Tuesday, January 10, 2012
త్రిశంకు స్వర్గంలో టీచర్స్ నియామకాలు
నిరుత్సాహాన్ని మిగిల్చిన టెట్ - నిప్పులు కక్కుతున్న అభ్యర్ధులు
అర్హతకు కులానికీ లింకేంటి ?
సైన్స్ బోధకులకు గణితంలో అగ్ని పరీక్ష
150 నిముషాల్లో 150 ప్రశ్నలకు సమాధానాలు..?
కోర్టుల్లో కేసులు వేసేందుకు సిద్ధమవుతున్న అభ్యర్ధులు
త్రిశంకు స్వర్గంలో టీచర్స్ నియామకాలు
పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అన్న చందంగా ఉంది రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి.. రాష్ట్రంలో ఏ రిక్రూట్‌మెంట్ కూడా వివాదాలు లేకుండా జరగలేదు. ఈ వివాదాలు కూడా ప్రభుత్వానికి పనికొస్తున్నాయి. అందుకే ప్రభుత్వ ఉద్యోగాలను వివాదాల్లోకి లాగడం.. లేదా వివాదం చేయడం రివాజుగా మారింది. గతంలో ప్రభుత్వ ఉద్యోగ ప్రకటన వెలువడగానే అభ్యర్ధులంతా గంపెడాశెతో అప్లై చేసేవారు. ఫైరవీ దారులు కొన్ని, లంచావతారులు కొన్ని పంచుకోగా ఎంగిలి చేయి విసిరినట్టు విసిరితో ఏ నలుగురికో ప్రభుత్వ ఉద్యోగాలు రాలేవి. కానీ జంబ్లింగ్ పేపర్, ఓఎమ్మార్ షీట్ పుణ్యమా అని ఇంటర్వ్యూ లేని ఉద్యోగాల్లో అవకతవకలకు పాల్పడితే అవలీలగా పట్టుబడుతున్నారు. పర్మినెంట్ ఉద్యోగాలు ఏటా భర్తీ చేయడం ప్రభుత్వానికి ససేమిరా ఇష్టం లేదు. అందుకే గ్రూప్ 1 ఉద్యోగాల వివాదాల జాతర ఇప్పటికీ తెగలేదు... కాదు కాదు తెంచలేదు.. కోర్టునుంచి ప్రభుత్వానికి, ప్రభుత్వం నుంచి అభ్యర్ధులకు అక్కణ్నుంచి రాజకీయ నాయకుల మధ్యకు ఇలా తిరుగుతూనే ఉంది. గత గ్రూప్ 1 వివాదమే ఇంకా కొలిక్కి రాలేదు. మొత్తానికి ఏపీపీఎస్సీ నియామకాలంటేనే లేట్ ప్రాసెస్ అన్న ముద్ర స్థిరంగా పడింది. ఇవికాక ప్రభుత్వ ఉద్యోగాలంటే పోలీస్, ఉపాధ్యాయ ఉద్యోగాలు మాత్రమే అడపాదడపా భర్తీ అవుతున్నాయి. తాజా ఉపాధ్యాయ ఉద్యోగాలు కూడా వివాదాల్లోకి రాబోతున్నాయి. రాబోతున్నాయి అనేకంటే అదే ఊబిలో ఉన్నాయనడమే కరెక్ట్. ఎందుకంటే గత నియామకాలే ఎన్నో బాలారిష్టాల నడుమ పూర్తయ్యాయి. బీఈడీ విద్యార్ధులు ఎస్‌జీటీకి అర్హులు కారని ఒకసారి.. అర్హులేనని ఒకసారి.. ఇలా రకరకాల ఒత్తిళ్ల నడుమ రిక్రూట్‌మెంట్ పూర్తయిందనిపించారు. ఈసారి డీఎస్సీకి టెట్‌లో ఉత్తీర్ణులయిన వారే అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. మొదట్లో దీన్ని ఇటు మేథావి వర్గాలు.. అటు అభ్యర్ధులు తీవ్రంగా వ్యతిరేకించారు. వ్యతిరేకత అలా ఉండగానే టెట్ నోటిఫికేషన్ విడుదల కావడం.. దీనికోసమే ఎదురుచూసే అభ్యర్ధులు ధరఖాస్తు చేయడం.. తొలివిడత పరీక్ష పూర్తి కావడం చకచకా జరిగిపోయాయి. ఈ పరీక్ష చాలా తేలికగా ఉండటం.. మొదటి పరీక్ష కావడంతో నిపుణులు కూడా తేలిక రకం ప్రశ్నా పత్రాన్ని తయారు చేశారు. కాబట్టి టెట్-2011 ఉత్తీర్ణతా శాతం బాగానే ఉంది. దీంతో టెట్ వల్ల పెద్ద ప్రమాదం లేదనే నిర్ణయానికి వచ్చారు చాలా మంది. తొలివిడత టెట్ పరీక్షను మరిచిన అభ్యర్ధులు కాస్త ఆలస్యంగా కళ్లు తెరిచారు. టెట్-2012 కు మిగిలిన బీఈడీ, డీఈడీ అభ్యర్ధులంతా ధరఖాస్తు చేసుకున్నారు. ఈ నోటిఫికేషన్లోకూడా స్పష్టత లేదు. తొలుత ఒకే అప్లికేషన్ పై పేపర్-1, పేపర్ -2 రాయొచ్చని ప్రకటించారు. తరువాత బీఈడీ అభ్యర్ధులు పేపర్ 2 మాత్రమే అర్హులని చల్లగా చెప్పారు.
ఈ రెండ విడత టెట్‌కు దాదాపు డీఎస్సీ పరీక్ష కోసం చేసినంత హడావుడి చేశారు అభ్యర్ధులు. ఎందుకంటే ప్రభుత్వం కూడా జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నానని ఉత్తుత్తి ప్రకటనలు గుప్పిచ్చింది. దీంతో ఉపాధ్యాయ ఉద్యోగాన్ని ఆశిస్తున్న అభ్యర్ధులంతా డీఎస్సీ స్థాయిలో ప్రిపేరయ్యారు. ఈ సారి శిక్షణా సంస్థలు కూడా టెట్ కు డీఎస్సీ స్థాయిలో ప్రచారం కల్పించాయి. హడావుడి మధ్య టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించారు. అనుకున్నదే అయింది. టెట్ పరీక్ష టైట్ చేయడానికే అన్న అసలు విషయం ఆలస్యంగా తెలిసింది. ఇది ఎలిజిబిలిటీ టెస్ట్ కాదు.. ఎలిజిబిలిటీ కాకుండా చేసే టెస్ట్ అన్న విషయం దాదాపు రెండోసారి పరీక్ష అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే టెట్ పరీక్ష ప్రశ్నా పత్రం తయారులోనే ఫిల్టరింగ్ చేయడానికి తీసుకోవలసిన అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. కన్ఫ్యూజ్ చేసి కంట్లో కారం కొట్టే ప్రశ్నా పత్రం తయారయింది.
