ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Sunday, January 15, 2012

ఎలా ఉండే సంక్రాంతి... ఎలా మారింది.. సంక్రాంతిని కమ్మేసిందెవరు ?


సంక్రాంతి పండుగంటే కల్లలెరుగని పల్లె సంబరం.. పట్టణాలన్నీ పల్లెలకు పయనమయ్యే సంతోషకరమైన రోజు.. పెట్రోల్ మురికి లేని పచ్చని పైరగాలిని ఆస్వాదించే శుభతరుణం. పాడి పంటలంటే ఏంటో కళ్లారా చూసే శలవు దినాలు.. సంక్రాంతి తమ జీవితాల్లో కొత్త కాంతి నింపాలని రైతులు, తమ సౌభాగ్యాన్ని కాపాడాలని మగువలు భావిస్తారు. చిన్న పిల్లలు పతంగులతో పోటీ పడుతున్నారు. సంప్రదాయ పద్దతులకు జీవం పోస్తూ హరిదాసులు... బసవన్నలతో గంగిరెడ్ల వాళ్లు చేసే సందడి.. ఇవన్నీ మూడు రోజులు మురిపించి చలిదుప్పటి తెరలో కనుమరుగయిపోతాయంటే కాస్త బాధగానూ.. గడిపిన మూడు రోజులూ సంతోషంగానూ ఉంటుంది...
సంక్రాంతి అంటే పల్లె లోగిళ్లన్నీ ముచ్చటైన ముగ్గులతో..... మగువల ముచ్చట్లతో మురిసిపోతాయి. పండు వెన్నెల ముంగిట్లో పిండార బోసినట్లు పట్టపగలే వచ్చి వాలిందేమో అనిపించే ముగ్గులు మౌనంగా సడి చేస్తాయి. రంగు రంగుల పరికీణలతో రంగవల్లులు తీర్చి దిద్దే అతివల మునివేళ్లను తాకిన పిండి బొమ్మలు, మంచుతడిలో మురిసి పోతాయి. బొబ్బెమ్మల చల్లటి స్పర్శకు గరికపూస చెరుకు గడలా నిటారుగా నిల్చుంటుంది.. రంగురంగుల రంగవల్లుల నడుమ కొలువుదీరిన బొబ్బెమ్మలు, వాటి చుట్టూ అడుగులో అడుగులు కలుపుతూ.. కోలలు ఆడుతూ .. వయ్యారంగా కదిలే ముద్దుగుమ్మలు.. తెలిమంచు కురిసే వేళ చూడ చక్కగా కనువిందు చేసే ఈ పరవశానికి తోడు.. సన్నాయి వాయిద్యంతో బసవన్న గజ్జల చప్పుడు లయ కలుపుతూ.. తల ఊపుతూ డోలు డప్పుకు తాళం వేస్తుంటే.. పెద్దలు కూడా చిన్న పిల్లల్లా మారిపోతారు.
వాకిట్లో రంగురంగుల ముగ్గులతో పోటీ పడుతున్నట్టు దూది పింజల్లా మబ్బుల్లోకి దూసుకెళుతున్న పతంగులు రంగ వల్లుల్లా ఆకాశం నిండా పురచుకోవాలని చూస్తాయి. దూరం నుంచి చూసే వారికి ఏ దారం లేని .. ఆదారం లేని కొత్త పక్షులు నింగి దారుల్లో చెక్కర్లు కొడుతున్నట్టు కనిపిస్తాయీ పతంగులు.. ఎవరి పతంగి ఎంత ఎత్తుకు ఎగురుతుందో వారే గొప్ప.. పతంగులను గాలిలోకి ఎగరవేయడం కూడా ఓ కళే మరి.
చలిగాలికి తోడు.. నులివచ్చని సూరీడి కిరణాలు బంగారు రంగులో... రంగవల్లులకు కొత్త అందం తెచ్చిపెడుతుంటే.. పైరగాలి మోసుకొచ్చే ముద్దబంతి పూల పరిమళాలు మంచుతడికి మత్తుగా ఊగుతున్న కొమ్మలకు కొత్త రాగాలను నేర్పుతాయి. మంచుదుప్పటిని తొలగిస్తున్న సూరీడికి ఆహ్వానం పలుకుతూ నేతితో చేసిన పిండివంటల ఘుమఘుమలు ముక్కు పుటాలను గుభాళిస్తాయి. సకినాలు, చెక్కర పొంగలి, అరిసెలు.. కొత్త రుచులను చూపిస్తాయి. ఏ ఇల్లు చూసినా పూల లోగిళ్లతో.. ముగ్గుల ముంగిళ్లతో.. కమ్మటి వాసనలతో... పండుగంటే ఇదీ అనిపిస్తుంది.
మన భారత దేశ చరిత్రలో పండుగలకు విశిష్ట స్థానం ఉంది. ప్రతి పండుగకూ ఓ అర్దం పరమార్ధం ఉన్నట్టుగానే.. సంక్రాంతికీ ఓ విశిష్టత ఉంది. సూర్యుడి మాసానికో రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మాసంలో మకర రాశిలోకి సంక్రమించడాన్ని మకరసంక్రమణం అంటారు. దీన్నే మకర సంక్రాంతి అంటారు. అయితే మకర సంక్రాంతికి ఇంతటి విశిష్టత ఎందుకంటే.. ఈ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. వివిధ రకాల పుణ్యకార్యాలకు ఇదే మంచి మాసం.. తొలిపంట గాదెలను పలకరించేది కూడా ఇదే రుతువు. అందుకే ఈ పండుగంటే.. రైతులకు.. వారిని నమ్ముకున్న వ్యాపారులకు.. పట్టణాల్లోంచి పల్లెలకు పిలిచే పురవాసులకు సంతోషం..

No comments:

Post a Comment