపులు యధేచ్చగా వ్యాపారం చేసుకుంటుంటే అడ్డుకోని వారు విద్యాసంస్థలను తెలంగాణ వచ్చేవరకు తెరవొద్దంటూ అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. లక్షల రూపాయల డొనేషన్లు కట్టి చదివించే తాము బందుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
మంగళవారం సోమాజీగూడా ప్రెస్ క్లబ్‌లో విశాలాంధ్ర మహాసభ, హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు విశాలాంధ్ర మహాసభ సభ్చుడు నలమోతు చక్రవర్తి పరుషంగా మాట్లాడటంతో సమావేశం గందరగోళానికి దారితీసింది.
తెలంగాణ సాధన కోసం తాము ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలంగాణ వాదులు ఊరూరా... వాడ వాడనా చాటుతున్నారు. విద్యార్ధులే స్వచ్ఛందంగా రోడ్డెక్కి జై తెలంగాణ నినాదాలు చేస్తున్నారు. ఈ సందర్భంలో దసరా సెలవులు మగిసీ ముగియడంతోనే పాఠశాలలు తెరవాలంటూ విశాలాంధ్ర మహాసభ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వ అసమర్ధతను ఎత్తి చూపడంతో ... తెలంగాణ వాదుల కోపం తారా స్థాయికి చేరింది. విషయం తెలుసుకున్న తెలంగాణ వాదులు, న్యాయవాదులు ప్రెస్ క్లబ్ వైపు దూసుకు రావడంతో పోలీసులు వారిని గేటు వద్దనే అడ్డుకున్నారు. పలుమార్లు తెలంగాణ వాదులు లోపలికి దూసుకురావాలని ప్రయత్నించడంతో ఉద్రిక్తవాతావరణం ఏర్పడింది. అదే సమయంలో తమ పై దురుసుగా వ్యవహరించిన నలమోతు చక్రవర్తి, ఆయన కారు డ్రైవర్ పై చర్యతీసుకోవాలంటూ రిపోర్టర్లు నిర్వాహకుల్ని అడ్డగించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగప్రవేశం చేయడంతో విలేకరులకు పోలీసులకు మద్య తోపులాట జరిగింది.
రాజకీయ పార్టీలు విద్యార్ధులను ఉద్యమాల కోసం వాడుకోవడం తగదని రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ అభిప్రాయ పడ్డారు. రాజకీయ పార్టీలు, ఉద్యమ నాయకులు విద్యార్ధులతో సంబంధం లేకుండానే ఉద్యమాన్ని కొనసాగించ వచ్చన్నారు. విద్యార్ధులను చదువులకు దూరంగా ఉంచడం ద్వారా లక్ష్యం నెరవేరదన్నారు.
తెలంగాణ వచ్చే వరకు సంస్థలన్నిటినీ నిలిపి వేస్తామని ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని ముందుగానే హెచ్చరించాయి. ప్రభుత్వ ఉపాద్యాయులు కూడా ఉద్యమంలో భాగస్వామ్యం కావడంతో పాఠశాలలు మూసివేయక తప్పని పరిస్థితి. అలాగని ప్రైవేటు పాఠశాలలకు అనుమతి నిస్తే రేపు ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు వెనకబడితే నష్టం ప్రభుత్వోపాధ్యాయులకు, వారిని నమ్ముకున్న విద్యార్ధులకు అందుకే అనివార్యంగా ఇటు ప్రైవేటు, అటు ప్రభుత్వ విద్యాసంస్థలు బందులో పాల్గొనాల్సివస్తోంది. పరిస్థితి ఒక కొలిక్కి వస్తుందనుకున్న సందర్భంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా అందరూ సంయమనంతో వ్యవహరించాలని మేథావులంటున్నారు.

No comments:

Post a Comment