ఉపాధ్యాయ శిక్షణలో ప్రశ్నా పత్రం తయారీ గురించి శిక్షణ ఇస్తారు. అందులో విద్యార్ధుల జ్ఞానాన్ని, నైపుణ్యాలను పరీక్షిచాలంటే ప్రశ్నా పత్రం ఎలా తయారు చేయాలో.. తయారీకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అనే విషయాన్ని క్షణ్ణంగా వివరించడమే కాకుండా.. నమూనా ప్రశ్నా పత్రాలను తయారు చేయిస్తారు. కానీ ఉపాధ్యాయులను ఎంపిక చేయడానికి అవసరమైన అర్హతా పరీక్షా పత్రాన్ని తయారు చేయడంలో మాత్రం ఆ నియమాలను తుంగలో తొక్కారు. సహజంగా అభ్యర్ధుల విశ్లేషణా కౌశలాలను పరీక్షిండానికి కొన్ని సిలబస్ కు సంబంధించిన అంశాన్ని సృశిస్తూనే స్వేచ్ఛా ప్రశ్నలను సంధిస్తారు. ఇవి అభ్యర్ధులను తికమక పెడతాయి. ఇటువంటివి అన్ని పోటీ పరీక్షల్లో ఉంటాయి. కానీ.. తాజాగా నిర్వహించిన టెట్ పరీక్షలో అన్ని ప్రశ్నలూ తికమక పెట్టే విధంగా ఉండటంతో అభ్యర్ధులు తికమక పడటమే కాదు... పరీక్ష పూర్తికాక ముందే భవిష్యత్తు పై అయోమయంలో పడ్డారు. టెట్ పరీక్షకు హాజరయిన ఒక్కరంటే ఒక్కరు కూడా పరీక్షా పత్రం రూపొందించి విధానం పై సంతృప్తి వ్యక్తం చేయలేదు. అత్యంత కఠినమైన ప్రశ్నా పత్రాన్ని రూపొందించి అభ్యర్ధుల పైకి సంధించారు. వాస్తవానికి ఈ తరహా ప్రశ్నాపత్రం ముందెన్నడూ చూడలేదంటున్నారు తలపండిన మేథావులు. ఎందుకంటే విశ్లేషణాత్మక ప్రశ్నలు, విచక్షణకు సంబంధించిన ప్రశ్నలు ఎక్కవగా ఉండటంతో... ఇదే కరెక్ట్ సమాధానం అని చెప్పడానికి ఏ ఇద్దరు అభ్యర్ధుల మధ్య పొంతన కుదరడం లేదు. ఈనాడు పత్రిక విడుదల చేసిన కీ లో బండ తప్పులున్నాయన్నారు. అవి నిపుణుల చేత తయారు చేయించారని ఆ పత్రిక చెప్పింది. కానీ నిపుణులే పప్పులో కాలేస్తే.. మామూలు అభ్యర్ధులు నిప్పుల్లోనే కాళ్లేస్తున్నారు. టెట్-2011 రాసిన అభ్యర్ధులకు ఒక న్యాయం, టెట్-2012 అభ్యర్ధులకు మరో న్యాయమా అని అభ్యర్ధులు నిలదీస్తున్నారు. ఇప్పటికే ఈ విషయం పై ఉద్యమించేందుకు అభ్యర్దులు సన్నద్దమవుతున్నారు. నెలల తరబడి టెట్ కోసం ప్రిపేర్ అయితే ఇష్టం వచ్చిన ప్రశ్నలిచ్చి డీఎస్సీకి అర్హులు కాదని పక్కన పడేస్తే సహించేది లేదంటున్నారు. సైన్స్ అభ్యర్ధుల పాలిట గణితం గుదిబండగా తయారయింది. ఎందుకంటే 150 ప్రశ్నలకు గానూ 2.30 గంటల సమయాన్ని కేటాయించారు. అంటే 150 ప్రశ్నలకు 150 నిముషాలన్న మాట.. సైకాలజీ, తెలుగు, మెథడాలజీ వంటి వాటికి కాస్త ఈజీ, మీడియం, హార్డ్ ను బట్టి టైం అడ్జెస్ట్ చేసుకోవచ్చేమోగానీ. ఒక్క నిముషంలో ఒక్కో సమస్యను కాలిక్యులేటర్ లేకుండా నోటి లెక్కలతో పూర్తి చేయడం బయాలజీ చదువుకున్న విద్యార్ధులకు సాధ్యమయ్యే పనేనా.. ? అది కూడా అత్యతం క్లిష్టమైన పర్సంటేజీ, ఘాతాంకాల వంటి ప్రశ్నలతో బాటు, భిన్నాలను ముప్పై సెకండ్లలో పూర్తి చేయమనడం వెనుక ఏ మర్మం దాగి ఉంది.. సైన్స్ విద్యార్ధులు, గణిత ప్రశ్నను అర్ధం చేసుకొనేలా చదవడానికే ముప్పై సెకన్ల పైనే పడుతుంది. దాన్ని తిరిగి అర్ధం చేసుకొని రఫ్ పేపర్ పై పెట్టి బాగాహారం, గుణకారం, కసాగు, వంటి ప్రక్రియల్లో ఏది అవసరమో అది పూర్తి చేసి ఫలితాన్ని రాబట్టడానికి మరోరెండు నిముషాలు తప్పకుండా అవసరం అవుతుంది. ఈ తికమక ప్రశ్నా పత్రం వల్ల చాలా మంది అభ్యర్ధులు గణితం ప్రశ్నలను చదవకుండానే గాలిలో దీపం పెట్టినట్టు సమాధానాలు పెట్టాల్సిన దుస్థితి తలెత్తింది. ఇది ఏ ఒక్కరో అంటున్న మాట కాదు. పరీక్షరాసిన మెజారిటీ అభ్యర్ధులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం.
ఇంతకీ టెట్ శాస్త్రీయమేనా.. ?
ఈ ప్రశ్న ఎప్పటి నుంచో అభ్యర్ధులను వేధిస్తున్న ప్రశ్న.. ఎందుకంటే బయోసైన్స్ అధ్యయనం చేసే విద్యార్ధులకు 10 తరగతి తరువాత గణితం అవసరమే లేదు. బీఈడీ వరకు గణితం జోలికే పోరు. అంటే అప్పుడే బీఈడీ అయిపోయిన విద్యార్ధులు గణితాన్ని అంటే క్షేత్రగణితాన్ని, ఘాతాంకాలను, సమీకరణాలను మరిచిపోయి ఏడేళ్లు అయిపోతుంది. ఇక పీజీలు, పీహెచ్‌డీలు చేస్తూనో లేక ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నవారైతే దాదాపు ఐదో ఎక్కానికే తడుముకోవాల్సిన పరిస్థితి. వీళ్లు చచ్చీచెడీ కోచింగ్ సెంటర్లలో గణితంలాంటిదాన్ని నేర్చుకున్నా వచ్చే ఫలితం కూడా లేదు. వీళ్ల అదృష్టం కొద్దీ డీఎస్సీలో ఉద్యోగం వస్తే బయాలజీ టీచర్ గానే వెళ్లాలి. తప్ప గణితం బోధించే చాన్సే లేదు. గణితం బోధించే చాన్సు లేని అభ్యర్ధులను గణితంలో నైపుణ్యాలను పరీక్షించాలను కోవడం వెనుక ఉద్ధేశ్యం ఏమిటని మేథావులు ప్రశ్నిస్తున్నారు. ఇదే సూత్రం, గణితం అభ్యర్ధులకు, సోషల్ స్టడీస్ అభ్యర్ధులకు వర్తిస్తుంది. వారికి పరిచయం లేని, బోధనకు అవసరం లేని సబ్జెక్ట్ లో కఠిన ప్రశ్నలతో పరీక్షించాలను కోవడం వెనుక అసలు ఉద్ధేశ్యం ఫిల్టర్ చేయడం తప్ప మరోటి కాదన్న విషయం తేట తెల్లమవుతోంది. టీచర్ ఉద్యోగం చేయాలంటే ముందు బీఈడీ , డీఈడీ ఎంట్రన్స్ ఎదుర్కోవాలి... తరువాత శిక్షణా కాలాన్ని పూర్తి చేయాలి. ఆ పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాలి. తరువాత టెట్ రాయాలి.. దీంట్లో కూడా ఉత్తీర్ణత సాధించాలి. తరువాత డీఎస్సీ రాయాలి. దీంట్లో కూడా ర్యాంక్ సాధిస్తే అప్పుడు పంతులు ఉద్యోగం. డిగ్రీ అర్హతతో రాసే ఐఏఎస్ పరీక్షకు కూడా ఇన్ని కండీషన్లు లేవు. రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్ష కూడా ఇన్ని స్థాయిలుండవు. అందుకే టెట్ పరీక్ష అవసరమా లేదా అన్నది జాతీయ స్థాయి అంశమైనా.. పరీక్ష నిర్వహించే విధానం మాత్రం సరియైనది కాదు, శాస్త్రీయ మైనది అసలే కాదనే వాదన బలంగా ఉంది.
అర్హత పరీక్షలో కూడా రిజర్వేషనా..?
మామూలుగా ఒక సబ్జెక్ట్ లో పాసవ్వాలంటే 35 శాతం మార్కులు రావాలంటారు. అది ఎస్సీ అయినా, బీసీ అయినా, ఓసీ అయినా పాస్ మార్కులు ఒకటే.. అంటే సబ్జెక్ట్‌లో పాస్ కావడానికి కులంతో సంబంధం లేదు. ఉద్యోగ కల్పనలో రిజర్వేషన్లను బట్టి పోటీ స్థాయిని బట్టి మార్కులు అవసరం ఉంటాయి. కానీ సబ్జెక్ట్ లో ఉత్తీర్ణత సాధించడానికి రిజర్వేషన్లు అవసరం లేదు. కానీ టెట్ లో ఉత్తీర్ణత సాధించడానికి కూడా రిజర్వేషన్లకు లింక్ పెట్టారు. ఎస్సీ ఎస్టీలకు 150 కు గానూ 60 మార్కులు, బీసీలకు 75 మార్కులు, ఇక ఓసీ లయితే 90 మార్కులు అర్హతా మార్కులుగా నిర్ణయించారు. ఇదెక్కడి చోద్యం.. అర్హత సాధించడానికి మార్కుల్లో భేదాలెందుకు ? ఉద్యోగ పరీక్షలో ఈ తంతు ఎలాగూ ఉంటుంది. ఇదే గనుక పూర్తి స్థాయిలో అమలయితే.. పేపర్ ఇలాగే క్లిష్టంగా ఉంటే.. డీఎస్సీకి మెజారిటీగా హాజరయ్యే అభ్యర్ధులు ఎస్సీ ఎస్టీలు వారి తరువాత బీసీలే అవుతారు. మెజారిటీ ఓసీ అభ్యర్ధులు ఆదిలోనే ఆగిపోతారు. దీన్ని ఆయా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ఇన్ని గండాలు దాటుకొని డీఎస్సీ పరీక్షలు సవ్యంగా నిర్వహిస్తారా.. ఈ చిక్కుముడులను అభ్యర్ధులు కోర్టులో సవాలు చేసి స్టేలు తెచ్చుకుంటే నష్ట పోయేది ఎవరు. ఆ స్టే ఎత్తేసి నియామకాలు మొదలు పెట్టేసరికి ఎన్నికల కోడ్ అమలులోకి వస్తే పరిస్థితి ఏంటి..? దురదృష్టవశాత్తో... అదృష్టవశాత్తో నోటిఫికేషన్ విడుదల చేసిన వేసిన ప్రభుత్వం కూలిపోయి కొత్త ప్రభుత్వం వస్తే ఈ నియామకాల పట్ల శ్రద్ధ చూపుతుందనుకోవడం కలే.. టామ్ అండ్ జెర్రీలాంటి ఈ నియామకాల ఉచ్చులో నిరుద్యోగ అభ్యర్ధులు తమ విలువైన సమయాన్ని, మేథస్సును, డబ్బులను వృధా చేసుకొని ఆవేశాలకు లోనై ఉద్యమాలకు సిద్ధమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. ఆ పరిస్థితి రాక ముందే.. ప్రభుత్వాలు రాక ముందే ప్రభుత్వ విధానాలు మారాలి. పారదర్శకంగా నియామకాలు జరగాలి.
Subscribe to:
Post Comments (Atom)
Well described brother,
ReplyDeletenenu kaadu kaani naa close frnd okadu chaala hard work chesadu TET 2012 gurinchi..ipudu meeru cheppinattugaane badhapaduthunnadu...but he qualified 2011 TET...
tet anedhi waste.. andulo adige prasnalu poyinasari silly ga vunnayi.. ala ani ee sari thala thoka leni prasnalu icharu. kharma.. durty A.P. adige vadu ledu.. andharu poradali
DeleteMy hearty Sankranti wishes to you & your family...........
ReplyDeleteExcellent write up Sir
thank u. same to u.
ReplyDelete